6, జూన్ 2012, బుధవారం

అమ్మ


డ్రైవింగ్ లో వుండే  తన ఐ పోన్ లో  మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి ఇన్ బాక్స్ చూస్తున్నాడు రాజేష్.

అన్నయ్య  నీ కోసం అమ్మ ఫోటో వొకటి. యిదిగో.. అని చెల్లి పంపిన అటాచ్ ఫైల్ .. ఓపెన్ చేసాడు .

అమ్మ ఫోటో.

ఓ పది నిమిషాల క్రితమే కదా అమ్మతో,చెల్లితో వీడియో చాట్ లో మాట్లాడుతూ తన ప్రక్కనే నిలబడి మాట్లాడుతున్న ఓ..పరిచయస్తుడికి ..మా మామ్ అండ్ మై సిస్టర్ అని చూపించాను.

అమ్మ అతనికి "హాయ్" కూడా చెప్పింది.

"హౌ ఈస్ థిస్ టాటూ.. సే టు మై మామ్.." అడిగితే అతను" లూకింగ్ వేరి నైస్ "అని చెప్పాడు.

అమ్మ మనఃస్పూర్తిగా నవ్వింది. తరువాత వొక అయిదు నిమిషాలు చెల్లితో మాట్లాడుతూ వుండగా అక్కడ పవర్ కట్ అయింది.లింక్ తెగిపోయింది.

ఇప్పుడు చెల్లి పంపిన మెయిల్ లో అమ్మ ఫోటో!.

తను స్వయంగా చూసి చూసి  సంవత్సరం  అవుతుంది. కొంచెం లావు అయినట్లు వుంది.

స్క్రీన్ పై ఉన్న అమ్మ ముఖాన్ని జూమ్ చేసి చూసాడు. ప్రేమగా కుడిచేత్తో కారు స్టీరింగ్ ని కంట్రోల్ లో వుంచుకుంటూనే యెడమ చేతితో.. అమ్మ ముఖాన్ని చేతి వ్రేళ్ళతో తడిమి చూసి ..ఐ లవ్ యు అమ్మా! అనుకున్నాడు.

అదే సమయంలో తను నెలకొకసారి పంపే తన పోటోలని అమ్మ తన కొంగుతో తుడిచి ప్రేమగా సవరదీస్తున్నట్లు అనిపించింది కూడా.

దీక్షగా అమ్మ ముఖం వైపు చూసాడు.

ఆ కళ్ళు నిశితంగా దేనినో పరిశీలిస్తున్నట్లు,కొంచెం ఆలోచిస్తున్నట్లు భ్రుకుటి ముడి పడి వుంది.

సాధారణంగా అమ్మ ఫోటోకి పెద్ద ఇంటరెస్ట్ చూపదు. తనతో కలసి ఫోటో దిగాలి అనుకున్నప్పుడు తప్ప. అది ఆమెకి ఇష్టమైన పని.

తను ప్రక్కన ఉంటే చాలు అమ్మ కళ్ళల్లో కాంతి.కొట్టొచ్చినట్లు కనబడుతుంటుంది. ఇప్పుడు ఆ కాంతి మచ్చుకైనా లేదు.నవ్వి నవ్వనట్లు వుండే  పెదవులు కొంచెం బిగించి ఉన్నాయి.

చెల్లి అమ్మకి చెప్పకుండా ఫోటో తీసినట్లు  వుంది. అప్పుడప్పుడు వీడియో చాట్ లో చూస్తున్నా కాని తను అంత బాగా గమనించడం లేదు

అమ్మ ముఖం పై పెరిగిన బటర్ ప్లయ్ మార్క్ పిగ్మన్టేషన్ బాగా యెక్కువగా కనబడుతుంది.హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకో అమ్మాఅంటూ యెన్నిసార్లు చెప్పినా పట్టించుకోదు. అవే పోతాయిలే వాటికోసం యిప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాలా  అంటుంది.

స్కిన్ కేర్ మాత్రమే కాదమ్మా హార్మోన్ చేంజెస్ కూడా వుంటాయి. వెళ్లి చూపించుకుని మెడిసన్ వాడాలి అంటే వినదు.
ముఖానికి  ఫేస్ పౌడర్ అంటే యేమిటో తెలియని అమ్మ .. సింపుల్గా స్టైలిష్ గా వుండటమే తెలుసు.

మీ మదర్ భలే సింపుల్ గా వుంటారని  తన ఫ్రెండ్ సృజన్ వాళ్ళ అమ్మ అంటూ ఉండేది. అయ్యో, మీలా అమ్మ అసలు బాడీ కేర్ గురించి,స్కిన్ కేర్ గురించి పట్టించుకోరు ఆంటీ.అమ్మకి అసలు తీరికే ఉండదు అని చెప్పాడు తను.

మరి మీ మదర్ హెయిర్ స్టైల్ భలే ఉంటుంది. అప్పుడైనా సెలూన్ పార్లర్ కి వెళ్ళరా అడిగింది.

లేదండీ..వెళ్ళదు. మాకు తెలిసిన ఒక అతను ఇంటికి వచ్చి అమ్మకి హెయిర్ కటింగ్ చేసి వెళతాడు.అసలు అమ్మ ఎందుకు తన నల్లటి పొడవైన జుట్టుని కట్ చేయిన్చుకుందో నాకు అర్ధం కాదు. తనకి ఇందిరాజీ రోల్ మోడల్ అందుకే అలా హెయిర్ స్టైల్ మార్చుకుంది. ఆ హెయిర్ స్టైల్ తనకి ఎంత బాగా సూట్ అయిందో. అమ్మని చూసి అయిదుగురారుగురు మహిళలు అలా హెయిర్ స్టైల్ మార్చుకున్నారు.కాని వారికి అమ్మకి వున్న అందం లేకపోయే సరికి మళ్ళీ జుట్టు పెంచేసుకున్నారు అని చెప్పాడు.

సృజన్ వాళ్ళ మమ్మీ.. నువ్వు యెన్నయినా చెప్పు రాజేష్.. మీ అమ్మ పార్లల్ కి వెళ్ళదు అంటే నేను నమ్మను అంది. కావాలంటే ఒకసారి మీ మమ్మీ హాండ్స్ చూడు నెయిల్ షేపింగ్..ఆ నెయిల్ కలర్స్ ఎంత బాగా మైన్టైన్ చేస్తారో! చెప్పింది ఆవిడ

అవునాంటీ, అది మాత్రం నిజం . అమ్మ ని నేను చిన్నప్పటి నుండి చూస్తాను. అస్తమాను ఎంత వంట ఇంటి పనులు ,బట్టలు ఉతకడాలు,పాత్రలు శుభ్రం చేయడాలు చేసినా సరే..అమ్మ చేతులు,కాళ్ళు శుభ్రంగా అందంగా ఉంచడానికి ఇష్టపడుతుంది.అని చెప్పాడు.

"మా అమ్మ మనసు ఎంత సున్నితమో..ఆ అరచేతులు కూడా అంతా సున్నితం గా ఉంటాయి.అది బై బర్త్ అనుకుంటాను"  ఒప్పించానని అనుకున్నాడు కానీ ఆమె నమ్మలేదు.

అసలు ఈ సృజన్  అమ్మ భాద యేమిటో తనకి అర్ధం కాలేదు. ఎప్పుడు అమ్మ స్టైల్ పై పడి యేడుస్తుంది. సంప్రదాయంగా వేసుకునే మట్టి గాజులు మెడలో ఓ..చెయిన్ తప్ప అమ్మని హెవీగా ఎప్పుడు చూడనే చూడం.అలాటిది మీ అమ్మ రెగ్యులర్ బ్యూటిపార్లర్ కి వెళ్ళే టట్లు ఉంటుంది అని పదే పదే అంటుంటే తనకి కోపం రాదు అనుకున్నాడు.

ఆ విషయాలు గుర్తుకు వచ్చి నవ్వుకుంటూ ఎంతైనా మా అమ్మది సహజ సౌందర్యం అనుకుంటూ
మళ్ళీ ఇంకోసారి చూసాడు అమ్మ ముఖం వైపు. కుడి వైపు పెదవులు పూర్తిగా మూసుకోక కొంచెం ఇబ్బంది గా పెదవులు బిగించినట్లు తోచింది.

అమ్మకి రెండేళ్ళ క్రితం జరిగిన యాక్సిడెంట్ లో దేవుడు దయ వలన పెద్దగా దెబ్బతగల లేదు కాని రోడ్డు దెబ్బ తగిలి క్రింది దవడకి దెబ్బతగిలి పై పలువరుసని గుద్దుకోవడం పలువరుస కొంచెం అస్తవ్యస్తం గా మారింది.రెండు పళ్ళు కొంచెం జారినయి. ఆపరేషన్ చేసి సరిచేయడానికి ఓ,,పాతిక వేలు ఖర్చు అవుతుందని అర్దోడాన్టిక్ చెప్పారు.

ఇప్పుడు అంత డబ్బు ఖర్చు వద్దు. ముందు.. నీ వీసా ఏర్పాట్లు కానివ్వు నాన్నా అంటూ తన గురించి పట్టించుకోకుండా రోజులు గడిపేసింది.సంవత్సరాలు గడచి పోతున్నాయి.

అన్నయ్య ..అమ్మకి స్పాండి లైటిస్ వచ్చింది అని చెప్పింది. అప్పుడు హాస్పిటల్ కి వెళ్ళు అని గొడవచేసినా అశ్రద్ధ చేసింది అనడం కన్న .. తన చదువు అయ్యే ఖర్చు కోసం.. ఇంటి ఖర్చుల కోసం ప్రాధాన్యం ఇచ్చిందే తప్ప తన ఆరోగ్యం కోసం అయినా కూడా పైసా ఖర్చు పెట్టడానికి ప్రాధాన్యం ఇవ్వని అమ్మ..
పేద పిల్లల చదువుల కోసం వేలకి వేలు సహాయం చేస్తుంది.

తమ ఇంట్లో పని అమ్మాయిని కూడా పెట్టుకోకుండా .. మనమే మన ఇంటి పనులు చేసుకుంటే ఆరోగ్యం కి ఆరోగ్యం ఇల్లు వాకిళ్ళు పరి శుభ్రం కూడా అంటూ పని అమ్మాయికి యిచ్చే డబ్బుని పేద పిల్లల చదువు కోసం యిద్దాం అంటూ.. మాట ప్రకారం చిన్నమెత్తు తేడా లేకుండా ఆచరించి చూపే అమ్మకి కొడుకు అయినందుకు తనకే గర్వ కారణంగా వుంటుంది.

అవును మరి అమ్మ యెన్ని కస్టాలు పడింది. ఇప్పటికి యెన్ని కష్టాలు పడుతుంది. నాన్న ప్రేమ రోగమో, మోహం రోగమో! ఏదో దెయ్యం పట్టి తనని, అమ్మని నడివీధిలో వదిలేసి వెళ్లి పోయాక అమ్మ యెన్ని కష్టాలు పడింది? ఒంటి చేత్తో తనని యింత వాడిని   చేసింది . పిన్ని తిడుతూ వుంటుంది. ఒట్టి ముదనష్టపు వాడు మీ నాన్న. వాడికిచ్చి పెళ్లి చేసాడు మా..నాన్న. ఏనాడన్నా మీ అమ్మ కంటి నిండా నిద్ర పోయిందా !? తిండి తిందా? దాని బ్రతుకు ఆంతా అలా వెతలు తోనే గడచి పోయింది. నువ్వు అయినా అర్ధం చేసుకుని బాగా చదువుకుంటే దాని కష్టాలు తీరుతాయి అని మందలించేది.

నాన్న యిచ్చిన లక్షల విలువలు చేసే ఆస్తులు కన్నా అమ్మ ప్రేమగా పెట్టిన పచ్చడి మెతుకులే మిన్నగా పెరిగిన తనకి అమ్మంటే..అమితమైన ప్రేమ.

ఒంటి చేత్తో తనని అరికాళ్ళు కంద కుండా పెంచిన అమ్మ,తన రెక్కల పై ఉన్నత శిఖరాల కి చేర్చిన అమ్మ అంటే యే బిడ్డకి యిష్టం వుండదు చెప్పండి. మా అమ్మ కష్టాలు  తీరే రోజులు వచ్చేసాయి..అనుకున్నాడు.
అమ్మకి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం . తన కోసం ఖర్చు పెట్టేది ఆ వొక్క విషయం లోనే. అవైనా కొనుక్కుంటుందో లేదో అని ఆలోచించుకుంటూ..అమ్మ ఫోటో వంక ప్రేమ గా చూసుకుంటూ వుంటే.. కళ్ళు తడిసి పోతున్నాయి. వెనక్కి వెళుతున్న రోడ్డు మసక మసక గా కనబడుతుంది.

మళ్ళీ అతనికి  చెల్లి దగ్గర నుండి ఒక మెయిల్ వచ్చింది. అక్కడ కరంట్ వచ్చి వుంటుంది అందుకే మెయిల్ వచ్చింది అనుకుని ఓపెన్ చేసాడు.


అన్నయ్య ! అమ్మ చాలా బాధ పడుతుంది. నువ్వు టాటూ వేయించుకోవడం అమ్మకి నచ్చ లేదు. అలా అని నాకు నచ్చలేదు అని చెప్పదు. ఎందుకంటే అమ్మ మనస్తత్వానికి  అది విరుద్దం. ఇలా చేస్తే బాగుంటుంది అని తప్ప మీరు ఇలానే చేయాలి,ఇలాగే ఉండండి అని అమ్మ యెప్పుడైనా చెప్పిందా ?

నువ్వు నీ ఫేవరేట్ క్రికెటర్ "ధోని" ఇయర్ నాట్ పెట్టు కున్నాడని నీకు అలా ఉంటే బాగుంటుందని యిష్టపడి అలా ఇయర్ నాట్ పెట్టుకున్నావు. సరదా పడుతున్నావు కదా అని నిన్ను  డిస్ అప్పాయింట్ చేయడం యెందుకని  అమ్మ .. చాలా బాగుంది అని చెప్పింది. ఏదో సరదా పడుతున్నాడు లే అని నవ్వుకుంది. నా బంగారం చూడు ఎంత అందంగా వున్నాడో అనుకుంది కూడా .

ఇప్పుడు టాటూ వేయించుకోవడం అమ్మకి నచ్చలేదు.మనకంటూ ఓ..సంస్కృతీ-సంప్రదాయం వున్నాయి కదా, నువ్వు విదేశాలలో చదువుకున్నావు, వుద్యోగం కూడా చేస్తున్నావు. అక్కడ అలాటి ప్యాషన్స్ వుండటం పరిపాటి. కాని నువ్వు అలా ఇయర్ నాట్ తో..టాటూ తో మన దేశం లో తిరిగితే  అందరు యేదో వొ అంటారు అది నాకిష్టం లేదు అనుకుంటుంది. పైగా టాటూ కోసం నువ్వు మూడు వందలు డాలర్స్ ఖర్చు పెట్టావు.

ఇక్కడ అమ్మ హాస్పిటల్ కి వెళితే డబ్బు ఖర్చు అయిపోతుంది నీ పై అప్పుల భారం పెరిగి పోతుంది వడ్డీలతో కలిపి ఆ అప్పులు తీర్చడం నీకెంత కష్టం అని తలచుకుని బాధ పడుతుంది తెలుసా, అమ్మకి రీడింగ్ గ్లాసెస్ అవసర పడ్డాయి.అయినా ఆ ఖర్చు కి కూడా వెనుకాడుతుందని నీకు తెలుసా!

అమ్మ కి మించిన గొప్ప రోల్ మోడల్ యెవరన్నయ్యా మనకి. యింటి కోసం, మన కోసం ఎంత కష్ట పడుతుంది? ఇప్పుడు మన వర్క్ షాప్ లో వర్క్స్ జరుగక మూసేయాల్సిన పరిస్థితి. అవన్నీ నీకు తెలియ నివ్వదు. నా బిడ్డకి ఆ కష్టాలు అన్నీ చెప్పడం యెందుకు అంటుంది. అమ్మ మనసు. అది అన్నయ్యా!

నీకొక విషయం తెలుసా.. అమ్మ తన కోసం తెప్పించుకునే వీక్లీస్,మంత్లీస్ సబ్ స్క్రిప్షన్స్ అయిపోయినా సరే మళ్ళీ సబ్ స్క్రిప్షన్స్ కట్టడం లేదు. ఇప్పుడు నేను చదవక పొతే యేమైంది లే అనుకుంటుంది.

అందరు వాళ్ళ అబ్బాయి అమెరికాలో వున్నాడు. ఇక వాళ్లకి డాలర్ లే డాలర్లు అంటున్నారు. నువ్వేమో ఇలా ప్రవర్తిస్తున్నావు.

ఇక నుండి అయినా నువ్వు సంపాదించుకున్న డబ్బు నీ ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెట్టకుండా, ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ కోసం ఖరీదైన గిఫ్ట్స్ కొని పంపిస్తూ ,లేకపోతే డబ్బు లేదన్న వాళ్ళందరికీ జాలితో అపాత్ర దానం చేస్తూ వున్నావు. అలా చేయకుండా యికనైనా నీ కష్టార్జితాన్ని జాగ్రత్త చేసుకో.  నువ్వు చేస్తున్నవి తప్పు అని నీకు చెప్పాను అని అనుకోవద్దు. కాని మన యింటి పరిస్థితులని గమనించు.

అమ్మ ఫోటో నీకు యెందుకు పంపానో తెలుసా, అమ్మ ముఖం చూసి అయినా నువ్వు ఇక్కడి పరిస్థితులని గ్రహిస్తావని.అని సుదీర్గంగా చురుక్కు మనిపించేలా వ్రాసింది. చదువుతున్న అతనికి   చాలా బాధ కల్గింది.

ఈ సారి  తన అమ్మ ముఖం వైపు చూసాడు.
ఆమె ముఖం యింకా అందంగా కనిపించింది. నిండు పూర్ణ చంద్రుడి లో మచ్చలు వున్నట్లు అమ్మ ముఖం లో మంగు మచ్చలు. పెదవులు బిగించి వునప్పుడు కూడా క్రిందికి జారి కనబడే ఆ పలువరుస ని చూస్తుంటే.. అందమైన దరహాస చంద్రిక అంటే యేమిటో తెలుసుకున్నాడు.అతనిలో పరివర్తన మొదలైంది.

అవును .. అమ్మ కన్న రోల్ మోడల్ యెవరు? అమ్మ కన్న అందమైనది ఈ ప్రపంచంలో మరొకటి యేముంది?.

 అతని కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయాయి. హృదయంలో అమ్మ పీఠం ఇంకా బలంగా ప్రతిష్టించ బడింది.
 అమ్మంటే కమ్మని మాటేనా! కాదు కాదు.కవి అన్నట్టు " అమ్మంటే అంతులేని సొమ్ము అది యేనాటికి తరగని భాగ్యమ్ము"అమ్మ కోసం ....పాట.


8 కామెంట్‌లు:

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

తొమ్మిది మాసముల్ కడుపు దుర్భర మైనను మోసి , కాన్పులో
బమ్మిన వేదనల్ గడిచి , పాపకొ బాబుకొ జన్మనిచ్చి , ప్రా
ణమ్ములు పోసి పెంచు కరుణామయి తల్లిని బిడ్డలెప్పుడున్
నమ్మిక మోసగింతు రయినన్ తన బిడ్డలె ప్రాణ మమ్మకున్
------ సుజన-సృజన

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

వెంకట రాజారావు గారు..మీ వ్యాఖ్య కి సంతోషం. ధన్యవాదములు.

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

హృదయాన్ని చిక్క బట్టుకొని చదివించే కథ .ఈ కథ కొడుకులు,కూతుర్లు అందరు చదవాలి.really touching.

సి.ఉమాదేవి చెప్పారు...

ప్రతి అమ్మలో ఉండే ఆర్తిని ప్రతిఫలింపచేసింది వనజగారు.

జలతారు వెన్నెల చెప్పారు...

వనజగారు, చాలా బాగుంది.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఒద్దుల రవిశేఖర్ గారు
@సి.ఉమాదేవి గారు..
@జలతారు వెన్నెల గారు
మీ అందరి యొక్క స్పందనకి ధన్యవాదములు.
"అమ్మ"అంటే అంతే కదా!

సీత చెప్పారు...

heart touching vanaja gaaru.....!!
amma ante ante ...!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Seeta gaaru Thank you!
@puranapandaphani gaaru.. Thank you very much!!