24, అక్టోబర్ 2022, సోమవారం

మాతృత్వపు హక్కు రద్దు కోరిన తల్లి

 ఈస్తటిక్ సెన్స్ కథా సంపుటిలో “ప్రేమే నేరమౌనా!?” కథ పై కథా సమీక్ష  (వ్యాఖ్యానం) అందించారు -రాధ  మండువ. అది మీకు పరిచయం చేస్తున్నాను. రాధ మండువ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.. 

***********

వనజ తాతినేని గారు  బ్లాగర్ గా, కవయిత్రిగా, రచయిత్రిగా పదేళ్ళకు పైగా పరిచయం. ఆమె తన అముద్రిత కథలను సంపుటిగా  వెలువరించే క్రమంలో ఒక కథని పరిచయం చేయమని అడిగిన వెంటనే అంగీకరించాను.   

"ప్రేమే నేరమౌనా!?" కథను చదివిన తర్వాత కథను విశ్లేషించాలన్న ఆసక్తి కలిగింది. కథ చదువుతుంటే ఆ కథలోని కథానాయకి పై ఇష్టం ఏర్పడింది.  ఆమె ఆలోచనా పరిథి లోని విస్తృతి ఆశ్చర్యం కలిగించింది.

సాధారణంగా కనిపిస్తూ అసాధారణమైన కథగా ముగియడం ఈ కథలోని విశేషం. జీవితం ఇలా కూడా ఉండవచ్చు లేదా మలుచుకోవచ్చు కదా అనిపించింది.  

ఎన్నో ఆలోచనలు మనలో కదలాడుతాయి - ఆవేదన కలిగించేవి.  కుటుంబ బంధాలనే సంకెళ్ళ నుండి, తన మానసిక వేదన నుండి స్త్రీ విముక్తి కోరుకోకూడదా!? అనేదే ఈ కథలో చర్చించుకోవలసిన విషయం.

స్త్రీలకూ వ్యక్తిత్వ సృహ ఉండాలన్న మేల్కొలుపు ఈ కథా నాయకి దేవకి లో కలిగింది.  కలగడమే చైతన్యమైతే ఆమె నిర్ణయం పాఠకులకి  ఒక విభ్రాంతిని కలిగిస్తుంది. 

స్త్రీలు  కుటుంబం కోసం కొవ్వొత్తిలా కరిగిపోయాను అనే ఆరోపణలు చేసుకుంటూనో లేదా అర్ధం చేసుకున్న కుటుంబ సభ్యుల మధ్య వారి   సానుభూతితో  బ్రతుకుతూనో ఉండాలి తప్ప తమకి ఇష్టం వచ్చినట్లు ఉండకూడదా!? తమకి నచ్చని వాటిని స్వేచ్ఛగా వ్యక్తీకరించకూడదా!!? లాంటి భావాలు పాతవే కానీ వాటిని సరికొత్తగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా రచించడం, ముఖ్యంగా కథ ముగింపులో ఓ బలమైన కెరటం ముఖాన్ని తాకిన అనుభూతిని కలిగించడంలో రచయిత్రి ప్రతిభ కనపడుతోంది.  

*

ఇక కథలోకి వెళితే - 

ప్రేమించి పెళ్లి చేసుకున్న దేవకి భర్త సహకారంతో ఉన్నత చదువులు చదువుకుని, ఉద్యోగం సంపాదిస్తుంది. ఇద్దరి బిడ్డలకి తల్లి అవుతుంది. వారి పిల్లల పెంపకం భర్త చేతికిచ్చి ఆమె ఆదాయ వనరుగా  మారిపోయింది. అది ఎంతలా అంటే -  తండ్రి గారాబంలో పిల్లలిద్దరూ తల్లి మాటను లక్ష్య పెట్టనంతగా...  తల్లిని గడ్డిపోచలా తీసి పారేసేంతగా... 

ప్రేమ, గౌరవం ఇవ్వాల్సిన పిల్లలే ఆమెని మానసిక వ్యాధిగ్రస్తురాలిగా ముద్ర వేశారు. క్రమశిక్షణ లేని,  సోమరిపోతులైన,  సంపాదనాపరులైన పిల్లల మాటతీరు, ప్రవర్తన భరించలేకపోతుంది.  వారికి భర్త వంతపాడటం జీర్ణించుకోలేకపోతుంది.

ఏం చెయ్యాలో నిర్ణయించుకునే కోర్టు మెట్లెక్కింది.  జడ్జితో తన ఆక్రోశాన్ని స్పష్టంగా చెప్పగలిగింది.  'తన  భర్తనుండి, పిల్లలనుండి గౌరవం, ప్రేమ కావాలి అని కోరుకున్నాను, అవి లభించవని గ్రహించాను' అని చెప్పిందే తప్ప వాళ్ళని నిందించలేదు.  ఈ నేల మీద నిలబడటానికి తనకి కొద్దిపాటి ఊతం చాలు అనుకోగలిగింది కనుకనే తన సంపాదన ని  నాలుగు భాగాలు చేయమని కోరింది.  ఆమె ఆలోచనల్లో దూరదృష్టి, ఆమె నిర్ణయంలో స్పష్టత ఉంది.

దేవకి తీసుకున్న నిర్ణయం, కోర్టులో జడ్జి గారితో ఆమె  మాట్లాడిన విధం, భర్త కానీ, పిల్లలు కానీ ఆమె తీసుకున్న నిర్ణయానికి ఎలాంటి మాటలు అంటారో ఊహించడంలో ఆమె  చూపించిన పరిపక్వత ...  కథ చదివితే పాఠకులకి అర్థం అవుతుంది. 

ఆమె ఆలోచనల్లోని పరిపక్వత నేటి ప్రతి స్త్రీలోనూ ఉండాలనిపించింది.  రచయిత్రి వనజ తాతినేని గారు స్త్రీల అంతరంగాలని ఆవిష్కరించడంలో గొప్ప పరిశీలన చేశారనిపించింది.  ఓ స్త్రీని మరో స్త్రీ మాత్రమే అర్థం చేసుకోగలదు అనే సత్యం మరోసారి ఋజువయింది.

పాత్ర యెక్క ప్రతి ఆలోచననూ, ఆమె తీసుకోబోతున్న నిర్ణయాన్ని పాఠకులు అర్ధం చేసుకోవడానికి అవకాశమిస్తూ వనజ గారు కథని మలిచారు.  

పాఠకులకు అందాల్సిన కోణాలు మరెన్నో చర్చకు రావడానికి అవకాశాన్ని కూడా ఇచ్చారు.  

కులాంతర, మతాంతర ప్రేమ వివాహాలలో స్త్రీ నిమ్న కులానికి చెందినదైతే ప్రతి భారతీయ వివాహంలో ఉండే పురుషాధిక్యతతో పాటు కుల అహంకారాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందనే సూక్ష్మమైన విషయాన్ని కథలో జొప్పించి ప్రతిభావంతంగా చెప్పగలిగారు.

ఆధిపత్యభావన, అహంకారపు ధోరణులను భరించలేక నలిగిపోతున్న ఎంతో మంది స్త్రీల ఆవేదనే ఈ కథ.  

గుర్తుండిపోయే కథను రాసిన వనజ గారికి అభినందనలు. ఆమె అముద్రిత కథా సంపుటి "ఈస్తటిక్ సెన్స్" కథా సంపుటిలో చోటు చేసుకున్న మిగతా కథలను,   సహరచయితల  విశ్లేషణలను చదవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. 

వనజ తాతినేని గారికి మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ    -  రాధ మండువ.




12, అక్టోబర్ 2022, బుధవారం

నల్లకాకి - తెల్లమనసు - కోకిల తల్లి

 కోకిలతల్లి -విశ్లేషణ వి. శాంతి ప్రభోద

సాధారణంగా మనం కాకిని పాపానికి ప్రతీకగా చూస్తాం. 

గత జన్మలో చేసిన పాపాలన్నీ కాకి రూపంలో ఎగిరి పోతాయని నమ్ముతాం. 

కానీ నల్లని కాకి లోని తెల్లని మనసును గమనించం. 

తన జాతికి చెందని కోకిల గుడ్లు పొదిగే దయాగుణాన్ని, సేవా హృదయాన్ని  గుర్తించం.  

వనజ తాతినేని గారి "కోకిల తల్లి" లో ఒక సాధారణ గృహిణి కరుణ గుర్తించింది.   

కాకికి ఉన్న సంస్కారం, క్షమాగుణం, నిస్వార్ధం మనిషిని అయిన  తనకు లేవేంటి అని ప్రశ్నించుకుంటుంది ఈ కథలోని ప్రధాన పాత్ర కరుణ. 


ఈ ప్రకృతిలోని పక్షులు, పువ్వులు , పచ్చని చెట్లు, పువ్వులను వాటి జీవన సంరంభాన్ని సరిగ్గా పట్టించుకోము.  పరిశీలించం. అన్నిటికీ సమయం లేదనుకుంటాం. 

 కానీ ఈ కథలో ప్రధాన పాత్ర కరుణ నిశితంగా గమనిస్తుంది. 

ఆమె గమనిస్తున్నట్టు చెట్టుకు , పువ్వుకు , ప్రకృతికి , కాకికి తెలుసో తెలియదో .. కానీ ఆమె వాటిని ప్రతి రోజూ పరిశీలిస్తూనే ఉంటుంది. మౌనంగా సంభాషిస్తూనే ఉంటుంది. 

బహుశా వాటికి ఆ విషయం తెలియక పోయి ఉండొచ్చు. తెలిస్తే అవి అప్రమత్తంగా ఉంటాయేమో .. అంత సహజంగా ఉండలేవేమో ..!

బిడియపడుతూ ఉంటాయేమో..! 

అక్కడ నుండి వెళ్ళిపోతాయేమో.!


మనిషి అలికిడి ఉన్నచోట పక్షులు అప్రమత్తంగా ఉంటాయి. 

ఇక్కడ ఈ కథలో కరుణకి కాకికి స్నేహం కుదరడం వల్ల, ఆమె పెట్టే ఆహారం వల్ల కాకికి ఆమె నుంచి ఎటువంటి హాని లేదన్న భరోసాతో ఉంది. 


ఒకరి భాష ఒకరికి తెలియకపోయినా వాటి కదలికల ద్వారా, శబ్దం ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కరుణ. 


ఆహారం సేకరించలేని ముక్కు విరిగిన మగ కాకికి కూడా  అంతకు మునుపు జతకట్టిన ఆడకాకి ఆహారం సేకరించి పెట్టడం చూస్తే మంచాన పడిన భర్తకు  తెచ్చిపెట్టి పొట్ట నింపే, సేవ చేసే స్త్రీ కనిపించింది. 


కారణాలేవైనా జతగాడు దూరమైన కాకి తర్వాతి కాలంలో మరో మగ కాకితో జతకట్టడం చూసినప్పుడు మానవ సమాజం కూడా అంత స్వేచ్ఛగా జతగాళ్ల విషయంలో ఉంటే మహిళలు అనవసర బరువు మోయాల్సిన అవసరం ఉండదు కదా!


ప్రపంచంలో అన్నింటికన్నా తల్లి ప్రేమ గొప్పది అంటారు.  స్వచ్ఛమైందని చెప్తారు.  నిస్వార్ధమైందని, విశాలమైందని అంటారు. 

తన బిడ్డ ఎలా ఉన్నా, అందంగా ఉన్నా లేకపోయినా, రంగు ఉన్నా లేకపోయినా , లోపం ఉన్నా కన్నతల్లికి తన బిడ్డ అందంగా కనిపిస్తుంది.  ఆ తల్లి బిడ్డ పై చూపే ప్రేమ, ఆదరణ, సంరక్షణ కూడా అంతే అందంగా ఉంటుంది. 

అది మనిషైనా, పక్షి అయినా, జంతువైనా ఏ జీవి అయినా బిడ్డకు కష్టం రాకుండా కాపాడుకోవడానికి యత్నిస్తుంది తల్లి.


కాకి గూట్లో కళ్ళు తెరచిన కోకిల పిల్ల తొలిసారి గొంతు విప్పగానే గమనించిన కాకులు చేసిన గోల విన్న తల్లి కాకి  రివ్వున వచ్చి, తోడేళ్ళ గుంపు బారిన పడి విలవిల్లాడుతున్న జింకపిల్లలా ఉన్న కోకిల పిల్లను కాపాడింది.  బిక్క చచ్చిపోయిన కోకిల పిల్లను ముక్కుతో పరామర్శించి తన రెక్కలను గొడుగుగా కప్పి రక్షణ ఇస్తుంది. నీకు నేనున్నానన్న భరోసా నింపుతుంది.  

 

సొంత తల్లి ప్రేమకు నోచుకోని పిల్లలను కన్నబిడ్డ మాదిరిగా  ఆదరించిన కాకి ఔదార్యం చూసి ఆశ్చర్యపోతుంది కరుణ.  కాకి అంటే గౌరవం రెట్టింపు అవుతుంది. 


శ్రీకర్ మరణం అంచులో ఉన్నప్పుడు భార్య కడుపున పుట్టని బిడ్డలను ఆమెకు  చేరువ చేయాలని ప్రయత్నించినప్పుడు, అంత ఔదార్యం తనకు లేదని వారి బాధ్యత తీసుకోలేనని,  తల్లితండ్రి లేని ఆ బిడ్డలకు నీ ఆస్తిపాస్తులు ఏమిచ్చుకున్నా నాకు అభ్యంతరం లేదు,  నేను నా కొడుకును తప్ప మరెవ్వరినీ నా బిడ్డలుగా పెంచలేనని నిర్ద్వందంగా చెప్పింది కరుణ,

చుట్టూ ఉన్న పరిసరాల్ని, పరిమళాల్ని తనలో ఇముడ్చుకుంటూ అందులో ఇమిడి పోతూ ఉండే కరుణ కాకిని  గమనించడం మొదలు పెట్టాక కోకిల పిల్లకు తల్లి అయి కాపాడుకునే తల్లి సహజ ప్రేమకు ఫిదా అవడమే కాక తనలా ఎందుకు ఉండ లేకపోయిందని ప్రశ్నించుకున్న కథ "కోకిల తల్లి' . 

.

సృష్టిలో స్త్రీ , పురుషుడు ఇద్దరూ ఒకరికొకరు అవసరం. ఎవరి ప్రాముఖ్యత వారిదే.  పునరుత్పత్తి ప్రక్రియ అనివార్యం.  వివాహం ద్వారా ఒక  స్త్రీ ఒక పురుషుడు మధ్య బంధం ఏర్పడుతుంది. ఒకే గూట్లో నివాసం మొదలవుతుంది.  నిరంతర సంబంధం ఏర్పడుతుంది. కలిసి జీవించడంలో, కలిసి భావాలూ వినిమయం చేసుకోవడంలో, కలిసి బాధ్యతలు పంచుకోవడంలో, భావోద్వేగాలు తెలుసుకుంటూ మసలుకోవడం ద్వారా ఇద్దరి మధ్య స్నేహబంధం, భార్య భర్తల బంధం దృఢమవుతుంది.

కానీ, ఆధిపత్యాన్ని చెలాయిస్తూ, తన లైంగికతకు ప్రాధాన్యం ఇచ్చి తన పురుషత్వానికి విలువనిచ్చి తనతో జీవితం పంచుకోవడానికి వచ్చిన స్త్రీ జీవితాన్ని అగాధంలోకి తోసేస్తుంటారు చాలామంది పురుషులు.  

నీతి, నైతికత, కట్టుబాట్లు వగైరా వగైరా ల భారం స్త్రీల  భుజస్కంధాలపై వేసి పైలా పచ్చిస్ లా తిరిగేస్తుంటారు  భారతీయ పురుషుడు.  

భారతీయ మహిళ తన అనుకునే భద్రపురుషుడి జీవితం కోసం పూజలు , నోములు , వ్రతాలతో కాలక్షేపం చేస్తుంది. తానొక గొప్ప కుటుంబాన్ని నిర్మించుకుంటున్నాని భ్రమల్లో బతుకుతూ ఉంటుంది.  అతని ప్రేమ తనకే సొంతం కావాలని తాపత్రయపడుతుంది.  అతని క్షేమమే తన క్షేమం అని తలుస్తుంది.  


కోకిల తల్లి లో  కరుణ భర్త శ్రీకర్ సగటు భారతీయ పురుషుడు. ఇంట్లో ఎంత కమ్మని తిండి ఉన్నప్పటికీ బయట రుచుల కోసం వెంపర్లాడుతుంటాడు.  మగవాడిగా అది తన హక్కు అని  భావిస్తాడు.  


ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలని అనిపిస్తున్నది.  ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది, ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే మగవాడెప్పటికీ తప్పుకాదట. 

ఆడవాళ్ళతో తిరిగిన కస్టమర్ ని ప్రాసిక్యూట్ చెయ్యకూడదట .. ఆహ్హాహ్హా ఏమి తీర్పు?! 

ఈ తీర్పులు ఏమి చెబుతున్నట్లు .. స్త్రిని కామ దృష్టితో చూడడం, ఆమెను లైంగికంగా వాడుకోవడం అతని తప్పుకాదు. కానీ అతనికి చేరువైన ఆమెది తప్పట!

స్త్రీ పురుష సంబంధాల్లో ఉన్న డొల్ల తనాన్ని పోగొట్టి సహజమైన , నిర్మలమైన స్నేహ సంబంధాల్ని ఏర్పరచి పెంపొందించాల్సిన స్థానంలో స్త్రీల స్థాయిని మరింత పలచన చేయడం,  దిగజార్చడం కదా..

ఎన్నో పోరాటాలతో ఉద్యమాలతో సాధించుకున్న చట్టాల స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ,  చైతన్యవంతం కావాల్సిన సమాజాన్ని అగాధంలోకి తోసే తీర్పు కదా..!

మగాడు జీవితాంతం తోడు నీడగా ఉంటానని బాస చేసిన భార్యతో కాకుండా ఇతర స్త్రీలతో సంబంధాలు ఏర్పరచుకోవడం తప్పు కాదని, అది తన మగతనానికి చిహ్నమని విర్రవీగే మగవాళ్ళకి కొమ్ములిచ్చి మరింత భద్ర పురుషుడిగా మార్చిన తీర్పు కదా... 


కోకిల తల్లి కథలో కరుణ భర్త శ్రీకర్ కూడా అటువంటి విలాసపురుషుడే.  తన చిత్త ప్రవృత్తి నేరం కాదని భావించే రకం.  పురుషాహంకారం నరనరాల్లో జీర్ణించుకున్న అతను కట్టుకున్న భార్య, కన్నకొడుకు కంటే ఇతర సంబంధాల్లోకి వెళ్లి వాళ్ళకే సమయం , సొమ్ము ఖర్చు చేసే లాలసుడు.  అలాంటి వాళ్లకు కోర్టులు చట్టాలు శిక్షలు వేయరేమో కానీ ఆత్మగౌరవంతో బతికే స్త్రీ అతని పోకడలను క్షమించదు.  


సహజ సునిశిత మనస్కురాలైన కరుణని అతని ప్రవర్తన ఆందోళనకు, ఆవేదనకు గురి చేసింది. 

నీ లాగే నేను ప్రవర్తిస్తే అని ప్రశ్నిస్తుంది.  బుసలు కొట్టే అతను ఆ ఆలోచన భరించలేడు. అదే గనుక జరిగితే ఆమెను ముక్కలు ముక్కలుగా నరికేస్తా అనే అహంభావి. సగటు పురుషుడు. 

అటువంటి వ్యక్తి భార్యగా తన స్థానం నిలబెట్టుకోవడం కోసం, భద్రపరచుకోవడం, సర్దుబాటు చేసుకోవడం కోసం నేలబారుగా ప్రవర్తించి తన ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టలేని కరుణ, భార్యాభర్తల బంధాన్ని లాభనష్టాల కాటాలో చూడని కరుణ లోకం దృష్టిలో మొండిది. లౌక్యం తెలియనిది. మొగుడిని కొంగున కట్టుకోవడం తెలియనిది.    


స్త్రీ పురుష సంబంధాల్లో ఉన్న అసమానతలు, డొల్ల తనాన్ని , ద్వంద నీతిని వేలెత్తి చూపే కథ కోకిల తల్లి. 

పిట్టతో, చెట్టుతో , పువ్వుతో మాట్లాడుకుంటూ వాటిలా విశాలంగా వికసించడానికి ప్రయత్నించే కరుణ  కథ కోకిల తల్లి.  


భక్తి పేరుతొ పూజల పేరుతో ఎదుటివారు పెంచుకున్న మొక్కల పూలను తస్కరించడం, చెప్పా పెట్టకుండా కోసేయ్యడం అదేమని అడిగితే అయ్యో దేవుడి పూలు ఆమాత్రం కోసుకోకూడదా అంటూ ఎదురుదాడి చేస్తుంటారు. కస్టపడి, ఇష్టపడి మొక్కలు పెంచుకున్నవారి మనసు ఎంత బాధపడుతుందో అర్ధం చేసుకోరు.  దేవుడి పేరుమీద నిర్ధాక్షిణ్యంగా  మొక్కనుండి వేరు చేసేసి, తాము పుణ్యం పొందాలని తాపత్రయపడిపోతుంటారు కొందరు. 

కానీ ఈ కథలో కరుణ పక్కింటి తోటలో పూలను యిష్టంగా చూసి చూపులతోనే వాటిని తుంపి కనురెప్పలపై వాటి భారాన్ని నెమ్మదిగా మోస్తూ పదిలంగా తెచ్చి ఆదిదంపతుల పాఠం ముందు ఉంచుతుంది.  

పూవు తుంచకుండా, హాని కలిగించకుండా మనసుతోనే అర్పణ చేయడం రచయిత్రి భావుకత, గొప్ప భావన. 


వివాహేతర బంధంలో పురుషుడికి చేరువైన స్త్రీని అల్పంగా చూసిన హైకోర్టు లాగే కొత్త కొత్త అందాలు వెతుక్కునే తన భర్త శ్రీకర్ తో బంధం కొనసాగించిన స్త్రీని నెరజాణ అనడం పంటికింద రాయిలా అనిపించింది. 


వి. శాంతి ప్రబోధ   





3, అక్టోబర్ 2022, సోమవారం

చిట్టి గుండె - మరువలేని కథ

ఈస్తటిక్ సెన్స్  కథాసంపుటిలో “చిట్టి గుండె” కథ “విశాలాక్షి మాస పత్రిక” జూన్ 2022 లో ప్రచురితమైంది. 

ఆ కథ పై MR అరుణకుమారి గారి వ్యాఖ్యానం పరిచయం చేస్తున్నాను. ధన్యవాదాలు అరుణకుమారి గారూ.. 🙏

14 కథలు 14 మంది సహరచయితల వ్యాఖ్యానం. 

#ఈస్తటిక్_సెన్స్ #వనజతాతినేని

************

 "చిట్టి గుండె"   మరువలేని కథలాగే  నా గట్టి గుండె కూడా మరవలేని ఇదే కథ నేను పనిచేసిన ఒక ఊరిలో జరిగింది.  ఏళ్లు గడిచినా మరపు మడతల్లో నుండి అప్పుడప్పుడు గుల్లలో నుండి బయటకు వచ్చే నత్తలా ఆ జ్ఞాపకం , అబ్బాయి రూపం.. నన్ను కాసేపు కలవరపెడుతుంది.         

వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో ఒప్పుకోలేదు అని అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మాయి మరో పెళ్లి చేసుకుని భర్త ,పిల్లలతో బాగానే ఉంది. నాకు బోల్డంత సందేహం !అమ్మాయి కూడా ప్రేమించింది కదా!  అబ్బాయి ప్రాణం తీసుకునేంత ప్రేమ గాఢత అమ్మాయి ప్రేమలో లేదా? ఉంటే తనూ చనిపోవాలి కదా! ( పాపం శమించుగాక!  ఈ మాట "ప్రేమ"  పైన  ప్రేమే! అబ్బాయి ప్రాణత్యాగం పట్ల బాధ, సానుభూతే)  ప్రేమ ఎంత మధురమో  ప్రియురాలు అంత కఠినం ! పిరికి వాళ్లకు ప్రేమించే అర్హత లేదు అనుకుని గమ్మునుండి పోయాను.       

నా వరకు నేను అన్నింటికన్నా "జీవిత" మే ముఖ్యమైనది ..విలువైనది అనుకుంటాను. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు తీసే అధికారం ఎవరికీ లేదు.      ప్రేమకు ఎన్ని నిర్వచనాలు ఉన్నా సరే ప్రేమంటే రెండు మనసుల మధ్య ఏర్పడే అనుబంధ వారధి! ఆ వారధి అనురాగం, ఆత్మీయత, అవగాహనలతో ఏర్పడవచ్చు. వయసు, వ్యామోహం, ఆకర్షణలతో కూడా ఏర్పడవచ్చు. వన్ సైడ్ ..టూ సైడ్ కూడా ఉండవచ్చు.  అయితే  ఏ ప్రేమ వారధి బలంగా ఉంటుందో మనకు తెలుసు. ఆ బలమైన వారిధి కూడా పరిస్థితుల ప్రభావం వల్ల వివాహ బంధబాట కాలేకపోవచ్చు.ఆమాత్రానికే ప్రాణంతీయడం ,తీసుకోవడం చెయ్యకూడదు.      

అన్ని ప్రేమ పెళ్లిళ్లు సక్సెస్ కానట్లే పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు కూడా విచ్చిన్నం అవుతున్నాయి. లోటుపాట్లు వివాహబంధంలో లేదు. ఆ బంధం లో ఉన్న వ్యక్తుల సర్దుబాటు ,అవగాహనా, అన్యోన్యత లో ఉన్నాయి. అదే ప్రేమంటే ! ఒక వ్యక్తి లోని ప్లస్ పాయింట్ లతోపాటు మైనస్ పాయింట్ లనూ అర్థం చేసుకోవడమే" ప్రేమ"!  ఎందుకంటే ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా సంపూర్ణుడు కాదు. కాలేరు కూడా!    పసి వయసులో మన కుటుంబం, సభ్యులు, పరిసరాలు, బంధుమిత్రులు, సమాజం ,బడి ,గురువులు ...ఎవరైనా ..ఏ సంఘటన అయినా  సరే  మన మనసులను తాకేది గాఢమైన ముద్ర వేస్తుంది అనడంలో లో సందేహం లేదు. అది మనలో ఒక బలమైన నమ్మకాన్ని కలిగిస్తుంది. దానిలో నుండి బయటకు రావడం చాలా కష్టం .అలా రావడానికి మానసిక పరిపక్వత ,మేధో వికాసం చాలా అవసరం. అప్పుడు మన ద్వేషాలు ..ప్రేమగా, సానుభూతిగా, సహానుభూతిగా... రూపాంతరం చెంది అర్థం చేసుకునే దిశగా మార్పు చెందుతాయి.     

ఈ కథలో పద్మ లో కలిగిన మార్పు అభినందనీయం. వివేకం, విచక్షణ ..కొత్త పరిష్కార మార్గం అన్వేషిస్తుంది . అది మార్గనిర్దేశం అవుతుంది.  ఎందుకంటే ఒక కథ చదివి పాఠకులు మారిపోతారా? అది కథే కదా! అనుకుంటే పొరపాటు .ఒక కథ సజీవచిత్రణతో  సాగితే అది తప్పకుండా మన మనసును స్పర్శిస్తుంది. ఏ కథలో నైతే పాఠకులు తమను తాము చూసుకుంటారో.. అదే మంచి కథ .అలాంటి కథలో పరిష్కారాలు ఆశావహ దృక్పథంతో, ధైర్యాన్ని,  ఆత్మవిశ్వాసాన్ని కలిగించేలా ఉండాలి.  " చావు"  ఏ సమస్యకూ పరిష్కారం కాదు అని బలంగా చెప్పాలి.     మమతల పొదరిల్లు.. అనుబంధాల ఆనందాలలో..  బతుకునావ  లాహిరి లాహిరి లాహిరే! బాధల సుడిగుండంలో ఏ చిట్టి గుండె చిక్కువడదు.


         -  యం.ఆర్. అరుణకుమారి,  చిత్తూరు.

చిట్టిగుండె  కథ ఇక్కడ లింక్ లో చదవవచ్చు. 




1, అక్టోబర్ 2022, శనివారం

రెక్కలు - ఊహలు

 రెక్కలు - ఊహలు 

తుమ్మెదలు సీతాకోకచిలుకలు వొకరినొకరు
పరామర్శించుకున్నాయి 

ఎవరి అన్వేషణ వారిది ఎవరి ఆస్వాదన వారిది

కలహించుకోకూడదని తోట చెప్పిన మాట తలకెక్కించు కున్నట్టున్నాయి. 

*********

శుభ్రమైన నీలాకాశంలో 

దిష్టిచుక్కలా సోమరి మేఘం

సూర్యుడికి దిష్టిచుక్క కాబోలు

************

గాలి ఈలలు వేస్తుంది

ఒకటే రొద. దానికి

వెదురుపొదల జాడ దొరికితే బాగుండు 

రవళుల తుఫాన్ మది తీరం దాటుతుంది.

*********

ప్రేమించడం అంటే …

కాఠిన్యం నిండిన మనసును 

పూల మృదుత్వంతో మార్పిడి చేసుకోవడం

దయను అంటు కట్టుకోవడం

ఉన్ననాళ్ళన్నీ నీ ఉనికిని  బేషరతుగా సమర్పించడం.