20, మార్చి 2019, బుధవారం

మురికి భాషపై ఒక వాక్యం

స్త్రీల కోసం.. నేను సైతం వొక వాక్యమవుతాను.

కవిత్వంలో స్త్రీలకొక భాష లేకపోవడం, వారు పురుషుల భాషలోనే కవిత్వం చెప్పాలనుకోవడం.. ఒక రకంగా ఫెయిల్డ్ ల్యూర్ అని చేకూరి రామారావు గారు వాఖ్యానించినట్లు గుర్తు.
ఎవరన్నా కాకున్నా నేనిపుడు అదే అంటున్నాను. ప్రత్యక్షంగా పురుషులు వాడినంత తేలికగా స్త్రీలు  అశ్లీలభాషను వాడలేరు. నిత్యజీవనంలో ఎంతో  నలిగిపోతేనో తప్ప వారికి అశ్లీలభాషను వాడేంత రాటుదేలరు.
నిజానికి ఈ అశ్లీలభాష వాడటం అనేది పురుషులకు వారికి లభించిందనుకున్న స్వేచ్ఛకావచ్చు, ఆధిపత్యభావజాలం కావచ్చు, వాచాలత కావచ్చు, మానసిక జాఢ్యం కావచ్చు.. లేదా అసహనాన్ని వ్యక్తీకరించే తీరు కావచ్చు.
స్త్రీలను వారి లైంగిక అవయవాలను సంభోగ క్రియ పుట్టుకకు మూలమైన అవయవాలని టార్గెట్ చేసుకుని వారి వాచాలతను చాపల్యాన్ని చాటుకున్న ఆనాటి సాహితీ స్రష్ట్రల నుండి ఈ నాటి వీథి బాలల వరకూ చేస్తున్నదదే! ఇక ఫేస్ బుక్ గోడలపై యథాలాపంగా చూసినా కనిపించేవి ఈ అశ్లీలభాషే.
అందుకు విరుగుడుగా స్త్రీల నుండి కవిత్వమో వ్యాసమో నిరసనో యేదో వొకటి రాగానే పురుషుల భద్రలోకం వులికిపడుతుంది. నాలుకల ఆయుధాలను బయటకుదీయటం మొదలవుతుంది.

ద్వేష వ్యక్తీకరణను కాదు ద్వేషానికి కారణమైన మూలాలను చూడండి అని నేను ఈ విషయంలో చెప్పలేను క్షమించండి. ఏ పురుషుడైనా యింకొక పురుషుడిని తిట్టాల్సివస్తే  అశ్లీల భాషలోవారి స్త్రీలను దూషించడం పరిపాటి అయిపోయింది.స్త్రీలు కూడా మరొక పురుషుడిని తిట్టడానికి ఆ వ్యక్తి తాలూకూ స్త్రీలను తమ అశ్లీలభాషలోకి లాగి తమ కుతి తీర్చుకోవడం అనేదాన్ని నేను కూడా తీవ్రంగా నిరసిస్తాను.
మగవాడు అంటే నువ్వంటావా అని సన్నాయినొక్కులు నొక్కొద్దు. ఒకటి అంటే నాలుగువినడానికే సిద్దపడి అనగల్గాలి మరి.అందుకే అమ్మలను అక్కచెల్లెళ్ళను ఆలిని పిల్లలనూ మీ మీ ఆనవాలమైన భాషల్లోకి లాక్కండి.
మీ పురుషభాషలను కనిపెట్టి ఆ భాషలో తిట్టుకుని మీ వాచాలతను చాటుకోండి.

ఒకటి చెబుతున్నాను.. స్త్రీలు మగవాడి వ్యక్తిగత ఆస్తులు కాదు..  ఈ మాటనగానే మీ పుచ్చిపోయిన మెదళ్ళు యేం ఆలోచిస్తాయో నాకు తెలుసు. స్త్రీలు ఎవరి ఆస్తులు కాదు. ప్రతి స్త్రీ తనకు తానే వొక సైనికురాలు. మీ మదం అణచడానికి... మీరు వుపయోగించే భాషలోనే తిట్టాల్సిన అవసరం లేదని తెలుసుకునే క్రమంలో వున్నారు.
ఫేస్ బుక్ గోడలపై యెందుకు..? ఇళ్ళకు వెళ్ళి  మీ అమ్మను చెల్లిని భార్యని ఇంకెవడో యేదో అన్నాడని గర్వంగా చెప్పుకోండి. అపుడు మగవాడిగా మీకు పదవోన్నతి లభించినట్లు. చెప్పలేకపోతే మీ తలను భూమిలో పాతేసుకోండి. స్త్రీలను అణచేకొద్ది తిరగబడతారు... అది భావవ్యక్తీకరణలో కూడా.. దైర్యాన్ని ఆయుధంగా చేసుకుని మరీ...అని మర్చిపోవద్దు. తర్వాత అసలు ఆడదేనా అది ఆశ్చర్యపోవద్దు కూడా.
ఇక అన్ ఫ్రెండ్ చేయడం వ్యతిరేకించడం  అనేది కూడా నిరసన తెలపడానికి వొక మార్గమే తప్ప భావజాలాన్ని నిరసించడమే తప్ప ద్వేషించడం కాదు. ఇలా వొకరినొకరు ద్వేషించుకుంటే భావజాలం మారిపోతుందా... ?  శతాబ్దాల భావజాలాన్ని ఇంత త్వరగా వొడపోసి పారేయడం అంత తేలిక కాదు. సంస్కారం మర్చిపోయి హద్దులు దాటినపుడు మందలింపు తప్పుకాదు..అమ్మలు పిల్లలను మందలించినట్లు మందలించాలి అని నేనూ  అనుకుంటూ...
పశు పక్ష్యాదులుకి  మన మురికి  భాష అర్ధం కాకపొతే మరీ బావుంటుంది అని ఆలోచన చేస్తూ ..

14, మార్చి 2019, గురువారం

నా యెంపిక

రాష్ట్రం కోసం ..
నా యెంపిక చంద్రబాబునాయుడు
మరి మీ యెంపిక!?
నేనొక రచయితను.2016 డిసెంబరు నెలలో “దాహం” అనే కథ వ్రాసాను. 2017 జనవరి 22న ఆదివారం ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో ఆ కథ ప్రచురితం.రాజధాని భూముల సేకరణపై. కొన్ని ప్రశ్నలు సందేహాలు వెలిబుచ్చాను. జరిగేదంతా అభివృద్దేనా అని అనుమానాలు వెలిబుచ్చాను. ఈ ధనదాహం భూదాహం తీరేదేనా అని ఆవేదన వెలిబుచ్చతూ ఓ రైతు వ్యథకు అక్షర రూపం యిచ్చాను. నా ప్రశ్నల దాహానికి దప్పిక తీర్చే వారెవరు? అని ముగింపు యిచ్చాను. ఇంకో రెండేళ్ళకు నాకు చాలా సమాధానాలు లభించాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పట్టిసీమ నుండి నీరు, పోలవరంప్రాజెక్ట్ నిర్మాణం సాగిస్తూ..రైతులకు రుణ మాఫీ, పేదలకు ఇళ్ళు, వృద్ధులకు పెన్షన్లు, పేదవారికి ఆరోగ్య సహాయం, డ్వాక్రా మహిళలకు సహాయం, చంద్రన్న భీమా.. ఇలాంటి పధకాలతో ప్రభుత్వం మంచి పరిపాలననే అందించిందని చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితులలోచంద్రబాబునాయుడు గారి దార్శనికత ముందుచూపు అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం. పక్క రాష్ట్రం పన్నాగాలు పనిచేయకుండా స్వతంత్రంగా అభివృద్ధి చెందే క్రమంలో అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి అవసరం. చంద్రబాబు నాయుడు గారు వున్నవారిలో బెస్ట్. ఓ బాటలో పడుతున్న రాష్ట్ర బండిని గతుకుల బాటలోకి మళ్ళకుండా అదే బాటలో నడవడం నడిపించే నాయకుడుపై నమ్మకం వుంచి ఇంకో ఐదేళ్ళు సహకరిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాట వేసుకున్న వాళ్ళం అవుతాం. రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ది సాధ్యం అవుతుందని.. ఆ విధంగా ఆ ప్రాంత నాయకులను ప్రశ్నించి సాధించుకోవడమే లక్ష్యంగా నడవాలని గొప్ప ఆకాంక్షతో ముందుకు నడవాలని ఒక పౌరురాలిగా నాఆకాంక్ష.
రాజధాని నిర్మాణం ఎక్కడ జరిగినా ఎవరు ముఖ్యమంత్రి అయినా.. జరిగేది రియల్ ఎస్టేట్ వ్యాపారమే. అంతకు క్రితం జరిగిన విమానాశ్రయ నిర్మాణం కోసం జరిగిన సేకరణలు, 101 ఆర్ధిక మండళ్ళు కోసం జరిగిన సేకరణలలో పేదవాడి భూములు లేవా..? విదేశీ సంస్ధలకు అభివృద్ధి పేరిట దారాదత్తం చేయలేదా..! రాజధాని నిర్మాణంలో రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చి అండగా నిలిచారు. పరిశ్రమలకు పోర్ట్ లకు భూములివ్వడానికి రైతులు మళ్ళీ సిద్ధంగా వున్నారు. అభివృద్ధి అంటే ప్రాంత అభివృధ్ది ద్వారా వ్యక్తిగత అభివృద్ది కూడా. వ్యవసాయం పరిశ్రమలు ఉపాధి అవకాశాలు ఇవ్వన్నీ అనుభజ్ఞుడైన నాయకుడి ద్వారానే లభిస్తాయి. అంత ఛరిష్మా వున్న నాయకుడు చంద్రబాబునాయుడు. ఇంకోసారి నమ్మితే నష్టపోము. నమ్మకం వుంచుదాం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడిపై మరో ఐదేళ్ళు నమ్మకం వుంచి యెన్నుకుందాం. మన బిడ్డల భవిష్యత్ కోసం, ప్రాజెక్ట్ ల కోసం అమరావతి కోసం, పోర్ట్ కోసం, పేదవాళ్ళ సంక్షేమం కోసం. జై ఆంధ్రప్రదేశ్!!

11, మార్చి 2019, సోమవారం

అభ్యుదయ భావాలు

అభ్యుదయంగా ఆలోచించడం కొందరికే పరిమితమా యేమిటి? ప్రపంచంలో అభ్యుదయంగా ఆలోచించేవారే మనుషులా? ప్రశ్నించడం చేతకాని అసహాయులలోనూ వ్యాపారం చేసి కోట్లు సంపాదించిన వ్యాపారులలోనూ.. అభ్యుదయ భావాలుంటాయి. మేథావితనం ప్రదర్శిస్తూ మేమే అభ్యుదయ భావాలు కలవాళ్ళం అని అనుకుంటే వీళ్ళ అహాలని తృప్తి పరచడానికి తతిమావాళ్ళందరూ వీళ్ళు అన్నదానికంతటికీ గొర్రెల్లా తలవూపాల్సిన అవసరంలేదు. ఎవరి సొంత అభిప్రాయం వారికి వుంటుంది. ఎవరి భావప్రకటనా స్వేచ్ఛ వారికి వుంటుంది. ఎవరి రాజకీయచైతన్యం వారికి ఉంటుంది. 


నేనసలు కమ్యూనిస్ట్ ని కాదు. నా ఆలోచనలలో ఆ ఛాయలు గోచరిస్తే మాములు మనిషిగా నాకు కల్గిన భావాలే తప్ప సమాజంలో సంచరించడం వల్ల నాకు కల్గిన అనుభవాల వల్ల స్పందించడం తప్ప నేను ఏ ప్రత్యేక సాహిత్యం చదువుకోలేదు. శిక్షణా తరగతులకు హాజరై నేర్చుకున్నది కాదు. నా దృష్టికోణంతో నా పరిశీలనతో, నా దృక్ఫదాన్ని వ్యక్తీకరించడమే నా రాతలు. 


ముఖ్యంగా చెప్పేదేమిటంటే నేను కమ్యూనిస్ట్ ని కాను. మతతత్వ పార్టీలకు వత్తాసు పలికింది లేదు. కులమత ద్వేషాలు నాకు లేవు. అభిప్రాయ భేధాలు తప్ప నాకు కులమత ద్వేషాలు లేవు. అరసం విరసం ప్రరవే పివో డబ్ల్యూ రచయితల సంఘాలు గ్రూప్ లు ఎందులోనూ నేను ఇమడను. నా కథలు ఏ పత్రికలలో అయినా రావచ్చు ప్రచురణకు అర్హత కల్గి ఉంటె. నేను కమ్యూనిస్ట్ ను అని . ఆమె రాతలు అలా ఉంటాయి కానీ వాళ్ళ అబ్బాయి విదేశాల్లో ఉంటాడు అనే వ్యాఖ్యలు వద్దు.మీ మీ భావజాలాలకి చీదర పుట్టి అందుకే నేను ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. :( :(

ఇంకొక విషయం ఏమిటంటే కమ్యూనిజం గురించి వ్యతిరేకత తెల్పడం వారిని విమర్శించడం కూడా నా అభిమతం కాదు. వారంటే కూడా నాకెలాంటి ప్రత్యేక అభిమానం కానీ ద్వేషం కానీ వ్యతిరేకత కానీ లేవు. మనిషి తనం నేను నా చిరునామా అంతే!