23, అక్టోబర్ 2019, బుధవారం

హృదయానికి లంకె ..

కొన్ని యుగళగీతాలు చూస్తుంటే ... నిత్య యవ్వన మనస్కులై ఉన్నట్టు ఉంటుంది. గతకాలంలోకి మనసెళ్ళి కూర్చుంటుంది. ఈ పాటను చూస్తుంటే కూడా అంతే ! 
"చరిత్రహీన్ " చిత్రంలో ఈ పాట  చిత్రీకరణ, సాహిత్యం సంగీతం అన్నీ బాగుంటాయి.. అందుకే .. యీ స్వేచ్చానువాదం .

పల్లవి:  మనసు మనసుతో కలవడానికి  ఏదో ఒక  కారణం ఉండాలి
 కారణం లేకుండా ఏమీ జరగదు, కాబట్టి దానికి ఒక కారణం ఉండాలి

1: మనమింకా  ఒకరికొకరు అపరిచితులమే 
  కానీ ఎవరైనా మన వైపు చూస్తే, మనము  ఒకరినొకరు సంవత్సరాల తరబడి   తెలుసునని  అనుకోవచ్చు
 హో హో హో
మన  ఇద్దరి మధ్య ఉమ్మడిగా ఏదో  వుంది ఉండాలి
లేకపోతే మనమిద్దరూ ఈ ప్రదేశంలో మరియు  ఇలాంటి వాతావరణంలో ఎందుకు ఉంటాము 

2: నువ్వు నేను  ఒకరినొకరు ప్రేమిస్తున్నామనడంలో సందేహం లేదు
 కేవలం రెండుసార్లు కలిసామో లేదో  తర్వాత మాకు  నిద్రకరువైపోయింది 
హో హో హో
 మనం  ఒకరినొకరు లేకుండా రోజులు ఎలా గడపబోతున్నాం
 ఒంటరిగా ఒక రాత్రి కూడా గడపడాన్ని  ఇప్పుడు  ఊహించలేము
మనసు మనసుతో కలవడానికి  ఏదో ఒక  కారణం ఉండాలి
 కారణం లేకుండా ఏమీ జరగదు, కాబట్టి దానికి ఒక కారణం ఉండాలి

3: తెలుసా యెక్కడి నుండి వచ్చావో నీవు, నేను  యెక్కడ నుండి వచ్చామో తెలుసు 
ఒకరి నేపధ్యం ఒకరికి తెలియదు  హృదయాల  చిరునామా మాత్రం తెలుసు 
యెలా కలిసామో పిచ్చోళ్ళు లాగా
బహుశా .. మన యిద్దరిదీ వొకే గమ్యం అయివుంటుంది. 
లేదంటే మన కలయిక జరిగేది కాదు  

మనసు మనసుతో కలవడానికి  ఏదో ఒక  కారణం ఉండాలి
కారణం లేకుండా ఏమీ జరగదు, కాబట్టి దానికి ఒక కారణం ఉండాలి

दिल से दिल मिलने का कोई कारण होगा बिना कारण कोई बात नहीं होती वैसे तो हम दोनों एक दूजे से हैं अभी अनजाने कोई अगर देखे तो कहे, बरसों के हैं मीत पुराने कुछ है तुम में हम में, वर्ना इस मौसम में फूलों की ऐसी बारात नहीं होती हो ना हो हम तुम में प्यार है, शक इस में नही है कोई दो ही मुलाकातों में निगोड़े नैनों ने निंदिया खोयी ऐसे दिन बीतेंगे, कैसे दिन बीतेंगे अब तो बसर एक रात नही होती जाने कहा से आये हो तुम, हम आये कहा से जाने तुम को खबर ना हम को पता दिल कैसे मिले दीवाने शायद हम दोनों का एक ही रस्ता होगा वर्ना हमारी मुलाकात नहीं होती  


 వీడియో ఇక్కడ చూడండి ... 



పైన లింక్ లో యూ ట్యూబ్ లో కూడా చూడవచ్చు .. 

16, అక్టోబర్ 2019, బుధవారం

పేరులోనే వున్నది..

చిగురించిన శిశిరం కథ ప్రచురణకు రాకమునుపు ఆ.. కథకు నేను పెట్టిన పేరు .. రాతి హృదయం. అసలు ఈ కథ “చేరేదెటకో తెలిసి” అనే కథకు సీక్వెల్ గా రాసిన కథ. కొద్ది గంటల్లో విరామం తీసుకోకుండా వ్రాసిన కథ. ఆదివారం సంచికలో ప్రచురణకు అనుకూలంగా దాదాపు 1500 పదాలకు కాస్త అటునిటుగా కుదింపబడిన కథ. ఈ కథకు రాతిహృదయం అనే టైటిల్ కన్నా “చిగురించిన శిశిరం” అని పెడితే బావుంటుంది అని సూచిస్తే సరేనన్నాను. ఎందుకంటే మంచి మంచి కథలు వ్రాసి నిత్యం యెన్నో కథలు చదివి పాఠకుల నాడిని గ్రహించగల్గిన వారి అనుభవం కదా..! ఇతివృత్తానికి తగినట్టు అని వారి అంచనా నిజమవుతుంది


ఇక యీ  కథ ప్రచురితమయ్యాక వచ్చిన స్పందన చూసి ఉబ్బితబ్బిబ్బైపోయాను. ఇన్నాళ్ల తర్వాత యీ  వారంలో కూడా నిర్మల్ నుండి ఒక హెడ్మాష్టర్ గారు ఫోన్ చేసి అభినందించి నేను మర్చిపోలేని కథ అందించారమ్మా.. మీరు నాకన్నా చిన్నవారు. కానీ మీ పాదాలకు నమస్కరించాలని వుందమ్మా అన్నారు. ఒకోసారి ప్రశంసలు కూడా యిబ్బంది పెడతాయి. కథలు వచ్చినప్పుడల్లా మెసేజ్ పెట్టండి అని అభ్యర్దన. నెంబరు సేవ్ చేసుకున్నాను. ఫోన్ తీయగానే యదాలాపంగా మాట్లాడుతూ పేరు సరిగా వినం కదా... మీ పేరు సర్.. అని అడగలేకపోయాను. 😞 ఈ సారి కనుక్కోవాలి.
ఇకపోతే ఈ కథ వచ్చాక ఇదే పేరుతో రెండు కథలు వచ్చాయి. అదేమిటో కథలకు పేరు పెట్టుకునే టపుడు  తనిఖీ చేసుకోరా..! నేను కథకు పేరు పెట్టేటపుడు అంతకుముందు యెవరైనా ఆ పేరు పెట్టారో లేదో చూసుకుని మరీ పెడతాను. కాస్త పొయటిక్ గా వుండేటట్లు జాగ్రత్త పడతాను. పేరులో పెన్నిధి వుందంటారే అలాగన్నమాట. కథకైనా కవితకైనా వ్యాసానికైనా శీర్షిక, ఎత్తుగడ, ముగింపు ప్రాణం. అవి బాగుండకపోతే అంతగా పాఠకులను ఆకట్టుకోవని నా అనుభవం కూడా! 
నా కథల టైటిల్స్ కు అభిమానులున్నారు.  ప్రముఖ రచయిత్రి చంద్రలత ... ఫోన్ చేసి కథల గురించి మాట్లాడుతూ టైటిల్స్ గురించి ప్రత్యేకించి అభినందించారు. ఈ మధ్య "పూలమ్మి " టైటిల్ కూడా మరొక చోట కనబడింది. ఇతివృత్తాన్ని బట్టి శీర్షిక పెట్టడంలో సగం విజయం లభించినట్లే అనుకుంటాను. ఆ జాగ్రత్తలు తీసుకుంటూ వుంటాను. ముందు టైటిల్స్ అనుకుని వ్రాసిన కథలు వున్నాయి. అట్లాంటా  వున్న శారద గారు, తిరుపతి లో వున్నా విజయ కుమార్ గారు నా కథల టైటిల్స్ కు పెద్ద అభిమానులు.
ఈ మధ్య వ్రాసిన "నీట చిత్తరువు " టైటిల్ అర్ధం కాని  ఎడిటర్ కూడా వున్నారు . నీటి చిత్తరువు అంటే వాటర్ కలర్స్ తో వేసిన చిత్రమా అని అడిగారు కూడా ! నా తలకాయ అనుకుని నీటి చిత్తరువు కాదండీ .."నీట చిత్తరువు " అంటే నీటిలో కనిపించే చిత్రం అని వివరించాల్సి వచ్చింది. సరే .. ఎలాగూ వాళ్ళు ఆ కథ ప్రచురణకు అంగీకరించలేదనుకోండి. 
ఇప్పటికి తొంబై అయిదు కథలు వెలువడ్డాయి. ఇరవై ఆరేళ్ళ క్రితం రాసుకున్న "జాతర" కథ తర్వాత "వేకువ పువ్వు " అనే కథ వ్రాసాను. ఆ వ్రాసుకున్న ప్రతి కనిపించలేదు కానీ ..కథ గుర్తుంది . మళ్ళీ వ్రాస్తున్నాను. పంతొమ్మిదేళ్ళ క్రితం వ్రాసిన కథానిక "బంగారు " ..ఇలా తొంబై అయిదు  కథలు ఈబ్లాగులో ..మీరు బ్లాగ్ తెరిచిన తర్వాత కిందికి చూస్తూ  కుడివైపున ..ఒకచూపు వేస్తే ... నా కథలు శీర్షికలో అన్ని కథల లంకె లు వున్నాయి. హాయిగా చదువుకోవడానికి నేను శ్రద్ధ తీసుకుని అలా లంకెలు యిచ్చాను. పత్రికలలో వచ్చిన కథలన్నింటిని రెండుమూడు రోజులుగా పిడిఎఫ్ ఫైల్ లోకి మార్చి వుంచాను. ఆ లింక్స్ కూడా ఇవ్వగలను. 
ఇంకా మెదడులో సంక్లిప్తమైన బ్లూ ప్రింట్ లో వున్న అనేకానేక కథలు వున్నాయి . ఓ అయిదు కథలున్నాయి కానీ నాలుగు నెలలుదాకా వాటిని పంచుకునే ఉద్దేశ్యం లేదు . పత్రికలకు పంపే ఆలోచన లేదు . బ్లాగ్ లో రాసిన టపాలలో చాలా అచ్చుతప్పులున్నాయి. వాటన్నింటిని సరిచేసుకోవాలి ముందు. అప్పుడు హడావిడిగా వ్రాసేసాను. కొంత తెలియక తప్పులు వ్రాసేసాను. అజ్ఞానం అలా వర్ధిల్లింది. ఏమైనా ... సహృదయంతో చదివిన మిత్రులందరికీ నమస్సులు. ధన్యవాదాలు.  
నా కథా ప్రయాణం గురించి ఎవరూ నన్ను అడగలేదు. పత్రికలలో పరిచయానికి నాకంత ఉత్సాహం లేదు అనేదానికన్నా ..అసలు అడిగినవారు లేరు. నా కథా ప్రయాణం గురించి నేను చెప్పుకోవడమే తప్ప. నాకు పత్రికలలో పనిచేసేవారిలో స్నేహితులు లేరు. అలాగే నాకొక కోటరీ (గుంపు ) లేదు. నేను వారిని పొగుడుతూ ఉంటే బదులుగా వారొచ్చి నను పొగుడుతూ వుంటారన్నమాట. అందుకు నేనెప్పుడూ దూరం కాబట్టి ... ఎంత ప్రశాంతంగా జరిగిపోతున్నాయో రోజులు.  :) 
మళ్ళీ చెపుతున్నాను ..పేరులోనే పెన్నిధి వుంది ..అనుకోవాలి అనుకుంటుంటే .. పేరులో ఏముంది అన్నారు ఒకరు. ఇదంతా కూడా చెప్పాలిప్పుడు.  :) 
పేరు ఉచ్చరించినప్పుడు వెలువడే వైబ్రేషన్స్ పాజిటివ్ గానూ నెగిటివ్ గానూ కూడా వుంటాయట. శబ్దం కూడా లయాత్మకంగా అర్ధవంతంగా వుండటం వల్ల  వీనులవిందుగా వుంటుంది కదా ! 
నా పేరు పెట్టేటప్పుడు కూడా ..మా అమ్మ చాలా శ్రద్దగా నా పేరు పెట్టారంట. నా  పేరులో వున్న మూడక్షరాలు. హల్లులే కదా ! హల్లులు పలకాలంటే అచ్చులు సహాయం లేకుండా పలకడమే కుదరదు కదా ! నా వరకు నా పేరంటే చాలా యిష్టం కూడా ! 
వనమున జనియించినది , నీటిలో జనియించినది ... నీలి కమలం   



14, అక్టోబర్ 2019, సోమవారం

తండ్రి ప్రణవమై.. తల్లి భ్రమరమై.. శ్రీ గిరి శిఖరాన.



శ్రీశైలం అనగానే క్షణంలో మనసు అక్కడ వాలిపోతుంది. ఇంటి దగ్గరనుండి బయలుదేరినప్పుడు నుండి మాత్రమేనా .. కాదు ప్రయాణానికి నాంది పలికినప్పుడే ..మనసెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి స్వామి దీవెన తీసుకున్న భావన కల్గుతుంది. అది నాకు నూతన శక్తిని ప్రశాంతతను మొక్కవోని ధైర్యాన్ని యిస్తుంది.

ఇక శరీరమెళ్ళి శ్రీ గిరి పర్వతంపై శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన గోపురం ముందు నిలబడుతుంది.ధూళి దర్శనం కోసం పరుగు పరుగున క్యూ లైన్ లో నిలబడుతుంది.

ఆ గోపురం  క్రింద నుండి లోనికి అత్యంత ఇష్టంగా  ప్రవేశించి ధ్వజస్తంభాన్ని భక్తితో తాకి నందీశ్వరుడి ప్రక్కగా వెళుతూ "నందీశ్వరాయ నమస్తుభ్యం, సాంబానంద ప్రదాయక ,మాహాదేవస్య   సేవార్ధం  అనుజ్ఞాoదాతు మర్హనీ" అని భక్తిగా నమస్కరించుకుని ఆయనను దాటేదాకా  ఆ సుందర మూర్తిని చెక్కిన శిల్పుల చేతిలో ఉలి విన్యాసాలను ప్రశంశించుకుంటూ భక్తిభావం అంకిత భావం లేకపోతే రాతికి ఆ సౌందర్యత్వాన్ని వీరత్వాన్ని ప్రాణత్వాన్ని తేగలరా అనుకుంటూ వీరమండపంలోకి ప్రవేశిస్తాను.  వీరమండపాన్ని చూస్తూ ఇదిగో యిక్కడే కదా భక్తితో కాళ్ళు చేతులను తెగనరుక్కుని స్వామికి సమర్పించుకుంది అలాగే ఇంకొందరు  ఆఖరికి ప్రాణాలను కూడా వీరభక్తితో స్వామికి సమర్పించుకుంది అని తలపోస్తాను. వొళ్ళు జలదరిస్తుంది కూడా.

ముందు తల్లిని దర్శించుకోవాలంట అని పెద్దవాళ్ళు చెప్పిన మాటను గుర్తుకు తెచ్చుకోనట్టే నటిస్తూ తండ్రిని చూసుకోవాలని ఉవ్విళ్ళూరుతాను .  పసి బిడ్డపై తండ్రి కురిపించే  ప్రేమను అనురాగాన్ని తలపించే ఆయన స్పర్శను చెప్పలేని శాంతిని నెమ్మదిని కల్గిస్తుంది. ఆ స్పర్శను  ఆ దీవెనను పొందేదాకా  మనసు పడే ఆరాటం  ఆ ఉద్విగ్నత యిక్కడ అక్షరాలలో చెప్పలేను. ఆ స్పర్శను  అణువణువునా అనుభవించి   గాఢ అనుభూతిని చెంది మైమరుపుతో ఆనందాశ్రువులతో వెనుదిరిగి చూస్తూ మసక మసక గా కనిపిస్తున్న ఆ రూపానికి నమస్కరించుకుంటూ మరల ఎప్పుడు ఈ భాగ్యం కల్గిస్తావు తండ్రీ అనుకుంటూ బయటకు వచ్చేస్తాను. తర్వాత స్వామి వెనక్కి వచ్చి  ధ్వజ స్థంభంకి సమీపంగా కుడిపక్కగా కాసేపు కూర్చుంటాను. బడి లోపలకి  వదిలేసి వెళ్లిన తండ్రిని తలుచుకుని పిల్ల బెంగపడినట్లు బెంగపడుతూ ... కాసేపు గోపుర కలశంపై  ఆ పై  ఎగిరే  తూనీగలను పావురాలను చూస్తూ మనసుకు శాంతి పొందుతాను.


ఆ తర్వాత అమ్మ దర్శనం కోసం కొంచెం పైకి వెళ్ళాలి కదా! పైకి ప్రాకుకుంటూ వెళ్ళిన పసిపిల్లలా నిదానంగా అక్కడికి వెళతామా ... ఎంత చల్లని తల్లి. హడావిడి ఏమీ లేకుండా .. తన చల్లని చూపులతో తడిమి.. రా ..రమ్మంటూ పిలిచి  ఆపైన అక్కునజేర్చుకుంటుంది అక్కుపక్షిలాంటి యీ మానవ దేహాన్ని.  ఆ పరిష్వంగానికీ  సంతసించి .. పులకించి .. అమ్మ పాదాలకు కదా ముందు నమస్కరించుకోవాల్సించింది. అదేమిటి అమ్మను ఇలా హత్తుకున్నాను అని స్ఫురణకు  తెచ్చుకుని "అమ్మా మన్నించు... నీ పాద ధూళిని శిరస్సున ధరిస్తున్నాను తల్లీ, నీ అనంతమైన కరుణ నీడు మిక్కిలి ప్రేమతో  నన్ను నా  బిడ్డలను  నా చుట్టూ వున్న సర్వ ప్రపంచాన్ని చల్లగా కాస్తున్నఅమ్మవు అమ్మలును గన్న అమ్మవు  కదమ్మా"  అనుకుంటూ అక్కడి నుండి చిన్నగా కదులుతూ ..బయటకు వచ్చి నీకు ఎడమ పక్క ఉన్న దేవ గన్నేరు చెట్టును చూడటం అక్కడ కూర్చోవడం కాసిని పూలు యేరుకుని ఆ పూల సౌందర్యాన్ని చూస్తూ పరిమళాన్ని ఆఘ్రాణించాలని మోహపడి మళ్ళీ వెంటనే ... నీ పూజకు పూసిన పూలు కదా యివి అనుకుంటూ గుండెలకు హత్తుకుంటాను. ఈ క్షణాన నా హృదయపుష్పమే నీకు సమర్పించితిని తల్లి అనుకుంటాను.

తర్వాత యెవరూ అభ్యంతర పెట్టకపొతే నీ వెనుకకు వెళ్ళి  గుడి ప్రాకారానికి మధ్యలో  నువ్వు మా అందరిని కరుణించడానికి ఆసీనమైన వెనుక భాగాన రాతి కట్టడాన్ని చీల్చుకుని వచ్చే భ్రమర నాదాన్ని వొంటి చెవి ఆనించి వినడానికి ఉత్సుకత చూపుతాను. నీ దర్శనమైతే తేలికగా యిస్తావుగాని తల్లీ ..నిన్ను అసాంతంగా చేరుకోవడం అంత సులభమా తల్లీ .. ఎన్ని వ్యామోహాలను విడనాడాలి. ఎంత  ఏకాగ్రత కల్గిన చిత్తం ఉండాలి మరి . అంత దుర్లభమైన దారిలో  నేనున్నాను కాబట్టి తేలిగ్గా కరుణించే నాయనను వేడుకోవడం నా అతితెలివి కాదనుకుంటాను. అమ్మంటే క్రమశిక్షణ కదా అనుకుంటాను. ఎంత చల్లని తల్లివైనా క్రమశిక్షణ క్రమశిక్షణే అంటున్నట్టు ఉంటావు కదా నీవు. నీ సామీప్యాన్ని వొదిలి బయటకు వస్తానా,  తమ  ఝుంకారాలనూ వినిపిస్తూ అక్కడే సంచారం చేస్తున్న అనేకానేక భ్రమరములు... వాటితో పాటు నేను సంచరిస్తూ .. మళ్ళీ సాయంత్రానికి నీ దర్శనం కోసం  ఆలోచన చేస్తూ ముందుకు కదులుతాను. మళ్ళీ రేపటి దర్శనం కోసం అనుమతులకై వెతుకులాడతాను.

నా ప్రతి దర్శనానుభవమూ ..నాకొక ఉత్తుంగ తరంగమే!  నా తండ్రి  ప్రణవమై  నాతల్లి భ్రమరమై ... శ్రీ గిరి శిఖరమున ఆసీనులై వుండి తమ కరుణామృత దృక్కులను పంచభూతాలలో ఎనిమిది దిక్కులలో ప్రసరిస్తున్న క్షేత్రం ... నాకత్యంత యిష్టమైన నెలవు. మానసిక దర్శనం చేసుకుని ... ఇలా ఆ భావనను అక్షరీకరించడం కూడా వారి దయాశీస్సులే కదా!

శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామియే నమః. ఓం నమఃశివాయ

ఓం నమః శంభవే చ  మాయో భవే చ   నమః శంకరాయ చ  మయస్కరాయ చ  నమఃశివాయ చ శివతరాయ చ నమః





.ఓం నమః శివాయ  🙏🙏🙏

11, అక్టోబర్ 2019, శుక్రవారం

కలగంటి కలగంటి... యిపుడిక వలదంటి..

కలగంటి కలగంటి... యిపుడిక వలదంటి.... 🙂

మనదంతా విచిత్రమైన అభిరుచి.(నాదే)

చిన్నప్పుడు వొక కలగంటిని. గోదారొడ్డున విశాలమైన ప్రదేశంలో చుట్టూరా వెదురుబద్దలతో లేదా కొబ్బరాకు తడికలతోనో కట్టిన స్థలం మధ్యలో ఓ రెండు నిట్టాడుల రెల్లు గడ్డి యిల్లు ఆ యింటి ముందు అనేక పూల మొక్కలు చుట్టూరా కట్టిన దడులకు పాకిన తీగజాతి కూరగాయ మొక్కలు వుంటూ.. నూతిలో నీళ్ళు తోడే పనిలేకుండా.. చక్కగా ఓ బిందె పట్టుకెళ్ళి గోదారిలో బుడుంగున ఒకసారి ముంచి బిందెను వయ్యారంగా నడుమ్మీద పెట్టుకుని మొక్కలకు నీళ్ళు పోయాలని పూల మొక్కల మధ్య తిరుగుతూ సోలో పాటలు పాడుకోవాలని.. పనిలో పనిగా.. చీకటి వెలుగుల కౌగిటలో చిందే కుంకుమ వన్నెలు .. అనే డ్యూయెట్, నిదురించే తోటలోకి పాట వొకటి వచ్చింది లాంటి బరువైన పాటలు పాడుకోవాలని కోరిక వొకటి ఆలోచనలలో విత్తై పడి మనసులో నాని నాని మొలకెత్తి ఆకులు తొడిగి కొమ్మలేసి ఆఖరికి వటవృక్షమై కూర్చుంది.

ఆ కోరికకంతటికి కారణం ముత్యాలముగ్గు సినిమా అని శోభన బాబు నటించిన సంపూర్ణ రామాయణం అని చీకటి వెలుగులు సినిమాలని చెప్పక్కర్లేదు 🙂 కళ్ళు మూసినా తెరిచినా నది వొడ్డు పూలతోటలు పాడుకున్న పాటలు యివే కనబడేవి. మా ఇంటిచుట్టూ ఖాళీ స్థలంలో కూడా బాగానే మొక్కలు వేసి పోటీపడి పెంచేవాళ్ళం. కానీ ఈస్టమన్ కలర్ సినిమా పాటల ముందు .. అవి మనకంటి్కి ఆనేవి కాదు, పైగా నది వొడ్డు కూడా లేదు. ఆ విధముగా సుడులు తిరుగుతూ పెరిగిన కోరిక వల్ల ఇంటర్మీడియట్ లో బై పి సి గ్రూఫ్ తీసుకున్నాను. మొక్కలతో పాటు కప్పలను కూడా కోయాల్సివచ్చినందుకు డ్రాయింగ్ బాగా వేస్తానని ఫ్రెండ్స్ రికార్డ్ లు కూడా నేనే పూర్తి చేయాల్సినందుకు అసలు బాధ అనిపించేది కాదు. ఆఖరికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ తప్పి.. పెళ్ళి గండం నన్ను ముంచేస్తే నేను రికార్డ్స్ రాసి యిచ్చినవాళ్ళు అగ్రికల్చర్ బియెస్ సి చదివి వ్యవసాయశాఖలో వుద్యోగం సంపాదించి  అధికారులు అయ్యారు. నేనేమో నలబై యేళ్ళకు పైగా నదివొడ్డున చిన్న కుటీరం చుట్టూరా పూలతోట కలలు కంటూనే వున్నాను.

ఈ మధ్యనే తీరికగా కూర్చుని కాస్త ఆలోచన చేస్తూ జీవితం అనే సినిమాలో  సోలోలు డ్యూయెట్ లు విషాదంగా పాటలు పాడుకునే అన్ని సందర్భాలు అయిపోయాయి కదా... అయినా నా కల తీరనేలేదు. ఆ సినిమాలు చూసిన కాలం లోనే " నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం" లాంటి పాటలున్న సినిమాలు చూసాను కదా... అలాంటి కలలెందుకు కనలేదు... అలాంటి కలలు కంటే అవి నిజమయ్యేవేమో... కలలు కనడం కూడా రాదు అని.... ఓ మొట్టికాయ వేసుకున్నాను గట్టిగా.

అయినా కృష్ణా వాళ్ళు గోదారొడ్డు కలలు కనకూడదబ్బా... అచ్చిరాదు 🙂 🙂

ఇప్పటిదాకా సరదాగా రాసినా .. అది నిజమే. నా చిరకాల కల కూడా అదే !

సరే ...కలైతే నెరవేరలేదు కానీ ప్రయత్నాలు మాత్రం కుంటుపడలేదు. ఉన్న ఊరులో అయితే అంత విశాలమైన స్థలం కొనడమో లేక యిప్పటికే వున్న స్థలంలో అభిరుచి ప్రకారం ఇల్లు కట్టుకోవడమో  తలకి మించిన భారం సంగతి అటుంచి ... నీ తర్వాత యెవరు వుండబోతారు యీ యింట్లో అన్న వ్యాపార దృక్కులు నా చుట్టూ అల్లుకుంటాయి. కొంతమందికి పెదవులు మాట్లాడకుండా కళ్ళు లేక నొసలు మాట్లాడతాయి . నా యింటి చుట్టూ అల్లుకున్న ఆశలకు మొదట్లోనే యాసిడ్ పొసే ఈర్షాద్వేషాలున్న మనుషులు నా కల నెరవేరకుండా అడ్డుపడుతూ వుంటారు. అలా రెండుసార్లు చేదాకా వచ్చిన అదృష్టం వెనక్కి జరిగి పాతాళంలోకి జారిపోయింది.

ఈ మధ్య ఒక ఆలోచన చేసాను. మెట్టినిల్లు అయిన వూళ్ళో నా యింటి కల నెరవేరడంలేదు. కనీసం పుట్టినూరులో నా కల నెరవేర్చుకుందాం అని ఆలోచన వచ్చినదే తడవు.. మా నాన్నగారికి ఫోన్ చేసి ... మన వూరిలో ఇళ్ళ స్థలాలు యెంత రేటు వున్నాయి నాన్నా  అని అడిగాను. ఆయన యధాలాపంగా సెంటు లక్షరూపాయలు దాకా వుండొచ్చు ఇప్పుడు రేట్లు పడిపోయినాయి కదా అన్నారు. వెంటనే నేను లెక్కలు వేసుకున్నాను. పది సెంట్లు స్థలం,ఒక  నలభై లక్షలలో ఇల్లు అయిపోతుంది కదా ! నేను ఈ ఊర్లోనే వుండాలని యేముంది. ఇంటర్ నెట్ కనెక్షన్ వుంటే యెక్కడ వుంటే యేమిటీ.. టూ వీలర్ వుంది కారు వుంది. హాస్పిటల్ అవసరాలకు విజయవాడ వెళ్ళడమే కదా అన్నాను.

మానాన్నగారు వెంటనే ..యిక్కడా? ఈ ఊరులో యెందుకులే అమ్మా ... ఈ ఊరులో రైతు కుటుంబాలు యేమీ లేవు. వున్నా అందరూ బెజవాడలో హైదరాబాద్ లో అమెరికాలో వుంటుంటే ..నువ్వు యిక్కడికి రావడం యెందుకు ? ఒక అపార్టుమెంటు కొనుక్కుని అక్కడే వుండు అన్నారు. మొత్తానికి ఆయనకు ఆడపిల్లలు ఒకింటికి వెళ్ళిపోయాక మళ్ళీ పుట్టినవూరుకు రావడం యిష్టం లేదని అర్ధమయ్యింది. జీవితంలో క్లిష్టమైన  సమస్యలు యెదురైనప్పుడే పుట్టింటికి వెళ్ళని నేను అక్కడ యిల్లు కట్టుకుని పైగా పుట్టిన ఊరులో వుండే అదృష్టం యెంతమందికి వుంటుంది అని కలలు కంటూ యెన్నో ఆలోచనలు చేసిన నా ఉత్సాహం అప్పటికప్పుడే గాలితీసిన బుడగలా నేలబడింది.

అమ్మ చనిపోయి ఇరవై ఒక్క ఏళ్ళయితే ఒకే ఒకరోజు పుట్టింటిలో నిద్ర చేసిన ఘనత నాది. అదీ మా మామగారు చనిపోయినప్పుడు భర్తతో కలిసి నిద్రకు వెళ్లడం. ఇక రెండవది భర్త చనిపోయిన తర్వాత అన్న యింటిలో ఇంకొకరోజు నిద్ర. ఇవన్నీ మనసుకు ముల్లులా గుచ్చుకుంటాయని అనుకోను నేను. చాలా యధాలాపంగా తీసుకుంటాను.అమ్మలేని పుట్టిల్లు యెవరికైనా అంతే కదా !

ఇక ఇప్పుడైతే పూర్తిగా వైరాగ్యం ఏది నా యిల్లు.. దేహమున్నంతవరకు దేహమే ఒక యిల్లు. ఈదేహంలోకి అద్దెకి ఉండటానికి వచ్చిన ఆత్మకి దేహమే అద్దె యిల్లు. ఈ దేహానికి మాత్రం సొంత యిల్లు లేకపోతే యేమీ అని తేలికగా తీసి పడేస్తున్నాను.

నేనెప్పుడూ ఒకమాట అంటూ వుంటాను. జీవితంలో పెళ్ళి  ఇల్లు  కలలాంటివి. కొందరికి నెరవేరతాయి కొందరికి అసలు నెరవేరవు. ఊపిరి వున్నన్నాళ్ళూ  యెలా రాసి వుంటే అలా జరగడమే.అందరికి అన్నీ పెట్టి పుట్టి ఉండవు. స్వయంగా నెరవేర్చుకునే శక్తి ఉండదు. ముఖ్యంగా స్త్రీలకు  భర్త అమర్చలేకపోతే బిడ్డలు కూడా ఆ కోరిక తీర్చలేరు. వాళ్ళ జీవన పోరాటం  వాళ్ళది కదా! పిల్లలను తప్పు పట్టలేము. ముఖ్యంగా ... ఆస్తులకు వారసులే తప్ప కలలకు వారసులు కారు

తల్లిదండ్రులు... తమ జీవితకాలం పెట్టుకునే భ్రమలు పిల్లలు. physically mentally emotionally... అయినా తల్లిదండ్రులకు బుద్ధి రాదు.ఈ తల్లిదండ్రుల వయసు వస్తే తప్ప బిడ్డలకు తల్లిదండ్రులు అర్ధం అవరు. అప్పటికి వాళ్ళు వుండరు. జీవనచక్రం తిరుగుతూనే ఉంటుంది అంతే! ఒక కలను సమూలంగా తుడిచేసాను.

చిన్నప్పుడు ఇసుకలో ఆడుకుంటూ పిచ్చుకగూళ్ళు  కట్టుకుంటాము. ఇంటికి  వెళ్ళేటప్పుడు  వాటిని కూల్చేయడమో లేకపోతే  వెనక్కి వెనక్కి తిరిగి చూసుకుంటూనో వెళతాము. తర్వాత ఎవరో ఒకరు వాటిని తొక్కేస్తారు. లేకపోతే గాలికి చెదిరిపోతుంది. నా కల కూడా అలాంటిదే!  వాస్తవంలో జీవించడం నేర్చుకున్నాను. ఇప్పుడు చాలా ప్రశాంతంగా వుంది.
 

8, అక్టోబర్ 2019, మంగళవారం

కానుక

కానుక కథంటే చాలా యిష్టం. ఈ వ్యాసం కూడా ..అందుకే బ్లాగ్ లో భద్రపరచుకుంటున్నాను. ఆంధ్రజ్యోతి సౌజన్యంతో ...
కానుక’ అద్భుతమైన కథ

‘కానుక’ అద్భుతమైన కథ అని ప్రముఖ రచయితలు, విమర్శకులు ఏకగ్రీవంగా ప్రస్తుతించారు. ఇందులో అధివాస్తవికత, మార్మికత ఉన్నాయని కూడా అన్నారు. అందరూ ఈ కథను అద్వితీయమైనదిగా పేర్కొన్నారు. అందులో సందేహమేమీ లేదు. కానీ, అసలు ఆ కథకు అర్థమేమిటి? ఆ విషయం ఎవరూ మాట్లాడలేదు. కథ చివరలో గల ముడిని ఎవరూ విప్పలేకపోయారు. ఆ మర్మాన్ని అలాగే వదిలేశారు. ఆ కథ ద్వారా రచయిత చెప్పదలచింది ఏమిటో ఎవరికీ తెలియకపోయినా కనీసం రచయితకైనా తెలిసి ఉండాలి కదా! ఎవరైనా అడిగితే రచయితైనా చెప్పగలగాలి కదా! రమణగారూ చెప్పలేదు- ఆయనా స్పష్టంగా, కచ్చితంగా చెప్పలేకపోయారు. ఆ ‘మార్మికత’ను అలాగే వదిలేశారు ఆయన. హాస్యరచయితగా ప్రసిద్ధులైన ముళ్ళపూడి వారు ఇంత గంభీరమైన కథను ఎందుకు రచించారని ఒకరు ప్రశ్నించగా ఆయన చెప్పిన సమాధానం ఇది:

