13, మార్చి 2023, సోమవారం

వాతాపి జీర్ణం

వాతాపి జీర్ణం -వనజ తాతినేని


డి విటమిన్ కోసం ఎండలో కూర్చుని ముఖంపై పేపర్ కప్పుకున్నాను. యు యెమ్ కొద్దిగా కుంటుకుంటూ చిన్న బౌల్ లో నీరు తీసుకొచ్చి విండో సిల్ లో అమర్చిన కుండీలో  పీస్ లిల్లీ మొక్కకు పోసింది. యు యెమ్ అంటే ఉదయమిత్ర. నా భార్య.రిటైర్ కావడానికి ఇంకో ఆరేళ్ళు పడుతుంది.  మోకాలు నొప్పి బాగా ఇబ్బంది పెడుతుందనుకుంటా కుంటుతుంది తప్ప పనిమనిషిని గేటు దాటి లోపలికి రానివ్వదు. రోజూ రాత్రిపూట బాదాం గింజలను ఆ బౌల్ లో నానపెడుతుంది. ఉదయాన్నే ఆ నీరు తెచ్చి జాగ్రత్తగా ఆ మొక్కకే పోస్తుంది. మా గార్డెన్ ఇండోర్ గార్డెన్ లో వున్న మొక్కలు చెట్లు అన్నింటిలోనూ ఆమెకు బాగా యిష్టమైన మొక్క కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటుంది అనుకుంటాను. 


పైసా ఖర్చు లేకుండా స్నేహితులు బంధువుల ఇళ్ళ దగ్గర అడిగి తెచ్చిన కొమ్మలను జాగ్రత్తగా నీరు నింపిన గాజు సీసాలో పెడుతుంది. వేళ్ళు వచ్చాక మట్టిలో పెట్టి తక్కువ మోతాదులో ఎండను అలవాటు చేసి నర్సరీలో మొక్కలను అభివృద్ధి చేసినట్టు చేస్తుంది తప్ప ఒక మొక్క కూడా కొనదు. దుబారా చేయదు. ఇతరులు చేస్తే అసలు ఊరుకోదు.  ఆమెతో కలిసి సూపర్ మార్కెట్కు వెళితే ఖరీదైన జీడిపప్పు తీయబోతుంటే వద్దు వేరుశెనగ గుళ్ళు చాలు అంటుంది. పంటి కిందకి రుచి కోసం ఎపుడో ఒకప్పుడు తప్ప రోజూ జీడిపప్పు తింటామా! తక్కువ ఖరీదులో దానికన్నా మంచి ఆహారం వేరుశనగ గుళ్ళు. అవి నానబెట్టి తింటే సరి అని తీసేస్తుంది. నా యిష్టాలను నా మాటను పూచికపుల్లను తీసిపారేసినట్టు తీసిపారేస్తే  ద్వేషం రాకుండా వుంటుందా మీరే చెప్పండి!?. 


పోనీ ఆమె ఏమైనా పొదుపు చేస్తుందా అంటే అదీ లేదు. తిరుపతి వెళితే ధర్మదర్శనంలో దైవదర్శనం చేసుకుని అన్నదానానికి విరాళం రాసిచ్చి వస్తుంది. జీడిపప్పు వద్దని అక్షయపాత్రకు విరాళం పంపుతుంది. ఎడ్డెమంటే తెడ్డెం తప్ప ఎప్పుడూ నాకు అనుగుణంగా నడిచింది లేదు. మూడుగదుల రైలు పెట్టల ఇల్లును అమ్మేయించి  కిందా పైనా మూడు బెడ్ రూమ్ ల ఇల్లు అమర్చింది. పెళపెళలాడే గంజి చీరలు తప్ప పట్టు చీరలు కట్టదు ఆడంబరాలకు పోదు నగలు పెట్టదు. బారెడు జడను మొక్కు రూపంలో సమర్పించినాక పాతికేళ్ళుగా మళ్ళీ జడ పెంచినదే లేదు. నువ్వు  జడలో బాగుంటావ్ అంటే ఆహా అన్నట్టు తలపంకించుతుంది కానీ జుట్టును మెడ దిగి పెరగనీయదు.  అప్పుడెపుడో నాకిష్టమైన పచ్చరంగు చీర కొని తెచ్చిచ్చి కట్టుకోమంటే తెల్లారిందో లోదో ఆ చీరను  పనిమనిషికి ఇచ్చేసింది. ఇలాంటి జగమొండిని నాకెందుకు కట్టబెట్టావే అని అమ్మమీద అరుస్తుంటే ఆమెను ఏమీ అనకండి అనేది. అత్తాకోడళ్ళు అమ్మ కూతురులా వుండేవారు. నేనే కొత్త అల్లుడిలా పడకగదికి బజారుకు ఆఫీసుకు మధ్య గిరగిర తిరుగుతుండేవాడిని. 


పిల్లలు పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయాకైనా ముద్దుముచ్చట సరదా సంతోషం లేదు. ఇంటిపని ఉద్యోగం ట్యూషన్లు మొక్కలు పెంచడం పుస్తకాలు చదవడం ఇదే పని. నేను రిటైర్ అయ్యిఅవ్వగానే చుట్టూరా కోవిడ్ ముంచుకొచ్చి  బయటకు కదలకుండా కాళ్ళకు సంకెళ్ళు వేసింది.నేను  వందమాటలు మాట్టాడితే ఒకటిరెండు మాటలలో సమాధానం చెప్పేసి మౌనం పాటిస్తుంది. లేదా తగిన పని చేసి చూపిస్తుంది.ఎదుటి మనిషికి తిక్క వస్తుందా లేదా మీరే చెప్పండి.మీ నాన్నకు ఏమీ తోచుబడి కావడం లేదంట. మీరు తీసుకెళ్ళండి కాస్త గాలి మార్పు వుంటుంది అంది కూతురితో. ట్రావెల్ బేన్ అయిపోనీ, టికెట్స్ బుక్ చేస్తాను ఇద్దరూ వద్దురుగాని అంది కూతురు.” నాకెక్కడ సెలవు పెట్టటం కుదురుతుంది అస్సలు కుదరదు” అనేసింది. 


ఒకరోజు ఫీస్ లిల్లీ మొక్కను కుండీ నుండి తీసి చిన్న చిన్న పిలకలను విడదీసి నాలుగైదు కుండీలలోకి  నాటింది. ఏమైనా పిచ్చా నీకు ఏం చేస్తావు వాటిని అన్నాను.మాట్లాడలేదు మౌనంగా చూసిందంతే! ఒక నెల రోజుల తర్వాత ఒక్కొక్కటి తీసి తన స్నేహితులకు కానుకగా యిచ్చింది. ఈ పీస్ లిల్లీ నా స్నేహితురాలు అరుణ నాకు కానుకగా యిచ్చింది. అందుకే నాకు యీ మొక్కంటే యిష్టం. దానిని జాగ్రత్తగా పెంచి ప్రవర్ధమానం చేసాను. మనమందరం ఇలాగే స్నేహాన్ని ప్రవర్ధమానం చేసుకోవాలి అంది. ఏంటో యు యెమ్ గురించి నేనెప్పుడు తక్కువగా అంచనా వేస్తుంటాను. నా ఆలోచన తప్పని ఆమె విభిన్నమైన ప్రవర్తనతో నాకు షాక్ లు యిస్తూ వుండటం పరిపాటి.

*********

కాలింగ్ బెల్ మోగుతూనే వుంది.. మూడవసారి మోగేదాక నాకేం పట్టనట్టు కూర్చున్నా బద్దకంగా. నాలుగవసారి ఐదవసారి మోగేటప్పటికి కొద్దిగా జంకు. టివి రిమోట్ చేతిలో పెట్టుకునే  కాళ్ళు పైకి మడిచి సోఫాలో అడ్డంగా పడుకున్నా. మేడమెట్లు దిగుతున్న చప్పుడు తర్వాత గుమ్మం పక్కనే వున్న బోర్డ్ లో స్విచ్ వేసిన శబ్దాన్ని ఆనుకునే కిటికీకి అమర్చిన దోమతెరలనుండి లోపలికి ప్రవహించిన కాంతి. వచ్చినవారిని వెంటబెట్టుకుని లోపలికి వచ్చిన యు యెమ్. 


నిద్రబోతున్నారు కాబోలు అందుకే కాలింగ్ బెల్ మోత వినబడినట్లు లేదు అంటూ.. హాల్లో ట్యూబ్ లైట్ వేసింది. కళ్ళకు చేయి అడ్డుపెట్టుకుంటూ నిద్రాభంగం అయినట్టు నటిస్తూ లేచి కూర్చున్నాను. వచ్చింది నా మేనల్లుడు. అప్పుడే నిద్ర పోయావే మామయ్యా! భోజనం అయిందా? అంటూ పక్కన కూర్చున్నాడు. యు యెమ్ అతిధి మర్యాదలు చేస్తుంది. ముందు పండ్లముక్కలు తర్వాత కాఫీ యిచ్చింది. మధ్య మధ్యలో నా వైపు చూస్తూ మీ వేషాలు నాకు తెలుసులే అన్నట్టు చూసింది.

నా మేనల్లుడు నా కూతురుకు ఫంక్షన్ చేస్తున్నాను ఇద్దరూ తప్పకుండా రావాలని ఆహ్వానించాడు. “రాకుండా ఎలా వుంటాము మాకు మాత్రం మీకన్నా ఆప్తులెవరున్నారు” అంది. 


“తనకు ఈవినింగ్ క్లాస్ లు లేకపోతే ఒకరోజు ముందే వచ్చేవాళ్ళం. వీలవదు గనుక ఉదయాన్నే వచ్చేస్తాము లే” అన్నాను. యు యెమ్ నావైపు తీక్షణంగా చూసి.. నేను క్లాస్ మధ్యలో వచ్చాను. నువ్వు మామయ్య మాట్లాడుకుంటూ వుండండి. నేను వచ్చాక భోజనం చేసి వెళుదువుగాని అని చెప్పి పైకి వెళ్ళడానికి లేచింది. నేనూ వెళ్ళాలత్తయ్యా పనులున్నాయి అని మేనల్లుడు లేచాడు. అతన్ని గేటు దాకా సాగనంపి లోపలకు వచ్చి లైట్ ఆఫ్ చేసి ఇరవై నిమిషాలు ఆలస్యంగా వస్తాను అని గోడకు చెప్పినట్టు చెప్పి మేడ పైకి వెళ్ళింది. 


 పాతికేళ్ళ పైగా టీచరుగా పని చేస్తున్న ఆమె తరగతి పిల్లలతో ఇంట్లో వాళ్ళకు లాగా ఇంట్లోవాళ్ళతో టీచరు లాగా వుంటుంది. ఆమె చూపే ఒక బెత్తం. అరచేతులు నలుపుకుంటూ సంజాయిషీలు చెప్పుకుంటూ వుండటమే కానీ ఎదురుమాటాడే ధైర్యం వుండేదికాదు అత్తగారితో సహా. కాలిక్యులేటెడ్ మైండ్. పిల్లలు పుట్టిన తర్వాత కచ్చితంగా చెప్పింది. ఇంతకుముందంతా మీ జీతంలో ఎక్కువ భాగం మీ సరదాలకు ఖర్చు పెట్టుకున్నా ఏమీ మాట్లాడలేదు. ఇకనుండి మీ జీతంలో మూడొంతులు ఇంట్లో ఇవ్వాల్సిందే. నేను మూడొంతులు ఇస్తాను. ప్రతినెలా ఇంటి ఖర్చులకు పోనూ మిగతావి పొదుపు చేయాలని తీర్మానం చేసింది. నేను ఆర్ అండ్ బి  లో ఇంజినీర్ గా పనిచేసేవాడిని.  మూడొంతులు జీతం ఇంటికి ఇచ్చేసి పావంతు నా సరదాలకు షికారులకు వాడుకునే వాడ్ని. ఇక తను ప్రతి పైసాకి ఖర్చు వివరం రాసేది. పిల్లలు ఎలా పెరిగారో చదువులు ఎలా ప్లాన్ చేసిందో తన తల్లి ఎలా దాటిపోయిందో ఇవేమి పట్టలేదు అనేకంటే పట్టించుకోలేదు కూడా నేను. తల్లి అంటూ వుండేది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లైనా కరతాళాలైనా మ్రోగేది. ఏ చేయి కలవకపోయినా తాళం కుదరదు అని. కానీ నా తాళం కలవకపోయినా మా సంసారగీతం అపశృతి లేకుండానే సాగింది.


అమ్మాయి బాగా చదువుకుంది. అమెరికా వెళ్ళిన క్లాస్మేట్ ను పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయింది. కూతురి వాటాకు రెండు ప్లాట్ లు పావు కేజీ బంగారం నాలుగులక్షలు డబ్బులు ఇచ్చింది. కొడుకుకు అంతే ఇస్తానని అప్పుడే చెప్పేసింది. కొడుకు ఇంటర్ కేస్ట్ మేరేజ్ చేసుకుంటానంటే అలాగే అంది. నా చెల్లెలు కూతురుని యిచ్చి చేద్దామనుకున్నాను. నువ్వు అలా యెలా వొప్పుకుంటావ్, నా వాళ్ళంటే నీకసలు గిట్టదు అని గట్టిగా అరిచాను. యు యెమ్ మౌనంగా మరో గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది.కొడుకు ఎంతో బతిమాలాడు తలుపు తియ్యమ్మా అని.  తలుపు తీసి ఈ రోజు శనివారం. నేను ఉపవాసం. మీరిద్దరూ  అనవసరమైన గొడవ చేయకుండా భోజనం చేసి పడుకోండి. నేను ప్రశాంతంగా పేపర్లు దిద్దుకోవాలి అని ఠక్కున తలుపేసుకుంది. 


తెల్లవారి కాఫీ తాగే సమయానికి మేనకోడలు రమ్య వచ్చి “మామయ్యా నేను బావను పెళ్ళి చేసుకోను. నేను ఆస్ట్రేలియాలో వున్న కుర్రాడిని ప్రేమించాను ఆరునెలల క్రితమే అత్తయ్య బావను చేసుకోమని అడిగినపుడే చెప్పేసాను. మా అమ్మ నువ్వు అనుకుంటే సరిపోతుందా, నేను బావ కూడా అనుకోవాలి కదా! అత్తయ్యను ఏమీ అనకు. నా పెళ్ళి మీ ఇద్దరి చేతుల మీదుగా జరగాలి. ఖర్చు కూడా మీరే పెట్టుకుంటారని అత్తయ్య అమ్మకు చెప్పిందంట” అంది.  అయినవాళ్ళ దగ్గర కాని వాళ్ళ దగ్గర అన్ని క్రెడిట్స్ యు యెమ్ కే దక్కుతుంటే నాకేమి మిగులుతుంది బూడిద. ఆ మాట కూడా పైకి అనలేను లోలోపల కుక్కుకోవాల్సిందే. యు యెమ్ అంటే ఉక్కుమహిళ అని కూడా అనుకోవాలేమో!


గతమంతా నెమరువేసుకుంటున్నా వర్తమానంలోకి తెచ్చిపడేసింది ఆకలి. గడియారం వైపు చూస్తూ కూర్చున్నాను ఇరవై నిమిషాలు యెపుడు గడుస్తాయా అని. నిజానికి నేనే పెట్టుకుని తినేయొచ్చు.  ఎలక్ట్రిక్  కుక్కర్  లో అన్నం తయారుగానే వుంది. కానీ బద్దకం.పైగా గిన్నెలమీద మూత పెట్టలేదే, ఆవకాయ యెందుకు వేసుకున్నారు అనే చూపులను యెదుర్కోవాలి. అదీగాకుండా భోజనానికి ముందు టాబ్లెట్ వేసుకోవాలి. అది ఏ టాబ్లెటో యేమో నాకేమి తెలుసు గనుక. ఆమె వేళ ప్రకారం చేతిలో పెట్టి నీళ్ళ గ్లాసు చేతికిస్తే వేసుకోవడమే. డాక్టర్ చెబుతూనే వున్నాడు చిన్నచిన్న వ్యాయామాలు వాకింగ్ చేస్తూ వుండమని. బద్దకంగా బాల్కనీ గార్డెన్ లో కేన్ ఉయ్యాలలో కూర్చుని రెండు మూడు న్యూస్ పేపర్స్ ను తిరగేసి మడిచేసి చదవడం సోఫాలో కాళ్ళు ఆరజూపుకుని  నిలకడలేని మనసుతో క్షణానికో చానల్ మార్చడం తప్ప. 


హాల్లో లైట్ వెలిగింది. యు యెమ్ చేతులు శుభ్రం చేసుకుని వచ్చి టాబ్లెట్ అందించింది. గేటు ముందు వరకూ వెళ్ళి ఆడపిల్లలను వాళ్ళ వాళ్ళకు భద్రంగా అప్పజెప్పి  గేట్ కు తాళం వేసి వచ్చింది. అంతా తమ కాలనీలో పిల్లలే. కోవిడ్ మూలంగా ఆన్లైన్ క్లాస్ లు చదువులో వెనుకబడిన పిల్లలకు మ్యాథ్స్ చెప్పమని పేరెంట్స్ వచ్చి రిక్వెస్ట్ చేస్తే సరేనంది. ఆ రోజు పేరెంట్స్ వెళ్ళాక గొడవపడ్డాను. “వారందరినీ పోగేసి నన్ను కోవిడ్ పాల్జేయాలని కదా పిల్లమందను ఇంటికి రప్పిస్తున్నావు” అని. “జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్నాళ్ళు ఇలా కూర్చుంటాం బాధ్యత లేకుండా” అంది


పిల్లలకు మేథ్స్ క్లాసులు మొదలు పెట్టకముందే నాకు కోవిడ్ అంటుకు కూర్చుంది. కార్పోరేట్ హాస్ఫిటల్ లో జాయిన్ చేయమని నేను, అంత ఎక్కువ లేదు తగ్గిపోతుందని ఆమె. “రాక్షసీ! నేను చస్తే  నా డబ్బుతో హాయిగా జల్సా చేయాలని కదూ అని తిట్టిపోసాను. గదిలోకి వెళ్ళి తలుపేసుకుని కూర్చుంది. నాతో మాట్లాడటం పూర్తిగా మానేసింది. కొడుకు కూతురు నుండి ఫోన్ల వరద. నా మీద ప్రేమో లేదా జాలి ఏదో వొకటి చూపకుండా తల్లిని వెనకేసుకొచ్చి నాన్నా! నీకు సేవలు చేస్తే అమ్మకు కూడా అంటుకోవచ్చుగా. అయినా ఆమె హాస్పిటల్ లో జాయిన్ చేయను అందంటే నువ్వు అర్దం చేసుకోవాలి. కార్పొరేట్ హాస్పిటల్ లో బెడ్ లు దొరకడం లేదు. దొరికినా లక్షల బిల్ వేసి పిండుకున్నంత పిండుకున్నాక పోతే శవాన్ని కూడా ఇవ్వడం లేదంట. రోజూ యెన్ని వింటున్నాం అని అన్నాడు కొడుకు. భయమేసి హాస్పిటల్ వద్దన్నాను. అల్లుడు స్నేహితుడు ఫోన్ లోనే ట్రీట్మెంట్ ప్రారంభించాడు. ఆమె శిష్యులు మందులు పండ్లు అన్నీ గుమ్మం ముందుకు చేర్చారు.  


నాకు కోవిడ్ తగ్గి ఆమెకు మొదలైంది. మాములుగా పనులు చేసుకుంటూ మందులు మింగుతూ పుస్తకాలు చదువుకుంటూ సంగీతం వినుకుంటూ దాటేసింది.  ఇపుడు మేడమీద క్లాసులు మొదలుపెట్టింది అదీ ఉచితంగానే. అందరికి ఉదారమే నాకు తప్ప. డాక్టర్ గట్టిగా చెప్పేసాడు.. మూడు నెలలవరకూ ఆల్కహాల్ ముట్టకూడదని. డబ్బు అందకుండా కార్డులు కనబడకుండా దాచేసింది రాక్షసి. ఎంత తిట్టినా ఎదురు మాట్లాడదు. ఆ అలక గృహంలోకి వెళ్ళి అన్నమయ్య గీతాలు భావగీతాలు వింటూ వినిపిస్తూ కూర్చుంటుంది. లేకపోతే పుస్తకంలో తలపెట్టుకుని కూర్చుంటుంది. తిండి సమయానికి టీ సమయానికి నేను తలుపులకు చూపునతికిచ్చి నిరీక్షించడమే. అప్పుడుకూడా కాలాతీతం -కానివ్వదు. ఏ వొంక పెట్టడానికి నాకసలు అవకాశమివ్వదు దొరకనివ్వదు యు యెమ్. 


***********


మేనల్లుడు కూతురుకి చిన్న గొలుసు కొందాము గోల్డ్ షాపుకు వెళదాం బయలుదేరండి అని చిన్న స్లిప్ పెట్టింది మధ్యాహ్నం టీ కప్పుతో పాటు. నా మనసులోను అదే కోరిక. ఎలా తెలుస్తుందో ఏమో! 

బట్టలు వేసుకుని రెడీ అయ్యాక “ఎలా వెళ్ళడం నేను కారు నడపలేను” అన్నాను. జవాబుగా ఫోన్ తీసి” ఓలా కార్ ..యేనా? వీధి చివరన వాటర్ టాంక్ పక్కన ఇల్లు.రెడీగానే వున్నాము వచ్చేయండి” అంది. 


నేను బయటకు వచ్చి నిలబడితే తలుపులు తాళాలు వేసి గేటు తాళం వేసి పక్కన వచ్చి నిలబడింది. కట్టుదిట్టమైన మాస్క్ ఫేస్ మాస్క్ గ్లౌవ్స్ ధరించి నావైపు చూసింది ఫేస్ మాస్క్ ధరించమని.  విననట్టు ఊరుకున్నాను. ముఖం చిట్లించి కార్ డోర్ తెరిచి ఎక్కమన్నట్టు చూసింది. ఎక్కిన తర్వాత డోర్ వేసాక తిరిగొచ్చి మరొకవైపునుండి కారెక్కి శానిటైజర్ తో చేతులు తుడుచుకుంది.బేగ్ లో నుండి నవల తీసి ముఖం అందులో పెట్టింది. అరగంట సేపు నోరు మెదపకుండా కూర్చోలేక డ్రైవర్ తో సంభాషణ చేసాను అతను చెప్పేది నాకు సగం వినబడక పోయినా సరే.


షాపు లోకి వెళ్ళాక ఆమెకు పలకరింపులు నాకు జాగ్రత్తలు ఫేస్ మాస్క్ పెట్టుకోండి గ్లౌస్ వేసుకోండి అని. తన బేగ్ లో నుండి  హియరింగ్ మిషన్ తీసి యిచ్చింది. ఢ్రైవర్ తో సంభాషణ విన్నట్టువుంది. ఎంత సుతిమెత్తగా అవమానపరుస్తుందో! నాకు ఒక రోజు రాకపోతుందా? మాస్క్ మాటున పళ్ళు పటపట కొరికాను. ఆమెకు నచ్చిన గొలుసులు రెండు పెట్టి సెలక్ట్ చేయమని నా వైపు చూసింది. ఆమెకు నచ్చిన వాటిల్లో నుండి నేను సెలక్ట్ చేయడం ఏమిటి? ఇంత పెద్ద షాపులో నాకు నచ్చినవి వుండవా అనుకుంటూ ఆమె చూసినవి పక్కకు నెట్టి మరికొన్ని తెమ్మన్నాను. యు యెమ్ చూస్తూ కూర్చుంది. 


ఆమె శిష్యురాలంట. వచ్చి ఆమెను విష్ చేసింది. మీ ఇరువురికి కోవిడ్ వచ్చిందంటగా. హాస్పిటల్క్  రావాల్సింది మేడమ్. ఇంటి దగ్గరే వుండి ట్రీట్ మెంట్  తీసుకున్నారటగా, ఇపుడెలా వున్నారు అని  పలకరింపులు క్షేమసమాచారాలు కానిచ్చింది. సిటీ లో మూడు నక్షత్రాల హాస్పిటల్ చైర్మన్ భార్య అంట. డైమండ్ నగలు కొనుక్కోవాలని వచ్చి షాపంతా తిరగతోడింది.  ఆ డిజైన్ యిలా వుంటే బాగుండేది ఈ నెక్లెస్ లో డైమండ్స్ మరీ చిన్నవి వున్నాయి ఈ హాంగింగ్స్ సూటవలేదు అని రన్నింగ్ కామెంటరీ చేస్తూనే ఉంది. ఆమె మాటలు వింటూ సేల్స్ మెన్ లు వచ్చిన పెద్ద కొనుగోలుదారిణిని వొదులుకోలేక యెస్ మేడమ్ అని తలలు ఊపుతున్నారు.. నేను ఏది సెలక్ట్ చేయాలో తెలియని అయోమయంలో వున్నాను. 


ఇంతలో ఇంకో కౌంటర్లో కొంచెం సందడి. కొన్న బిల్ వుందా మీ దగ్గర. వుంటే చూపించండి గట్టిగా అడుగుతున్నాడు సేల్స్ మేనేజర్. యు యెమ్ కూడా తలతిప్పి అటు చూసి వెంటనే లేచి వెళ్ళింది. ఆఫీస్ జీప్ డ్రైవరు శివరాం భార్య ఉమ. మా పిల్లలు చిన్నపిల్లలుగా వున్నప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకూ పిల్లలను చూసుకోవడానికి ఇంట్లో అమ్మకు తోడుండేది. నమ్మకమైన మంచి మనిషి.  జీతం కూడా దండిగానే యిచ్చేది ఈమె. పిల్లలు స్కూల్ కి వెళ్ళే కాలానికి ఇక అవసరం లేదని షడన్ గా ఉమను మాన్పించింది.  ఈమె వెళ్ళి ఉమను పలకరించింది.”మా అబ్బాయికి కోవిడ్ వచ్చిందమ్మా, హాస్పిటల్ లో జాయిన్ చేసాము. అసలే గుండెజబ్బు మనిషి. అదేదో కాక్ టెయిల్ ట్రీట్మెంట్ అంట. ఒక్కో ఇంజెక్షన్ ఎనభై వేలంటున్నారు. డబ్బులు లేక పుస్తెలతాడు అమ్మాలని వచ్చాను.సంవత్సరం క్రితం ఇక్కడే కొన్నాను” అంది. ఇదిగోండి  అని బిల్ కూడా తీసి చూపించింది. “నువ్వు ఐదు నిమిషాలు మాట్లాడకుండా వుండు. నీ సమస్య చూడటానికి నేనున్నాను కదా” అంటూ ఆ బిల్ ని పరీక్షగా చూసింది. ఆమె భృకుటి ముడిపడింది. బిల్ లో పేరు గానీ చూసిందా ఏమిటని నేను గతుక్కుమన్నాను.


తరువాత..తన శిష్యురాలి దగ్గరకు ఉమను తీసుకెళ్ళి చూపించి ఏదో మాట్లాడింది. శిష్యురాలు వెంటనే ఫోన్ తీసి రెండు మూడు నంబర్లుకు ఫోన్ చేసి మాట్లాడి.. ఈమె కొడుక్కి మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. బిల్ కూడా మినిమమ్ బిల్ వచ్చేలా చేస్తాను. మీకావాల్సిన మనిషి అన్నాక శ్రద్ద తీసుకోకుండా యెలా వుంటాను మేడమ్. కంగారుపడకండి. హి విల్ బి ఆల్ రైట్ అన్నారు. మా డాక్టర్ టేక్ కేర్ చేస్తారు అని హామీ యిచ్చింది. నా మనసులో అలజడి.ఒళ్ళంతా చెమటలు. సూర్యానికి నయమవుతుందా, మళ్ళీ చూస్తానా అతనిని.  


యు యెమ్ ఉమను పుస్తెలతాడు అమ్మవద్దని వారించి తిరిగి ఆమె మెడలో వేయించింది. బేగ్ లో నుంచి లక్ష రూపాయల నగదు తీసిచ్చి హాస్పిటల్ ఖర్చులకు వాడమని చెప్పింది. కన్నీళ్ళతో దణ్ణం పెట్టి ఉమ బయటకు వెళ్ళాక నేను కూర్చున్న కౌంటర్ కి వచ్చి నా వైపు చూసింది యింకా సెలక్షన్ అవలేదా అన్నట్టు.  నేను గబాల్న పక్కకు పెట్టిన రెండు చెయిన్ లలో నుండి ఒక చెయిన్ తీసి సేల్స్ మేన్ కి యిస్తూ “ చేతికి ఎముక లేదు అనిపించుకోవాలని బాగానే దానాలు సాయాలు చేస్తావు. ఇపుడు క్రెడిట్ కార్డ్ వాడాల్సిందేగా” అన్నాను. ఆమె బిల్ వచ్చాక  తీసుకుని చూసింది. క్రెడిట్ కార్డ్ ఇవ్వకుండా చేతికి వున్న గాజులు రెండూ తీసి ఎక్చేంజ్ బిల్ రెడీ చేయమని చెప్పింది. ఆమె ఇచ్చిన గాజుల్లో ఒకదానికే చెయిన్ ధర వచ్చిందని మరొక గాజు ఆమె చేతికిచ్చాడు సేల్స్ మెన్. ఈ గాజులు మా పుట్టింటి వాళ్ళు పెళ్ళిలో చేతికి తొడిగినవి. పాత బంగారం మేలిమి ఎక్కువ అని రసీదు పుచ్చుకుని డెలివరీ కౌంటర్ కు వెళ్ళింది. అక్కడ నుండి ఓలా కారు బుక్ చేసినట్టుంది. పదినిమిషాల తర్వాత బయటకువెళుతూ నా వైపు చూసింది. నేను మెల్లగా లేచి బయటకు వచ్చి కారు యెక్కి కూర్చున్నాను.ఆమె యధాప్రకారం  నవలలో తలదూర్చింది. హియరింగ్ మిషన్ చెవులకు తగిలించి వున్నా  డ్రైవర్ తో మాట్లాడలేదు ఈసారి. 


ఇంట్లోకి రాగానే కాఫీ కలిపి టేబుల్ పై పెట్టి ఎలక్ట్రిక్ కుక్కర్ స్విచ్ ఆన్ చేసి క్లాసు చెప్పడానికి మేడ మీదకు వెళ్ళింది. కాఫీ కప్పు తీసుకుంటుంటే దాని కింద నాలుగు మడతలు పెట్టిన చీటి. తెరచి చూసాను. 


