9, ఆగస్టు 2013, శుక్రవారం

అమ్ము..

అమ్మూ!  అమ్మూ! ..... లెగు .. లేచి బయటకి వస్తన్నావా లేదా !? అరిచింది రమణ

అంతలో ఉల్లిపాయలు రిక్షా వచ్చింది   ఉల్లిపాయలు ఇద్దువు గాని ఉండన్నా అని చెప్పి  ఇంటేనక్కి ఎల్లింది పనిచేసే వాళ్ళిల  నుండి పోగేసుకొచ్చిన పాత ఇనుము ,అట్టపెట్టెలు, పగిలిపోయిన ప్లాస్టిక్ సామాను అన్నీ కలిపి ఒక గొనె సంచిలో వేసి ఉంచింది గొనె సంచితోసహా ఉల్లిపాయలబ్బాయికి ఇచ్చి ఉల్లిపాయలు తీసుకుంది

"మరీ నాలుగే ఇచ్చావేమన్నా ! ఇంక నాలుగియ్యి. పిల్లలకి రోజు పొద్దుట పూట కూరోండి కేరేజీ కట్టాలి "అంది .
"నువ్వెందుకు కేరేజీ కట్టడం? మజ్జానం బళ్ళో పిల్లకాయలకి కూడేడతారు కదా!" అడిగాడు ఆరాగా అతను

"బడికేల్లడం మొదలై పది రోజులయిందో లేదో పిల్లకాయలిద్దరికి జొరం ముంచుకొచ్చింది. ఆడ పెట్టె అన్నం తిని పిల్లలకి వాంతులు విరోచనాలుని పట్టుకున్నాయి. ఆళ్ళని హాస్పటల్కి తీసుకేల్లలేక మందులు కొనలేక చచ్చాననుకో. పేపర్లో కూడా పడతనయ్యి. బళ్ళో పెట్టె బోయనాలు తిని పిల్లలు చచ్చిపోతున్నారంట. ఇంటికల చిట్టిమ్మామ్మ పేపర్ తెచ్చి నా ముందు కూకుని చదివి ఇనిపిచ్చింది "ఒసే  రమణా! పిల్లలకి ఎట్టోగట్టా వండిపెట్టి కేరేజి కట్టవే! ఆ కూళ్ళు తిని పేణం మీదకి తెచ్చుకుంటారు అని చెప్పి పోయింది . అంది .

"పలకరిస్తే భారతం చెపుతావ్ కదమ్మే! అంటూ మరో నాలుగు ఉల్లిపాయలిచ్చాడు. అయి చాలవన్నట్టు మరో రెండుల్లిపాయలు తీసుకుంది రమణ  ఇట్టా ఇచ్చుకుంటూ పొతే నేనుకూడా నా రిచ్చాబండి ని  పాత సామానాడికి తూకం లెక్కన అమ్మి తువ్వాలేసుకోవాల్సిందే.. అంటూ ఇసుక్కున్నాడు

"అబ్బో ఈ మాత్రం దానికే అట్టాగ అయిపోతే ఏళ్ళ తరబడి ఈడఎట్టాఉన్నావన్నా! సంపాయించిన ఇల్లు సంగతేంటోఅని దీర్ఘం తీస్తూ ఇంటోకి వచ్చి

చేతిలో ఉల్లిపాయల సంచీని అక్కడేసి... ఇంకా మొద్దు నిద్దర పోతున్న .. అమ్ము ని గట్టిగా ఒక్కటి చరుస్తూ ..   ఎన్ని సార్లు లేపినా లేగవకుండా దున్నపోతులా పడి నిదరపోతున్నావ్ కదే! ఎనిమిది గంటలయ్యింది. మీకెప్పుడు జడలెయ్యాలి.. అన్నం తినిపిచ్చి స్కూల్ కాడ వొదిలి మళ్ళీ పనికేప్పుడు పోవాలి.. అంటూ అరిచింది.
ఆ దెబ్బతో అమ్ము లేచి వచ్చి మళ్ళీ వరండాలో ఓ.మూల కూర్చుంది ..

అయిదేళ్ళచిన్న కూతురుని  శృతి.. శృతి... లేగవరా తల్లీ ! ఈ రోజు బడికి వెళ్ళాలి అంటూ బలవంతంగా లేపి ముద్దులాడుకుంటూ బయటకి వస్తూ వరండాలో కూర్చున అమ్ముని చూసి .. ఏంటి ఇయ్యాల కూడా బడికేల్లవా? అడిగింది కోపంగా .

అమ్ము తల అడ్డంగా తిప్పింది . నీకేం మాయరోగం వచ్చిందే ! నాకు పట్టిన గతే నీకు పట్టకూడదని పనిలో కూడా పెట్టకుండా బడికి పంపుతొన్నా, నీ అయ్యా ఏమన్నా సంపాయించి నీకు ఏలకి యేలు ఇచ్చి పెళ్ళిచేత్తాడు అనుకుంటున్నావా? ఆరవ తరగతికి వచ్చావు ఎట్టోగట్టా.. ఇంకో నాలుగు కాసులు చదివితే ఎదో ఒక ఉజ్జోగం వస్తందని అంగన్వాడి టీచర్ చెప్పింది. నువ్వేమో మూడు మూడు రోజులకి బడి ఎగ్గొట్టి తిరుగుతున్నావ్ .. నిన్ను అంటూ ..ఒంగి జుట్టుపట్టుకుని కొట్టబోయింది. చంకలో చిన్నది ఉండటం మూలంగా ఈలు కుదర్లా. ఈలోపులో అమ్ము లేచి ఈదిలోకి పరుగులు తీసింది . అమ్ము ! మరియాదగా ఇంటోకి వచ్చి   తొందరగా బయలెల్లి బడికెల్లు అంది రమణ

అమ్మా నేను బడికి పోను...  అంది .  ఎందుకనేల్లవే! పాఠాలు అర్ధమగడం లేదా ? నేను ఒచ్చి అయ్యోరమ్మకి చెప్పెసివస్తా  . నిన్ను కొట్టదు, ఏం చేయదు.. మమ్మవిగా బడికేల్లవే.. నీకు దణ్ణం పెడతాను కూతుర్ని  బతిమలాడింది.

 "నేనేల్లనంటే ఎల్లను నువ్వు పనికి పో.. ! చెల్లిని పెట్టుకుని నేనింట్లో ఉంటా  మొండిగా చెప్పింది
 " ఇయ్యాల నిన్ను ఇరగదీసయినా సరే బడికి తీసుకుపోతా.. "అంటూ అమ్ము వెనకాల పడింది రమణ . అది అందకుండా రోడ్దేమ్మట పరుగు తీసింది .  అరగంట దాటినా దాన్ని పట్టుకోవడం రమణ వల్ల కాలేదు. పనికి ఆలస్యమైపోతుంది, తొందరగా ఎల్లకపోతే ఉండ రెండిళ్ళు కూడా పోతాయి అనుకుంటూ  చిన్నదాన్ని చంకనేసుకుని ఇంటికి తాళం పెట్టి గబా గబా పని చేస్తున్న ఇంటికి వచ్చింది

ఏంటి రమణా ! నువ్వు వచ్చేదెప్పుడు ఇల్లు చిమ్మి తుడిచేదేప్పుడు ? నేను పూజ చేసుకునేదేప్పుడు ? రోజు రోజు కి నువ్వొచ్చే టైం మారిపోతుంది. ఇలా అయితే నిన్ను మానిపించాల్సి వస్తుంది . గట్టిగా కోప్పడ్డాను .

"అమ్మా ! మీరు కూడా అట్టంటే ఎట్టాగమ్మా! ఇప్పుడుదాకా దానితో ఏగి ఏగి... ఇదిగో దీనిని చంకనేసుకుని వచ్చా , అని వరండాలో నిలబెట్టిన చిన్న దాన్ని చూపెట్టింది .

ఇవాళ కూడా అమ్ము బడికి వెళ్ళ లేదా !  ఆరాగా , కోపంగా అడిగాను

లేదమ్మా ! రోడ్లమ్మట పరిగెత్తుతుంది. దాన్ని పట్టుకోడం నావల్ల  అయ్యే పని కాదు. ఆ బాడుకోవ్ ముండ ని పెంచడం నావల్లకాదు. దాని అయ్యకాడికి పంపిచ్చేత్తాను.. అంది ముక్కు చీదుతూ బాధగా

కోపం వచ్చినప్పుదల్ల్లా  నువ్వలా అనడం దానికి తేలికయి పోయింది . అది చెప్పా పెట్టకుండా  వాళ్ళ నాన్న దగ్గరికి వెళుతుంది. రొండు రోజులు అక్కడుంటే నీకు దిగులు  అదెక్కడ  అక్కడే ఉండిపోద్దోఅని ..  రమ్మని ఫోన్ చేస్తావ్ !
 అది  నీ  అలుసు కనిపెట్టి బడి ఎగ్గొట్టి తిరగడం మొదలెట్టింది . పన్నెండేళ్ళ పిల్ల అలా రోడ్లెంమ్మట తిరగడం ఏమిటే ?  మొన్న అర్ధరాత్రి పూట పన్నెండింటికి బాంక్ దగ్గర రోడ్డు ప్రక్కనే వేసిఉన్న బెంచీ మీద కూర్చుని ఉందంట.  మీ సార్ గారు చెప్పారు అన్నాను

అవునమ్మా ! ఆరోజు తిట్టానని అలిగేల్లి అక్కడ కూకుంది ఎంత బతిమలాడినా రాలేదు. అప్పుడు మా చెల్లెల్లి  తీసుకొచ్చింది "

ఏమన్నా అనుకో రమణా ! నీకసలు వివరం లేదే! పిల్లలని అంతగా తిట్టడం ఎందుకే? నిదానంగా అర్ధం అయ్యేదాకా చెప్పుకోవాలి. మొగుడు పెళ్ళాం విడిపోతే పిల్లలు ఇలాగే తయారవుతారు పద్దాక నువ్వు మీ అయ్యదగ్గర కెళ్ళు అనబట్టేగా ఆదట్టా.. తయారయింది. మన కోపాలు,మన బాధలు పిల్లలు మీద చూపెట్ట కూడదే!
అన్నీ దిగమింగుకుని పిల్లలని పెంచాలి.పిల్లలని పెంచడం అంటే మాటలనుకున్నావా? వాళ్ళని కన్నంత తేలిక కాదు

అవునమ్మా ! ఆ సంగతి అప్పుడు తెలియాలా, అందరోద్దన్నా నా పిల్లలు నాకే కావాలని తెచుకున్నా. ఇయ్యాల ఏకు మేకైనట్టు తయారయింది.  మొన్న అప్పు జేసి మూడొందల రూపాయలు పెట్టి నోట్స్ పుస్తకాలు కొనిచ్చా ఆ అప్పు ఇంకా తీరనే లేదు . రెండు రోజులు పని మానుకుని మీటింగ్ కి ఎల్లా ! బడికి నాగా పెట్టకుండా ఎల్లినాల్లకి డబ్బులు ఇస్తారని చెప్పారు. చక్కగా సదువుకోమ్మా అని బతిమలాడి చెపుతున్నా.. ఇనడంలేదు నేను ఏం జేయాలి....? అంది .

"తీసుకెళ్ళి హాస్టల్లో  పడేయి, బయటకి రాకుండా అందులో పడి ఉంటుంది .." అన్నాను కోపంగా .

నిజం చెప్పొద్దూ .. అమ్ము మీద నాకు చాలా కోపం ఉంది . అది వాళ్ళ మ్మ మాట వినదు.  తెలివికలదే కాని చదువు మీద శ్రద్ద లేదు బడి ఎగ్గొట్టి ఆటలాడటం, ప్రక్క ఇళ్ళకి వెళ్లి టీవి చూడ్డటం కి అలవాటు పడిపోయింది.
రమణ ఆ పిల్లని ఒక్క దెబ్బ కూడా కొట్టదు కాని నోటికివచ్చినట్టు తిడుతుంది. అలా తిట్ట కూడదే! మంచిగా చెపితే వినకపోతే గట్టిగా నాలుగు వడ్డించు . ఆ  భయం ఉండాలి .. అంటుంది తను .

