29, జులై 2011, శుక్రవారం

ఆకు పచ్చ జరి..అన్నీ మేలిమి బంగారు పోగులే !

"ఆకుపచ్చ జరి"   నానీల సంపుటి  పరిచయం. 
శిశిరంలో
చెట్టు దిగంబరి
అయితేనేం  ఆమనిలో 
ఆకుపచ్చని జరి...

అంటారు..నానీల గట్టి గింజల్ని చల్లిన..కవి.

నానీలను రాయడం అంటే 
పెద్ద కొండను చిన్న అద్దంలో చూపించడమే
కడలిని కమండలంలో బంధించడమే.. 

ఒక వేదికపై నానీలను చదివి వినిపించినప్పుడు..
నానీల నాన్న "ఆచార్య గోపి" అతని నానీలని విని ప్రోత్శాహించాక...    

..అతని కలం.. ఇలా అంది ..

గుండె లోతులని 
కలంతో తవ్వా 
ఉబికివచ్చే 
అక్షరధారల కోసం.. అని.

కిటికీ లోంచి
ప్రపంచం కనిపిస్తుందా?
అయితే అది తప్పకుండా
పుస్తకమే..

 అని భాష్యం చెప్పారు ..ఆ  కవి.

గర్భ సంచిలో
ఖననం
తప్పించుకుందా?
కట్నాగ్ని జ్వాలల్లో దహనం

..అని అంటూ.. నే

అతివ
అంతరిక్షంలో నడక
ఆబల అనే సామెత
అంబుధి లో మునక

.. అంటారు ఆశావాదంగా

తెలుగు పావురం
ఎగిరిపోతుంది
అమ్మో !ఆంగ్ల డేగ
రెక్కల చప్పుడు..!

.. అని భయపడుతూ..

చేతి వెన్న ముద్ద
చిన్న బోయింది
ఇప్పుడంతా
ట్వింకిల్ లిటిల్ స్టార్లే!

.. అంటారు వ్యంగంగా..

కలం పీక
నొక్కాలని చూస్తారేం?
కొత్త కావ్యం
పుడుతుంది జాగ్రత్త

.. అంటూ..హెచ్చరిస్తూనే..

మీడియా అనుకూలం
 అయితే పూల గుత్తి
వ్యతిరేకం అయితే
వాడి కత్తి.. అంటారు..పోర్త్ ఎస్టేట్ గా అభివర్ణించే..మీడియా రంగాన్ని..

అక్కడ ఆడ మాంసం
అమ్ముతున్నారు
కేజీలలో కాదు
గంటలలో..అని..వ్యధ చెందుతారు.

ఆ దీపం చుట్టూ
 అన్నీ మగ పురుగులే
రెడ్ లైట్
ఏరియా మరి.. అంటారు హెచ్చరిస్తూ..

బుద్దదేవుడు
బ్రతికి పోయాడోచ్
అతడు ఆంధ్రుడు
కాడుగా మరి..అంటూ..మిలీనియం మార్చ్ పై చురక.

రింగ్ టోన్లు
పిచుకుల కూతలా?
అంతరించిన పిచుక జాతి
స్మృత్యర్ధం .. అంటూ పర్యావరణ వినాశనం గురించి..

విజేతల గాధలు
మధుర గేయాలు
దానికి పునాదులు
గుండె గాయాలే!..అంటూ..

కవిత్వం
వ్రాయడమంటే
అంతరంగంలోకి
ప్రయాణించడమే..

అంటారు..ఈ నానీల కర్త..
మోపూరు పెంచల నరసింహం .

చరిత్ర
పుస్తకమంతా
శవాలు కాలుతున్న
కమురు వాసన..

అని చెప్పే...ఈ కవి.. తన కళ్ళతో..లోకాన్ని చూడక ..

మనసుతో..
అక్షరాలూ నాటాను
కవిత్వమనే పంటను
కలంతో కోసాను

...అంటుంటే..

"అతను తనకంటూ..ఒక లోకాన్ని సృష్టించుకోలేదు..లోకాన్నే తనలోకి తీసుకున్నారు..అంటారు.." ఆకు పచ్చ జరి..కి వ్రాసిన  ముందు మాటలో.. ఆచార్య గోపీ.

జరి అనేది బంగారు పోగుల అల్లిక.కానీ ఇక్కడ జరి..ఆకు పచ్చనిది. ప్రజలకి అన్నం పెట్టె హరిత లోకాన్ని కాంక్షిస్తూ..  ఆయన వ్రాసిన నానీలని.. "ఆకు పచ్చ జరి" పేరుతో.. నానీల సంకలనం తీసుకుని వచ్చారు.

 ఆకు పచ్చ జరి సంకలనం ని..పెన్నా రచయితల సంఘం (పెరసం) ప్రచురణ లోకి తీసుకువచ్చారు.   ఈ ఆకుపచ్చని జరి లో..అన్నీ మేలిమి బంగారు పోగులే !
నానీల జలపాతం

అందరు చదువ తగినవి.అలోచింపజేసేవి కూడా  .
ప్రతులకు.. 

పెరసం (పెన్నా రచయితల సంఘం ) 
            లేదా
మోపూరు పెంచల నరసింహం (రచయిత )
న్యూ మిలిటరీ కాలనీ
ఏ.కే. నగర్, నెల్లూరు -524004  

2 వ్యాఖ్యలు:

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

చదువుతుంటే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. "నానీల సంకలనం" ఎక్కడ దొరుకుతుందో చెప్పరూ?

థ్యాంక్స్ వనజ గారూ!

అజ్ఞాత చెప్పారు...

<<>>>> ఎంతబాగా చెప్పాడు కవి

వనజ గారూ మీ బ్లాగ్ చాలా బావుందండీ .