28, సెప్టెంబర్ 2016, బుధవారం

లతాంతాలు 4

ఇరవయ్యేళ్ళ క్రితం ఒకానొక సిగ్గుమాలిన పని చేసి మీ పెదనాన్న  ముందు  రఘు దోషిగా నిలబడ్డాడు .
మా ఎదురుగా పెదనాన్న  స్నేహితుడు రాఘవరావు మాస్టారు ఆయన భార్యజానకమ్మ , కూతురు మోహన.
 కందిరీగ నడుమేసుకుని సిగ్గుల మొగ్గలా ముడుచుకుపోయే మోహనని  ఎప్పుడూ ఆటపట్టిస్తూ ఉండేవాడు. ఆమె వాటిని సరదాగానే తీసుకునేది.  కాలేజ్ కి వెళ్ళడానికి రోడ్డు మీద  ఒంటరిగా నించున్నప్పుడు చూస్తే మరింత ఈలలేయాలనిపించే యవ్వనోత్సాహంలో ఉండేవాడు రఘు .

 ఒకరోజు స్కూటర్ పై  లిఫ్ట్ ఇస్తానని ఎక్కించుకుని రోడ్డుప్రక్కనే ఉన్న సపోటా తోటలోకి తీసుకెళ్ళి   బలత్కారం చేసి  తర్వాత భయమేసి ఆమెని అలాగే వదిలేసి  మాయమైపోయాడు.  మూడు  రోజులకి మన  ఇంట్లో  వాళ్ళ ముందు సిగ్గుతో తలొంచుకుని నిలబడ్డాడు

"తెలిసినవాడే, ఒక ఊరివాడే అని నమ్మినందుకు నా  బిడ్డ జీవితాన్ని ఇలా కుక్కలు చింపిన విస్తరిలా చేయోచ్చా?. అవమానంతో బావిలో దూకింది  ఆయువుండి బ్రతికింది కానీ..  చస్తే మాగతి ఏమికానూ? ఎవరేమి అడిగినా పెదవిప్పి ఏమీ చెప్పదు. మూడు రోజులకి కానీ  మీ మేనల్లుడి చేసిన నిర్వాకం చెప్పింది. నలుగురికి  ఈ విషయం తెలియక ముందే మీరే ఏదో ఒక న్యాయం చేయాలి మాధవరావు గారూ "అంటూ   పమిట చెంగుని ఏడుపు వినబడకుండా నోటికి అడ్డుపెట్టుకుంది జానకమ్మ.

ఇద్దరికీ పెళ్ళిచేసేద్దాం .  రాఘవా, ఏమంటావ్ ? మీ పెదనాన్న  తీర్పు ప్రశ్న ఒకేసారి.

అలాగే ! నేను మాత్రం కట్న కానుకలేమైనా తక్కువ చేస్తానా ? పెళ్ళైన తర్వాత కూడా చదువుకుంటారు. ఆ ఖర్చు కూడా నేనే భరిస్తాను. అనంటున్నరాఘవరావు గారి మాటలని  మోహన అడ్డుకుంటూ "నాన్నా ! జరిగిన తప్పు అతనొప్పుకుంటాడా లేదా అనేది తెలుసుకోవడానికి మాత్రమే వచ్చాను. నాకు కొన్ని ఆశలుంటాయి. ఎలాంటి వాడిని చేసుకోవాలి, ఎలాంటివాడు వద్దో అన్నది నా ఇష్టం. ఇలాంటి రౌడీ ని పెళ్ళిచేసుకోవడం మాత్రం నాకిష్టం లేదు. అసలు నేను పెళ్ళే చేసుకోను." అంటూ వెళ్ళిపోయింది.

జరిగిన విషయం పట్ల అమ్మాయి చాలా  కోపంగా ఉంది.  తర్వాత నచ్చజెప్పి చూస్తాను. రఘురామ్ నువ్వు ఇచ్చిన మాట మరవొద్దు.

అలాగే మాస్టారూ ! నేనెప్పుడూ మీకిచ్చిన ఈ మాట తప్పను. మోహనని తప్పకుండా  పెళ్లి చేసుకుంటాను అని మాట ఇవ్వడం జరిగింది.

ప్రతి రోజూ కాలేజ్ లో మోహన కనబడుతూనే ఉండేది వాడికి .  చూస్తే చాలు  అసహ్యంగా ముఖం త్రిప్పుకుని వడి వడిగా వెళ్ళిపోయేదట  రఘు మాట్లాడటానికి చేసిన ప్రయత్నాలన్నీ  విఫలమయ్యేవి. ఆ సంవత్సరంతో వాడి   చదువు అయిపొయింది. తనకి  MBA చదవాలని ఉందని బొంబాయికి  వెళ్ళాలని చెప్పాడు  మరి మోహన తో పెళ్లి విషయం ఏం చేసావ్ రా !  విషయం గుర్తు చేసాడు పెదనాన్న. ఇచ్చిన మాట తప్పను. రాఘవరావు మాస్టారింటికీ వెళ్ళి వద్దాం అన్నాడు.

అందరం వెళ్లి  పెళ్లి గురించి  అడిగాము. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. మీరిలా వెంటపడితే నేనసలు ఇల్లోదిలేసి వెళ్ళిపోతాను అంటూ విసురుగా పెరట్లోకి వెళ్ళిపోయింది. మొండిది బాబు!తననుకున్నట్టే ఉండాలనుకుంటుంది. నీకు రెండేళ్ళు చదువుంది కదా! అంతలోకి తన చదువు పూర్తవుతుంది. అప్పుడు చూద్దాం. ఈ లోపు త్వరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు అంటూ రఘు చేయి పట్టుకున్నారు మాస్టారు.

రఘు  MBA అయిపోయి ఉద్యోగంలో జాయిన్ అయ్యాక ఇంకొకసారి పెళ్లి విషయం కదిలించారు.  అప్పటికే తన చదువు ముగించి కాలికట్ లో  ప్లాంట్ సైన్స్ ప్రాజెక్ట్ కొ ఆర్డినేటర్ గా ఉద్యోగం సంపాదించించి వెళ్ళిపోయింది. ఉత్తరం వ్రాసి విషయం చెపితే   సారీ నాకిష్టంలేదు. ఎన్నిసార్లడిగినా నా సమాధానం ఇదే !  అతన్ని  పెళ్లి చేసేసుకోమని చెప్పండి.  అని తిరుగు టపాలో జవాబు వచ్చింది.

చిన్న మామయ్య కూతురు లత ని చేసుకోవడం నీకిష్టమేనా ! అడిగాడు పెదనాన్న.

మీ ఇష్టం మామయ్యా... అన్నాడు తలంచుకునే ..

తొందరేం లేదు నాలుగు రోజులు ఆలోచించుకునే చెప్పు. లత తమ్ముడు కూతురైతే  చెల్లెలు కొడుకువి  నువ్వు .  నా ఆస్తి మొత్తానికి వారసులు మీ ఇద్దరూ . రెండు వైపులా కలుపుకుంటే ఎవరికీ ఈర్ష్యాద్వేషాలు లేకుండా అందరూ బాగుంటారని  నా కోరిక.

ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. నీకన్నా మా మంచి కోరే వాళ్ళు ఎవరుంటారు మామయ్యా ! . నీ ఇష్టమే నా ఇష్టం "అన్నాడు .

అలా మీ ఇద్దరికీ  వైభవంగా పెళ్లి జరిగిపోయింది. ఆ అమ్మాయి జీవితమేమో  అలా అయిపొయింది లతా ! మొండిది. రోగాలు రోష్టులతో పడిపోయిన తల్లి తండ్రిని కంటికి రెప్పలా చూసుకుంది. ఏదో ఇప్పుడే కొంత స్థిమితంగా ఉంది. ఆ అమ్మాయిని అల్లరి చేసి నువ్వు అల్లరిపాలు కాకు. రఘు నీకన్యాయం చేయడు. నీ అనుమానాల నుండి బయటపడి  సానుభూతితో ఆలోచించు. ఆ అమ్మాయంటే అభిమానమే తప్ప నువ్వనుకునే సంబంధాలు పెట్టుకునే మనిషి కాదని నీకు తెలియదా !? గ్రుప్పిట బిగించి పట్టుకుంటే ఇసుక జారి పోతుంది అర్ధం చేసుకుని జాగ్రత్తగా ఉండు.  నచ్చజెప్పే ప్రయత్నం చేసిందావిడ.

"ఇదన్నమాట వీళ్ళు కలిసి తిరిగే కారణం. నిజమేమిటో ఇప్పుడేగా తెలిసింది .నేనెలాంటిదాన్నో ఇక చూస్తారు " విసురుగా వెళ్ళిపోయింది.

ఇంటి ఎదురుగా కారు   డ్రైవింగ్ సీట్ లో నుండి దిగిన ఆమెని  లత గా గుర్తించింది మోహన. ఒక నెల క్రితమే కాలేజ్ ఫెస్ట్ జరిగినప్పుడు చూసింది.  చుట్టుప్రక్కల ఇళ్ళన్నింటిని కలియజూస్తుండటం గమనించి  ఎవరి అడ్రెస్స్ కోసమో వెతుకుతుందని గ్రహించి  దగ్గరకి వెళ్లి లత  గారు నమస్తే ! అని విష్ చేసింది.

అదేమీ పట్టించుకోకుండా .. మీరే కదూ మోహన .. ? "అవునండీ ! నాతో ఏమైనా మాట్లాడాలా, లోపలికి రండి "

" రావాల్సిన వాళ్ళు వస్తున్నారు కదా ! ఇంకా నేనెందుకు లెండి ! ఆయనెక్కడ ? కొంచెం బయటకి పిలుస్తారా? .

"ఆయనంటే  రఘురామ్ గారి గురించేనా మీరడగడం. వారిక్కడెందుకు ఉంటారు ? కాలేజ్ లో ఉండొచ్చు లేదా ఇంట్లోనే  ఉండొచ్చు. అక్కడ కెళ్ళి చూడండి ... ప్లీజ్ "

"మీకొక విషయం చెప్పి వెళ్లాలని వచ్చాను. ఇదిగో .. దీనిని తాళి అంటారు. ఇది కట్టినవాడు ఇంట్లోకి వస్తేనే ఎవరికైనా మర్యాద  ! నా మెడలో తాళి కట్టినతను తరచూ నీ  ఇంటికి రావడం మర్యాదస్తుల లక్షణమెలా  అవుతుందేమో మీరే చెప్పండి.భర్త కోసం బాధపడుతూ  నీ ఇంటి ముందు ఏడ్చి గగ్గోలు పెట్టేసే ఆడదాన్ని కాదు.  పోలీస్ స్టేషన్ కెళ్ళి వెర్బుల్  అండ్  ఫిజికల్ అబ్యూజ్ చేస్తున్నాడని కేస్ పెట్టి భర్తని గుప్పిట్లో బంధించుకోవాలని చూసే భార్యని కాదు. బాధపడి,భంగపడి  విడాకులిచ్చేసి  వెళ్ళిపోయే రకాన్ని కాదు.  హక్కు , అందం,ఆస్తి అంతస్తు , పలుకుబడి అన్ని ఉన్నదానిన్నేను. ఆయన్ని ఎలా లాక్కెళతానో చూస్తూ ఉండండని, జస్ట్ మీకు చెప్పి వెళదామని వచ్చానంతే " మెరుపులా వచ్చి ఉరుములా ఉరిమింది

"లత  గారు  ఒకరు చేసే అన్యాయం కన్నా ఎవరికివారు చేసుకునే అన్యాయం ఎక్కువ. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి  వెళ్ళండి ప్లీజ్ !  అంటూ అంతే మర్యాదగా బయటకి  చేయి చూపి లోపలికి  వచ్చి గేట్ మూసేసింది. ఆలోచిస్తున్న కొద్దీ మనసంతా చేదుగా అయిపొయింది మోహనకి.

ఆ మర్నాడే రీసెర్చ్ కోసమని పూణే  వెళ్లి పోయింది.  వెళ్ళేటప్పుడు మర్యాద కోసం కూడా  రఘుకి చెప్పనే లేదు. ఆర్నెల్ల తర్వాత తిరిగి వచ్చే టప్పటికి లత అపోహలన్ని తొలగిపోతాయని ఊహించింది. కానీ అవి పీటముడేసుకుని అలాగే భీష్మించుకుని కూర్చున్నాయని తెలిసినప్పుడు గంభీరంగా మారిపోయింది.

"మోహనా ! ఈ రాత్రికి ఇక్కడుండవచ్చా !"

"ఉండాలనుకుని వచ్చినప్పుడు మళ్ళీ అడగడం ఎందుకు ?"

"నిత్యం  ఇంట్లో గొడవ జరుగుతుంది. ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది.  అసలు ఇక్కడికి రాకూడదనుకున్నాను, వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాను. కానీ రాక తప్పలేదు."

"ఏమైనా తిన్నారా ? "

"ఊహూ ! ప్రత్యేకంగా ఏమీ చేయొద్దు. నువ్వేం  తింటే అదే పెట్టు."

ఉడికించిన కేరట్ ని  జ్యూస్ చేసి అందులో చల్లని పాలు కలిపి ఇచ్చింది. నేలపై చాపేసి బొంతేసి గంజిపెట్టిన ఇస్త్రీ దుప్పటేసి బూరుగ దూది దిండు ఇచ్చింది. ప్రక్కనే ఇంకో చాపేసుకుని కూర్చుని "ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా  రఘూ ! మొదటిసారి ఆమె అలా సంబోదించడం.. " నీ చేయి ఇలా ఇవ్వు"  ఎడమచేతిని అతనికి అందించింది. .స్పర్శ ఒకొరి నుండి మరొకరికి ప్రవహించే సజీవమైన భాష. అతని మనసులో ఏముందో ఆమెకి విశద పరుస్తుంది.

"ఇంకా నా పై ద్వేషం అలాగే ఉందా ? "
"
 ప్రేమ కూడా లేదు" బాగా అలసిపోయారు... పడుకోండి. అంది కుడి చేత్తో తల సవరిస్తూ .  ఆమె చేతిని చెంపకానించుకుని నిద్రలోకి జారిపోయాడు.

పసిపిల్లాడిలా నిద్రిస్తున్న అతన్ని చూస్తుంటే   ఆమె  అంతరాలలో చిత్రంగా ఏదో స్పందన. ఆ స్పందనలు  చిగిర్చి పుష్పించి ఫలించి అతనిని సొంతం చేసుకోవాలనే కోరికకి ఉసిగొల్పుతున్నాయి. అప్పుడెప్పుడో కాదన్నావ్, ఇప్పుడు అతను నీవాడవడం ఎలా సాధ్యం ? అంతరాత్మ హెచ్చరించింది. అవును   అతన్ని  ఎక్కువగా ప్రేమించకూడదు. ప్రేమ అధికారాన్ని కోరుకుంటుంది. కాలం చెట్టుకి చీకటి పువ్వు పూసింది,  రాలిపోతుంది,  తనూ అంతే ! కాకపొతే కొన్ని కలలు, కాసిని కన్నీళ్లు.  ఇవి చాలు ఈ జన్మకి అనుకుంటూ   అలాగే నెమ్మదిగా జారగిలపడింది కన్నీటితో సహా !
 తర్వాతెప్పుడో అతను ఉలికిపడి నిద్రలో నుండి లేచి కూర్చున్నాడు. కాళ్ళు జాపుకుని గోడకి ఆనుకుని కళ్ళు మూసుకుంది,  ఆమె చెక్కిళ్ళపై దుఃఖ చారికలు.

"నిజం చెప్పు మోహనా ! నా సాన్నిహిత్యం నీకు మాత్రం ఇష్టం కాదూ ! సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు.  క్షణకాలం ఆ కళ్ళు కళ్ళూ  ముడివేసుకున్నాయి. ఆమె తలదించుకుంది ఆయినా ఆ  కళ్ళల్లో వెలుగు  అతను  గమనించకపోలేదు. " నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు,  ప్రేమ కొక భాష ఉంటుంది  అది  వెలుగు భాష, దాచుకోవాలన్నా దాగదు "  చెప్పు మోహనా ?

మనసులో భావాలన్నీ గుదిగుచ్చి  ఆశువుగా కవిత్వం చేసి వినిపించింది

"వాన జీవితకాలమంతా కురుస్తుందని ఆశపడే మూర్ఖురాలిని కాదు. కురిసినప్పుడు దోసెడు నీళ్ళైనా దాచుకోలేని నిరుపేదరాలిని.  ఈ పేద మనసులోకి నడిచొచ్చిన నీ పాదాల కంటిన చినుకులే తప్ప ,ఈ  ఇంట కొంచెం పాధ్యమైనా లేదు  ఆతిధ్యమివ్వ సాధ్యమసలే కాదు, ఆశలేమీ లేవు ఆశయాలు తప్ప, పన్నీరసలే  లేదు  కన్నీరు తప్ప  ఈ గుండె గదిలోకి అసలు రాకోయీ అనుకోని అతిధీ ...

"నేనప్పుడూ చాలా పొరబాటు చేసాను మరొకసారి బలవంతంతో నైనా పెళ్లి చేసుకోవాల్సింది". గతాన్ని గుర్తు తెచ్చుకుని నొచ్చుకున్నాడతను.

రఘూ ! మానీ మానని గాయాలపై ఇప్పుడీ  నగిషీలు పెట్టుకోవడం ఎందుకు?

ఆత్మాభిమానం నిలుపుకోవాలనుకున్నాను కానీ ఆత్మీయమైన మనిషిని చేరనివ్వడం లేదని అప్పుడనుకోలేదు. ఒకరకమైన జఢత్వంతో ఒంటరైపోయానని ఇప్పడు తెలుస్తుంది.  అలా అని మీకిప్పుడు  సమస్యలు తేవాలని నాకు లేదు.  ఎక్కడికైనా వెళ్ళిపోవాలని చూస్తున్నాను. కానీ మధ్యలో ఈ ఫార్మింగ్ ఇవన్నీ వదిలేసి ఎలా వెళ్ళగలను? నా మీద నమ్మకంతో చాలా పనులు అప్పగించారు మీ మామయ్య.  ఆ పనులన్నీ దిగ్విజయంగా పూర్తవ్వాలి. నా స్వార్ధంతో వాటిని నాశనం చేయలేను. ఆ గొంతులోని ఆవేదనకీ చలించిపోయాడు.

నువ్వెక్కడికి వెళ్ళే ఉద్దేశ్యం పెట్టుకోకు మోహనా !  ముఖ్యంగా  ఈ రీసెర్చ్ అవీ వదిలి ఎక్కడికీ వెళ్లొద్దు. నేనే అందుకు  పరిష్కారం ఆలోచిస్తాను అన్నాడతను .

కార్పెట్ పరుచుకుని క్రింద పడుకున్నతని ప్రక్కన వచ్చి కూర్చుంది లత .  లాప్టాప్  మూసి  తలకి ఉన్న హెడ్ ఫోన్స్ తీసి ప్రక్కన పెట్టి లేచి కూర్చున్నాడు రఘు.  "నేను కూడా ఇక్కడే పడుకుంటానీవేళ ". కారణమేమిటో అతనికర్ధమయింది   ఏం పాట వింటున్నారు ? చొరవగా  హెడ్పోన్స్ తగిలించుకుంది ." ఏక్ ప్యార్ కా నగమా  హై మౌజోం కి రవానీ హై, జిందగీ ఔర్..  కుచ్ బీ నహీ తేరీ మేరీ కహానీ హై !" మంచి పాటే వింటున్నారు.  తుఫాన్ తో ఆనా హై , ఆ కర్ చలే జానా హై  అని కదా  తర్వాత  తుఫాన్ వెళ్లి పోతుందా మరి ? హెడ్ఫోన్ ప్రక్కన పడేసి అడిగింది. వాదనాడదల్చుకోలేదు.  అతడు మళ్ళీ  పడుకుని కళ్ళు మూసుకున్నాడు.

"మీరు  ఆ మోహన ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. కావాలంటే డబ్బులు పడేయండి."

కోపంతో దవడలు బిగుసుకుంటున్నాయతనికి. స్త్రీలని మగవాళ్ళు కించపరచడం కాదు. అనుమానాలతో వాళ్ళని వాళ్ళే కించపరచుకుంటారు. గర్భ దారిద్ర్యం కన్నా భావ దారిద్ర్యం మరీ భయంకరమైనది.   షటప్ లతా  ! కాలేజ్ కి వెళ్లి  మోహనని అవమానించి వచ్చావ్ ! నువ్వు చేసినపనికి సంజాయిషీ ఇస్తావేమోనని ఆమెకి  సారీ చెపుతావేమోనని ఎదురుచూస్తున్నాను.   ఆత్మ పరిశీలన చేసుకోవడం మానేసి ఇంటిని నరకంగా మార్చేస్తున్నావ్ !  బాగా విసిగిస్తున్నావ్, ముందిక్కడి నుండి వెళ్ళిపో !

మీ ఇద్దరి మధ్య నేను కంటకంలా మారిపోయాను కదా ! మీ  జీవితంలో నుండే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నా ! ఆఖరి ప్రయత్నంగా మీతో చెప్పాలని అంతే ! అంది  ముక్కు ఎగబీలుస్తూ ...

"ఆశయాల  కోసం బ్రతికే వారు పువ్వుల్లాగా నిశ్శబ్దంగా రాలిపోతారు. అలా రాలేటప్పుడయినా రాతిదెబ్బ తగలనీయ కూడదని  చెపుతున్నాను, నీకది  నచ్చడంలేదు. నేను ఆమె వైపు కన్నెత్తి కూడా చూడనని నీకు మాటిచ్చాను అయినా నువ్వు వినడంలేదు. మనమే ఇక్కడినుండి  షిఫ్ట్  అవ్వాలని నేనాలోచిస్తున్నాను. నువ్వేమో ఆమెని ఇక్కడి నుండి తరిమేయాలని  కంకణం కట్టుకున్నావ్ ! పుట్టినూరు,సొంతిల్లు,ఉద్యోగం, ముఖ్యంగా ఆ ప్రాజెక్ట్ వదులుకుని ఆమెక్కడికి వెళుతుంది ?   కోపాన్ని అణుచుకుంటూ మాములుగా చెప్పడానికి ప్రయత్నించాడు.

"మీ నాటకాలన్నీ నాకు తెలుసు,  మీరు వెళ్ళాలనుకుంటే నేనేమి అడ్డు కాదు.   వెళ్ళే ముందు   ఆ కాగితాలపై సంతకాలు చేసి వెళ్ళిపొండి .. ఇదే నా ఆఖరిమాట" అది బెదిరింపో, స్థిరమైన నిర్ణయమో రఘుకి తెలియడంలేదు.

మొబైల్ లో టెక్స్ట్ మెసేజ్.  తెరిచి చూస్తే  మోహన నుండి " ఎన్ని అవమానాలైనా తట్టుకోగలను. నా గురించి ఆలోచించకండి రఘూ!  "  ముగింపు లేఖపై తడి ఆరని  ఓ కన్నీటి సంతకం కాదు మోహన.  అభాగ్యశాలి కాదు, ఒకరు వెలిగిస్తే వెలిగేది కాదు తనని తానూ వెలిగించుకో గలదీ మోహన,  కొన్ని కావాలనుకుంటే కొన్నిటిని తట్టుకుని నిలబడాలి.  నేను నిబ్బరంగా ఉన్నాను. మీ మధ్య కలతలు రాకుండా చూసుకోండి ప్లీజ్ !

చదివి బాధగా కళ్ళుమూసుకున్నాడు. తెల్లారే లోపు మరుగుతున్నఆలోచనల్లో నుంచి  సమస్యకి పరిష్కారం  తట్టింది.  లత  పెట్టెళ్లిన కాగితాలని చేతిలోకి తీసుకున్నాడు.

ఆ పేపర్ల మధ్య నుండి కొత్త  పసుపు తాడుకు గుచ్చిన మంగళ సూత్రాలు దర్శనమిచ్చాయి.  ఆశ్చర్యంగా అవి చేతిలో పెట్టుకునే పై  పేపర్ లో వ్రాసిన విషయాన్ని చదవసాగాడు.

రఘూ ! ఏదో ఒక నిర్ణయానికి వచ్చి ఉంటేనే కదా ! ఈ పేపర్స్ తీసి ఉంటావ్ .  మీ  మనసు నాకు తెలుసు.
మీ సంబంధం నైతికమా, అనైతికమా అన్నది నాకు సంబంధం లేదు. మోహన రీసెర్చ్ కి వెళ్లి   మీకు దూరంగా ఉన్న ఆరునెలల కాలంలో ఆమె మీ మనసులో లేనిదేప్పుడూ !? వివాహేతర సంబంధాలలో భార్యకి మిగిలేది రాక్షసి  అన్న పేరొక్కటే. మీ వాళ్ళందరికి మిమ్మల్ని  కాల్చుకు తింటున్నానని  నాపై ద్వేషం. మీ పై జాలి.  ఆమె పై సానుభూతి.  అందుకే నన్ను నేనే మీ నుండి త్యజించుకుంటున్నాను.  ఒకరిచ్చే  గిఫ్ట్ అయినా  నాకు నచ్చనిది నేను తీసుకోనని నీకు తెలుసు. అలాంటిది మీ ఇద్దరూ త్యాగమూర్తులై నాకు  నీ జీవితకాలపు భార్యననే  గిఫ్ట్ ఇచ్చారని సంబరపడకండి.   భార్య  మీద నెపెమేసి గర్ల్ ఫ్రెండ్స్ ని వదిలించుకున్న బోలెడు మంది మగవాళ్ళని చూసాను.  ఇప్పుడూ మీరూ  అదే పని చేసి మోహనకి ఇంకోసారి ముఖం చాటేస్తారనే  నేనూ ఈ నిర్ణయం తీసుకున్నాను. త్యాగాలు చేయడం  మీకే కాదు, నాకూ తెలుసు.  ఈ లతకి  అలంకారమైన భార్యగా ఉండటం ఇష్టం లేదు. ఇద్దరు బిడ్డలకి  తల్లిననే ఈ పదవి చాలదా ? నాకీ  భువిని యేలడానికి. మంచి పనులకోసం మీ ఇద్దరూ కలిసి పనిచేయండి. బెస్టాఫ్ లక్ !

నిర్ఘాంతపోయాడు రఘు. "ఈ స్త్రీలు ఎంత చపలచిత్తులు !? ఎంత బలంగా అల్లుకోగలరో, అంత తేలికగా  విదిల్చుకుని పోగలరు,  కావాలంటే ప్రాణ త్యాగం చేసి  పందిరిని ఖాళీ చేసేయగలరు. సున్నితంగా కనిపించే  వీళ్ళే  దృఢమైన లతలు. లతాంతాలు. మనస్తత్వాలు వేరైనా ఆలోచనా విధానానంలో మోహన,లత ఇద్దరూ వేరు వేరు కాదు.  ఇద్దరూ ఒకటే !  ఈహృదయాన్ని  ఖాళీ చేయకుండా ఏ ఒక్కరూ తిష్ట వేసుకుని ఇక్కడ  ఉండలేరా ?  అననుకుంటూ ఆ లెటర్ తో జతపరిచిన విడాకుల పత్రాలకేసి చూస్తూ  అయోమయంగా ఉండిపోయాడు.


2 వ్యాఖ్యలు:

శశి కళ చెప్పారు...

మీరే అసంపూర్తి రచనలు అని లేబుల్ ఇచ్చేక ఇక ఏమి కామెంట్ చేసేది ?ఇలాంటివి మామూలు ఆకర్షణలు కాక పోవచ్చేమో , చూస్తూ ఉంటె కర్మ తీరిపోతే తొలగిపోతాయి . కధనం చాలా బాగుండక్క

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మీ కధలో లత పాత్ర చాలా ఉదాత్తంగా ఉందండీ. కానీ మీరు ఇంత మంచి పాత్రలు పరిచయం చేస్తే అందరూ అలా మంచిగా మారిపోయి గొడవల్ని ఇలా ప్రశాంతంగా పరిష్కరించుకుంటే లాయర్లు,జడ్జ్ లు ఏమి చేయాలి చెప్పండి. :)

కొన్ని సమస్యలకి శాశ్వత పరిష్కారులుంటాయంటారా.