11, మే 2012, శుక్రవారం

శ్మశానం లోను మత ప్రాముఖ్యత

బలి చక్రవర్తికి మూడడుగుల నేల సరిపోతుందేమో ..కాని మనిషికి మాత్రం మతం ఏదైనా అంతిమ సంస్కారం కి ఓ..ఆరడుగుల నేల కావాలి.

ఆరడుగుల నేలలో...పంచ భూతాలలో కలసి పోతాడు.

అరణ్యంలో జంతుజాలంలకి లేని సంస్కారం మనిషికి కావాలి. లేకపోతె ఏ కుక్కలో,నక్కలో,రాబందులో పీక్కు తింటాయని భయం.

మనిషి బ్రతికి ఉండగా మనిషికి మనిషికి మధ్య అంతరాలు ఉండనే ఉన్నాయి. కులం,మతం,ఆస్తులు-అంతస్తులు..
వగైరా లు.

మనిషి మరణించాక కూడా.. ఎన్నో అభ్యంతరాలు తొంగి చూసిన సంఘటన ఒకటి ..నిన్న మా సమీప గ్రామంలో జరిగింది.

ఒక దళిత కుంటుంబం లోని వ్యక్తి.. ఆత్మ హత్య చేసుకుని (బహిరంగ ప్రదేశంలో ) చనిపోయాడు.
ఆత్మహత్య కేసు నమోదు చేసుకుని ఆ..మృతదేహానికి పోస్ట్ మార్టం చేసి ఆ వ్యక్తీ కుటుంబ సభ్యులకి మృతదేహాన్ని అప్పగించారు.అసలు కథ ఇక్కడే మొదలైంది.

ఆ చనిపోయిన వ్యక్తి పుట్టుకతో హిందువు. పుట్టాక ఓ..నలబయ్యి ఏళ్ళకి క్రిస్టియన్ మతం లోకి మారి ఉండటం వల్ల అతనికి క్రైస్తవ మత సంస్కారం కొరకు స్మశాన వాటికకు తీసుకుని వెళ్ళారు.

అది హిందూ శ్మశాన వాటిక. అక్కడ హిందువులు కొందరు.. అక్కడ క్రైస్తవ మతం వారిని హిందూ స్మశాన వాటికలో ఖననం చేయడానికి అభ్యంతరం తెలిపారు.హిందువుల ఆచారం ప్రకారం దహనం చేస్తే అభ్యంతరం లేదని చెప్పారు.

శవ పేటికను అక్కడే ఉంచి..వివాదాలకి దిగారు. ఆ శ్మశాన వాటికలో ..క్రైస్తవుల ఖనన స్థలం ఉందని..క్రైస్తవల వాదన.

ఆ శ్మశాన వాటిక ని కొలిచి భాగాలు విడ గొట్టాలని వాదులాడుకున్నారు, అంతలో అక్కడికి రాజకీయ నాయకుల ప్రవేశం.జరిగింది..

ఆ స్థలం ని శుభ్రం చేస్తేనే కొలవడం కుడురుతుదని ..ప్రభుత్వ సర్వేయర్ చేతులెత్తేశారు.

ఆ శ్మశాన వాటిక శుభ్రం చేసేది ఎప్పుడు? కొలతలు వేసి విడ గొట్టేది ఎప్పుడు? అని అనుకుని ఆ శవ పెటికని తీసుకుని నగరంలోని స్వర్గపురీ కి తరలించారు.
ఇదండీ విషయం.

మనిషి చచ్చాక కూడా మత సంప్రదాయాలు..మనుషుల మధ్య కించిత్ మార్పుని తీసుకురాలేక కనీస మానవత్వం ని ప్రదర్శించలేని ..మనుషులకి ఈ మతం నేర్పిందేమిటి? ఆశ్చర్యంగా లేదూ!?

చచ్చాక కూడా శవాలని వెలివేసే తీరు లో ..సాధించేదేమిటి? అక్కడ కాకపొతే ఇంకొక చోట జరిగిపోయింది ఆ కార్యక్రమం.

మత మార్పిడులు మనుషుల మధ్య ఇనుప తెరలు వేసాయి. చచ్చిన తర్వాత కూడా సాదింపులుఉంటున్నాయి.

ఆరడుగుల నేల కోసం ..మతం ఆధిపత్యం ..లేదా.. జన్మ పొందినప్పుడు ఉన్న మతం ని ఆచరించ లేకపోవడం ,,లేదా..మతం మారడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు.. ఏది ..సరి అయిన కారణం అవుతుందో..నాకు అర్ధం కాలేదు.

మత మార్పిడుల వల్ల ..ఎన్ని ఇబ్బందులు ఉండకుండా బతికి ఉండగానే ..ఓ..ఆరడుగుల నేల కొనుక్కుని ఉంచుకోవడం కూడా అవసరమేమో!అనిపించింది.

ఆ స్థలాన్ని కూడా భూ బకాసురుల దృష్టి పడకుండా కాపాడుకోవడం కష్టమేమో!!

5 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

బావుందండీ! కొట్టుకోవడానికి ఒక వంక దొరకాలే కానీ దేనికయినా సిద్ధమన్నట్టు ఉంది. అసలు మనిషిని చనిపోయాక ఖననం ఏ మతం వారు ఎలా చెయ్యాలి అన్నది ఎక్కడా ప్రత్యేకంగా చెప్పినట్టు నాకనిపించదు. ఒకవేళ ఉంటే తెలియచేయగలరు. నా అభిప్రాయం ప్రకారం ఈ ఖనన క్రియలన్నీ కూడా మనకి అనువుగా, పది మందికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పెట్టారు అనిపిస్తుంది. ముస్లింలు చనిపోతే మట్టిలో కప్పెడతారు. ఎందుకంటే ఆ మతం మొదలయ్యింది ఈజిప్టులో. అక్కడ నేల సారవంతమయినది కాదు. చనిపోయిన మనుషులని అలా మట్టిలో పెట్టడం వలన అది సారవంతంగా మారి పది మందికి ఉపయోగపడేది. అలా అది వారి ఆచారంగా మారింది. అదే హిందువులలో కొంతమంది కాలుస్తారు, కొంతమంది పూడుస్తారు. ఇలా పూడ్చేవారు సాధారణంగా పంట పొలాల్లోనో, స్మశానాల్లోనో పూడ్చేవారు. మొదట్లో ఇబ్బంది ఉండేది కాదు కానీ తరువాత జనాభా పెరిగే కొద్దీ, ఆ చుట్టు ప్రక్కల నివసించే వారికి అలెర్జీస్ రావటం మొదలయ్యాయి. వాటినే దెయ్యం పట్టిందని భావించి కాల్చటం మొదలు పెట్టారు. పూడ్చినపుడు పూర్తిగా మట్టిలో కలిసేందుకు సమయం పడుతుంది. ఆ సమయంలో కొన్ని జబ్బులు రాకుండా ఉండటం కోసం కాల్చటం అనే ప్రక్రియ మొదలు పెట్టారు. అదే క్రైస్తవులని తీసుకుంటే వారి ఆవిర్భావం శీతల ప్రదేశాలు కనుక కాల్చడానికి మంటలు సరిగ్గా అంటుకోవు, శరీరాన్ని పూడ్చేసినా మట్టిలో కలవడం కూడా కష్టం (చాలా సంవత్సరాలు పట్టేది). సగం సగం క్రుళ్ళిన శరీరం వలన రోగాలు వస్తాయని పెట్టెలో బంధించి పూడ్చి పెట్టడం మొదలు పెట్టారు. ఇది నా అభిప్రాయం మాత్రమే! ఇప్పుడు వీటన్నిటికీ అతీతంగా కరెంటు ఆధారంగా కానిచ్చేస్తున్నారు.

అజ్ఞాత చెప్పారు...

ఇందులోని సమస్యలు 1) అపరిష్కారంగా పడివున్న స్మశానం 2) మత మార్పిడి చేసుకున్నా క్రైస్తవుల స్మశానంలో దళితుడి శవానికి చోటు దొరక్క పోవడం.

ఇందులో మానవత్వం అన్న ప్రశ్న రాదు, బ్రతికున్న వాళ్ళ సమస్యలను ఓ శవం పైకి తెచ్చింది.

రసజ్ఞ గారి శవాలను ఎందుకు పూడ్చాల/కాల్చాల అన్న వివరణ బాగుంది. మరి ఆ కాలంలో అంటువ్యాధుల గురించి అంత తీవ్రంగా రీసెర్చి చేశారా! అన్నది వేరే విషయం.

పల్లా కొండల రావు చెప్పారు...

అసలు మత మార్పిడి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకుని ఆ అణచివేత - అస్పృస్యతా ధోరణులు మానుకుంటే ఈ సమస్య కొంత తగ్గుతుంది.

అజ్ఞాత చెప్పారు...

మతం మారితే వామపక్షాలకు వచ్చే నష్టం ఏమిటి?! 'ఈ సమస్య కొంత తగ్గితే' ఎవరికొచ్చే ఇబ్బందులేవి?! అస్పృశ్యత హిందూ మతానిది కాదు, పాకిస్థానులో నిమ్నకుల ముస్లింస్ కూడా ఇదే సమస్య వుంది అంటే ఇది భారత ఉపఖండంలో వున్న సామాజిక సమస్య, ఒకప్పుడున్నంత ఇప్పుడు లేదు. దీన్ని ఎగదోసి తమ అస్థిత్వానికి ఆసరాగా కొన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి, అన్నది మీకు తెలిసిందే.

మతం మారినా హిందూ శ్మశానంలోనే ఇరుక్కుని పడి పూడుస్తామనటంలో రాజకీయమేమిటి?! కిరస్థానీలకు పూడ్పించుకోవటానికి ఇబ్బంది ఏమిటి?! క్రైస్తవులుగా మతం మార్చుకున్న దళితులకు జాగా ఇవ్వడానికి వాళ్ళకు వున్న మతపరమైన ఇబ్బంది ఏమిటి?

ఈ సమస్య శవానిది కాదు, బ్రతికి వున్న మనుషులది.

పూర్ణప్రజ్ఞాభారతి చెప్పారు...

//అది హిందూ శ్మశాన వాటిక. అక్కడ హిందువులు కొందరు.. అక్కడ క్రైస్తవ మతం వారిని హిందూ స్మశాన వాటికలో ఖననం చేయడానికి అభ్యంతరం తెలిపారు.హిందువుల ఆచారం ప్రకారం దహనం చేస్తే అభ్యంతరం లేదని చెప్పారు.//

అంటే అక్కడ ఖననం చెయ్యడం క్రైస్తవులకి కూడా అభ్యంతరమే అన్నమాట. మత మార్చుకోవడమంటే అంతకు ముందు తాను విశ్వసించిన దైవీయ భావనలను. తదాధారితమైన అన్ని ఆచారాలను వదిలేసుకోవడమే కదా. మరి అతని శరీరాన్ని హిందూ శ్మశాన వాటికకు ఎందుకు తీసుకువచ్చారో మరి.

ఎస్.ఎన్.కె.ఆర్ గారు వేసిన ప్రశ్న//2) మత మార్పిడి చేసుకున్నా క్రైస్తవుల స్మశానంలో దళితుడి శవానికి చోటు దొరక్క పోవడం. // సరైనది. మీరు మా మతాన్ని వదలండి కానీ మీ కులాన్ని వదులుకోకండి. మా దగ్గర కులాలు లేవు. కానీ మీ పాతమతపు కులాన్ని మేమూ దూరంగానే ఉంచుతామని అన్యాపదేశంగా చెప్పడమే ఆ మతాచరణ కాబోలు.

రోజు రోజుకు ఎటు వెళుతున్నామో అర్థం కాని పరిస్థితులు దాపురిస్తున్నాయి