27, మార్చి 2023, సోమవారం

రైటర్ పద్మభూషణ్

 


వర్ధమాన రచయిత కథ లో … లోపలి కథ యిది. ఎంతో బాగుంది.. ఇప్పుడే చూడటం ముగించాను. మనసు తడి కనుల నీరు. 

ఈ కథలో పద్మ భూషణ్ వొక వర్ధమాన రచయిత. స్నేహితుడి సాయంతో వడ్డీకి డబ్బులు తెచ్చి ఒక పుస్తకం ప్రచురిస్తాడు. గొప్ప పేరు వచ్చేవరకూ యింట్లో ఆ విషయం తెలియనివ్వకూడదు అనుకొంటాడు. కానీ అతని పుస్తకాలు అమ్ముడుపోక ప్రోత్సాహం లేక నిరాశపడుతుంటాడు. పద్మభూషణ్  తల్లిదండ్రులతో కలసి బంధువుల ఇంటికి ఓ శుభకార్యానికి వెళతాడు. అక్కడ ఒక కొత్తపుస్తకం రచయితగా బంధువులకు పరిచయం అవుతాడు. అతని పేరిట వొక బ్లాగ్ కూడా నిర్వహించబడుతుంది అని  అతనికి షాకింగ్ గా తెలుస్తుంది. రచయితలు అంటే గౌరవం వున్న  బంధువు మామయ్య తన కూతురిని  ఫణిభూషణ్ కిచ్చి  వివాహం చేస్తానంటాడు. ఎంగేజ్ మెంట్ కూడా  నిశ్చయింపబడుతుంది. ఆ శుభముహూర్తంలో బ్లాగ్ లో రాయబడుతున్న ధారావాహిక రచనను పుస్తకంగా ప్రచురించి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లో ఆవిష్కరణ చేయాలనే తన ఆలోచనను వెలిబుచ్చుతాడు కాబోయే మామగారు.  

ఫణిభూషణ్ లో   టెన్షన్ మొదలవుతుంది.  నేను రాయని రెండో పుస్తకం నా పేరున యెందుకు ప్రచురించారు.? అసలు ఆ పుస్తకం రాసి ప్రచురించింది యెవరు? బ్లాగ్ కూడా యెవరు రాస్తున్నారనే సందేహం వస్తుంది కానీ బ్లాగ్ లో  రచన ఏ ఇబ్బంది లేకుండా సాగిపోతుంది కదా.. అదే ప్రింట్ లోకి వెళుతుందని రిలాక్స్ గా వుంటూ కాబోయే వధువుతో షికార్లు చేస్తూవుంటాడు. అంతలోకి షడన్ గా  బ్లాగ్ లో రచన ఆగిపోతుంది. ఎగేంజ్మెంట్ తేది దగ్గరకు వస్తూ వుంటుంది… 

తర్వాత కథ యెలా నడుస్తుందనేదే… సినిమాలో ముఖ్యభాగం.

ఇక ఫణిభూషణ్ తల్లి సరస్వతి. చిన్నతనంలో క్లాస్ లో టీచర్ అడిగిన ప్రశ్నకు నేను రచయిత ను అవుతాను. నాకు కథలు రాయడమంటే చాలా యిష్టం అని చెప్పిన ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పెరిగి పెద్దదై పెళ్ళైన తర్వాత సగటు భారతీయ యిల్లాలి  గానే  ఆమె ఆశలు ఇష్టాలు   అణచివేయబడతాయి. 

సినిమా ఆఖరిలో.. 
అమ్మాయిలకు యెన్ని కలలున్నా.. 
 “మధ్యలో పెళ్ళనేది  వొకటి వుంటుంది” కదా! అది అన్ని కోరికలను అణచివేస్తుంది… అంటుంది సరస్వతి. 

కుటుంబంలో స్త్రీ లను పెళ్ళైన తర్వాత అమ్మాయిలను ఇంట్లో యెవరైనా నువ్వేం కావాలనుకుంటున్నావ్ అని అడిగి వుంటారా? ఒకవేళ వారి ప్రతిభ వెలిబుస్తే తగిన ప్రోత్సాహం లభిస్తుందా?  

మంచి  ప్రశ్నలతోనూ పాజిటివ్. సందేశంతోనూ ముగుస్తుంది కథ. 

చిత్రీకరణ 90% విజయవాడ లోనే చిత్రీకరించిన సినిమా.. నాకు చాలా నచ్చింది. కొత్త నటీనటులే.. కానీ కథ సినిమాకి మూలాధారం. చూడటానికి హాయిగా వుంది. విడుదలై రెండు నెలలు దాటింది కాబట్టి చాలామంది చూసేవుంటారు. రివ్యూ లు కూడా వచ్చే వుంటాయి. పరిచయం చేయాలనిపించి చేసాను. ఒక గృహిణిగా రైటర్ గా నేను బాగా కనెక్ట్ అయ్యాను ఈ సినిమాకి.

వీలైతే మీరు కూడా చూడండి. Zee 5 లో వుంది సినిమా.. 


కామెంట్‌లు లేవు: