11, ఆగస్టు 2013, ఆదివారం

అమ్ము-2

 అమ్ము మొదటి భాగం ఈ లింక్ లో  చదవండి
 తరువాయి భాగం ... 

అమ్ము నాన్న పోన్ లో ఏ మాటలైతే చెప్పాడో ఆ .. మాటలని తిరిగి చెప్పింది రమణ చెల్లెలు .

అప్పటిదాకా నిబ్బరంగా కనబడిన రమణ నేలపై కూలబడింది. కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ "చూడమ్మా! ఇది ఎంత పంజేసిందో! నేను ఏడని దాన్ని వెదుక్కురాను నాకాడ ఓపిక్కూడా లేదాయే! నేనేం చేయను దేవుడోయ్.. అంటూ కనబడని దేవుడిన్ని అడిగింది. అమ్ము వాళ్ళ నాన్న దగ్గిరికే పోయుంటదమ్మా! ఆ దొంగనాకొడుకు నన్నేడిపీనాటికే అబద్దాపు కూతలు కూస్తా ఉన్నాడు. ఇప్పుడే ఆడి  పని చెబుతా.. ఆడింటికిపోదాం పదవే."  అంటూ చెల్లెలిని పిలిచింది. ఇంత  రాత్రేల పోయి ఏడ ఎతుకాతం? రేపు చీకటేల్నే పోదాం. ఇప్పుడు ఇంటికిపోదాం.. పద,  ఈ పాటికి అమ్ము కూడా యెడేడో   తిరిగి ఇంటికి వచ్చేసే ఉంటాది అంది.

అప్పుడు నేను కలగజేసుకుని నువ్వు ఇంటికి పొవే! నేను రమణ ని తీసుకునెల్లి అమ్ము అక్కడుందేమో . చూసొస్తాం...   అని చెప్పి బండి బయటకి తీశాను .. ఓ.మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణీంచాక అమ్ము వాళ్ళ నాన్నుండే  ఇంటి ముందు బండి ఆపి .... నిలబడి చుట్టూ చూసాము . అక్కడ నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి . ఇంకొద్ది దూరంలో ఒక పాక వేసి ఉంది . ఆ పాకలో అక్కడ వాచ్ మెన్ గా పనిచేసే అమ్ము వాళ్ళ నాన్న కాపురం ఉంటాడు. ఆ పాకలో నుండి సన్నని వెలుతురూ కనబడుతూ ఉంది .. వాడు చూడమ్మా ఎంత అబద్దాపు కూతలు కూసాడో! ఎవరు లేకపోతే  ఇంటోదీపం ఎట్టా ఎలుగుతాది? అంటూ ఇంటిముందు కళ్ళతో వెదుకుతుంది. నేను ఇంటి ముందుకు వెళ్లి తలుపు తట్టబోయాను.   రమణ వచ్చి చటుక్కున నా చేయిని పట్టుకుని ఆపేసింది.

అమ్మా ! ఎల్లిపోదాం రా.. అంది "అదేమిటే? పిల్ల కోసం అన్జెప్పి వచ్చి పిల్ల ఉందొ లేదో చూడకుండా పోదాం పదమంటావు? నీకేమైనా వెర్రా!? అన్నాను

ఇదిగో! ఇక్కడ చూడమ్మా ! అమ్ము చెప్పులున్నాయి. అంటే అదిక్కడ ఉండట్టే గా. వాడు నాటకాలు ఆడుతున్నాడు
ఆడనీ,నాతలాఉ ఆడనీ , ఎన్నాళ్ళు నాటకాలు ఆడతాడో చూత్తా! రేపు మా కులపోళ్ళతో పంచాయితీ పెట్టిస్తా! వాడిని అందరితో ఊపియ్యాలి. ఆడు మొగుడు కాదమ్మా ! నా పాలిట యముడు. ఆడిని వదిలిచ్చుకుని తప్పు కట్టానా!  రొయ్యల ప్యాక్టరీలో రాత్రిబవళ్ళు కష్టపడి ఆ అప్పు దీర్చుకున్నా. పిల్లలతో ఆడికి సంబందం లేదని రాయించుకున్నా. చిన్న పిల్ల తెలిసో తెలియకో ఆది దగ్గరికి ఎల్లిందీ  అనుకో... తీసుకొచ్చి దించిపోకబోగా ఇంటో పెట్టుకుని నన్ను దేసంమీద పడి వెదుక్కోమన్నాడు.  ఆడికి నిలువెల్లా ఇసమేనమ్మా! ఇట్టా కూడా నన్ను ఎందుకు బతకనీయాలని ఆడి  కచ్చ..అంటూ ముందుకు దారితీసింది . రమణ మాటల శభ్దంకి ఎవరైనా బయటకి వస్తారేమో అని చూసాను. ఎక్కడా ఆ అలికిడే లేదు . బండి స్టార్ట్ చేసిన శబ్ధం కి  ఇరుగుపొరుగు  ఆరాగా తొంగి చూసారు  కాని ఆ ఇంట్లో నుండి సవ్వడే లేదు.

