7, డిసెంబర్ 2016, బుధవారం

ఓ ప్రేమికుడి విషాద పయనం ..

మనసుపొరల్లో ..ఆఖరి మూడు భాగాలు చదివిన తర్వాత ..నా స్పందన ఇలా ...

ఓ ప్రేమికుడి విషాద పయనం ..

గత కొద్దీ రోజులుగా స్క్రీన్ పై చదవడం అంటే విరక్తి కల్గింది. కొందరి రచనలు వైరాగ్యంలో ముంచెత్తిస్తే మరికొందరి బీభత్సమైన కవిత్వాలు చదివి భళ్ళున వాంతి చేసుకున్న భావన కల్గింది. మందెక్కువైతే మజ్జిగ పలుచన అయినట్లు పేస్ బుక్ వేదిక భావాలని పలుచన చేసి పాలరాయిమీద పాలు జారినంత తేలికగా ..ఓహ్ రచనలు చేయడమంటే ఇంత ఈజీ నా అన్నట్టు ఉంది. వీటన్నింటి మధ్యా మంచి రచనలు వెతుక్కునే ఓపికా లేకుండా పోయింది. హఠాత్తుగా మనసు పొరల్లో గురుకొచ్చింది . గత మూడు నెలలుగా కౌముది పై శీతకన్ను.


మొత్తానికి స్థబ్ధతగా ఉన్నాను అయితేనేం నిశ్చలంగా ఉన్నాను. అలాంటప్పుడైనా ఓ నాలుగు పుటల్ని మస్తిష్కంలో ముద్రించుకోవాలనిపిస్తున్నా, కారణమేమి చెప్పకుండా వచ్చి పడిన బద్దకపు శత్రువు ఓ ప్రక్క వద్దని మొత్తుకున్నా, మనసు మొరాయిస్తున్నా ఎలాగోలా కళ్ళప్పగించి అయిష్టంగానే అక్షరాలని హత్తుకునే పనిలో పడ్డాను . నాలుగు పుటలన్నది సాగి సాగి నలభై పుటల దగ్గర విరామ చిహ్నం పెట్టింది.


భువనచంద్ర గారి "మనసు పొరల్లో " ఈ సంవత్సరపు ఆఖరి సంచికలో ఆగింది . ఆగిందన్నమాటే కానీ ముగింపు కాదు అన్నట్లు ఉంది. ఈ ముగింపు నేను ఊహించిందే ! కలిసి ఉండటానికి ఎన్నో కారణాలు. మనుషులు విడిపోవడానికి ఒక్క కారణం చాలు. అంతా విధిలీల అనుకుంటూ దూరం ..దూరం ..దూరంగా జరిగిపోతాం. రాజు దోసిట్లో పడ్డ నమ్రత నక్షత్రం వ్రేళ్ళ సందుల్లోనుండి జారిపోయింది. వెన్నెల కిరణంలాంటి ఉమ నువ్వున్నావనే ఆలోచనే చాలు ఎన్ని అవాంతరాలు అయినా దాటేయగలను అని చెపుతూనే ఉంటుంది . అర అరకి ఒక్కో అనుభవాన్ని అమరికగా సర్దేసి మనసు మరణించి, మౌనం ధరించి, జ్ఞాపకాల చితి చిటపటల మధ్య ఓ ప్రేమికుడి అంతరంగం జీనా యహా మర్నా యహా .. అని విషాద గీతం పాడుకుంటుంది. మనచేత విషాద గీతాన్ని ఆలపింపజేస్తుంది. రచనలకి ఆ శక్తే లేకుంటే .. ఎన్ని పాటలు మన మనసుని తడిమి తడిమి తడిపి మరీ ఎందుకు వెళతాయి ?


అదేమిటో ..ఏ ఒంటరి ప్రేమికుడి /ప్రేమికురాలి బాధని కన్నా నా గుండె కొండంత బండని మోస్తున్నట్లు ఉంటుంది. ఈ రోగం ఇప్పటిది కాదు . ఊహ తెలిసి నప్పటి నుండి కూడా. అవి అక్షరాలే కదా అని అల్పంగా అరచేత్తో ఆవలికి తోసిపడేయలేను. అసలా అక్షరాలూ అంత అందమైన వాక్యాలుగా రూపాంతరం చెందాలంటే మనసు ఎంత స్పందించాలి . భావనలని కుంచె పట్టుకుని చిత్రించినట్లు ఎంత నగ్నంగా చిత్రీకరించాలి !? ప్రతి ప్రేమికుడి/ప్రేమిక మది కడలి తరంగాలై వాస్తవమనే తీరాన్ని తాకి నిశ్శబ్దంగా అనంత జలరాశిలో కలగలిసి పోయినట్లు ఉంటుంది .


ప్రతి కలయిక ఒక వీడ్కోలుకి నాంది అంటారు . వీడ్కోలు మాత్రం ఒక బాధాకర సన్నివేశం. ప్రేమికులకైతే అది మరింత బాధాకరం. మనసులు కలిసే ఉంటాయి. మనుషులే దూరంగా వెదజల్లబడిన విత్తనాలే పోతారు . ఎప్పుడో ఎక్కడో తారసపడుతుంటారు .


మనలో కదలాడిన భావాలని ఇతరుల వాక్యాలలో చూడటం వల్లనేమో అతిగా స్పందిస్తాం . ఆ వ్రాతలని మన వ్రాతలగానే అడాప్ట్ చేసుకుంటామేమో .. అందుకే ఆ సహానుభూతి . మార్గాలు వేరైనా ప్రయాణికుల అనుభవాలు ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి . తీవ్ర ఆశా నిఘాతాన్ని తట్టుకోవడం అంత సులభమేమీ కాదు. ఎవరికీ వారు తనని తానూ తెలుసుకోవడమే జ్ఞానం. అప్పుడే ప్రపంచపు దుఃఖాన్ని తట్టుకునే శక్తి లభిస్తుంది .


దివ్వెలాంటి నీ నవ్వు చాలదా.. నా..లోన చీకట్లని ప్రారద్రోలడానికి ... అని ఆ ప్రేమికుడు భారమైన మనసుతో తన జీవన ప్రయాణం సాగించడం విషాదమైన ముగింపు .


మనసు పొరల్లో రచన ఎంతో మందిని బాగా ఆకట్టుకుంది. ఎంతోమంది వ్యాఖ్యలలో స్పందించారు. ఈ రచన ఆసాంతం చదివాక " ఓ సరైన సమయంలో ఓ సరైన కోణంలో అక్షర కిరణం పరావర్తనం చెంది సుందర రమణీయ భావాల ఇంద్రచాపం వెల్లి విరిసినట్లుంది." అనిపించింది. పడమటి సూరీడు వెనకనుండి తీక్షణంగా వీపు తడుముతుంటే ఆకుపచ్చని నది ఒడ్డున నిలబడి నల్లటి నా నీడని ఆ నీళ్ళల్లో చూసుకుంటున్నట్లు ఉంది . పచ్చని ప్రేమ జ్ఞాపకం ఎలాంటిదంటే .. "పూలు తెంపని జాజి కొమ్మ రాత్రంతా మంచు దుప్పటి క్రింద దాగి పరిమళాన్ని బందించుకుని తనకి తానే ఆస్వాదించినట్లు ఉంటుంది." మనో వికారాలకి తావు లేని ఓ యోగ స్థితిలో ఆ ప్రేమికులు ఒకొరినొకరు అర్ధం చేసుకుని విడిపోవడం మంచిదయింది. అందుకేగా ఈ మనసుపొరల్లో .. అంత సున్నితంగా మన ముందుకువచ్చింది అనిపించింది .


ఈ ధారావాహిక ప్రేమగాధలో ఎన్నో అనుభూతులున్నాయి . మంచి మంచి పాటల పరిచయాలున్నాయి. భువనేశ్వరి,పెద్దమ్మల విశాలమైన ఆలోచనలు, మంచి దృక్ఫదం ఎలా ఉంటుందో మనకి పరిచయమయ్యాయి. వెరసీ ఇది రచన అనాలని నాకనిపించడంలేదు . ఇంతకన్నా ఇంకా ముందుకు వెళ్లి మరికొన్ని విషయాలని తెలుసుకోవాలనే ఆసక్తిలేదు . ఎందుకో ఈ ముగింపు బాధాకరమైనదే అయినా ఇదే బావుంది . భువన చంద్ర గారికి అభినందనలు, ధన్యవాదాలు తప్ప ఇంకేం చెప్పగలను ... ధన్యవాదాలతో 


వనజ ..

కామెంట్‌లు లేవు: