14, సెప్టెంబర్ 2013, శనివారం

ఎల్లమ్మ తల్లి సత్తెం


నూనె కుండ 
సత్య ప్రమాణం     ఈ కథ ఇంతకూ ముందు రెండు భాగాలు ఈ లింక్ లలో

దట్టంగా మబ్బులు కమ్ముకొచ్చాయి .. గాలి వాన మొదలయింది .. నూనె కుండ కింద పొయ్యి ఆరి పోయింది ..  పంచాయితీకి వచ్చినాల్లందరూ చెట్ల కిందకి పోయారు  నేను వానలో తడుస్తూనే గుడి చుట్టూ తిరుగుతానే ఉండాను .. కాసేపటికి ఏమైందో తెలియదు .. నేను కళ్ళు తిరిగి పడిపోయాను .

కళ్ళు తెరిచి చూసేసరికి .. మబ్బులు ఎట్టా పోయ్యాయో! కళ్ళల్లో చురుక్కుమని సూరీడు గుచ్చుతున్నాడు . నీరసంగా కళ్ళు తెరిచాను.

మా అమ్మ చెప్తా ఉంది .. నూనె కుండ పంచాయితీ తప్పి పోయిందంట " ఎల్లమ్మ తల్లి సత్తెం కలది అందుకే నూనె  కుండ క్రింద పొయ్యి కూడా చిత్రంగా ఆరిపోయింది . ఇక నూనె కుండలో చెయ్యి పెట్టె పనే లేదు .. నీ పెళ్ళాం ఏ తప్పు చేయలేదని  ఋజువైనట్టే! పంచాయితీ అయిపొయింది అన్నాలు వొండుకుని తిని  ఇక ఇళ్ళకి బోటమే!  " అని పంచాయితీ చెప్పారని సంతోషంగా చెప్పింది .

అట్టా. నేను నూనె కుండలో చెయ్యి పెట్టకుండా తల్లి కాపాడిందని  నేను ఏ తప్పు చేయలేదని చెపుతా ఉంటారు .  నేను ఆ ముక్కే నోరు చించుకుని చెప్పినా ఇనలేదు, ఏడ్చి చెప్పినా ఇనలేదు. నూనె కుండలో చెయ్యి పెట్టాల్సిందే అన్నారు . ఆ తర్వాతయినా మా ఆయనలో అనుమానం జబ్బు పోలేదు .  ఆ వూరిడిచి వచ్చేసాము. ఈ బెజవాడ చుట్టుపక్కల బతుకుతున్నాం , ఇంటోనుండి కాలు బయటకి పెడితే చాలు "ఎవడ్ని ఉంచుకున్నావే ... "(అభ్యంతర పదం) తో .. తిడతా ఉంటాడు. ముగ్గురి బిడ్డలని కన్నా  ఏళ్ళతరబడి అన్నం తిన్నట్టు తిట్లు తింటానే ఉండాను. శుభ్రంగా గుడ్డ కట్టుకోనీయడు,పూలు బెట్టనీయడు, నలుగురితో మాట్టాడనీయాడు. కాలు చెయ్యి ఆడక పదేళ్ళు అయ్యింది . ఏ పని చేయకుండా తిరుగుతున్నా .  పాచి పని చేసి పసి బిడ్డని సాకుతున్నట్టు సాకుతున్నా.. ఇప్పుడు .. తిడతానే ఉంటాడు..  ఆ తిట్లు తిని తిని ఇట్టా అయిపోయా అంటూ చెప్పింది. సన్నగా కట్టేబారిపోయి ఉన్న ఆమెని చూస్తూ జాలిపడ్డాడు రమేష్.

నీకెన్నేళ్ళు అవ్వా.. అడిగాడు అరవయ్యి ఉంటాయయ్యా..  ఈ కళ్ళతో ఎన్నో చూసా.. చెప్పుకుంటే బోలెడు కథలు అంది

 అది సరే ఆ తర్వాత నీకు తెలిసీ ఎవరన్నా .. ఇట్లాంటి పరీక్ష లో నూనె కుండలో చేయి పెట్టారా ? రమేష్ అడుగుతున్నాడు సుబ్బమ్మని.

మా కులంలో మొగుడు అనుమానిత్తే అట్టా నూనె కుండలో చేయి పెట్టి నిరూపించుకోవాల్సినదేనయ్యా .. ఇద్దరు ముగ్గురు కాలి నయం గాక చచ్చిపోయారు . కొంత మందేమో చేయి పెట్టడానికి భయపడి తప్పు చేయకపోయినా చేసామని ఒప్పుకుని డబ్బు కట్టి మొగుడ్ని వదిలేసుకుని ఎల్లిపోతారు మొగుడు నిందేస్తే.. ఆడదాని జీయితం అయిపోయినట్టేనయ్యా! అందుకే మాలో ఆడైనా, మగైనా  మారు మనువులు జాస్తి . అని చెప్పి

దొరసాని .. నేను పోయోస్తా.. రేపు  కనబడతా నమ్మా..  కాసిని డబ్బులు అప్పు ఇయాలి నువ్వు .. అంటూ అడితీలోకి వెళ్ళిపోయింది

నేను ఆలోచిస్తూ ఉన్నా.. ఆ రోజు గాలి వానా రాకుండా ఉండి ఉంటె  .. ఆ  కుండలో  మరుగుతున్న నూనె లో  సుబ్బమ్మ చేత చేయి పెట్టించి ప్రమాణం చేయించి ఉండేవారు . కచ్చితంగా చేయి కాలి చర్మం కూడా ఉడికి పోయి ఉండేది .. ఊహించు కుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది . శీల పరీక్ష పేరిట అమాయుకులైన ఆడవాళ్ళని ఇలా హింసించే ఆచారాల్ని కూకటి వేళ్ళతో పెకిలించి వేయాలి  ఆవేశంగా అనుకుని ..

 రెండు  తరాల తర్వాత కూడా .. సుబ్బమ్మ మనుమరాలు "రమణ" కి మళ్ళీ నూనె కుండ పరీక్ష పెట్టమని పంచాయితీ చెప్పిన కుల పెద్దల తీర్పు తో .. వాళ్ళ జీవనంలో ఎలాంటి మార్పు రాలేదని  అర్ధమవుతుంది కదా రమేష్ గారు .... అడిగాను

అవునండీ! ఇంతకీ ఈ సుబ్బమ్మ మనుమరాలికి ఈ పరీక్ష పెట్టమన్నారా .. ఏమిటీ అడిగాడు ... అవునని తలూపాను .

మైగాడ్ ..  అలా జరిగిందా ?  అడిగాడు అతను ఆశ్చర్యంగా ..

అలా జరగడానికి "రమణ " ఏమన్నా  సుబ్బమ్మ లాంటి మామూలు ఆడమనిషి కాదు  ఆభిజాత్యం ఎక్కువ. నేను చెప్పడం కాదు కాని మీరు రెండు మూడు రోజుల తర్వాత తీరిక చేసుకుని వస్తే .. స్వయంగా ఆమె నోట వెంబడే .. ఆమె కథ చెప్పిస్తాను ..  అన్నాను

మళ్ళీ .. సస్పెన్స్ లో పెట్టారా.. మేడం అన్నాడతను నవ్వుతూ ....

కొన్ని కథలు మనం చెప్పుకోవడం కన్నా వారి కథ వారి నోటి వెంట వచ్చినప్పుడు వింటేనే బావుంటుంది అన్నాను .రమేష్ నా పోన్ నంబర్ తీసుకుని  రెండు రోజులలో వీలుని బట్టి కలుస్తానని చెప్పి నా   దగ్గర సెలవు పుచ్చుకుని . వెళ్ళిపోయాడు


సరే.ఫ్రెండ్స్... నా కథ  ఇక్కడ ఆగింది .

"రమణ"  రమేష్ తో...  ఆమె కథ  చెప్పేటప్పుడు .. మీరు విందురుగాని .. ఐ మీన్ చదువుదురుగాని .. ఇక ఉండనా మరి ..


4 వ్యాఖ్యలు:

nagarani yerra చెప్పారు...

ఎల్లమ్మ తల్లి ప్రకృతి రూపంలో సుబ్బమ్మను కాపాడిందన్నమాట.హమ్మయ్య!బావుందండీ కథ కాని నిజం .

Pantula gopala krishna rao చెప్పారు...

ఈ కథమూడు భాగాలు ఇప్పుడే చదివాను. చాలా
ప్రయోజనకరమైన రచన.పూర్తిగావ్రాయండి.అంతా చదివి నా అభిప్రాయం తెలియజేస్తాను.

Meraj Fathima చెప్పారు...

మొత్తం ఒక్కసారే చదువుతాను మీ శైలి బాగుంటుంది ఎన్నిసార్లు చదివినా విసుగు అనిపించదు. ముగింపు తర్వాత నా అభిప్రాయం రాస్తాను.

Vanaja Tatineni చెప్పారు...

నాగ రాణి గారు ..కథ నచ్చినందుకు ధన్యవాదములు.

@ Pantula gopala krishna rao గారు ధన్యవాదములు . సమయం చూసుకుని ఈ కథ పూర్తి చేస్తానండీ . కొంచెం వెయిట్ చేయండి.

@ మేరాజ్ .. త్వరలో కథ పూర్తి చేస్తాను . చదివి తప్పకుండా మీ అభిప్రాయం చెప్పాలి మరి . థాంక్ యూ సో మచ్.