ఇంటికి వస్తున్నంత సేపు దారంతా  రమణ మొగుడ్ని తిడుతూనే ఉంది. ఇంటికి వచ్చాక ఇంకా ఇప్పుడు ఏమి వెళతావ్ ఇక్కడే పడుకో.. అన్నాను . లేదమ్మా ! చిన్నది నేను లేకపోతే  నిదరపోదు.. ఇంటికి పోతాను అంది . సరే .. ఈ అన్నం పట్టుకెళ్ళు అని  రమణకి అన్నం పెట్టి  ఇస్తుంటే సమాజ సేవ అయిందా ..?  అంటూ ఇంట్లో వాళ్ళ గొణుగుడు . అవన్నీ గోడకి తగిలినట్టే అనుకుని .. అయ్యో రామా! ఇది ఒక సేవెనంటారా??మగవాళ్ళు చేస్తే అది మరపురాని సేవ . ఆడవాళ్ళు  చేస్తే అధిక ప్రసంగం అంటారనుకుంటా  కదా? అని ఎదురు ప్రశ్న వేసా! అంతే .. నో సౌండ్.

తెల్లవారి రమణ రోజుకన్నా పెందలాడే పనికి వచ్చింది చాలా హుషారుగా ఉంది . ఎన్నాళ్ళు ఉంటాదో.. ఉండనీయమ్మా ! నేనసలు దాని జోలికే పోను ... దానిని తలిస్తే మీ చెప్పు తీసుకుని కొట్టండి .. అంటూ బింకపు మాటలు పలికింది. అలా రెండు రోజులు గడచిపోయాయి . పంచాయితీ పెట్టిస్తానన్నావు కదే! ఎప్పుడు పంచాయితీ? అని అడిగాను

అది ఇంకో రెండు రోజులకైనా ఇంటికోస్తాది కదా ! అప్పడే చెపుతా ఆ సంగతి .. అంది .

********************

బడి ఎగ్గొట్టి  నాన్న ఇంటికి చే రిన అమ్ము ని గుమ్మంలో నుండే నిలబెట్టి అడిగింది   వాళ్ళ నాన్నని  కట్టుకున్న మూడో పెళ్ళాం  వసంత.  ఏమ్మా ..! ఇట్టా వచ్చావ్? బడికి పోలే ?  మీ యమ్మ నిన్ను ఇట్టా గాలికోదిలేసిందేంటే ! భయంబత్తి లేకుండాతిరుగాతా ఉండావ్! మీ నాయనొచ్చి నీ సంగతి తేల్చుకుంటాడు,! నీకులా నా బిడ్డలు తిరిగితే అట్టకాడ కాల్చి వాతలేడతా! అని చీదరిచ్చుకుంది.

మొన్నేగా ఈడకి వచ్చినప్పుడు .... బాగా పలకరిచ్చి రెండురోజులుఉండిపోవే  అని అంది. ఇప్పుడేంటి చిన్నమ్మ ఇలా ఇసుక్కుంటుంది అనుకుంది  అమ్ము .

కాళ్ళకున్న చెప్పులిడిసి ఇంటోకి పోబోయింది.. ఎక్కడికి అట్టా ఇంటో జోరబడుతున్నావ్.. కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటోకి  రా! పయిటేలకి కానీ నిన్ను కన్నోడు రాడు. ఆయనొచ్చాక నీ సంగతి తేల్చు కుంటాడు మద్దిలో. నా కెందుకు దురద.? నన్ను ఈడికి ఇచ్చేటప్పుడు మొదటి పెళ్ళాం బిడ్డలు, రెండో పెళ్ళాం బిడ్డలతో ఈడికి సబందమే లేదు అని లొల్లి మాటలు జెప్పారు... ఇప్పుడేమో .. పెల్లీడుకోచ్చాక నువ్వు మా ఎదానే పడతావని చెపుతూ ఉండారు. ఇట్టైతే నేను నా పిల్లలు మట్టి కొట్టుకుని పోతాం  అని  ఒకటే సాపించడం.. మొదలెట్టింది
చానా సేపు చిన్నమ్మ మాట్టాడే ముల్లుమాటలు ఇంటూనే గుమ్మం ముందే నిలబడింది అమ్ము.

పన్నెండు గంటలప్పుడు .. చెల్లెళ్ళు ఇద్దరూ బడి నుండి ఇంటికొచ్చారు . ఆళ్ళ కాళ్ళకి కొత్త బూట్లు .. అయి విప్పుతూ .. నువ్వు కూడా రా! ఈళ్ళతో పాటు  నీకు అన్నమేస్తా అని లోపటికి పిలిచింది . కూరాకు మరింత లేదు నువ్వు ఈ పచ్చడేసుకుని తిను . పూజ,వనజ చిన్న పిల్లకాయలు కదా ! పచ్చడి తింటే రొప్పుతారు అంటూ .. పచ్చడేసి పెట్టింది . అప్పుడు అమ్ము కి వాళ్ళమ్మ గుర్తుకొచ్చింది .. కళ్ళల్లో నీరు పళ్ళెం లో పడ్డాయి. ఈ మాత్రం దానికే ఏడవాలా? పచ్చడి తిని బతకాలా, గొడ్డుగారం వేసుకుని తిని బతకాల. అంటూనే పిల్లలిద్దరికి పాలబూత్లో కొనుకోచ్చిన పెరుగు కప్పు తీసి అన్నం లో కలిపి ఇచ్చింది.  అమ్ము మారు అన్నం అడక్కుండానే పళ్ళెం తీసుకుని బయట కుళాయి దగ్గరికి కెళ్ళి పళ్ళెం కడిగి నీళ్ళు తాగి అక్కడే నిలబడింది.

అమ్ము ఇటు రాయే..! ఈ గిన్నెలు తీసుకుపోయి కడుక్కురా! నేను ఈళ్ళని తీసుకుని బంగారంగడికి పోయి రావాలి . కంసాలాయన  కాళ్ళ గొలుసు లు  ఇస్తానన్నాడు.  అన్జెప్పి తలుపుకు గొళ్ళెం పెట్టి తాళం వేసుకుని  మరీ పోయింది .
వాళ్లటు పోగానే అరుగుమీద పడుకుంది అమ్ము . నాన్న ఎప్పుడు వస్తాడో ? రాగానే సైకిల్ ఎప్పుడు కొనిస్తాడో అడగాలి. పుస్తకాల సంచీ బోలెడు బరువు. మోయలేక సాలి వస్తుంది నడుం వంగి పోతుంది . ఆ మాటే అమ్మకి చెపితే .. రోజు బడిదాకా వచ్చి సంచీ వరండాలో పెట్టి వస్తంది కానీ సైకిల్ అడిగితే  కొనదు. ఏమడిగినా డబ్బులేడయి? నీ కళ్ళు దొబ్బినాయా అని పిచ్చి కూతలు కూసుద్ది . రేషన్ షాప్ లో బియ్యమే తెచ్చి వండుద్ది. పోస్టాపీసులో నెలనెలా డబ్బులు కట్టకపోతే ఆ డబ్బులతో సైకిల్ కొనియోచ్చు కదా ! అదే మాట అడిగితే అమ్మకి మాలావు కోపం వచ్చుద్ది. గవర్నమెంటాళ్ళు చెల్లికి నాకు నలబయ్యేసి ఏలు లెక్కన  బాంక్ లో ఏసారని అమ్మమ్మ చెప్పింది . అన్ని డబ్బులున్చుకుని సైకిల్ కొనమంటే కొనదు. నోట్స్ పుస్తకాలు కొనదు. అమ్మ ఒట్టి రాకాసిది. నోటికొచ్చినట్టు కూస్తాది. మళ్ళీ అంతలోనే ముద్దులాడుద్ది. నాన్న అట్టా కాదు ఎక్కడ కనబడినా పలకరించక్కపోయినా ఇంటికి ఎలితే.. వచ్చావా అమ్ము రా రా నాన్నా అంటూ దగ్గరికి తేసుకుంటాడు. చెల్లెళ్ళతో పాటు నాకు చాక్లెట్లు కొనిస్తాడు. ఇంటికేల్లెటప్పుడు చార్జీలకి డబ్బులిస్తాడు ... ఛీ ! అమ్మ మంచిది కాదు . నాన్నే మంచాడు . నేను నాన్న దగ్గరే ఉంటా .. ఇక పొమ్మన్నా పోను అనుకుంటూ .. గోడకి తిరిగి పడుకుంది .

గుమ్మానికడ్డంగా అట్టా పడుకున్నావేంటే..? ఇంటికి దరిద్రం ముందు ఆడ నుండి లే ! అంటూ కసురుకుంది చిన్నమ్మ . బిత్తరపోయి లేచి నిల్చుంది. ఎదురుగా చెల్లెల్లిద్దరూ.. మువ్వలు పట్టీలు పెట్టుకుని అటు ఇటు ఎగురుతూ ..ఆమువ్వలుమోతకి నవ్వుకుంటూతిరుగుతున్నారు .అమ్ముతన కాళ్ళకేసి చూసుకుంది.బోసిగా ఉన్నాయి.దిగాలేసింది. "నాక్కూడా కాళ్ళగొలుసులు తేకూడదా... చిన్నమ్మా.."అడిగింది .

అడిగావు ? ఇంకా అడగలేదేందా అని అనుకుంటా ఉండా? ఈ గొలుసులేయి మీ బాబు తెచ్చిచ్చిన సొమ్ముతో కొనలేదమ్మా! మా అమ్మోళ్ళు సాంగ్యానికి చెవులు కుట్టిచ్చి కాళ్ళ గొలుసులేసారు. అయ్యో నీ అయ్యా కంతటి ఇవరం కూడానా? సంపాయించడం తాగడం సరిపోయే ! అయినా నీ కాళ్ళకి గొలుసులు నేనెందుకు చేయిన్చాలే ? నువ్వేమన్నా నా కడుపున బుట్టావా? లేకపోతె నీ అమ్మ.. చస్తే నన్ను నీ నాయన కట్టుకున్నాడా? మీ యమ్మ గిత్త లాగా బాగానే ఉందిగా .. మూడు మూడు నాళ్ళకి నిన్ను ఈ కొంప మీదకి ఉసిగోల్పుతుందేంటి? నా కాడ  ఆ యవ్వారాలు అన్నీ కుదరవు.  వచ్చినావా ఒక పూట ఉండావా ... అంతే ! తెల్లారి లేచి  వచ్చిన దారిన పో.వాల.. చిన్నమ్మా,పెద్దమ్మా అని వరసలు కలిపి ఈడే  తిష్ట వేయడంకాదు.. అని  ఎడతెరిపి  లేకుండా వాయించి ఈసడించింది .

అమ్ము అక్కడి నుండి లేఛి దూరంగా పోయి రోడ్డు ప్రక్కనే ఉన్న రాయి మీద కూర్చుంది. రాత్రైనదాకా అక్కడే కూర్చుంది . మీ బాబు వస్తే నిన్నాడనే కూర్చోబెట్టాడని తిడతాడు, నన్ను తిట్టియ్యడానికే కూసున్నావా.. లోపలకి వచ్చి కూసో! అని  పిలవాలి కాబట్టి ఒకపాలి పిలిచి  మళ్ళీ లోపలి ఎల్లిపోయింది . చీకటీగలు పీక్కు తింటన్నాయి. లోపలి పోదామా  అంటే చిన్నమ్మ అనే మాటలు చానా బాధగా ఉండాయి.  అమ్మ ఎప్పుడు తిట్టే తిట్లు కన్నా చిన్నమ్మ మాటలు చానా బాధగా ఉండాయి. అయినా సరే ఇక్కడే ఉండాలి . అమ్మ దగ్గరికి ఎల్ల కూడదు. నేను కనబడకపోతే అమ్మ ఏడవాలి బాగా ఏడవాలి అప్పుడు కాని  నా కసి తీరదు అనుకుంటూ కచ్చగా అమ్మని తలుచుకుంది అమ్ము

(ఆఖరి భాగం .. మరో పోస్ట్ లో )

2 వ్యాఖ్యలు:

Praveena చెప్పారు...

Baagundhi ammu story.Waiting for the next part :)

nagarani yerra చెప్పారు...

పాత్రలకు తగ్గ సంభాషణల తో చాలా బాగుంది .