12, సెప్టెంబర్ 2013, గురువారం

నూనె కుండ
మెయిన్ రోడ్ ని ఆనుకుని  వున్న సినిమా హాలు. దాని ప్రక్కనే వో  పెట్రోల్ బంక్. ఆ రెండిటి ప్రక్కన  నాపరాళ్ళు, చలువ రాళ్ళు పేర్చిన అడితీ. ఆ అడితీ  యెదురుగా రోడ్డుకి అవతలి వైపున యెత్తుగా గుబురుగా పెరిగిన చెట్లు బాటసారులకి యెండా వాన నుండి రక్షణ యివ్వడమే కాకుండా  ఆ రోజు  కుల పెద్దల పంచాయితీకి వచ్చినవారికి నీడనిచ్చాయి.

భర్త వైపు నుండి నాలుగు ఆటోల జనం దిగారు. భార్య వైపు నుండి పట్టుమని నలుగురు  కూడా లేరు. అయితేనేం ? నలబయి మంది మనుషుల లెక్కన వొకే వొక స్త్రీ స్వరం  సివంగిలా  విరుచుకు పడుతూ తన వాదన వినిపిస్తూ వుంది. కుల పెద్దలు ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ వున్నారు. అప్పటికే తీర్పు జరిగి పోయింది . మెల్లగా కొందరు లేచి కల్లు  పాకల వైపు, దగ్గరలో వున్న బార్ & రెస్టారెంట్ ల వైపు దారి పట్టారు .

మిగిలిన కొంతమంది ఆడవాళ్ళు  " ఇది చేసిన తప్పు యెనక పెట్టుకుని నోరేసుకుని చెలుగుతుంది. ఆడడానికి యింత  కావరం పనికి రాదు " అయినా యిదొక్కతే యీ నూనె కుండ ప్రెమాణంకి తయారైందా  యే౦టీ ? ఎన్ని చూళ్ళా మనం " అంటూ దుమ్మెత్తి పోస్తుండగా ..

వారికి యెదురుగా  పెద్ద కారు ఆగింది. అందులో నుండి కెమారాలు పెట్టుకుని యిద్దరు దిగారు . ఇంకొకతను చేతిలో మైక్ పట్టుకుని  కెమరా ఆన్ అన్నట్టు కెమెరా మెన్ వంక చూస్తూ, వీళ్ళ దగ్గరికి వచ్చి " ఏమండీ ! యిక్కడేదో కుల పంచాయితీ జరుగుతుందని  తెలిసింది . అసలు అలా పంచాయితీలు చేయవచ్చా,  యిక్కడున్న అందరికి తెలియదా? ఏమైనా గొడవలు వుంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళాలి అని అనుకోకుండా యింకా యిలా పంచాయితీలు పెడుతున్నారు. ఇది తప్పని మీకు తెలియదా అంటూ   ఆతను  అలా అడగగానే అదేదొ టీవిలో మనం కనబడతాము అనుకుని కొందరు ఉత్సాహంగా ముందుకు వచ్చి చెప్పబోతుండగా,  యింకొకరు వచ్చి గబా గబా వాళ్ళని వెనక్కి నెట్టి. "ఇక్కడ ఆట్టాంటియి  యేమి జరగట లేదండి, యేదో మొగుడు పెళ్ళాం తగువులు పెట్టుకుంటే సర్ది చెపుతున్నాం " అని ఒకరికొకరు సైగ చేసుకుని అక్కడ నుండి జారుకున్నారు .

ఇక అక్కడ అప్పటిదాకా సివంగిలా తిరగబడ్డ "రమణ " వొకటే నిలబడి వుంది.  ఆమె ప్రక్కనే వున్న తల్లి, అమ్మమ్మ ,చెల్లి కూడా మీడియా వాళ్ళని చూసి వేగంగా వచ్చే వాహనాలని తప్పించుకుంటూ రోడ్డు దాటి అడితీలోకి వెళ్ళిపోయారు . రమణ వొంటి పై చీర కూడా లేదు "ఇది ఆడు కొనిచ్చిన చీర.. ఈ చీర కూడా నాకొద్దు  వాడే వద్దనుకుంటే వాడు  కొన్న చీర నా వొంటిపై  యె౦దుకు? అంటూ చీరిప్పి మొగుడి మొహాన కొట్టింది. వెంటనే ఆమె తాత తన భుజం పై వున్న తువ్వాలుని వేసి ఆమెకి నలుగురి దృష్టిలో పడకుండా చేసి ఆడ  దాక పోయొస్తా!  అంటూ కుల పెద్దలతో కలిసి కల్లు దుకాణానికి పోయాడు.

చానల్ వారికి అర్ధమైంది. తమకి కావాల్సిన విషయాన్ని  వాళ్ళెవరూ చెప్పరని. ఆఖరిసారి ప్రయత్నించి చూద్దాం అనుకుని ఆశతో వారు కూడా రోడ్డు దాటి  యివతలి వైపుకి వచ్చారు వారి వెనుకనే "రమణ" కూడా రోడ్డు దాటి అడితీలోకి పోయింది

నేను అక్కడి నుండి కదలబోతుండగా మీడియా విలేఖరి నన్ను అడిగాడు "ఇక్కడ యే౦  జరుగుతుంది ? అసలు యిప్పటి వరకు యే౦   జరిగింది " మీరు చూస్తూనే వున్నారు కదా ! చెప్పండి .అన్నాడు .

నేను చిన్నగా నవ్వి వాళ్ళతో చెప్పాను   " స్పెషల్  కథనం కాదగ్గ విషయం కొద్దిసేపటి క్రిందే జరిగిపోయింది ".  ..

అదేమిటో  కొంచెం వివరిస్తారా ? జిడ్డు ప్రశ్న. వదిలేటట్టు లేరు అనుకుంటూ  "నిజంగా యిలాంటి కథనాన్ని మీరు నిత్యం ప్రసారం   చేసేంత ముఖ్యమైనదే ! ఇప్పటికిప్పుడు నేను రెండు ముక్కల్లో చెప్పే విషయం కాదిది.  మీరు యీ ప్రత్యక్ష ప్రసారం కాస్త ఆపేసి వో  గంట సేపు  కూర్చో గల్గితే వివరంగా చెపుతాను " అన్నాను .

సరే,  యిప్పుడే చెప్పడానికి మీకు అభ్యంతరం లేదుగా ? అడిగాడు. నేను కొంచెం అసహనంగా ముఖం పెట్టి వారి కెమెరాలవైపు చూసాను .

ఆతను నా అసహనాన్ని గమనించి కెమెరా వారిని  వెళ్ళిపొమ్మని చెప్పాడు.

వాళ్ళు వెళ్ళిన తర్వాత " ఇప్పుడు మీకు యెలాంటి యిబ్బంది లేదు, వ్యక్తిగతంగా  యిక్కడ యే౦  జరిగిందో తెలుసుకోవాలని వుంది చెప్పండి ప్లీజ్ !  అడిగాడతను .

నూనె కుండలో చేయి పెట్టడం అనేది  మీరెప్పుడైనా  విన్నారా ? అడిగాను

"ఎస్,ఎస్  విన్నానండీ ! అబద్దం చెపుతున్నారనే అనుమానం వుంటే   మరగ కాగుతున్న నూనె కుండలో చేయి పెట్టి తీయాలి నిజం చెపితే చేయి కాలదు లేకపోతే  కాలుతుంది" అలాంటిదే కదా " అడిగాడు ఆసక్తిగా, వుత్సాహంగా  చూస్తూ.

అలాంటి నిరూపణే  చెయ్యాలనే  "కుల పంచాయితీ" జరిగింది యిక్కడ  .

మై గాడ్ ! యిప్పుడు  కూడానా ?  అసలు మనమెంత  అనాగరిక కాలంలో బ్రతుకుతున్నాం,  అలా నూనె కుండలో చేయి పెట్టడం  జరిగిందా ? మీరు అదంతా చూస్తూనే నిలుచున్నారు . ఒక భాద్యత గల పౌరురాలిగా మీకు భాద్యత వుంది కదా ! పోలీస్ కి ఫోన్ చేసి నోటీస్  చెయ్యవచ్చు కదా ! అన్నాడు .

"మీరు కూడా నేను పోన్ చేస్తేనే వచ్చారు"  నా సమాధానం

నూనె కుండ పంచాయితీ యె౦దుకు జరిగింది?  అతని ప్రశ్న .

నా మొహం వివర్ణమయింది ." ఇది  యుగ యుగాల తరతరాలగా జరుగుతున్న పరీక్ష . ఆడదానికి శీల పరీక్ష "  మొగుడు అనుమానపడితే నిరూపించుకోవాలి,  తప్పదు అని చెప్పిన   కుల పురుష పంచాయితీ   తీర్పు చెప్పిన కథ  అసహ్యంగా, ఆవేదనగా చెప్పాను .
...
( "రమణ చెప్పిన కథలు శీర్షిక" న  కొన్ని మూడాచారాలు, పురుషాధిక్య ప్రపంచం కలసి  స్త్రీల జీవితాలని యెలా  కాలరాస్తున్నాయో చెప్పే  ప్రయత్నం చేస్తున్నాను .. యదార్ధ వ్యధార్ద  కథలు ఇవి )

ఈ కథ తరువాయి భాగం ... రేపటి పోస్ట్ లో21 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

అసలు ఇదీ బడిత పూజ మొదలు పెట్టవలసిన విధానం. కొనసాగించండి

Sharma చెప్పారు...

మీ టపా లోని చిత్రాన్ని చూడగానే ఇదేదో ఆ త్రేతాయుగంలోని సీతాదేవికి సాక్షాత్తూ దైవస్వరూపుడైన ఆ శ్రీరామచంద్రుడు పెట్తిన పరీక్ష లాంటిదేదో ఈ కధా కదనం అనుకున్నాను . ఇది తర తరాలుగా , సారీ యుగ యుగాలుగా ఆనవాయితీగా నడుస్తూ తరలి వచ్చిన మగ మహారాజుల మదాంధకారానికి ప్రతీక . రాజ్యకాంక్షతో , కీర్తికండూతితో అగ్నిసాక్షిగా , ఆ నాటి పెద్దల సాక్షిగా కట్టుకున్న , ఆ సీతమ్మను ఆకట్టుకున్న సాక్షాత్తూ దైవస్వరూపుడైన ఆ శ్రీరామచంద్రుడే , ఆమె గర్భవతి అని తెలిసి కూడా అడవుల పాల్జేశాడు అంటే అంతకంటే కౄరుడు మఱెవ్వరూ వుండరేమో ? డైవాంశతో జన్మించినవాడై వుండి.
మనమొక విషయాన్ని పరిశీలించాలిచట . ఆ నాటి యుగ వాతావరణాన్ని బట్టి ఆ యింటి పెద్దాయన తన కామ కండూతిని గడ్డివాముల వద్ద సరిజేసుకొంటున్నాడు . కొంత కాలానికి ఆయన మనవడు పెద్దయ్యాడు . ఆ మనవడు తన కామ కండూతిని లాడ్జిలలో తీర్చుకొంటున్నాడు . అంటే విషయమేమీ మారలేదు , విధానం మారిందన్నమాట .
యుగాల మార్పులో వచ్చిన మార్పు సామాన్య మానవులకు కూడా బదిలీ అయింది . ఇది నరనరాల్లో అలా జీర్ణించుకుపోయింది . ఆ నర్నరాల్లో నుంచే ( జీన్స్ ) కదా ! మానవులందరు పుట్టుకొచ్చింది . ఇదిలా సాగుతూనే వుంటుంది . ఈ యుగం అంతమై నూతనంగా మఱల మానవులు పుట్టుకొస్తేనే ఈ దుర్బుధ్ధులకు , కుతంత్రాలకు అంతం . అంతవఱకు యిలా కొనసాగుతూనే వుంటాయి ఈ దురాలోచనలు , కుతంత్రాలు , అణగద్రొక్కటాలు .
వాస్తవానికి ఈ సృష్టిలో లింగ భేదం ఒక్క సృష్టి కొఱకే పెట్టబడింది . ఆ యిరువురిలో ఏ ఒకరూ తక్కువా కాదు , ఎక్కువా కాదు . ఆ శారీరక నిర్మాణాన్ని బట్టి , ఆ శరీరానికి వలసిన శక్తి సామర్ధ్యాలు ఏర్పఱచటం జరిగింది . ఇరువురిలో అంతులేని శక్తి వున్నది . ఒకరు ఓర్పుకి ప్రతీక , మరొకరు నేర్పుకి ప్రతీకలు . ఒకరు అందానికి ప్రతీక, మరొకరు మందానికి మారుపేరు . ఒకరు సంపాదించుకొస్తే , మరొకరు నిల్వ చేస్తారు . ఇలా ఎన్నో ఆ యిరువురిలో శక్తి సామర్ధ్యాలున్నాయి . ఆ రెండూ ఒక చోట కలిస్తేనే సంపూర్ణం అవుతుంది . ఇలాంటి శక్తి సామర్ధ్యాలని మగవాళ్ళు దుర్వినియోగం చేస్తూనే వస్తున్నారు యుగ్యుగాలుగా . అందుకే ఈ దురాచార అత్యాచారాలు . ఇలా మనం చర్చించుకొంటుంటె కొంత మార్పైనా వస్తుందేమోనన్న ఆశకు అవకాశం మాత్రమే .

hariSbabu చెప్పారు...

శర్మ గారికి,
శ్రీ రాముడి గురించి మీరు వేసిన నిందలని బాగా ఆలోచించే చేసారా?

ప్రేరణ... చెప్పారు...

బాగుందండి....మిగిలింది కూడా రాసేయండి.

Meraj Fathima చెప్పారు...

వనజా, మార్పుకు నాంది పలుకుదాం మిగతాది కూడా రాసేయండి

Malakpet Rowdy చెప్పారు...

శ్రీ రాముడి గురించి మీరు వేసిన నిందలని బాగా ఆలోచించే చేసారా?
____________________________________

ఆయన కండూతిని ఆయన ఇలా తీర్చుకుంటున్నారులెండి. ప్రతీవాడికీ దేవుళ్ళని తిట్టటం ఫేషన్ అయిపోయిందిగా!

Zilebi చెప్పారు...


'మా' లక్కు, పేట రౌడీ గారు ఇక్కడ వచ్చే రంటే , ఇక అగ్గి బరాటా ఏదో ఇక్కడ ఇక తప్పక వస్తుందను కుంటా !!


జిలేబి

Vanaja Tatineni చెప్పారు...

HariSbabu గారు నేను అజ్ఞాత ల కామెంట్స్ ని ప్రచురించను. కానీ మీ కామెంట్ కి వివరణాత్మకమైన సమాధానం లభిస్తుందనే ఆశ.. తో పబ్లిష్ చేసాను . నాతొ సహా చాలా మందికి రామాయణాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియడం లేదు. వివాదాలు కాకుండా ఆరోగ్యంగా చర్చ కొనసాగితే .. బావుంటుందని భావిస్తున్నాను .ధన్యవాదములు.

Vanaja Tatineni చెప్పారు...

జిలేబీ గారు .. :) ధన్యవాదములు .

Vanaja Tatineni చెప్పారు...

కష్టేఫలేమాస్టారూ .. కొన్ని తెగలలో ఇప్పటికి కొనసాగుతున్న ఆచారాలని చెపుతూ స్త్రీల వెతలని చెప్పడమే .. నా ఉద్దేశ్యం అండీ ! సీతమ్మ వారు అగ్ని ప్రవేశం చేయబోతున్న చిత్రం పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది. అది ఈ కథలో ముందు ముందు విషయంలోకి వస్తుంది. మీ అభిమాన పూర్వక వ్యాఖ్యకి ధన్యవాదములు

Vanaja Tatineni చెప్పారు...

ప్రేరణ గారు , మేరాజ్ మీ ప్రోత్సాహానికి ధన్యవాదములు

Vanaja Tatineni చెప్పారు...

Sharma గారు మీ వ్యాఖ్యకి ధన్యవాదములు . మీ వ్యాఖ్యకి వివరణ కోరుతూ మిత్రులొకరు వ్యాఖ్యానించారు గమనించగలరు.

Vanaja Tatineni చెప్పారు...

Malkpet Rowdy గారు .. వీ వ్యాఖ్యకి స్వాగతం అండీ! మిమ్మల్ని ఇలా సంభోదించడం కొంచెం ఇబ్బందిగా ఉంది :)

Malakpet Rowdy చెప్పారు...

అయ్యా జిలేబీసారువాడూ

నేను నిప్పు రాజేసినా రాజెయ్యకుండా మీరు మాత్రం పెట్రోలు పట్టుకుని రెడీగా ఉన్నట్టున్నారుగా?

వనజ గారూ .. రౌడీ అనే పిలవండి .. పౌరాణికపాత్రలని ముఖ్యంగా రాముడిని, ద్రౌపదిని తిట్టటం కొంతమందికి సరదా ... వాళ్ళని తిట్టటం నాకు సరదా ... నన్ను తిట్టుకోవటం మరికొందరికి సరదా ... అంతకన్నా ఏమీలేదు లెండి ..

hariSbabu చెప్పారు...

కామెంటు కొంచెం పెద్దదయినా ఫరవాలేదా?యెందుకంటే కొన్ని చోట్ల పరిమితి ఉందదం వల్ల ముక్కలు ముక్కలుగా పబ్లిష్ చెయ్యాల్సి వొచ్చింది.నేనెవరీనీ కించ పరిచే విధంగా రాయనని అక్కదక్కదా నేను ఇదివరలో వేసిన కామెంట్లు చూస్తే అర్ధమవుతుంది. రామాయణానికి సంబంధించి చాలా మందికి తెలియని నిగూఢమయిన విషయాలు కొన్ని నాకు తెలుసు - అవి చెప్పాలి, అంతే.

Vanaja Tatineni చెప్పారు...

hariSbabu గారు మరీ దీర్ఘంగా కాకుండా.. కామెంట్ రూపంలో అందించండి. తెలుసుకోవాలనే ఆసక్తిగా ఉంది .

hariSbabu చెప్పారు...

రామాయణం అనేది జరిగిందా లేక కేవలం కల్పితమైనదా అనేదానిలో మీకేమైనా అనుమానాలు ఉంటే వాటిని వొదులుకోండి. అది కేవలం కల్పనే. కాకపొతే అవతారికలో వాల్మీకి చెప్పుకున్నాడు, యేమని? ఈ ప్రపంచంలో నదీ నదాలు పారుతున్నంత వరకూ గిరి శిఖరాలు స్ఠిరంగా ఉన్నంత వరకూ నా రామకధ నిలిచి ఉంటుందని. అంత ధైర్యంగా తన కృషిని గురిచి తనే చెప్పుకున్న మరో కవి యెవరైనా ఉన్నారా?

ఆ ధీమాకి కారణం యేమితో తెలుసా? తన రచనలో తను చేసిన చమత్కారాల మీద నమ్మకం ఉండి, యే కాలంలోనైనా మనుషులకి కావల్సిందేమిటో తెలుసుకోగలిగిన కవికి ఉండే ఆత్మ విశ్వాసం అది.మిగతా భాషల్లో లేనిది రామాయణానికి సంబంధించి తెలుగులో ఒక విలువైన పుస్తకం ఉంది.అంతరార్ధ రామాయణం అని వేదులు సూర్యనారాయన శర్మ గారు రాశారు.దాని ప్రకారం మనిషి మనీషిగా మారే అధ్యాత్మిక ప్రయాణాన్ని వాల్మీకి ఒక కధగా మలిచాడు.పాత్రలకీ స్థలాలకీ వాడిన పేర్లనీ వర్ణనల్నీ డీకోడ్ చేసి చూపించారు శర్మ గారు.

రామ అంటే రమింప జేయు వాడు అని అర్ధం. సీత అంటే అసీద్(యేదైతే ఉన్నదో అది) అనే అర్ధం తీసుకుంతే సీత రాముడికి విధేయంగా ఉన్న భార్యగా కాకుండా సీతయే ఉన్నత స్థానం లో భగవత్ స్వరూపంగానూ రాముడు ఆ భగవత్ శక్తిలో లీనమవ్వాలని యోగ సాధన చేసే సాధకుడి గానూ కనపడతారు.

శివ ధనుర్భంగం తో సీతను పెళ్ళాడటమనేది ఓంకార సాధన ఫలించి దైవాన్ని మొదటి సారి దర్శించడానికి సంకేతం.శ్రీ రామ వనవాసానికి కారణం దసరధుడు, కైక. కైక పేరుకి సర్మ గారిచ్చిన కోడ్ గుర్తు లేదు కానీ దశరధ అనే పేరుకి అన్ని వైపులకీ ఆతురంగా పరిగెట్టే మనస్సు ప్రతీక. కైక బహుశా అహంకారానికి ప్రతీక అనుకుంటాను. వీటివల్ల యోదులకి శక్యం కాని అయోధ్య అనే ఉన్నతమైన యోగ సాఫల్యత నించి దూరంగా వెళ్ళి అక్కడ మళ్ళీ పంచ వికారాలూ విషయ వాసనలూ దశగ్రీవుడి(నీచమైన కోరికలకి గొంతు పెద్దది కదా) లాగా వొచ్చి సాధకుడ్ని దైవం నించి వేరు చెయ్యదానికి సీతాపహరణం ప్రతీక.

ఒకసారి సాధించినా దూరమైన దైవ సంప్రాప్తిని తిరిగి సాధించాలంటే సద్గురువు చాలా అవసరం. ఆ సద్గురువు స్థానం లఓ వాల్మీకి వాక్య కోవిద, వాక్య విశారద అని చాలసార్లు కితాబు లిచ్చిన హనుమంతుల వారు వస్తాడు.ఆ విశేషణా లన్నీ సద్గురువుకే వర్తిస్తాయి. రాముడు ఆంజనేయుడ్ని నాకు చేసిన ఈ సాయానికి నీకు ఇంతకన్నా ఇచ్చుకోలేనని ఆలిగనం చేసుకుంటాదు. ఇది గురువుకు శిష్యుడు చేసే మనోగతమైన విధేయతకి ప్రతీక.

ఇప్పుడు పైన ఉన్న బొమ్మకి సంబంధించిన విషయానికి వస్తాను.అలా సద్గురువు సాయంతో రెండవ సారి తిరిగి దగ్గిరకి తెచ్చుకున్నప్పుడు భక్తుడికి తన దైవం మీద పూర్తి అధికారమూ, తన గురించి తెలిసీ తనని కష్తపెత్తినదుకు కోపమూ ప్రదర్శించే సన్నివేశానికి ప్రతీక. రామదాసు "యెవడబ్బ సొమ్మని" అంటూ తిట్టినా ఆ తర్వాత "అబ్బా దెబ్బల బాధ కోర్వ లేకుంటి" నన్నా తనకన్న అధికుదైన దైవం మీద వాళ్ళు సాధించుకున్న చనువు లాంటి అధికారమే కారణం.

లౌకికమైన అర్ధంలో చూస్తే సీత చేసిన ఒక దారుణమైన తప్పుకి వేసిన శిక్ష. వానరులు సీత నగల్ని తెచ్చి చూపించినప్పుడు రాముడు లక్ష్మణుడ్ని గుర్తుపట్టమన్నప్పుడు నాకు కాలి అందెలు మాత్రమే గుర్తున్నాయి(అంతకంటే పైకి ఆమెని చూదలేదు అని) అంటాడు. కానీ సీత మారీచుడు అరిచిన అరుపులకి కంగారు లోనే కావచ్చు గానీ వెళ్ళనంటున్న వాణ్ణి నువ్వు నన్ను మోహించావు. తను లేకపోతే నన్ను చేపట్టాలని చూస్తున్నావు అంటుంది. రామయణంలో ఉన్న మిగతా నీతుల కన్నా ఇది చాలా గొప్ప నీతి. అన్ని రకాల పాపాల్లోనూ తప్పు చెయ్యని వాణ్ణి తప్పు చేసాడు అనడం నిష్కృతి లేని దోషం.

శర్మ గారు అన్నట్టు రాజ్య కాంక్ష తోనో కీర్తి కండూతి తోనో చేసింది కాదు రెండో సీతా పరిత్యాగం. రాజధర్మం ప్రకారం తప్పని సరి అయ్యే చేసాడు. చేసి హాయిగా మరొక దాన్ని కట్టుకుని కులకనూ లేదు. తను కూడా బాధ పడాల్సి వస్తుందని తెలిసే చేసాడు.ధర్మానికి ప్రతిరూపంగా ఆదికవి వాల్మీకి సృజించిన రాముడిని గురించి ఆ మాటలు వాడటం పొరపాటు శర్మ గరూ.
శుభం

Vanaja Tatineni చెప్పారు...

hariSbabu గారు ధన్యవాదములు చాలా తక్కువేమో! తక్కువే మిక్కిలి చేసి మీకు మనఃపూర్వకంగా ..

hariSbabu చెప్పారు...

