15, సెప్టెంబర్ 2014, సోమవారం

అవే ముఖచిత్రాలు

అవే ముఖ చిత్రాలు ..

అన్నిచోట్లా... నామ వాచకం
మోసగించేవాడికి మోసపోయామనుకునే వారికి 
వేదిక ఎక్కడైనా కావచ్చు వేడుక రూపం మారవచ్చు
విషయం మాత్రం ఎప్పుడూ ఒకటే !
ఆవాంచిత స్నేహాల వల వేసి ఒడిసి పడుతున్న వ్యాఘ్రాలెన్నో
మాటల తీయదనంలో మోసపోతున్న చంచితలెందరో !
భ్రమపడి పొరబడి జీవితాలని కాల్చుకున్న అభిసారిక లెందరో
చిత్తకార్తె కుక్కల వలే ఆ కక్కుర్తి ఏలనో!?
వీడు ఇంటిలో పురుష పుంగమా?
పరుల ఇంట పర పురుష భుజంగమా !?
కాల సర్పం కాటుకి బలి అయ్యేదెన్నడో?


కొన్ని చోట్ల ... సర్వ నామం


స్నేహంలో ప్రేమ ప్రేమలో స్నేహం
ఏది ఎందులో ఉండక పోయినా ఆశ్చర్యం ఏమీ లేదు
కానీ ప్రేమలో నమ్మకం లేవక పోవడమన్నంత
విచారం ఇంకోటి లేదు, అంతకన్నా అవమానం వేరేకోటి లేదు
అవమానింపబడ్డ ప్రేమలో తడిమి తడిమి తడిని కాంచడమంటే
ఎడారిలో ఒయాసిస్ కై అన్వేషణే !
ఆత్మాభిమాన బలం మెండుగా ఉన్న ఆ చెంత
చీత్కారం తప్ప ఏమి విదల్చని చోట
కపట వేషాలు, మోసాలు ఆ మాత్రం తెలియనివా ?
అతివల అంతరంగాలోచానలపై పై అంత చిన్న చూపు ఏమిటో!
మారండి.. మారండి తల్లులూ
మసిపూసి మారేడుకాయ అని చెప్పేస్తే నమ్మకండి
ముఖ చిత్రాలని నమ్మకండి
మనసు చిత్రాలని ఆవిష్కరించుకోండి




3 కామెంట్‌లు:

Sharma చెప్పారు...

మీ సందేశం సందేహం లేకుండా చాలా చక్కగా వున్నది .

ఇవి " అవే ముఖచిత్రాలు " అంతే కాదు " దుఃఖ పత్రాలు " .

ఆ మగ అన్న పదంలోనే ఈ పగ అనాదిగా వస్తూ అలా అంచెలంచెలుగా దిన దిన ప్రవర్ధమానమౌతూ వున్నది . వాస్తవానికి ఈ లింగ భేదపు ఆనందం యిరువురి మేళవింపు . ఒక్కరి స్వంతం కానే కాదు .
ఎప్పుడైతే యిరువురికీ సంబంధించినదో అప్పుడు అవతల వారి అంగీకారం అవసరమన్న యింగితం తెలుసుకోలేని మగ,పగ మృగాల వైపరీత్యం పేట్రేగిపోతొంది .

మన భారతదేశం సత్సంప్రదాయాల నిలయం అని చెప్పుకొంటున్నామే గాని ఆచరణ శూన్యమైనదై అత్యాచారాల విలయంగా మారి ప్రళయాల్ని సృష్టిస్తున్నది ఈ మగదురహంకారం .

విదేశాల సంప్రదాయం మనకు నచ్చదు . అచ్చటే అత్యాచారాలు జరపాలంటే భయపడ్తున్నారు . ఎందుకంటే అచ్చట అతివల అంగీకారం లేకుండా ఏ మగవాడు సాంగత్యం గాని , సంగమం గాని చేయ సాహసించలేడు .

ఇప్పుడు చెప్పండి , ఎవరివి సత్సంప్రదాయాలు ? భారత దేశానివా ? లేక విదేశాలవా ?
అక్కడ మద్యపానం ఎప్పుడూ చేస్తారు . ఒక్కడు కూడా నేల తూలినవాడిని గాని , గలభా చేసిన వాడిని గాని మనం చూడలేము .
అంతే కాదు ఆడవాళ్ళూ మందు తాగుతారు మగవాళ్ళతో సరి సమానంగా . కాని ఎటువంతి గలభాలు , అరాచకాలు చేయరు .

స్త్రీ జాతికి రక్షణ లేని మన సంప్రదాయాలు గొప్పవా ? రక్షణ కలిగిన విదేశాలవా ?

స్త్రీలు అనగానే ఓ పెద్ద చిన్న చూపు మన దేశంలో . మగవారికి సరి తూగ(లే)రు అన్నది బలంగా నాటేసేశారు . ఇరువురూ సమానము అన్న భావన కాని , వారికీ వ్యక్తిగతం వున్నదని కాని ఆలోచించ(లే)రు మన ఈ సత్సంప్రదాయాలకు ఆలవాలమైన ఈ భారత దేశంలో .

మాటలలోనే యిరువురూ సమానం . ఆచరణ శున్యమైన ఆలాపనలే అవి , పై పై ప్రేలాపనలే .

పల్లా కొండల రావు చెప్పారు...

అవే ముఖ చిత్రాలు - దు:ఖపత్రాలు :((

నవజీవన్ చెప్పారు...

స్నేహంలో ప్రేమ ప్రేమలో స్నేహం ఏది ఎందులో ఉండక పోయినా ఆశ్చర్యం ఏమీ లేదు
కానీ ప్రేమలో నమ్మకం లేవక పోవడమన్నంత
విచారం ఇంకోటి లేదు, అంతకన్నా అవమానం వేరేకోటి లేదు....నిజమే మరి..సత్యం చెప్పారు..