24, ఏప్రిల్ 2012, మంగళవారం

అపురూప స్నేహం విలువ

మనలో చాలా మంది ఒక పని ని సహజంగా చేయడానికి సాధ్య పడని అప్పుడు, కొన్ని నియమాలకు విరుద్దంగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు.. ఆ పని ని సమర్ధవంతంగా పూర్తి చేసుకోవడానికి దొడ్డి దారులు వెతుకాల్సి వస్తుంది.
మన పని పూర్తి కావాలంటే..డబ్బు,అధికారం,పలుకుబడి..ఇలా ఎవేవైనా ఉపయోగపడతాయని ఆలోచించడం ..తర్వాత ఆ ప్రయత్నాలు చేయడం మామూలే!

ఎందుకో.. చాలా విషయాలు మూడో శక్తి లేకుండా పని పూర్తీ కాని దరిద్రపు వ్యవస్థ. నేను నిజాయితీగా ఉంటాను. కష్టపడి పనిచేస్తాను. నా దగ్గర నైపుణ్యం ఉంది.అని గొంతెత్తి అరచినా.. అవెందుకు పనికి రావు.. జస్ట్ ఒక పై రవీ పోన్ కాల్ చాలు క్షణంలో పని పూర్తి అయి పోతుంది. అలా ఒక పని జరుగుతుందని ఆశించి ..వెళ్ళిన నాకు .. ఒక జీవిత కాలానికి చూడని ఒక మహోన్నత వ్యక్తిత్వాన్ని చూసిన అనుభవం ఒకటి ఈ పోస్ట్ లో చెప్పదలచాను.

ఒక సంవత్సరం క్రితం..అనుకుంటాను.. మా చెల్లి వాళ్ళ అమ్మాయి "అప్పు" చదువుకు సంబందించి .. ఒక కార్పోరేట్ కాలేజ్ లో.. సి.ఓ. బ్యాచ్ లో.. మొదటి సెక్షన్ లో ప్రవేశం అప్పుడు..తనకి ఫీజ్ రాయితీ కొంత లభించింది. ఎందుకంటె తను 8 వ తరగతి నుండి IIT JEE Concept Oriented గా తీర్చిదిద్దబడింది. పైగా 10 తరగతిలో మంచి మార్కులతో..పాస్ అయింది. సహజం గా అలాంటి పిల్లలపై కార్పోరేట్ కాలేజ్ ల వల వేసే ఉంటుంది. ఎందుకంటె.. rank ల పంట పండిస్తారని.

సంవత్సరానికి లక్ష పాతికవేలు ఫీజు చెల్లించాల్సిన ఉన్న CO batch లో మా "అప్పు" ని 60 % ఫీజు రాయితీ తో అడ్మిషన్ ఇచ్చారు. సడన్గా మా చెల్లెలి కుటుంబానికి ఆర్ధిక ఇబ్బంది కలగడం వల్ల..మిగతా ఫీజు ..ఇతరత్రా ఖర్చులు..కలిపి ఇంకొక లక్షరూపాయలు భారం అయింది. అలాటప్పుడు..మిగిలిన ఫీజ్ కి కూడా రాయితీ ఇచ్చే అవకాశం లభించే మార్గాల కొరకు అన్వేషణ మొదలబెట్టింది.మా చెల్లెలు.

అదే సమయంలో.. ఒక అవకాశం కలసి వచ్చింది. శ్రీ చైత్యన ఫౌండర్ & చైర్మన్ BS రావు (సత్యనారాయణ గారు).. మా house owner లక్ష్మి గారి అన్నయ్య ప్రాణ స్నేహితులు . ఆ విషయం నాకు తెలుసు. లక్ష్మి గారి అన్నయ్య సాంబ శివరావు గారు..బి ఎస్ రావు గారు బాల్య స్నేహితులు. అలాగే గుంటూరు లో వైద్య కళాశాలలోను సహాధ్యాయులు.
మిత్రులు ఇరువురు దారులు వేరు వేరు అయినా ఒకే ప్రాణం. యెంత అపురూప స్నేహం అంటే.. యెంత బిజీ షెడ్యుల్ లో ఉన్నా సరే.. శ్రీ చైతన్య విద్యా సంస్థల నిర్వహణలో తలమునకలై ఉన్నా సరే తన స్నేహితుడి తలిదండ్రులని కూడా నెలకి ఒకసారి అయినా వచ్చి స్వయంగా చూసి ఒక గంట కూర్చుని..మంచి చెడు కనుక్కుని వారికి అవసరమైనవి అన్నీ ఓ..కొడుకులా సమకూర్చి వెళ్లాలని అనుకుంటారు. అక్కడెక్కడో. అమెరికా దేశంలో ఉన్న .తన మిత్రుడు చేయలేని భాద్యతలు కొన్ని అయినా తీర్చగల్గానన్నఆనందం బిఎస్ రావు గారిది. ప్రతి విషయానికి మా సత్యనారాయణ అన్నయ్య అని ..చెపుతుంటారు కాబట్టి.. మాకు వారిరువురి మిత్రుత్వం గురించి తెలుసు.
"అక్కా.. సాంబశివరావు ..గారి ద్వారా పూర్తీ ఫీజు రాయితీ కోసం ట్రై చేద్దామా!? అని అడిగింది మా చెల్లెలు. నాకు ఎందుకో సాంబశివరావు గారిని ఆ విషయం గురించి రికమండ్ చేయమని అడగడం ఇష్టం లేక పోయింది.

ఎందుకంటే..సాంబశివరావు అన్నయ్య (నేను వారిని అన్నయ్య అని పిలుస్తుంటాను.నిజానికి నేను రక్త సంబందం కాని వారిని అన్నయ్య అని పిలవడం పెద్దగా ఇష్టం ఉండదు కూడా! ) అలాటి విషయాలకి వ్యతిరేకం. ఆయన పెళ్లి కూడా వరకట్నం అనే ప్రసక్తి లేకుండా జరిగిపోయింది..అట. కష్టపడి చదవడం,నిజాయితీగా ఉండటం.అందరి కష్టసుఖాల్ని గమనించడం..పేదవారికి.విద్యార్ధులకి వేలకొలది డాలర్లు సాయం చేయడం.. చేస్తుంటారు సాంబశివరావు అన్నయ్య.

ఆయన గురించి తెలిసి ఉన్న దానిని అవడం వల్ల నాకు మా "అప్పు " ఫీజు రాయితీ గురించి అన్నయ్యతో రికమండ్ చేయించడం గురించి నేను అడగాలని అనుకోలేదు.అదే విషయం ని మా చెల్లికి నేను చెప్పాను. మనమేమి హెల్ప్ చేయమని అడగడం లేదు కదా! పూర్తి ఫీజు రాయితీ లభించే అర్హత మన అమ్మాయికి ఉంది. సాంబశివరావు అన్నయ్య ఒక మాట చెబితే.. రెండు సంవత్సరాలకి కలిపి దాదాపు నాలుగు లక్షల రూపాయలు సేవ్ అవుతాం. ఒక్క మాటే కదా.. నీకిష్టం లేకపోతే నువ్వు అడగవద్దు..నేను అడుగుతాను అని నిష్టూరంగా అంది మా చెల్లి. ఇక తప్పదు అనుకుని.. సాంబశివరావు అన్నయ్య ని కలవడానికి మా చెల్లిని వెంటబెట్టుకుని తీసుకుని వెళ్లాను.

మా చెల్లెలిని అన్నయ్యకి పరిచయం చేసాను. అన్నయ్య ..పిల్లలు యెంత మంది? ఏం చదువు కుంటూ న్నారమ్మా! ..అని అడిగారు. ఆయన ఆత్మీయమైన ప్రశ్నకి మా చేల్లెల్లికి దుఖం ముంచుకు వచ్చింది. మా "అప్పు " IIT లో సీట్ సంపాదించు కోవాలి అన్న లక్ష్యం తోనే సంవత్సరానికి లక్ష రూపాయల పీజులు పోసి..కాన్సెప్ట్ స్కూల్లో చదివిస్తూ.. అప్పుడు ఆర్ధిక పరిస్థితి చతికిల పడటం ..వల్ల తను కాస్త బాగా బాధలోని,ఒత్తిడిలోనూ ఉంది. కదిలిస్తే.. కన్నీళ్లు కార్చేస్తూ బేలగా మారిపోయింది. అప్పుడు నేనే జోక్యం చేసుకుని మా '' అప్పు" చదువు,పీజు రాయితీ విషయం గురించి చెప్పి.. "సత్యనారాయణ గార్కి" కొంచెం పాప గురించి చెప్పగలరా ?అన్నయ్యా..! అని అడిగాను

సాంబశివరావు అన్నయ్య మౌనంగా రెండు నిమిషాలు అలా ఉండిపోయారు. తర్వాత ఇలా చెప్పారు.
అమ్మా.. సత్యనారాయణ డి నాది నలబై ఏళ్ళ స్నేహం . ఏ రోజు కూడా.. నేను ఒకమాట కూడా ఇలా చేయాలి అని నేను చెప్పి ఉండలేదు. నాకు ఏం కావాలో తనకి తెలుసు. నేను ఎయిర్ పోర్ట్ లో ప్లైట్ దిగే సమయానికి కారు తీసుకువచ్చి రెడీగా ఉండటం,,నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు నాకు ఏం అవసరం అవుతాయో చూడటం..నా తల్లిదండ్రులని కూడా తన తల్లిదండ్రులుగా చూసుకోవడం చేస్తుంటాడు.నేను చెప్పకుండానే..అన్నీ చేసే తనకి ఈ పని చేయి..రా అని చెప్పడం ..నేను ఎప్పుడు అడగని విషయం. తను నాప్రాణ స్నేహితుడే! ఎన్నో విద్యా సంస్థలు సంపాదించి ఎంతో మంది డాక్టర్లని,ఇంజినీర్లు చదవడానికి శిక్షణ ఇచ్చే నంబర్ వన్ సంస్థ చైర్మన్ కావచ్చు. అతని స్వవిషయాలలో నేను ఎప్పుడు జోక్యం చేసుకోను. అతను నా విషయం లో ఆసక్తి కనపరచడు. మా వృత్తులు,మా పనులు.. వీటన్నిటి అతీతమైన "స్నేహం " తప్ప ఇలా చిన్న పాటి రికమండేషన్ కూడా మా మధ్య ఉండవు.

ఒక సారి మా చిన్న మామ గారు కావూరి గారి మనుమడికి కూడా చైతన్య లో సీట్ కోసం రికమండ్ చేయమన్నారు. అతను చదువులో చాలా పూర్. ఆలాటి విద్యార్ది కోసం..నా భార్య వైపు బంధుత్వం కోసం అయినా కూడా నేను సత్యనారాయణ ని అడగలేకపోయాను. భార్య వైపు బంధువుల కోసం కొన్ని చేయక తప్పని పరిస్థితుల్లో కూడా నేను జోక్యం చేసుకోలేదు. నేను అలా రికమండ్ కాల్ చేయడం ఇబ్బంది అని కాదు కాని.. మా ఇద్దరి స్నేహం విలువ.. అలా రికమండ్ చేసే స్థాయి గల స్నేహం కాదమ్మా.. అన్నారు.

నేను వెంటనే ఏదో మాట్లాడబోయాను. అన్నయ్య నా మాట వినకుండానే ..గబా గబా ..మేడమీదకి వెళ్లి అయిదు నిమిషాల్లో తిరిగి వచ్చారు. అప్పుడు..అన్నయ్యకి నేను మనస్పూర్తిగా సారీ చెప్పి.. మీ మనస్తత్వానికి విరుద్దంగా..మిమ్మల్ని ఒక పని చేసి పెట్టమని అడిగాను. నన్ను క్షమించాలి ..అన్నయ్యా.. మీ లాటి వ్యక్తిని,వ్యక్తిత్వాన్ని నేను అర్ధం చేసుకోలేకపోయాని అని చెప్పాను. వెంటనే మా చెల్లి కూడా అన్నయ్యా ..అక్క మీ గురించి చెప్పింది. తను అడగను అనికూడా అంది. నేనే బలవంత పెట్టాను. మీ పంధా ని,మీ స్నేహాన్ని మేము అర్ధం చేసుకున్నాను. మీరు అలా రికమండ్ చేయలేదని బాద కూడా లేదు అన్నయ్యా.. అలా అడిగి మిమ్మల్ని బాద పెడితే క్షమించండి ..అంది.

అమ్మా.. నేను అమ్మాయి గురించి చెప్పి రికమండ్ చేయ లేక పోయాను అన్నబాధ ఉంది .అలా అని నేను నా పద్దతికి విరుద్దంగా అలా ఆ స్నేహితుడిని అడగలేను. కానీ నా వంతు గా అమ్మాయిని ..నా మేనకోడలే అనుకుని ..మిగతా ఫీజు నేను కడతాను..అని .. జేబు లోనుండి డబ్బు తీసి చెల్లి చేతిలో పెట్టేసారు. నేను చెల్లి కూడా నిర్ఘాంత పోయాం. మేము వెళ్ళింది ఒకందుకు,అక్కడ చూసింది..ఒక ఉన్నత వ్యక్తిత్వంని.. సాయం లభించదు అన్న దిగులు లేదు..కానీ మళ్ళీ అక్కడే..ఓ..సాయం అందించిన ఆపన్న హస్తం.

వారు మళ్ళీ ఇలా అన్నారు. అమ్మా.. కష్టాలు నాకు తెలుసు. నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్ట పడి చదువుకున్న వాడినే.మిమ్మల్ని అవమానించాలని నేను ఈ సాయం చేయడం లేదు. ఒక తెలివైన విద్యార్ది పీజు లు కట్టలేక చదువు ఆగ కూడదు.అని చెప్పారు. అది మా సొంత అన్నయ్య కూడా చేయని సాయం అన్నమాట. .

నేను శ్రీ చైతన్య CO బ్యాచ్ ఫీజులు సంవత్సరానికి ఒక్కో విద్యార్ధికి రెండు లక్షలు అని చెబితే..ఆశ్చర్య పోయారు. మీ మిత్రులు వందల కోట్లకి పడగలెత్తారు ఇప్పుడు అని చెప్పి నేను నవ్వాను. ఇక్కడ అంత ఫీజుల..అమ్మా..అన్నారు. నేను ఎప్పుడు వ్యక్తిగతం, ఆర్ధిక వివరాలు ఏమి అడగను..అందరు బాగున్నారా..అనేదే తప్ప ఆర్ధిక పరిస్థితులని గూర్చి అడగను ..అని చెప్పారు. ఆ రోజే మద్యాహ్నం కి అన్నయ్య రిటర్న్ అయ్యారు. జరిగిన విషయం హౌస్ ఓనర్ లక్ష్మి అక్కకి చెప్పాను. "అయ్యో!వనజా..అన్నయ్య అల్లా ఎప్పుడు రికమండ్ చేయరు. "శిల్ప"ని చైతన్య లో జాయిన్ చేసినప్పుడు కూడా.. అందరి దగ్గర తీసుకున్నట్లుగానే పీజులు తీసుకుంటాను అంటేనే .. ఆ కాలేజ్ లో చదివిస్తాం అని వాగ్దానం తీసుకున్నాకే అక్కడ జాయిన్ చేసాం. అన్నయ్య స్వభావానికి విరుద్దం అలాటివి. నాకు చెబితే..సత్యనారాయణ అన్నయ్యకి నాన్న ద్వారా చెప్పించి అడిగిన్చేదాన్ని కదా!" అన్నారు.

నేను ఎప్పుడు ఒకటి అనుకుంటూ ఉంటాను. చిన్న పాటి విషయాలకి కూడా..స్నేహాన్ని అడ్డంగా వాడేసుకుంటూ.. స్వార్ధం తో మెలిగే మనుషులు మద్య.. ఇద్దరి మిత్రుల అపురూప స్నేహం వెనుక నెలకొని ఉన్న ఉన్నత మైన విలువలు,చిన్న పాటి పనులకి కూడా ఉపయోగించుకొని నిబద్దత ఈ రోజుల్లో ఎక్కడ ఉన్నాయి. అవసరాలకి స్నేహాన్ని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకుని తర్వాత మొహం చాటేసే స్నేహాల మధ్య.. ఒక ఉన్నత మైన స్నేహాన్ని, ఉన్నత వ్యక్తిత్వాలని చూడటం..నాకు చాలా అబ్బురం. మా అబ్బాయికి కూడా చాలా సార్లు ఆ విషయం చెప్పి.. మా అబ్బాయికి సాంబశివరావు అన్నయ్య ని చూపించాలనుకున్నాను. కానీ కుదరలేదు.

అపరిమితముగా దనం సంపాదించడం, గొప్పగా మెలగడం .ఇతరులకి చిన్న మెత్తు సాయం కూడా అందించలేని పరమ లోభుల కన్నా .. తను నిజాయితీగా సంపాదించుకుంటూ..అందులో సగ భాగం పైగానే పేద విద్యార్ధులకి సాయం అందిస్తూ.. ఆఖరికి తను వ్రాసిన పుస్తకం పై లభించే రాయితీ మొత్తాలని కోడా పేద విద్యార్ధులకి సాయం అందించడంలోను, ఇతరుల ఇబ్బందిని గమనించి స్నేహంగా వెళ్లి ఇంటి అవసరాలకి కావాల్సిన గ్రాసరీ ని కూడా తీసుకు వెళ్లి అందించి.. వారి కోసం ఏమి దాచుకొని .. సాంబ శివరావు అన్నయ్యని. మంజుల గారిని చూస్తుంటే..
ఇంకా ఈ లోకంలో..మానవత్వం,నిబద్దత,ఉన్నత విలువలు యొక్క చిరునామా కనబడుతుంది. venkata S Musunuru .. అన్నయ్య అమెరిక పేరు. Granger -indiana ఉంటారు. Anesthesiology.లో బుక్స్ వ్రాసినందుకు గాను వారి సేవలకు గాను.. అవార్డులు వచ్చినట్లు విన్నాను కూడా.

ఇక్కడ వారి ఫోటో కూడా పెట్టి ఉండేదాన్ని. కానీ అన్నయ్యకి ఇలా చెప్పడం కూడా ఇష్టం ఉండదు.
ఆయనలో.. మరో మంచి కోణం .. ని చెల్లిని ప్రాణంగా చూసే అన్నయ్యని ,చిన్నమెత్తు కష్టం కూడా రానీయని అన్నయ్యని.ఒకవేళ కష్టం వచ్చినా తీర్చే అన్నయ్యని .ఓ..మంచి కొడుకుని, తండ్రిని కూడా నేను చూసాను. అలాంటి అన్నయ్య ఉండటం అదృష్టం మాత్రమే కాదు..గర్వపడటం కూడా. ఈ పోస్ట్ వ్రాయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. ఎందుకో నేను స్నేహానికి ఇచ్చిన ఆవిలువ కి గ్రేట్ ఫీల్ లోకి వెళ్ళిపోయాను కూడా. స్నేహమేరా జీవితం-స్నేహమేరా శాశ్వతం ..అంటారు కదా!

ఇంతకీ..మా "అప్పు " చదువు కి కూడా సాయం చేయడం ..ఒక విధంగా గొప్ప విషయం అనుకుంటాను. ఎందుకంటే..ఒక ఉన్నత వ్యక్తిత్వం ఏమిటో.. ఒక మనిషిలో చూడ గలిగాము కదా! మా పిల్లల కి ఆదర్శం అంటే ఏమిటో చెప్పగల్గుతూ..ఓ. స్నేహం విలువ ఇది..అని చెప్పడం తక్కువ విషయమేమీ కాదు కదా! మా "అప్పు " కి ఇలా చెప్పాను. నువ్వు బాగా చదువుకుని.. ఆ.. అంకుల్ సాయం చేసినట్లు పదిమంది పిల్లలకి అయినా హెల్ప్ చేయగలగాలి. అప్పుడే ఈ సాయానికి విలువ ఉంటుంది అని. ష్యూర్ .. పెద్దమ్మా..అని అంది అమ్మాయి. పిల్లల్లో ఆత్మ విశ్వాసం, సేవా భావం ,వ్యక్తిత్వపు విలువలు నేర్పాల్సిన బాధ్యతా యుతమైన పని కూడా ఉంటుంది కదా!

ఇకపొతే..వెంటనే మా చెల్లెలికి ఉన్న ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోయి..ఇప్పుడు వాళ్ళే ఫీజ్ లు కట్టుకోగాల్గే స్థితి లో కి వచ్చేసారు. మా "అప్పు" 93 %. మార్క్స్ తో.. A ** సెక్షన్లో.. TOP టెన్ గా ఉండటానికి ట్రై చేస్తుంది. కార్పోరేట్ కాలేజ్ లు రాంక్ ల పంట కోసం..విద్యార్దుల పై ఒత్తిడి,పిల్లల మానసిక ఒత్తిడి గురించి మరొక పోస్ట్ లో వివరిస్తాను. ఇప్పటికి ఇక సెలవు.

9 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

ఒక మంచి వ్యక్తిని పరిచయం చేసిన మీకు అభినందనలు. మీ "అప్పు" కి good luck!

అజ్ఞాత చెప్పారు...

స్నేహం విలువ ఏంటో మరోసారి చూపించారు.
నిజం చెప్పాలంటే ఆ స్నేహాన్ని అర్ధం చేసుకున్నందుకు మిమ్మల్ని అభినందించాలి. చాలా మంది అల ఆలోచించరు. కొంచెం మాట సాయం చేస్తే ఎంపోతుంది అని మాట్లాడాతారు కాని అవతలి వాళ్ళ మధ్యన ఉన్న relation అర్ధం చేసుకోరు. అంత ఆర్దిక ఇబ్బందులలో కూడా మీ sister అపార్ధం చేసుకోకపోవడం చాల great.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఉన్నత వ్యక్తిత్వం గల మహానుభావులను పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

Hats off

కాయల నాగేంద్ర చెప్పారు...

ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
"స్నేహం కోరుకునేది మనహితం
దానిని చేయరాదు కలుషితం"

శ్రీ చెప్పారు...

పురుషులందు పుణ్య పురుషులు వేరయా...
అని యోగి వేమన చెప్పినట్లు...
@శ్రీ

గోదారి సుధీర చెప్పారు...

Bahusa vaalla sneham alaa nilichi vundataaniki aa svabhaavame kaaranm ayivundocchu kadaa vanja gaaroo.yemainaa mee appu baagaa chaduvukovaali.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జలతారు వెన్నెల గారు.. థాంక్ యు వేరి మచ్.

@ సన్నాయి రాగాలు గారు.. నా బ్లాగ్ కి విచ్చేసినందుకు ధన్యవాదములు. అలాగే.. మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదములు

@ చిలమకూరు విజయ్ మోహన్ గారు ధన్యవాదములు.

@ కష్టే ఫలే గారు.. పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదములు.

@ నాగేంద్ర గారు.. థాంక్ యు వేరి మచ్.

@శ్రీ గారు.. ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

గోదారి సుదీర గారు .. "అప్పు" కవిత్వం వ్రాస్తుంది అండి. తన కవిత్వాన్ని మీకు పరిచయం చేస్తాను. మీ లాంటి వారి గైడెన్స్ అవసరం కూడా!

అలాగే.. వారి ఫ్రెండ్ షిప్ చెక్కు చెదరకుండా నిలబడటానికి కారణం కూడా అదే అయి ఉంటుంది కూదానండి.

మీ స్పందనకి ధన్యవాదములు.