15, ఫిబ్రవరి 2011, మంగళవారం

."వలపెరుగని బ్రతుకు కన్న వలచి విలపించిన బ్రతుకు మిన్న"అని.. ఆ భావ కవి.....


అమ్మగా చల్లగా కనిపెంచేది,బ్రహ్మని సైతం కని పెంచేది

ప్రపంచ ప్రేమికుల దినోత్శవం ప్రపంచం అంతా ఏమో కానీ గత ఏడాదిలాగే  ఈ ఏడాది  జరిగిపోయింది. 
ప్రేమ సంగతి బట్టబయలు అయ్యే సంగతి అటు ఉంచి .. అవాచింత పెళ్లి బెడదతో.. ప్రేమికులు భయపడిపోయి రహస్యంగా.. ఉండిపోయారని నా యంగ్ ఫ్రెండ్ ఒకరు వాపోయారు.

"వలపెరుగని బ్రతుకు కన్న వలచి విలపించిన బ్రతుకు మిన్న"అని.. ఆ భావ కవి.. చెప్పిన తర్వాత టైం పాస్ ప్రేమలు..తొ టీన్ఏజ్ ని అవలీలగా దాటేసే ఈ నాటి  యువతకి ప్రేమ విలువని  ఒక  పాట ద్వారా ఒక సందేశాన్ని ఇవ్వాలని.. ఒక రోజు తర్వాత నా ఈ..వాచాలత్వం.

నిజమైన ప్రేమకి అర్ధం తెలిపే వాళ్ళుంటే.. నన్నుక్షమించాలి. "వేటూరి" ని అమితంగా అభిమానించే వారికి.. ఈ పాట తెలియకుండా ఉండదు.అందులో.. ఇది "జంద్యాల" గారి చిత్రం కూడా.. వేటూరి గారి జయంతి రోజునైనా.. ఈ పాటని ఒక్కరు తలచుకోలేదు.అందరి దృష్టి పేరు పొందిన పాటలపైనే కదా!

 నా బ్లాగ్ కి ఇప్పటికే పాటల బ్లాగ్ అని పేరు పడిందని అనిపించి.. పాటల్ని పరిచయం చేయడం తగ్గించే ప్రయత్నంలో.. విలువైన పాటలని పరిచయం చేయలేకపోతున్నాను.ఈరోజు సందర్భోచితంగా..ఈ పాట. "రెండు జెళ్ళ సీత"  అనే చిత్రం లోది. రమేష్ నాయుడు  గారి స్వర   కల్పన.

మందారంలో  ఘుమఘుమలై..
మకరందంలో..మధురిమలై..
మంత్రక్షరమై వినిపించేది..
మనమే మనమై జీవించేది.. ప్రేమ... ప్రేమ....

గంగాలాగా పొంగి వచ్చి
యమునాలాగా సంగమించి (గంగ)
కౌగిలిలోకాశీ క్షేత్రం..
శివశక్తుల తాండవ నృత్యం (కౌ)
నిలిచి.. వలపు పండించేది..
నిన్నునన్నుబ్రతికించేది.. ప్రేమ ప్రేమ (ప్రేమ)

అనురాగానికి.. పరిమళమై..
ఆరాధనకి సుమగళమై..
వేదాశీస్సులు కురిపించేది...
వేయి ఉషస్సులు వెలిగించేది..  ప్రేమ ప్రేమ..

ఒక ప్రేమ అమృత శిల్పం..
ఒక ప్రేమ బుద్దుని రూపం...
ఒక ప్రేమ రామచరిత్రం..
ఒక ప్రేమ గాంధి తత్వం (ఒక)
చితినైనా చిగురించేది...
మృతినైనా బ్రతికించేది... ప్రేమ ప్రేమ (ప్రేమ)

నేనున్నానని తోడయ్యేది..
నీవే నేనని నీడయ్యేది...
అమ్మగా చల్లగా కనిపించేది..
బ్రహ్మని సైతం కని పెంచేది.. ప్రేమ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ (మందారం)

సాహిత్యం చూడండి.. ప్రేమ కి నిర్వచనం ఎంత గొప్పగా.. చెప్పారో..
ఈ.. పాట పదే పదే వింటే ఎవరైనా.. ప్రేమ పేరిట ఇన్ని అకృత్యాలు చేయగలరా..!?
ఈ నాటి వన్ సైడ్ లవ్ లు, యాసిడ్ దాడులు, గొంతులు కోయడాలు ఉంటాయా?
ఈ చిత్రం కధ ని యువతరంకి పరిచయం చేయండి. జస్ట్ థింకింగ్ లో.. మార్పు వస్తుందో లేదో.. చూడండి.
విజ్ఞత కల్గినవారు తీసిన చిత్రాలు.. తప్పకుండా ప్రభావితం చేస్తాయి.
ఈ పాట నన్నుబాగా ప్రభావితం చేసిన పాట.
అందుకే ఈ పాటని గుర్తు చేసుకుంటూ.. ప్రేమ విలువని తెలియజేయాలని..నా ఈ..చిన్ని ప్రయత్నం.

వేటూరి పాటని.. విమర్శించేవారు.. కూడా.. ఈ పాట వింటే.. పాదాభివందనం చేయక మానరని.. నా వ్యక్తి గత అభిప్రాయం.
వినాలనుకునేవారికి ఈ.. పాట అన్ని చోట్లా లభ్యం. ఇదిగో..ఈ పాట వినండి. మందారంలో  ఘుమఘుమలై  -- రెండు  జెళ్ళ సీత 
ఈ.. పాటని ఒక్క సారి అయినా విని చూడండీ.. ప్లీజ్!!

ప్రేమ కన్న ప్రేమ భావన గొప్పది కాదు..
ఆ భావనలో.. మునిగి తేలుతున్న వారికి.. ఈ పాట.. ఈ పాట విని...
ప్రేమ పట్ల అర్ధ విహితంతొ.. మెలగ గలరని  ఆశిస్తూ.. "వేటూరికి" పాట నీరాజనం ..