2, అక్టోబర్ 2015, శుక్రవారం

అమ్మ కోసం


అమ్మా ! ఎక్కడున్నావమ్మా !! 


ఒకసారి కనిపించమ్మా ! నాతొ మాట్లాడమ్మా !!


అమ్మలమైనా .. 

ఇంకా అమ్మ ఒడిలో పసి పాపలా అల్లుకోవాలనుకుంటున్నామమ్మా 

ఇక అమ్మా అని  ఎవరిని పిలుస్తారు ? మీ నోటికి తాళం పడిపోతుంది అని భవిష్యత్ ని బహు సుందరంగా చెప్పావు కదమ్మా ! 

నేను చచ్చిపోతున్నానంటే భయంలేదు 

కానీ నా బిడ్డల ముద్దుమురిపాలు బాగా చూసుకోలేదు 

బిడ్డలపై భ్రమత తీరలేదని లోలోప క్రుంగి పోయావు కదమ్మా ! 


అమ్మా ! నీ బాధలు చూడలేక .. ఎప్పుడు చచ్చిపోతావమ్మా  అని కర్కశంగా అడిగాను కదమ్మా ! 

అలా అడిగినందుకేమో అలిగి నీ తలవైపు పడుకున్న మాతో మాట మాత్రం కూడా చెప్పకుండా బిడ్డలకి  నిద్రాభంగం కల్గించ కూడదని నిశ్శబ్దంగా వెళ్ళిపోయావా అమ్మా !


నువ్వు ఇష్టపడి చేయించుకున్న నల్లమద్ది నవ్వారు మంచం మంగళగిరి నులక మంచం మార్చి మార్చి పడుకోబెడతానని చాలా రోజులు ఎదురు చూసాయమ్మా !


మళ్ళీ రామ్మా ! పసి పాపలా అయినా రామ్మా ! నిన్ను మళ్ళీ చేతల్లో పట్టుకుని కళ్ళల్లో పెట్టుకుని భద్రంగా చూసుకుంటాను . 


నిండుగా పూసిన మందార చెట్టుని ఎక్కడ చూసినా గుప్పున నువ్వే గుర్తుకొస్తావమ్మా,గుండె చెరువై పోతుందమ్మా! 

నువ్వు పడమటి చెరువు వైపు మేళతాళాలతో  ఇప్పుడే వెళ్ళినట్లు ఉంటుంది 

నువ్వు లేని ఇంటికి  వెళ్ళ బుద్దే కాదు వేళ్ళ పై  లెక్కపెట్టుకుని కాళ్ళకి సంకెళ్ళు వేసుకుంటాం  ఎవరున్నారక్కడని బాధగా ప్రశ్నించుకుంటాం !


ఏ పూల వనాల్లోనో ఉంటావని నీ నిలువెత్తు చిత్రానికి పూల మాల కూడా వేయకుండా నా తల వైపే పెట్టుకుని పడుకుంటానమ్మా ! నీవిచ్చిన రక్తం, నీ తెలివితేటలు,నీ జ్ఞానం మాలో ప్రవహించి మమ్మల్ని ధీర లగా నిలబెట్టాయని గర్వంగా  చెప్పుకుంటాం . మమ్మల్ని కళ్ళారా చూసుకోవడానికైనా ఒక్కసారి   వచ్చి వెళ్ళమ్మా ! సోదెమ్మ వెళతా ఉంటే పిలవాలని ఉంటుంది .పెదవులపై మాట అలాగే నిలబడి పోతుంది . సోదెమ్మ రూపంలో నువ్వొస్తే కదిలి కదిలి ఏడ్చి దుఖభారం తీర్చుకోవాలని ఉంటుంది .  


నీ  ముద్దుల మనుమడి తో తనివి తీరా ఆడు కోలేదు కదా !  ఇప్పుడు నాకు మనుమడో మనుమరాలో రావడానికి మా మామ గారు నువ్వు పోటీ పడతారనిపిస్తుంది.

అమ్మ లేని మేము అనాధలమయ్యామనిపిస్తుంది. అమ్మా ! ఎక్కడున్నావమ్మా !!


దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు  గాంధీ జీ జయంతి రోజుకి మధ్య అర్ధశతాబ్దానికి ఒక్కటంటే ఒక్క ఏడు పైన  ఈ భూమి పై బాధలని అనుభవించడానికే పుట్టిన నువ్వు వెళ్ళడమే సబబు అనుకుని కాస్త తెరిపిన పడతాము కానీ .. అమ్మమ్మ ని చూడటానికి వెళ్ళినప్పుడల్లా  నువ్వు ఎంత పసిగా రాలిపోయావో అని ఏడుపు ఎగదన్నుకొస్తుంది 


మమ్మల్ని చూసి చిన్నక్క పిల్లలని చుట్టాలందరూ  నిన్నే తల్చుకుంటారు. మన వూరు వెళితే ..  అరుగుల పై  కూర్చున్న వాళ్ళందరూ పలకరిస్తూ వాళ్ళమ్మ రంగు రూపు ఒక్కరికన్నా రాలేదే ! గంజి పెట్టి ఇస్త్రీ చేసిన ఆ చక్కని  చీర కట్టే  గుర్తుకొస్తున్నాయని   చెపుతుంటే  . దిగులుని దాచుకుని నవ్వి వాళ్ళని దాటేసి వెళ్ళడం  గుర్తొస్తుంది . 


అమ్మా ! ఒక్కసారి రామ్మా !!  ఇక్కడ మాకెవరున్నారమ్మా ! కొన్నాళ్ళుగా తల్లడిల్లి పోతున్నామమ్మా! నీ రక్త స్పర్శ ఎవరు కదిలించినా కళ్ళు కడవలవుతున్నాయమ్మా !


నీ కనుకొసటిన రాల లేక ఆగిపోయిన కన్నీటి చుక్క నాలో దుఃఖ సంద్రాన్ని దాచి నిన్ను తలచుకున్నప్పుడల్లా  తీరాన్ని తాకుతుందమ్మా  ! ఇప్పుడే చెల్లి నేను మాట్లాడుకుని నిన్ను తల్చుకున్నాం . 


ఇప్పుడీ వ్రాతలు చూసి గుండె పగిలేలా ఏడుస్తుంది నీ చిన్న కూతురు.  నీకిష్టమైన నీ కొడుకుకి నువ్వు బాగా ప్రేమించే  నీ చిన్న కూతురికి నిన్ను ఈ అక్షరాలలో చూపి  ఏడిపిస్తున్నా నమ్మా ! 


నా చేతి వ్రాతని చూసి ఎంత మురుసుకునే దానివో కదా ! ఇప్పుడు కథలు కవిత్వాలు వ్రాస్తున్నానంటే ఇంకెంత మురుసుకునే దానివో కదా ! అవి చూడడానికైనా ఒక్కసారి రామ్మా ! 


నువ్వు రావని నాకు  ఏడుపొస్తుంది . పిచ్చిదానిలా ఏడుస్తావెందుకు అని మందలించి ఓదారుస్తానికైనా  రామ్మా ! 


(పదిహేడేళ్ళ క్రితం మాకు దూరమైన అమ్మ నిన్నో మొన్నో తప్పి పోయినట్లు ఉంటుంది నాకు . 

అమ్మ కోసం వ్రాసిన ఈ అక్షరాలూ నాకు అపురూపం . అందుకే పంచుతున్నా ! అందరూ అమ్మ చెప్పిన మాట వినండి . అమ్మని ప్రేమించండి ప్లీజ్ !!)




కామెంట్‌లు లేవు: