5, నవంబర్ 2021, శుక్రవారం

మేఘ రాగమ్

 మేఘ రాగమ్ -1

(ఇంట్రో)

నీలాంజనా… అపుడపుడూ ఇలాగే ఉత్తరాలు వ్రాసుకుందాం. కలలను విశ్లేషించుకుందాం. ఆకాంక్షలను వెల్లడించుకుందాం.మనసు విప్పి అనేక విషయాలు ముచ్చటించుకుందాం. మనచుట్టూ కమ్ముకుంటున్న భయానక వాతావరణాన్ని చెదరగొట్టుకుందాం. అపోహలు తొలగించుకుందాం. జీవితాల చుట్టూ అలుముకున్న వేదనలను కరిగించుకుందాం. ఇతరుల కోసం కురిసే కన్నీరవుదామ్ చిలకరించుకునే పన్నీరవుదామ్. ఇదే మేఘ రాగమ్.

ప్రియ నేస్తం నీలాంజనా..

ఎలా వున్నావు! మనసారా మాట్లాడుకుని చాలా కాలమైంది కదా.. అందుకే ఈ ఉత్తరం. అయినా ఉత్తరాలు చదువుకునే తీరిక ఎక్కడుంది చెప్పు. మన వాట్సాప్ స్టేటస్ చూసుకుని ఓ మెసేజ్ అటునిటూ ప్రవహిస్తూ వుంటే చాలు ఎంతెంత దూరమైనా చెంతనే వున్నట్టు అదో భరోసా నిశ్చింతానూ!  మన తరం ఒక విధంగా దురదృష్టవంతులం. నిన్నైతే అనలేను కానీ నా గురించే నేను చెబుతున్నా. ముందుగా నీతో పోల్చుకుంటూ.. నా ఆలోచనలు నీతోనే  పంచుకుంటూ.. 


ఎనబై యేళ్ళు దాటిన అత్తగారైన వృద్దురాలి సేవలో అంకితమైన నిన్ను చూస్తుంటే.. గర్వం కల్గుతుంది.  నా ఊహాచిత్రంలో పసిపాపల సేవలో నిమగ్నమైన ఓ తల్లి గోచరిస్తుంది.

కానీ నన్ను  నీతో పోల్చుకుంటే సిగ్గేస్తుంది. ఎందుకంటావా? డెబ్బై పైబడిన నాన్నను ఎనబై దాటేసిన అత్తమ్మను చూసుకో లేనందుకు. వారికి కనీసం ఓ కప్పు కాఫీ నో టీ నో తయారుచేసి చేతికి అందివ్వలేని స్థితిలో వున్నందుకు. వారు వారి గృహాలను అలవాట్లను వారికి నచ్చిన మెచ్చిన సౌకర్యాలనూ వొదిలి ఈ అపార్ట్మెంట్ సంస్కృతిలో  ఇమడలేమని  బాహాటంగా అంటుంటారు.ఆర్దిక బలిమి వున్న వారిద్దరూ  వారి ఇగోలను వొదలలేరు. అందుకే వారిని నేను బలవంతం చేయడం లేదు. అలా అని వొంటరిగా మిగిలిన  నేనూ వెళ్ళి వారివద్ద వుండనూలేను. అటు బిడ్డలకు ఇటు పెద్దలకూ మధ్య మన తరం వారు వారధులమే కానీ ఎవరూ ఎవరితోనో కలిసి జీవించలేని కాలంతో యాంత్రికంగా బ్రతకడం అలవాటైపోయింది. ఇది ఆర్ధికంగా ఇబ్బందులు లేని వృద్దజీవనంలో ఒక పార్శ్వమైతే మరొక పార్శ్వం బీదరికంతో అలమటిస్తున్న వృద్దుల జీవితాలు.


నన్ను ఈ మధ్య అతిగా కదిల్చివేసిన సంఘటన  ఏమిటంటే వృద్దాప్యంలో వున్న తల్లిని ఆదరించలేక కన్నబిడ్డే స్మశానవాటికలో వదిలివెళ్ళిన కథనం చూసి మనసు విచలితమైపోయింది. అది చూసిన తర్వాతే చాలా విషయాలు నీతో పంచుకోవాలనిపిస్తుంది.  అసలు మన వృద్దాప్యం గురించి మనమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నామో తెలుసుకుంటూ ఇంకేమి తీసుకోవాలో అని ఆలోచిస్తూ వున్నాను. 


పూలను సృష్టించినవాడే తుమ్మెదలను సీతాకోకచిలకలను సృష్టించాడు కానీ గొడ్డలిని సృష్టించలేదు.. అన్నానొక సందర్భంలో.  ప్రకృతిని గౌరవించినట్లే మన ఉనికికి కారణమైన తల్లిదండ్రులను గౌరవించడంలో సంరక్షించుకోవడంలో మనమెందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాం నిర్దాక్షిణ్యంగా వుంటున్నాం!? నిజంగా అంత అసహాయతలో మునిగిపోయామా లేక అశ్రద్ద చేస్తున్నామా? అనిపిస్తుంది. 


పెద్దలున్న పంచన సిరులు తాండవిస్తాయని పెద్దల మాట. అది నిజమని చాలామంది అంగీకరిస్తారు. కానీ బిడ్డలెందుకు ఇంత కాఠిన్యంగా వుంటున్నారు? నానాటికి లక్షలమంది జీవితాలు ఎందుకింత దుర్భరంగా మారుతున్నాయి. నిరుద్యోగం పేదరికం నియంత్రణ లేని ధరలు ఆర్ధిక అసమానతలు ఉగ్రవాదం ప్రకృతి వైపరీత్యాలు కాలుష్యం ధన వ్యామోహం విశృంఖలమైన స్వేచ్ఛా జీవనం మత్తుపదార్దాల సేవనం ఇంకా ఇంకా అనేక కారణాలతో మనిషి జీవితం నానాటికీ కుంచించుకుపోతుంది. మానసిక శారీరక అనారోగ్యాలతో మనిషి విలవిలలాడుతున్నాడు. వృద్దాప్యం అయితే ఇక చెప్పనవసరం లేదు.


ముడుతలు పడిన శరీరంతో  శక్తి సన్నగిల్లబడిన దేహంతో వొకింత వేగం మందగించిన నడకలో  నరాల మధ్య ప్రవహించే రక్తంలో ఆవేశం అణిగి నెమ్మది సంతరించుకున్న ఆలోచనల్లోని అనుభవసారాన్ని విప్పి చెప్పే గళాలను వినే ఆసక్తి సమయం మనకు లేవు. వృద్దాప్యాన్ని బాల్యాన్ని ముడిపెట్టి  నిశ్చింతగా మనగల్గే  కుటుంబ భద్రత మనకు కరువైంది. వ్యక్తి స్వేచ్ఛకు దాసోహం అయిపోయిన మనం చిన్న మందలింపును తట్టుకోలేకపోతున్నాం. ఎడగారు పిల్లలే కాదు  ఎడగారు తల్లిదండ్రులు అయిపోతున్నారందరూ.. 


ఊరు పొమ్మంటుంది కాడు రావద్దు అంటుంది ఏం చెయ్యాలి అని దీనంగా వేడుకునే పేద వృద్దుల ఆవేదన కలచివేస్తుంది. కనిపెంచిన బిడ్డలే తల్లిదండ్రులను ఆదరించక రాక్షసుల మాదిరిగా ప్రవర్తిస్తుంటే వారికి ఎంత వేదన. ఆ మూగరోదనలు నిస్తేజంతో కన్నీరు ఇంకిన గాజు కళ్ళు మేమింకా ఎందుకు బ్రతికివున్నాం భగవంతుడా! అని  విలపించే రోదనలు వారి వేడికోళ్ళు హృదయఘోష వినగల్గే బిడ్డలు అయినవాళ్ళు ఎందరు? వృద్దాప్యం ఎంత శాపం!?


మనుషులు ఇంత కరుడుగట్టిన కాఠిన్యంతో ఎలా బ్రతకగల్గుతారు అనే ఆశ్చర్యం వేస్తుంది. పుట్టుకముందు మనచుట్టూ కొన్ని ఆశలు మమకారాలు అల్లుకునివుంటాయి. పుట్టాక యెదుగుదల క్రమంలో జాగ్రత్తలు ఆంక్షలు ఆకాంక్షలు వుంటాయి. అధికారాలు అహాలు అసక్తతలూ నిస్సహాయాలు ప్రేమరాహిత్యం అన్నీ భరిస్తూనే వృద్దాప్యపు వొడ్డుకు యెప్పుడొచ్చి చేరుకుంటారో కదా! తరచిచూసుకుంటే యెన్నో అసంత్రుప్తులు ఆవేదనలూ ఆరోపణలూనూ.  ఎవరిమీదో ఒకరిమీద ఆధారపడే స్థితిలో ఎన్ని ఆలోచనలూ ఎంత వేదన!


వృద్ధాప్యం ఓ శాపం కాదు, వ్యాధి కాదు, అది రెండో బాల్యం’’ అన్నారట తిరుపతి వేంకట కవులు.

మన భారతదేశంలో పదహారు కోట్ల మంది వృద్ధులు బిడ్డల నిర్లక్ష్యాలకు గురైన వారు అనాధలగా వున్నారట. తల్లిదండ్రులను దేవతలుగా భావిస్తారనుకునే ఈ దేశంలో కుటుంబజీవనానికి గొప్ప చిరునామా అనుకున్న మనదేశంలో ఉన్న పరిస్థితి ఇది. ప్రపంచ వ్యాప్తంగా కూడా వృద్దులను నిర్లక్ష్యం చేస్తున్నారు.  నిజం చెప్పాలంటే ఇది ఉగ్రవాదం లాంటి ముఖ్యమైన సమస్య. 

 

వృద్దులు పిడికెడు మెతుకుల కోసం పెట్టే ఆకలి కేకలు రోగగ్రస్త శరీరాలతో వారి ఆలాపనలు  అరుపులు ఈ ప్రపంచానికి వినబడదు వినిపించుకోదూ.   వారి అరుపులు వారికే  ప్రతిధ్వనులతో  వినబడి  జీవితంపై అసహనం అసహ్యం పుట్టిస్తుందట. ఆ అసహాయ జీవం పిడికెడు ప్రేమ కోసం తహతహలాడుతూ  చకోరంలా ఎదురుచూస్తుంది. తుదకు  ఏదో ఒకనాడు మరణిస్తుంది. 


మా పక్కన నివసించే ఒక వృద్దజంటను గమనిస్తూ వుంటాను. బిడ్డలతో అంటీముట్టనట్లు వుంటారని అనుకునేదాన్ని. కానీ కరోనా కాలంలో బిడ్డల క్షేమం కోసం వారు ఎంత అలమటించారో. బిడ్డలు వారి క్షేమసమాచారం ఎలానూ విచారించలేదు కానీ వారు ఎంత ఆత్రుత ప్రదర్శించారో తెలుసా! వారికి అయినవాళ్ళపై బిడ్డల ప్రవర్తనపై విసుగు విరక్తి రెండూ వచ్చాక మనుషులను వద్దనుకోవటం మరణించడం కన్నా తక్కువేమీ కాదు. చుట్టూ వున్న మనుషులు చెప్పాపెట్టకుండా మాయమైపోతున్నప్పుడు మనతో అనుబంధం వున్న మనుషులు హఠాత్తుగా గుర్తుకు వచ్చి  అయినవారికి గుబులు పుట్టిస్తారనుకుంటా.  ఆ వృద్దులిరువురూ ఆత్రుతగా వారి కుశలం అడగాలని ఫోన్ పట్టుకుని మళ్ళీ అంతలోనే ఆగిపోవడం. అపుడు నాకనిపించింది మనుషులు సంకోచాలను జయించడం అనుకున్నంత తేలికైన విషయం కాదు. సంకోచం జయించినపుడు వచ్చే స్వేచ్ఛ ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు కానీ కచ్చితంగా సంతోషాన్ని మాత్రం ఇస్తుంది కదా అని. 


