31, జులై 2012, మంగళవారం

వంద !? ..ఇదిగో ఇంద !!.



వంద !? ..ఇదిగో ఇంద !!.

ఏమిటీ ఈ లెక్క అంటారా ? ఈ లెక్కకి ఒక తిక్క అయినా లేదు..ఊహు .లేదంటే లేదు.

వంద రోజుల్లో వంద పోస్ట్లు వ్రాయాలని సరదాగా అనుకున్నాను. బ్లాగ్ వ్రాయడం మొదలెట్టిన తర్వాత ..ఒకో నెలలో రోజుకొక పోస్ట్ వ్రాసాను. కానీ వంద రోజులు అంటే!?
భయం వేయలేదు కానీ సాధ్యమేనా !?అనుకున్నాను.

ఎందుకంటే.. మా వూరిలో ఆకు అల్లలాడితే చాలు.. పవర్ కట్. దానికి తోడూ వేసవి లో విపరీతమైన కరంట్ కోత. పైగా గృహిణిగా సమయం కేటాయించుకుని బ్లాగ్ వ్రాయడం అంటే కీ బోర్డ్ పై సామే!! కాగితం పై అయితే కొవ్వొత్తి పెట్టుకుని కూడా వ్రాసి పడేయవచ్చు. కానీ ఇక్కడ పప్పులు ఉడకలేదు. అందుకే రాత్రుళ్ళు మెలుకువతో ఉండి వ్రాసే దాన్ని.

మా అత్తమ్మ కి ఆరోగ్యం బాగోక ఇన్ పేషంట్ గా హాస్పిటల్ లో ఉన్నా.. నేను ఆమె ప్రక్కన ఉండాల్సి వచ్చినా బ్లాగ్ వ్రాయడం మానలేదు.

అలాగే మా చెల్లి.. ICU లో ఉన్నప్పుడు కూడా దిగులుని,ఒత్తిడిని తట్టుకుని బ్లాగ్ వ్రాసాను.

ఎందుకు అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సి వచ్చింది అంటే..

ఒకోసారి ఏ పని చేయడానికి మనస్కరించ నప్పుడు , లేదా మొనాటనీ ఏర్పడినప్పుడు దానిని అధిగమించడానికి నాకై నేనే కొత్త లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటిని అందుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందులో ..నాకొక లక్ష్యసాధన, మార్గం స్పురిస్తుంది.

నా లక్ష్యాలని చేరుకునే క్రమంలో ఎన్ని ఒడిదుడుకులు,ఆటంకాలు ఎదురైనా..వాటిని త్రోసిరాజని నా లక్ష్య సాధన ని చేరుకోవడంలో కొత్త ఉత్సాహాన్ని మూటగట్టు కుంటాను. ఆ విధంగా ఈ నాటికి నేను ఆనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాను.

వంద రోజులు వంద పోస్ట్లు వ్రాయడంలో విజయం సాధించాను. ఈ మజిలీ లో ఎన్నో వొత్తిళ్ళు ఉన్నాయి.ఎన్నో పెయిన్స్ ఉన్నాయి.రోజుకొక పోస్ట్ వ్రాయాలని కూర్చుంటే.. సమయానికి విషయం తట్టేది కాదు.

ఖాళీగా ఉండి స్పురించిన విషయం వ్రాద్దామంటే కరంట్ ఉండేది కాదు.

ఈ వంద రోజులలో పెద్ద కథలు కూడా వ్రాసాను. అలాగే తీరిక చిక్కనప్పుడు.. ఒక పాట పోస్ట్ చేస్తే బావుంటుంది లే! అనుకునే దాన్ని.

ఒక పాట పోస్ట్ చేయడానికి ఎంతొ ప్రయాస పడాల్సి వచ్చేది. పాట కన్నా.. పోస్ట్ బెటర్ అనుకునేదాన్ని.

ఈ వంద పోస్ట్ లలోనే కాదు.. నా బ్లాగ్ లో పోస్ట్ లు అన్నీ వస్తు వైవిధ్యం ఉండేవిధంగా నేను శ్రద్ద తీసుకుంటాను.

నాకున్న జ్ఞాన పరిధిలో, నాకు వచ్చిన భాషతో.. చక్కగా ప్రజెంట్ చేయాలనే తపన నాకు ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే నేను బ్లాగ్ వ్రాయడం ని సరదాగాను తీసుకోలేదు , ఆషామాషీగా ను తీసుకోలేదు.

సరదాగా అనిపించాలి అనుకుంటూ వ్రాసిన పోస్ట్ లలో కూడా..మంచి కంటెంట్ ఉండేలా జాగ్రత్త పడేదాన్ని.

ఒక స్త్రీగా.. నాకున్న సౌలభ్యం, గృహిణి గా ఉన్న భాద్యతలు,వృత్తి పరంగా తీరిక లభించని ఒత్తిళ్లలో కూడా నేను బ్లాగ్ వ్రాయడం అనేది నాలో ఓర్పుని,సహనాన్నిపెంచింది.

నేను వ్రాసిన ప్రతి పోస్ట్ ని చదివి నాకు సలహాలు సూచనలు అందించి,నన్ను అభినందించిన మిత్రులకి నేను మనఃపూర్వకంగా ధన్యవాదములు తెలియజేస్తూ..

మునుముందు ఇలా వ్రాస్తానో లేదో!

కానీ ఈ వంద పోస్ట్ లు అవిశ్రాంతంగా వ్రాయడం అనేది.. నాకొక సవాల్ గా మాత్రమే కాదు అనేక అనుభవాలని మిగిల్చింది.

బ్లాగింగ్ కూడా అష్టమ వ్యసనం. నేను ఈ క్రమంలో వ్రాయడానికే సమయం ఎక్కువ కేటాయించాల్సి వచ్చింది కాబట్టి ..కొన్ని మంచి పోస్ట్ లని కూడా చదవలేకపోయేదాన్ని. చదివిన పోస్ట్ లకి బాగా నచ్చినప్పటికీ వ్యాఖ్య పెట్టె సమయం కూడా లభించేది కాదు.

ఈ బ్లాగ్ వ్రాయడం ఆనే ప్రక్రియ .. నాకున్న మంచి అలవాట్లని మార్చివేసింది. వాకింగ్ చేయడం ,పుస్తకాలు చదవడం కి గండి కొట్టింది. ఇకపోతే ఆత్మీయుల ఇంటికి వెళ్ళడం కూడా మానేయాల్సి వచ్చింది.

తర్వాత అనిపించింది..ఇంత చిన్న లక్ష్యానికే నేను అనుభవాలు ఎదుర్కొంటే .. పెద్ద పెద్ద లక్ష్యాలని అందుకున్న వారు.. ఎన్నెన్ని వొత్తిళ్ళు తట్టుకుని ఉంటారు, ఎన్ని అవాంతరాలు వచ్చి ఉంటాయి.అయినా వారు మొక్కవోని దీక్షతో ఆ లక్ష్యాలని అందుకుని ఉంటారు అనిపించింది.

ఏది ఏమైనా .. ఇది నాకు ఎదురైన ఒక అనుభవం.

ఆఖరిగా ఒక చిన్న మాట.

ఒక అజ్ఞాత వ్యాఖ్య నన్ను అమితంగా బాధపెట్టింది. "మహా మహులే బ్లాగ్ ని మూసేసుకున్నారు మీరు మూసేసుకోండి"అని ఉచిత సలహా ఇచ్చారు. వారికి మనఃపూర్వక ధన్యవాదములు.

మనం ఆనుకున్న లక్ష్యం నెరవేరుతుందా లేదా అన్నది చెప్పడం కూడా కష్టమే! ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో..ఎవరు ఊహించలేరు.

నేను వ్రాసిన ప్రతి కంటెంట్ నా ఆలోచనలని మధించి వచ్చిందే! నేను చదవడం ద్వారా, వినడం ద్వారా, చూడడం ద్వారా, నా అనుభవాల ద్వారా నాకు లభించిన జ్ఞానాన్ని నేను సంగ్రహించుకుని వ్రాయడం ద్వారా.. వ్యక్తీకరించినదే!ఒక పాటల సాహిత్యం,ఆడియో,వీడియో,కొన్ని చిత్రాలు తప్ప.

నాకు లభించిన సమయాన్ని బట్టి, నా ఆసక్తిని బట్టి.. ఇంకా ఎన్నో వ్రాసుకోవాలని నా కోరిక.

ఎప్పటికైనా నేను మనసు చెప్పిందే చేస్తాను. వ్రాస్తూనే ఉంటాను. నాకుగా నేను వద్దనుకునే దాక. కానీ ఏ ఒకరో చెప్పినంత మాత్రం చేత నా బ్లాగ్ ని మూసేయను.అది నా స్వభావానికి విరుద్దం కూడా. .

ఫ్రెండ్స్!! అల్ ఆఫ్ యు ..థాంక్స్.

29, జులై 2012, ఆదివారం

నివేదిత




ఈ మధ్య నేను సాహితీ నికేతన్ కి వెళ్లి కొన్ని బుక్స్ తీసుకురావాలని అనుకున్నాను. ఈ లోపు.. మా ఫ్రెండ్ రమ అక్కడికి వెళ్లి కాల్ చేసి నీకు ఏం బుక్స్ కావాలని అడిగింది. నేను సిస్టర్ నివేదిత గురించి బుక్ కావాలని చెప్పాను. ఎందుకంటే.. ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి.

నివేదిత
అంటే అర్ధం సమర్పణ.
సిస్టర్ నివేదిత ..ఎక్కడో విన్నట్టు ఉంది కదా! అందమైన వ్యక్తిత్వం కల ఇర్లాండ్ దేశపు యువతి. పదిహేడు సంవత్సరాలకే టీచర్ గా మారింది. ఇరువై అయిదు సంవత్సరాలకే ఒక పాఠశాల స్తాపించింది.
వివేవకనందుడి ప్రసంగం విని ఉత్తెజితురాలయింది . స్వామీజీ ఒక రోజు భారతీయ స్త్రీల గూర్చి చర్చిస్తూ ..మా దేశంలో అమ్మాయిలి ఇప్పటివరకు పాఠశాల ముఖం చూడలేదు. మహిళలు విద్యావంతులు అయ్యేవరకు మా దేశం ప్రగతి సాధించదు. అని మార్గరెట్ వైపు చూస్తూ అన్నారు. నావద్ద మా దేశపు అభివృద్ధి చదువుకోసం వివిధరకాల ప్రణాళికలు ఉన్నాయి. వారిని ఆ పనిలో నిమగ్నం చేయడానికి నువ్వు నాకు సహాయం చేస్తావా? అని అడిగారు.

తనపట్ల స్వామీజికి ఉన్న విశ్వాసానికి మార్గరెట్ ప్రభావితురాలయింది. ఆమె తనకు అంత యోగ్యతా ఉందా అని ఆలోచనలో పడగా ఆమె ఆలోచనలు తెలుసుకున్న స్వామీజీ ప్రపంచాన్ని మార్చేటందుకు నిన్ను నీవు సిద్దం చేసుకోవాలి. అప్పుడు నీతో పాటు మరికొందరు వస్తారు. నీ ఆత్మని మేలుకొలుపు అన్నారు.

బీదరికం,అంటరానితనం,ద్వేషం తదితర చెడు లక్షణాలతో నిండిఉన్న భారత దేశాన్ని ఆమె గమనించి ఆమె అక్కడికి పయనమయ్యారు.

1898 లో ఆమె కలకత్తాకి వచ్చారు. ఆమె తొందరగానే బెంగాలి జీవనం లో ఇమిడిపోయి.. బెంగాలి భాష నేర్చుకుని ఆ బాషా సాహిత్యాన్ని కూడా అర్ధం చేసుకున్నారు.

మార్గరెట్ ని ..ఆ తరువాత వివేకానంద రామకృష్ణ మఠానికి తీసుకుని వెళ్ళారు. ఆమెకి శారదా దేవి ఆస్సీస్సులు లభించాయి. తరువాత మార్గరెట్ హిందువుగా మారి పూజలు చేసారు. ఆమెని వివేకానందుడు ఆశ్వీర్వదించి "నివేదిత" అని నామకరణం చేసారు. పాశ్చాత్య సంస్కృతీ భారతీయ సంస్కృతిగా పరివర్తన చెంది..మార్గరెట్ నివేదిత అయింది.

ఆమె ఒక పాఠశాల ని ప్రారంభించారు.

ఇంటింటికి తిరిగి పెద్దలని ఒప్పించి బాలికలను కూడగట్టుకుని స్త్రీ విద్య కై పాటు పడ్డారు తర్వాత ఆమె సిస్టర్ నివేదిత గా ప్రాచుర్యం పొంది..ప్రజలకి సేవ చేసారు.

కలకత్తా లో ప్లేగు వ్యాది వ్యాపించి లక్షలాది ప్రజలు మరణిస్తుండగా.. ఆమె చలించి పోయి .. స్వయంగా రోగులకి సేవ చేసారు.

మురికి వాడలని,మూత్రశాలని శుభ్రం చేసారు. అది అక్కడి ప్రజలు గమనించి సిగ్గుపడి ప్రజలు ముందుకి వచ్చారు. అలా రోగుల సేవలోనే అలసి..ఆమెకి అనారోగ్యం సోకింది.

ఆమె ఇతరదేశాలకి వెళ్లి భారతీయ సంస్క్రతి ని గూర్చి గొప్ప గా ప్రసంగాలు చేసారు.

భారత దేశం గురించి..కొంతమంది క్రైస్తవ మతస్తులు ప్రపంచానికి చెడు గా చిత్రీకరించడం గుర్తించి.. వాస్తవాలని, భారత దేశం అంటే ఎలా ఉందొ..అన్న విషయాలని.. ప్రపంచ దేశాలకి తన ప్రసంగాల ద్వారా తెలియజేసింది.

అప్పుడు పాశ్చాత్యుల దోరణి మారింది. ఆమె నడుపుతున్న పాఠశాల లకి ధన సహాయం చేసారు.

వివేకానందుడి మరణం తర్వాత ఆమెకి ఇంకా భాద్యత పెరిగింది. స్వామీజికి ఇచ్చిన మాట ప్రకారం ఆమె పూర్తిగా ఈ దేశ సేవలోనే నిమగ్నమైంది. స్వాతంత్ర్యం కోసం కూడా పోరాటం చేసేలా ప్రోత్సాహం ని అందించింది.

వందేమాతరం గీతం ఆమె నడుపుతున్న పాఠశాల ల లో ప్రార్ధన గీతం అయింది.

ఆమె రాట్నం వడికేవారు. నూలు బట్టలే ధరించేవారు.. అది బెంగాలి ప్రజలకి ఆచరణ అయింది. బెంగాల్ విభజన జరిగినప్పుడు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో నివేదిత స్వయంగా పాల్గొన్నారు.రబీంద్ర నాథ్ ఠాకూర్,గోపాల కృష్ణ గోఖలే, మహత్మా గాంధీజీ , బాల గంగాధర్ తిలక్ మొదలైనవారు ఆమెని తరచూ కలుస్తూండేవారు.

బెంగాల్ వరదలప్పుడు చాలా విస్తృతంగా పర్యటన చేసి సేవలు చేసారు. తీవ్ర అనారోగ్యం కి గురిఅయింది తన సంపద,నగలు అన్నీ బేలూరు మఠం కి సమర్పించింది. దాని ద్వారా ఒక నిధిని ఏర్పాటు చేసి..భారతీయ మహిళలకు జాతీయ శిక్షణ ఇవాలన్నది ఆమె కోరిక.

తర్వాత ఆమె కొద్దికాలానికే మరణించారు.

హిమాలయ సానువుల్లో ఆమె సమాధి చేయ బడింది. ఆ సమాధి మీద "భారత దేశం కోసం తన సర్వస్వాన్ని అర్పించిన సోదరి నివేదిత ఇక్కడ దీర్ఘ నిద్రలో ఉంది" అని వ్రాయబడింది.

ఆమె స్థాపించిన పాఠశాల పెద్ద సంస్థగా అవతరించింది. అక్కడ వేలాదిమంది భారతీయ యువకులు,మహిళలు జాతీయవాదం గురించి శిక్షణ పొందుతున్నారు.

ఒక పాశ్చ్యాత్య వనిత భారతీయ సంస్క్రతి పట్ల ఆకర్షితురాలాయి.. భారతీయ తత్వంలో ఇమిడి పోయి.. సేవా దృక్పదంతో.. తన జీవితాన్ని అంకితం చేసిన సిస్టర్ నివేదిత.. స్పూర్తికరం.

భారతజాతికి గర్వకారణం కూడా. ఆమెకి ఎటువంటి అవార్డులు,రివార్డులు లభించినా.. ఆమె అసలు పేరు మార్గరెట్ నోబుల్. ఈ రోజుకి బెంగాల్ ప్రజలకి సిస్టర్ నివేదిత ఆరాధ్య మైంది .

భారతదేశానికి సేవ చేయడానికి తర్వాత కూడా మరికొందరు వచ్చారు. కానీ వారు.. సేవ పేరిట మతాన్ని కూడా మోసుకునివచ్చారు. సేవ చేసారు. మతం ని జొప్పించారు.

అంతే కదా.. ! భారతీయత అంటే.. ఎవరు ఏం మోసుకుని వచ్చినా స్వీకరించింది. తన లో ఐక్యం చేసుకుంది.

సిస్టర్ నివేదిత గురించి చదవాలి అనుకుంటే "నివేదిత" పుస్తకం సాహిత్యనికేతన్..లో .. లభ్యం అవుతుంది.తప్పక చదవండి.

28, జులై 2012, శనివారం

ఆనంద దీపికలు

ఇచ్చట అనాధ శిశువులను స్వీకరించబడును. 

 ఆ దారిన నడచి వెళుతున్న కొందరు ఆ ఇంటి ముందు కొత్తగా వెలసిన బోర్డ్ ని చూసి ఆశ్చర్యపోయారు. 

 ఆ ఇంట్లో ఉన్న దంపతుల గురించి తెలిసినవారు కొందరేమో.. ఓహో. పిల్లలని పెంచుకోవాలనే ఆలోచన వచ్చినట్లు ఉంది కాబోలు  అని అనుకున్నారు. 

 నెలలు గడచినా ఆ బోర్డ్ అలా ఆ ఇంటి బయట ఉన్న గేటుకి వేలాడుతూనే ఉంది.

 ఒక పత్రికా విలేఖరి ఆ విషయం గమనించి.. వారి ఇంటిలోపలకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అతను లొపలకి ప్రవేశించగానే.. కృష్ణ కనిపించాడు. తెలుసుకోవాలనుకున్న విషయం గురించి కృష్ణ తోనే మాట్లాడిన తర్వాత గాని విషయం ఏమిటో..బోధపడింది. ఆ పత్రికా విలేఖరికి చాలా ఆసక్తి కరమైన విషయాలు కూడా తెలిసాయి. ఇది అనాధ శరణాలయమా..?అడిగాడు. 

 కృష్ణ నవ్వుతూ ..అవునో కాదో మీరే చెప్పాలి..అంటూ.. ఒక నెల క్రితం జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుని ఆ విషయాన్ని చెప్పనారంభించాడు.

 "పూజా.. కాస్త ఆ మూడ్ లో నుండి బయటకు వచ్చి నేను చెప్పిన విషయం గురించి ఆలోచిస్తావా? ప్లీజ్ !! అని సాధ్యమైనంత వేడుకోలుగా అడిగాడు. 

 "ఏమండీ.. నేను అసలు ఈ విషయాన్ని జీర్ణించు కోలేక పోతున్నానండి . ఈ ఇల్లు ముద్దులొలికే పాపల బోసి నవ్వులతో కళ కళ లాడాలని ఎన్ని కలలు కన్నాం. ఇలా ఆలోచించాల్సి వస్తుందని కలనైనా అనుకోలేదు. నా దురదృష్టం ఇలా ఉంది. నేను తల్లినయ్యే అవకాశం లేదని తెలిసిన తర్వాత అయినా కూడా మీరు నాపట్ల చూపుతున్న ప్రేమానురాగాలు నన్ను మరింత క్రుంగ దీస్తున్నాయి. నా బాధ్యతని నాకు గుర్తు చేస్తున్నాయి. ఏమైనా ఈ ఇంటికి ఒక వారసుడు కావాలండి. మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటే బావుంటుంది. ఆ సంగతి మీరే ఆలోచించండి." అంది పూజ.

 "ఏ పిచ్చీ! పిల్లలు లేనంతమాత్రాన పిల్లల కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలు కని పెంచి వారి ఉన్నతికి కారకమైన తల్లిదండ్రులకి వృద్దాప్యంలో ఆసరాగా నిలుస్తున్నారు.!? ఎవరి త్రోవ వారిది అన్నట్లు ఉంటున్నారు. అలాగే అక్రమ సంతానం అని, ఆడపిల్ల పుట్టింది అని, లేదా అవకరాలతో పుట్టారని, పోషించలేని స్థితిలోనూ, పసి గుడ్డులని కూడా చూడకుండా చెత్త కుండీల లోను,మురుగు కాలవుల ప్రక్కనో, కదులుతున్న రైళ్ళలోనూ వదిలేసి వెళుతున్న కసాయి వాళ్ళని చూస్తే .. కన్నవాళ్ళు ఆనే పదానికే మచ్చ తెస్తున్న వాళ్ళని చూస్తే ...ఇంకా తల్లి-బిడ్డ అనుబంధానికి అర్ధం ఉంది అంటావా? అని అడిగాడు. 

"నిజమే అనుకోండి .. కానీ మీరలా ఆలోచించడం నాకు సబబుగా లేదు.మీరు ఇంకో ఛాన్స్ కోసం ప్రయత్నిస్తే తప్పులేదు,నాకసలు అభ్యంతరం కూడా లేదు " 

"ఎందుకు ఇలాంటి విషయాల గురించి ఆలోచిస్తావు? నేను నిన్ను వదిలి మరో పెళ్లి చేసుకుంటాను ఆనే ఆలోచన నీకు ఎలా వస్తుంది? " కృష్ణ గొంతులో ఆక్రోశం. 

పూజ నుండి మౌనమే సమాధానం అయింది. 

" నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు" అడిగాడు మళ్ళీ .

 "నాకు మీరు చెప్పిన విషయం నచ్చలేదండీ! ఎంత ప్రేమగా పెంచినా మన రక్తం పంచుకున్న బిడ్డలు అవుతారా? పోనీ సరోగ్రేట్ మదర్ కోసం ప్రయత్నిద్దాం.! అలా అయినా ఒప్పుకుంటారా?" ఆశగా అడిగింది పూజ. 

" నీ కోరిక నాకు అర్ధం అయింది..పూజా.. నా వారసుడిని ఇంట్లో ఎలాగైనా చూడాలి.. ఆ బిడ్డ ఈ ఇంట్లో పెరగాలి ఈ ఆస్తి పాస్తులను సంపూర్ణంగా అనుభవించడానికి పూర్తీ హక్కుదారుడు కావాలని నీ కోరిక అంతేనా? " అని అడిగాడు. 

 అవును అన్నట్లు.. భర్త ముఖం వైపు చూసింది. 

 దీర్ఘంగా నిట్టూర్చి.. అన్నాడు  కృష్ణ. "ప్రతి ఒక్కరికి తల్లి-తండ్రిగా మారాలనే కోరిక బలంగానే ఉంటుంది. దురదృష్టవశాత్తు అలాంటి అవకాశం లేనప్పుడు,మరో పెళ్లి చేసుకోవడమో  లేదా ఎవరి బిడ్డనైనా దత్తత తీసుకోవడం తప్పుకాదు. లేదా సరోగ్రేట్ మదర్ ద్వారా వారసుడు కావాలనుకోవడం తప్పు కాదు. అయితే .. ప్రేమాభిమానాలని,ఆస్తి పాస్తులని ఏ ఒక్కరికో పంచి.. వారిని మాత్రమే బిడ్డగా చూసుకుని మురిసిపోవడం కూడా బాగుంటుంది. కానీ నా ఆలోచన ఏమిటంటే.. మన ప్రేమాభిమానాలు, కోట్లాది రూపాయాల ఆస్తిపాస్తులు ఏ ఒక్కరికో కాకుండా.. ఇంకొక పది మందికి పంచ గల్గి.. ఆ పది మందిని పెంచుతూ వారికి ఆసరాగా నిలుస్తూ వారిలో మన ఆశలని,ఆకాంక్షల్ని చూసుకుంటే ఎంత బావుంటుంది అనుకుంటాను. అనాధలుగా పిలవబడుతూ.. ఏ అనాధ శరణాలయాల లోనో పెరగవలసిన పది మంది పిల్లలు.. మనలని అమ్మ-నాన్నా అని పిలుస్తూ మన పిల్లలుగా గుర్తించ బడుతూ.. ఎదిగిన తర్వాత వారి కళ్ళలో వెలిగే కాంతులని చూస్తే కలిగే ఆనందం కి మనం వెలకట్ట గలమా? అందుకే మన ఆస్తులన్నిటి ని ఒక ట్రస్ట్ గా మార్చి ఆ ట్రస్ట్ నిర్వహణ భాద్యత  చేపట్టి.. అనాధ శిశువులకి ఆసరాగా నిలుద్దాం. మనకి పిల్లలు లేరన్న విషయాన్ని మర్చిపోదాం. మన ప్రేమని పది మందికి పంచే భాగ్యం మనకి కల్గినందుకు ఆనందిద్దాం. సరేనా..అన్నాడు కృష్ణ. 

"పది మంది చిన్నారుల తప్పటడుగులని ఆ ఇంటి ఆవరణలో ఊహించుకున్న పూజ కళ్ళల్లో ఆనంద దీపికలు. అలా వెలిసినదే..ఈ ఇంటి ముందు వ్రేలాడ దీసిన బోర్డులోని విషయం. ఇప్పుడు చెప్పండి!? ఇది ఇల్లో.. లేక అనాధ శరణాలయమో!? అని నవ్వుతూ ప్రశించాడు.

విలేఖరి  ఆశ్చర్యంగా  చూస్తూ మరికొన్ని వివరాలు అడగబోయాడు . 

 ఒక ఫోన్  కాల్ ని రిసీవ్ చేసుకుని.. "నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఈ ఇంటి వారసుడు ని స్వయంగా తీసుకుని రావాలి" అని చెప్పాడు ఆ ఇంటి యజమాని కృష్ణ. 

 అప్పుడు..ఆ విలేఖరి.. నేను ఒక్క గొప్ప ఇంటిని.. మాత్రమే కాదు.. ప్రేమాభిమానాలు రాశి పోసుకున్న ఒక ఇంటిని ..అంటూ.. కాదు కాదు.. అమ్మ-నాన్న ల నిలయం ని చూస్తున్నాను. అంటూ గౌరవ భావం తో.. కృష్ణ వెంట తనూ వెళ్ళాడు.

27, జులై 2012, శుక్రవారం

వస్త్ర దానం

ఈ రోజు నేను వస్త్రదానం చేసాను కానీ అసలు పైసా కూడా ఖర్చుకాలేదు.

ఇలా నేను ప్రతి రోజు వస్త్ర దానం చేస్తూనే ఉన్నాను. కానీ నాకు ఏమాత్రం ఖర్చు కావడం లేదు.

మన భారతీయుల సంస్కృతిలో ఒక భాగం దానం చేయడం ఆనే ఆనవాయితీ ఉండనే ఉంది. దానాలలో .ప్రతి దానం కి కూడా దేనికదే ప్రత్యేకత కల్గి ఉంది . అందుకే అన్ని దానాలు శ్రేష్టమైనవే !


మీ అందరికి నేను దానం చేయమని చెప్పబోయే దానం కి..మీకు కూడా నాకు లాగానే పైసా కూడా ఖర్చు కాదు.

ఆశ్చర్యపోకండి .. అది ఎలా అంటే..


మీ ఇంట్లో.. సూర్యోదయం తో పాటు పోటీపడి ముంగింట్లో పడే దిన పత్రికలు ఉన్నాయిగా..

సినిమాపేజీని చూడండి. కొత్త సినిమాకి సంబంధించిన ప్రకటనలలో అందమైన అమ్మాయిలకి శరీరాలని దాచుకోవడానికి వస్త్రాలు కరువయ్యాయి అట.


పాపం వారిని చూస్తుంటే.. ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు .. కృష్ణా..కృష్ణా..అని ద్రౌపది ఆక్రందనతో పిలుస్తున్నట్లు నాకు వినబడుతూ ఉంటుంది.


నేనేమో..వెంటనే కృష్ణావతారం లోకి పరకాయ ప్రవేశం చేసి.. వారికి అభయ హస్తం చూపించి వస్త్రదానం చేస్తుంటాను.


కాసేపు వారిని నిండైన భారతీయ వస్త్రధారణలో చూసుకుని మురిసి ముక్కలై ..దానం చేసినందువల్ల లభించిన సంతృప్తి తో. అలా కనులు మూసుకుంటాను


కాసేపటికి నాకల చెదిరిపోతుంది.


ఇదండీ పైసా ఖర్చు లేని వస్త్రదానం .

ఇంటిల్లపాది చదివే వార్తాపత్రికలలో.. స్త్రీలకి సంబంధించింది అని చెప్పు కునే పేజీలలో.. మీరు సన్న బడాలను కుంటున్నారా ? ఫలానా హెర్బల్ టీ తాగండి.


మీరు సన్నగా ఉన్నామని బాధ పడుతున్నారా? పలానా లేహ్యం తినండి.


మీ జుట్టు ఊడిపోతుందా? పలానా చోట ట్రీట్మెంట్ తీసుకోండి. గంటలో బట్ట తల మీద వెంట్రుకలు మొలిపించడం సాధ్యం అంటారు.

అబ్బబ్బా. ఏది నమ్మి చావాలి.?. పత్రికలో వచ్చే వార్తలలోనే విశ్వసనీయత ఉండదు. ఇక ప్రకటనలలో ఏ పాటిదో..మనకి తెలియదా..?


సినిమా పేజీలలో ఒక నలుగురు అందగత్తెలకు తక్కువ కాకుండా దేవతా వస్త్రాలకు కొంచెం తక్కువగా ప్రేక్షకుడి కంటే ముందు పాఠకుడి మతి పోగొడతాయి.


అందుకనేమో..మా ఇంటి ప్రక్కన ఉన్న ఒక అమ్మాయి .. ఉదయం లేచి లేవగానే పేపర్ వాళ్ళాయన చూడకముందే ... తాను చూసిన .. అశ్లీల చిత్రాలకు స్కెచ్ పెన్ తో వస్త్ర దానం చేసి ప్రశాంతంగా పేపర్ పక్కన పెట్టి రోజు వారి కార్యక్రమాలను చేసుకోవటానికి రెడీ అవుతుంటుంది. అలాగే వీక్లీస్ లో అమ్మాయిల చిత్రాలని చూసినా అలాగే చేస్తుంటుంది.


అది ఒక మానసిక వ్యాది అని అనుకోవచ్చునేమో.. కానీ.. అలాటి అశ్లీల చిత్రాలు ప్రచురించే పత్రికల వారికి కనీస బాధ్యత లోపించిన విషయం సుస్పష్టంగా అయితే కనబడుతుంది కదా!


నాకు మాత్రమే కాదు..ఇలాంటి ప్రకటనలు చూసినప్పుడు కొందరికైనా ఒక ఇరిటేషన్ అనేది ఏర్పడుతుందేమో..అని ఆలోచిస్తూ... ఉంటాను.


ఈ రోజు దినపత్రికలో విడుదల కాబోయే రెండు చిత్రాలకి సంబంధించిన ప్రకటనలు చూసి. నాకు తక్షణం వస్త్రదానం చేయాలనే కోరిక గల్గింది.


ఆఖరిగా ఒక మాట.. ఒక తెలుగు హీరొయిన్ గురించి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఒక మాట అంది.


"ఆ హీరొయిన్ బట్టలు కట్టినా, కట్టకపోయినా..నిర్మాతకి తడిసిమోపెడయ్యే ఖర్చు మాత్రం ఖాయం." అని


నిజమే కదా!

అదండీ .. విషయం.

26, జులై 2012, గురువారం

కన్నుల లోగిలిలో ...

స్నేహం గురించి ఒక పోస్ట్ వ్రాయాలని అనుకుని నా ఫ్రెండ్ ని స్నేహం గురించి ఏమైనా చెప్పు ..ఆన్నాను. తను ఇలా చెప్పింది. 


 वादा करते हैं दोस्ती निभाएंगे कोशिश यहही रहेगी तुझे न सतायेंगे ज़रूरत पड़े तोह दिल से पुकारना मर भी रहे होंगे तो मोहलत लेकर आयेंगे 


 నాకు అర్ధం కాలేదు. బాగా ట్రాన్స్లేట్ చేయడం నేర్చుకో..అని చీవాట్లు పెట్టింది. 


 "నిశ్చయంగా నా స్నేహాన్ని నిలబెట్టుకుంటానని ప్రమాణం చేస్తున్నా.. నిరంతరం అందుకై ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టను.. అవసరం వచ్చినప్పుడు నీ హృదయంతో పిలిచావంటే మరణానికి చేరువలో ఉన్నా కూడా దానిని వాయిదా వేసి వస్తాను నీకోసం" అని విడమర్చి చెప్పింది. 


 ఇంకేం చెప్పను!? కన్ను నాదైతే అందులో చిప్పిల్లే నీరు తాను.. అందుకేనేమో.."సిరివెన్నెల " కలం జాలువార్చిన స్నేహభావం .. కన్నుల లోగిలి లో అన్నపాట .. 

25, జులై 2012, బుధవారం

పాటేగా..

పాటేగా.. అంటారు.

కానీ ఈ పాట అంటే మాటలా!?

ఒక పాటని పరిచయం చేయాలంటే.. ఒక సారి కాపీ, ఇంకోసారి పేస్ట్ .. క్లిక్ చేస్తే చాలు ఒక పోస్ట్ అయిపోతుంది అనుకుంటారు.

నేనైతే..అంతేనా.. అంటాను.

నాకు నా ఆలోచనని..లేదా అభిప్రాయమో..కథ,కవితో..వ్రాయడం చాలా తేలికైన విషయం. స్క్రిప్ట్ అంటూ ఏమి లేకుండానే.. డైరెక్ట్ గా కీ బోర్డ్ పై టక టకా లాడించడం అలవాటైపోయి..కాగితం పై కలం పెట్టి ఎన్ని రోజులైందో !

విషయం ఏమిటీ..మర్చిపోయి ఎటో వెళ్ళిపోయాను కదా!?సారీ.. !!

ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే..వ్రాసే మూడ్ లేనప్పుడు..ఒక పాట పడేస్తే పోలా అనుకోవడం నాకు చాలా కష్టం సుమీ!

పాటంటే మాటలా? పాట సాహిత్యం ఎలా ఉందొ..గమనించాలి,సంగీతం ఆకట్టుకుంటుందో లేదో చూడాలి..ఇంకా చెప్పాలంటే గాయనీగాయకుల బాణీ నచ్చాలి.

ఆ పాట మనకి ఎందుకు నచ్చిందో..చెప్పడం చాలా కష్టం అన్నమాట.

ఇన్ని పోస్ట్ లు వ్రాశానా.. వేటూరి గారి పాట పై ఒక పోస్ట్ వ్రాదామంటే.. నా వల్ల కావడం లేదు. ఎందుకంటే.. పాట గురించి వ్రాయడం కన్నా ..వారు వ్రాసిన భావాన్ని అన్వయించుకుని..నా భాషలో వ్యక్తీకరించడం అనేది నాకు చాలా కష్టం అయింది.అవుతుంది.

నేను పెట్టుకున్న ఒక టార్గెట్ రీచ్ అయ్యేదాకా వేటూరి పాట జోలికి పోకుండా ఉండాను.
సోది చెప్పింది చాల్లే! అనుకోకండి.

నేను ఈ రోజు కూడా పాటేగా..అనుకునే టట్టు ."పాట " గురించే పరిచయం చేయబోతున్నాను. నిజానికి ఈ రోజు ఒక మంచి పోస్ట్ వ్రాయాలి అని ఉంది. కానీ కరంట్ కోత ,సమయాభావం..

వెరసీ..నా మనసు దోచుకున్న పాట.

పాట సాహిత్యం తెలుగులో..మక్కీ కి మక్కీగా

ఆమె:

నీవు నా హృదయాన్నిదొంగిలించావు
చూపులను కూడా దోచుకోవద్దు
నా జీవితాన్ని మార్చి వేసిన నీవు మాత్రం ఎప్పుడు మారి పోవద్దు
హా ..నా హృదయం తీసుకున్నావు .. హాయ్.. నా హృదయమును ..
హృదయాన్ని దొంగిలించి నన్ను రంజింపజేయవద్దు (ఆటలాడ వద్దు,మాయ చేయవద్దు)
నీవు నా హృదయాన్నిదొంగిలించావు
చూపులను కూడా దోచుకోవద్దు
నా జీవితాన్ని మార్చి వేసిన నీవు మాత్రం ఎప్పుడు మారి పోవద్దు

వసంతంలా మారి వస్తాను ఎప్పుడో ఒకప్పుడు నీ ప్రపంచంలోకి
ఈ కోరికతో..జీవితంలో ఈ రోజు గడచి పోకుండా ఉండాలి
నీవు నావాడివే..హొయ్ నీవు నావాడివే
ఈ రోజు మాత్రం ఈ విధంగా ప్రమాణం చేయి .
దొంగిలించావు.........
నీవు నా హృదయాన్నిదొంగిలించావు
చూపులను కూడా దోచుకోవద్దు
నా జీవితాన్ని మార్చి వేసిన నీవు మాత్రం ఎప్పుడు మారి పోవద్దు

అతడు:
దోచుకుని అయినాకొమ్మలాంటి నీ శరీరంని అలంకరిస్తాను
నా హృదయ రుధిరం యొక్క ఎర్రదనాన్నినీ అందమైన పెదవులకి అద్దుతాను
నా నిజాయితీ ని ఏదో ఒక రోజు
ఈ ప్రపంచానికి తెలియ జేస్తాను పిచ్చిగా

నీవు నా హృదయాన్నిదొంగిలించావు
చూపులను కూడా దోచుకోవద్దు
నా జీవితాన్ని మార్చి వేసిన నీవు మాత్రం ఎప్పుడు మారి పోవద్దు

అందరిని అలరించి వారి వారి మనసులని తడుముకునే పాట. ఈ పాట .." చురా లియా హై తుమ్నే జో దిల్ కో "

పాట సాహిత్యం:
Chura liya hai tumne jo dil ko
Nazar nahin churaana sanam
Badalke meri tum zindagaani
Kahin badal na jaana sanam
Oh, le liya dil, oh haai mera dil
Haai dil lekar mujhko na behlaana
Chura liya hai tumne jo dil ko
Nazar nahin churaana sanam
Badalke meri tum zindagaani
Kahin badal na jaana sanam
(Bahaar banke aaoon kabhi tumhaari duniya mein
Guzar na jaaye yeh din kahin isi tamanna mein) - 2
Tum mere ho, ho tum mere ho
Aaj tum itna vaada karte jaana
Chura liya
Chura liya hai tumne jo dil ko
Nazar nahin churaana sanam
Badalke meri tum zindagaani
Kahin badal na jaana sanam

--MALE--

Ho, sajaaoonga lutkar bhi tere badan ki daali ko
Lahoo jigar ka doonga haseen labon ki laali ko
Sajaaoonga lutkar bhi tere badan ki daali ko
Lahoo jigar ka doonga haseen labon ki laali ko
Hai vafa kya is jahaan ko
Ek din dikhla doonga main deewana
Chura liya
Chura liya hai tumne jo dil ko
Nazar nahin churaana sanam
Badalke meri tum zindagaani
Kahin badal na jaana sanam
Le liya dil, haai mera dil
Haai dil lekar mujhko na behlaana
Chura liya hai tumne jo dil ko
Nazar nahin churaana sanam
Hm hm hm hm, hm hm hm hm - 2

ఇక్కడ పాట వినండీ! చురాలియ హాయ్ తుమ్నేజో దిల్ కో

క్రింద పాట చూసేయండీ



ఈ పాట విని చూసి.. ఒక రోజంతా ఈ పాటని హమ్ చేయక పొతే!!!!!!!?
ప్చ్.. చెప్పను..
Singers: Mohammad Rafi, Asha Bhosle
Music: R.D Burman
Movie: Yaadon Ki Baaraat (1973)
Starring: Vijay Arora, Zeenat Aman

24, జులై 2012, మంగళవారం

500 వ పోస్ట్













ఈ నాటి ఈ పోస్ట్ కి ఒక ప్రత్యేకత ఉంది. నేను బ్లాగ్ ప్రారంభించి ఖచ్చితంగా ఇరువది నెలల 3 రోజులు.


నేను వేసిన పోస్ట్ 500 .అవును అక్షరాలా 500 వ పోస్ట్.


ఈ పోస్ట్ ప్రతేకత అంటూ ఏమి లేదు. కాని మా అబ్బాయికి ఒక మంచి విషయం ని షేర్ చేసుకుంటూ పోస్ట్ చేయాలనుకున్నాను. ఎందుకంటే ..


ప్రపంచంలో నాకు అతి ముఖ్యమైనది ఏమైనా ఉంది అంటే అది.. "నాకొడుకు ".


నేను చెప్పే ఏ మంచి విషయాన్ని అయినా నా నుండి మా అబ్బాయి నేర్చుకోవాలని నేను మనసారా కోరుకుంటాను.అయితే దురదృష్టవశాత్తు చాలా మంది తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలని పిల్లలు పెడచెవిన పెడతారు. వాళ్లకి వేరే రోల్ మోడల్స్ ఉంటారు. మనం వేరే పిల్లలకి రోల్ మోడల్ అవుతాము అన్నమాట.:)


ఈరోజు ఈ పోస్ట్ నాకొక తీపి జ్ఞాపకంగా మిగలాలని కోరుకుంటూ..

లేఖా రూపంలో .. ఈ పోస్ట్.

చిన్ని..! బంగారం !!ఎలా ఉన్నావు నాన్నా!

నిరుడు ఈ రోజుల్లో నా కంటి ముందు నిండుగా తిరుగుతూ ఉన్నావ్? ఈ సంవత్సరం ఇక్కడికి రావడం వీలు పడదు అని తెలిసిన దగ్గర నుండి.. నా మనసులో మబ్బులు ముసురుకున్నట్లు దిగులు పట్టుకుంటుంది.

బలమే జీవనం, బలహీనతే మరణం అన్నది ఈ జాతికి వివేకానందుడు అందించిన సందేశం కదా!

బలాన్ని కూడా గట్టుకుని.. ఏదో కొత్త వ్యాపకాలలో తలదూర్చి తీరిక లేని పనులలో తలమునకలైపోతున్నాను.

జీవితం లో శూన్యం నిండు కున్నట్లు అనిపించగానే .. నాకు నేనే కొత్త లక్ష్యాలు ఏర్పరచుకుని.. వాటిని అందుకోవడానికి సదా ప్రయత్నం చేస్తుంటాను. ఆ బాటలోనే ఉన్నానిప్పుడు.


ఎవరు ఎప్పుడూ కూడా నిరాసక్తతగా జీవితాన్ని జీవించకూడదు. మనం ఒక క్రొత్త పని చేయాలని మొదలెట్టినప్పుడు ఎన్నో అవాంతరాలు ఏర్పడుతుంటాయి.


వాటికి భయపడి పారి పోతామా? అనుకుంటున్నాను.


నీవు కూడా అలాంటి లక్ష్యాలతో..ముందుకు సాగుతావని మనసారా దీవిస్తూ.. నేకొక స్పూర్తికరమైన ముచ్చట చెపుతూ..


నా ఫ్రెండ్ వైషూ నీకు తెలుసు కదా నాన్నా! అదే నువ్వు వైషు అక్క అంటావే.. ఆమె.


ఇప్పుడు 30 ప్లస్ లో భారత నాట్యం నేర్చుకుంటుంది. మూడవ కాలం రావడం లేదని తెగ ఇబ్బంది పడుతూ చెపుతుంది.


నాట్యం నేర్చుకోవాలని ఉత్సాహంగా మొదలుపెట్టి మధ్యలో వెనుకంజ వేయడం ఏమిటీ ? అని కోప్పడ్డాను.


తను ఈ రోజు కూడా క్లాసు కి వెళ్లి కొంత ప్రాక్టీస్ చేసిన తర్వాత.. బాగానే చేయగల్గానని చెప్పింది.

సాధన చేయడం వల్ల ఏదైనా సాదించ వచ్చు కదా!

వైషు అక్కకి ఒక స్పూర్తికరమైన విషయం చెప్పాను. ఆ విషయం ఏమిటంటే..


గరుడ పక్షి కి సంబంధించి నేను ఒక వ్యాసం చదివాను.


ఆ వ్యాసం చదివిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది.


ఆ విషయం ఏమిటో..చెపుతాను..విసుక్కోకుండా
, ఓపికగా చదువు. .

ఇందులో..నిజా నిజాలు నాకు తెలియవు.. కాని ఆసక్తిగా ఉంది. స్పూర్తి గాను ఉంది. అందుకే ఇలా షేర్ చేస్తున్నాను.



గరుడ పక్షి జీవనగమనం విచిత్రమైన సంఘర్షణ లతో,సవాళ్ళతో కూడుకుని ఉంటుంది.


పక్షి జాతిలో ఈ గ్రద్దల జీవన కాలం చాలా ఎక్కువ.దాదాపు డెబ్బై ఏళ్ళ పాటు ఇవి జీవిస్తాయి అట. అయితే ఇన్నేళ్ళు బతకడానికి ఈ పక్షి కొన్ని సాహసవంతమైన కార్యాలకు కూడా సిద్ద పడాల్సి ఉంటుంది..


గద్దకు నలబై ఏళ్ళు వచ్చే సరికి దాని ముక్కు, గోళ్ళు .రెక్కలు ఇతర శరీర అవయవాలు అన్నీ అననుకూలంగా పరిణమిస్తాయి.


పదునైన కొక్కెం లా ఉండే ముక్కుమొండిగా మారుతుంది.


గోళ్ళు వేటాడి వేటాడి వంగిపోతాయి.


అదే విధంగా పొడవుగా ఎదిగిన రెక్కలు భారమై,ఎగరడానికి వీలు కాకుండా మారతాయి.


ఈ దశలో గరుడ పక్షి ముందు రెండే రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి చనిపోవడం,రెండవది తిరిగి ఆయా శరీరాంగాలని పునర్జీవిన్ప చేసుకోవడం !


ఈ దశలో ఆ పక్షి పర్వతాలపై తానూ నిర్మించుకున్న గూటిలోకి చేరి పోతుంది.


దాదాపు అయిదు నెలలపాటు శారీరకంగా ఎన్నో బాధలకి ఓర్చి,తనని తానూ జీవన పోరాటానికి సంసిద్దపరచుకుంటుంది.


ముందు మొద్దు బారిన ముక్కుని పదునుగా మారే వరకు రాళ్ళపై రాపిడి చేస్తూనే ఉంటుంది.

తర్వాత రాపిడితో మొన దేలిన ముక్కుతో..వంగిపోయిన తన గోళ్ళను బలవంతంగా పీకేసుకుంటుంది.కొత్త గోళ్ళు వచ్చేవరకు వేచి చూస్తుంది .

ఈ దశ దాటిన తర్వాత కొత్త గోళ్ళతో,మొనదేలిన ముక్కుతో.పాట రెక్కలను పీకేసుకుంటుంది.

కొంత కాలానికి ఏర్పడిన కొత్త శరీర భాగాలతో..ఉత్సాహంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఎగిరిపోతుంది.మరో ముప్పై ఏళ్ళు జీవిస్తుంది.

ఈ కథని నేను "రామకృష్ణ ప్రభ " లో చదివాను. ఆశ్చర్యకరమైన ఈ పక్షి జీవన సంఘర్షణని మనిషి కూడా ఆదర్శంగా తీసుకోవాలి.


యువతరం పుస్తకాలు చదవడం ఆనే అలవాటు లేకపోవడం వల్ల లేక చదవడానికి దూరం కావడం వల్ల ఇలాటి స్పూరికరమైన విషయాలు తెలుసుకోలేకపోతున్నారు అనిపించింది. తప్పకుండా ఇలాటి విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం కదా!


ప్రతి ఒక్కరు తమ మనుగడలో ఇంకా అనివార్యమైన కొన్ని మార్పులకు సిద్దం కావాలి.

గతించిన వైఫల్యాలను,పరాజయాలను పక్కన నెట్టి కొత్త కొత్త సవాళ్ళను ఎదుర్కొనడానికి ప్రతి క్షణం అప్రమత్తంగా మెలగాలి.

విద్యార్ధి దశలో కానీ,ఉద్యోగ నిర్వహణలో కాని మనందరికీ కొన్ని సంఘర్షణలు. సాహసాలు తప్పవు. చావో,రేవో..అన్న పరిస్థితి లో చావు నుండి తప్పించుకుని రేవుకు చేరుకోవాలంటే మేధస్సుకు పదను పెట్టక తప్పదు


మనలో చాలా మంది..కాలం చెల్లిన (out dated ) విధానాలను,అలవాట్లను,పద్దతులను పట్టుకుని వేలాడుతూ ఉంటారు.


జీవితం అన్నది ప్రవాహం లాంటిది. అది అలా సాగిపోవాలంటే ఎప్పటికప్పుడు మన అంతరంగాన్ని నూతనోత్సాహంతో,భావజాలం తో నింపుకోవాలి.


మన ఉనికి (identity ).కి భంగం కలిగే పరిస్థితులని దైర్యంగా ఎదుర్కుంటూ..ఎప్పటికప్పుడు కొత్త సమస్యలను ఎదుర్కోవాలి.


మనకు తగ్గట్టుగా పరిస్థితులు ఉండాలని ఆకాంక్షించ కుండా..మనమే పరిస్థితులకు తగ్గట్టు మారుతూ..హుందాగా ఎదగాలి.


ఏ రిస్క్ తీసుకుంటే ఏమవుతుందో..అనుకునేవారు ఎప్పటికి విజయ పథాన పయనించలేరు.


ఎదిగి ఎదగని గొంగళి పురుగు సీతాకోక చిలుకగ ఎదిగి ఎగరాలంటే సంబందిత పరిణామ దశలోని బాధలని ఒర్చుకోవాల్సిందే!


అలాగే మనిషి కూడా కొన్ని మానసిక ఒత్తిళ్లను,సవాళ్ళను ఎదురోడ్డకుండాప్రగతి సాదించ లేడు కదా!


సమాజంలో అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్తాయికి చేరిన ఎవరి జీవన ప్రస్తానమైనా పరిశీలించి చూస్తే వారంతా కూడా కఠినమైన దశలని అధిగమించి వచ్చినవారే!అనేక మార్పులకు అనుగుణంగా తమ మనుగడను నిర్దేశించు కున్న వాళ్ళే !!


ప్రస్తుతం నువ్వు ఉన్న ఫ్రస్ట్రేషన్ నుండి బయట పడాలని కోరుకుంటూ.. ఉత్సాహంగా కొత్త కోర్సులు నేర్చుకుంటూ.. నీ భావి జీవితాన్ని మరింత మెరుగులు దిద్దుకుంటావని ఆశిస్తూ..


ప్రేమతో..దీవెనలతో. మీ అమ్మ.

23, జులై 2012, సోమవారం

చిరునామా...


చిరునామా

ఎన్నటికి మారని రహదారిపై..
మారుతున్న ప్రయాణికులు
ఎందరెందరో

జీవితాలు ఎన్ని మలుపులు తిరిగాయో
స్థిరంగా నిలబడిన పర్వత శిఖరాన్ని
తాకి తాకి వెళ్ళే మేఘమాలికలు ఎన్నెన్నో
ఎంత కుంభ వృష్టిని కురిపించి వెళ్ళాయో

నిశ్చలంగా నిలబడిన అద్దం ముందు
తమని తాము దర్శించుకుని వెళ్ళింది ఎందరో
ఎన్ని అంతఃస్వరూపాలు బహిర్గతం కాబడ్డాయో

అలజడితో స్వభావాన్ని మార్చుకోని సముద్రంలో
ఎన్ని నదులు సంగమం చెందాయో
సాగర సంగమం గా మారాలని
ఎన్ని నదీ హృదయాలు పరితపించాయో 

అనంత జీవన ప్రవాహంలో 
మనిషిని మనిషిగా ప్రేమించుకోలేనంత కాలం 
ఏదో ఆశించి రావడాలు.. బురద చల్లి పోవడాలు ..
అంతా..మామూలే

స్వార్ధం చేసిన గాయాలకి..
పైపై లేపనాలపూత కాదు కావాల్సింది..
జీవనపర్యంతం వెంట ఉండి
నడిపించే నమ్మకమైన తోడు.

ఒంటరితనాలు , ఒంటరిపయనాలు
ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక చోట
జారిపోకుండా ఉండటానికి
ఎంత ధృడచిత్తం కావాలి
ఎంతటి అహం ఉంది అనిపించుకోవాలి
లేకుంటే నగుమోము
నగుబాటుతో తలదించుకోదూ

నా ప్రియ నేస్తాల్లారా
వయస్సు,యశస్సు శలభంలా 
ఘడియలో ముగిసిపోదూ
ఉండిలేనట్లు అంది అందనట్లు
భ్రమింపజేస్తూ నెరజాణతనం ప్రదర్శిస్తూ


మీ ఆలోచనల భారం మోసానో
మీ అనుభూతుల ఆయుష్షుని పెంచానో
మీ మీ ఈర్ష్యద్వేషాన్ని సహించానో
మీ .. మీ హృదయాల అలజడిని భరించానో

మీరేమనుకున్నా
నేను మాత్రం ..
ఒక ఆహ్లాద కెరటాన్ని.
ఒక.. విశ్వసనీయ స్నేహాన్ని
మిమ్మల్ని మీరుగా ప్రేమించే 
హృదయానికి .. చిరునామాని

22, జులై 2012, ఆదివారం

భావ చౌర్యం.. అంటే

నిన్నటి పోస్ట్ లో భావ చౌర్యం అని చెప్పాను కదా!

భావ చౌర్యం అనగానే నాకు ఒక సంగతి గుర్తుకు వస్తుంది.ఆ విషయం చెపుతాను.

అప్పుడప్పుడే కాస్త నా కవిత్వపు పైత్యం ముదురుతున్న రోజులు.. ఒక కవిత ని వ్రాసుకుని వ్రాసిన కవిత ని హ్యాండ్ బేగ్ లో భద్ర పరచుకున్నాను.

కొన్నాళ్ళకి నెల్లూరు నుండి విజయవాడకి వస్తూ రైలు ప్రయాణం చేస్తున్నాను.

దొరికిన విండో సీట్ వెనక్కి  వెళుతున్న అందమైన దృశ్యాలు నాలో ఉన్న కవయిత్రి రూపం పెళ్ళున  ఒళ్ళు విరుచుకుని లేచింది.

హ్యాండ్ బేగ్ లో నుండి వ్రాసిన కవిత తీసుకుని చదువుకుంటున్నాను.

సుమారు నా వయస్సు ఉన్న ఒక ఆమె తో..ప్రయాణంలో పలకరింపుగా  అంతకు ముందు రెండు మూడు మాటలు కలిపి ఉన్నాను ఆమె ..నన్ను మాటల్లోకి దించుతూ.. ఏమిటి..మీలో మీరే చదువుకుని నవ్వుకుంటున్నారు.. కవిత్వం అనుకుంటాను..నాకు చూపించ వచ్చు కదా..అని అంది. సరే  అని ఆమెకి  ఇచ్చాను చూడండి..అంటూ (లోలోపల గర్వంగా ఫీల్ అవుతూ )  .ఆమె ఆ కవిత చదివి.. ఎంత బాగా వ్రాశారు అని మెచ్చుకుంది.

ఏ పత్రికలకైనా పంపారా? అని అడిగింది. నేను ఇలా అన్నాను." లేదండి ..పంపలేదు.మేము ఉండే చోట పోస్ట్ ఆఫీస్ సౌకర్యం లేదు. ఇప్పుడు అమ్మ వాళ్ళింటికి వెళ్ళాక పెయిర్ చేసి అక్కడ నుండి పంపుతాను" అని

అలా మాట్లాడుకుంటూ .. విజయవాడకి సమీపంగా రాగానే  నేను నా కవిత వ్రాసిన పేపర్ కోసం చేయి చాచి ..నా కవిత ఇస్తారా? అడిగాను.

లేదండీ.. నేను ఇవ్వదల్చుకోలేదు మీరు ఈ కవితని పత్రికలకి పంపక అశ్రద్ద చేసేలాగా ఉన్నారు. నేనే ఈ కవితని స్వయంగా పత్రికకి పంపుతాను ..మీ పేరు,ఊరు అడ్రస్ అన్నీ వివరంగా చెప్పండి అంటూ నన్ను తొందర పెట్టారు.
ఆ సమయంలో..మరో మాట చెప్పడానికి కూడా సమయం లేక గబా గబా నేను నా వివరాలు చెపుతుంటే ఆమె నేను వ్రాసిన కవిత వెనుక ఆ వివరాలు వ్రాసుకున్నారు.

నేను రైలు దిగిపోయాను. ఆమె అదే ట్రైన్ లో హైదరాబాద్ వరకు వెళ్ళాలని చెప్పారు. ఆమెతో పాటు .. నా కవిత వెళ్ళిపోయింది.

తరువాత కొన్ని నెలలకి ఓ.. వార పత్రికలో ఓ..పుల్ పేజీలో ప్రచురితమైన నా కవిత. ఎంత అందంగా అచ్చై ఉందొ.. నాకు చాలా సంతోషం వేసింది. ఆనందంగా నాట్యం చేసాను.

నా కవిత ..నా కవిత అంటూ..అందరికి చూపించాలనుకుని బయటకి వస్తూ ..కవిత వ్రాసిన వారి పేరు చూస్తూ ..షాక్ కొట్టినట్లు ఆగిపోయాను.

కోపం,దుఖం రెండు కలగా పులగమై ..చీ.. చెత్త..______ అని కోపంగా తిట్టుకున్నాను.

ఆమె పేరు తెలుగు భాష అంత అందంగా ఉంది. కాని బుద్ది మాత్రం .".గుడిసేటిది". 


 ఆమె ఎవరో నాకు తెలియదు కాని ఆమె ఒక రచయిత్రి . లెక్చరర్ గా పనిచేస్తుంటారు. అని చెప్పారు.

స్టూడెంట్స్ తో..కూడా కవితలు వ్రాయించి..ఆకవితలన్నీ సంకలనం తీసుకు వస్తానని అందరి దగ్గర సేకరించి.. తర్వాత తన పతి మీద ప్రేమతో.. ఆ కవితలన్నీ కలిపి ఆయన గారి పేరు పై ప్రచురింప జేసి..సంకలనం తెచ్చారని ఆమె స్టూడెంట్ ఒకరు "రుక్సానా" ఆనే అమ్మాయి నాకు చెప్పింది.

ఈ పోస్ట్ చూస్తే ఆమె తప్పకుండా గుర్తుపడతారు. చేసిన పనికి సిగ్గుపడే ఆమె అయితే ఆ పని అసలు చేయరు కదా!
ఆమె తెలుగు పద్యములలో ఒక పద్య లక్షణం ని తన కలం పేరుగా పెట్టుకున్నారు.
ఎంత గొప్పో!

తర్వాత నేను చాలా సార్లు ఆ విషయం తల్చుకుని బాధ పడ్డాను. నా ఫ్రెండ్ నన్ను ఓదార్చేది..ఇలా ..అని.." నీకేమిటి ..బంగారు! నువ్వు ఏ సబ్జెక్ట్ పైన అయినా వ్రాయగలవు. నువ్వు అలా నిరుత్సాహపడవద్దు.. చక్కటి భావ వ్యక్తీకరణ నీ సొంతం. నువ్వు వ్రాయాలి..వ్రాయగలవు కూడా..అని నన్ను ప్రోత్సహించిన నా నేస్తం కి ఎప్పటికి నేను థాంక్స్ చెప్పుకుంటాను.

తర్వాత నేను ఎన్నో కవితలు వ్రాసుకున్నాను. కొన్ని పత్రికలో ప్రచురింపబాడ్డాయి.కాని నేను ఆ విషయం మాత్రం మర్చిపోలేదు.

గొప్ప పేరు సంపాదించుకున్న వారిలో కూడా అలా భావ చౌర్యం ని చేసిన వారు ఉన్నారు. బయట పడనంత వరకు అందరు.. గొప్పవారే! బయట పడితే కదా తెలిసేది. ఒక ప్రముఖ కవి ఇంగ్లిష్ బాషలోని కవితలని అనువాదం చేసి తన పేరున ప్రచురింపజేసుకున్నారు. ఇంకెవరో..సాహితిమిత్రులు అది గుర్తించి ప్రశ్నించారు కూడా..

ఇలాటిదే మరొకరి అనుభవం.

చిన్ని గీత ..ఆనే పేరుతొ వ్రాసే ఓ..యువ వర్ధమాన కవి ఉన్నాడు. ఎమ్.బి ఏ చదివి జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు.

మా అబ్బాయికి చిన్నప్పటి క్లాస్మేట్ . అతను చాలా బాగా వ్రాస్తాడు. స్పందించి ఆశువుగా అప్పటికప్పుడే గేయ రూపంలో వినిపించిన అతని భావ ప్రకటనకి ముచ్చట వేసేది.

అతను సినీ రంగం వైపు వెళ్ళాడు.జూనియర్ రైటర్గా అతను వ్రాసుకున్న కవితలని,పాటలని కూడా..అలాగే చౌర్యం చేసి..తమదిగా చెప్పుకునేవారని చెప్పి చాలా బాధపడ్డాడు.

బ్లాగ్ వ్రాసుకోమని సలహా చెప్పాను. అక్కడా అంతే కదా ఆంటీ ! అన్నాడు.!కాపీ రైట్ పెట్టుకోమని సలహా చెప్పాను. సరే అని తల ఊపాడు కాని అతను బ్లాగ్ ప్రారంభించ లేదు.

ఎప్పుడైనా కనబడితే మాట్లాడతాను ఏదో ఒక చిన్న చిత్రం కి పాట రాసే అవకాశం అతనికి వచ్చిందని చెప్పాడు.

ఒకసారి ఒక సభలో సినీ గీత రచయిత అదృష్ట దీపక్ గారు ఒక విషయం చెప్పారు. ఒక కవి తన కవిత్వం గురించి కొన్ని పరిచయ వాక్యాలు వ్రాయమని ఆయనని అడిగారట. పూర్తిగా చదివి వ్రాస్తాను..అక్కడ పెట్టి వెళ్ళ మన్నారట.అదృష్ట దీపక్ కి తీరిక లేక తనకి అసిస్టెంట్ గా   చేస్తున్నఒక అతనితో.. ఆ కవిత్వం ఎలా ఉందొ..చూసి చెప్పు ?  అని అన్నారట.

ఆ ..అందులో ఏముంది సార్.. మీరు వ్రాసిన పాటలలోని కొన్ని చరణాలను అటు ఇటుగా మార్చి ..మరి కొందరు వ్రాసినవి చూసి.. అతని కవిత్వం  వ్రాసాడు..అని చెప్పాడట అతను.

 అదృష్ట దీపక్ గారు ఈ విషయం చెప్పుతూ..ఇది అండీ కవిత్వం అంటే..అని అంటూ ..అసలైన కవిత్వం అంటే ఏమిటో..అర్ధం లేకుండా పోతుంది..అని బాధ పడ్డారు.


అలా ఉంది కవిత్వం  తీరు తెన్నులు అన్న సంగతి నేను చెప్పడం లేదు. కాని భావ చౌర్యం మాత్రం  ఉంది అని చెప్పడమే నా ఉద్దేశ్యం. .

ఆంధ్ర దేశం లో ఏ కవితా సంకలనం వెలువడినా ఒక ప్రముఖ విశ్లేషకుడి అభిప్రాయం తో ఒక  కవితా సంకలనం వెలువడుతుంది. ఆయన అందరి కవితలని మెచ్చుకుంటారు. తప్ప ఒక్క లోపం ని చెప్పరు. బహుశా..కవి లేక కవయిత్రి ని బాధ పెట్టడం ఇష్టం లేక ఏమో..అనుకుంటాను నేను.

ఇవి అండీ కొన్ని భావ చౌర్యం కబుర్లు.

21, జులై 2012, శనివారం

ఓ చినుకు కవిత



ఈ చినుకు ..నేను వ్రాసినది కాదు.

ఎక్కడో..చదివాను. నాకు బాగా నచ్చింది. ఈ కవిత వ్రాసిన వారి పేరు గుర్తుకు రావడం లేదు. వెతుకుతున్నాను. కానీ చిక్కడంలేదు.

కానీ చినుకు పడినప్పుడల్లా ..ఈ అక్షర చినుకు నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది.

జాన్ హైడ్ గారు.. వాన కవితలని సేకరిస్తున్నానని చెప్పారు. ఓ..అనామిక కవితగా ఈ కవితని పరిచయం చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది.

అందుకే ఈ షేరింగ్. .. (భావచౌర్యం అనుకోవద్దు ప్లీజ్ !!) నాకు ఈ కవిత వ్రాసిన వారు గుర్తుకు రాగానే..ఇక్కడ వారి పేరును పొందు పరుస్తాను.

చినుకు చినుకు రాలి సంద డాయెను
నుదుటిపై జేరి ముత్యమాయెను
అది గుండెపై జారగానే జాతరాయెను
నడుమ పై పడిన చినుకు వీణ ఆయెను
అల్లనల్లన మీటగానే వేణు వాయెను
తడిసి తడిసి తనువంతా బృంద గాన మాయెను
కనులముందు బృందావని కదలి పోయెను
అది మధురమైన జ్ఞాపకమై మిగిలి పోయెను
మరలి వచ్చే చినుకు కోసం కనులు కాయలు కాచెను.

నేను గుర్తుకు తెచ్చుకుని సుమారుగా ఈ కవితని వ్రాసాను. కానీ ఒరిజినల్గా మార్పు ఉండవచ్చేమో కూడా..
ఈ పోస్ట్ చదివి..ఈ కవిత వ్రాసిన వారు ముందుకువస్తే..వారికి నా అభినందన మందారమాల
భావ చౌర్యం గురించి రేపు ఒక పోస్ట్ వ్రాస్తాను .. వెయిట్ ప్లీజ్!!

20, జులై 2012, శుక్రవారం

కథ కాదు

ఈ కాలం అమ్మాయిల ఆలోచనలు పెడదారి పట్టడమో.లేక తల్లిదండ్రుల మూర్కత్వం వల్లనో కాని..

ఒక యువకుడు అతని తల్లి దండ్రులు చెల్లించిన మూల్యం ధనం మాత్రమే కాదు..మానసిక వేదన కూడా..

మా ఇంటి ప్రక్కనే ఉన్న గ్రూప్ హౌస్ లోకి ఒక కుటుంబం అద్దెకి వచ్చారు.ఒక ఒక కొడుకు ..అతనికి ఒక సంవత్సరం క్రితం పెళ్లి అయింది. కోడలు చూడటానికి ముచ్చటగా బాగానే ఉంది. అత్తగారు..ఇంట్లో సామాను సర్దుకుంటూ ఉంటే.. మా వైపు బాల్కనీ లో వేలాడదీసిన ఉయ్యాలలో కూర్చుని పోద్దస్తమాను సేల్పోన్ లో మాటలాడుతూ ఉండి పోయేది.

ఆ ఇంట్లో పని చేసే వాళ్ళ ద్వారా విన్న మాటలు నా చెవిన పడేవి. ఏమిటా అమ్మాయి తీరు? అలా గౌరవ మర్యాదలు లేకుండా అత్తమామగారి ముందర కాలుపై కాలు వేసుకుని ఎల్లప్పుడూ ఆ పోన్ మాట్లాడటం ఏమిటి? వంట ఇంటి వైపు తొంగి చూడదు. లేదా గది వదిలి బయటకి రాదు.. పాపం ! ఆ గోపాలరావు గారు,రాజ్య లక్ష్మి గారు..ఆ కోడలి ప్రవర్తనని జీర్ణం చేసుకోలేక పోతున్నారు. ఏదో బొబ్బర్లంక అమ్మాయి అని కట్నకానుకల ప్రమేయం లేకుండా..అమ్మాయిని చూసి చేసుకొచ్చారు. ఆ కోడలి వరుస చూస్తే ఇలా.. అంటూ.. బుగ్గలు నొక్కుకునేవారు.చెవులు కొరుక్కునేవారు.

ఖచ్చితంగా..రెండు నెలలు తిరిగే సరికి గోపాలరావు గారి అబ్బాయి బాబ్జీకి విడాకులు అయ్యాయి అని చెప్పారు.

యధాలాపంగా వాళ్ళు వీళ్ళు చెప్పే కబుర్లు వినడమే తప్ప పెద్ద ఆసక్తి చూపని నేను..."ఆ.". అంటూ ఆశ్చర్యంగా నోరు తెరిచాను

అవునంట.. ఆ అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేదంట. ఎవరినో..ప్రేమించింది అట. ఆ అమ్మాయి ఇష్టా ఇష్టాలకి విలువ ఇవ్వకుండా.. తల్లిదండ్రులు పెళ్లి చేసారని అయినా బాబ్జీని భర్తగా అంగీకరించ లేకపోతున్నానని చెప్పిందట.

ఆ అమ్మాయి పెళ్లి జరిగిన తర్వాత కూడా.. భర్త తో.. సర్దుకుని జీవించడం లో ఏ మాత్రం ఆసక్తి లేకపోయింది. ప్రేమించిన అతనితో రోజు పోన్ లో మాట్లాడుతూ సమయం దొరికినప్పుడు వెళ్ళిపోవాలని అనుకున్నదట. అలా ఒక సంవత్సరం పాటు ఓపికగా ఎదురుచూసిన బాబ్జీ ఇక రహస్యం దాచలేక అతని తల్లిదండ్రులకి విషయం చెప్పాడు. ఆ అమ్మాయిని గట్టిగా ప్రశ్నించే సరికి పుట్టింటికి వెళ్లి పోయింది. ఇక ఆ అమ్మాయి తో కాపురం చేయాలనుకోవడం అవివేకం కాబట్టి బాబ్జీ వైపు నుండే విడాకులు కోసం అప్లై చేసారు.

విడాకులు ఇవ్వడం కోసం ఆ అమ్మాయి పది లక్షలు రూపాయలు ఇవ్వాలని కోరిందట. ఆ అమ్మాయి కుటుంబం నుండి బాబ్జీ కుటుంబం కోసం వారు ఇచ్చిన డబ్బు అక్షరాల నలబై వేలు (అది వివాహ సమయంలో అబ్బాయికి బట్టలు కోసం) .. మధ్యవర్తుల సమక్షంలో ఏడు లక్షలు రూపాయలు ఇవ్వడానికి సిద్దపడి.. ఆ అమ్మాయికి వివాహ సమయం లో పెట్టిన బంగారు నగలను ఒదులుకుని,డబ్బు ఇచ్చి..విడాకుల కాగితం మీద సంతకం పెట్టించుకుని బ్రతుకు జీవుడా !అనుకుని బయట పడ్డారు. అని చెప్పారు.

ఎంత మోసం!? బాబ్జీ కి అతని తల్లిదండ్రులకి ఎంతటి క్షోభ?

ఏమిటీ ఈ పరిస్థితులు ? అమ్మాయి ఇష్టా ఇష్టాలని గమనించక ధనిక కుటుంబ అబ్బాయికి ఇచ్చి చేయడం తోనే.. అన్నీ సర్దు కుంటాయా ? ఈ తరం ఆడపిల్లల ఆలోచనా విధానం సవ్యమేనా? పెళ్లి చేసుకోక ముందే..తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఆ అమ్మాయి చెపితే బాగుండేది కదా!? అలా చెప్పకుండా ఒక సంవత్సరం పాటు ఓ..వ్యక్తిని బాధపెట్టడం తగునా!?

ఆర్ధికంగా,మానసికంగా,గౌరవమర్యాదల పరంగా..ఆ అమ్మాయి,ఆమె తల్లి దండ్రులు చేసిన డామేజ్ కి బాబ్జీ కుటుంబం ఎంత క్షోభ అనుభవించారు.

చట్టం ని అడ్డం పెట్టుకుని..అమ్మాయిలు చేసే పని ఏమన్నా బాగుందా!? ఈ కాలం అమ్మాయిలూ మగవారి జీవితాలతో..ఆడుకుంటున్నారు.

ప్రేమ-పెళ్లి వేరు వేరు వ్యక్తులతో..

జీవితాలతో..ఆడుకోవడం తగునా?

మగపిల్లల్ని కన్న తల్లిదండ్రులు కి ఇలాటి తిప్పలు తప్పవా?

అమ్మో! ఆలోచిస్తే భయం వేస్తుంది.

నేను మాత్రం ఒకటి చెప్పదలచాను. తల్లిదండ్రులు పిల్లల ఇష్టాలకి విలువ ఇవ్వకుండా..తాము చెప్పిన ప్రకారమే పిల్లలు నడుచుకోవాలనుకుంటే.. వారి పిల్లలు వేరొకరు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.

తల్లిదండ్రులు కాస్త పెద్ద మనసు చేసుకుంటే వారు ప్రేమించిన వారినే పెళ్లి చేసుకుంటారు, ఆనక వాళ్ళిద్దరూ కొట్టు కుంటారు,తిట్టుకుంటారు.. అది వాళ్ళ ఆలోచనా దోరణి ని బట్టి ఉంటుంది. ఇతరులు ప్రేమించినవారినో,లేదా ఇతరులని ప్రేమించిన అమ్మాయిని చేసుకుని చూస్తూ చూస్తూ జీవితాన్ని నరక ప్రాయం చేసుకోవడం ఉండదు కదా!

(ఈ పోస్ట్ లో పేర్లు మార్చడం తప్ప యధాతధం గా వ్రాయడం జరిగింది)

19, జులై 2012, గురువారం

అంటే అన్నారంటారు..కానీ ..

అంటే అన్నామంటారు కానీ..ఇలాటి విషయాలు విన్నప్పుడు, ప్రత్యక్షంగా కొందరు చూస్తున్నప్పుడూ .. మనకి ఏమి అనిపిస్తుంది..

ఇంకా ఆటవిక యుగంలో ఉన్నట్లు లేదు.

ఏ పదాలు ఉపయోగించి తిట్టగలం చెప్పండి? స్త్రీలు బాహ్య ప్రపంచం కి తెలియని ఎన్నో రాక్షస ప్రవృత్తులని భరిస్తూ ఉన్నారు.

కనబడటం లేదా!? ఇక్కడ మానవ మృగ క్రూరత్వం. !?

ఇలాటి చోట్ల కూడా పెమినిజం కనబడుతుందా?

ఈ క్లిప్పింగ్ చూడండి.. ఇది ఈ నాటి దిన పత్రికలో వచ్చింది. (ఆంద్ర జ్యోతి ..దిన పత్రికలో.. )

కళ్ళు ఉండి చూడలేని గుడ్డి లోకంలో ప్రతిదానికి స్త్రీలని ఆడిపోసుకుంటున్న పురుష ప్రపంచమా! ఓ..అబల దుస్థితి చూసాక అయినా మనం ఇంకా ఆటవిక యుగంలోనే ఉన్నామని నిర్ధారించుకోండి.

ఉబుసుపోక, పురుష ద్వేషం తో.. స్త్రీలు రచనలు చేయడం లేదని తెలుసుకోండి. మంచికి-చెడుకి రెండింటికి స్పందించండి.

ఆ వాదమో, ఈ వాదమో మోయడం .. సమంజసం కాదు.

తప్పిదం ఎక్కడ, ఎవరికీ జరిగినా స్పందించండి. స్త్రీ ల సాహిత్యంని నిందించకండి అని మనవి.

18, జులై 2012, బుధవారం

కొన్ని సంస్కారాలు

మనం చాలా నేర్చుకోవాలి. ముఖ్యంగా కొన్ని విషయాలలో సంస్కార వంతంగా మెలగడం.

మనిషి పుట్టినప్పటి నుండి మరణించిన తర్వాత కూడా పాటించాల్సిన సంస్కారాలు ఇరువది ఏడు అని ఎక్కడో చదివాను. కానీ మనం నేర్చుకోవాల్సిన కొన్ని సంస్కారాలని నాకు అనిపించిన విషయాలని చెపితే బావుంటుందేమో అనుకున్నాను (నేను ఇవన్నీ  సాధారణంగా పాటించేవి కూడా!)

మొన్నీ మధ్య మా చెల్లెలు మా వదిన చేతిలో ఉన్న లేటెస్ట్ మోడల్ పోన్ చూడాలని తన చేయి చాచి మా వదిన చేతిలోని పోన్ తీసుకోబోయింది. మా వదిన తన మొబైల్ పీస్ ని మాచేల్లికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. కొన్ని సెకనుల కాలంలో జరిగిన ఈ విషయం నా దృష్టి పథం ని దాటి పోలేదు.

ఇప్పుడు మొబైల్ పోన్ అంటే.. అంతరంగం లాటిది. ఒక విధంగా చెప్పాలంటే డైరీ లాటిది.

వ్యక్తిగతమైన ఎన్నో ముఖ్యమైన విషయాలు మెసేజెస్,పిక్స్ వీడియోస్ ద్వారా సేవ్ చేసుకోవడం జరుగుతుంది.ఇతరులు చూడటం,చూడాలనుకోవడం వల్ల వాళ్ళ ప్రైవసీ దెబ్బతింటుంది కదా!

కొంత మంది చాలా చొరవగా మన మొబైల్ ని మోడల్ వివరాలు తెలుసుకుని,పీచర్స్ అన్నీ చూసి తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. అది కూడా అభ్యంతరకరం గానే తోస్తుంది నాకు.

ఇతరుల మొబైల్ ని మనం అంటుకోకుండా ఉండటమే మంచిది.

రహస్య గూడాచారి అవతారం ఎత్తి పిల్లల మొబైల్స్ చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రవర్తన లో మార్పు కనబడినప్పుడు..తల్లిదండ్రులకి అనుమానం రేకెత్తడం సహజం. అలాటప్పుడు మన పిల్లల మొబైల్ పోన్ కూడా మనం చెక్ చేయడం.ఆ విషయం వాళ్లకి తెలియడం వల్ల మనపై వారికి నిరసన భావం తలెత్తుతుంది కూడా!

పిల్లలు వారికి సంబంధించిన వస్తువులని వారి వ్యక్తిగత ఆస్తి గానే పరిగణిస్తారు.కంప్యూటర్ సిస్టం,లేదా లాప్ టాప్..లాటి వ్యక్తిగత మైన వస్తువులని ఇతరులు వాడటం ఇష్టం ఉండదు. ఒకవేళ ఇతర కుటుంబ సభ్యులు ఆ వస్తువులని ఉపయోగించు కుంటారనుకుంటే.. వారి అకౌంట్ ని లాగౌట్ చేసుకోవడం మంచిది.

మాఅబ్బాయి ఆన్ లైన్ ఉన్నట్లు నేను గమనించినా సరే..మాట్లాడి చాలా రోజులవుతున్నా సరే...  మన అబ్బాయే కదా..అని ..స్టేటస్ చూడకుండా పింగ్ చేయను. బిజీ అని ఉంటే.. డిస్ట్రబ్ చేయను. ఒక వేళ అలా అత్యవసరంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు .. మెయిల్ పెడతాను.

తల్లిదండ్రులగా మనకి హక్కులు ఉన్నాయని వాళ్ళని మన స్వంత ఆస్తిగా పరిగణించి పిల్లల ప్రైవసీని మనం భంగ పరచలేం కదా! ఇవన్నీ ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకోవాల్సిన సంస్కారాలని  అనిపిస్తూ ఉంటుంది.

అలాగే పిల్లలు కూడా సభ్యత పాటిస్తూ..సంస్కారవంతంగా ఉండటమే కాదు.. సంస్కారవంతమైన వస్త్రధారణ చేసుకుంటే కూడా తల్లిదండ్రులకి మానసిక క్లేశం తగ్గించిన వాళ్ళు అవుతారు.

మా కొక పరిచయస్తురాలు ఉన్నారు. ఆవిడ సంగతి చెపుతాను. "ఏం చేస్తున్నారు..అంటూ సరాసరి బెడ్ రూమ్లోకి వచ్చేస్తారు. అది సంస్కారం కాదని  నాలుగు పదులు వయసు దాటినా ఆమెకి తెలియరాదు..

కొంతమంది కబురు కాకరకాయ లేకుండా వచ్చేస్తారు..అతిధి మర్యాదలు బాగా జరపలేక,ముఖ్యమైన పనులు ఉంటే..వాయిదా వేసుకోలేక ఎంత అవస్థ పడతామో..కదా! ముందుగా తెలిపి రావడం సంస్కారం కదా!

"తెరిచి ఉందని వాకిట తలుపు జొర బడతారా ..ఎవరైనా.. " ఓ..పాటలో ఉన్న ఒక లైన్ నాకు బాగా నచ్చుతుంది.

అది హృదయమైనా..గదైనా.. ఇతరులకి సంబంధించిన వస్తువైనా, ఇతరులకి సంబంధించిన  విషయమైనా.. చొరవజేసి కల్పించుకోకపోవడం,రహస్య గూడాచారి పాత్ర పోషించక పోవడం అనేది ఉత్తమ సంస్కారం అనిపించు కుంటుంది అని నా అభిప్రాయం. !

మరి మీరేమంటారో !?

17, జులై 2012, మంగళవారం

కూతురైతేనేం!?

పచ్చగా, గుబురుగా ఉన్న చెట్లమధ్య విజ్ఞానం పంచిపెట్టే గ్రంధాలయం ఆ కాలనీకి అలంకారం.

లోపల కూర్చుని చదువుకునేవారికి సరి సమానంగా వెలుపల వైపు సిమెంట్ బెంచీల మీద కూర్చుని దిన పత్రికలూ చదువుకుంటున్న కాలనీ జనులు. వారిలో వృద్దులు రిటైర్ అయిన వారే అధికం .

కాలక్షేపు కబుర్లు,అనుభవాలు చెప్పుకుంటున్న వారి దృష్టి అక్కడే ఓ..ప్రక్కగా నిలబడి ఉన్న శాంతమ్మపై ప్రసరించింది.

"ఎక్కడికి బయలుదేరారు? అమ్మాయి వద్దకా? రేపే కదా భోగి పండుగ.అమ్మాయి పిల్లలతో ఇక్కడికి రావడం లేదా!అని అడిగారు మూర్తి గారు.

"అవునండీ! అమ్మాయి దగ్గరకే” అని చెప్పింది  చిన్నగా నవ్వుతూ.

"మన శాంతమ్మ గారికి చాలా ఓపిక. వారానికి రెండు సార్లయినా అమ్మాయి ఇంటికి ప్రయాణం కడతారు. ఈ వయసులో తల్లి మనసుని అర్ధం చేసుకునే తీరిక,వివేకం ఆ పిల్లకి లేవు. ఏం చేస్తాం?వయసు ఉడిగిందని పెద్దలకి పిల్లల పట్ల మమకారాలు అడుగంటుతాయా? పిల్లలని చూసుకోవాలని తపిస్తారు "అని చెపుతున్నారాయన .

''శాంతమ్మ గారూ! ఇంకా ఇక్కడ మీరొక్కరే ఏం ఉంటారమ్మా ఇక అమ్మాయి దగ్గరే ఉండిపోకూడదు."ఉచిత సలహా ఇచ్చాడు ఇంకో ఆయన.

శాంతమ్మ ముఖం మాన్లమైంది.

తనకా హై బి.పి,షుగర్ లాంటి దీర్ఘ కాలిక వ్యాదులు తో పాటు కొత్తగా ఆస్ట్రియో పొరాసిస్ అనే వ్యాధి వచ్చినదట.

ఎముకలు గుల్లబారి ఎక్కడ పడితే అక్కడ పెళుక్కు మంటూ ఇరిగిపోయే రోగం వచ్చింది. మీరసలు ఎక్కువ కదలకుండా జాగ్రత్తగా బెడ్ రెస్ట్ లోనే ఉండాలమ్మా! లేకపోతే ఎముకలు విరిగి మంచం మీద పడి ఉండాల్సి వస్తుంది అని హెచ్చరించారు ఆర్ధోపెడిక్ డాక్టర్. కానీ మనసు ఊరుకుంటుందా! కూతురు కన్నా కూడా మనుమడు "బుజ్జి"ని మనుమరాలు "పండు " ని చూడాలని ఆమె మనసు ఆరాట పడుతుంది.

ఒక్క గానొక్క కూతురు. ధనవంతుల ఇంటి కోడలిగా చూసి మురిసి పోవడమే తప్ప కూతురు,అల్లుడు పట్టుమని పది రోజులు కూడా ఈ ఇంట్లో నిద్రచేసింది లేదు.పెళ్ళైన రోజుల్లో నాలుగైదు రోజులు ఉన్నారేమో! 

శాంతమ్మ  భర్త రాధాకృష్ణ  కావాలని కోరి కోరి ప్రశాంతంగా ఉంటుందని.. సిటికి  చివర వెలిసిన ఓ..కాలనీలో స్థలం తీసుకుని కట్టించుకున్న ఇల్లు అది. చుట్టూ రక రకాల చెట్లు. పూల మొక్కలు..రణ గొణ ధ్వని లేకుండా హాయి గా తోచే పరిసరాలు. ఇక్కడ అలవాటు పడి ఇక ఎక్కడన్నా ఉండగల్గడమే అనుకునేది.

ఇరవైయేళ్ళు  మారుమూలన ఉన్న కాలనీ నుండే రాధాకృష్ణ సిటీ కెళ్ళి  ఉద్యగం చేసి వచ్చారు. కూతురి పెళ్ళి చేసిన తర్వాత ఓ సంవత్సరానికే హార్ట్ ఎటాక్ తో మరణించాక శాంతమ్మ ఒంటరి జీవి అయిపోయింది.

కూతురు కూడా వచ్చి అక్కడే ఉంటే బాగుంటుందని ."బాబూ ! ఇంత ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉండటం ఎందుకు? మీరిక్కడికే వచ్చేసి ఉండవచ్చు కదా" అని అల్లుడు గారిని నోరు తెరచి అడిగింది

అతని కన్నా ముందే కూతురు స్వప్న మాటల్లో జోక్యం చేసుకుని "ఇక్కడ ఉండటం ఎందుకమ్మా! ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి.".అని ఆరింద మాటలు చెప్పింది.

ఇక అల్లుడు ఏం మాట్లాడతాడు? భార్య మాటలకి నవ్వి ఊరుకున్నాడు.

స్వప్న బాధంతా సిటీ లో ఉన్న కాలక్షేపం ఇక్కడ ఈ మారు మూల కాలనీలో ఉండదని.

అక్కడ ఉంటే ఫ్రెండ్స్ తోనో,బంధువులతోనో కలసి సినిమాలకి షికార్లకి హాయిగా తిరగవచ్చు. అదే ఇక్కడ ఉంటే..సరిగా బస్ సౌకర్యం లేని కాలనీ. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఓ..కిలోమీటర్ దూరం నడిస్తే కానీ..నట్టడివి నుండి జనం లోకి వచ్చినట్టని ఆలోచించుకుని వద్దనుకుంటుందని  అర్ధమయింది శాంతమ్మ కి. మనసులో బాధ  కల్గినా బయటకి వెల్లడించలేదు. దూరంగా ఉండే చోట ఇచ్చి పెళ్ళి  చేస్తే ఇలాగే ఉండేది కదా! అని అనుకుని సర్ది చెప్పుకుంది.

ఇద్దరు పిల్లలు తల్లి అయినప్పుడు కూడా కాన్పుకి వచ్చి మూడు నెలలకే తన ఇంటికి వెళ్ళిపోయేది.

నెలకి ఒకసారైనా పిల్లలని తీసుకుని రావడానికి కూడా స్వప్నకి కష్టంగా ఉండేది.

"పోమ్మా, నీ దగ్గరికి రావడమంటేనే విసుగు. వందలకి వందలు పోయాలి ఆటోల ఖర్చులకి "అనేది.

ఆ మాట వినగానే మనసులో ముల్లులా గుచ్చుకుంది.

నెలా నెలా వచ్చే పెన్షన్ డబ్బు మొత్తం కూతురికే ఇచ్చేసేది. స్వప్న చేసే షాపింగ్ కి ఎక్కడ డబ్బూ  చాలదు. అంతా వెంటనే ఖర్చు పెట్టేసేది.

నేను ఒక్క కూతురినన్న మాటే కాని మా తోడి కోడళ్ళ తో పోల్చుకుంటే నాకే అన్ని విషయాలలోనూ తక్కువ. వాళ్ళకు కారు కూడా పుట్టింటి వాళ్ళే ఇచ్చారు. నాకా  అవకాశమే లేదు అని అంటే ఒంటి మీద ఉన్న బంగారం అమ్మి ఆ డబ్బుని అల్లుడు చేతికి ఇచ్చి కారు కొనుక్కోమని చెప్పింది  శాంతమ్మ .

అప్పుడైనా కూతురు ముఖం లో తల్లి ఒంటి మీద బంగారం కరిగిపోయిందన్న కించిత్ బాధ లేదు కారుని చూసి మురిసిపోయింది.

కారు ఉంది కాబట్టి వారం వారం తను వెళ్ళకుండానే వాళ్ళే వస్తారు అనుకునేది. అది ఆమె అమాయకత్వమని  కొన్ని నెలలకి గాని తెలియలేదు.

మళ్ళీ కొన్నేళ్ళకి అమ్మా! మేము ఉమ్మడి కుటుంబం నుండి విడి పోతున్నాం. మా వాటాకి ఉన్న ఇంటిలో భాగం రాలేదు. నువ్వు ఊర్లో ఉన్న పొలం లేదా  ఈ ఇల్లు కానీ అమ్మేసి ఇస్తే సిటీ లో మంచి ప్లాట్ కొనుక్కుంటాం అని చెప్పింది  స్వప్న.

అందుకు తీవ్రంగా అభ్యంతరం చెప్పింది శాంతమ్మ. పొలం కానీ,ఇల్లు కానీ అమ్మే పరిస్థితి లేదని ఖచ్చితంగా చెప్పింది. పొలం  కౌలుకి ఇవ్వడం ద్వారా వచ్చిన డబ్బుతో అద్దె కట్టుకుని అద్దె ఇంట్లో ఉండమని చెప్పింది. కూతురుకి కోపం వచ్చినా సరే .. ఇద్దరి మధ్య నాలుగు నెలలు మాటలు లేకపోయినా బెట్టుగానే ఉంది. అప్పుడప్పుడు వెళ్ళి  పిల్లలని చూసి డబ్బు ఇచ్చేసి వచ్చేది.

“ఏమిటో..ఈ తరం వారికి దేని విలువ అర్ధం కాదు. ఈ ఇంటిని కట్టడానికి ఆయన యెంత కష్టపడ్డారో! ఎన్ని కష్టాలు వచ్చినా సరే పెద్దలు ఇచ్చిన భూమిని అమ్ముకోవాలని తాము ఎన్నడూ అనుకోలేదు.ఇప్పుడు చూస్తే కూతురు ఎప్పుడూ ఈ ఇంటిని, ఆ పొలాన్ని అమ్మేసి డబ్బు చేసి తనకి ఇచ్చేస్తామా అన్నట్లు చూస్తుంది. సంపాదించిన వారికి తెలిసిన విలువ అయినకాడికి అమ్మేసి దర్జాగా బ్రతకాలని అనుకునేవారికి ఎలా తెలుస్తుంది” అని ఆలోచన చేస్తుంటుంది.

తనతో కూతురు సరిగా మాట్లాడదు అని తెలిసినా కూడా మనసు ఆపుకోలేక పిల్లలను చూడాలని బయలు దేరింది. రెండు మూడు సంచీల నిండా పండుగ కని చేసిన నేతి అరిసెలు,జంతికలు,మిఠాయి, అటుకులు,కమ్మగా కాచిన నెయ్యి తో పాటు.. పల్లెనుండి  తెచ్చిచ్చిన తేగలని కుండలో పెట్టి తంపటి వేయించి, రేగు పళ్ళు, బంతి పూలు,గుమ్మడి పండు,చెరకు ముక్కలు.పెరడులో కాసిన చిక్కుడు కాయలు,మునక్కాయలు,జామ కాయలు..అన్నీ కలిపి మూడు నాలుగు సంచీలలో సర్దింది. అవన్నీ బరువు అయినా సరే ఆటో కట్టించుకుని వెళితే… ఓ వంద రూపాయల ఖర్చు అని లెక్క లేసుకుని ..కాలనీ కి వచ్చే బస్ కోసం ఎదురు చూస్తుంది. ఆ వంద రూపాయలు ఉంటే మనుమడికి ఇంకాస్త ఖరీదైన డ్రస్ కొన్నివ్వవచ్చు కదా అని ఆమె ఆలోచన. అది పిసినారి తనం అనుకోవాలో ప్రేమ అనుకోవాలో! అలా అని ఆమె పిసినారి కాదు. చెట్టుకు కాసిన కాయ,పండు తో సహా అందరికీ పంచి పెడుతుంది.ఇతరుల అవసరాలకు డబ్బు ఇచ్చి ఆదుకుంటూ ఉంటుంది . అందుకే శాంతమ్మ  అంటే కాలనీ వాసులందరికీ అభిమానం.

పదకొండు గంటలకి రావాల్సిన బస్ ఓ గంట ఆలస్యంగా వచ్చింది.

ఎలాగోలా ఇతరుల సాయం తీసుకుని ..ఆ సంచీలన్నీ బస్ లో పెట్టుకుని శ్రమ పడుతూ కూతురు ఇంటికి చేరుకునే లోపు బస్ కిటికీకి తల ఆనించి కళ్ళు మూసుకుంది.  


చేతుల్లో బరువైన సంచీలని మోసుకుని కూతురు ఇంటికి చేరింది. .
మనుమడు బుజ్జి, మనుమరాలు పండు అమ్మమ్మ వచ్చింది అంటూ సంతోషంతో గంతులు వేసారు.
మనుమరాలయితే నా కోసం ఏమి తెచ్చావు అమ్మమ్మా అని అడుగుతూ ఎప్పుడెప్పుడు తీసి ఇస్తుందా అన్నట్లు చూసింది.

ఆమె తెచ్చినవి తీసి ఇవ్వగానే  తింటూ..

అమ్మమ్మా ! నువ్వు తెచ్చిన అరిసెలు యెంత బాగున్నాయో అని చెబుతుంటే సంతోషంగా అనిపించింది. మనుమడు అయితే..మెడ చుట్టూ చేతులు వేసి వేలాడుతూ ముద్దులు పెట్టాడు.

శాంతమ్మకి కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగాయి. ఆత్మీయ మైన స్పర్శ కోసం ఎన్నాళ్ళుగా అలమటించి పోయింది.

తల్లిని ఆ స్థితిలో చూసి  స్వప్నకి కూడా ఏడుపు వచ్చింది. చిన్న పిల్లలా తల్లి ప్రక్కన కూర్చుని తల్లి చేయి పట్టుకుంది. ఆ మాత్రం దగ్గరితనానికే కరిగిపోయి కూతురిని దగ్గరకి తీసుకుంది.

తేలికైన మనసులతో కళ్ళల్లో ఆనందపు కన్నీరు చిప్పిల్లగా కూతురు మసక మసకగా కనబడింది తడిమి తడిమి తన మనసులో దాగిన ప్రేమని ప్రకటించింది.

"అమ్మా! పండుకి సాయంత్రం భోగి పళ్ళు పోద్దామా ?.ఇక్కడ అందరి పిల్లలకి భోగి పళ్ళు వేడుక చేస్తున్నారు.మనం అలాగే చేద్దాం "అని అడిగింది.. "అలాగేనమ్మా."అంది సంతోషంగా శాంతమ్మ. “భోజనాలు అయ్యాక ఒక గంటలోనే అన్ని తయారు చేద్దాం ముందు భోజనం కానీయండి “అంది శాంతమ్మ.

అల్లుడు భోజనానికి వచ్చినప్పుడు ఇంట్లో కనబడుతున్న వాతావరణం చూసి నవ్వుకున్నాడు. రక్త సంబంధం ముందు కోపాలు-తాపాలు యెంత సేపు? ఎన్ని పొరపొచ్చాలు ఉన్నా క్షణంలో ఏకమైపోతారు అనుకున్నాడు.

సాయంత్రం చుట్టూ పక్కలవారిని,దగ్గర బంధువులని పిలిచి భోగి పళ్ళు పోసేటప్పుడు అక్షింతలు వేస్తూ.. మనుమరాలికి అరవంకీ పెట్టింది. కూతురి కళ్ళల్లో సంతోషం చూసి శాంతమ్మ కి సంతోషం వేసింది.

శాంతమ్మ తెచ్చిన తినుబండారాలని, కాయగూరలు,పండ్లు ని అందరికి పంచి మా పొలంలో పండినవి, మా పెరట్లో కాసినవి గర్వంగా చెప్పింది స్వప్న.

ఆ సందడి సద్దు మణిగాక."ఇక నేను వెళతాను స్వప్నా” అంది.

'"అమ్మా ఇక్కడే ఉండకూడదా" అని అడిగింది. స్వప్న

"లేదమ్మా వెళతాను " అంటుంది తను.

ఇలా కలగంటున్న శాంతమ్మ" ఏమ్మా శాంతమ్మ గారు".అన్న పిలుపుకి ఉలికిపడి కనులు తెరిచింది..

“అమ్మా! మీరు దిగే స్టాప్ వచ్చింది. దిగండి” అని చెప్పాడు బస్ కండక్టర్.
మళ్ళీ ఎవరో సాయం చేస్తేనే ఆ సంచీలన్నీ  బస్ లోనుండి కిందికి దిగాయి.

నిదానంగా చేతుల్లో బరువులు మార్చుకుంటూ బస్ లో కన్న కల నిజం కావాలని కోరుకుంటూ కూతురు స్వప్న ఇంటికి చేరుకుంది శాంతమ్మ.

కూతురు ఇంట్లోనే ఉంది. పిల్లలు వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు.

"హాయ్ అమ్మమ్మా!."అని పలకరించి ఆటలో మునిగిపోయారు.

తల్లికి తాగడానికి నీరు తీసుకువచ్చి ఇచ్చి.."నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా సంచుల మోత వేసుకుని రోడ్దెమ్మట పడి మోయలేక నడిచి వచ్చి మా పరువు తీయకు. అయినా ఇవన్నీ నిన్నెవరు తెమ్మన్నారు." అని విసుక్కుంది.

"అదేమిటమ్మా.. పిల్లలున్నారు వాళ్ళ కోసం కనీసం ఈ మాత్రమయినా పిండివంటలు చేసి ఇవ్వడం నాకేం కష్టం ."అంది శాంతమ్మ.

"నీకు కష్టంగా ఉన్నవి నువ్వు ఎలాగు ఇవ్వలేవులే! ఈ చెత్త చెదారం కూడా ఎందుకు ఇవ్వడం? చూసేవాళ్ళు కూతురి కోసం యెంత కష్టపడుతుందో అని అనుకోవడానికి తప్ప" అంది. స్వప్న.

ఆ మాటకి శాంతమ్మ మనసు విల విల లాడిపోయింది. గుండెల్లో గునపాలు గుచ్చినట్లు అయింది.మౌనంగా ఊరుకుంది. తనకి ఒక కొడుకు ఉండి ఇదే మాటలు కోడలు అని ఉంటే గనుక ఎలా జీర్ణించుకునేదో అలాగే జీర్ణించుకుంది. ఆ నిమిషంలో కూతురే కోడలు ల్లాగా  అనిపించింది.
.
పిల్లల దగ్గరికి వెళ్ళి "పండూ! నీకోసం ఏమి తెచ్చానో చూడు. ఇదిగో.ఈ నేతి అరిసె తిని చూడు .ఎంత బాగుంటుందో! పండూ..ఈ తేగని తినడం తెలుసా నీకు? రా చూపిస్తాను . తింటే చాలా బాగుంటుంది." అంటూ వాళ్ళకి దగ్గర కాబోయింది.

మనుమడు ఒక అరిసెని కొరికి తిని చూసి “ఛీ ! ఇదేమి బాగోలేదు అమ్మమ్మా! నాకు ఫైవ్ స్టార్ చాక్లెట్స్ కావాలి” .అని చెప్పాడు.

పండు ఏమో.. తేగని చూసి మొహం చిట్లించింది. నాకు వద్దు,  నువ్వు తెచ్చినవి అన్నీ పిచ్చి స్నాక్స్ అని తోసేసింది.

శాంతమ్మ బాగా నొచ్చుకుంది మనుమరాలికి చేయించుకుని వచ్చిన అరవంకీ తీసి ఇచ్చింది. కూతురు దాన్ని అటు ఇటూ తిప్పి "ఇది చేయించే ముందు నాకు ఒక మాట అన్నా చెప్పవచ్చు కదా! లేటెస్ట్ మోడల్స్ చూసి చేయించేదానిని " అంది. మళ్ళీ అంతలోనే "అన్నీ నీ ఇష్ట ప్రకారమే చేస్తావు.ఇది నాకేమి నచ్చలేదు" అని చెప్పింది.

"నేను నెల నెలా స్కీం లో కట్టిన డబ్బుకి కొంత డబ్బు వేసి చేయించాను. ఆ రోజు షాప్ నుండి చాలా సార్లు ఫోన్ చేసాను. నువ్వు ఫోన్ తీయలేదు స్వప్నా అందుకే నేను నా ఇష్టప్రకారం కొనాల్సి వచ్చింది. ఇప్పటికి ఎలాగోలా పెట్టేయిలేమ్మా! ఈ సారి పెద్దదిగా కావాల్సివచ్చినప్పుడు నీకు నచ్చినట్లు చేయించుకోవచ్చు" అని చెప్పింది.

"భోజనం చేయి"అంది మొక్కుబడిగా. భోజనం వడ్డించి ఎదురుగా కూర్చుని "అయితే ఆ పొలం కానీ ఇల్లు కానీ అమ్మి డబ్బు ఇవ్వనంటావు.".అడిగింది స్వప్న..

''నేను ఇవ్వనని అనలేదు స్వప్నా! నాకు నువ్వు తప్ప ఇవ్వడానికి ఇంకెవరు ఉన్నారు. బంగారం లాంటి పొలం ఇప్పుడుకిప్పుడు అమ్మితే ఏం వస్తుంది చెప్పు? ఇరుకు గదుల ఇల్లు తప్ప. కొన్నాళ్ళు ఆగితే మంచి విలువ పెరుగుతుంది. కాస్త ఓపిక పట్టి నేను ఎందుకు చెపుతున్నానో..అర్ధం చేసుకో” అని చెప్పింది

"పెద్దరికం పేరు చెప్పి ఏదో విధంగా సర్దిపెట్టాలని చూస్తావు కాని బిడ్డ మనసు అర్ధం చేసుకోవు నాకు మంచి ఇంట్లో ఉండే రాత లేదు అనుకుంటాను" అంది నిష్టూరంగానో వెటకారం గానో..

శాంతమ్మ మాట్లాడలేదు. నాలుగు గంటల సమయమప్పుడు నేను ఇంటికి వెళతాను అంటూ బయలుదేరబోయింది.

ఆమెకి ఇంటితో పెనవేసుకున్న అనుబంధాలు అలాంటివి. ఒక్క రాత్రి కూడా ఎక్కడా ఉండలేని తనం.

ఓ,, రెండు గంటలుండు, ఇప్పుడే వచ్చేస్తాను..ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో చిన్న పంక్షన్ ఉంది అని పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళింది. పండు చేతికి తను ఇచ్చిన అరవంకీ పెట్టడం చూసి నవ్వుకుంది ,సంతోషించింది.

"ఏదో స్వప్న నచ్చలేదు అని వొంక పెట్టింది కాని బంగారు ఆభరణం అంటే ఇష్టం లేకుండా ఎందుకు ఉంటుంది.? పైగా ఇప్పుడు గొప్ప కోసమైనా ప్రదర్శించాలని ఉండే మనస్తత్వం తనకి తెలియదా స్వప్న మనస్తత్వం” అనుకుంది లోలోపల.

ఆ రెండు గంటల సమయాన్ని రెండు యుగాల్లా గడుపుతూనే.. ఇంట్లో చిందర వందరగా ఉన్న వస్తువులన్నిటీని సర్దింది.

ఇంటి ముందు  శుభ్రం చేసి వాకిట్లో సంక్రాంతి ముగ్గు పెట్టింది.
ఆ ముగ్గుని తను తెచ్చిన పూలతో చక్కగా అలంకరించింది.

ఎప్పుడు కూతురు వస్తుందా ! ఎప్పుడు ఇంటికెళ్ళి పడదామా అని ఎదురు చూసింది. పది గంటలకి కాని స్వప్న ఇంటికి రాలేదు.పిల్లలిద్దరూ నిద్రకళ్ళతో వేలాడుతున్నారు.

"వస్తాను రా బుజ్జి, పండు టా..టా అని చెప్పి, స్వప్నా! రేపు పిల్లలని తీసుకుని నువ్వు, అల్లుడుగారు భోజనానికి వచ్చేయండి' అని చెప్పింది.

"వీలయితే వస్తాం లేకపోతే లేదు. హైరానా పడి నాలుగు రకాలు వంటలు చేసి వస్తున్నారా లేదా అని తొందరగా రమ్మనమని ఫోన్  లు మీద ఫోన్ లు  చేయకు" అని హెచ్చరించింది స్వప్న.

"సరేనమ్మావెళ్ళొస్తాను పిల్లలు జాగ్రత్త! నువ్వు జాగ్రత్త" అని చెప్పి బయటకి వచ్చింది. గుమ్మం దాకా వచ్చి నట్టే వచ్చి లోపలి తిరిగి వెళ్ళిపోయింది కూతురు.

ఆ రాత్రి వేళ  బస్ సౌకర్యం లేని తమ కాలనీకి ఆటో  మాట్లాడుకుని ఇంటికి వచ్చి పడింది.

ఏమి తినాలనిపించలేదు.తాగాలనిపించేలే
దు. స్వప్న ప్రవర్తనని మర్చిపోలేక పోతుంది. తల్లి బిడ్దల బంధం కూడా "ధనం మూలం మిదం జగత్" లో పలుచనై నీరు కారి పోయింది.

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే! అన్న మాటలు అక్షరాలా నిజం అనిపించాయి.

అలాగే ఆలోచిస్తూ పడుకుంది. మరలా ఏదో గుర్తుకు వచ్చినట్లు ఒక ఉదుటున లేచి వెళ్ళి ఆస్తిపాస్తులున్న డాక్యుమెంట్స్ అన్నీ ఒకచోట చేర్చి పెట్టింది నిద్ర రాని రాత్రి ఎంతకీ తెల్లారదు అన్నట్టు.వేకువ కోసం ఎదురు చూసింది.

నాలుగు గంటలకి రామాలయంలో మ్రోగుతున్న గంటలు విని ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని రధం ముగ్గు పెట్టి.. పసుపు,కుంకుమతో అలంకరించి.పువ్వులు పేర్చి అందంగా ఉన్న వాకిలిని చూస్తూ లోపలకి వచ్చింది.

స్నానాదులు ముగించుకుని పూజ అయ్యేటప్పటికి ఆరు గంటలు దాటింది. అలాగే గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని వచ్చింది.   పాలు కాచి గ్లాస్ లో పోసుకుని వచ్చి అందులో ఏదో టాబ్లెట్స్ వేసుకుని బాగా కలుపుకుని తాగింది. భారంగా నిట్టూర్చింది

పనివాళ్ళు వచ్చారు. వారికి చేతినిండా చేసిన తినుబండారాలు అన్ని పెట్టి పంపింది. "కళ్ళు తిరుగుతున్నాయి నేను కాసేపు పడుకుంటాను" అని చెప్పి అలా వాలు కుర్చీలో తలవాల్చి పడుకుంది.
అలా పడుకున్న శాంతమ్మ కూతురు, అల్లుడు,పిల్లలు వచ్చేవరకు లేవలేదు .

వాళ్ళు వచ్చి తట్టి లేపుతున్నా లేవనే లేదు. కూతురు తల దగ్గరకు వచ్చి అమ్మా , అమ్మా అని కదిల్చేటప్పటికి కూతురి చేతిమీదకి ఒరిగిపోయింది నిర్జీవంగా.

ఏ ప్రేమని 
ఏ సేవని ఆశించక,  

చూడటానికి వచ్చిన అందరూ ఎంత అదృష్టవంతురాలు! పండుగ పూట చనిపోయింది. అంటున్నారు

"అమ్మా ఒక్కసారి మాట్లాడమ్మా ! మాట్లాడమ్మా..!" కూతురు అడుగుతూనే ఉంది. ఆ పిలుపు వినబడని తీరాలకి ఆమె ఆత్మ ఎప్పుడో చేరుకుంది.

**************0*****************

(2012 ఆటా సావనీర్ లో  వచ్చిన నా కథ )

16, జులై 2012, సోమవారం

మన్ మేరా గాయే

ఈ రోజు మనసంతా చాలా చికాకుగా వుంది . అవసరమైన చోట అనవసరమైన వాద ప్రతివాదనలు జరుగుతుంటాయి అలా అని అభిప్రాయ బేధాలు రాకుండా ఉండవు.

అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకునే కన్నా.. ప్రశాంతంగా మనసుకు నచ్చిన పని చేసుకుంటే బాగుండును అనుకుంటూ..ఇదిగో..ఇలా వచ్చాను .

నాకు నిబ్బరాన్ని,మానసిక ప్రశాంతతని ఇచ్చే ... నాకు నచ్చిన అత్యంత ఇష్టమైన వ్యాపకం .. ఈ పాట వినడం.
ఆ పాట సాహిత్యం.. ఇది.

చిత్రం: Banaras - A Mystic Love Story
సాహిత్యం: సమీర్


తూర్పు నుండి సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో..
ఆ కిరణాల వెలుగు సింధూరవర్ణ రంజితమైన మేఘములుగా దట్టంగా పరచుకుంటుంది.
గాలి గమనంలో మువ్వల రవళి వినిపించగా
నా నెమలి లాంటి హృదయం పాడుతుంది..
నా హృదయం పాడింది..
ఓం నమః శివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

నిన్ను పూజించడానికి పళ్ళెరం నిండా పూల దండలు తెస్తాను.
గంగా జలాన్ని కలశంలో నింపి తెస్తాను
తొమ్మిది జ్యోతుల దీపాన్ని వెలిగిస్తాను
నిత్యం శివ చరణముల ముందు శిరస్సు వంచుతాను
తన్మయత్వంతో,భక్తి పారవశ్యంతో..
నా ఆణువణువూ పులకరిస్తుంది
నా హృదయం పాడింది
ఓం నమః శివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

నశ్వరం కాని అభయమిచ్చే శంకరా ..
నేను నీ దర్శనాభిలాషిని
జన్మ జన్మల నుండి నీ పూజ చేయుటలో దప్పిక గొన్న దానిని
నా మీద కొంచెం దయ చూపు
నీ కన్నా నాకు ఎవరు ఎక్కువ కాదు
నా ప్రాణాలు కేవలం నీ కోసమే !
నా హృదయం పాడింది ..ఓం నమః శివాయ
ఓం నమఃశివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ


మన్ మేరా గాయే

ఇక్కడ చూడండి .


(శివ మహాదేవుని చరణార విందములకు శిరసా ప్రణమిల్లుతూ )

15, జులై 2012, ఆదివారం

డైరీ లో కొన్ని పేజీలు 

చినుకు పడితే సంబరం.
చినుకుపై మనసు పడితే
మనపై చినుకు పడితే
మనసంతా ఆనందపు చిత్తడి చిత్తడి...

అందుకే  చినుకు పడినప్పుడు కవిత్వం ..పుట్టుకొస్తుంది.

ఆ కవిత్వం వ్రాసున్న రోజులు గుర్తుకు వస్తాయి.

అలా వ్రాసుకున్న కవితలు..

డైరీ లో కొన్ని పేజీలు ...
చూడు ఈ వర్షం ఎలా  కురిసిందో
వీధులన్నీ ఎలా ఉన్నాయంటే
ఆలోచనల సముద్రం వలే ఉన్నాయి
మూసి ఉన్న గాజు కిటికీ తలుపు మీద
వర్షపు చినుకు ఆనవాలు
నువ్వు వచ్చి ఉంటావేమో 
అందులో నీ పరి ఛాయా కనబడుతుంది




ఇది అసలే వర్షా కాలం
మనసు విప్పి చెప్పేది నీతో మాత్రమే
కేవలం నీతో మాత్రమే
వర్షం నిండుగా కురుస్తుంది నా ప్రేమలా  
కోరుకుంటే ఆకాశం నుండి కురిపించ వచ్చు
కుదిరితే నీ సొగసు వర్షం కురిపించవచ్చు



రాతిరి ఎలా గడిచిందో ఎవరికీ చెప్పకు
కలలో ఉన్న విషయం ఎవరి చెప్పకు
ఓ మేఘం ఎలా వచ్చిందో
మరొక మేఘంతో ఎలా డీ కొందో
ఈ వర్షం ఎలా కురిసిందో ఎవరికీ చెప్పకు


ఇవండీ.. ఒకప్పటి చినుకు తడికి ..వెల్లువెత్తిన భావ పరంపర.
అలాగే ఒక బరువైన పాట.. వినేయండి..


14, జులై 2012, శనివారం

మురికి మనసు


ఈ రోజు వుదయం పదకొండు గంటలప్పుడు నా రెగ్యులర్ కస్టమర్స్ వచ్చారు.

వారిని కస్టమర్స్ ఆనే కంటే  ఫ్రెండ్స్ అంటే బావుంటుందనుకుంటాను నేను.
వారి ఇద్దరి పేర్లు వాణి గారు,విజయ గారు.

వాణి గారు వాళ్ళ అమ్మాయికి ఒక పట్టు చీర కొని వర్క్ చేయాలని కోరారు. మీకు  నచ్చిన చీర కొని తెచ్చుకుంటే వర్క్ చేసి యినని చెప్పాను. వారు అందుకు వొప్పుకోలేదు. సెలక్షన్ చేయడానికి మీరు రావలసినదే అన్నారు.

గత నవంబర్ లో వాణి గారు వాళ్ళ అమ్మాయి పెళ్లి చేస్తే.. అమ్మాయికి కావాల్సిన పెళ్లి చీరల్లో వొక్క చీర కూడా బయట షాపింగ్ చేయకుండా నేను డిజైన్ చేసిన చీరలే తీసుకున్నారు. ఒక్కో చీర వెల ఇరవై వేల పై మాటే! అది వాళ్ళ నమ్మకం.

నేను ఘర్ కా దుకాన్ క్లోజ్ చేసుకున్నా వాళ్ళకి  మాత్రం నా సెలెక్షన్స్ పైనే నమ్మకం.  సరే హడావిడిగా వంట ముగించి 12 గంటలకి సిటీ లోకి షాపింగ్ కి వెళ్ళడానికి రోడ్డు పైకి నడుచుకుంటూ వెళ్లాం. ముగ్గురుం కాబట్టి నా వాహనం తీయలేదు బస్ యెక్కి వెళ్ళాలనుకుని దగ్గరగా వున్న బస్ స్టాప్ కి వెళ్లి నిలుచున్నాం.


వాతావరణం మేఘాలు క్రమ్మి వున్నా వొకటే వుక్కపోతగా వుంది.అప్పుడప్పుడు వురుముల మోత.ఎక్కడో వర్షం కురుస్తున్నట్లుగా. 


రోడ్డు ప్రక్కన మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముతున్నారు. ముగ్గురం  తలా వొకటి  తీసుకుని  వూర్లోనుండి వస్తున్న పదవ నెంబర్  బస్ యెక్కేసి తింటూ బస్ అని కూడా చూడకుండా  కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేసి బీసెంట్ రోడ్డులో దిగేసాం. అలా నడుచుకుంటూ విండో షాపింగ్ చేస్తూ రెగ్యులర్ గా వెళ్ళే షాప్ కి వెళ్లాం.

ఆషాడం సందర్భంగా డిస్కవుంట్స్ సేల్స్ వైపు తొంగి చూడకుండానే   రెండు గంటలు సేపు వెతికి  వో మూడు చీరలు కోసం  పదకొండు వేలు ఖర్చు పెట్టి మెటీరియల్స్ కొన్నాము. డిస్కవుంట్స్ యివ్వడం కుదరదన్నా కూడా 35 % డిస్కవుంట్స్ ని అడిగి యిప్పించుకుని కాస్తంత గర్వంతో వొడలు విరుచుకుని  షాపులో నుండి బయటపడ్డాం. కాస్త అలా వెళ్లి ఆ మోడరన్ పుడ్స్ లో ఒక కర్రీ పఫ్ఫ్,ఒక సమోసా,బాదం పాలుతో మరి కాసిని కబుర్లు చెప్పుకుని వేరు వేరు బస్ స్టాప్ లోకి నడచి యెవరి దారికి వాళ్ళు విడిపోయాం.


నేను బస్ స్టాప్ లోకి రాగానే మళ్ళీ పదవ నంబర్ బస్సు  వచ్చింది. ఖాళీగా వుందని  యెక్కేసాను. మధ్యాహ్న సమయం కాబట్టి పెద్దగా రష్ లేదు. ఎక్కగానే సీట్ దొరికింది. విండో సీట్ లో కూర్చుని అలా మారిన మహాత్మా గాంధి రోడ్డు అందాలని అవసరమైన గుర్తులని బుర్ర లోకి యెక్కించుకునే   ప్రయత్నం చేస్తూ ఎఫ్ ఎమ్..రేడియో పాటలు వింటూ అలా కళ్ళు మూసుకున్నాను.

పి.డబ్లు యూ గ్రవుండ్స్ బస్ స్టాప్ లో బస్ ఆగింది. బిల బిల మంటూ వొక  పది మంది యెక్కేసారు. వాళ్ళ వైపు అప్రయత్నంగానే చూసాను.

అందులో కొంత మందిని వో పదేళ్ళ క్రితం చూసి వుంటానేమో అయినా వాళ్ళని గుర్తించాను.

వాళ్ళేమి గుర్తుంచుకోవాలసిన వ్యక్తులు కాదు. బహుశా వారి దైన్యం,పేదరికం,అందరి కన్నా భిన్నంగా వుండనేమో వాళ్ళంటే చులకన భావం. నాకే కాదు చుట్టూ వున్న ప్రపంచం లోని 90 % మందికి అదే భావం.

అసలు నేను నాతో  పాటు అందరూనూ  యెవరైనా  విభిన్నంగా  కనబడతారేమో అని చూస్తాను. ఊహు..అందరు అంతే నాతో  సహా.  


బస్ లోకి యెక్కిన పది మంది పిల్లలు,స్త్రీలు. వారు యెక్కడ  సీట్లు ఖాళీ వుంటే అక్కడ సర్దుకుని కూర్చున్నారు. వాళ్ళు తమ ప్రక్కన కూర్చోగానే సీట్లలో కూర్చున్న ప్రయాణికులు మొహం చిట్లించుకున్నారు. అసహ్యంగా వారికి దూరంగా జరగడానికి ప్రయత్నించారు. వారు తగిలితే యెక్కడ మైల పడతామో అన్నట్లు..ముడుచుకుని సర్దుకుంటున్నారు.

మరి బస్ యెక్కిన పది మంది.. శుభ్రమైన బట్టలు ధరించలేదు. కనీసం చింపిరి చింపిరిగా వున్న జుట్టుని దువ్వడం చేసి నెలలు కూడా అయి వుండవచ్చు.వాళ్ళ శరీరాల నుండి చెమట కంపే కాదు, ఒక రకమైన ముంజు వాసన. వాంతి తెప్పించే వొక రకమైన దుర్గంధం. పాపం గాలికేం తెలుసు, వారి వైపు నుండి పయనించి ప్రక్కనే కూర్చున్న నాగరికుల వైపు పయనించ కూడదని.


పాపం వారికి కడుపు నిండా తినడానికే లేదు. ఇంకా  పరిమళాలు వెదజల్లే సబ్బులతో స్నానం చేయగలరు?


పాపం వాళ్లకి త్రాగడానికే మంచి నీరు కరువు. ఇంకా శరీరాలని శుభ్ర పరచుకోవడానికి నీరు యెక్కడ?.

వారు వొంటి నిండుగా బట్ట కట్టుకునే ప్రయత్నమే చేసారు. కానీ ఆ బట్టలకి అన్నీ చిరుగులే! ఆ బట్టలు వుతుక్కునేందుకు మార్చుకునేందుకు వేరే బట్టలే లేవు. ఏ దయాశీలురో పాత బట్టలని వస్త్రదానం చేసినా కడుపు నింపు కోవడానికి పదికో పరకకో..ఆ వస్త్రాలని అమ్మేసుకుని పొట్ట నింపుకుంటారు.

వారు ప్రతి నిత్యం సూర్యుడి కన్నా ముందే నిద్ర లేస్తారు. వీధి వీధిలోని చెత్త కుండీలలో మనకి పనికి రాని వస్తువు లని అపరాధ పరిశోధకులగా మారి చెత్త నుండి విడగొట్టుకుని భద్రంగా భుజాన ఉన్న గోనె సంచీలో సేకరించి అమ్ముకుంటారు. వారికి పనికి వచ్చే వస్తువులతో పాటు పాచిపోయిన ఆహార పదార్ధాలని అపురూపంగా యేరుకుని పొట్టబోసుకుంటారు


సాయంత్రం వరకు యేరుకుని వాటిని అమ్ముకుని వచ్చిన తృణమో,పణం తోనో.. ఆహారాన్ని కొనుక్కుని  అర్దాకళ్ళతో  పడుకుంటారు. మరి వారికి వంట తయారీ సామాగ్రి లేదు, బియ్యం నూకలు కరువు.


వాళ్ళకి పూరి గుడెసైనా లేదు. మా వూరి హై స్కూల్ ప్రహరీ గోడకి ఆనించి వేసిన వెదురు బొంగులపై యెరువుల మందుల సంచులని పరదాలగా మార్చి యె౦డ వానల నుండి రక్షణ పొందుతారు. రాత్రి సమయాలలో స్కూల్ వాచ్ మెన్ దయతలచి లోపలి ప్రవేశం యిస్తే వరండాలో పక్కలు పరచుకుంటారు.

పదునాలుగు యేళ్లకే ఓ పసుపు తాడు కట్టి పెళ్లి అయినదనిపించుకుంటారు. ఓ పిల్ల తల్లి వొడిలో మరో పిల్ల. ఓ పదునైదు యేళ్ల అబ్బాయి తండ్రిగా మారతాడు. వారి జీవన విధానం అదే .వాళ్ళంతా వీధి బాలలు,వీధి తల్లులు-వీధి తండ్రులు. వారసత్వం కాపాడుకుంటున్నట్లు గా.

స్థానికులు ఓ ఏబై  యేళ్లలో మూడు తరాలు చూసామని చెపుతుంటారు

పదేళ్ళ క్రితం నేను చూసిన పిల్ల వొడిలో నేడు వో..పిల్ల. నాకు ఆశ్చర్యం. ఆ తల్లి యే బిడియం లేకుండా మురికి కారుతున్న పైట తొలగించి .బిడ్డకి స్తన్యం అందించింది. వారినే చూస్తున్న కొన్ని కళ్ళు. జాలిగా చూసే కొన్ని కళ్ళు. అందరి చూపులు వారి పైనే. వారిని బస్ దిగిపోమ్మనే అధికారం యెవరికీ లేదు. ఎందుకంటే వారు మాకు లాగా తొమ్మిది రూపాయలు చెల్లించి టికెట్టు కొనుక్కుని ప్రయాణించే వారే!


వారిని తమ ప్రక్కన కూర్చో వద్దని అడ్డుకునేందుకు దమ్ములేదు. వారికి హక్కు ఉంది కదా! అందుకే ముక్కులు మూసుకుని బలవంతంగా భరిస్తున్నారు. .


వారిని మన ప్రక్కన కూర్చుని ప్రయాణం చేయడాన్ని అసహ్యించుకుంటున్నాం. మనం నాగరికులం. అది గమనించేమో, తమ వారి ప్రక్కన సీట్లు ఖాళీ కాగానే వారే వారి వారి దగ్గరకు సర్దుకుంటున్నారు.మన నాగరిక మురికిని మనకే వదిలేసి అన్నట్లుగా వాళ్ళు వాళ్ళ పిల్లలు కబుర్లతో, గట్టి నవ్వులతో. వెనుక సీట్లు నుండి ముందు సీట్లకి ప్రవహింపజేసే కేకలతో, సందడితో గమ్య స్థానం చేరుకుంటారు.

అది వారి రోజు వారి దిన చర్య. అది అలా సాగుతూనే ఉంది. మారనే మారదు అన్నట్లు. మార్చడం యెవరి వల్ల కాదన్నట్లు. ఎవరు కాదనే ప్రసక్తే లేదు.

వారిని చూస్తే నాకు యిలా అనిపిస్తుంది.

చెత్త కుండీల నుండి వ్యర్ధాన్ని యేరుకుని అర్ధంగా బ్రతుకుతున్నట్లు అనిపిస్తున్న వారిని చూసి మనం చాలా నేర్చుకోవాలి. మనం కప్పుకున్న ముసుగులు తొలగించాలి. అవును చదువు-సంస్కారం,ధనం,హోదాల సంగతి మర్చిపోయి వారిని మనలో కలవనీయ గల దైర్యం ఉందా!?

నాకైతే లేదు అనిపించింది.


ఎందుకంటే నా పుట్టుక లో అహం, నా స్థాయిలో కనబడే బేధం, నా కులం, నా మతం, నా ఇల్లు, పరిశుభ్రత. ఇంకా నాకున్న విద్యార్హత, నాకున్న ఆర్ధిక స్తోమత కూడా.

వారు నా ప్రక్కన కూర్చుని ప్రయాణించడానికి నా మనసేమాత్రం  అంగీకరించదు.

భగవంతుడా! ఎందుకు వీరికి యిలాటి స్థితిని ప్రసాదించావు? ఎందుకు వీరిని ఆ మురికి కూపం నుండి బయటకి రానీయ కుండా చేస్తావు? వారికి మాలా బ్రతికే హక్కు నేర్చుకోమని యె౦దుకు చెప్పవూ?    వాళ్ళ జీవితాలు మారావా? వాళ్ళని మారనివ్వవా? తరతరాలు వారివి వీధిబాలల, చెత్త కుప్పల బ్రతుకేనా? .అని అనుకుంటూనే దేవుడిని ప్రార్దిస్తూనే అంతలోనే యేహ్యం ప్రదర్శిస్తాను.

అమ్మో! వాళ్ళది యే౦  పుట్టుక  రా బాబూ! ఏం దరిద్రం పెంపకం? అపరిశుభ్రత భరించడం నావల్ల కాదు.

యాక్.. తలచుకుంటేనే వాంతి వస్తుంది. ఇంకా నా ప్రక్కన కూర్చుంటే భరించడ
మా? నెవ్వర్.   రోజూ  వొక పూట పస్తుండి అయినా ఓ యిద్దరికైనా కాస్త అన్నం పెడతాను కానీ, వాళ్ళని తోటి మనిషిగా చూడటమా!? అనుకున్నాను.

అవును నాలో మనిషి తనమే కాదు మానవత్వం లేదు.


వారిని మనిషిగా చూడ గల్గిన వాళ్ళు, వాళ్ళ దీన గాధలకి, వారి బాధలకి,దయనీయ జీవన విధానానికి జాలి తలచిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తాను. విశ్వ మాతా .. మదర్ ! నీ ప్రేమ తత్వానికి,నీ జాలి గుండె స్పందనకి, నీ దయార్ద్ర హృదయానికి శత కోటి వందనాలు. నీ సేవా బావానికి,  కరుణామృత హృదయానికి మనసా వాచా ప్రణమిల్లుతాను తల్లీ!

నాలో మనిషి గుణం,మానవత్వం లేనందుకు మన్నించు తల్లీ! నేను ఒక మామూలు మనిషినే! ప్రక్కనే ప్రాణం ఉన్న ఓ.. మనిషి మనిషిగా చూడటం చేతకాని పాషాణాన్ని! నన్ను క్షమించు తల్లీ!!. అనుకుంటూ.. వారి ప్రయాణం సాగుతుండగానే నేను దిగాల్సిన స్టాప్ వచ్చి నేను బస్ దిగిపోయాను.


ఇంటికి రాగానే చికాకుగా అనిపించి స్నానం చేసేసి శరీరపు   మురికితో పాటు మురికి ఆలోచనలు కడిగి వేద్దాం అనుకున్నాను.


ఊహు నా వల్ల కాలేదు. చింతాల్ సబ్బు నా శరీరపు  మురికిని, రిన్ ప్రెష్ నా బట్టలకి అంటిన మురికి వాసనని పోగొట్టాయేమో కాని.

నాలో ఉన్న మురికి హృదయం మారదు గాక మారదు. నేను మనిషినే!

ఏ మాత్రం గొప్పదనాన్ని అపాదించుకోవాలని ప్రయత్నించినా కూడా  అది  యేమాత్రం అంటని మామూలు మనిషిని. మురికి మనసుని .    

13, జులై 2012, శుక్రవారం

కోరా కాగజ్ త మన్ మేరా


ఇటీవల మీడియాకి కనబడిన రాజేష్ ఖన్నా రూపం చూసి చాలా మంది అభిమానులు బాధపడ్డారు. మన రొమాంటిక్ హీరో రాజేష్ ఖన్నా యేనా!? అని ఆశ్చర్యపోయారు కూడా!

అవును మరి "రాజేష్ ఖన్నా " అంటే కవ్వించే కళ్ళు, కళ్ళతోనే గిలిగింతలు పెట్టె సైగలు, గడ్డం నొక్కుతో.. హీరోయిన్ ల కళ్ళలో నిజమైన హీరో..అని పేరు.

వారి చిత్రాలలో పాటలలో పేరెన్నిక గల ఈ పాట చూడండి 'ఆరాధన" చిత్రం లోని పాట. ఇది. "షర్మిల టాగోర్ " జోడీగా నటించిన ఈ చిత్రం మన తెలుగు చిత్రం "కన్నవారి కలలు" కథ కి చాలా దగ్గరగా ఉంటుంది.

"రూప్ తేరా మస్తానా" మేరె సపనోం కి రాణీ ,గున్ గునా రహే,చందా హై తూ..లాటి హిట్ సాంగ్స్ ఉన్నాయి.

ఈ పాట ని నేను దూరదర్శన్ లో మొదటి సారి చూసినప్పుడు ..ఇలా అనుకున్నాను.

ye gaanaa dhekhane per ..mera Dil mujse poochane laga ki kisiko pyaar kare tho achcha hone ka aaise hi hum bhi gaane gaane vaale hai

నేను కూడా ఎవరినైనా ప్రేమించి ఉండి ఉంటే బాగుండును.ఇలా పాట పాడుకుని ఉండేవాళ్ళం కదా ..అని :))

అప్పుడు నా వయసు పద్దెనిమిది.పెళ్లి అయిపొయింది కూడా:))

అప్పుడు,ఎప్పుడూ.. ఆ పాట చూస్తే అలాగే అనిపిస్తుంది. థట్స్ గ్రేట్ రొమాంటిక్ హీరో..రాజేష్ ఖన్నా.. ఆ లుక్స్. ఆ స్టైల్ అదరహో!

హిందీ మూలం కి తెలుగు అనువాదం ఇలా ఉంటుంది.

అతను: తెల్ల కాగితం లాటిది నా ఈ మనసు ..
రాశాను అందులో నీ పేరు
తెల్లని కాగితం లాంటి నా ఈ మనసులో వ్రాసాను నీ (ఈ)పేరు

ఆమె:
నిస్సారమైన నా ఈజీవితంలో నిండి పోయింది నీ ప్రేమతో..

అతను:
కలలు చెదిరిపోకూడదని..భయపడతాను నేను
రాత్రి పగలు కలల్లో చూస్తుంటాను
కాటుక నిండిన కళ్ళు ,వాటి సైగలు మత్తెక్కిస్తూ
ఏ నీడ లేని అద్దం లాంటి నా మనసు
చిత్రించుకుంది (రచించుకుంది) ఇందులో నీ ప్రతిబింబం

ఆమె:
తెల్లని కాగితం నా ఈ మనసు అందులో వ్రాసాను నీ పేరు .
విశ్రాంతి పోగొట్టుకున్నా..నేను నిద్రను పోగొట్టుకున్నా
పూర్తి రాత్రి మెలుకువగా ఉన్నా ..నేను ప్రార్ధనలు చేయడానికి {2 సార్లు)
ఇంతకన్నా నీకేం చెప్పగలను ..ఎలా చెప్పగలను ?
నాలో ఉన్న కోరికను ,ప్రేమను..మనసు లాగగా..
అజ్ఞాత శత్రువైన ఈ నామనసు వెళ్లి మారింది

అతను
తెల్ల కాగితం నా ఈ మనసు అందులో లిఖించాను నీ పేరు.
తోటల్లో పూలు వికశించడానికి ముందు (2 సార్లు)
ఆమె:
నా నీ కళ్ళు కలుసుకోవడానికి ముందు (2 సార్లు)
అతను:
చెప్పుకోబడ్డ ఈ మాటలు

ఆమె:
కలయికలు
అతను:
ఇలాటి రాత్రులు
ఆమె :
రాలిపడిన నక్షత్రం లాంటి నా ఈ మనసు
అతను:
మారి తయారైంది నీ చందమామలా ..
అతను &ఆమె :
తెల్లని కాగితం నా ఈ మనసు లిఖించాను అందులో నీ పేరు.

ఈ పాటకి సాహిత్యం:ఆనంద్ బక్షీ.
సంగీతం:ఎస్.డి.బర్మన్.
గళం: కిషోర్ కుమార్,లతా మంగేష్కర్
చిత్రం:ఆరాధన



ఈ పాట you tube లో చూడండి 



12, జులై 2012, గురువారం

నచ్చిన అంశం

మనం ప్రతి నిత్యం ఎన్నో విషయాలని ప్రత్యక్షంగా చూసి,చదివి,విని,స్వయంగా చేయడం ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటాము.

ఈ మధ్య కాలంలో నేను చదవడం ద్వారా మంచి విషయం తెలుసుకున్నాను ఈ విషయం చూడండి ..
తల్లి -తండ్రి మధ్య ఉన్న వ్యత్యాసం. అలాగే విధ్యార్ధులతో గురువుకి ఉన్న అనుబందాన్ని...ఎంత బాగా వివరించి చెప్పారో!

చదవడం పట్ల ఉన్న ఆసక్తితో.. నేను ప్రతి నిత్యం ఇలాటి విషయాలు చదివేటప్పుడు అల్లా.. మా అమ్మ బాగా గుర్తుకు వస్తూ ఉంటారు. .

అమ్మ ఇచ్చిన కాఫీ త్రాగుతూ.. దొరికిన పాత పేపరో, (సరి క్రొత్త పేపర్ ఉండేది కాదు. రెండు మూడు రోజుల నాటి పేపర్ ని మా పెదనాన్న గారిని అడిగి తెచ్చుకుని చదువుకునేవాళ్ళం) లేదా ఏ వార పత్రికనో తిరగేస్తూ ఉంటే..ఆ కాఫీ చల్లారి పోయేది. అలాగే అన్నం తింటూ చదవడం మొదలెట్టాను అంటే.. చేయి ఎండి పోయి..అన్నం ఆరిపోయి..అలా కెలుకుతూనే ఉండిపోయే దాన్ని. అప్పుడు అమ్మ బాగా తిట్టేది. పెంట కుప్పలో కాగితాలు కూడా వెతుక్కోచ్చుకుని చదువుతావు అని. అలా చదివే అలవాటు మూలంగానే కాస్తంత జ్ఞానం నేర్చుకున్నాం. .. అని ఇప్పుడు అనుకుంటాను.

ఈ నాటి యువత కి ఈ అలవాటు లేనేలేదు. మొబైల్ పోన్ లలో ఇంటర్నెట్ కనెక్షన్ లభ్యం అవడం మొదలెట్టాక పేస్ బుక్ లో చాటింగ్..లో తలమునకలై ..తల్లిదండ్రులు పలకరిస్తే చాలు విసుక్కోవడం అసహనం ప్రదర్శించడం చేస్తున్నారు. అది ఎంత వరకు సమంజసమో ఆలోచించుకుంటే మంచిది.

విపరీతమైన వత్తిడితో కూడిన చదువులు చదువుతున్నారని..పిల్లలకి చిన్న పాటి పని కూడా చెప్పకుండాను ,ఇంకా చెప్పాలంటే వారికి కావలసిన అవసరాలతో పాటు.. వారు కోరిన అన్ని గొంతెమ్మ కోర్కెలని తీరుస్తున్న కుటుంబ ఆర్ధిక పరస్థితి ఏమిటో కూడా ఆలోచించడం లేదు కూడా అనిపించింది.

అలాగే నేను చదివిన ఒక మంచి వాక్యం..మన బ్లాగ్ ల లోనే చదివాను.. నాకు చాలా బాగా నచ్చింది కూడా.
ఆ వాక్యం ఏమిటో..మీరే చూడండి.

"బాహాటంగా చెయ్యలేని పనిని రహస్యంగా కూడ చెయ్యకూడదు.."

యువత కూడా ఈ విషయాన్ని అర్ధం చేసుకుంటే బాగుండును..కదా!! ఇలాటి విషయాలని ఉత్తరాలు వ్రాసే కాలంలో చక్కగా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకునే దాన్ని. ఇప్పుడు కూడా వ్రాస్తాను అనుకోండి. ఇక్కడ కూడా ఇలా వ్రాస్తూ.. హాపీగా ఫీల్ అవుతున్నాను.

సరే ఈ చక్కని విషయాన్ని కూడా చూడండి.

ఈ నెల తొమ్మిదవ తేదీ నాటి ఆంద్ర జ్యోతి దిన పత్రిక జిల్లా ఎడిషన్ లో "చుక్కాని " చూడండి.