‘‘కృష్ణుడు, సంగీతం రెండూ అద్భుతమైన వస్తువులు. కృష్ణుడిలా అల్లరి, అందం, సంగీతం; చిలిపిదనం, సంగీతం; ప్రణయం, సంగీతం; పోకిరీతనం, సంగీతం; నిండుదనం, గొప్పదనం, కరుణ, సంగీతం అన్నీ కలబోసుకుని ఎవరికి ఏ ‘శ్రుతి’లో కావాలంటే ఆ శ్రుతిలో పలికే వ్యక్తి ఏ దేశ పురాణగాథలు చూసినా కనబడడు. కృష్ణుడి గురించి రాయాలని చాలా దురాశ ఉండేది, ఉంది. పన్నాలాల్‌ ఘోష్‌ వేణు నాదం విన్నప్పుడల్లా ఆ నాదాన్ని వాక్యాల్లో - తెలుగు వాక్యాల్లో ఇమిడ్చి ఫ్రేము కట్టాలన్న పేరాశ ఉండేది, ఉంది.
‘‘సత్యాన్ని అన్వేషించబోయే వాడిని - స్క్వేర్‌ రూట్‌ ఆఫ్‌ మైనస్‌ వన్‌ కనిపెట్టు అని గణిత శాస్త్రారాధకుడు అన్నాడు. ఏడు రంగుల కలయికలో వెదకమని చిత్రకారుడు అన్నాడు. సప్తస్వరాల సమ్మేళనంలో వెదకమని నాదారాధకుడన్నాడు. సత్యాసత్య నిదానానికి ఈ వాక్యకారుడికి అర్హత ఉందని కాదు. నేతి నేతి అనుకోడం కూడా చేతకాదు. కాని, అలా అనుకొని ఏదో పరమార్థాన్ని అనుభూతికి తెచ్చుకోగలిగిన ఒక వ్యక్తి గురించి రాయాలన్న ఆశతో రాసిందీ కథ.’’
కృష్ణుని వేణు నాదాన్ని విని పరవశించే ఆరాధకుడు గోపన్న. కృష్ణుని కోసం ఒక వేణువును తయారుచేసి బహూకరించాలనుకున్నాడు.
‘‘ఇంత మోహనమైన సంగీతాన్ని కృష్ణుడు ఒక వెదురు ముక్కలో ఎలా ఇమిడ్చాడా అని గోపన్న ఆలోచించాడు. ఒకసారి అతని ఇంటికి వెళ్ళి ఆ మురళిని ఎత్తుకవచ్చాడు. యమున ఒడ్డుకు వచ్చి చెంగుచాటు నుంచి మురళి తీసి వాయించాలనుకునే సరికి అది కనబడలేదు! మాయదారి కృష్ణుడు... గజదొంగ దగ్గర నేను దొంగతనమేమిటి అనుకున్నాడు గోపన్న. కాని, గజదొంగ ఆ సాయంత్రం కనబడి ‘గోపన్నా నా మురళి తీసుకుపోయావు కదూ... పోనీ ఇంకొకటి చేసిపెట్టు’’ అన్నాడు నవ్వి.
ఆ మర్నాటి నుంచి వేణు నిర్మాణం ఆరంభించాడు గోపన్న.
‘‘మురళి సిద్ధం కాగానే శ్రుతి చూశాడు. గుండె బద్దలయినంత పనయింది. అది శ్రుతి శుద్ధంగా లేదు. పైగా జీర. రెండు మూడు వేణువులు పలికినట్లుంది. కృష్ణుడు ఊదుతాడన్న ఆనందంలో దానికి ఒళ్ళు పులకరించిందా? గోపన్న అది పడేసి మరోటి చేశాడు. అదీ అంతే. మర్నాడు వెదురు చాలా తెప్పించాడు. పది, పన్నెండు చేశాడు. ఒక్కొక్కటీ ఊది చూడడం, నచ్చక పారేయడం. నీకు వేణువు ఇవ్వందే నా ముఖం చూపను కృష్ణయ్యా! అనుకున్నాడు. నాటి నుంచి ఇదే పని పెట్టుకున్నాడు. సాయంకాలం బృందావని వేపు వెళ్ళి వేణుగానం వినడం, ఉదయాస్తమానం కొత్త వేణువులు చెయ్యడం.’’- ఇవన్నీ రమణగారి వాక్యాలే.
అలా పాతికేళ్ళు గడిచిపోయాయి. కృష్ణుడు పెద్ద వాడయ్యాడు. బృందావనికి రావడం లేదు. పట్నవాసం మనిషైపోయాడు. అయినా ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి వస్తున్నాడు. అప్పటికెలాగైనా శ్రుతి శుద్ధమైన వేణువును సిద్ధం చేయాలని గోపన్న ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కాని, వేణువు తయారయేది కాదు. గోపన్న పాకలోని అటక అంతా పనికిరాని వేణువులతో నిండిపోయింది.
మళ్ళీ వచ్చింది పండగ. రేపే కృష్ణాష్టమి. ఇదే చివరి ప్రయత్నం. కృష్ణుడికి వేణువు ఈసారి ఇవ్వలేకపోతే ఇక ఈ జన్మలో ఇవ్వలేడు. చివరి వేణువు తయారు చేశాడు. ఇక దీన్ని పరీక్షించదలుచుకోలేదు. పనికొస్తుందో లేదో అది కృష్ణయ్యే చూసుకుంటాడు అనుకున్నాడు. ఆ వేణువును కొడుక్కి ఇచ్చి ఇది రేపు పొద్దున్న కృష్ణయ్యకి ఇవ్వమని చెప్పాడు.
తన మురళిని కృష్ణుడు ఊదుతున్నట్లు ఊహించుకుంటుంటే తన పక్కనున్న వేణువులోంచి సన్నని చిక్కటి స్వరం నెమ్మదిగా ఇవతలికి రావడం, వచ్చి తన చెంప నిమరడం గమనించాడు గోపన్న. తర్వాత కుటీరంలోని సహస్ర వేణువులూ మేలుకొని భువన మోహనంగా గానం చేయసాగాయి. అన్నీ శ్రుతి శుద్ధంగా ఉన్నాయి. అసత్యమైన వేణువు లేనేలేదు. భగవంతుడికి ఉపయోగపడని వేణువే లేదు
అంతలో కొడుకు వచ్చాడు. ‘‘అయ్యా.. అయ్యా, కృష్ణయ్య నీ మురళి వాయించాడే. నాకు బువ్వపెట్టాడు. ఇక్కడ ముద్దెట్టుకున్నాడు. మరేం... కిష్టయ్య నీ మురళి వాయించేవాడే, కాని... ఎంత వాయించినా ఏమీ వినబడలే. అస్సలు పాట రాలేదే...’’ అని చెప్పాడు.
‘‘గోపన్న తల పక్కకు తిప్పి గది నిండా పడివున్న వేణువులను చూశాడు. ఇంతసేపూ గానంచేసి అలసిపోయిన వేణువుల వంక ఆప్యాయంగా సగర్వంగా చూసి ఒకటి తీసి ముద్దు పెట్టుకున్నాడు’’.
ఆధ్యాత్మికత, అధివాస్తవికత, మార్మికత, పారలౌకికత, ఫేంటసీ అన్నీ కలబోసుకున్న కథ ఇది. గోపన్న పరీక్షించి పనికి రావనుకున్న వేణువులన్నీ- కృష్ణుడు ఊదకుండానే, వాటంతట అవే -భువన మోహనంగా గానం చేశాయి. వేయి వేణువుల మనోహర బృందగానం. కాని, గోపన్న పరీక్షించకుండా పంపిన వేణువు మాత్రం కృష్ణుడు ఊదినా పలకలేదు. మార్మికత అంతా ఈ ముగింపులోనే ఉంది.
రమణ గారు ఈ కథలోని ప్రతి వాక్యాన్నీ, ప్రతి పదాన్నీ, ప్రతి అక్షరాన్నీ అతి జాగ్రత్తగా, సున్నితపు త్రాసులో తూకం వేసి రచనా భరణంలో పొదిగారు. ఇలాంటి రచనలు ‘అలవోకగా’ జరగవు. భావనకు భౌతిక రూపం ఇచ్చే శిల్పి అలవోకగా శిల్పం చెక్కలేడు. ఊహ కచ్చితంగా శిల్పంలోకి ఒదగదు. కవి భావన సంపూర్ణంగా అక్షరాలలో ఆవిష్కృతం కాదు. తపస్సు అలవోకగా జరగదు. రమణగారు ధ్యానస్థితిలో దర్శించిన దృశ్యాలను, సత్యాలను తపోదీక్షతో అక్షరబద్ధం చేసినట్లు అనిపిస్తుంది.
ఈ ‘కానుక’ కథలో రెండే పాత్రలు - గోపన్న, అతని కొడుకు చిన్న గోపన్న. అసలు కథ అంతా కృష్ణుడికి సంబంధించినదే అయినా ప్రత్యక్షంగా కృష్ణుడు ఎక్కడా కనిపించడు. కృష్ణుడు గోపన్న మనస్సులోనే - మనస్సంతా నిండి ఉంటాడు. ఒక్క నిమిషం కూడా మనస్సును ఎడబాయడు. కథలో మొదటి నుంచి చివరిదాకా గోపన్న వేణువులు తయారుచేస్తూనే ఉంటాడు. అంతసేపూ అతడి మనస్సులో సన్నగా, లీలగా, స్మృతిగా కృష్ణుని వేణునాదం వినిపిస్తూనే ఉంటుంది- వేణు నిర్మాణానికి దారి చూపేది అదే. రమణగారు ఈ కథను చిన్న సినిమాగా తీస్తే ఎంత బావుండేది?
గాఢంగా ఆలోచించవలసిన, మననం చేయవలసిన వాక్యాలు, సంగీతానికి సంబంధించినవే ఎన్నో ఉన్నాయి ‘కానుక’లో. కొన్ని చూద్దాం:
‘‘గోపన్న పూర్వం ఎన్నో వేణువులు చేశాడు. తృప్తిగా వాయించాడు. బాగానే ఉందనుకున్నాడు. కాని, ఒక స్థాయి వచ్చాక అతనికొక ఊహపోయింది. వేణువును కిందపెట్టి, సంగీతాన్ని ఊహించబోయాడు. ఊహించిన సంగీతాన్ని భావన చేసి, భావించిన దానిని అనుభవించి దర్శించే సరికి అతనికొక సత్యం తోచింది. సంగీతాన్ని అనుభూతికి తెచ్చుకోవడానికి జంత్రగాత్రాలను ఉపయోగించబోవడం అవివేకం. జలపాతాన్ని వెదురు గొట్టంలో ఇమడ్చడం పొరపాటు. సముద్రాన్ని పాలకడవలో ఇమడ్చడం తెలివితక్కువ. ఊహకందే సంగీతంలో పాటకందేది శత సహస్రాంశం ఉండదు.
‘‘ఊహ సాగిన కొద్దీ స్వరలత దిగంతాలకు వ్యాపించ సాగింది. ఆకాశం వరకు వ్యాపించసాగింది. రోదసి అంతా నిండిపోసాగింది. క్రమంగా ఓంకార జనితమైన స్వరార్ణవం తిరిగి ఓంకారమై భువన సమ్మోహనంగా, భీకరంగా, అద్భుతంగా ఎరుకపడ సాగింది. శ్రుతి సంగీతంలా ఇందులో అపశ్రుతులు లేవు. అపశబ్దాలు లేవు. అన్ని వేదాంతాలు, అన్ని సత్యాలు అర్ధసత్యాలేనంటూ, తనలో భాగాలేనంటూ నిలచే అద్వైత సత్యంలా ఈ సంగీతంలో అపస్వరాలు కూడా అర్ధస్వరాల, పూర్ణస్వరాల పక్కన నిలిచి అందాలు సంతరించుకొని, అందంగా భాసించసాగాయి. ప్రతి అణువునా భగవంతుడున్నాడు, ప్రతి శబ్దంలోనూ సంగీతం ఉంది - అన్న వాక్యాల తాత్పర్యం అతనికి ఎరుకపడింది. గోపన్న అర్భక దేహానికిది దుర్భరమైపోయింది. అతను ఊహించిన సంగీతాన్ని అనుభవించడానికి శక్తి చాలలేదు. అవయవాలన్నీ విలవిలలాడేవి. హృదయం బద్దలయిపోయే స్థితికి వచ్చింది. అందం, ఆనందం దగ్గరగా వస్తే ఇంత దుర్నిరీక్ష్యాలై దుర్భరాలై ఉంటాయని అతను ఊహించుకోలేదు. ఇప్పుడు గ్రహించి కూడా తప్పించుకోలేడు.’’
‘‘అతన్ని ఆస్థితి నుంచి ఐహిక స్థితికి తెచ్చి కాపాడినది కృష్ణుడి మురళి. అది విన్న క్షణాన అతను ముగ్ధుడైపోయాడు. ఆ స్థితిలోకే మేలుకున్నాడు. తన ఊహకు అందిన దానికన్నా గొప్పదీ, ఆకళింపు చేసుకుని అనుభవించడానికి సులువైనదీ అతనికి ఆనాడే వినిపించింది. నాటి నుంచి ప్రతి నిత్యం కృష్ణుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి మురళి వినేవాడు...’’
ఇక - చిట్టచివరి మార్మికత సంగతేమిటి? దాన్ని పరిష్కరించడం ఎలా?
కథ రమణ గారిది - అందులో జోక్యం చేసుకునే అధికారం నాకు లేదు. కాని, చాపల్యంతో నేనూహించిన కొత్త ముగింపును సూచిస్తున్నాను - రమణ గారికి క్షమాపణలతో.
ఇక్కడ గోపన్న పాకలో వేయి వేణువులు భువన మోహనంగా గానం చేస్తుంటే అక్కడ స్వయంగా కృష్ణుడే వాయిస్తున్న వేణువు మోగకపోవడం ఏమిటి? ఆ వేణువూ, ఈ వేయి వేణువులూ అన్నీ కృష్ణుడికి నైవేద్యంగా గోపన్న చేసినవే కదా! గోపన్నకు న్యాయం జరిగేట్టు, పాఠకులకు, సినిమా తీస్తే ప్రేక్షకులకు త్రిల్‌ కలిగేట్లు నేను భావన చేసిన దృశ్యం వినండి:
చిన్న గోపన్న పరుగెత్తుకుంటూ వచ్చాడు. వాడి మొహం సంతోషంతో వెలిగిపోతోంది. ‘‘అయ్యా అయ్యా... మరే... కిష్టయ్య నీ మురళి వాయించాడే. పాట ఎంత బావుందో!’’ అన్నాడు.
గోపన్న వినిపించుకొనే స్థితిలో లేడు. పనికిరానివనుకొని పక్కన పడేసిన వేయి వేణువుల సమ్మోహన బృందగానాన్ని పరవశంతో కనులు మూసుకొని ఆలకిస్తున్నాడు.
‘‘అయ్యా అయ్యా... కిష్టయ్య వాయించింది ఈ పాటే. సరిగ్గా ఈ పాటే. కిష్టయ్య ఇంకా వాయిస్తూనే ఉన్నాడు. నీకు చెప్పాలని లగెత్తుకొచ్చేశాను’’ అన్నాడు చిన్న గోపన్న.
ఆ మాటలూ వినిపించలేదు గోపన్నకి. ఆనందంతో కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. వేణువులన్నీ అతడికి దగ్గరై అతడి చెంపలను ముద్దాడుతూ గానం చేస్తున్నాయి. అతడు వాటిని గట్టిగా పొదువుకున్నాడు. వాటి పరిష్వంగంలో అలౌకిక కృష్ణ స్పర్శను అనుభూతం చేసుకున్నాడు. అతడికి అంతా అర్థమయింది. అక్కడ కృష్ణ మురళీ శ్రుతులు, ఇక్కడ వాటి అనుశ్రుతులు; అక్కడ స్వరాలు, ఇక్కడ అనుస్వరాలు. అక్కడ నుంచి ఇక్కడి దాకా ఒకే నిరంతర కృష్ణగాన వాహిని.
చిన్న గోపన్నకీ ఏదో మైకం కమ్మినట్లయింది. నాన్నపై అంతులేని బెంగ కలిగింది. వెళ్ళి నాన్న పక్కన పడుకున్నాడు. గోపన్న వేణువులతో పాటు కొడుకునీ కౌగిట పొదువుకున్నాడు. గానం సాగుతూనే ఉంది...సన్నగా. క్రమంగా వేణుగానమూ అలసి సొలసి గోపన్న కౌగిట నిదురించింది.
-సమాప్తం-

నండూరి పార్థసారథి

(ఇటీవల ముళ్ళపూడి వెంకట రమణ జయంతి సందర్భంగాచేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలు)




5, అక్టోబర్ 2019, శనివారం

ఫ్లిప్ సైడ్

మళ్ళీ ఆధ్యాత్మికంలో పడినట్లున్నారు. ఏమిటీ సంగతి అని అడిగారు నా మిత్రుడు. 

రోజూ నేను పెడుతున్న వాట్సప్ స్టేటస్ లు చూస్తున్నట్లు అర్దమైంది. నాకు ప్రశాంతత అక్కడ తప్ప యింకెక్కడా దొరికేటట్లు లేదు అని రిప్లై యిచ్చాను. నేను అలా బ్రాంతి లో బ్రతుకుతున్నాననుకుని వుండవచ్చు. అదికూడా నేనే అనుకున్నానంటే అతని ఆలోచనలు నాకు తెలుసు కాబట్టి.   


అసలు మనుషుల అంతరంగంలో యేమి వుందో కనుక్కోవడం పెద్ద కష్టమేమికాదు. కానీ వారు తమ ఆలోచనలు నిజమేనని వొప్పుకోకపోవడమే కష్టం. 


నేను మాత్రం ఏం తక్కువ? చీపురు అరిగి అరిగి పోయినా కూడా.. ఆప్టరాల్ వొక చీపురు వందరూపాయలు పోసి వూరికూరికే మార్చలేక అరిగితే మాన్లే కాస్త నడుంవొంచి  ఊడ్వ వచ్చు.మంచి ఎక్సెర్ సైజ్  కూడాను అని బతకనేర్చిన తెలివితేటలు చూపిస్తాను.


నేను మహా దైర్యవంతురాలినని, కొందరు నాకు చాలా పొగరని పిసినారిని అని యేవేవో మాట్లాడుతుంటారు. ప్రతిపనికి అయినదానికి కానిదానికి పురుషుడిపై ఆధారపడే మనస్తత్వం కాదు. ఏ పనైనా స్వయంగా చేసుకోవాలనుకుంటాను తప్ప సోమరితనంగా కూడా వొకరిపై పని నెట్టేయడమన్న ఆలోచన చేయను.. నేను సంపాదించని రూపాయలను విచ్చలవిడిగా  ఖర్చు చేయడానికి నాకు అధికారం లేదు అంటాను. అయినా డబ్బులేమీ వూరికే రావడం లేదు కదా. ఆ మాత్రం ఆత్మ విశ్వాసం వున్నవాళ్ళను కృంగదీసే మాటలంటే పట్టించుకోకూడదనుకుని నాకు నచ్చిన దారిలో పోతుంటాను కానీ… కొన్ని విషయాలకు స్పందించకుండా మాత్రం వుండలేను.


గత ఆదివారం నేను ఓ పరామర్శకు.. వెళ్ళివచ్చేసరికి మా బ్లాక్ చుట్టూ కనబడిన మార్పుకు కుదేలైపోయాను.     పచ్చని చెట్లు నిలువెత్తు పెరిగి రంగురంగుల పూలతో భలే శృంగారంగా కనువిందు చేస్తూ వుండేవి. ఆ పూల పొదలచుట్లూ చెట్ల చుట్టూ తిరిగే తుమ్మెదలు సీతాకోకచిలకలు తూనీగలు హమ్మింగ్ బర్డ్స్ ఉడుతలు  యింకా పూల దొంగలకు అన్నింటికి ఆలవాలమైనట్లు వుండే అన్నిరకాల చెట్లను మొదలకంటా నరికించేసారు. బిల్డర్ నరకమని చెప్పారండి అన్నాడు వాచ్ మెన్. 


"మనుషులకు తిరిగే వాహనాలకు వేటికి అడ్డుకాదు. పైగా శ్రావణమాసం. అలా పచ్చగా వున్న పూలు పూసే మొక్కలను నరికినేయడానికి ప్రాణమెలా వొప్పింది. పూలు కొయ్యొద్దు అంటే కోయడం మానేస్తారుగా" అన్నాను. 


"దోమలు  పచ్చ పరుగులు వస్తున్నాయని నరికించేసారు" అన్నాడతను. అతను మాత్రం యేం చేస్తాడు యజమాని ఆజ్ఞ పాటించాలిగా అనుకుని పైకి వచ్చేసాను. కానీ రెండురోజులు మాములు మనిషిని కాలేకపోయాను. 


ఎంత కఠినంగా వుంటున్నారు మనుషులు.  అసలేమాత్రం జాలి కరుణ లేని రాతి హృదయాలు అయిపోతున్నాయని అనుకోవడమే కాదు మరి కొందరి దగ్గర  పదే పదే వాపోయాను.కళ్ళు మూసినా తెరిచినా రంగుల రంగుల పూల పందిళ్ళు కదలాడుతూనే వున్నాయి.అసలు మనిషి గురించి తప్ప మనుషుల గురించి ఆలోచించడం మానేసాం. నేను నా అనే చట్రంలో పడి తిరుగుతున్నాం. పాంచ భౌతాత్మికం శివం ప్రకృతియే లక్ష్మి అని తెలియదా లేక యెవరూ చెప్పలేదా? 


ఉదయాన్నే పూలు తెచ్చుకోవడానికని ప్లాట్ దగ్గరకి వెళ్లాను. అక్కడ నీలిరంగు  శంఖు పూలు దిట్టంగా పూస్తున్నాయి. పూలను కోస్తుంటే గోడపై నుండి పలకరించింది వెనుకింటి ఆమె. పెద్ద పరిచయంలేదు కానీ హాయిగా మాట్లాడబోయాను. 


"ఇవిగో యీ మొక్కలన్నీ నేనే వేయించాను అంది. “ఈ శంఖుపూల తీగ నేనే నాటానండీ అది కుండీలో పెరిగి పూలుపూసి కాయలుకాసి గింజలు రాలి మళ్ళీ మొలిచాయి” అన్నాను. ఒప్పుకుంటేనేగా సాక్ష్యానికి యింట్లో అద్దెకి వుంటున్న అమ్మాయిని తోడుతెచ్చుకుని నేనే గింజలు వేసేను అంది. 


ఇవిగోండి..కాసిని పూలు తీసుకోండి అని యివ్వబోతే యివాళ పక్కింటివాళ్ళ దొడ్లో కోసుకొచ్చాను అంది. అసలామె బాధేమిటో నాకర్ధమవక ఆలోచిస్తుంటే ఆ గోరింటాకు చెట్టు నేనే వేయించాను. ఈ మందారాలన్నీ వేయించాను. చాలా పూలు పూసేయి అందరికి పంచేదాన్ని అంది.నీక్కూడా కావాలంటే కోసుకుని వెళ్ళు అంది వుదారంగా. నా స్థలంలో  ఆవిడ వుదారత యేమిటో నాకర్ధమై చావలేదు.   ఇప్పుడు నేను  కూడా మరిన్ని  మొక్కలు నాటుతానంటే యెందుకమ్మాయ్ ఇల్లు కట్టినాక వేసుకో అని చెట్లుంటే దోమలు పురుగుపుట్రా వస్తాయి బయట కూర్చోలేము అంది. ఓహ్ ..ఇదా యీమె బాధ అనుకుని అక్కడనుండి తప్పించుకుని వచ్చేసాను. 


ఆమెకి మాకు గోడ అడ్డుంది కాబట్టి సరిపోయింది లేకపోతే మా స్థలం యింకా వుంది  అనేసేదేమో. ఇప్పటికే ముందువైపు వున్నాళ్ళు  వెనక్కి వెనక్కి జరిగి రెండొందలు గజాలు మాయం చేసేసారు. నోరున్నవాడిదే రాజ్యం అయిపోయిందని వాపోవడం తప్ప చరిత్రని తవ్వి వెనక్కి తెచ్చుకోవాలనే జ్ఞానం ఆశ రెండూ లేని నిర్లిప్తత జీవులు మా ఇంట్లో వాళ్ళు. ఏది నాది యేది మీది అన్నీ వొదిలి అందరూ వెళ్ళేది ఆ వొలుకుల్లోకే కదా వెళ్ళేదన్నవైరాగ్య జ్ఞానం వచ్చేసిన వృద్దులం అయిపోయాం. వొంట్లో జవజీవాలు సన్నగిల్లడం కాదు పోరాడే శక్తి లేదని వెనకడుగు అంతే. నాకెందుకో పులి నాలుగడుగులు వెనక్కి వేసిందంటే అన్న నానుడి గుర్తుకొస్తుంది అప్రయత్నంగా. మేమంతా మంచి పులులం అని మాకు మేమే సెహబాష్ అని వెన్ను చరుచుకుంటుంటే ఆక్రమణదారులు మా  మంచి తనాన్ని చేతకాని తనంగా భావిస్తున్నారని నా గట్టి అనుమానం.వలస వెళ్ళి స్థానికత కోల్పోయిన కుటుంబం మాది. అక్కడ వున్న వాళ్ళతో పోల్చుకుంటే మా కుటుంబం బలహీనం. బలహీనుడి మనోభావాలతో బలవంతుడు బంతాట ఆడుకుంటాడు. తప్పులేదు. Might is right అయ్యేది యెపుడని? ఏ స్వార్ధ ప్రయోజనాలకో కొంతమంది అమ్ముడవుతారు లేదా యేవేవో భేదాలు పొడసూపి నీరుకార్చేస్తారు. బలహీనుల అపజయమంతా యిలాంటి చోటనే దాగివుంటుందనేది సత్యం. కుంకుమ పూల కోసం చేసే జీవన యుద్ధం లాంటిదే నాది కూడా అనిపిస్తూ వుంది. 


ఈ రోజు పేపర్లో వార్త దిగ్భ్రాంతపరిచింది. వంద ఆవులకు పైగానే చనిపోయాయి అని. పక్కనే వున్న పల్లెటూరులో దాతల విరాళాలతో గోశాల నడుస్తుంది. ఎవరో విషప్రయోగం చేసారనే వార్త చక్కర్లుకొడుతోంది. కాదంటాడు సంబంధిత శాఖాధికారి. మంత్రి కూడా. విషం యెలాగైనా ప్రవహించవచ్చు. ఆహారం నీరు నేల మాట ఆలోచన యెక్కడినుండైనా ఆఖరికి ప్రాణాలను కాపాడే మందు కూడా   విషాన్నే వెదజల్లవచ్చు. దాని తీర్మానం దానిది.

  

దేశమంతా పూజించాలనే గోజాతి  వందల కొద్దీ  మనుషుల లెక్కన కుక్కల లెక్కన శవాలై పడి వుండటం చూసి మనసు కలత చెందింది. కారణాలేవైనా యివాళ యివి యెల్లుండి ఈద్ సందర్భంగా తెగిపడే మరిన్ని గొర్రెలు, ఆవులు. మనుషుల మూఢ విశ్వాసాలకు ఆహారప్రీతికి బలైపోయే మూగజీవాలు. ఈ బలులకు అంతే లేదు.ఆ మాట ఎవరితోనైనా అంటే మీరు నాన్ వెజ్ తినరా అని అడుగుతారు. తినేవారికి జీవ హింస తప్పు కాదు.ఏ జంతువైనా తప్పుకాదు కదా అని నా ఆలోచన కూడా! మనుషులకు తినాలనుకున్నప్పుడు తప్ప మిగతాదంతా కారుణ్యమే.  పసి పిల్లను రేప్ చేసి చంపినవాడికి పడ్డ ఉరిశిక్ష కూడా సబబు కాదు అంటారు. మనుషులందరిదీ ఒకే ఆలోచనా విధానమైతే యెట్టా, ఒకరు అవునంటే యింకొకరు కాదనాలి. కాదనడానికి కారణమేమి ఉండనవసరం లేదు. కేవలం వ్యతిరేకించాలి అనేదే ముఖ్యం తప్ప   ఫ్లిప్ సైడ్ యెంతమాత్రం  కాదు.


మా ప్రక్కన ఎకరాలకు ఎకరాలు నివాస స్థలాలుగా విడగొట్టబడుతుంటే మేము చుట్టూరా పచ్చదనాన్ని కాపాడాలని కుండీలలోనైనా మొక్కలు నాటాలని తెగ తాపత్రయపడి నర్సరీల చుట్టూ తిరుగుతున్నాం. ముద్ద మందారాలు ముద్ద గన్నేరులు పూజకు పనికి రావండి అంది వొకామె. అసలు మన ఆలోచనలు  పనులే సమాజానికి పనికిరావండీ అని అందామని  పెదాలపైకి వచ్చి వాటిని వెనక్కి కుక్కుకున్నాను. మనుషులకు అన్నింటికీ మంచి కావాలి. ఈ మంచి మంచి మంచి అన్నది వినలేక చస్తున్నా. యూట్యూబ్  లో అనేకమంది చెప్పిన విషయాలని అరగదీసుకుంటూ విని వినీ కూడా అందరూ మంచికి క్రానిక్ అయిపోతున్నారు. మరి చెడు అంటే యేమిటో ఊహకి అందనంతగా మనుషులంతా యింత మంచాళ్ళు అయిపోతే మిగతా ప్రాణులు పర్యావరణం తట్టుకునేది యెట్లబ్బా !  


కుక్కలనుకుంటా, మంచి కోడిపెట్టనొకదాన్ని లాక్కొచ్చి పూపొదల దగ్గర వదిలేసి పోయాయి. ఆ మాటే వాచ్ మెన్ తో అంటే అయ్యో, పొద్దున్న నుండి నేను ప్లాస్టిక్ నల్ల కారీబేగ్ అనుకుంటున్నానండీ, కోస్తే కిలోన్నర మాసం ఈజీగా పడేది అంటూ వొంగి దాన్ని అందుకోబోయే సమయానికి టక్కున వెనుకింటావిడ గోడమీద ప్రత్యక్షం. కుక్కలు పట్టుకొచ్చినవే అయినా మంచిదో లేదో యేవన్నా రోగాలొచ్చి చస్తే బయటపడేస్తే లాక్కొచ్చాయో అంది. 


కోడి రెక్కను అందుకోబోయిన  వాచ్ మెన్ చేయి ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్లు ఆగిపోయింది. కాసేపు ఆ మాట యీ మాట మాట్లాడినాక ఆ కోడిని తీసుకెళ్ళి డస్ట్ బిన్ లో పడేసి రావయ్యా అని వాచ్ మెన్ ని అంటే .. చెత్తబండి వాళ్ళు వస్తారు కదండీ వాళ్ళు తీసేస్తారు అన్నాడు.  


వాళ్ళు రేపటికి రాకపోతే దాన్ని తీయకపోతే ఇదంతా వాసన కదా, తీసేయకూదడా అంటే అతని నుండి సమాధానమే లేదు. ఓర్నీఇతని ఆలోచనల్లో యెంత మార్పు అనుకుని ఆశ్చర్యపోవడం నావంతు. 


పూల సంచీ పట్టుకుని బండి తీయబోయుంటే  వాచ్ మెన్ “అయితే  మీరు రోజూ యీ పూలు కోసుళుతున్నారు దేవుడికి పెడతానికా అండీ? అయితే నేను పెడతాను లోపల దేవుడి పటం వుంది. మొన్న శుక్రవారం నాడు ఆ తీగకున్న పువ్వు ఈ తీగకున్నపువ్వు తెంపుకొచ్చి పెట్టాను.  పూలరేటు బాగా యెక్కువ వుందండీ, ఇక రేపటినుండి ఈ పూలే పెడతాను” అన్నాడు. 


హతసురాలినైపోయాను. ఇక్కడ కూడా పోటీ యేనా అని. 


రోజూ  తెల్లారేటప్పటికి పూల కోసం పరుగులు పెట్టడం పెద్ద పని అయిపోయింది నాకు. ద్విచక్రవాహనం పైనే అయినా పరుగులు తీయాల్సి వస్తుంది. ఎండెక్కితే పూల కోసం ప్రాకులాట మరింత యెక్కువైపోతుంది. అని  నా కొడుకుతో చెపుతుంటే .. "నువ్వేదో అహింసామూర్తిని అనుకుంటున్నావ్ కానీ నీలోనూ అసుర గుణం వుంది. కావాలంటే గుర్తు తెచ్చుకో ..చిన్నప్పుడు నాలుగైదు సార్లు నన్ను మజ్జిగకవ్వంతోనూ నా  బెల్ట్ తోనూ నన్నేనూ  కొట్టావ్" అన్నాడు. 


"దండం దశ గుణ భవేత్ అంటారు కదా బంగారం, అలా దండించి వుండకపోతే నువ్వింత కుదురుగా పెరిగేవాడివా చెప్పు" అని గడుసుగా అంటుంటే.."నేను నాపిల్లలను అసలు కొట్టకుండా పెంచుతా చూడు"అన్నాడు.


 "మంచిది, పైగా మీకక్కడ నియంత్రణ చేసే చట్టాల చుట్టాలున్నారు కదా" అన్నాను. కాసేపు నవ్వుకున్నాక  మళ్ళీ అన్నాడు "నీలోనూ రాక్షస గుణం వుంది"అని. నేను ప్రశ్నార్ధకంగా చూస్తుంటే "అహింస ప్రధమం పుష్ఫం అని నీకు తెలియదా .. భగవంతుకి అర్పించే పూలను కూడా యే మాత్రం కనికరం లేకుండా  ప్రొద్దు ప్రొద్దున్నే విరిసీ విరియకుండానే త్రుంచి త్రుంచి ప్లాస్టిక్ సంచీలో కుక్కి కుక్కి ప్రిజ్ లో దాపెట్టి తీరికగా వీలున్నప్పుడు తీసి కర్ణ కఠోరంగా  అష్టోత్తరాలు వినిపిస్తూ దేవునికి పుష్పాభిషేకం చేయడం మాత్రం హింస కాదు" అన్నాడు.


 నాతో పాటు కరుణశ్రీ పుష్పవిలాపాన్ని బాగా విన్నవాడు. అలా ఆలోచించడంలో తప్పు లేదులే అనుకుంటూనే వెను వెంటనే నేనూ చిన్ని పువ్వా అని అందుకున్నాను. 


"భలే వుందిగా మళ్ళీ చెప్పమ్మా అన్నాడు.. 


"చిన్ని పూవే వాడెనా తన కన్నె వలపు వీడెనా తన చిన్నెలన్నియు వన్నెలన్నియు మన్నులో కోల్పోయెనా? కాంతునెరుగని కన్నె గాదా మొన్న మొన్ననే ముద్దు వల్లిని మొనలు దీరెనుగా!" 

….అని వినిపించి "పూల జన్మకు సాఫల్యం సిద్దించాలి. కేవలం వాటిని దేవుని పాదాల దగ్గరకు చేర్చే వాహకాన్ని నేను"అని  అన్నాను  నన్ను నేను సమర్ధించుకుంటూ. పూల బాసలు తెలిసిన వారికి మాటలయుద్దంలో సున్నితంగా గెలవడం బహుతేలిక కదా! మనసులో అనుకొంటిని కూడా ! 


ఫోన్ పెట్టేసాక తీరిగ్గా కాసేపు అసలు ఆనందమంటే యేమిటని ఆలోచిస్తూ కూర్చున్నా. పచ్చని కొమ్మన విలాసంగా  వూగుతున్న రాచిలక  కేరింతలను ఆహ్లాదంగా  చూస్తూ  .. 


అరె..ఆకాశంలో పాము యెగురుతుంది యేమిటబ్బా అని ఆశ్చర్యపోతూ  ఆలోచించి ఆలస్యంగా మెదడులో జ్ఞానరేఖ తళుక్కుమని  మెరిసి చిన్ని పిట్టలు గూడు కట్టుకోవడానికి కొబ్బరాకులను మోసుకెళుతున్నాయని ఆనందపడటం, రెండు పసుపు  పచ్చ సీతాకోక చిలుకలు గాలిలో వూరేగుతూనే  మూతి మూతి ఆనించుకుని వూసులాడుకోవడం, వుడుతొకటి పద్దతిగా పూలకొమ్మపై కూచుని విరిసిన పూవుని తెంపి మొదలు తిని చివరలను కిందకి వొదిలేయడం యివన్నీ చూస్తుండటం మాత్రం ఆనందం కాదూ.. ఏమిటో వెఱ్ఱి ముఖందాన్ని ఆనందాన్ని వల వేసి పట్టాలనుకోవడం మూర్ఖత్వం కాదూ! రకరకాల పూలు సేకరించి చేసే  పూజలో ఆనందం వుందా ఆరాధన వుందా అర్పణ వుందా కామితములు తప్ప. మనిషికి ఒక ఆశ తీరినాక మరొక ఆశ కాదు కాదు మూకుమ్మడి ఆశలు అవి నెరవేర్చమని ప్రార్ధనలు. నేను మానసికంగా యెదిగేదెన్నడూ? 


అన్నట్టు ఈ ఆనందాలకు తోడు మరో చిన్న ఆనందం జత చేరింది కాసేపటికి. దానికి వొక కథ వుంది. అది కూడా వినేయండి మరి.


మా పార్కింగ్ ప్లేస్ చుట్టూతా  నానా చెత్తంతా పేర్చబడివుంటుంది. అట్టపెట్టెలు పాత చెప్పులు విరిగిన కుర్చీలు పాత చీపురులు ఇంకా ఫాస్ట్ పుడ్ సెంటర్ కు సంబంధించిన సామానుతో పాత సామానుల గౌడన్ లా వుంటుంది తప్ప పార్కింగ్ ప్లేస్ లా వుండదు. ఆ సామానుల మధ్య పేరుకుపోయిన దమ్ముధూళి కారుకు కూడా చుట్టుకుని తళతళలాడే కారు అందాన్ని దెబ్బతీయడం సహించలేకపోయాను.  గత ఐదారునెలలుగా యిదే తీరు. పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ లా వుండాలి.. తప్ప గౌడన్ లా కాదు. అవన్నీ తీసేయమను అని వాచ్ మెన్ కి చెప్పాను. అతను విన్నాడు వినిపించాడో లేదో తెలియదు వినిపించినా పెడచెవిని పెట్టారో తెలియదు. 


నేనలా చిరాకు పడుతూనే వున్నా,రోజులు గడుస్తూనేవున్నాయి. వర్షాలు మొదలయ్యాక ఆ సరంజామా మధ్యనుండి పాములు మండ్రగబ్బలు రావడం మొదలయ్యాక పిల్లలున్న వాళ్ళం.ఇలా వుంటే మేముండలేము అని వాచ్ మెన్ అతని భార్య పాట పాడటం మొదలెట్టి కష్టాలన్నింటినీ చరణాలుగా మార్చి పదే పదే వినిపించారు. ఫలితంగా పార్కింగ్ ప్లేస్ కొంత శుభ్రపడింది. 


విసుక్కుంటాను అపుడపుడు. అసలు వీళ్ళ తీరు యింతే! మూడొందల అరవై ఐదు రోజుల్లో సగం రోజులు నీచు కంపు ఘమ ఘమ లాడే  మసాలా కంపులతో కాలక్షేపం చేస్తారు తప్ప పార్కింగ్ ప్లేస్ శుభ్రం చేయరు. పైగా అక్కడ కట్టెల పొయ్యలు పెట్టి డేగిసాలు డేగిసాలు బిర్యాని వండుతూ వంటసాల చేస్తున్నారు. ఏమన్నా అనకముందే మా పార్కింగ్ ప్లేసే కదండీ అనడం. అక్కడంతా అరాచకం. వొకటి రెండుసార్లు గట్టిగా మాట్లాడం వల్ల వాళ్ళు నన్ను చూస్తే ముఖం గండుగా పెట్టుకుని చూడటం మాములై పోయింది.  పులి మీద పుట్రలా నా చికాకును మరింత పెంచుతూ సీజన్ అయిపోగానే డ్రింక్స్ షాపు సరంజామా అంతా తెచ్చి మళ్ళీ పార్కింగ్ ప్లేస్ లో సర్దారు. నష్టపడ్డారంట. షాపు అద్దె కట్టలేక సామాన్లన్నీ అక్కడ  సర్దిపెట్టారని వాచ్ మెన్ సమాచారం.  కొంత సామాను  మాకు కేటాయించిన స్థలంలో సర్దుకున్నా చూసి చూడనట్టు ఊరుకున్నాను. అదీ వెనుకటి కథ. 


ఇక యిప్పటి ఆనందక్షణాలు లోకి వచ్చేద్దాం.


 ఈ రోజు ఈద్. లిప్ట్ దగ్గరలో కూర్చుని మాట్లాడుకుంటున్న టోపివాలాలను చూసి ఈద్ ముబారక్ చెప్పబోయి సందేహించాను.  అంతలో పది పన్నెండేళ్ళ పిల్లవాడు రెండు చేతుల మధ్య తూకం మిషన్ పెట్టుకుని.. "కొంచెం లిప్ట్ డోర్ తీస్తారా" అని అడిగాడు. లిఫ్ట్ డోర్ లు తెరిచి అతను వెళ్ళాల్సిన అంతస్తు నెంబర్ నొక్కి లిఫ్ట్ డోర్ మూస్తూ "ఈద్ ముబారక్ భాయీ" అన్నాను. పెద్ద వాళ్ళు మాటలాపి నావైపు చూస్తుంటే పిల్లవాడు “థాంక్స్ ఆంటీ “అన్నాడు రెండుసార్లు. రెండోసారి థాంక్స్ చెప్పినప్పుడు  “ఇట్స్ ఓకే” అన్నాను. 


పండుగ అందరిది. తీసుకోవడంలోనే వుందంతా. అసురులు భూసురులు అంతా మన ఆలోచనల్లోనే వున్నారు. తగు విధంగా బయటకు వస్తూ వుంటారంతే! అని అనుకున్నాను. 


రేపు శ్రావణ మంగళవారం. గౌరీ దేవిని పూలతో బాగా అలంకరించాలనే ఆలోచన వచ్చినదే తడవుగా రేపుదయం ఊహలలో మెదిలింది.  ప్రొద్దు ప్రొద్దుటే పూల చెట్లు పొదల చుట్టూ తిరుగుతూ యెవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని .. అని అబ్బురపడుతూ ప్రకృతిలో మమేకమైనట్టూ, పూజలు సేయ పూలు తెచ్చాను తీయరా తలుపులను రామా ..అని ఆర్తిగా పిలిచినట్టూ  పూవులేరి తేవే చెలి పోవలె కోవెలకు ..  అనుకుంటూ వుందునా, లేక నిన్ను అర్పించ హృదయపుష్పం చాలును కదా ప్రభూ/దేవీ  అంటూ ఎస్కేపిజం ప్రదర్శిస్తానో అన్నది రేపుదయానికి కానీ తేలదబ్బా. ఆలోచనల్లో మార్పు ఆచరణలోకి మారడం చాలా కష్టం. నా మటుకు నాకు నాణేనికి రెండోవైపు చూడటం సులువైన వ్యవహారమే!


4, అక్టోబర్ 2019, శుక్రవారం

తెలుగు లెస్స

క్రీస్తుశకం 1515వ సంవత్సర ప్రాంతం.  కృష్ణదేవరాయలు కొండవీడు జయించాడు. కృష్ణానదికి కుడివైపున సైన్యాన్ని మొహరించి  కృష్ణానదిని దాటి కొండపల్లిని ముట్టడించాలని ప్రయత్నిస్తున్నాడు.
కంజీవరం ప్రాంతం నుండి తరిమివేయబడిన  కళింగాధిపతి కపిలేశ్వర గజపతి కొండపల్లిలో కేంద్రీకరించి వున్నాడు. రాయల సైన్యం అమరావతి నుండి ఉండవల్లి కొల్లూరు వరకు విస్తరించి వుంది 

రహస్యంగా ఒక సామాన్యమైన మనిషిలా రాయలవారు శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణుదేవాలయ సందర్శనకు వచ్చాడు. (దేవుడు లంక ) అప్పుడు కృష్ణలో వెన్నెలలో  నదీ విహారం చేస్తూ... 

కృష్ణమ్మను కీర్తించాడిలా.. 

సహ్యగిరి శిఖరాన 
శ్రీ కృష్ణ రూపాన 
కృష్ణమ్మ పుట్టింది 
ముందుకే సాగింది 

పరమేశు అంశాన 
వేణమ్మ పుట్టింది 
కృష్ణమ్మతో  కలిసి
కృష్ణవేణయ్యింది 

ముందుకే సాగింది 
ముచ్చట్లు పోయింది 






2, అక్టోబర్ 2019, బుధవారం

అగర్ తుమ్ మిల్ జావో





 వినసొంపైన గళంతో యే భాషలో పాటలు పాడినా ఆ భాష అమ్మాయిలా అనిపిస్తూ శ్రోతలను మైమరిపింపజేసే అమ్మాయి శ్రేయా ఘోషాల్  పాడిన యీ పాట చాలా బావుంటుంది. చూడటానికి అంత బాగుండదు కానీ ..సాహిత్య పరంగానూ సంగీతపరంగానూ ..ఒకసారి వింటే పదే పదే పెదాలపై నాట్యమాడే పాట. చాలాకాలం నుండి కాస్త రాద్దామనుకుని కూడా బాగా బద్దకించి .. ఇప్పుడు మళ్ళీ పాట వింటూ .. పరిచయం చేయాలనిపించిన పాట. అనువాదం perfect గా కుదిరందని చెప్పలేను కానీ కిందా మీదా పడి ఫ్రెండ్ సాయం తీసుకుని  బాగానే ప్రయత్నం చేసాను. చూడండి ..

zeher అనే చిత్రంలో పాట యిది. zeher అంటే poison అని అర్ధం. హిందీలో hum అని ఎవరికీ వారు గౌరవించుకుంటారు. మనం తెలుగులోకి  స్వేచ్చానువాదం  చేసుకున్నప్పుడు నేను అనే  చెప్పుకోవాలి కదా !

 చిత్రం : జెహెర్ (Zeher)
అగర్ తుమ్ మిల్ జావో  (agar tum mil jao)
సాహిత్యం : సయీద్ క్వాద్రి   (Sayeed Quadri)
సంగీతం: అను మాలిక్ (Anu Malik)

ఒకవేళ నువ్వు దొరికావో .. ఈ ప్రపంచాన్ని వదిలివేస్తా
నిన్ను పొంది లోకంతో సంబంధాన్ని తెంచుకుంటాను  
ఒకవేళ నువ్వు గనుక దొరికావే అనుకో ..ఈ ప్రపంచాన్ని వదిలేస్తా  2 

నిన్ను తప్ప (కాకుండా ) యే యితర అందాన్ని చూడను  2 
నీకేదైతే యిష్టం వుండదో ఇక దానివైపు మరోసారి చూడను 
ఎందులోనైనా నీ రూపం లేకపోతే (గోచరించకపోతే) 2 
ఆ అద్దాన్ని పగలగొడతాను నేను 
నువ్వు గనుక దొరికితే  యీ ప్రపంచాన్నే వదిలేస్తా 

నీ హృదయంలో నివసిస్తాను 
నిన్నే నా ఇల్లుగా మార్చుకుంటాను (తయారుచేసుకుంటాను ) 
నీ తలపులనే నగలుగా నాపై అలకరించుకుంటాను 
ఒట్టు నీ మీద వొట్టు 
ఆన నీపై ఆన 
తలరాత (యొక్క రూపాన్ని ) మలుపును మారుస్తాను నేను 
నువ్వు గనుక దొరికితే ఈ ప్రపంచాన్నే వదిలేస్తాను నేను 

నిన్ను నేను నా శరీరంలో ప్రాణంగా యే విధంగా నిలుపుకుంటాను అంటే 
భగవంతుడితో కూడా విడదీయలేనటువంటి సంబంధాన్ని ఏర్పరుచుకుంటాను (కలుపుకుంటాను ) మీతో 
నువ్వు గనుక దొరికినట్లయితే ప్రపంచాన్నే వదిలేస్తాను 
నిన్ను పొంది లోకంతో సంబంధాన్ని తెంచుకుంటాను . 
నీ పరిమళం నా దేహం యొక్క పరిమళముగా మార్చుకుంటాను 

ఒకవేళ నువ్వు దొరికావో .. ఈ ప్రపంచాన్ని వదిలివేస్తా
నిన్ను పొంది లోకంతో సంబంధాన్ని తెంచుకుంటాను

హిందీ మూలం

अगर तुम मिल जाओ
ज़माना छोड़ देंगे हम

तुम्हें पा कर ज़माने भर से रिश्ता तोड़ देंगे हम

अगर तुम मिल जाओ
ज़माना छोड़ देंगे हम

बिना तेरे कोई दिलकश नज़ारा हम ना देखेंगे (x2)
तुम्हें ना हो पसंद उसको दोबारा हम ना देखेंगे
तेरी सूरत ना हो जिस में (x2)
वो शिशा तोड़ देंगे हम

अगर तुम मिल जाओ
ज़माना छोड़ देंगे हम

तेरे दिल में रहेंगे, तुझको अपना घर बना लेंगे (x2)
तेरे ख़्वाबों को गहनों की तरह खुद पर सजा लेंगे
कसम तेरी कसम (x2)
तकदीर का रूख मोड़ देंगे हम
अगर तुम मिल जाओ
ज़माना छोड़ देंगे हम

तुम्हें हम अपने जिस्म-ओ-जान में कुछ ऐसे बसा लेंगे (x2)
तेरी खुशबू अपने जिस्म की खुशबू बना लेंगे
खुदा से भी ना जो टूटे (x2)
वो रिश्ता जोड़ लेंगे हम

अगर तुम मिल जाओ
ज़माना छोड़ देंगे हम
तुम्हें पा कर ज़माने भर से रिश्ता तोड़ देंगे हम