5, డిసెంబర్ 2025, శుక్రవారం

Poetry farming 2

టక్ టక్ టక్ టక్ టక్.. 

ఎవరో తలుపు తట్టారు. 

నా ఇంటికి రావాల్సిన 

అతిథులు ఎవరూ లేరు.

దానితో నాకు పని లేదు. 

ఒక్క నేను. నా లోపల అనేకులు. 

                     

Knock knock knock knock.. 

Someone knocked on the door. 

I have no guests coming to my house. 

I don't care. 

Only me. Many inside me.


टुक टुक टुक टुक टुक टुक

किसी ने दरवाज़ा खटखटाया।

मेरे घर कोई मेहमान नहीं आ रहा है।

मुझे इसकी परवाह नहीं।

 सिर्फ़ मैं। मेरे अंदर कई।


*******************


వంతెనలు కూలిపోయాక  వొడ్డులు వొంటరివి.

అనుబంధాలు నెత్తురోడుతూ ప్రవాహంలో కొట్టుకుపోతాయి. 

కరుణించి దరి చేర్చుకునే దైవం సముద్రం. 

కాగితపు పడవులకు తీరాలుంటాయా?

                                       

When bridges collapse, the shores are lonely.

Attachments bleed and are washed away by the current. 

The ocean is a compassionate and welcoming like a god. 

Do paper boats have shores?


जब पुल टूट जाते हैं, तो किनारे अकेले पड़ जाते हैं।

आसक्ति रिसती है और धारा के साथ बह जाती है।

सागर एक दयालु और स्वागत करने वाला देवता है।

क्या कागज़ की नावों के किनारे होते हैं?


********************


ఇరుకు త్రోవలను విశాలం చేయడం

ఏమంత సులువు కాదు. 

మరి అవి బండలు కాదు గుండెలు.

మృదువుగా మార్చడానికి నా గుండెను 

డైనమేట్ చేయాలని ఆలస్యంగా తెలిసింది                 


It is not easy to widen narrow paths. 

And they are not rocks, but hearts. 

I learned late that 

I had to dynamite my heart to make it soft.


संकरे रास्तों को चौड़ा करना आसान नहीं होता।

और ये चट्टानें नहीं, बल्कि दिल हैं।

मुझे बाद में पता चला कि अपने दिल को 

मुलायम बनाने के लिए उसमें डायनामाइट लगाना पड़ता है।


3, డిసెంబర్ 2025, బుధవారం

Poetry farming

 ఉన్మత్త పరిమళం/ Crazy Perfume 

పరిమళోన్మత్మమైన గాలి అడవిని వీడింది 

దూసరవర్ణ బాట ను పట్టి ఊరిని చేరింది.

పలుచనై తేలికపడింది. 

ఆ ఉన్మత్తత ఎవరు మాత్రం భరించగలరు!?  


The fragrant wind left the forest. 

Reached the village along a dusty path.

It became thinner and lighter. 

Who can bear that madness?!

                               


************

ఆశ్రయం/Shelter

 ప్రేమ ఎవరి ఆశ్రయం కోరుతుంది!? 

నటించే వారి ఆశ్రయం. 

ఎందుకంటే.. అక్కడ రంగులు ఆకర్షణలు ఎక్కువ కాబట్టి. 

Whose shelter does love seek!? 

The shelter of those who act. Because..

 there are more colors and attractions.


प्रेम किसकी शरण में जाता है!?

अभिनय करने वालों की शरण। 

क्योंकि... वहाँ रंग और आकर्षण ज़्यादा होते हैं।

************


అనేక కారణాల వల్ల నువ్వు నాకు స్పందించవు

అదే కారణం వల్ల నేను నీకు స్పందించను. 

నెపం కారణాలపై నెట్టేసి.. 

మనం ఇరుకు మనసుతో జీవిస్తున్నాం.

                                


You don't respond to me for many reasons

I won't respond to you for the same reason. 

By pushing on pretextual reasons.. 

We live with a narrow mindness

                                    


आप कई वजहों से मुझे जवाब नहीं देते

मैं भी उन्हीं वजहों से आपको जवाब नहीं दूँगा।

बहाने बनाकर..

हम छोटी सोच के साथ जीते हैं।

**************

ప్రేమంటే ఎదుటివారి జీవితాన్ని పూర్తిగా ఆక్రమించడం కాదు.

వారిని కూడా ఊపిరి పీల్చుకోనీయడం.

కలసి మెలసి జీవించడం. 

                  


Love is not about completely taking over someone else's life.

It's about letting them breathe too.

Living together in harmony.


****************


చీకటితో పువ్వులు చెప్పిన ముచ్చట్లు విన్న రాత్రి కరిగిపోయింది. 

ఉదయం మంచు బిందువులై పూలను అభిషేకించింది. 


The night melted away,

 listening to the flowers' sweet voices in the darkness.

In the morning, dewdrops anointed the flowers.

                            

*************


The beauty of the seasons


ఏ రుతువు అందం ఆ రుతువుదే. 

రుతువుల మాయాజాలాన్ని ఆస్వాదించడమే! 

ముక్కు పొగమంచు వాసనతో దిబ్బడ వేసింది. 

ఈ అనుభూతి బావుంది. 

ఆనందానికి రూపాలు వేరు.


The beauty of each season is that season.

Enjoy the magic of the seasons! 

My nose was dazzled by the smell of mist. 

This feeling was good.

Happiness has different forms.






2, డిసెంబర్ 2025, మంగళవారం

చెలికానితనం

 


చెలికానితనం    - వనజ తాతినేని.


కాళిదాసు రచించిన  శాకుంతలం నాటకమో మేఘసందేశమో కాదు

పోతన వర్ణించిన శరదృతువు కాదు

ఆముక్తమాల్యద లో వర్ణించిన  వర్షరుతువు కాదు

ఇదేదో పొడుపు కథలా కనబడే పద్యమూ కాదు

సంయోగ వియోగాలకు అతీతమైనది ఈ ప్రేమ రుతువు

 

నువ్వు వలపు గాలానికి చిక్కిన చేప వి కాదు

నేను  భావజాలానికి లొంగిపోలేదు

ఎవరో దయతలచి నిన్ను నాకు బహుమతిగా ఇవ్వలేదు 

ఏ తావుల్లోనో నిను వెతకకుండానే ప్రాప్తించినావు 

నన్ను నీవు తెలుసుకున్నావు, నిన్ను నేను కనుగొన్నాను. 

వస్తువు ఒకరైతే రూపం మరొకరిది


గాఢనిద్ర వలె తిమిరం కమ్మేసినప్పుడు 

నా స్వరజ్ఞానం నీతో స్వరచాలనం చేసింది

వాగ్ధానాలు అవసరం లేని వాగ్వాదాలు అసలేలేని మౌనమూ

గానమూ కలసిన ధ్యానముద్ర మనది.


కలలు కననూలేదు కల్లలైనాయని చింత పడనూలేదు. 

కలయిక వున్నప్పుడు ఎడబాటు వుంటుందనే ఎరుక కల్గిన మనం  

అదృశ్య గొలుసులతో బంధించబడి వున్నాం

చిక్కుముడులు పడనీయని బ్రహ్మ ముడులు వేసుకోని బంధం మనది. 


నీ పరిచయాన విస్మృతిపథాన పడిపోయిన నా బాల్య జ్ఞాపకాలు 

తిరిగి నాలో జాగృతమైనట్లు 

అనువాద భాషలవసరంలేని హృదయభాషని

అక్షరాలతో మార్పిడి చేసుకుంటూ..ఘ్రాణేంద్రియశక్తితో వర్ధిల్లుతూ

కాలానుగుణంగా ఎవరి త్రోవన వారు నడుస్తూ.. 

అల్పమో ఆధిక్యమో దూరమో దగ్గరో  అన్న లెక్కలు లేకుండా. 


నేను రూపసిని కాకపోయినా నువ్వు గుణవంతుడివే అయినా 

ఈ చెలికానితనం వర్ధిల్లక మానింది కాదు. 

ఒక వస్తువు నో ఒక విషయాన్నో నాతోపాటు ఆలోచిస్తావు. 

అనుభూతి చెందుతావు. ఈ భావ సారూప్యం చాలును!


మనోఃఫలకం పై ముద్రించిన నీ ఊహా చిత్రం 

ఆనందసౌరభాన్ని చిలికి చిందించినట్లు వుంది

ఆలోచన కలిసిన నాలుగు క్షణాలు ప్రేమలో 

నిండా మునకలు వేసినట్టు వుంటుంది. 

ఏ ప్రేమ జీవితాంతం అంటి పెట్టుకుని వుంటుంది గనుక

లిప్తపాటు ప్రేమలు మనవి.  


కథలు రాసే నేను కథలో కథ వుంటుందని 

ఆ కథ పూలదండలో కనబడని దారంలా అంతర్లీన సూత్రంలా

దాగి వుంటుందని ఏం చెప్పను? 

పగిలిన వేణువులో కూడా అపశృతుల సంగీతం వినిపిస్తుంది

కరివానలో కూడా తటిల్లత క్షణకాలం వెలుగునిస్తుంది

అక్షరాలకు ఆవేశం వుంది చదివే హృదికి అనుభూతి వుంది అని తప్ప


కల్పిత గాథలకి జీవం పోసేది మనసే కదా! 

గొలుసు కథను మనలా  అందుకుంటారెవరో!

ఈ రోజు నదిని నేను చంద్రుడివి నీవు.

తీరాన అలంకరింపబడిన  రెల్లు పూల తోరణానివి నీవు. 

ఈ చీకటి రాత్రంతా తలలూపుతూ కవిత్వంలా పలకరిస్తూ వుంటావ్


మనుషులు తిరగని మనోవీధిలో రద్దీ లేని ప్రయాణం మనది.

కాస్త పుస్తకం చేతిలోకి తీసుకుందాం.

తన కాలంలో గుర్తింపబడని విస్మరింపబడిన కవి పేరు ని 

ఆత్మీయంగా స్పృశించి నచ్చిన వాక్యాన్ని కళ్ళకు అద్దుకుందాం.

పుట పుటతో పుటం పెట్టుకుందాం తెల్లవారే వరకూ.

నిద్రలేమి కళ్ళలో జీవితాన్ని వెలిగించే వెలుగుతో.

వేయి పున్నముల వెలుగు .. ఒక్క కవి వాక్యం.

 
2025 నవంబర్ 30 ఫెడరల్ తెలంగాణ డాట్ కమ్ లో ప్రచురితం.

30, నవంబర్ 2025, ఆదివారం

కొత్త కవిత..

 మనం ప్రకృతిలో లీనమై పరవశిస్తూ వుంటాం. ఒక పుస్తకాన్ని చదివి లేదా కవిత్వాన్ని చదివి ఒక అనుభూతికి లోనై అది పంచుకోవడానికి ఎవరూ లేనప్పుడు పడే యాతన భయంకరంగా  వుంటుంది.  నా అభిరుచులు కలిసిన  నాకు కలిగిన అనుభూతి లాంటి దాన్ని  స్పష్టంగా ప్రకటించగల్గిన  సహ పాఠకులో స్నేహితులు  వుండటం వరం అనుకుంటాను. అలాంటి వ్యక్తులు మనకు తారసపడతారు కూడా. వాళ్ళు  ఎక్కడో వుంటారు. మనం ఎక్కడో  వుంటాం. మనకేం గొప్ప సంబంధ బాంధవ్యాలు కూడా వుండవు. ఈ లోకం దృష్టి లో ఆలోచించుకున్న బంధం కన్నా బలీయమైన ఆత్మ బంధం  వుంటుంది. ఇలాంటి ఆలోచనలతో .. ఓ నిద్రపట్టని రాత్రి కూర్చుని ఈ కవిత రాసాను.

 చెలికానితనము  ఇక్కడ నొక్కండి. 

ఆ కవిత “చెలికానితనము” .. 

ఓ పువ్వు పువ్వు ప్రకృతి గురించి మాట్లాడుకుంటే ఎలా వుంటుంది.. ఓ పుస్తకం ఇంకొక పుస్తకం కలిసి మాట్లాడుకుంటే .. ఎలా వుంటుందో.. అలా ఈ కవిత్వం లోని విషయం కూడా అంత బాగుంటుంది. తప్పకుండా చదవండి. 

వేయి పున్నముల వెలుగు ఒక్క కవి వాక్యం 

కవితను చదివి మీ అభిప్రాయం చెబుతారు కదూ !  ఈ లింక్ లో కవిత చదవండీ .. 

ది ఫెడరల్ తెలంగాణా డాట్ కమ్ ఎడిటర్  గారికి  ధన్యవాదాలు 🙏

Cross roads - క్రాస్ రోడ్స్

16, నవంబర్ 2025, ఆదివారం

కొత్త కథ క్రాస్ రోడ్స్ .. సారంగ లో

 కొత్త కథ “ క్రాస్ రోడ్స్” సారంగ లో ప్రచురితం. 

కథ ఈ లింక్ లో చదవగలరు. క్రాస్ రోడ్స్  -వనజ తాతినేని 


నాలో నేను

 నిన్ను నీవు తెలుసుకోవాలంటే.. 

నీతో నువ్వు అంతర్యుద్ధం చేయాలి

మెదడుకి పట్టిన మురికిని కడుక్కోవాలి

నిన్ను నీవు గాయపర్చుకోవాలి 

నిన్ను నువ్వే ఓదార్చుకోవాలి

తొడుక్కున ముసుగు తొలగించుకోవాలి.

నిశ్శబ్దంగా నీతో నువ్వు మాత్రమే వుండగల్గాలి. 

అనుభవమూ అనుభూతి పాతవే అని గ్రహించాలి


నువ్వు నువ్వుగా మిగలగల్గాలి అంటే.. 

భావోద్వేగాలను అణచుకున్న మనిషివైనా కావాలి

కాలానికి ఎదురొడ్డి నిలిచిన మనిషివైనా అయివుండాలి. 

రహస్యంగానైనా నిన్ను ఆరాధించే

బలగమైన్నా కలిగివుండాలి. 

మెట్టనేలలో మొండిగా నిలిచి   తుఫాన్ గాలి తట్టుకున్న 

చెట్టువైనా అయివుండాలి

రాగద్వేషాలు అద్దుకున్న  దేహ వస్త్రాన్ని  సవుడు సున్నం వేసి 

ఉడకబెట్టి పరిశుభ్రంగా ఉతికి ఆరేయాలి. 

పాము కుబుసం విడిచినట్టు జ్ఞాపకాలనూ అనుభవాలను 

బలవంతంగానైనా విసర్జించాలి. 

15, నవంబర్ 2025, శనివారం

దేవర న్యాయం

 దేవర న్యాయం - వనజ తాతినేని. 


సరోజ మంచం మీద అస్థిమితంగా మెదులుతుంది. సగం మంచం ఖాళీగా వున్నా ఆ సగంమనిషి తాలూకు నస అనాదరణ మనసును మెలిపెడుతూన్నాయి. పగలల్లా పనితో గడిచిపోయినా రాత్రి  గడవడం నరకప్రాయంగా తోస్తుంది. 


పెళ్ళై పదేళ్ళైనా ఒడి నిండని భార్య ను అతుక్కొని పడుకోవడం నామోషీగా తలిచాడో యేమో.. లేక మగతనం నిరూపించుకోవాలనుకున్నాడో యేమో.. పక్క వీధిలో మొగుడు వదిలేసిన సుకన్య తో సంబంధం పెట్టుకున్నాడు. నాలుగేళ్ళకు ఇద్దరు పిల్లలను కన్న సుకన్య  సరోజ మొగుడు శేషుతో.. రాజసంగా బుల్లెట్ బండి మీద తిరుగుతుంది. 


 తెల్లవారు ఝామున లేచి రాత్రి పదింటి దాకా ఇంట్లోనూ పొలంలోనూ ఒళ్ళెరగని పని చేయడం అలవాటు చేసుకుంది. అత్త మామ కూడా  ఏదో అనాలి కాబట్టి అన్నట్టు  బిడ్డలు పుట్టే రాత లేని దాన్ని ఇంటికి పెద్దకోడలుగా తెచ్చుకున్నాం అని బాధ నటిస్తూ వుంటారు.  ముద్దుముచ్చటకు రెండో కొడుకు పిల్లలు వున్నారు. పుట్టింటికి పోయి పదిరోజులు వుండి వస్తానంటే.. “అమ్మో నువ్వు లేకుంటే నాకు చెయ్యి ఇరిగనట్టు, ఇల్లు చేనూ బోసిపోయినట్టు వుంటాయ్. మీ అమ్మను నాన్నను రమ్మను. పది రోజులు కాకపోతే నెలరోజులుండిపోతారు.మనకేమి తినడానికి లేదా వుండటానికి లేదా” అంటుంది మాట మంచిగా కనబడే తెలివితేటలతో అత్త. 


అత్త కురచ బుద్దులు కనిపెట్టి.. తల్లి కమలతో అనేది.  అమ్మా!  నువ్వొస్తే ఖాళీ గా కూర్చుండేదానివి కాదని పత్తి చేలోనో మిరప చేలోనో పనికి వొంగుతావని, నాన్నేమో.. ట్రాక్టర్ డ్రైవర్ గా చిన్న కొడుక్కి సాయంగా వుంటాడని. మీరు రాబాకండి, నేనొస్తే పది రోజులు చాకిరీ అయినా తప్పిద్ది” 

సరోజ కు ఆ ఇంటి నుంచి అంత తేలిగ్గా విముక్తి దొరికేది కాదు.ఇద్దరి మనుషుల పనిని అవలీలగా చేసే పని మనిషిని ఎవరు వొదులుకుంటారు అనుకునేది విరక్తిగా. 


కమల కి వియ్యపురాలు మళ్ళీ ఫోన్ చేసేది.  “అమ్మాయి రావాలంటంది. ఆడ బాగా యెండలైపోయే, పాడి కూడా లేకపోయే! మా ఊరు పచ్చగా వుండి యెండే తెలియడం లేదు. మీరే రండి వదినా! పది రోజులు వుండేసి పోదురుగాని “ అని అతి మంచిగా పిలిచేది. 

వియ్యపురాలి తేనె పలుకులకు బోల్తాపడి ఒకటి రెండు సార్లు వచ్చి  బిడ్డ సంసార వైభోగం చూసి కళ్ళనీళ్ళు పమిటచెంగులో దాచుకునేది కమల. బిడ్డకు గొడ్రాలనే నింద పోగొట్టాలని కూతురు తో పాటు బలవంతంగా అల్లుడిని సంతాన సాఫల్య కేంద్రాలకు తిప్పింది సొంత ఖర్చుతో. సరోజ కి ఏ లోపం లేదని శేషు లోనే లోపం వుందని మందులు వాడమని రాసిచ్చారు. సరోజ డాక్టర్ చెప్పినదాన్ని విని సంతోషపడింది క్షణకాలం. లోపం లేదన్నందుకు, తర్వాత అపనమ్మకంగా చూసింది, సుకన్య పిల్లలు కళ్ళ ముందు మెదిలారు. 


ప్రతి రోజూ..మంచినీళ్ళ గ్లాసు మందులతో శేషు  ముందు నిలబడితే..

“నాకెందుకు మందులు? నేను బిడ్డల తండ్రిని.నువ్వే గొడ్డుమోతు ముండవి” అని తిట్టిపోసేవాడు.  కళ్ళనీళ్ళతో  మారుమాటాడకుండా నిలబడేది. క్రమేపి బండబారి పోయింది.  


మరిది శీను కి  తన ఈడే వుండే వదిన ను చూస్తే జాలితో పాటు యేదో యిది. ఎదురైనప్పుడల్లా గుచ్చి గుచ్చి చూస్తాడు. నర్మగర్భంగా మాట్లాడతాడు. మగడి ఆదరణ లేని ఆలి పట్ల బయట మగాడికి వుండే చులకనభావం అది. అతని మాటలకు చూపులకు కలవరం. అత్త మామ తీర్థయాత్రలకు తోడికోడలు పిల్లలకు సెలవలని పుట్టింటికి వెళ్ళినప్పుడు  పులి కంటబడకుండా తప్పించుకు తిరిగే లేడిలా బిక్కు బిక్కు మంటూ వుండేది.


అవతలి బజారులో అట్లతద్ది పేరంటానికి వెళ్ళినప్పుడు అక్కడ సుకన్య చొరవగా పలకరించింది. “మందులు వాడుతున్నావా? తొందరలోనే కడుపు పండిద్ది లే” అంది. ఎగతాళిగా అందా, మంచి మనసుతో అంటుందో అర్థం చేసుకోలేక తికమకపడింది సరోజ. 


ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు  పక్కనే నడుస్తూ  “సరోజా! నీకో రహస్యం చెప్పాలి” అంది. సరోజ ముఖం చిట్లించింది నువ్వు నాకు చెప్పాల్సిన రహస్యాలు ఏముంటాయి అన్నట్టు. 


“నిన్ను చూస్తే చాలా జాలి కల్గుతుంది” అంది మళ్ళీ సుకన్య.


“నంగనాచి మాటలెందుకు లే, నీ దారిన నువ్వు పో” కోపంగా వేగంగా ముందుకు నడిచింది. 


“శేషు కు పిల్లలు పుట్టరన్న సంగతి నాకెప్పుడో తెలుసు. నా పిల్లలిద్దరూ మీ ఆయనకు పుట్టలేదు. ఆ విషయమే నీకు చెబుదామని” 


గిర్రున వెనక్కి తిరిగి అక్కడే నిలబడిపోయింది సరోజ. కళ్లు పెద్దవి చేసి చెవులు రిక్కించింది తర్వాత మాటలేమిటో అన్నట్టు. 


“నిజమే చెబుతున్నా, గొడ్డుమోతు  దానివనే ముద్ర వేయించుకుని బతకడం యెందుకు? నువ్వు కూడా తల్లివి కావాలనుకుంటే వేరే విధంగా ప్రయత్నించు. ఇదిగో ఈ విషయం  నేను నీకు చెప్పానని  శేషుకు చెప్పినా నమ్మడు.అతను నా బిడ్డలిద్దర్ని తనకు పుట్టిన బిడ్డలనే భ్రమతో నన్ను పోషిస్తున్నాడు, నా బిడ్డలను అపురూపంగా చూసుకుంటున్నాడు. ఇది చెబితే  నువ్వే అబద్దం చెప్పావనుకుంటాడు”


‘హే.. పో గాలి మాటలు కూయకుండా” ఇంకో పరుషమైన మాట అనలేక పళ్ళు నూరింది

.

‘’మీ అత్త మామ నీ మరిది పిల్లలకు ఆస్థి అంతా రాయించే పనిలో వున్నారు.  శేషు తదనంతరం ఆ పిల్లలకు చెందేటట్టు రాయమని అడుగుతున్నారట. కాటికి పోయేదాక నీకు చాకిరి తప్ప చిటికెడు సంతోషం కూడా మిగలదు, నువ్వే ఆలోచించుకో మరి.”


స్తంభంలా  కరెంటు స్తంభం కింద నిలబడింది. దీపం కాంతి తల మీదగా పడి లోనకి వెలుగేదో

జొరబడింది. 


ఆలోచిస్తూనే ఇంట్లోకి నడిచింది.అయినా సుకన్య ఆ సంగతి నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది? 

 కొంతసేపటికి ఒకటి ఒకటి కలిసి రెండై ఆచూకీ చిక్కింది. సుకన్య పై  అదివరకు వున్న తగని ద్వేషం ఈర్ష్య క్షణంలో తుడిచిపెట్టుకుపోయాయి.  

 

విలాసాల కోసం ఉంచుకున్న వాడి దగ్గర అభిమానం  పొందడానికి  పిల్లల ఎర వేసింది.  తన వొడి నిండటానికి తెంపరితనానికి తెగబడి మరొకరితో సంబంధం పెట్టుకుంది. శేషు ని అందంగా బలీయంగా నమ్మించింది. నమ్మకమేగా దేనికైనా మూలం. 


గత కొన్నేళ్ళుగా ఇంటా బయటా సంతానం లేని స్త్రీగా చులకన భావానికి అలవాటు పడింది సరోజ. ఆ అలవాటైన అవమానానికన్నా  ఇది పెద్ద అవమానంగా తోచింది.ఆస్తులన్నీ మరిది పిల్లలకు రాయించడం ఏమిటి?   వీళ్ళకు సొమ్ము వారసత్వాలపై ఎంతటి వ్యామోహం!? సంతానం లేని స్త్రీ అయిన తనను  కుటుంబ రథచక్రాల కింద తొక్కిస్తూ ముందుకు సాగుతున్నారే!  పొద్దస్తమానం గాడిద చాకిరీ చేస్తూ తన లోపం ఏమీ లేకపోయినా గొడ్రాలి ముద్రను భరిస్తూ వుంది. కడుపులో భగ భగ మండుతుంది. ఎత్తిన చెంబు దించకుండా లీటరు నీళ్ళు తాగింది. 


తనకు మాత్రం తల్లిని కావాలనే కోరిక లేదా? తోడికోడలి పిల్లలనో, చెల్లెలు పిల్లలనో ఒడిని వేసుకుని వారి తల నిమురుతూనో గుండెలకు హత్తుకుంటే ఏదో తెలియని చిత్రమైన పులకింత. ఆ పిల్లల యెడ తనకి వాత్సల్యం పొంగిపొరలేది. పిల్లలు అన్నం తింటున్నప్పుడు మురిపెంగా తదేకంగా చూసినా.. పిల్లల తల్లులు తన కళ్ళెదుటే దిష్టి తీస్తూ తన వైపు చూసిన చూపులకు అర్ధం తెలియని అమాయకురాలు కాదుగా. 


“ఎనకటి జన్మలో ఎవర్ని చూసి యేడ్చావో, ఏ బిడ్డలకు హాని తలపెట్టావో, నీ కడుపున వొక కాయ కాయకుండా ఆ భగవంతుడు శిక్ష వేసాడు నీకు”  అని తల్లితో సహా అందరూ  మాటలతో చేసిన మానసిక హత్యలు యెన్నెన్నో!!


లోపం తనలో పెట్టుకుని వైద్యానికి సహకరించని భర్తను నమ్ముకుని తను మాత్రం ఎంతకాలం గొడ్రాలుగా మిగిలిపోవాలి. సరోజ మనసులో ఓ పథకం రూపుదిద్దుకుంది. పాపాలన్నింటికీ పాదు నేను నాది అనే స్వార్థమే కదా!  నాకు మాత్రం స్వార్ధం వుంటే తప్పేంటి? అనుకుంది.టివీలో చూసిన భారతం కథ గుర్తుకు తెచ్చుకుంది. కృత్రిమ గర్భధారణ కన్నా ఇది నయం కదా అనే నిర్ణయానికి వచ్చింది.



మర్నాడు మసక చీకట్లో  ముగ్గు పెడుతూ నిద్ర లేచి వస్తున్న మరిది ని చూసి నవ్వింది. మధ్యాహ్నం పీట వేసి కంచం పెట్టి చుట్టూ అన్ని అమర్చి పక్కకు తప్పుకునే ఆమె ఆ రోజు ఎదురుగా కూర్చుని కొసరి కొసరి వడ్డిస్తూ అతన్ని చూస్తూ నవ్వింది. రాత్రి అతను ఏదో పని వున్నట్టుగా చొరవగా గదిలోకి వచ్చాడు. పట్టె మంచం పైకి వచ్చాడు. పది నెలల్లో ఒడిలో బిడ్డై ఆమెను మరింత మురిపించాడు.  ఆ తర్వాత కూడా అప్పుడప్పుడూ ఆమె నవ్వుతూనే వుంది. శేషు మాత్రం తమ పరగణాలో  మగాడు అని మరోసారి అనిపించుకున్నాడు. పుట్టిన బిడ్డకు వంశీకృష్ణ అని పేరు పెట్టుకున్నారు.

‘కిట్టూ’ అని ముద్దుగా పిలువసాగారు.


కొంత కాలానికి అందవలసిన వారికి ఆ రహస్యమేదో సూచాయగా అందింది. ముందు నోళ్ళు నొక్కుకున్నారు. తర్వాత ఏదో ఒకలాగా చచ్చారు లే,ఏ కొడుకైతే ఏమిటిలే! కులకాంత ద్వారా వంశానికి మరో వారసుడు వచ్చాడులే అనుకున్నారు పెద్దలు. ఆ సంగతి శేషు కి తెలియకుండా శీను ని మందలించారు.  తండ్రీ, కొడుకులిద్దరూ  ఆస్తులను  మూడు భాగాలుగా పంచుకున్నారు. ఇంటి భాగంలో అన్నదమ్ములిద్దరూ గొడవ పడ్డారు. పదెకరాల పొలం, ఇళ్ళ స్థలం తమ్ముడి పిల్లలకు రాయాల్సిన పని లేకుండా తన వాటా ఆస్తులపై తనకే అధికారం దక్కిందని శేషు, అతనితో పాటు సుకన్య సంతోషపడ్డారు.  


సరోజ తరచూ ఒక మాట  అనుకునేది. తల్లికి బిడ్డ కన్నా ఎక్కువ సంతోషాన్ని కలిగించే విషయం ఏముంటుంది!! ఉంటే అది తన జీవితంలో ఒక భాగం మాత్రమే! బిడ్డ పుట్టగానే తల్లి తన సంతోషాన్ని మూడొంతులు కోల్పోతుంది. నేనూ అంతే! ఇంక నాకేమి వద్దు. నువ్వు ఒక్కడివి చాలు రా!.అని కిట్టూ ని గుండెలకు హత్తుకుంది.. 


మరిది శ్రీను కి అన్న వాటా ఆస్తి తన పిల్లలకు దక్కకుండా  జారిపోవడం కంటగింపుగా మారింది. ఆస్తులు పంచుకున్నప్పటి నుండి సరోజ తనవైపు ఏమాత్రం చూడటం లేదు.నీతో నాకేం పని అన్నట్టు తిరస్కారంగా చూస్తుంది. కాపురం పక్క ఊరికి మార్చేసింది. సరోజ కి   కట్నం కింద ఇచ్చిన పొలాన్ని హామీగా పెట్టి శేషు ట్రాక్టర్ కొన్నాడు. వరి కోత మిషన్  తెచ్చాడు. పక్కనోళ్ళ పొలం కౌలుకి తీసుకుని పత్తి వేసాడు. ఆ ఏడు పంటలు బాగా పండి మంచి రేటు పలికి నాలుగు లక్షలు కళ్ళజూసారు. సరోజ కాలు కందకుండా పని మనుషులను పెట్టాడు శేషు.  ఏ మాత్రం ఒంటి నునుపు తగ్గకుండా పండ్లు ఫలహారాలు బిర్యానీలు తినిపించాడు. సుకన్య ను గుంటూరులో వుంచి అంతకన్నా బాగా చూసుకుంటున్నాడు.

 

సరోజ తల్లి కమల  “నా కూతురికి మంచి రోజులొచ్చాయి. దాని కడుపున ఒక బిడ్డ పుట్టాక ఎక్కడలేని వైభోగం వచ్చింది” అని ఇరుగుపొరుగు కి బంధువులకు చెప్పుకుని సంతోషపడింది. 


శీను ఈసారి వేరే దారిన వచ్చాడు. గొడవలన్నీ మర్చిపోయినట్టు నటిస్తూ అన్న ఇంటికి రాకపోకలు సాగిస్తున్నాడు. ఎందుకో సరోజ కి లోలోపల భయంగానే వుంది. 


శేషు తను లేనప్పుడు ఇంటికి కాపలాగా వుంటాడని కోత మిషన్ వెంట తిరిగి లెక్కలు రాస్తాడని  ఒక కుర్రాడిని పెట్టుకున్నాడు.  అతని పేరు రాజేష్. సరోజకు వాడంటే సోదరభావం వుండేది. కిట్టూ కూడా రాజేష్ ని మామ మామ అంటూ భుజాలపై తిరిగేవాడు. సరోజ రాజేష్  అర్ధరాత్రి వరకు మేల్కొని టివి లో సినిమాలు చూస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ  నవ్వుకుంటూ వుండేవారు. రాజేష్ కూడా ఇంటి లోపలే పడుకునేవాడు.


శీను ఒకోసారి అన్న లేని సమయం చూసి ఇంటికి వచ్చేవాడు. సరోజ కి రక్షణగా వున్న రాజేష్ చూసి తన ఎత్తులు పారటం లేదని కోపగించుకున్నాడు. కక్ష పెంచుకున్నాడు. 


“అంతలపొంతలవాడు ముంగిలి బయటే వుండాలి కానీ అంతఃపురం లోకి జొరబడనిస్తారా” అని రాజేష్ పై అన్న శేషుకి ఎక్కబోసాడు.సరోజ పై అనుమానబీజం నాటాడు. తమ్ముడి మాటలు నెత్తికెక్కిన శేషు ఉన్మాదంతో ఊగిపోయాడు. ఇంటికెళ్లి కిటికీలో నుండి తొంగి చూసాడు. అష్టాచెమ్మా ఆడుకుంటూ సరదాగా గొడవ పడుతున్న వారిద్దరిని చూసి ఆవేశపడిపోయాడు. అర్ధరాత్రి పూట రాజేష్ ని చావబాది సరోజను వివస్త్రను చేసి  నడి బజారుకీడ్చాడు. పిల్లవాడ్ని బలవంతంగా లాక్కున్నాడు. అయ్యో!  అలాంటిది ఏమీ లేదయ్యా, వాడి కన్నతల్లిని నేను అక్కడే వున్నానని రాజేష్ తల్లి చెపుతున్నా వినిపించుకోలేదు.


కాలం కర్మం కలిసి రాకపోతే అవమానాల పాలు తప్పదు అనుకుని. ఆ అర్ధరాత్రి వేళ  పుట్టెడు దుఃఖంతో. పుట్టింటికి చేరింది. అంతకన్నా ముందే గాలి కబుర్లు ఆ ఊరికి చేరుకున్నాయి. 

ఏ ఇద్దరు కలిసినా సరోజ ముచ్చటే!  ఆ దిగులుతోనే సరోజ తండ్రి కాలం చేసాడు. అయినా అత్తింటి వైపు కాకి కూడా ఈ ఇంటి వైపు వాలింది లేదు పలకరింపు కైనా. సరోజ అవమాన భారంతో మంచానికి అతుక్కుపోయింది. 


ఆర్నెల్ల తర్వాత పెద్దల మధ్య పంచాయితీ జరిగింది. 


“కుక్క ముట్టిన కూడు నేను తినను. నాకు ఆ భార్య అవసరం లేదు”  కఠినంగా చెప్పేసాడు శేషు.  ముఖం నల్లబడింది సరోజకి. పిల్లవాడిని ఇవ్వడానికి వొప్పుకోలేదు.  కమల తల్లీ బిడ్డను వేరు చేయడం అన్యాయం అంది. ఆమె గోస ఎవరికీ వినబడలేదు. విన్నా విననట్టు నటించారు. అప్పు చేసి మరీ కేసులు కోర్టుల చుట్టూ తిరిగి పిల్లవాడిని తెచ్చుకోగల్గింది సరోజ. విడాకులు ఇచ్చేసాడు శేషు. కిట్టూ కి  అప్పటికే ఐదో ఏడు వచ్చేసింది. కిట్టూ ని  గుంటూరులో మంచి స్కూల్లో చేర్పించింది సరోజ. 


రాజధాని పరిధిలో వున్న ఊరు కాబట్టి కట్నం కింద సరోజకి ఇచ్చిన రెండు ఎకరాల పొలానికి బాగా  రేటు పెరిగినా.. ట్రాక్టర్ లోను కట్టనిదే పొలం చెర వీడదు.దానిపై కేసు నడుస్తూ వుంది. కాస్తో కూస్తో మిరప పంట మీద వచ్చే సొమ్ముతో తల్లి కమలకి  వచ్చే వృద్ధాప్యం పెన్షన్ తోనూ అవి చాలనప్పుడు పక్క పొలాల్లో కూలి కి వెళ్ళి కష్టంగా రోజులు వెళ్ళదీస్తూ వున్న సరోజ కు పిల్లవాడికి స్కూల్ ఫీజులు కట్టడానికి బ్రహ్మ ప్రళయం అవుతుంది. తల్లి పంచన చేరి ఆమె సొమ్మంతా ఒక్కటే తింటుంది అని చెల్లెలికి అక్కపై కోపం. అయినా ఉన్నంతలో కిట్టూ ని బాగానే పెంచుతుంది. 


కిట్టూ బాగా చురుకైనవాడు. తమ పరిస్థితిని బాగా ఆకళింపు చేసుకున్నాడు. వారంలో నాలుగు రోజులైనా  సరోజ కమల శేషుని ఆడిపోసుకునేవాళ్ళు, పిల్లాడు వింటున్నాడనే సృహ లేకుండా.


మొదట్లో తల్లి కూతురు  ఇద్దరూ టివీ సీరియల్స్ చూస్తూ ఎవరికిష్టమైన ఛానల్ వాళ్ళు చూడాలనుకుని రిమోట్ కోసం వాదులాడుకోవడం. కిట్టూ హోమ్ వర్క్ గురించి కూడా పట్టేది కాదు.  


“అమ్మమ్మా.. మా అమ్మా నాన్న పోట్లాడుకుంటే వాళ్ళిద్దరూ చూసుకోవాలి. మధ్యలో నేనేం జేసాను? మా నాన్న దగ్గర వున్నప్పుడు మా అమ్మ మంచిది కాదని తిట్టేవాళ్ళు. ఇప్పుడు మీ దగ్గరుంటే మా నాన్న మంచోడు కాదని తిడుతున్నారు.నాకు వీళ్ళిద్దరూ వద్దు. హాస్టల్ లో వుంటా, అక్కడ చేర్పించు” అన్నాడు దిగులుగా ముఖం పెట్టి. 


 నివ్వెరపోయింది కమల. కళ్ళనిండా నీళ్ళతో మనుమడిని గుండెలకు హత్తుకుంది. “మీ అమ్మా నాన్న సంగతి వదిలేయ్! నీకు నేనున్నాను. నా ఒంట్లో ఓపిక వున్నంతవరకు నిన్ను బాగా చూసుకుంటాను. నువ్వు కూడా బాగా చదువుకోవాలి” అంది.  కిట్టూ సరేనని తల ఊపాడు. 


సరోజ ఉద్యోగం చేస్తానంది. నువ్వు చదివిన పదో తరగతి చదువుకి ఏం ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగం వద్దు ఏమీ వద్దు. ఇప్పటికే  కుటుంబం పరువు పోయింది. ఇంకా పరువు తీయకు అన్నారు తండ్రి తమ్ముళ్లు. వాళ్లలో ఒకరు పంచాయితీ ప్రెసిడెంట్. మరొకరు అపరాల వ్యాపారి.


కడుపు నిండిన వాడికి పస్తులుండే వాడి ఆకలి ఏం తెలుస్తుంది? నా పొలంలో  అరెకరం పొలం అమ్మి వడ్డీకి ఇస్తే పిల్లాడి చదువుకి ఇంటి ఖర్చులకు సరిపోతాయి అని మరుదుల దగ్గర మొర పెట్టుకుంది కమల.ఆడవాళ్ళ మాటకు మనం విలువ ఇచ్చేది ఏమిటి? అన్నట్టు వ్యవహరించారు వాళ్ళు.బేరగాళ్ళు వచ్చినా ఏదో వంక చెప్పి తిప్పి పంపేవారు.


ఇవ్వన్నీ సరోజని మరీ మొండిగా మార్చాయి. తల్లిని వేధించడం అకారణంగా చెల్లెళ్ళపై తగాదా పడటం,నలుగురిలోనూ బాబాయిలను తుస్కారంగా మాట్లాడటం మొదలెట్టింది. ఆమె ప్రవర్తనకు విసిగిపోయింది కమల.


మిగతా కూతుర్లను పిలిపించి తన కష్టాన్ని వెల్లబోసుకుంది. “నాఇంట్లో నాకు స్వేచ్ఛ లేకుండా పోయింది.కడుపున పుట్టినందుకు తిండి పెడుతున్నాను, పిల్లాడికి ఫీజులు కడుతున్నాను. వీసమెత్తు పనిచేయకుండా మంచానికి అంటి పెట్టుకోవడం టివీ చూడ్డం. పొద్దున్నే లేచి పిల్లాడికి క్యారేజ్ అయినా కట్టుకోకపోతే ఎట్టా? ఆ పని కూడా చేయకపోతే ఎట్టా?”అని.


చెల్లెళ్ళు ఇద్దరూ “ఇలా అయితే కుదరదక్కా !  అమ్మని ప్రశాంతంగా బతకనీయవా నువ్వు? ముందసలు  నువ్వీ ఇంట్లో నుండి బయటకు  వెళ్లి పో” అని  గట్టిగా  మాట్లాడాక దారిలో పడింది సరోజ. కిట్టూ పెంపకంలో బాగా  శ్రద్ద తీసుకుంటుంది.కూలి పనికి వెళ్లి అయినా అడిగినవన్నీ కాస్త ఆలస్యంగానైనా కొనిచ్చే తల్లి ప్రేమను అర్ధం చేసుకున్నాడు. 


కిట్టూ అన్నాడొకరోజు. “అమ్మమ్మా! మా ఊరు నుంచి గుంటూరు రావాలంటే.. మా స్కూల్ పక్కనుండే వెళ్ళాలి. ఈ మూడేళ్ళలో మా నాన్న కానీ మా నాయనమ్మ తాతయ్య కానీ ఒక్కసారి కూడా నన్ను చూడటానికి రాలేదు. వాళ్ళకి నేనంటే ఇష్టం లేదనుకుంటా! నాక్కూడా వాళ్ళంటే ఇష్టం లేదు” అంటూ బొటనవేలు కిందకి చూపించాడు. కమల సరోజ మౌనం వహించారు.


శేషు కి కలసిరాని వ్యవసాయం, అప్పులు. ట్రాక్టర్, వరికోత మిషన్ ఎటు పోయాయో! ఆస్తులకు మించిన అప్పులు.సుకన్య వొత్తిడి రోజు రోజుకు పెరుగుతుంది.పొలం తన పిల్లలకు రాయమని. 


మా తదనంతరం వచ్చే ఆస్తి అది. ఎవరెవరికో రాయటానికో అప్పులు తీర్చడానికి కాదు అని శేషు తల్లిదండ్రులు. అంతా ఆగమాగం.ఒకనాడు అప్పుల వాళ్ళ వొత్తిడికి తట్టుకోలేక శేషు పురుగు మందు తాగేశాడు. 


సరోజ దాకా విషయం వచ్చి చేరింది.అయినా చలించలేదు. స్కూల్ నుండి కిట్టూ వచ్చాక విషయం చెప్పి నాన్న ను చూడటానికి వెళదామని మీఅమ్మని అడుగు అంటూ  మనుమడిని ఎగదోసింది కమల.


 “అమ్మా  నాన్నను చూడటానికి వెళదామా “ అన్నాడు తల్లి ముఖంలోకి చూస్తూ. తల్లిని 

కొడుకు కి తీసుకుని ఆటోలో గుంటూరు హాస్పిటల్ కి బయలుదేరింది సరోజ.  


ప్రయాణిస్తున్నంతసేపు శేషుతో గడిపిన జీవితాన్ని తలుచుకుని కళ్లు తుడుచుకుంటూనే వుంది. 

“మదిలో సమాధి అయిన సంగతులెన్నో,కళ్ళల్లో కన్నీరు అయిన కలలెన్నో,గొంతులోనే మూగబోయిన మాటలెన్నో, నోట్లోనే నానిపోయిన నిజాలెన్నో, గుండెల్లో గూడు కట్టుకున్న గుర్తులెన్నో,

ఈ జీవిత పయనంలో చేదైన అనుభవాల ప్రయాణంలో… సరోజ మనసు గుక్కపెట్టి ఏడ్చింది. 

హాస్పిటల్ లో  బెడ్ పై పడివున్న శేషు సరోజను చూడగానే పెద్ద పెట్టున ఏడ్చాడు. 

ఓదార్చే క్రమంలో  బెడ్ పై కూర్చుంది. పడుకున్న వాడల్లా లేచి ఆమె వొళ్ళో  పసిపిల్ల వాడిలా తలపెట్టాడు. కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న అతన్ని చూసి ఆమె విచలితమైంది. బండబారిన ఆ  హృదయంలో  స్త్రీ సహజమైన వాత్సల్యం కరుణ పెల్లుబికింది. చాలాసేపటి వరకూ అతని తల నిమురుతూ వుండిపోయింది. లోలోపల ప్రశ్నించుకుంటుంది. 


ఈ పురుషుడేనా  చెప్పుడు మాటలు విని  అపవాదులేసి భర్తనే అధికారంతో తనని నడివీధికి ఈడ్చింది?  ఈ పురుషుడేనా అహంకారంతో తన ఒడిలో వున్న బిడ్డను నిర్దాక్షిణ్యంగా నా కొడుకు  అని  లాక్కుని పోయింది? ఈ పురుషుడేనా సుకన్యతో కలిసి నాటకమాడి  ఆస్తుల కోసం తనను ఆటబొమ్మని చేసి ఆడుకుంది?  ఈ పురుషుడేనా ఇప్పుడు పసివాడి లా ఒడిలో వాలి వెక్కి వెక్కి ఏడుస్తోంది? బేరీజు వేసుకుంటుంది.

 

భర్తనే వాడు అహంకారంతో అణచివేయజూస్తాడు. ఆటబొమ్మని చేసి ఆడుకుంటాడు. పసివాడి లా లాలించమని ఒడిన చేరతాడు. క్షమించమని కాళ్ళ మీద పడతాడు. అబల, నిస్సహాయ స్థితిలో ఉన్న తనేం చేయగలదు? 


శేషు తాలూకా బంధువులు హాస్పిటల్ కి మందలాగా వచ్చి పడ్డారు.  సరోజ ని చూసి తలో ఒక మాటా అన్నారు.


“ఆడదిక్కు లేని సంసారం చేసుకున్నాడు.అప్పులపాలై పోయాడు. ఇల్లాలు లేని మగాడి బతుకు చావును వెతుక్కుంటుంది.అయిందేదో అయ్యింది. ఇప్పటికైనా మొగుడు పెళ్ళాం కలిసి వుండండి.” సూచనలు చేశారు. 


సరోజ మామ కల్పించుకుని “మేం మాత్రం వొద్దన్నామా? కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకి కోపం. ఇద్దరూ పంతాలుకి పోయి సంసారం ఈ కాడికి తెచ్చారు. ఊరూరా తిరిగారు అల్లరైపోయారు. మా పరువు తీసేసారు” అన్నాడు భుజం పై తుండుగుడ్డ తీసి గట్టిగా విదిలిస్తూ. 


“మా పరువు పోయింది. పిల్లకిచ్చిన పొలం లోన్ కి ఇరికించారు. చిన్నం బంగారం ఒంటిపై లేకుండా చేసారు. రంకులు కట్టి బజారుకి ఈడ్చారు, పిల్లాడ్ని ఈయడానికి కోర్టుల చుట్టూ తిప్పించారు. ఇన్నేళ్ళలో పిల్లాడు ఎట్టా వున్నాడో అని ఒక్కరైనా తిరిగి చూసారా?” ఆక్రోశం ప్రవాహంలా సాగింది కమల నోటి నుంచి. 


వాదనలు సాగుతూనే వున్నాయి. సరోజ లో స్థబ్దత. ఏం మాట్లాడాలో తెలియక పిచ్చి చూపులు చూడసాగింది. నిమిషాలు గడిచే కొద్దీ కుటుంబ రాజకీయాన్ని అర్థం చేసుకోవటం జీర్ణించుకోవడం రెండూ కష్టమైంది.  శేషు వైపు చూసింది. కాళ్ళకు పామై చుట్టుకున్న ఇతన్ని ఏంచేయాలి?ఏం పాలుపోలేదు. బేలగా చూసింది కొడుకు కిట్టూ వైపు. 


కిట్టూ తల్లి కళ్ళల్లోకి స్థిరంగా చూసాడు. 


“ఇక వెళదాం రా అమ్మా! చీకటి పడక ముందే ఇంటికి వెళ్ళిపోదాం” అంటూ తల్లి చేయి పట్టుకుని లాగాడు కిట్టూ. బొమ్మలా కొడుకు వెంట నడిచింది. వెనుక కమల కూడా అనుసరించింది. 


ఆటో ఎక్కాక కిట్టూ కమలతో  “అమ్మమ్మా!  నన్నూ, మా అమ్మని అక్కడికి పంపాలని చూసావనుకో,  నేను మా అమ్మ నీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతాం.” అన్నాడు తర్జన చూపిస్తూ. 


కమల కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తుంటే సరోజ పెదవులపై చిరునవ్వు తొంగిచూసింది. 


మరో రెండు రోజులకు లాయర్ తో మాట్లాడి పకడ్బందీగా కాగితాలు రాయించి  కిట్టూ ని దత్తత తీసుకుని  తన  రెండెకరాల పొలం, తదనంతరం తన ఇల్లు మనుమడికి రాసిచ్చింది కమల.  సంప్రదాయంగా హోమం చేయించి తమ ఇంటి పేరుతో కిట్టూని పిలిపించింది. సరోజ దేవర న్యాయాన్ని ఆహుతిలో వేసింది. ఆ ఇంటి పేరు మాసి పోయింది. దుఃఖపు తుఫాను వెళ్ళిపోయింది. జీవితానికి కాస్తంత కాంతి శాంతి దొరికాయి అనుకుంది.


**********************సమాప్తం*********************


కొలిమి వెబ్ మాసపత్రిక నవంబర్ 2025  ప్రచురితం.