19, ఏప్రిల్ 2017, బుధవారం

రమ్మంటే రాదు

రమ్మంటే రాదు 
ఎంత విదిల్చినా రాని సిరా చుక్కలా  
తనంతట తానే వచ్చి 
పాతదే అయినా మళ్ళీ సరికొత్తగా వొచ్చి 
తిరిగి  పోనట్లు బెట్టు పోతుంది 

రాలుతున్న ఆకుల రాగాన్ని 
కొత్త చివురులందుకున్నంత గ్రాహ్యంగా 
ఆలోచన పోగు అతుక్కోక తగని అవస్థలవుతుంటే 
పడమటి సంజె  వెలుగులో సాగే పొడుగు నీడలా 
పక్కుమంటుంది, సౌందర్య తృష్ణ మరీ రగులుకుంటుంది  

గరిక కొమ్మ మీద నీటి పక్షిలా మనసు ఉయ్యాలూగువేళ  
గాలి తరగలొచ్చి మేనుపై సువాసనలద్ది పోతుండగా  
తటిళ్ళున్న  తగులుకున్న పదాలేవో స్వరాలై  
లేత చిగురుటాకు పెదవులపై  
ఒంపులు తిరిగి  పాటగా పరిమళిస్తుంటాయి    

గతాన్ని వర్తమానాన్ని కవనంలా  
కలగలుపుకుని సాగే ప్రవాహం లాంటి మనిషి  
ఉత్సాహం  జీవ పాత్ర అంచులు దాటి పొర్లిపోతూ ఉండగా 
సాలె గూడులా అల్లుకున్న బంధాలని పుట్టుకున్న తుంచేసి 
జీవితమంటే ఇంతేగా అన్నట్టు తప్పుకుంటాడు .
పరిశుభ్ర ప్రియుడైన ఆ  దేవుడు 

ఇప్పుడు తెలిసిందా !? 
ఈ భువిపై శాశ్వత అసత్యాలు కానీ 
అశాశ్వతమైన సత్యాలుకానీ లేనేలేవు 
కవిత్వంలా ఋతువుల్లా అవీ రంగుమార్చుకుంటాయాని జెప్పి  
వనదేవత కాలికి బలపం కట్టుకుని వెళ్ళిపోయింది  
పువ్వులాంటి పదం పదంలో  మధువుని నింపడానికో 
చీడ పట్టిన  వాక్యపు  తరువులకి శుస్రూష చేయడానికో  అన్నట్లు 
ఇక రమ్మంటే రాదు తానై  తానుగా
వెలిగే దాకా వేచి ఉండాల్సిందే.

19/04/2017.   
  
.  

కామెంట్‌లు లేవు: