10, మే 2021, సోమవారం

వారియర్

 మరణాలు అనేకం

క్షణ క్షణం చచ్చి బతికే మానసిక మరణాలు

అవమాన భారంతో తలొంచినపుడే  తగిలిన శరాఘాత మరణాలు

వణికించే సంఘటనల సమాహారాల మధ్య భయవిహల్వురులై మరణించిన క్షణాలు

అనారోగ్యాల మధ్య బయాప్సి రిపోర్ట్ చేతికందేలోపు కలిగే గుబులు మరణాలు

అన్నీ మరణ సదృశ్యాలే. 


 అమ్మ గర్భం నుండి యుద్ద కవచం తొడుక్కున్నట్లు 

శ్వాస తీసుకున్న క్షణం నుండి శ్వాస ఆగే వరకూ నీడలా వెంటాడుతున్న మరణభయం. 

ఆ భయం నీది నాది మనందరిది మన వారిదందరిది.

పోరాడటం మర్చిపోతే ఆ క్షణమే నువ్వు మరణించినట్లు. 

యోధుడా/యోధురాలా.. 

చలించే నీ దేహం కోసం   

శ్వాశించే నీ ఆశల కోసం.. నీ దేహం లోపల సూక్ష్మ యుద్దం చేయి. 

ఆలోచనతో  అలసిపోని చీకటి యుద్దం చేయి. 

ప్రాణం నీదే ప్రయాణం నీదే

నీలో వున్న శత్రువుతో యుద్ధం చేయి. 

అలసి మరణ సంతకం చేసేవనుకో భీతితో అదే బాటలో 

మరిన్ని మృత్యు ఘంటికలు  మ్రోగుతూనే వుంటాయి

రణ క్షేత్రంలో పడి లేచిన యోధుడా/యోధురాలా 

మరణ భయాన్ని జయించి రా.. 

కణ కణంతో కరోన ని జయించి రా.. 

యూ ఆర్ ఏ వారియర్.. 

 ఐ యామ్ ఏ వారియర్.

కరోన ఆలోచనలు

 దృశ్య మాధ్యమం

అనేకానేక జాగ్రత్తల మధ్య 

భయాన్ని తాగి బెంగను మింగి 

వణుకు దుప్పటి కప్పుకుని హాయిగా నిద్రించమంటుంది. 

కంటికి కనిపించని ఆ.. 

సూక్ష్మ క్రిమి కన్నా పెద్ద భూతం ఇది.  


*****

లాలి జో లాలీ జో

ఒణికిపోతున్న మనుషజాతిని నిద్ర పుచ్చటానికి 

చల్లనైన అమ్మ స్పర్శ శ్రావ్యమైన లాలి పాట అత్యవసరమిపుడు

*****

తోచితోయనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందంట అనే సామెత యేమో కానీ పక్కింటి వైపు చూడటానికి  ఆవైపు నుండి వచ్చే గాలి పీల్చడానికి కూడా భయం పుడుతుంది. మనుషులు చేయడానికి యే పని లేకనే లేక సామాజిక బాధ్యత అనుకునో విపరీతమైన దోరణిలో  వార్తలు విషయాలు పంచుతూ వుంటారు. మానసిక వత్తిడి కూడా కావచ్చు. కానీ ఆ వార్తలు సంఖ్యలు అవగాహన పేరిట అనేక విభిన్నమైన అంశాలు చదవడం వినడం చూడటం వల్ల  భయం కల్గుతుంది. అందరికీ విజ్ఞప్తి. మహమ్మారికి తలవొంచి మౌనంగా  నిశ్శబ్దంగా వీలైనంత వొంటరిగా వుందాము. ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకుందాం. అందరికీ మనవి...



భయోత్పాతం సృష్టించవలదు 🙏

కరోన ఉక్కుపాదం క్రింద బంధువులు స్నేహితులు అభిమాన నాయకులు నలిగిపోతే దయచేసి ఆ వార్తలు ఇక్కడ share చేయకండి. వీలైతే ఫేస్ బుక్ లేనప్పుడు ఏం చేసేవారో అది చేయండి. 

భయోత్పాతం సృష్టించడం తగదు. మాస్క్ పెట్టుకోవడం ఎంతఅవసరమో మరణించిన వారికి ఇక్కడ నివాళులు అర్పించడం అంత అనవసరం. 

దయచేసి.. అర్దం చేసుకోండి. నెగిటివ్ వైబ్రేషన్ వలన మానసిక ఆరోగ్యం పాడైపోయే వాళ్ళు భయంతో మానసికంగా కుదేలైన వాళ్ళు కోకొల్లలు. 

సామాజిక హితం కోసం ఈ రెండు పనులు చేయండి ప్లీజ్.. 🙏🙏