23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

లతాంతాలు 2

లతాంతాలు రెండవ భాగం

రెండోసారి అతనొచ్చినప్పుడు వాన లేదు కానీ  పుష్యమాసపు వెన్నెల్లో  ఇంటి ముందు దడికి అల్లుకున్నతీగపై  తెల్లని అనపపూల సౌందర్యాన్నిచూసి మైమరపులో పడినప్పుడు  ప్రక్కనే వచ్చి నిలబడి చిన్నగా దగ్గాడు. ఉల్కి పడింది.

"మీతో చిన్నపని  పడింది అందుకే రాక తప్పలేదు" అన్నాడు.

"లోపలి రండి." ఆహ్వానించింది .

"ముందుగా మీరు  నాకొక హామీ ఇవ్వాలి. మీ మార్క్ కాఫీ  వీలైతే  మీ చేతి వంట కూడా రుచి చూడాలనుకుంటున్నాను. చాలా ఆకలిగా ఉందీ  రోజు"  పొట్ట మీద చెయ్యేసుకుని చెప్పాడు.

"తప్పకుండా ! కూర్చోండి " అని కుర్చీ చూపి మంచి నీళ్ళు అందించింది.

"మధ్యాహ్నం లైబ్రరీలో బుక్స్ సర్దిస్తూ లంచ్ కి వెళ్ళలేదు.  ఆఫీస్ లో  అర్జంట్ పనులు  చేసుకుంటూ రాత్రయింది కూడా చూసుకోలేదు. ఇంటికి వెళదాం అనుకునేసరికి కార్ రిపేర్. ఇంట్లో కూడా ఎవరూ లేరు.   మీ చేతి వంట  తినాలని,మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని  రాసి పెట్టి ఉందీరోజు." సంజాయిషీగా అన్నాడు.

"కూరగాయలు కూడా ఏమీ లేవు. అనుకోకుండా ఇలా అతిధి వస్తే ఏం చేయాలి?  ఆలోచిస్తూనే కాఫీ తయారు చేయడానికి గ్యాస్ స్టవ్ అంటించబోయింది. టుపుక్ టుపుక్ మన్న శబ్దం తప్ప స్టవ్ వెలగలేదు. "గ్యాస్ నిండుకుందేమో... సిలిండర్ మార్చండి ,నేను హెల్ప్ చేయనా? " అంటూ చొరవగా ఆ గదిలోకి వచ్చేసాడు.

ఆ చొరవకి ఆమె మనసు ఉక్కిరి బిక్కిరి అవుతుంది.  "రెండో సిలిండర్ లేదు , కుంపటి వెలిగిస్తానుండండి." అంటూ  కింద అరల్లో దాగిన కుంపటి , బొగ్గుల కవరుని బయటకి తీసింది.

 ఇనుప కుంపటి నిండా  బొగ్గులు నింపి  కొబ్బరి పీచుతో వెలిగించి గుమ్మానికి ఎదురుగ పెట్టింది. బయటనుండి వీస్తున్న గాలికి రెండు నిమిషాల్లోనే కణ కణ మంటూ మండింది. ముందుగా తన మార్క్  బ్లాక్ కాఫీ కలిపి ఇచ్చింది. కాఫీ కలుపుతున్నప్పుడు తయారు చేసే  విధానాన్ని ఆసక్తిగా గమనించాడు. నీళ్ళలో  కాఫీ పొడితో పాటు కొద్దిగా  బెల్లం,  కొన్ని మిరియపు గింజలు, చిన్న ముక్క దాల్చిన చెక్క వేసింది.  అతను కాఫీ  త్రాగుతూండగా మొహమాటంగా చెప్పింది.

"ఒంటిదాన్ని, తిండి మీద శ్రద్ద లేనిదాన్ని. కూరగాయలు కూడా ఏమీ లేవు. ఏదో  ఉన్నదాంట్లో మాత్రమే మీకు భోజనం పెట్టగలను" .

"ఏమైనా పెట్టండి  తినేస్తాను . ఆఖరికి విషమైనా, అలా  అయినా మీకు  చేసిన అన్యాయానికి దండన వేసినట్టు ". తలొంచుకుని పశ్చాతాపం నిండిన గొంతుతో చెప్పాడు.

"జరిగనవన్నీనేనెప్పుడో మర్చిపోయాను. గతాన్ని తవ్వుకోవడం,బాధపడటం నాకిష్టం ఉండదు. భవిష్యత్ గురించి కూడా నేను ఆలోచించను. వర్తమానమే  ముఖ్యం నాకు". అంటూ ఆర్ కె నారాయణ్ మాల్గుడి కథలు బుక్ తెచ్చి అతని చేతిలో పెట్టి చదువుతూ ఉండండి నేను త్వరగా వంట చేసేస్తాను.

అతను ఇచ్చిన  పుస్తకాన్ని పై పైన తిరగేస్తూ కూర్చున్నాడు. చిన్న అల్యూమినియం చట్టిలో నూనె పోసి నెల్లి కాయలని,  ఎండు  మిరపకాయలని,కాస్త కొత్తి మీరని  విడి విడిగా వేయించింది. కందిపప్పుని దోరగా వేయించింది. చల్లారిన తర్వాత  కడిగి మట్టి చట్టిలో వేసి కుంపటి మీద పెట్టి, చిన్న రోటి ముందు కూర్చుని నెల్లి కాయల్ని  గింజ నలక్కుండా దంచి గింజలని వేరేసింది. వాటిలోనే  వేయించిన  కొత్తిమీర ఎండు మిరప కాయలని వేసి  మెత్తగా  నూరింది అందులో వెల్లుల్లిపాయలు జీలకర్రేసి నూరి కలిపేసి గిన్నెలోకి తీసింది. ఇంగువ, కరివేపాకు వేసి తాళింపు  పెట్టింది.  ఆమె చేసే ప్రతి పనిని శ్రద్దగా గమనిస్తున్నాడతను. ఏ పని చేసినా అందులో అంకితభావం కనబడుతుంది.  తర్వాత చిన్న గిన్నెలో బియ్యం కడిగి అత్తెసరు పెట్టొచ్చి అతని ఎదురుగా కుర్చీ జరుపుకుని కూర్చుని .. "ఇప్పుడు చెప్పండి  మీ విషయాలు. మీ పాప ఏం చదువుతుంది? బాబు  ఊటీ స్కూల్ లో చదువుతున్నాడని వాచ్ మెన్ చెపుతూ ఉంటాడు."

"అమ్మాయిని కూడా ఊటీ లోనే జాయిన్ చేసేది మా ఆవిడ. కానీ పాప నన్ను ఒదిలి ఒక్క రోజు కూడా ఉండదు. అందుకే ఇంటి నుండే స్కూల్ కి వెళుతుంది సిక్స్త్ క్లాస్ చదువుతుంది బాబు ఎయిత్ క్లాస్. ఇక నా భార్య లత  కూడా మంచిదే! డబ్బున్న కుటుంబంలో పుట్టానన్న అహంకారం  తప్ప చాలా విషయాల్లో ఉదారంగా ఉంటుంది. తనలాగా క్లాస్ మెంటాలిటి ఉన్నవాళ్ళతో కలిసి సర్వీస్ క్యాంప్ లు నిర్వహిస్తూ ఉంటుంది. పరిశుభ్రతంటే పిచ్చి ఇష్టం. ఇల్లంతా ఎప్పుడూ ఫైవ్ స్టార్ హోటల్ లా ఉండాలంటుంది. తనకొక గది, నాకొక గది, పాప కొక గది, బాబుకొక గది, అమ్మ కొక గది. అందరూ నిద్ర లేచాక చూసుకోవాల్సింది మనుషులని కాదు గోడలని.  మోడరన్ గా తను అలంకరించుకోవడమే కాదు ఇంటిని అలంకరిస్తుంది. ఎప్పుడూ మార్పులు చేర్పులూ,షాపింగ్ లూ . తనదంతా బిజీ ప్రపంచం.

