27, ఏప్రిల్ 2018, శుక్రవారం

ప్రేమకి బందీ

ఈ విశాల ప్రపంచంలో స్వేచ్ఛగా యెగిరే పక్షినవ్వాలనో, ఓ స్వచ్చమైన  సరస్సులో క్షణం కూడా ఖాళీ లేకుండా అల్లనల్లగా యీదులాడే వో చేపనవ్వాలని, పచ్చని తోటలో రంగుల సీతాకోక చిలకనవ్వాలని అలా పుట్టి వుంటే బాగుండేది కదా అని తలంపులు  యెన్నో యెన్నెన్నో లోలోపల. ఇవన్నీ కాకున్నా  ప్రవరుడిలా  దివ్య లేపనం  పూసుకుని హిమాలయాల్లోనూ , అందమైన కాశ్మీరంలోనూ తిరిగి వచ్చే లేపనం అయినా  పొంది వుండకూడదా అని వగచిన సందర్భాలు యెన్నెన్నో! కాళ్ళకి  చక్రాలు ధరించి రయ్యి రయ్యిమంటూ  భారత దేశమంతా  తిరగాలని  జీవ వైవిధ్యాన్ని రికార్డ్ చేయాలని, వీలైనన్ని సార్లు  హంసల దీవిలో సాగరసంగమం  వద్ద  పొద్దస్తమాను తిష్ఠ వేసుకుని అలల ఘోషని హృదయం పెట్టి వినాలని యిలా చాలా చాలా వున్నాయి.  చెప్పుకుంటే బాగోదని లోలోపల అనుకుంటాను కానీ యిలా చెప్పుకునే సందర్భం వస్తుందనుకోలేదు కానీ వచ్చింది మరి.


మనలో చాలామందికి ఈ నాగరిక జీవనం పట్ల, వొత్తిడితో కూడుకున్న జీవిత పట్ల వో విముఖత. వొక విధమైన నైరాశ్యం కూడా ! ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి,అనురక్తి వున్నవాళ్ళు అంత తొందరగా వైరాగ్య భావనలోకి వెళ్ళలేరు. ప్రకృతి ప్రేమికులు మాత్రమే అదీ వొక passion వున్నవాళ్ళు మాత్రమే ఆధునిక  సౌకర్యాలని, సౌకర్యవంతమైన జీవితాన్ని వొదిలి అలా అరణ్యాల అందాలని ఆస్వాదించాలి, యింకా యేదో కొంగ్రొత్తగా తెలుసుకోవాలనే ఆసక్తితో,జిజ్ఞాసతో  వారు అభిలషించిన మార్గంలో నడిచే సాహసం చేస్తారు. అలాంటి వారిలో ఫేస్ బుక్  ఫ్రెండ్  జయతీ  లోహితాక్షన్ జనబాహుళ్యంలో తక్కువగానూ అరణ్యాలలో (అనకూడదేమో ) అడవి సౌందర్యాన్ని చూస్తూ, అన్వేషిస్తూ అక్కడి అందాలని ఛాయాచిత్రాలుగా బంధించి అందరికీ చూపిస్తూ  అందర్నీ వూరిస్తున్నారు.నిజానికి ఆమె నాకు పరిచయమయ్యాక ఆమెలా జీవించాలని, లేదా ఆమెని అనుసరిస్తూ నడవాలని కోరిక నానాటికి వృద్ధి చెందుతుంది. కానీ అడుగు కూడా ముందుకు వేయలేని ఆసక్తురాలిని. ప్చ్ .. అందుకు ఒక కథ వుంది.


మనం యేవేవో అనుకుంటాం అందుకు యిల్లు మనకి అనుమతి యివ్వదు. ఇల్లు అంటే నా దృష్టిలో నాలుగు గోడలు, పై కప్పు నాలుగు గదులు యిది కాదు నా దృష్టిలో. ఇల్లంటే ప్రేమాభిమానాలు అనుబంధాలు ఆప్యాయతలు కొన్ని విమర్శలు, కొంత ఆధిపత్య భావజాలం, కొంత ఈర్ష్యలు, కొంత నిస్వార్ధ త్యాగాలు, సర్దుబాట్లు యివన్నీ కలగలిసిన మనుషులు. ఇంట్లో వాళ్ళు బయటకి వెళుతుంటే యెన్నో జాగ్రత్తలు చెపుతాము. బయటకి వెళ్ళిన మనిషి తిరిగి గూటికి చేరేదాకా గుమ్మానికి చూపులు వ్రేలాడదీసి వుంచుతాం. మరికొంత ఆత్రుత, లోలోపల యేవో భయాలు తారట్లాడుతుంటే గుమ్మందాటి రహదారి పైకి వచ్చి వీధి మలుపు దాకా దృష్టి సారిస్తాం కదా ! అలా ..



నా కొడుకు నేను యెక్కడికైనా వెళతానని చెపితే అనేక జాగ్రత్తలు చెపుతాడు. ఈ మధ్య ... బంగారం, నేను  ఉత్తర భారత దేశం చూడటానికి వెళతాను, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది  వెళుతున్నారు, అన్ని యేర్పాట్లు బాగా చేసుకుంటున్నారు యిబ్బంది యేమీ వుండదులే అన్నాను కొంచెం అనుమానం గానే ! వెంటనే టపీమనే సమాధానం " వద్దు " అని.  నేను ముఖం చిన్నది చేసుకుని దిగులుగా "యే౦. యెందుకని ? " అన్నాను .


" ఇప్పుడెందుకమ్మా ! అక్కడ వర్షాలు ముందుగా కురుస్తాయి. కొండ చరియలు విరిగిపడటం, రోడ్లు పై వెళ్ళడానికి అడుగగునా అంతరాయం, బోలెడు ఇబ్బందులు. నేను వచ్చినప్పుడు అందరం కలిసి వెళదాం.. ఇప్పటికి వాయిదా వేసుకో " అన్నాడు .


ఓ భారమైన నిట్టూర్పుతో నాకు తెలుసు నువ్వు యిలా అంటావని, అసలు నీకు చెప్పకుండా ప్రయాణం ఖరారు చేసుకుని వెళ్లి వచ్చాక చెప్పాల్సింది అన్నాను. నువ్వేం అలా చేయవని నాకు తెలుసులే ..అని నవ్వు.


ఇక రెండో విషయం .. కార్ డ్రైవింగ్ నేర్చుకుని కూడా వొంటరిగా తీయడానికి అనేక ఆంక్షలు. నేను వచ్చినప్పుడు నువ్వు డ్రైవింగ్ యెంత బాగా చేస్తున్నావో చూసి అప్పుడు ఒకే చేస్తాను. అప్పడి దాకా డ్రైవర్ లేకుండా కార్ తీయోద్దమ్మా ..నువ్వు చాలా స్పీడ్ వెళతావ్, వెళ్లనని ప్రామిస్ చేయి అంటూ నా ఉత్సాహానికి బ్రేక్ వేసేసాడు.



సరే ! అదలా అయిందా .. మళ్ళీ ఇంకో సంగతి.  ఉదయాన్నే చాలా బద్దకంగా వుంటుంది మళ్ళీ వాకింగ్ కి  వెళ్ళాలనిపిస్తుంది . మనకి ఒక కిలోమీటర్ దూరంలో వాకింగ్ ట్రాక్ వేసారు, అక్కడికి బండి మీద వెళ్లి అక్కడ వాకింగ్ చేస్తాను, మనకి తెలిసిన అక్క వాళ్ళు రోజూ నాలుగు కిలోమీటర్ల దూరంనుండి వస్తున్నారు అక్కడికి. ఆ యేరియా చాలా ప్రశాంతంగా వుంది నాకు బాగా నచ్చింది అని చెప్పాను . అందుకూ సమాధానం వద్దు అనే ! నాకైతే భలే  కోపం వచ్చేసింది. ప్రతి చోటుకి వెళ్లొద్దు,వెళ్లొద్దు అంటావ్ ..  అసలు నీ పెత్తనం యేమిటీ  నాపై అన్నాను కోపాన్ని ప్రకటిస్తూ ..


