21, ఏప్రిల్ 2018, శనివారం

బరువు మేఘం


అమ్మా !
మౌనస్వరాలని  మోస్తున్న నీ కంఠం
విషాద సంగీతాన్ని వెదజల్లుతున్నట్లు వుంది
మనసుకి ఇనుపతెరలు వేసుకోకు
కనీసం ఓ మాట మాటాడి శాపమైనా ఈయరాదా

ఉప్పుమూటలా నువ్వు నన్ను మోస్తున్నప్పుడు
గజారోహణ చేస్తున్నట్లు సంబరపడిపోయిందీ
నాన్న కోపానికో తిరస్కరణకో  గురైనప్పుడు పడిపోయి
లతలా నిన్నల్లుకుని యెదిగిందీ
ఉక్కుకవచంగా నీ మమత ధరించి
ఊహలకి రెక్కలు తొడిగి యెగిరింది నేనే కదా !

ఈ లోకాన స్వచ్చమైనది ఏమైనా వుందంటే అది నీ ప్రేమే
 చీము నెత్తురులో నువ్వు ప్రవహించి నన్నొడ్డున కూర్చోపెట్టావ్
బిడ్డని లాలించడమే మంత్ర దీక్షగా తీసుకున్నావు
నీ దీవెన అందనిదే యే దేవుని పూజ పూర్తీ కాదు
ఏ వరమూ  ఫలించదు

నీకంటిన  ఈ అనాదరణ ధూళిని
నా కన్నీటితో శుభ్రపరచనీ, ధగ్ధమవనీ నా అహాన్నీ
ఆలి మాటలు విని రోసి పారేసిన వైనాన్ని
ఊపిరుండగానే కాటికీడ్చిన ఈ బిడ్డ యొక్క  సిగ్గిల్లిన క్షణాలని
నీ దయామృతంలో    నిలువెల్లా ముంచి  శుభ్రపడనీ తల్లీ ..


అమ్మంటే  అస్తిత్వమని  అశ్రు బిందువులతో యెలుగెత్తి చెపుతున్నా
అమ్మంటే  ఆవలి గట్టుకి వంతెన నని యెద పరచి ఆరేస్తున్నా
అమ్మంటే వో బరువు మేఘమని అది అంతగా తొందరపడి  కురవదనీ
కురిసినా ఎవరినీ  యేమీ తిరిగి ఇమ్మని అడగదని





కామెంట్‌లు లేవు: