26, సెప్టెంబర్ 2016, సోమవారం

లతాంతాలు 3

మర్నాడుదయమే  రఘు కాలేజ్ కి వచ్చేసరికే పనిలో బిజీ అయిపోయిన ఆమెని చూసి ఆశ్చర్యపోయాడు

ఆక్వాటిక్ ప్లాంట్స్ నాటడం కోసం చిన్న చెరువుని తవ్విస్తూ  తవ్విన మట్టిలో వర్మీ  కంపోస్ట్ కలిపి కుండీలలో  సగం పైగా నింపి  ఒక ప్రక్కకి పెట్టిస్తూ ఉంది.

దగ్గరకొచ్చి "అప్పుడే పని మొదలెట్టేసారా? ఈ రోజు రెస్ట్ తీసుకావాల్సింది"

"నర్సరీ వాళ్ళు ఈ రోజు సాయంత్రానికల్లా లోడ్ పంపిస్తామని ఫోన్  చేసారు. అదీ కాకుండా సెలవలైపోయే టప్పటికి  గార్డెన్ డిజైన్ పూర్తిచేయాలి కదా !"

"అదీ నిజమే !" ఒప్పుకున్నాడతను

"మీరు వాస్తుని నమ్ముతారా ? అడిగింది . నేను నమ్మడం నమ్మకబోవడం  కన్నా నమ్మే వాళ్ళని కాదని ముందుకు వెళ్ళలేను. మామయ్య కాలేజ్ నిర్మాణమంతా  వాస్తు ప్రకారమే జరగాలని ఆర్కిటెక్చర్ కి చెప్పి చేయించారు. ఇక ఇంటి విషయమంతా లత  చూసుకుంది. తనకి వాస్తు పిచ్చి బాగానే ఉంది. ఈశాన్యం మూలన   చిన్న బరువు కూడా పెట్టనీయదు.   చెట్లు కూడా వాస్తు ప్రకారమే ఉండాలంటుంది.

 పెంగ్ షుయి స్టైల్ గార్డెన్ ఐడియా ఒకటి ఉంది. ఎన్విరాన్ మెంట్ కి చాలా మంచిది. ఇప్పుడున్న స్థలం లోనే మంచి గార్డెన్ చేయొచ్చు. మీ మామయ్యా గారి అనుమతి తీసుకుని రండి. నేను డిజైన్ చేస్తాను.

"ఈ రోజు కుదరదు.  మామయ్యింటికి రేపు వెళదాం,,మీరు కూడా వద్దురుగాని "

రఘుతో పాటు కలసి వెళ్ళకుండా ఒక్కతే  మాధవరావు గారి ఇంటికి వెళ్ళింది ." రామ్మా .. రా ..ఎలా ఉన్నావ్ " ఆదరంగా  ఆహ్వానించారు .

"బావున్నాను . మీ ఆరోగ్యం ఎలా ఉంది ? పిన్ని గారు బావున్నారా ?

బాగుందమ్మా ! పూజ గదిలో ఉంది. ఆమె పూజ రెండు మూడు గంటలు పడుతుంది. కూర్చో ! ఏదో గార్డెన్ డిజైన్ చేస్తానన్నావట  కదా ! రఘు చెప్పాడు.  అయినా విధ్యార్ధులతో పాటు నీక్కూడా  సెలవలే  కదమ్మా! సెలవలప్పుడైనా మీ అన్నయ్య ఇంటికి వెళ్లి రావాల్సింది.

"పనిలోనే నాకానందం దొరుకుతుంది. బాబాయి గారు.  పండగ రోజు ఇంట్లోనే ఉంటారని  ఎక్కువ సమయం తీసుకుని మీకన్నీ విపులంగా చెపుదామని ప్లాన్ తో సహా వచ్చాను". అంటూ చేతిలో పేపర్స్ తీసి  డిజైన్ చూపించి  ఏయే రకాలు మొక్కలు ఎలా వేస్తే  బావుంటుందో చెప్పింది .  విద్యార్ధులని ఎలా భాగ స్వామ్యం చెయ్యాలో ఎలాంటి దిగుబడి వస్తుందో ... ఆ వచ్చిన మొత్తాన్ని పేదపిల్లలకి ఫీజుల స్కాలర్ షిప్ ఏర్పాటు చేయవచ్చో  వివరించింది.

"నువ్వు చెప్పిన విధానం నాకు బాగా నచ్చిందంమ్మా! మొత్తానికి కాలేజ్ రూపురేఖలు మర్చేస్తున్నావ్ ! నాకు తెలియక అడుగుతున్నాను . నువ్వు ఇలాంటి చిన్న ఉద్యోగం చేయడమెందుకమ్మా! ఏ  వ్యవసాయ యూనివర్సిటీ లోనో ఉద్యోగానికి వెళ్ళాల్సింది. మంచి జీతం వచ్చేది కదా !".

"నేను డబ్బుకోసం పని చేయడం లేదు బాబాయి గారు. మన ప్రాంతంలో చూడండి. వ్యవసాయం చేసేవాళ్ళే లేరు. భూములన్నీ వెంచర్లుగా మారిపోతున్నాయి. అగ్రికల్చర్ జోన్ అంటేనే  రైతులు మండి పడుతున్నారు . అందరూ సాఫ్ట్ వేర్ లు, డాక్టర్  లూ బిల్డర్స్ వ్యాపారాలు చేసేవాళ్ళే  అయిపోతే వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరూ ?,అసలు వ్యవసాయం దండగై పోతుందని వేలు పెట్టకుండానే పారిపోయే వారందరికి  వ్యవసాయం రుచి చూపించాలి. కాలేజీలో చదివే ప్రతి విద్యార్ధికి కొంత అవగాహన వస్తే కొంతమందైనా వ్యవసాయం వైపు దృష్టి మళ్ళిస్తారని నా ఆలోచన. కనీసం ఇళ్ళల్లో కూరగాయలైనా పండించుకుంటారు.  పూలు,పళ్ళు ,కూరగాయల తోటలు ఆధునిక పద్దతిలో చేస్తే మంచి లాభాలు  వస్తాయి" .

"బావుందమ్మా ! మన కాలేజ్ లో కూడా అగ్రికల్చరల్ కోర్స్ లు పెట్టడానికి అనుమతి కోరదాం. రూల్స్ అవన్నీ ఉంటాయిగా . ప్రయత్నం చేద్దాం . అన్ని రకాల బిజినెస్ లు చేసాను. బోలెడంత చచ్చింది. వ్యవసాయానికి మంచి జరుగుతుందంటే నేనెందుకు కాదంటాను.పైగా మన మూలాలన్నీ అక్కడే ఉన్నాయి కదా !"

"ప్లాంట్ టిష్యూ కల్చర్ లో స్పెషలైజ్ చేసాను . లాబ్ లలో నాలుగేళ్ళు పనిచేసాను. ఫాలీ హౌసింగ్ ఫార్మింగ్ చేయాలని  జెర్బెరా పూలపంట సాగుచేయాలని బాగా  ఉంది. శంకర్ అన్నయ్య పొలం కౌలు కన్నా ఇస్తాడేమోనని ట్రై చేసాను.ఇవ్వనన్నాడు "అంది కొంచెం నిసృహగా .

"మీనాన్న కూడా నీకన్యాయమే చేసాడనుకుంటాను ఎప్పుడూ,  బాధపడకమ్మా ! నీకు మంచే జరుగుతుందిలే ! "అన్నారు.

రిపబ్లిక్ డే రోజున జెండా అవతరణ కార్యక్రమం  తర్వాత మాధవరావు గారు తన ప్రసంగంలో  మరుసటి విద్యాసంవత్సరం నుండి వ్యవసాయ విద్యా కోర్సులు ప్రవేశ పెడుతున్నామని చెప్పి అందరిని సంతోషపరచారు. పిల్లలతో కార్యక్రమాల రూపకల్పన హడావిడిలో ఉన్న .. మోహన దగ్గరకి వెళ్లి  " ఇదిగోనమ్మా! ఇది నా తరపున గిఫ్ట్ " అంటూ ఒక కవర్ ఇచ్చారు .

గిఫ్ట్ .. !?  ఆశ్చర్యంగా చూసి "తర్వాత చూస్తాను సర్ !" " లేదమ్మా ! అది చూసినప్పుడు కల్గిన ఆనందాన్ని నేను స్వయంగా చూడాలి."

కొంచెం సంకోచంగా కవరు చించి లోపలున్న పేపర్స్ తీసి  చదువుకున్న ఆమెకి  బోలెడంత ఆశ్చర్యం,  ఆనందం. "నీతెలివితేటలు,  అంకితభావాన్ని చూసి నమ్మకంతో  నాలుగేళ్ళపాటు నా పొలాన్ని లీజుకి ఇస్తున్నాను. బ్యాంకు లోన్, లేబర్ విషయంలో నీకు సాయం చేస్తాను. మంచి పేరు రావాలి నీకు " తల మీద చేయి పెట్టి ఆశ్వీరదించారు.

"మీ నమ్మకాన్ని నిలబెడతాను సర్ "

నగరంలో ఏర్పాటు  చేసిన పుష్ప ఫల ప్రదర్శన శాలకి   కుండీలలో పెంచిన పూల  మొక్కలని, బోన్సాయ్ మొక్కలని,  టిష్యూ కల్చర్ లో రూపొందించి అధిక దిగుబడిని సాధించిన అరటి చెట్టుని గెలతో సహా   తీసుకువెళ్లి  కాలేజ్ తరపున ప్రదర్శనకి పెట్టింది మోహన.  స్టేట్ వైడ్  బెస్ట్ ఎంట్రీ అవార్డ్ సాధించిన ఆమెని మనఃస్పూర్తిగా అభినందించారు మాధవరావు గారు.

రుతువులు మారుతున్నాయి.  ఉగాది వెళ్లి శ్రీరామ నవమి వచ్చింది. ఊరంతా సీతారాముల కల్యాణం సందడి. పానకం సేవన.  చిరుజల్లుల తడిలో ఆనందంగా గంతులు. రాత్రివేళ  మండపంలో నుండి వినబడుతున్న హరికథని   శ్రద్దగా వింటూ .. చెట్టున పూసిన గుండు మల్లెలని కోసి  మాలకడుతూ కూర్చుంది మోహన.

"శాస్త్రి గారు చెపుతున్న హరికథ ఆగి వినమంటుంది. మీ మల్లెల పరిమళాలేమో కాసేపాగి ఆస్వాదించి వెళ్ళమని పిలుస్తున్నాయి, నేను   లోపలకి రావచ్చా ? అని అడిగాడు  రఘురామ్.

"ఈ రోజు వాన లేకుండానే వచ్చారు. ఆతిధ్యమడుగుతారని భయమేమి లేదు లెండి. మీరడిగిన బుక్ కూడా దొరికింది . తీసుకుని వెళ్ళొచ్చు రండి ".అంటూ ఆహ్వానించింది .

"అయినా ఈ టైం లో వాక్ ఏమిటండీ ! అతిగా అలసిపోయినా నిద్ర రాదంట . అది గమనించండి. "  బుక్ తీసుకు రావడానికి లోపలకి వెళ్ళింది. ఆమె వెనకనే ఇంట్లోకి వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు.

"ఒకవేళ తలుపులు మూసి ఉంటే  మిమ్మలెలా  నిద్ర లేపాలా అని ఆలోచించుకుంటూ వచ్చాను. లక్కీగా మీరు  మేలుకునే వున్నారు !? అంతా ఆ దేవుడి  దయ అని గుడి వైపు చూపించి చెప్పాడు.

" ఎందుకీ  సమయంలో ఇంటికి రావాలనుకున్నారు ? ఏమైనా  అర్జంట్ పని  పడిందా  ?"
వాచ్ చూసుకుంటూ .. లేచి నిలబడి తన వెంట తెచ్చిన చిన్న బాక్స్  తెచ్చి ఆమెకిచ్చి ... హ్యాపీ బర్త్ డే మోహనా ! అంటూ విష్ చేసాడు. ఆశ్చర్యంగా చూసింది. " నువ్వు పచ్చగా పది కాలాలు పాటు సంతోషంగా ఉండాలని  కోరుకుంటున్నా " అన్నాడు మళ్ళీ . అలా విష్ చేయడంలో హృదయం ఉందని ఆమెకి అర్ధం అయింది .

"విష్ చేసారు   చాలు కదా ! మళ్ళీ ఈ గిఫ్ట్ ఏమిటీ ? నాకిలాంటివన్నీ ఇష్టం లేదు,సారీ! "అంటూ అతనికి  తిరిగి ఇచ్చేయబోయింది.

"లేదు లేదు ఇది మీరు  తీసుకోవాల్సిందే .  ఈ గిఫ్ట్ ఏమిటో చూస్తే   మీరు నిజంగా  ఆనంద  పడతారు . ప్లీజ్ ! ఓపెన్ చేయండి " బ్రతిమలాడాడు .

"సరే అయితే " సన్నగా పొడవుగా ఉన్న  బాక్స్ ని చుట్టిన రేపర్ ని విప్పింది. ఎర్రటి ముఖముల్ క్లాత్ అంటించిన కార్డ్ బాక్స్ అది. ఏ విలువైన నగో అయి ఉంటుంది.  తప్పకుండా తిరస్కరించాల్సిందే అనుకుంటూ చిన్నగా పై మూత తీసి చూసింది. నాలగైదు అంగుళాల పొడవుతో  విరిసి విరియని  కొంచెం నల్లగా కనబడే తులిప్   చూడగానే ఆమె పెదవులు  నెమ్మదిగా విచ్చుకున్నాయి. ఆనందంగా అతని చేయి అందుకుని "థాంక్ యూ సో మచ్" అంది. అది చూసినతని కళ్ళ లోని వెలుగులు వేయి చేతులై ఆమెని ఆత్మీయంగా చుట్టేసాయి.

"ఎలాగైతే నేం .. అన్నమాట నిలబెట్టుకుని మీరు మంచి గార్డెనర్  అనిపించారు. అసలు మన వేడి వాతావరణంలో ఈ నల్ల  తులిప్  పూయడం చాలా కష్టం. అందుకు ఎంతో  ప్రత్యేకమైన శ్రద్ద కావాలి.  మీరు సాధించారు. ఇంతే శ్రద్ధతో కాలేజ్ గ్రౌండ్ లో కూడా నల్ల తులిప్ లు  పూయించాలి "

"ఇంకా ఏమేమి కోరికలున్నాయి మీకు ? వినాలని ఉంది  చెప్పేసేయండి "

" వడ్లు ఏ చెట్టుకి కాస్తాయి అని అజ్ఞానంగా ఏ విద్యార్ధి అడగకూడదు. పిల్లలందరూ గార్డెనింగ్ ఇంటరెస్ట్ గా చేయగలగాలి. హార్టీకల్చర్ ప్రాముఖ్యత అందరికి తెలియాలి.  పంట పొలాలని  వ్యాపారంగా మార్చకూడదు, అందరికి అన్నం పెట్టే  రైతు ఎప్పుడూ నష్టపోగూడదు. రైతు ఆత్మహత్యలు  అస్సలుండకూడదు.  అదీ నా కోరిక" అంది.

మోహన మాటలకి అతని కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి.  కాసేపు ఆమెనే చూస్తూ ఉండి  పోయాడు.
తర్వాత లేచి " వెళ్లొస్తాను. గుడ్ నైట్ " అంటూ  కొంచెం దూరం వెళ్ళాక  మళ్ళీ వెనక్కి తిరిగి చూసి వెళ్ళిపోయాడు.

ఉదయం రౌండ్స్ కి   వెళ్ళి వచ్చేటప్పటికి ఆఫీస్ లో కూర్చుని ఉన్నాడు మామయ్య. పేరుకి ఆ కాలేజ్ కి  చైర్మెనే కానీ ఎప్పుడో కానీ  కాలేజ్ కి  రాని మామయ్య పనిగట్టుకుని కాలేజ్ కి రావడం ఆశ్చర్యం కల్గించింది.

"ఏరా ! ఎలా ఉన్నావ్ ?"

"బాగున్నాను మామయ్యా ! ఫోన్ చేస్తే నేనే వచ్చే వాడిని కదా "

"ఇక్కడైతే నీతో ఫ్రీ గా మాట్లాడటానికి బావుంటదని  నేనే వచ్చాను. "లత ఇంటికి.వచ్చింది నిన్న. ఒకటే ఏడుపు. అత్తయ్య కూడా కంగారుపడుతుంది. విషయమేమిటో కనుక్కుందామని వచ్చాను."

"లత  అనుకున్నట్టు ఇక్కడేమీ జరగడంలేదు. కావాలని రాద్దాంతం చేస్తుందంతే !"

లత  రాద్దాంతం చేస్తుందో  లేక నువ్వు చేసిన తప్పుకి న్యాయం చెయ్యాలనుకుంటున్నావేమో తెలియదు కానీ నువ్వు నల్గురి నోటిలో నానుతున్న విషయం మర్చిపోతున్నావ్ . పిల్లలకి విద్యాబుద్దులు నేర్పించే చోట ఇలాంటి మాటలు  రావడం మంచిది కాదు.  ఏదో ఒకటి చేయి . అది చెప్పి పోవడానికే వచ్చాను. మెత్తగా చెప్పాల్సింది చెప్పేసి అంతర్లీనంగా ఏదో సూచన ఇచ్చేసి  వెళ్లి పోయాడాయన.

*************

పెదనాన్నా ! అదే నీ కూతురికి ఇలాంటి అన్యాయం జరుగుతుంటే ఊరుకుంటావా ? తప్పు చేస్తున్న ఆయన్ని మందలింఛి ఆ మోహన ఉద్యోగం పీకేసి కాలేజ్   ఛాయలకి రాకుండా చేసేవాడివి కాదు."  ప్రవహిస్తున్న కన్నీటి వాగుకి కర్చీఫ్ ఆనకట్ట వేయలేకపోతుండగా అడిగింది లత.

"రఘురామ్ అలాంటి మనిషో  కాదో నీకు తెలియదా ? పదిహేనేళ్ళుగా  భార్యగా వాడినర్ధం చేసుకున్నది ఇంతేనా !? ఆ అమ్మాయికి  ఆర్గానిక్ గార్డెనర్ గా, టిష్యూ కల్చరిస్ట్ గా మంచిపేరు ఉంది . మన కాలేజ్ లోచదివే  పిల్లలకి ఆర్గానిక్ గార్డెనింగ్ చేయడంలో శిక్షణ ఇప్పిస్తున్నాం. నువ్వే చూసావుగా, స్టేట్ వైడ్ జరిగిన పుష్పఫల ప్రదర్శనలో మన కాలేజ్ బెస్ట్ ఎంట్రీ అవార్డ్ కూడా గెలుచుకుంది. వాళ్ళిద్దరూ కలిసి నర్సరీలకి, కాన్ఫరెన్స్ లకి  కలసి వెళ్ళినంత మాత్రాన అనుమానించడం, గొడవపడటం మంచిది కాదు. నువ్వు ఆవేశాన్ని తగ్గించుకుని ఆలోచించి చూడు.  నువ్వు అప్పుడప్పుడూ సర్వీస్ కేంప్స్  నిర్వహిస్తూ ఉంటావు కదా ! ఆడమగ కలిసి పనిచేయడం లేదా  చెప్పు ?  అనునయంగా నచ్చచెప్ప జూసాడు.

"ఎంతైనా ఆమె నీ స్నేహితుని కూతురు. ఆయనేమో నీకు అత్యంత ఇష్టమైన మేనల్లుడు.  నా  కష్టం నీకు చెప్పుకుందామని వస్తే వాళ్ళనే సమర్దిస్తున్నావ్ ! .నువ్వు ఇలా అంటావని తెలిసుండి కూడా రావడం నాదీ బుద్దితక్కువ."

"నేను చెప్పేది కూడా  అర్ధం చేసుకో లతా  ! మనకవకాశం ఉందికదా అని కాలేజ్ నుండి పంపేయగలం, కానీ ఊరి నుండి పంపేయగలమా? రఘుని వెళ్ళకుండా కట్టడి చేయగలవు. కానీ మనసులో ఉండకుండా కట్టడి చేయగలవా ? ఆవేశంతో నిర్ణయాలు తీసుకుని నీకు నువ్వే అన్యాయం చేసుకొంటున్నావనిపిస్తుంది."

"నేను ఏదైతే భరించలేను అనుకున్నానో అదే ఎదురవుతుంది పెదనాన్నా! "అంది  ఏడుస్తూ

"భర్త ప్రేమని సంపాదించడమంటే  అధికారం ప్రదర్శించినంత,  వస్తు సామాగ్రి సంపాదించడమంత తేలిక కాదమ్మా"
 అంటూనే..  మాధవరావు గారు నిస్సహాయంగా భార్య వైపు చూసారు

ఆ చూపునర్ధం చేసుకున్నామె లత దగ్గరకి వచ్చి ఓదార్చి నేను చెప్పింది విన్న తర్వాత  ఏదైనా మాట్లాడు  అంటూ గదిలోకి, గతంలోకి తీసుకువెళ్ళింది .

-(ఇంకా ఉంది )