అబ్బాయి మాత్రం తన సహజమైన నెమ్మదైన గొంతుతో .. యిదిగో, యిలాంటి ఆవేశమే వద్దనేది. నేను యెందుకు వద్దంటున్నానో అర్ధం చేసుకోవాలి నువ్వు. మన ప్రక్క రోడ్లు పెద్దవి చేస్తున్నారు కదా !  ట్రాఫిక్ అంతా అస్తవ్యస్తంగా వుంది కదా ! మొన్న నువ్వే చెప్పావు పిన్ని వాళ్ళ వెనకింట్లో వుండే అతను రోడ్డు దాటి మన సందులోకి వస్తుంటే రోడ్డు పని చేసే టిప్పర్ గుద్దేసిందని. పనులు జరుగుతున్న రోడ్డు పై రోజూ బండి వేసుకుని వెళ్ళడం యెందుకమ్మా ... వాకింగ్ వద్దు యేమీ వద్దు. నాకుంది నువ్వొక్కదానివే అమ్మా ! నీకేమన్నా అయితే  నాకెవరు వున్నారు అన్నాడు.


నాకు కళ్ళ నిండా నీళ్ళు. ఈ అవధుల్లేని ప్రేమకి నిలువెల్లా తడిసిపోవడం తప్ప ..నేనింకేం మాట్లాడగలను. అంగుళం కూడా ముందుకి కదలలేను. ఈ అనుబంధాల వానలో తడుస్తుంటే యే విహార యాత్రలకో తీర్ధయాత్రలకో వెళ్ళాలని యెందుకు  అనిపిస్తుంది ?  రెక్కలు ముడుచుకున్న పక్షినై గూటిలోకి జేరి మౌనంగా .. నేను వూహించుకున్న అందమైన లోకాలని గూగుల్   ద్వారా విహంగ వీక్షణం చేస్తూ సంతోషంగా కాలం గడిపేస్తున్నా! నాలో కలిగే  ఆధ్యాత్మిక  భావనలను హృదయానుభూతితోనూ సందర్శనం చేసుకుంటూ   నా భ్రమణ కాంక్షకి తిలోదకాలిచ్చేసి ...  "బంగారం...మీ అమ్మ నీ ప్రేమకి బందీ కానిదెన్నడు, నీ ఆజ్ఞలకి లోబడనిదెన్నడూ " అనుకుంటాను.



యెవరైనా అవధుల్లేని ప్రేమతో తన వారిని శాసించగలరు తప్ప .. వేరొక విధంగా కాదు. తమ వారి పట్ల ప్రేమ, భాద్యత వుంటేనే అలా ఆంక్షలు విధించగలరు కదా !  ఆఖరికి మా అబ్బాయి ఫినిషింగ్ టచ్ యెలా యిచ్చాడు అంటే .. నాకు ఇరవై యేళ్ళప్పుడు  సెకండ్ షో  సినిమాలకి వెళ్లొద్దు, జీరో అవర్స్ లో ఫ్రెండ్స్  చేసుకునే బర్త్ డే పార్టీలకి వెళ్లొద్దు  అంటే నేను నీ మాట వినలేదూ, అలాగే నువ్వు వినాలిప్పుడు " అంటే  లోలోపల మురిసిపోతూ నవ్వుకున్నాను. ఆ సందర్భాన్ని తలుచుకుంటూ యిప్పుడూ నవ్వుకుంటూ ..



ఏ ప్రేమలైనా తల్లి బిడ్డల ప్రేమ బంధం ముందు తీసి కట్టే .. అని నా అభిప్రాయం.అమ్మని నాగురించి నా బిడ్డ చెబితే బాగుంటుందేమో ..కానీ నా వైపు నుండి ఈ ప్రేమ ప్రకటన ..

నా కడుపున పుట్టిన వాడు

నా కన్న తల్లై నన్ను హత్తుకుని నడిపించే వాడు

కాబట్టి ..



1 కామెంట్‌:

శిశిర చెప్పారు...

:-) ముచ్చటగా ఉంది చదవడానికి.