“రక్త సంబంధానికి ఆపద కల్గితే సహాయం చేయడానికి ముందూ వెనుకా చూడం. మీ పీఎఫ్ డబ్బులలో నాలుగు లక్షలు తగ్గించి చెబితే ఏం చేసారు ఎవరికిచ్చారు అని నేను ఆరా తీసానా?. సూర్యం కు ఇచ్చారని అతను ఆ డబ్బుతో కిరణాషాపు పెట్టుకున్నాడని తెలుసు. సూర్యం మీ కొడుకు అని నాకు ఎపుడో తెలుసు. కచ్చితంగా చెప్పాలంటే పాతికేళ్ళ క్రితమే తెలుసు. దిగులుపడకుండా కాఫీ తాగి వాకింగ్ కు వెళ్ళండి. సూర్యం బాగానే వుంటాడు. మీరూ బాగానే వుంటారు. మీ లక్షలు భద్రంగానే వుంటాయి. జల్సా చేయడానికి నా జీతం డబ్బులు నా పియెఫ్ లు  చాలు నాకు.”

  

 చదివిన ప్రతి అక్షరం నాకు చెళ్ళుమని కొరడాతో కొట్టినట్లు అనిపించి చేతిలో కప్పు జారి భళ్ళున శబ్దం చేస్తూ కిందపడి తిరిగి వేడి వేడి కాఫీని ముఖంపై చిందించింది. కాసేపటికి తేరుకుని ముఖం కడుక్కోవడానికి సింక్ దగ్గరకు వెళితే అద్దంలో ప్రతిబింబం చెప్పు తీసుకుని ఎడాపెడా చెంపలు వాయించినట్లు అనిపించింది. అప్రయత్నంగా చెంపలు తడుముకున్నాను. ఉమతో  తనకు వున్న ప్రణయ రహస్యాన్ని  తెలుసుకుని ఏ మాత్రం బయటపడకుండా గుప్పిట మూసి దశాబ్దాలు నెట్టేయగలవచ్చని, అవమానం ఇంత మెత్తగా పదునుగా చేయవచ్చు అని ఈ రాక్షసికి తెలిసినట్టు ప్రపంచంలో మరెవరికి తెలియదేమో!  సిగ్గులేని ఈ ముఖాన్ని ఆమెకెలా చూపను?  భూమి బద్దలై అక్కడికక్కడ కూరుకుపోతే బాగుండును అనిపిస్తుంది. దిండులోకి ముఖం కూర్చుకుని పడుకున్నాన్నమాటేకానీ మూలనున్న అహం బయటకొచ్చింది. మగవాడన్నాక ఏవో కొన్ని సరదాలుంటాయ్.అవి తీర్చుకున్నాను ఆమెకు కుటుంబానికి ఏమన్యాయం చేసాను? మూడొంతులు జీతం ధారపోసేను కదా! ఇంకా ఆమె అడుగులకు మడుగులెత్తాలా? సమర్ధించుకొన్నాను. ఈ లోపలి మాటలు బయటకొస్తే పెద్ద గొడవలేం జరగవు కానీ ఆమె చూసే చూపునే భరించలేను.అంతా ఏకతాళమ్. మరింత గిల్ట్ లో కూరుకుపోకుండా నన్ను రక్షించడానికి  కొడుకు నుంచి ఫోన్ కాల్.  నాన్నా! బట్టలు సర్దుకుని రెడీగా వుండండి. నా వెంట హైదరాబాద్ వద్దురుగాని అని.లేచి గబగబ బట్టలు మందులు అన్నీ సర్దేశాను. వీలైతే హైదరాబాద్ నుండి కూతురు దగ్గరకు వెళ్లడానికి వీలుగా ఫాస్పోర్ట్ కూడా పెట్టుకున్నాను. ఆమె  క్లాస్ ముగించి రాకముందే కొడుకు వస్తే బాగుండుననే అత్యాశతో గేటు వైపు చూస్తూ అనుకున్నాను ఇంతకూ ఈ జీవితకాల అవమానం ఆమెకా నాకా!? 


కొడుకు వస్తున్న జాడలేదు. గేటు నుండి పిల్లలందరూ ఉత్సాహంగా బయటకు వెళ్ళారు. యు ఎమ్ చప్పుడు లేకుండా లోపలికి వచ్చింది. 

చేతులు కడుక్కొని వచ్చి టాబ్లెట్ నీళ్ళ గ్లాసు చేతికి అందించింది.

తలొంచుకుని అందుకుంటూ “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అనుకున్నాను. 


****************౦*********************


#ఈస్తటిక్ _సెన్స్ కథాసంపుటిలో స్వీయ ప్రచురణ.
కామెంట్‌లు లేవు: