5, నవంబర్ 2012, సోమవారం

నీ పాదం మీద పుట్టుమచ్చనై...


ప్రస్తుతం ఒకే ఒక సంతానం కల్గి ఉండటం, ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నమై  ఆ మూలన ఒకరు ఈ మూలన ఒకరు పడి ఉండటం వల్ల రక్త సంబంధీకుల మధ్య కూడా ప్రేమాభిమానాలు తరిగి పోవడం.. పరాయి వారిగా తలంచడం వెనుక   సున్నితత్వం చచ్చిపోవడమే కాదు ఆర్ధిక అసమానతలు కూడా కారణమేమో!

వస్తు వ్యామోహం, ఆడంబ రత్వం వల్ల  సొంత అన్నా  చెల్లెళ్ళు ,అక్కా తమ్ముళ్ళు కూడా ఎవరికీ వారే యమునా తీరే రీతిగా మెలుగుతుండటం  ఆశ్చర్యం కాదు.

నేను ఈ పోస్ట్ చాలా రోజులుగా వ్రాయాలనుకుంటాను.



ఈ పోస్ట్ కేవలం మా "అన్న" కోసమే!!

ఎంత దూరంగా ఉన్నా రెండు రోజులకి  ఒకసారి అయినా  మా అన్న కాల్ చేయకుండా ఉండలేడు  . "అమ్మా! ఏం చేస్తున్నావ్ ! అని చిన్న పిల్లని అడిగినట్లు ఆడుగుతాడు. నేను నవ్వు కుంటాను. మా అన్నయ్యకి నేను ఇంకా చిన్న పిల్లనే అని.

నా చిన్నతనంలో నేను చేసిన  చాలా చాలా అల్లరి పనులకి మా అన్నయ్య సాక్ష్యం.అయినా సరే .. నోరు విప్పి చెప్పకుండానే .. నన్ను కాచే కన్ను. మా అన్న.

అమ్మ లోని లాలన-నాన్నలోని పాలన..అన్నలోనే చూసిన అదృష్టం నాది.

నేను అమ్మమ్మ వాళ్ళింట్లో పెరిగి ఆ సంవత్సరమే మా ఇంటికి వచ్చాను. నేను అన్నయ్య ఇద్దరం కలిసే స్కూల్ కి వెళ్ళే వాళ్ళం. "బాబూ.. అమ్మాయిని జాగ్రత్తగా తీసుకుని వెళ్లి మళ్ళీ వచ్చేటప్పుడు వెంటబెట్టుకుని తీసుకునిరా.. అని చెప్పేది అమ్మ.

అదంతా..నా పై ప్రేమ మాత్రమే  కాదు.. స్కూల్ వదిలేశాక బుద్దిగా ఇంటికి రాకుండా..పిల్లలతో కలసి ఏ గోలీలాట కి వెళ్లి ఇల్లు సంగతి మరచిపోతానని మా అమ్మ జాగ్రత్త.

అన్నయ్య అయితే.. నా చేయి పట్టుకుని తీసుకు వెళ్ళేవాడు. మధ్యానం అన్నం తినడానికి ఇంటికి  వచ్చి మళ్ళీ ఒకటిన్నర గంటకి స్కూల్ కి వెళ్ళేవాళ్ళం. అమ్మ తినడానికి ఎదో ఒకటి ఇచ్చి పంపేది. ఒక రోజు ఏం  జరిగిందంటే ..

అన్నయ్య,నేను ఒకరి వెనుక ఒకరు నడుచుకుంటూ.. అమ్మ ఇచ్చిన ఆకుపచ్చ రంగు కాగితం చుట్టిన న్యూట్రిన్ చాక్లెట్స్ ని బేగ్ లో వేసుకుని  బత్తాయి కాయి ఒలుచుకుంటూ వెళుతూ ఉన్నాం. నేను అయితే.. అన్నాయ్.!. ఉండు.. ఇటు చూడు ! అని .. ఒలిచిన బత్తాయి తొక్కని రెండు వ్రేళ్ళ మద్య నొక్కిపట్టి  అన్న కళ్ళముందు తీసుకువెళ్ళి నొక్కాను.  ఆ తొక్క లోని  రసం కళ్ళల్లో పడి .. అబ్బా..మంట..అంటూ అన్నయ్య కళ్ళు మూసుకుని.. అట్టా  చేయకూదమ్మా  అన్నయ్యని కదా ! అంటూ.. మళ్ళీ  బత్తాయి తొక్కతో ఎక్కడయినా దాడి  చేస్తానో అన్నట్లు   నా వెనుక నడుస్తున్నాడు.

అలా కొంచెం దూరంలో నడిచామో లేదో.. నేను టక్కున ఆగిపోయాను. ఎదురుగా.. ఒక కుక్క నిలబడి ఉంది అది మామూలు కుక్క కానే కాదు. డాక్టర్ గారి కుక్క. కదిలితే.. కండ  పట్టుకుని..పీకి పడేసే రాక్షసి కుక్క. రోజు అంతా కట్టి పడేసి.. డాక్టర్  గారు భోజనం చేసే సమయంలో దానిని మేడపై నుండి క్రిందికి తీసుకు వచ్చి షికారుకి వదిలేసి వెళ్ళేవారు. ఆ సమయంలో ఆ కుక్క జనాలతో ఆడు కునేది. మా ఇంటి ముందు ఉన్న  బజారు వెంబడే రోజు షికార్లు చేసేది కాబట్టి  మమ్మలిని రోజు చూస్తూనే ఉండేది కాబట్టి..మమ్మల్ని ఏమి అనేది కాదు కానీ ఆ కుక్క రూపం చూస్తేనే భయంతో ఒణికి దూరంగా ఉండేవారం.

 ఇక డాక్టర్  గారు గురించి కంటే    డాక్టర్  గారు  ఉండే ఇంటి గురించి చెప్పాలి. ఆయన ఆర్ ఎం పి డాక్టర్ గారే !! కానీ వాళ్ళు ఉండే ఇల్లు మాత్రం పెద్ద మేడ . రాజుల కోట నమూనాలో కట్టబడింది. పూర్వకాలం మైలవరంలో కట్టిన కోట మోడల్ లో చిన్నదిగా కట్టి ఉండేది. బ్రిటీష్ వారి కాలంలో  కప్పం క్రింద ధాన్యం చెల్లించేవారట. ఆ ధాన్యం నిలువ ఉంచడానికి కోత్వాల్ ఉండటానికి ఆ కోట కట్టారని మా తాత గారు చెప్పుతూ ఉండేవారు. కాలక్రమేణా ఆ కోట వైశ్యుల చేతిలోకి వచ్చి డాక్టర్ గారు అద్దెకి ఉండే వారు.  మూడంతస్తుల ఆ కోట ని మూడో అంతస్తు  ఎక్కడం చాలా కష్టంగా ఉండేది. అయినా ఎక్కి చూడాలని నాకు చాలా ఉబలాటంగా ఉండేది.నా ఉబలాటం కి అడ్డుకట్ట వేసేది.. ఈ రాక్షసి కుక్కే!

అలా ఆ రాక్షసి కుక్కని భయం భయం గా చూస్తూ.. ఉండగానే అది మా దగ్గరికి వచ్చి వాసన చూడటం మొదలెట్టింది. అలా వాసన చూసి వెన్నక్కి వెళ్లి అన్నయ్య దగ్గర ఆగింది. అంతే.. నేను  భయం వేసి.. అన్నయ్యని ఒదిలేసి  పరుగో పరుగు.. నా పరుగు చూసి అన్నయ్య కదలబోయాడు.  ఆ కుక్క భౌ భౌ ..అంటూ.. అన్నయ్య తొడని పట్టుకుని.. ఎడా పెడా .. కరిచేసింది. అన్నయ్య ఏమో.. ఒకటే కేకలు, ఏడుపూను .

ఆ కేకలు మా ఇంటి వరకు వినబడి.. అమ్మ గబా గబా వచ్చింది. అమ్మ ఆ కుక్కని తరిమి కొట్టి  రక్తం కారుతున్న అన్నయ్య  కాలుని తుడుస్తూ.. డాక్టర్ గారిని క్రిందికి కేకేసి  "అన్నయ్య గారు ..మీ కుక్క చూడండి మా బాబుని ఎలా కరిచిందో.." అని అడిగింది.

ఆయన గబా గబా క్రింది దిగి వచ్చి.. వాళ్ళ  కుక్క కరిచిన అన్నయ్య కాలు చూసి..అయ్యో.. ఎంత పని జరిగింది.!? ఈ రాస్కెల్ ని కట్టి పదేయాల్సిందే ఒదలనే  కూడదు అని  వచ్చినంత వేగంగా పైకి వెళ్లి కుక్క ని కట్టేసే గొలుసు తెచ్చి దానిని నాలుగు  పీకి  గొలుసుతో.. కట్టిపడేశారు.  అన్నయ్యకి కట్టు కట్టి ఇంజక్షన్ చేసారు. పాపం అన్నయ్య.. ఏడుస్తూనే ఉన్నాడు. ఈ ఇంజక్షనే చాలదు. మైలవరం తీసుకు వెళ్ళి  బొడ్డు  చుట్టూ..పద్నాలుగు ఇంజక్షన్స్ చేయించాలి అని చెప్పారు. ఇంజక్షన్ చేయిన్చుకోవడం అంటేనే  భయం అయిన మా అన్నయ్యకి ఆ మాటకి ఇంకా ఏడుపు వచ్చింది.

తర్వాత పద్నాలుగు ఇంజక్షన్స్ బొడ్డు  చుట్టూ వాపు.. ఏడుపు ..పాపం ..మా అన్నయ్యకి ఎంత కష్టం.!?
అయినా కూడా.. ఒక్కసారి కూడా.. అమ్మాయి పరిగెత్తడం  వల్లనే ఆ కుక్క నన్ను కరిచింది అని అమ్మకి చెప్పనే లేదు.  పాపం! ఎంత మంచి అన్నయ్య.

అలాగే ఇంకో సంఘటన రోజూ సాయంత్రం పూట అమ్మ వండి పెట్టిన అప్పచ్చులు తింటూ ఆడుకునేవాళ్ళం. మాతో పాటు డాక్టర్ గారి అమ్మాయి "కల్యాణి " వాళ్ళ "బాబు"  కూడా కలిసి ఆడు కునేవారు. ఆ రోజు అమ్మ చేసిన తినుబండారాలు  అన్ని అయిపోయాయి అని చెప్పి చెరొక బెల్లం ముక్క ఇచ్చి.. తొందరగా వచ్చేయండి. స్నానం చేసి పెందలాడే అన్నం తినేద్దురుగాని అని చెప్పి పంపింది.

 నేను, అన్నయ్య.. ఆ బెల్లం ముక్క తింటూ.. పాటిబండ్ల వారి అరుగుల పైకి చేరుకున్నాం. మమ్మల్ని చూసి కల్యాణి క్రింది దిగి వచ్చింది. ఎత్తుగా ఉన్న అరుగులు ఎక్కి దిగి.. ఏవో ఆటలు ఆడుతున్నాం. అమ్మ నాకిచ్చిన బెల్లం ముక్క తినడం అయిపొయింది. అది చూసి అన్నయ్య. "అమ్మ నీకు చిన్న బెల్లం ముక్క ఇచ్చింది..చూడు నాకు ఎంత పెద్ద బెల్లం ముక్క పెట్టిందో.."అని ఊరించ సాగాడు.

నాకు కోపం ముంచుకు వచ్చి  అన్నయ్య దగ్గరికి వెళ్లి  ఉక్రోషంతో వెనుక నుంచి  ఆ  ఎత్తైన అరుగుల పై నుండి అన్నయ్యని క్రిందకి తోసేసాను. ఆ పడటం పడటంతోటే  అన్నయ్యకి మోచేయి పైన విరిగి కూర్చుంది.

 మళ్ళీ అన్నయ్య ఏడ్పులు. అమ్మ అడిగింది.. "ఎలా పడ్డావు?" అని.  అన్నయ్య నేను తోసేసిన సంగతి చెప్పకుండా ఆడుకుంటూ నేనే పడిపోయాను అని  అబద్దం చెప్పాడు.

అప్పుడు కల్యాణి అమ్మకి ఇలా చెప్పింది. "బాబు ఒట్టి మాటలు చెపుతున్నాడు. అమ్మాయే ..బాబుని క్రిందకి తోసేసింది." అని.

అమ్మ నావైపు అనుమానంగా చూసింది.  అమ్మ  కొట్టకుండానే నేను ఏడుపు మొదలెట్టాను

అమ్మా..!.అమ్మాయిని ఏం  అనకు,  ఆడుకుంటూ నేనే క్రింద   పడ్డాను అని  చెప్పి అమ్మ కొట్టే దెబ్బలు నుండి నన్ను కాపాడాడు.

అదే రోజు రాత్రి  బూరుగ గూడెం తీసుకు వెళ్లి అన్నయ్యకి నాటు కట్టు కట్టించుకుని వచ్చారు. ఆ చేయి అతుక్కుని సరిగా వచ్చేదాకా నేను మా అన్న వంక బాధగా  చూసేదాన్ని. ఛీ.. ఇంకెప్పుడు ఇలా చేయ కూడదు అని అనుకునేదాన్ని.

అన్నయ్యకి నేను అంటే అంత ప్రేమ. అప్పుడే కాదు నలబయి అయిదేళ్ళ కాలంలో ఎప్పుడూ కూడా.

ఆటలాడుతూ..  తొండి  ఆటలు ఆడుతున్నారని  తోటి పిల్లలతో నేను గొడవ పడుతున్నప్పుడల్లా.. నన్ను వారించి నన్ను వెనక్కి లాక్కు వచ్చే అన్న, నేను చేసిన చిలిపి  పనులు దాచి పెట్టి నన్ను కాపాడే అన్న.. ఇంకా చాలా సందర్భాలలో.. నాకు ఇలాంటి అన్న ఉంటె చాలు అనిపించిన అన్న .. మా అన్నయ్య.

బుధవారం పుట్టినందుకేమో.. చాలా సౌమ్యుడు. కష్ట జీవి.  బావ గారి అబ్బాయికి లాగా ఆగ్రా యూనివర్సిటీ లో ఇంజినీరింగ్ చేయిన్చాలనుకునే అమ్మ ఆశలు కాదని కుటుంబం  కోసం పంతొమ్మిది ఏళ్లకే  భుజాలపై భారం ఎత్తుకున్నవాడు.చెల్లెళ్ళు అంటే ప్రాణం ఇచ్చేవాడు.

చెల్లెలికి కష్టం వస్తే.. తను కూడా  కన్నీరు పెట్టేవాడు.  తనకి     పెళ్లి సంబంధం కోసం వచ్చి వాకబు చేసుకున్న వారికి  కుంట ముక్కల లోనే అలాంటి బుద్దిమంతుడు అయిన అబ్బాయి వేరొకరు లేరని పదుగురి నోటా మెచ్చబడినవాడు .

ఈ  చెల్లికి కష్టం వస్తే నలుగురిలో ఎంత గుంభనంగా ఉన్నా.. సరే అన్న తో చెప్పి తన కష్టాన్ని కన్నీరు రూపంలో  ప్రవహించి అన్నకి చేర్చితే తప్ప మనసు తేలిక పదని  ఈ చెల్లికి " నీకు  నేను ఉన్నాను  కదమ్మా! దైర్యంగా ఉండు" అని ఓదార్చే అన్న..

ఈ అన్న గురించి చెప్పాలంటే చాలా భాగాలు గా  వ్రాయాలి.  అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి అర్ధంగా నిలిచిన ఎన్నో విషయాలు.. సజీవంగా మిగిలి ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే పోస్ట్ పెద్దదవుతుంది కాబట్టి.. ఈ రోజుకి ఇది చాలు.

మా అన్న కోసం ఈ పాట ...


14 కామెంట్‌లు:

జ్యోతి చెప్పారు...

మీ అన్నాచెల్లెల్ల అనుబంధం కలకాలం ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటున్నాను..

PALERU చెప్పారు...

Champesaaarandi vanajakka gaaru....Love this post

ఆత్రేయ చెప్పారు...

నేనొప్పుకోను !! నాగురించి అస్సలు రాయలేదు. అంతా మోసం.

మంచి టపా, బాగుంది మా అన్న కూడా అంతే ప్రతీ రోజూ ఫోన్ చేసి మంచి చెడ్డలు అడుగుతాడు.

తన ప్రేమ తో నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. అన్నలంతా అంతేనేమో.

జ్యోతిర్మయి చెప్పారు...

ఎంత అదృష్టవంతులు వనజగారు. జ్యోతి గారి మాటే నాదీను.

పల్లా కొండల రావు చెప్పారు...

బాగుంది. నేడు అన్ని మానవ సంబంధాలను డబ్బు శాసితోంది. ఆత్మీయతానుబంధాలను కబళించివేస్తుంది. పోస్టు పాటా బాగున్నాయి. మీరు అదృష్టవంతులు. చాలామంది అన్నలిలా ఉండేవారున్నారు. గుర్తుంచుకుఏ చెళ్లెల్లెందరో మీలాగా మరి.

మీ అన్నాచెల్లెల్ల అనుబంధం కలకాలం ఇలాగే ఉండాలి.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మీరు చాలా అదృష్టవంతులండీ..
"కొన్ని బంధాలు మాత్రమూ ఎన్నడు మారవు"
లాగా మీ అన్నాచెల్లెళ్ళ అనుబంధం కూడా ఎప్పటికీ ఇలాగే వుండాలని కోరుకుంటున్నాను..

Padmarpita చెప్పారు...

చాలా వరకు అన్నాచెల్లెళ్ళ అంబంధాలు ఇలాగే ఉంటాయండి. మీ బంధం కలకాలం ఇలాగే ఉండాలని కోరుతూ....

శశి కళ చెప్పారు...

అయితే మీరు నా అల్లరి బ్యాచ్ అన్న మాట :))
అన్నయ్య అంటే అన్నయ్యే...యెంత చక్కగా ఉన్నాయి మీ కబుర్లు

meghamandiram చెప్పారు...

chalaa manchi anubandam andi

జలతారు వెన్నెల చెప్పారు...

You are really lucky!!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జ్యోతి..గారు ..ధన్యవాదములు. ఈ సిరీస్ ఇంకా పూర్తీ కాలేదండీ!!


@రాఫ్సున్ తమ్ముడూ.. ఎలా ఉన్నారు? బహు కాల దర్శనం. అంతా..బాగు..బాగు నే కదా! బ్లాగ్ లోకి ఎప్పుడు వస్తారు?

మీ అభిమాన పూర్వక వ్యాఖ్యకి ధన్యవాదములు.


@ఆత్రేయ అన్నగారు.. అన్నల అభిమానం లేకుంటే.. చెల్లెళ్ళు నాలా ఉండగలరా! ఇంకా ఈ సిరీస్ అవలేదు.

మీ వ్యాఖ్యకి ,మీ ప్రశంస కి ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జ్యోతిర్మయి గారు.. ఎలా ఉన్నారు. ?

కొన్ని కొన్ని బై బర్త్ లభిస్తాయండీ! గాడ్ ఈజ్ గ్రేట్! తనక్ యు వెరీ మచ్ !!

@ కొండల రావు గారు.. ఇప్పటి తరం కి కోరినది..కొండ మీద నుండి తీసుకు వచ్చే తల్లిదండ్రులు ,ఇవ్వకపోతే బ్లాక్ మెయిలింగ్స్ మాత్రమె తెలుసు.

అన్నా..చెల్లెళ్ళ మధ్య అనుబంధాలు,సర్దుబాట్లు ,ఒకరి కోసం ఒకరు పడే తాపత్రయాలు లేకుండా.. స్వార్దపరత్వంతో బ్రతుకుతున్న రోజులివి. ఇలా పంచుకుంటే బావుంటుందని ..ఈ ప్రయత్నం. ధన్యవాదములు.

@ పద్మార్పిత గారు.. మరీ మరీ ధన్యవాదములు రక్తసంబందం కదండీ!! అందుకే అలా ఉండే గొప్ప రోజులవి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజీ గారు.. మీరు కూడా.. చెల్లితో,తమ్ముడితో..ఉన్న అనుబంధాలు,అనుభూతులు షేర్ చేసారు కదా! ఎంత ముచ్చటగా ఉనాయో..ఆ ముచ్చట్లు.

మళ్ళీ గుర్తుకు వచ్చాయా!? థాంక్ యు వెరీ మచ్!!

@ జలతారు వెన్నెల గారు.. ఎలా ఉన్నారు? థాంక్ యు వెరీ మచ్!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శశి ..టీచర్.. ఎలా ఉన్నారు? మీ అభిమానానికి ధన్యవాదములు.

@ మేఘమందిరం రాము గారు..ధన్యవాదములు. మీ బ్లాగ్ చూస్తున్నాను. మీరు సీనియర్ బ్లాగర్. మీ బ్లాగ్ చాలా బావుందండీ!!