" ఈ లోకంలో ఒకరి ప్రపంచంలో మరొకరు కలవని ప్రత్యేక ప్రపంచాలు చాలా ఉన్నాయిలెండి "

 అవునేమో ! ఆ ప్రపంచంలో మా మధ్య మాటల వారధి సెల్ ఫోన్. అప్పుడప్పుడూ కొత్త వాళ్ళ లా పలకరించుకున్నట్టు అనిపిస్తుంది కదా .. రామ్ అని నవ్వుతుంటుంది. పసి పిల్ల మనస్తత్వం. ఏదైనా ఆమె అడిగినప్పుడే  ఇవ్వాలి. ప్రేమతో గిఫ్ట్ ఇచ్చినా ఆమెకి నచ్చవ్ ! నేను నిన్ను అడిగానా అంటూ గొడవపెట్టుకుంటుంది. అంతా డిమాండ్  అండ్ సప్లై లాగా అన్నమాట.  ఆఖరికి దాంపత్యమైనా సరే అంతే ! మాములుగా చెప్పాడు.  ఆ విషయాన్ని కూడా . మోహన కూడా మాములుగానే విన్నట్టు వింది.

"మిమ్మల్ని  చూస్తుంటే చాలా శాంతంగా ఉంటుంది, పదే పదే  వస్తున్నానని  ఏమీ అనుకోకండి . ఇలా రావడం వల్ల మీకేమీ ఇబ్బంది లేదు కదా?"

"నాకెలాంటి ఇబ్బంది లేదు , ఇతరులేమన్నా అనుకుంటారేమోనన్న వెరపు  అసల్లేదు. ఎవరి జీవితం వాళ్ళకి నచ్చినట్లే ఉండాలి,  భయం నుండి స్వేచ్ఛ లోకి పయనించేటప్పుడు  లోకం గురించి ఆలోచనెందుకు? "

"స్వవిషయంలో  జోక్యం చేసుకుంటున్నాననుకోకు.  మీరు అని సంభోదించే  పరాయి వాడినని నేను అనుకోవడం లేదు,  పెళ్ళెందుకు  చేసుకోలేదు?

"ఆసక్తి లేదు" .

"ఎవరినైనా ప్రేమించావా ?"

ప్రేమా !... అంటూ ఆలోచనగా చూసి " అయినా నన్నెవరు ప్రేమిస్తారు  నన్ను ప్రేమించరని తెలిసీ నేనెందుకు ఎవరినో ప్రేమించాలి ? నిస్వార్ధమైన ప్రేమలంటూ ఏవీ ఉండవనుకుంటా ? అన్నీ అవసరాలని బట్టి పుట్టే ప్రేమలే !"

"అలా ఎందుకంటావ్ !?  మనుషుల మధ్య అసలు ప్రేమలనేవీ  లేని యంత్ర యుగం రాలేదు ఇంకా ! ఇప్పుడైనా పెళ్లి చేసుకో! "

" మనుషులే యంత్రాలై బ్రతుకుతున్న రోజులివి. ఆఖరికి నా తల్లిదండ్రులనే తీసుకోండి. కోడలెలాగూ  చూడదని తెలుసు కాబట్టే నన్ను అంటిపెట్టుకుని ఉన్నారని నాకూ వాళ్ళకీ  మాత్రమే  తెలుసు. లోకానికి మాత్రం పాపం  ఆడపిల్ల!  పెళ్ళీ పెటాకులు లేకుండా ఒంటరిగా ఉంటుందని ఆ పిల్లని కనిపెట్టుకుని ఈ వయసులో ఊరూరు తిరుగుతున్నారని సానుభూతిని పొందేవారు. వాళ్ళదగ్గరున్న  డబ్బు,పొలం,నగలు అన్నీ కొడుకు పిల్లలకి ఎప్పుడో ఇచ్చేసుకున్నారు. కన్నవారి  ప్రేమలోనే నిజాయితీ లేదు అవసరాలకి పుట్టే ప్రేమల్లో నిజాయితీ ఎక్కడుంటుంది.? "ఆ గొంతులో లీలగా అణచిపెట్టుకున్న వేదన.

"వాన కురిసినప్పుడు బీటి మీద కూడా మొలకలు వస్తాయి. అలాగే ప్రేమ కూడా .!  నీ వయసు కూడా పెద్ద ఎక్కువేమీ కాదు ముప్పై అయిదు ఆరు మధ్య ఉంటుందేమో కదా !

"నా వయసు భలే గుర్తుందే మీకు"

"కలిసి పెరిగిన వాళ్ళమే కదా!.మూలాలని మర్చిపోయేంత గర్వం,  జరిగినవేమీ గుర్తు లేనంత మరుపు రాలేదు ఇంకా .

ఆ మాటలు విననట్టే    "మీకు  భోజనం తయారుగా ఉంది,  అయితే క్రింద కూర్చునే భోజనం చేయాలి " అంటూ వడ్డించటానికి తయారైంది

ఒక్కటే కంచం పెట్టడం  చూసి "రోజూ  ఒక్కడినే తినడం బోర్  కొడుతుంది . ఇద్దరం కలసి తిందాం నువ్వూ పెట్టుకో మోహనా."

"మీకు కంపెనీ ఇవ్వాలని తినడం లేదు నాకూ ఆకలిగానే ఉంది కాబట్టి తింటాను " అంటూ మరొక కంచం తెచ్చుకుని ఎదురుగా కూర్చుంది.

పప్పులో నెయ్యేసి కలుపుకుని ఒకసారి కొత్తిమీర పచ్చడేసుకుని ఒకసారి రెండూ కలిపి ఒకసారి తింటూ  భోజనాన్ని ఆస్వాదిస్తూ చాలా బావుంది మోహనా, థాంక్స్! అన్నాడు .

"అయ్యో ! నేనేమీ స్పెషల్ గా చేయలేదు. కనీసం మజ్జిగ కూడా లేని భోజనం పెట్టాను. అతిధికి ఇలాంటి భోజనమేనా  పెట్టడం అని నాకు నేను మొట్టికాయ వేసుకుంటున్నా" అంది నవ్వుతూ .

"దేనికైనా కాంబినేషన్ కుదరాలి.కాంబినేషన్  కుదరని వంటలు,  కాంబినేషన్ కుదరని జీవితాలు చప్పగా ఉంటాయి.ఎనీ హౌ , మంచి భోజనం పెట్టినందుకు థాంక్స్ చెప్పకుండా ఉండలేను. "వాచ్ చూసుకుంటూ రేపు   కాలేజ్ దగ్గర కలుద్దాం.  ఇక వెళ్లొస్తాను మోహనా.. అంటూ సెలవు తీసుకున్నాడు.

సంక్రాంతి సెలవలిచ్చే  ముందు రోజు కారిడార్ లో ఎదురైనప్పుడు " గ్రౌండ్ లో ఇంకా ఎక్కువ మొక్కలు వేస్తే బావుంటుందని అనుకుంటున్నా.  కడియం  నర్సరీకి వెళ్లి మొక్కలు కొనుక్కురావాలి. మీరు  కూడా వస్తే బావుంటుంది ". సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడతను.

"ఇబ్బందేమీ లేదు, వస్తాను ..  ఎప్పుడో చెప్పండి ?"

" రేపే వెళదామా ! ఎల్లుండి బాబు వస్తున్నాడు. వాడు వెళ్ళిందాకా నా సమయాలన్ని లత   చేతిలోనే ఉంటాయి.
రేపుదయం సిక్స్ కల్లా రెడీగా ఉండండి. వచ్చి పికప్ చేసుకుంటాను". తలూపింది.అతను  ఇంటికొచ్చి పికప్ చేసుకోకుండా తనే కాలేజ్ గేట్ దగ్గర వెయిట్ చేస్తూ నిలబడింది మోహన. డ్రైవింగ్ సీట్లో కూర్చున్నతను ముందు సీట్ ఆఫర్ చేసాడు. చిన్నగా నవ్వి వెనుక సీట్ లో కూర్చుంది.

దట్టమైన మంచులో ప్రయాణం నెమ్మెదిగా సాగుతుంది. నిర్భయంగా, ఒద్దికగా,సంస్కారంగా కూర్చున్న ఆమె తీరుని చూసి ఈ మనిషికి చిన్న ఒంక పెడదామనుకున్నా అవకాశమే ఇవ్వదు అనుకుంటూ "మీకొక  విషయం చెప్పనా ? కారులో కూర్చున్న తీరుని బట్టే మనిషిని అంచనా వేయోచ్చని మామయ్య చెపుతారు. యజమానులందరూ కారు ముందు సీట్లో కూర్చుని దర్పం ప్రదర్శిస్తారంట. కానీ నిజమైన యజమాని వెనుక సీట్ లో  డ్రైవర్ తో సంభాషణకి అనుకూలంగా ఉండేటట్టు కూర్చుంటారట."  నవ్వేసి ఊరుకుంది.

దారిపొడవునా  ఆమె పచ్చని పైరు పొలాలని  కుడిప్రక్క పైపైకి లేస్తున్న గోరువెచ్చని సూర్యుడి అందాలని  చూస్తూ మెడకి ఎక్సర్సైజ్ ఇస్తూనే ఉంది. అతను వెనక్కి తిరిగి చూస్తూ ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాడు.

"అగర్ తుమ్  మిల్ జావో జమానా చోడ్  దేంగే హమ్" ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్  ప్లే అవుతుంది. అద్దం సరిచేసుకుని అందులో కనబడే ఆమెని చూస్తూ  అతను. అదేమీ పట్టనట్లు ఆమె.  ప్రయాణం సాగుతూనే  ఉంది .  మధ్యలో ఒకచోట ఆపి కాఫీ త్రాగారు. తొమ్మిది గంటలకల్లా కడియంలో ఒక  నర్సరీకి  చేరుకున్నారు.

ఆ మొక్కలని, పూల అందాలని చూస్తూ ఆమెలో నూతన ఉత్సాహం.
"మంచు వర్షంలో స్నానం చేసినట్లున్నాయి మొక్కలన్నీ. . పూలన్నీ నన్ను చూడండి, నన్ను చూడండి అని పోటీ పడుతున్నాయి"

"ఇంకా ఏమనిపిస్తుంది మీకు ?" కొంత అల్లరితనం .

"పూల మంకరందాన్ని తీసుకుని ఎగిరిపోయే సీతాకోక చిలకలని, పూల మకరందాన్ని గ్రోలి కృతజ్ఞత చెపుతున్నట్లు ఝుంకారంతో పువ్వు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్లు ఉన్న మధుపాన్ని చూడండి.  మనుషులు తరహా  కూడా ఇంతే అన్నట్టు ఉన్నాయి కదండీ." పంచ్  పడింది.

"ఈ  ఇండోర్ ప్లాంట్స్ విజయగర్వంతో ఊగుతున్నాయి. రంగుల్లో మాకెవరూ సాటిరారు, ఆఖరికి ఇంద్రధనుస్సు కూడా అన్నట్టు "

అతనిలో మౌనం. ఆకుపచ్చ చీరతో  నర్సరీ అంతా తిరుగుతూంటే వనకన్యలా ఉందీమె. ఈమెకి మోహన అని పేరెవరు పెట్టారో  నన్ను మోహనావలో పడేయడానికి కాకపొతే !

ఆ లిల్లీ పూలు,ఈ పారిజాతాలని  చూడండి ..  "గాలికి గాఢ పరిమళాలనల్లడమే తమకి చాతనవును అన్నట్టున్నాయి " వర్ణిస్తూనే ఉంది. అతను హాయిగా నవ్వేదాకా !

begonia plant  టిష్యూ కల్చర్ తో వస్తాయి ఈ కలర్స్ అన్నీ . ఇవి పాట్ ప్లాంట్స్ . ఇందులో కొన్నిరకాలు  పూలు కూడా పూస్తాయి .

aglaonema plant చైనీస్ రకం .హైబ్రీడ్స్ లో చాలా రంగులు వస్తాయి .  కారిడార్ లలో కుండీలలో బాగా పెరుగుతుంది.. అని వివరిస్తూనే ఉంది.

గ్లాడియోలస్ దుంపలు కావాలని అడిగింది. నల్ల గులాబీ కావాలని అడిగింది . లేవండి ఈ వాతావరణానికి రావడం కష్టం అని చెప్పారు.  .లేదు వస్తాయి కదా ! అంటుంది తను అల్లరిగా .ఏదో కుండీలలో పెంచుకోవడానికైతే వస్తాయి. క్రాఫ్ గా తీయాలంటే చాలా కష్టం.  గొప్ప విషయాన్ని  కనుగొన్నట్టు చెప్పాడతను. రఘు ముఖానికి దగ్గరగా తల వొంచి   రహస్యంగా చెప్పింది అసలు నల్ల గులాబీ ఉండదని, టిష్యూ కల్చర్లో కూడా సాధ్యపడదని.  ఎవరైనా చెపితే నమ్మకండి. ముఖ్యంగా ఆన్ లైన్ షాపింగ్ లో " నవ్వుకున్నడతాను.

caladium bulbs  తీసుకుంది. దుంపజాతికి చెందిన మొక్కలు.  ఈ మొక్కలంటే నాకు చాలా ఇష్టం . హృదయాకారంలో అకులుంటాయి . మనవాళ్ళు ఏనుగు చెవులాకుల మొక్క అంటారు .  ఈ నలుపు గులాబీ కలిసున్నఆకులు చూడండి . ఎంత బావున్నాయో !నడిచే దారి పొడవునా నాటితే చాలా బావుంటాయి. పెద్దగా పెరిగిన చెట్ల మొదట్లో కూడా వేయవచ్చు.  ఇందులో ఎనిమిది రకాలున్నాయి అన్నీ కలిపి ఒకే కుండీలో నాటితే చాలా కలర్ఫుల్ గా బావుంటాయి. ఎంతో రసికుడు దేవుడంటారు  ఇందుకే కాబోలు.  నచ్చిన మొక్కలని చూసినందుకేమో  ఉత్సాహంగా, సంతోషంగా మాట్లాడేస్తుంది.

అయితే ఆర్డర్ పెట్టి  ఇంకా ఎక్కువ తీసుకుందాం అన్నాడు . మధ్యలో ఒకసారి భార్యకి  ఫోన్ చేసి " లతా  ! ఇండోర్ ప్లాంట్స్ ఆర్కిడ్ వెండా చాలా రకాలున్నాయి. నీకిష్టం కదా తీసుకు రానా !? అని అడగడం వింది. తర్వాత తీసుకోకుండా వదిలేయడం చూసింది. అతను  ప్రక్కకి వెళ్ళినప్పుడు అవి కూడా ఆర్డర్ లో నోట్ చేసింది.
మధ్యాహ్నం లంచ్ చేసినతర్వాత  తను డిజైన్ చేసిన నమూనాలని మొబైల్ ఫోల్డర్ ఓపెన్ చేసి  తీసి చూపెట్టింది. అన్నీ బావున్నాయని మెచ్చుకున్నడతాను.

కొన్ని గ్రాప్టింగ్ చేసుకోవచ్చనీ , కొన్నింటికి సీడ్స్ ఉంటాయని , కొన్ని మొక్కలు కొమ్మలు నాటితేనే వస్తాయని వివరంగా చెప్పి భారీ ఆర్డర్ ని సగానికి తగ్గించేసి చాలా ఖర్చు తగ్గించింది. ఉన్న నాలుగు నర్సరీలని ఓపికగా చూసి కావాలసినవన్నీ కొని తిరిగి ప్రయాణమయ్యేటప్పటికి మునుమాపు వేళైంది. ఉదయం నుండి కలసి తిరగడం,మాట్లాడుకోవడం వల్ల కొంత చనువేర్పడి ...

ఊటీలో దొడ్డబెట్ట , బొటానికల్ గార్డెన్,  గవర్నమెంట్ రోజ్ పార్క్ చూసారా ?

"లేదు మోహనా ! నేను ఒక్కసారే వెళ్లాను. అర్జంట్ పనులవల్ల వెంటనే తిరిగి వచ్చేసాను.  వీలు  చూసుకుని వెళ్లి బాబుతో గడిపి రావాలి."

"శ్రీనగర్ లో సిరాజ్ బాగ్ తులిప్ గార్డెన్స్ చూసారా? ఆసియాలో పెద్ద గార్డెన్స్ అవి.  మార్చ్ ఏప్రియల్ నెలల్లో  వెళితే చాలా బావుంటుంది. ఫ్యామ్లీతో వెళ్ళిరండి."

"కాశ్మీర్ నచ్చనివారెవరైనా ఉంటారా ? మీకు  ఏం  నచ్చాయక్కడ ? ఏం  తీసుకొచ్చారు ? ఆసక్తిగా అడిగాడు.

"నల్ల  తులిప్ ని అక్కడే చూసాను. చాలా ఇష్టపడి దుంపలని  తెచ్చాను కానీ  పూలు పూయించలేకపోయాను అదొక కోరిక మిగిలిపోయింది. అప్పటికి ప్లోరీ కల్చర్ నాకంతగా తెలియదు. ఇప్పుడు ట్రై చేయాలి. " .తర్వాత  వారి మధ్య మాటల్లేవ్ ! దారి మధ్యలో ఒక అరగంట ట్రాఫిక్ జామ్.

వెనుక సీట్లో కూర్చున్న ఆమె రోడ్డు వైపు చూస్తుంది. సన్నని వెలుతురు ఆమె ముఖం పై బడి కారు సీట్ పై  బడ్డ  నీడనే చూస్తున్నాడు.  ఆమె కళ్ళు మూసి తెరిచినప్పుడల్లా  నీడలో కదులుతున్న ఒత్తైన పొడవైన కనురెప్పల అందాన్ని  అతని హృదయం ఒడిసి పట్టుకుంది. ఆనీడని  ఏ చిత్రకారుడో చూస్తే నిమిషాల్లో వెలుగు నీడల కలయికలో అద్భుత చిత్రాన్ని ఆవిష్కరించగలడనిపించింది.  అప్పటికప్పుడు పొర్లి వచ్చే ప్రేమని ప్రకటించడం కూడా అవసరమనుకున్నాడు.

లక్ష్మీకాంత్ -ప్యారేలాల్ ద్వయం మనుషులని స్వరాలతో చంపేసే పని పెట్టుకున్నారేమో అన్నట్టుండే  మహేంద్ర కపూర్  తన మనసులో మాట చెపుతున్నాడేమో ననిపించే  పాట ప్లే చేసాడతను.

బహోత్ తర్సా హై  యే దిల్ తేరే సప్నే సజాకే ,
బహోత్ తర్సా హై  యే దిల్ తేరే సప్నే సజాకే ,
యే దిల్ కి బాత్ సున్ లే మేరి బాహోం మే ఆకే
జగాకర్  అనోకి ప్యాస్ మన్ మే .యే  మీఠి ఆగ్  జో బెహకా రహీ హై ,
యే  పెహలే ప్యార్ కీ ఖుష్బూ....
తేరి సాసోంసే షాయద్   ఆ.. రహీ హై .
 మేరీ సాసొంకో  జో మెహకా రహీ హై,

పాట మొత్తం వినకుండా ఇయర్ ఫోన్స్ చెవుల్లో పెట్టుకుని తన మొబైల్ లో పాటలు వినే పనిలో పడింది ఆమె.

1 వ్యాఖ్య:

Lalitha TS చెప్పారు...

మోహనావ

నచ్చిందీ పద ప్రయోగం - మనోహరం!