22, సెప్టెంబర్ 2016, గురువారం

లతాంతాలు 1వ భాగం
ఫ్రెండ్స్ .... లతాంతాలు అనే కథ వ్రాసాను. అనుకోకుండా అది కాస్త పెద్దదిగా అయిపోయింది. పత్రికల వారికి పంపినా ప్రచురణకి ఎంపిక అవదు. ఈ సంశయంతోనే  కథని అలాగే ఉంచేసాను. అందుకే బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాను .. చదివి ఎలావుందో ...చెప్పండి ప్లీజ్ !

 ఉదయాన్నేలేచి  తన ఇంటి ముందు నిలబడి సూర్యోదయాన్ని కంటారా చూసి "పొడుస్తూ భానుడు పొన్నపువ్వు ఛాయ పొన్న పువ్వు మీద పొగడపువ్వు ఛాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ " అని పాడుకుంటూ  యధాలాపంగా చుట్టూ చూసింది. తెల్లారేసరికల్లా ఆకాశంలో నల్లగా కమ్ముకొచ్చిన మబ్బులకి మల్లే  లేచొచ్చిన భవనాలని చూసి రోజూ లాగే దిగులుపడింది మోహన. ఆ దిగులుతోనే అన్యమనస్కంగా ఇంటి పని చేసుకుని ఏదో తిన్నాననిపించి  హడావిడిగా కాలేజ్ కి బయలుదేరింది.

రోడ్డుపై  వడి వడిగా నడుస్తూ కాలేజ్ గేట్ కేసి  చూసింది.  రోడ్డు ప్రక్కనే  విద్యార్ధులు  పార్క్ చేసిన అనేక ద్విచక్ర వాహనాలు. ఎక్కడో ఒకటి రెండూ ఎరుపూ  పసుపు తప్ప ఆన్నీ నల్లరంగులోనే ఉండటంతో ఉదయపు తీక్షణపు ఎండపడి  మరింత  మెరుస్తూ దూరంనుండి  చూస్తున్న మోహనకి   నల్ల సముద్రంలో అలలు కదులుతున్నట్టు,నల్ల త్రాచులు సంచరిస్తున్నట్లు ఉంది.  ఎనిమిది ఇరవయ్యి కల్లా కాలేజ్ కి చేరుకొని హమ్మయ్య అనుకుంది.

ఆ కాలేజ్ కి చాలా ప్రత్యేకతలున్నాయి. కాలేజీ  ఆవరణలోకి  విద్యార్ధుల  బైక్ లు నిషేధం. సెల్ ఫోన్ నిషేధం. ప్రతి విద్యార్ధి తప్పనిసరిగా తోటపని, వంట పని చేయాలి. మధ్యాహ్నం అక్కడే భోజనం చేయాలి వంటి నిబంధనలతో క్రమశిక్షణ పాటిస్తూ,  మంచి ఫలితాలు అందివ్వడంలో ముందంజలో ఉంది. ఆ కాలేజ్ లో తమ తమ  పిల్లలు చదువుతున్నారంటే   ప్రిస్టేజ్ గా భావించే తల్లి దండ్రులూ  ఉన్నారు . పిల్లలని ఆ కాలేజ్ లో చదివించుకోవాలని వచ్చిన కుటుంబాలన్నీ ఆ చుట్టుప్రక్కలే నివాసం  ఉండాలనుకుంటుకున్న ఆంతర్యాన్ని గ్రహించిన బిల్డర్స్ రెండు మూడేళ్ళలోనే ఆ చుట్టుప్రక్కల ప్రాంతాన్ని   ఆధునిక మయుని నిర్మాణాలతో నింపేశారు. ఆ వూరికి పట్టణ వాతావరణం వచ్చేసింది.

ఆ కాలేజ్  గార్దెనెర్ గా ఉన్న మోహన పిల్లలందరూ క్లాసుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత   గార్డెన్ అంతా తిరుగుతుంది. కొత్తగా వేసిన చివురులని , మొగ్గలని, పూలని తాకి చీడ పీడలంటాయేమోనని పరిశీలించుకుంటుంది.

తన రూమ్ లో  కిటికీ ప్రక్కన నిలబడి కర్టెన్ ప్రక్కకి తొలగించి మోహనని  చూస్తున్నాడు రఘు.  ములగ పువ్వు రంగు చీరలో ఆమె కదిలే నదిలా ఉంది, చదవని కథలా ఉంది.  చాలారోజులనుండి  అతనాలోచనలు సూర్యకాంతి పుష్పంలా  ఆమె చుట్టూ తిరుగుతున్నాయి.  బ్యూటీ పార్లర్లు అంటని సహజ సౌందర్యం. సౌందర్యం కన్నా ఆత్మ విశ్వాసం, విజ్ఞానంతో వెలుగుతున్నకళ్ళు,  క్షణాల్లో ఎదుటి మనిషిని చదివే సునిశితశక్తి . దగ్గరికి వెళ్లి పలకరించాలనిపించింది . వరండా అంచున నిలబడి ఆమె తనవైపు చూసినప్పుడు పలకరించాలని చూస్తున్నాడు. పూలభారంతో ఒంగిపోయిన గులాబీ మొక్కకి ఆధారంగా కర్రని పాతి పురికొసతో బందిస్తున్నామె తలెత్తి అక్కడతన్ని చూసి ఉలికి పడింది.


"రెండు గులాబీలు కోసుకెళదామని నించున్నాను విత్ యువర్ పర్మిషన్ "  అన్నాడు పూలని కోయరాదు అన్న బోర్డుని చూపిస్తూ.

"అడగకుండా కోసేసుకుంటారు కొందరు. అడిగినా ఇవ్వరు కొందరు. అయినా  నా పర్మిషన్ అవసరంలేదనుకుంటా ఇక్కడ " అంటూ ఇంకో వైపుకి వెళ్ళిపోయింది. అతని ముఖం గంభీరంగా మారిపోయింది.

  ఆ సాయంత్రం అనుకోకుండా కురిసిన వర్షంతో  ఇంటి పైకప్పుపై పడుతున్న చినుకుల్లోనుండి  ఒక పావు వంతు లోపలకి కారిపోతున్నాయి .   ఇల్లంతా తడవకుండా ఉండటానికి ఇంట్లోని పాత్రలన్నీ తెచ్చి  ధార క్రింద పెడుతుంది. నిండిన వెంటనే వాటిని బయట ఒంపేసే లోపలే ఇంకొక పాత్ర నిండుతుంది  ఇంట్లోకి ద్వారానికి మధ్య గడియారంలో లోలకంలా ఊగుతూనే ఉంది మోహన. అంత వానలో ఇంటి ముందు ఎవరో ఆగిన శబ్దం. తలెత్తి చూసిన ఆమె ఆశ్చర్యపోయింది. చేతిలో పాత్రని క్రిందికి వదిలేసి ప్రక్కకి జరిగి లోపలకి రండని ఆహ్వానించక తప్పలేదు. వచ్చినతను కాలేజ్ డైరెక్టర్.  అతను తను వేసుకున్న షూ ని గుమ్మం బయటే వదిలేసి లోపలకి అడుగు పెట్టాడు. ఒకదానిలో ఒకటేసి ఓ మూలకి ఉంచిన  కుర్చీల్లో   నుండి ఒక కుర్చీని తీసి  చినుకులు పడనిచోట  వేసింది. అతను వేసుకున్న రెయిన్ కోట్ ని విప్పి అటు ఇటు చూసి తగిలించడానికి ఏమీ కనబడక తలుపుకి తగిలించాడు.

అనుకోకుండా వచ్చిన అతిధికి మర్యాదలెలా చేయాలా అని ఆలోచిస్తూ ఉన్న ఆమెని "కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా " అడిగాడు .  ఆమాటైనా తనడగనందుకు సిగ్గుపడింది.  త్రాగిన గ్లాసుని ఆమె చేతిలోనున్న ట్రే లో పెడుతూ ఇల్లు బాగా కురుస్తున్నట్లు ఉంది అన్నాడు.

అవునండీ ... క్రొత్త రేకులు కాక పోయినా కనీసం ప్లాస్టిక్ పట్టా అయినా కప్పించాలని అనుకున్నాను. అంతలోనే అమ్మకి  ఆరోగ్యం పాడవడం, హాస్పిటలు ఖర్చులు, చనిపోవడం మళ్ళీ  ఆ ఖర్చుల్లో ఇంటికేమీ పెట్టడానికి కుదరలేదు.  వచ్చిన అతిధి ముందు తన బీదరికమేమి సిగ్గుపడేది కాదన్నట్టు మాములుగా చెప్పింది.

"మీ అమ్మగారికి  బాగోలేనప్పుడు హాస్పిటల్ ఖర్చులకని, పోయిన తర్వాత అవసరపడతాయని డబ్బు పంపాను తీసుకోలేదు మీరు " అన్నాడు.

అంతకు  ముందే తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాను. అవసరం లేదనిపించింది . నా జీతం డబ్బుతో  ఏడాది లోపులోనే అప్పులన్నీ  తీరిపోతాయి.  ఇకనుండి నేను ఒక్కదాన్నేకదా !

మీ అమ్మగారు  చనిపోయినప్పుడు రాలేక పోయాను . సారీ ! అన్నాడతను. మసక వెలుతురులో మౌనంగా నిలబడిన ఆమె  నయన సరస్సులో కన్నీటి పుష్పం విరిసింది.   వర్షం కురుస్తూనే ఉంది . ఇల్లు తడుస్తూనే ఉంది .

"మీరు నిలబడే ఉన్నారు కూర్చోండి" .

"మీరు అనడం ఇబ్బందిగా ఉంది. చిన్నప్పుడు పిలిచినట్టు పేరుతొ పిలిస్తే సరిపోతుంది కదా ! " అంటూ కుర్చీలో కూర్చుంది. మళ్ళీ అంతలోనే లేచి "కాఫీ కలపడానికి పాలు కూడా లేవు. అయినా అతిధి మర్యాదకేమీ లోటు రానివ్వను. అలా వర్షాన్ని చూస్తూ కూర్చోండి అయిదు నిమిషాల్లో కాఫీ పట్టుకొస్తాను " అంటూ రెండో  గదిలోకి వెళ్ళింది.

నీళ్ళలో కాఫీ పొడి మరుగుతున్నప్పుడు వచ్చే వాసనతో ఏదో క్రొత్త వాసన మిళితమై నాసికా పుటాలకి అందుతుంటే ..ఎప్పుడెప్పుదు ఆ కాఫీ రుచి చూద్దామా అన్నట్టు ఎదురు చూడసాగాడతను. పొగలు క్రక్కుతున్న బ్లాక్ కాఫీ లాంటి ద్రవాన్ని స్టీల్ గ్లాస్ లో నిండా పోసి చెయ్యి కాలకుండా వేరొక స్టీల్ గిన్నెలో పెట్టి ఇచ్చింది. నెమ్మదిగా ఊది తలొంచి ఒక సిప్ తీసుకున్నాడు అద్భుతమైన రుచి. కాఫీ లో పంచదార బదులు బెల్లం కలిపినట్లు తెలుస్తుంది అది కాకుండా మరొకటేదో రుచి నాలికపై నాట్యం చేస్తూ వెచ్చగా లోపలకి దిగుతుంటే తెలియని ఆనందమేదో అతని కళ్ళల్లో. గ్లాస్ పెట్టిచ్చిన గిన్నె తీసి క్రిందపెట్టి రెండు చేతులతోనూ అపురూపంగా గ్లాస్ పట్టుకుని గుటక గుటక ని ఆస్వాదిస్తూ త్రాగేసి తర్వాత కూడా చేతిలోనే గ్లాస్ ని పట్టుకుని కూర్చున్న అతని చేతిలో నుండి గ్లాస్ ని తీసుకుని సింక్ లో పెట్టి వచ్చింది. కరంట్ వచ్చేటట్టు లేదు వాన తగ్గేటట్టు లేదు. దీపం వెలిగిస్తానంటూ  గ్లాస్ లాంతర్ ని వెలిగించింది ఆమె.

"ఇంకా  ఈ లాంతర్ వాడుతున్న మిమ్మల్ని  చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది మోహనా !"  అన్నాడు .

"నేనంత  ఆధునికం కాలేదు. పాత వస్తువులు,పాత అలవాట్లు మనని అంటిపెట్టుకున్నప్పుడే  కొత్తగా మనమేమి మారలేదన్న సృహలో ఉంటాం .  కొత్తెప్పుడూ  ఆసక్తిగా, ఆకర్షణీయంగా , ఉత్సాహంగా  ఉంటుంది కానీ కొత్తలో పడి  కొట్టుకుపోవడం నాకిష్టం లేదు " మాటల్లో నిర్మొహమాటం.

గడ్డకట్టిన మౌనాన్ని  కాసింత కరిగించి "ఇన్నేళ్ళు  ఎక్కడున్నారు ?  అసలు మీరు  చదివిన చదువేంటి చేస్తున్న ఉద్యోగం ఏమిటీ ? మీతో  పాటు చదివిన వాళ్ళందరూ మంచి కాలేజీలల్లో ప్రొఫెసర్స్  గానూ వేరే ఉద్యోగం లోనో   స్థిరపడిపోయారు. మీరేమో  ఇలా గార్డెనర్ అవతారమెత్తావ్.  ఆ పోస్ట్ కి వచ్చిన  మీ రెజ్యూమ్  చూసి ఆశ్చర్యపోయాను "

" మనుషులని చూసిన తర్వాత వచ్చే వికారం తగ్గడానికి పచ్చని చెట్లని చూడండి " అన్నారట ఆస్కార్ వైల్డ్. ఉద్యోగం పేరిట ఎక్కెడెక్కడో ఉన్నాం. ఎక్కడికెళ్ళినా నేనే  సర్దుకోలేకపోయాను. బయట ప్రపంచంతో కాదు నాతొ నేనే సర్దుకోలేకపోయాను ఎవరైనా ఏమైనా అంటారని నాకనిపించినప్పుడు అనే అవకాశాన్ని వాళ్ళకివ్వకుండానే నేనే రాజీనామా చేసి వచ్చేసేదాన్ని. పదేళ్ళలో ఎనిమిది ఉద్యోగాలు. ఆరు నగరాలు.. ఆఖరికిలా సొంత ఊరులో వచ్చి పడ్డాను. కాస్తంత హాయిగా ఉందిప్పుడు ". నవ్వింది.

"మీరొచ్చిన ఆరు నెలల్లోనే కాలేజీ ఆవరణమంతటిని భలే మార్చేసారు.  ఆఖరికి క్లాస్ రూమ్ లలో కూడా  ఇండోర్ ప్లాంట్స్ . పంకాలు తిరగాల్సిన అవసరం లేకుండా చల్లగా మార్చేసారు!  కేంపస్ సెలక్షన్స్ కోసం వచ్చిన కంపెనీల  వాళ్ళందరూ ...  కాలేజ్ గార్డెన్ ని, కారిడార్ ల పరిశుభ్రతని చూసి భలే మెచ్చుకున్నారు. మాక్కూడా ఇలాంటి గార్డెనర్ దొరికితే బావుండునన్నారు"   ప్రశంసించాడు. చిన్నగా నవ్వి ఊరుకుంది.

వర్షం తగ్గినట్లే ఉంది. ఇక వెళతాను. లేచి షూస్ వేసుకుని రెయిన్ కోట్ తొడుక్కుంటూ " ఏమైనా అవసరపడితే కాల్ చేయొచ్చు" అంటూ కార్డ్ ఇచ్చాడు . తీసుకుని థాంక్స్ చెప్పింది. తలమీదకి హేట్ లాక్కుని కురుస్తున్న వర్షంలో వెళుతున్న అతన్ని చూసి ఆశ్చర్యపోయింది.  కాలేజ్ నుండి కిలోమీటర్ పైనే ఉంటుంది అతని  ఇల్లు. అన్ని కార్లున్నాయి. అయినా నడిచే వచ్చాడు . తనకి  తారసపడిన చాలామంది కన్నా విచిత్రంగా ఉన్నాడితను   పదిహేనేళ్ళ క్రితం చూసిన మనిషి.  వయసు పెరుగుతున్న కొద్దీ మార్పు రావడం సహజమే అన్నట్టు ఉన్నాడిప్పుడు  అనుకుంది. రాత్రి పడుకున్న తర్వాత కూడా ముసురేసిన మబ్బులాగానే కొన్ని జ్ఞాపకాలు కూడా ఆమెని తడిమి నిలువెల్లా  తడిపేసి వెళ్ళాయి.
_ఇంకా ఉంది .