"ఏమోనమ్మా ! నేను దాన్ని కొట్టలేను బిడ్డలని కొట్టడానికి నాకు పేణం ఒప్పదు "అంటుంది. ప్రేమగా . ఆ రోజంతా చిన్న దానినేసుకునే ఇళ్ళల్లో పనులు చేసుకుంది . సాయంత్రం ఇంటికెల్లాక చూసింది  అమ్ము ఇంటికి రాలేదు .. రాత్రి అయింది అయినా అమ్ము ఇంటికి రాలేదు,రోజు అమ్ముఎక్కడెక్కడతిరుగుతుందో అక్కడక్కడికివెళ్లి వెదికింది

అమ్ము కనబడలేదు . ప్రక్కన ఊరిలో ఉన్న వాళ్ళ నాన్న దగ్గరికి ఎల్లిందేమో అన్న ఆలోచన చేసింది.  అమ్ము తండ్రికి పోన్ చేసి కనుక్కోవడం దానికి ఇష్టం లేక పోయింది .. ఇంకాసేపు చూసింది  ఇక ఉండబట్టలేక  చెల్లెలుతో  కలసి మా ఇంటికి వచ్చింది .  అమ్ము నాన్న నంబరు నాకిచ్చి వాళ్ళ నాన్నకి పోన్ చేయించింది .  నేను అతని నంబరు నొక్కి .. రమణ చెల్లెలికి  మాట్లాడమని ఇచ్చాను

బావా.. అమ్ము వచ్చిందా !?

 "అది నాదగ్గరకేందుకు వస్తాది,. అయినా నేను ఊళ్ళో లేను. ఇటికరాయి తోలుకోచ్చే లారీలో బట్టీ కాడికి పోతున్నా .  ఇంటో మా ఆవిడ పిల్లలు కూడా లేరు ఊరికి బోయినారు. పిల్లని పెంచని రాని  నీ అక్కని రోడ్డ్లెమ్మట ఎతుక్కోమను" చెప్పి పోన్ పెట్టేసాడు .

రోజులు చూస్తే బాగా లేవు . దానికి చిలక్కకి చెప్పినట్టు చెప్పాను . ఎన్నిసార్లు చెప్పానో .. అలా ఒంటిగా తిరగోద్దె.. అని నా మాట ఇంటేగా!? అని ఏడుస్తూ కూర్చుంది .

అమ్ము ఏమై ఉంటుంది ? నాలో కూడా చిన్న ఆందోళన మొదలైంది . అసలే ఆడపిల్ల... ఆలోచించడానికే భయమేసింది ..
( అమ్ము కథ రెండో భాగం .... మరో పోస్ట్ లో )

5 కామెంట్‌లు:

ranivani చెప్పారు...

బాగా వ్రాసారు వనజ గారూ !సంఘటన కళ్ళెదురగా జరిగిన ఫీలింగ్ వచ్చింది .

Padmarpita చెప్పారు...

కళ్ళకి కట్టినట్లుంది కధ.....నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురుచూస్తూ...

సృజన చెప్పారు...

కధ ఆసక్తిగా సాగుతుంది.

కృష్ణప్రియ చెప్పారు...

yes. తర్వాతి భాగం కోసం ఎదురు చూస్తున్నాను..

Sharma చెప్పారు...

నాలుగు రోజుల నుంచి నెట్ కి దూరంగా నెట్టబడడంతో ఏ పోష్టులు చూడలేక పోయా , పోష్టు చేయలేకపోయా . రాత్రే వచ్చను . ఈ రెండో పార్త్ చూసి , మొదటి పార్ట్ చదవటం జరిగింది . ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టినట్లు , కళ్ళకు కట్టినట్లు ఉత్సాహంగా నడిచింది