17, జనవరి 2013, గురువారం

స్నేహ గీతి

స్నేహం  లేకుంటే.. జగమే జడ పదార్ధంలా తోస్తుంది కదా!

స్నేహం గురించి ..నా అభిమాన కవి.. స్నేహ గీతి ఇది.

నేను ఎప్పుడు మరువనిది. నిరంతరం  నా పెదవులపై నలిగేది ..

 ఒక్క పలకరింపు చాలు కదా! 
పెదవులపై నవ్వులు విరబూయడానికి,
పదములుగా  కవిత్వం జాలువారడానికి 


తైలాలు లేకుండా వెలిగేటి దీపం
విద్యుత్ లేకుండా వేలిసేటి దీపం
హృదయాలలో ఎప్పుడూ నిలిచేటి  దీపం
నిజమైన దీపం మా స్నేహ దీపం

వర్ణాలు వర్గాలు వదిలితే స్నేహం
వేషాలు దోషాలు మానితే స్నేహం
ప్రాణాలు అర్పించగల్గితే స్నేహం
కష్టాలు నష్టాలు ఓర్చితే స్నేహం

నిరుపేద అయితే ఏమి ఎవడైతే ఏమి
చదువేమి రానట్టి చవటైతే నేమి
అందాలు చందాలు లేకుంటే ఏమి
నిన్ను కాచినవాడే నిజమైన నేస్తం

దోస్తిని మించినది లేదు జగాన
రత్నాలు కంటే మిన్న అది లోకాన
మిత్రుడే కావాలి సుఖమున,శోకాన 

అతడు లేకున్నచో నగరమే కాన-

చీకటిలో దారి చూపేది నేస్తం
కళ్ళు తలకెక్కితే దింపేది నేస్తం
మనలోని లోపాలు తెలిపేది నేస్తం
నిజమైన మనిషిగా నిలిపేది స్నేహం..
                                                        - దాశరధి

నా  ఈ నడకలో తోడైన నా మిత్రులందరికీ  ఈ స్నేహ గీతంతో నా మనసు మాట వెల్లడిస్తూ.. మనసారా ధన్యవాదములు.




4 కామెంట్‌లు:

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

నిద్దుర లేవంగానే స్నేహ హస్త మందిస్తాడు సూర్యుడు లేలేతకిరణాలతో -
పూల మొక్కలు పిలుస్తాయి విచ్చుకొన్న పూల స్నేహ సౌరభంతో -
రాతిరి వేళల చందమామ చల్లని వెన్నెల చల్లుతాడు చెలిమి కోరి-
తుదకు జంతువులు కూడా మాలిమి చేస్తే స్నేహాన్ని వీడవు -
అన్నీ తెలుసను కొనే మనిషేమో అహంకార మలినంతో స్నేహాన్ని కూడా కల్తీ చేస్తాడు .
స్నేహం విలువ ప్రకృతికి తెలిసి నంతగా మనిషికి తెలియడం లేదు మరి .

అజ్ఞాత చెప్పారు...

నిరుపేద అయితే ఏమి ఎవడైతే ఏమి
చదువేమి రానట్టి చవటైతే నేమి
అందాలు చందాలు లేకుంటే ఏమి
నిన్ను కాచినవాడే నిజమైన నేస్తం

నిజం! నిజం!!

భారతి చెప్పారు...

నిరుపేద అయితే ఏమి ఎవడైతే ఏమి
చదువేమి రానట్టి చవటైతే నేమి
అందాలు చందాలు లేకుంటే ఏమి
నిన్ను కాచినవాడే నిజమైన నేస్తం...

చీకటిలో దారి చూపేది నేస్తం
కళ్ళు తలకెక్కితే దింపేది నేస్తం
మనలోని లోపాలు తెలిపేది నేస్తం
నిజమైన మనిషిగా నిలిపేది స్నేహం

అద్భుతమైన స్నేహగీతిక!
అపురూపమైన స్నేహగీతి అందించినందుకు అభినందనలు వనజ గారు!
మీరన్నట్లు చిరు పలకరింపు చాలు ... పెదవులపై నవ్వులు విరబూయడానికి, అంతరంగమంతా అనురాగభరితం కావడానికి...

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

వెంకట రాజారావు లక్కాకుల గారు..మీ స్పందనకి ధన్యవాదములు. ప్రకృతికి తెలిసినంతగా స్నేహించడం మనిషి కి ఏం తెలుస్తుంది. మీ అభిప్రాయం తో ఏకీభవిస్తున్నాను.

@భారతి గారు.. స్పందనకు ధన్యవాదములు.

@కష్టేఫలె మాస్టారూ.. ధన్యవాదములు.