వనజ వనమాలి గారికి,
మీరు నా సంక్షిప్తమయిన కామెంటుని ప్రచురించి నాకు ఉత్సాహాన్నిచ్చే మంచి ప్రసంస కూడా చేసినదుకు ధన్యవాదాలు. ఒకటి మాత్రం నిజం. నూనెకుండ ప్రమాణాల లాంటివి నిజంగా అనాగరికమే. కానీ పైన మీరు అగ్నిప్రవేశం బొమ్మని వెయ్యదం వీతికీ సీత అగ్నిప్రవేశం లో ఉన్న సారూప్యతని చూపించడం కోసమని వేసి ఉండవచ్చు. వాస్తవంగా కూడా రామాయణం లో అక్కడ నిజంగా జరిగింది యేమిటనేది తెలియనప్పుడు యేమనిపిస్తుంది?
రాముడు సీతని నువ్వు సంవత్సరం పాటు రావణుడి లంకలో ఉన్నావు కాబట్టి నిన్ను స్వీకరించను అంటే సీత అగ్ని పరీక్షకి నిలబడి తన శీలాన్ని నిరూపించుకుని రాముడి భార్యగా తన స్థానాన్ని తను నిలబెట్టుకుంది అనే విధంగా సామాన్యులకి అర్ధమయ్యింది. దానికి పొడిగింపుగా తనకీ అలాంటి అనుమానమే వొస్తే - సీత తన శీలాన్ని నిరూపించుకున్నాట్టుగా నువ్వు కూడా నీ పవిత్రతని నిరూపించుకోమనే అలోచన కూడా అనుకోకుందానే వొస్తుంది. ఆ రకంగా ఆ సన్నివేశం కొంత అపార్ధానికి గురయిందనేది వాస్తవం. కానీ నేను సూచించిన అంతరార్ధాన్ని చూస్తే ఆ అపోహ వొచ్చ్గి ఉండేది కాదనుకుంటున్నాను.
అప్పుడు జరిగింది పరీక్ష కాదు.ఒక కఠినమైన నిర్ణయం తీసేసుకున్నాడు. వాల్మీకి రాముడిని పదహారు గుణాలకి ప్రతిరూపంగా నిలబెట్టాడు - సత్య విక్రమ , ధృడ విక్రమ, - ఇలాంటివి. తను ప్రతి పత్రకీ కొన్ని విశేషణాలు వాడి ఆయా విశేషణలకి నిర్రొపణగా కొన్ని సన్నివేసాల్ని కల్పించాడు. సత్య విక్రమ,ధృడ విక్రమ అనే మాటల ప్రకారం చూస్తే ఒకసారి రాముడు నిర్ణయం తీసుకున్నాక మార్చుకోదనది సీతకు తెలుసు గనక పూర్తి నిరాశతో అత్మాహుతికి పాల్పడదమే తప్ప యేదో పరీక్షకి నిలబడి తన పవిత్రతని నిలబెట్టుకోవలనే ఉద్దేశం సీతకీ లేదు.
లొకికమైన దృష్తితో చూసినా - వాళ్ళు రాజ వంశీయులు. అప్పటికే భరతుడు తిరిగి వొస్తే రజ్యానికి నువ్వే రాజువని శృంగిబేర పురం లో యెదురు చూస్తున్నాడు. రాముడి అప్పటి తిరస్కారానికీ తర్వాత జరిగిన రెందవ పరిత్యాగానికీ రాజనీతి లో ఉన్న ఒక మెలిక కారణం. రాజు ఆనేవాడు తను ఆదర్శప్రాయంగా ఉండడం తో పాటు అది ప్రజలకు తెలిసే లాగా ప్రవర్తించాలనేది చాణక్యుడూ చెప్పాడు, మాకియవిల్లీ చెప్పాడు.

రాజుగా తను పాటించిన దాన్ని మనం పాటించనక్కర లేదనేది తెలుసుకుంటే దాన్ని మనం ఇమిటేట్ చెయ్యనక్కర లేదనేది కూడా తెలుస్తుంది.స్సాంప్రదాయం లో యేది అనుసరించాలి అనే సందేహం వొచ్చినప్పుడు ఋషి వాక్యమే గొప్పది. వాల్మీకి, వ్యాసుడు, చాణక్యుడు, వాత్స్యాయనుడు నాలుగు పురుషార్ధాలైన ధర్మ అర్ధ కామ మోక్షాలకి సంబంఢించి ఆఖరి మాటగా చెప్పదగిన న్యాయమైన సూత్రాలనే చేశారు. సరిగ్గా తెలియక పోవటం వల్ల గానీ స్వంత లాభం కోసం గానీ తప్పుగా ఆచరించె మనలోని కొందరి దోషాల్ని ఆ పుణ్యాత్ములకి అంటగట్టటం తప్పు. మీ పోస్టు వల్ల మీరాశించిన ప్రయోజనం చాలావరకూ ఈ చర్చ తోనే నెరవేరింది.కొన్ని అర్ధవంతమైన ప్రతిపాదనలు బయటి కొచ్చేటందుకు మీ యీ పోస్టు దోహద పడింది.
శుభం.

Vanaja Tatineni చెప్పారు...

hariSbabu గారు .. మీ విలువైన వివరణకి ధన్యవాదములు . నేను ఈ కథలో ఈ చిత్రం పెట్టడానికి కారణం ఉంది .. కథ పూర్తైన తర్వాత ఈ కథకి సీతమ్మ వారి అగ్ని ప్రవేశం కి గల సంభంధం ఏమిటో ఒక పాత్ర ద్వారా చెప్పిన తర్వాతనే ఈ చిత్రం తీసేస్తాను . బహుశా నేను ఇంకెప్పుడూ ఇలా నాకు తెలిసిన పరిజ్ఞానం ని అత్యుత్సాహంతో ప్రదర్శించను . ఏమి తెలియని అజ్ఞానం కన్నా మిడి మిడి జ్ఞానం ప్రమాదం అనుకుంటున్నాను మీ వివరణ చూసిన తర్వాత :) ధన్యవాదములు .

hariSbabu చెప్పారు...

వనజ వనమాలి గారూ,
చిత్రాన్ని తీసేయడం అదీ అక్కర లేదు. నేను చెప్పిన విషయాలు మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు. నా వివరణలో యేదైనా తప్పు పట్టే విషయం ఉంటే అది శర్మ గారికి మత్రమే : యేకపత్నీ వ్రతానికి రూపంగా వాల్మీకి వర్ణించిన రాముడ్ని గడ్డి వాముల పక్కన కామ కండూతిని తీర్చుకునే వాళ్ళలో జమ కట్టేశారు కదా.
బొమ్మ చూడగానే కధ శీల పరీక్ష గురించే అని తెలియడం కోసం వాడుకోవటం లో తప్పు లేదు లెండి.దాన్ని గురించి మరీ పశ్చాత్తాప పడిపోవటం అనవసరం. ఇప్పుడు నాకు మీరొక సాయం చెయ్యాలి. అక్కడా ఇక్కడా వ్యాఖ్యలు రాసీ రాసీ బోరు కొట్టేసింది, సొంతంగా బ్లాగు తెరవాలనుకుంటున్నాను. యెక్కడ రిజిస్టర్ అవ్వాలి. ఒక సారి గూగుల్ కాలవలో తెలుగు బ్లాగ్ ఓపెన్ చెయ్యటం గురించి రాయి వేస్తే అది నన్ను యెక్కడెక్కడికో తీసుకెళ్ళింది. మీరు ఇప్పటికి అనుభవం సంపాదించేశారు కదా.నాకు యేదైనా మొదలు పెట్టేముందు చిన్న విషయమైనా పూర్తిగా తెలియకుండా ముందుకెళ్ళలేను.ఇంతకీ ఈ బ్లాగు ఓపెన్ చెయ్యటం ఫ్రీ సర్వీసా లేక పైడ్ సర్వీసా? విషయం యెక్కువగా ఉంటే నా మెయిల్ ఐడి కి అందించగలరు. మీరు మా కామెంట్లని చూసేటప్పుడు అక్కద మా మెయిల్ ఐడిని మీరు చూదగలరనుకుంటాను.లేదంటే మీ జవాబు చూసాక అప్పుడు ఇస్తాను.