తల్లిదండ్రులను ధనం కోసం పీడించే పిల్లలూ వున్నారు. వారు ఆశించినవి

ఇవ్వడం కూడా అంత తేలికైన విషయమూ కాదు. అది శారీరక శ్రమా వస్తు రూపమా వడ్డీ రూపమా స్థిరచరాస్తులా అన్నది కాదు. అన్నింటి మీద తన హక్కులో ఇతరుల హక్కులో ఇష్టాలో అయిష్టాలో యెన్ని కలగాపులగమై వుంటాయసలు. ఇవ్వలేదని నిరసన అలక ఆరోపణ అన్నీ ఏదో ఒక రూపంలో వ్యక్తమవుతూ వుంటాయి. అవి  వృద్దుల మనసుకు తెలుస్తుంటాయి. మేమేం బండరాళ్ళం కాదుగా.  బిడ్డల మాటలు  ప్రవర్తన  లోపలి మనిషిని పట్టిస్తాయి. ఒకవేళ వాటిని అవసరం మేర దాపెట్టినా మేము చూసింది విన్నది నిజం కాదనీ తెలుస్తూనే వుంటుంది.  ఎందుకు ఇంత బాధని వున్నదంతా ఇచ్చేసాము,  ఇక తర్వాత మా ముఖం చూసినవాళ్ళే లేరు అని వాపోయారు.  ఇలా అన్నీ బిడ్డలకిచ్చేసి అనాదరణకు గురైన అనాధలైన వృద్దుల గుండెల్లో చెప్పలేని కథలెన్నో.. అందుకే అంటున్నా, మన పూర్వులు చేసిన తప్పులు మనం చేయకుండా మనకోసం మనం కొంత సమయం కేటాయించుకుని అందులో లీనమైపోదాం.వీలైనంతగా బిడ్డల మీద ఆధారపడకుండా గౌరవంగా జీవనం సాగించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి అని. ఉరుకుల పరుగుల జీవనంలో యెపుడైనా మన కోసం మనం ఆగి చూసుకున్నామా అని విచారపడుతున్నాను కూడా.


కూటికిగుడ్డకు నోచుకోని నిరాదరణ పాలైన వృద్దులు దిక్కులేని రెక్కలు విరిగిన పక్షులై దీనస్థితిలో పుట్ పాత్ లపైన స్మశానాల పంచన కాలం వెళ్ళదీస్తూ యెంతకూ రాని మరణం కోసం దుఃఖిస్తూ కన్నీరు కూడా రాని గాజుకళ్ళతో నిర్వేదంగా చూస్తున్న చూపుతో కలవరపెడతారు. ఎవరిదీ నిర్లక్ష్యం. ఎవరిదీ పాపం!? ఎక్కడుందీ మానవత్వం. వీరిని సేవించడానికి ఆకలి నింపడానికి యెన్ని ఆపన్నహస్తాలు కావాలి.అమెరికాలో మరికొన్ని దేశాలలో లాగా వృద్ధుల భాద్యతను ప్రభుత్వాలు తీసుకుంటే బాగుంటుందేమో!


పిల్లలు కూడా ఎంతసేపూ వారి వారి వ్యక్తిగత అభిరుచులకూ ఆకాంక్షలకూ అనుగుణంగా నడుచుకోవడమే తప్ప ఇతరుల గురించి ఆలోచించడం అంటే మానేసారు సరే.. కన్న తల్లి తండ్రి రక్త సంబంధం గురించి కూడా ఆలోచించకుండా వుండటం యెంతవరకూ సబబు అనుకుంటున్నాను.  వృద్దురాలైన తల్లికి గ్లాసుడు పాలు కొనడానికి డబ్బులేదన్న కొడుకు  పట్టుమని పదేళ్ళు లేని  తన పిల్లల కోసం మేకప్ కిట్ ల కోసం వేలకువేలు ఖర్చు పెట్టడం వింతగా తోసింది. ఏ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాం మనం. ఎంత విచారంగా వుంటుందో ఇవ్వన్నీ చూస్తుంటే.


ఇంకొక విషయం చెబుతాను విను. ఒక స్త్రీ మూర్తి కథ ఇది. నాకు పిన్ని  వరుస అవుతారు ఆమె. కొడుకు ఆమె ఆశలకు విభిన్నంగా వివాహం చేసుకున్నాడు. దానిని ఆమె దశాబ్దాలుగా అంగీకరించలేదు జీర్ణం చేసుకోలేదు. అనారోగ్యం కల్గితే ఆసుపత్రికి కూడా వెళ్లదు.ఆమెకు పిసినారితనం లేదా డబ్బు వెసులుబాటు లేకపోవడమేమో కాదు. తనకు తనమీద శ్రద్ద లేకపోవడం,  ఆసుపత్రికి వెళ్ళడం పట్ల అయిష్టత,బద్దకం, నిర్లిప్తత కూడా కావచ్చేమో.  కానీ ఆమె పెదవులపై ఎపుడూ ఆరోపణ కొడుకుపై కోడలిపై భర్తపై ఆఖరికి ఆమెపై ఆమెకు కూడా. మనకు వొకరు చేసే అన్యాయం కన్నా మనకు మనం చేసుకునే అన్యాయం ఎక్కువ అని చెప్పాలనిపించింది. మనుషులు పైకి కనబడేదానికన్నా అంతర్గతంగా విభిన్నమైన వాళ్ళు. వాళ్ళు హఠాత్తుగా  షాక్ యిస్తూ వుంటారు. నిజమా నిజమా అని మనం పదే పదే గిచ్చి చూసుకునేంతగా. అందుకే ఎవరిపైనా కచ్చితమైన అంచనాలు పెట్టుకోకూడదు.  బిడ్డలైనా సరే వారిని గుడ్డిగా నమ్మకూడదూ.  నమ్మకం పక్కన అపనమ్మకం వుండాలి పొర క్రింద పొరలా. మనుషుల మధ్యే కాదు బంధాల మధ్య కూడా ధనం ప్రవేశించి నీకింత సేవ చేస్తే నాకెంత ఇస్తావు అని అడగటాన్ని సహజంగా తీసుకోవాల్సి వస్తుంది. అమ్మనాన్నలంటే ఆఖరి రక్తం బొట్టు వరకూ ఉదాత్తంగా ఇచ్చేవారే కదా..అది మరుస్తుంది పిల్లల లోకం.


అప్రయత్నంగా ఎప్పుడో చదివిన కథలు గుర్తొచ్చాయి “రుకైయ్యా రీహానా” ఉర్దూ రచయిత వ్రాసిన “తల్లి” కథను నేనెప్పటికీ మర్చిపోలేను. ఇంకో కథ “జహీదా హీనా” అనే రచయిత వ్రాసిన “తితిలియోం దూండ్నే వాలే” అన్న కథ తెలుగు అనువాదంలో “నిష్క్రమణం” అనే శీర్షికతో చదివినపుడు ఎంత కదిలిపోయానో. అలాగే ఇటీవల చదివిన తమిళ రచయిత  “పెరుమాళ్ మురుగన్” వ్రాసిన అమ్మ కథ ఎంత హృద్యంగా వున్నాయో!  వాటిని చదివిన మనుషులెవ్వరూ అమ్మనాన్నలను నిర్లక్ష్యం చేయరు అనిపించింది. నేను చదివిన అత్యుత్తమ తల్లిదండ్రుల కథలను సంపుటిగా వేసి పంచిపెట్టాలనిపిస్తూ వుంటుంది. ప్రేమ కథలు కాదు ఇపుడు కావాల్సింది. తల్లిదండ్రులను వృద్దులనూ ప్రేమించి ఆదరించే విధంగా కఠినశిలగా మారిన హృదయాలను తుత్తునియలు చేసే సాహిత్యం సినిమాలు చిన్న చిత్రాలు రావాల్సిన అవసరం వుంది. వీధి కుక్కల కళేబరాలవలె దిక్కుమొక్కు లేని అనాధ శవాలుగా మనుషులు మిగలకూడదని నా ఆశ ఆకాంక్ష. మీ అత్తగారితో పాటు అమ్మను కూడా మీ ఇంటికి తెచ్చుకుని ఆమెకూ నీ సేవనూ ప్రేమాప్యాయతలనూ పంచిపెట్టాలని కూతురివైతే మాత్రం ఏమిటీ అమ్మను చూడటం కూడా నీ భాద్యతే కదా అని నీకు గుర్తుచేయాలని అనిపించింది. 


జీవిత తీరం దాటడానికి ఏం కావాలి చెప్పు? ఓ  రెండు చాలు. పిడికెడంత ప్రేమ చిటికెడంత ఓదార్పు. వృద్దాప్యాన్ని  అదే రెండో బాల్యాన్ని మన బిడ్డల బాల్యాన్ని కాపాడినట్లు పదిలంగా కాపాడుకుందాం. అదే మనం చూపే అసలైన ప్రేమ భాద్యత. వృద్దులను వినడం ఒక వరం చాదస్తపు కబుర్లు అని కొట్టి పడేయకుండా మనసుపెట్టి వింటే ఎన్నెన్ని అనుభవపాఠాలు అనుకున్నావు. వారి కబుర్లలో చరిత్ర దాగివుంటుంది.లోకరీతి వుంటుంది.వారు అధిగమించిన అవరోధాలు వారి త్యాగాలు కఠినమైన మాట వెనుక దాగున్న మంచి విషయాలు ఇలా ఎన్నెన్నో. 

వృద్దుల అనుభవాలు జీవనసారం. వారి మాటను పెడచెవిన పెట్టకుండా విని ఆలోచిస్తే మంచి జరుగుతుంది అని నమ్మేదాన్ని. ఇప్పటికీ నమ్ముతాను. వృద్దుల కౌన్సిలింగ్ యువతను పెడత్రోవ పట్టకుండా కాపాడుతుంది. నాయనమ్మలను అమ్మమ్మలను తాతయ్యలను మీ పిల్లలకు కానుకలుగా ఇవ్వండి అని విదేశీ తల్లిదండ్రులకు చెప్పి చెప్పి వెగటు కల్గిస్తున్నానట. నా కొడుకు   హాస్యంగా చేసే ఆరోపణ. ఇపుడు నువ్వేమంటావో! 


చివరగా మనుషులైన వారందరిని ఒకటే కోరుకుందాం...


“మిమ్మలను ప్రేమించే వారి హృదయాలను ఎప్పుడూ గాయపర్చకండి. 


ఎందుకంటే వారు మిమ్మల్ని యేమీ అనలేరు. 


మౌనంగా మీ జీవితం నుండి నిష్క్రమించడం తప్ప.” అని. 


వృద్దుల యొక్క  సంతోషపు జీవనసూచికతో  మాత్రమే కుటుంబానికి అర్దాన్ని దేశానికి అభివృద్దిని ప్రపంచానికి శాంతిని కనుగొనగల్గం అనిపిస్తుంది. 


                                                                                    ఉంటాను మరి..

                                                                                 ప్రేమతో నీ ప్రియ నేస్తం 

                                                                                        “అమృత”




కామెంట్‌లు లేవు: