28, ఫిబ్రవరి 2019, గురువారం

దుఃఖపు రంగు




దుఃఖపు రంగు -వనజ తాతినేని 


ఇంటి వెనుక నుండి మొదలయ్యే అడవి. పేరుకు అడవే  కానీ.. ఒక పచ్చని చెట్టు కూడా కనబడని  ఆరుబయలు. చిన్న చిన్న చిట్టీతి పొదలు బొమ్మేడు,చిట్టికీసర చెట్లు. గట్టి ఎర్రటి నేల. చిన్న గాలికే నేల దుమ్మురేగి చెట్ల ఆకులు కూడా జేగురురంగు వేసుకున్నట్టు వుంటాయి.


ఆ కొండంచు పల్లెలో గుట్టల మధ్య నిలువుగా పెరిగిన చిట్టి కీసర కొమ్మలని వంకీ కట్టిన కర్రతో లాగి తన దగ్గర ఉన్న తాడుతో ముడేసి నేలబారుకి వొంగేలా  లాగి మళ్ళీ అదే చెట్టు మొదలకి ముడేసింది. ఆకులని తింటున్న మేకల మందని చూస్తూ పక్కనే వున్న పెద్ద రాతిపై కూర్చుని  యెక్కడో ఆలోచిస్తూ కూర్చుంది సోనా.  పిల్లిలా శబ్దం కాకుండా యెటునుండి వచ్చాడో  భూక్యా  మోకాళ్ళ మీద నేలపై కూలబడి సోనా కాళ్ళు పట్టుకుని నన్ను మాఫ్ చేసినానని చెప్పు సోనా, మళ్ళీ లగ్గం చేసుకుని నీకు చాలా అన్యాయం చేసినా, వోలి  కింద యిచ్చిన పశువులని కూడా తిప్పి తోలుకొచ్చుకున్నా వొక్క మాట అనలేదు మీ అమ్మ బాపు. ఇంట్లో పని, మడిలో పని అన్నీ నీ చేత చేయిస్తున్నా  అని కుమిలిపోతుండా. అది రాచ్చసి ముండ. నీ యెంక చూసినా వూరుకుంటల్లే. దాని నోటికి జడిసి కుక్కిన పేనల్లే పడి వుండాను గానీ  యింటికి అసలైన లచ్చిమిదేవి  నువ్వే, నువ్వు నా వైపు చూసి చిన్న నవ్వైనా నవ్వనిదే నేనెట్టా బతకనే సోనా  అంటూ ఆమె వొడిలో తలపెట్టాడు. కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా  చూస్తూ   భర్త  తలపై ప్రేమగా చేయి వేయబోయి క్షణంలో మనసు మార్చుకుంది. 


మోసాకారికి  మాటలకేమి కొదవ. మాట మాటకి రంగులద్దడమే కదా అని అనుకుంటుండగానే  మరిన్ని మాటలు చెపుతూ ఆమె వొళ్ళోనుండి  లేచి నడుము చుట్టూ చేతులు బిగించి లేత కొబ్బరి లాంటి నిన్నువొదిలి ముదురు ముంజెలాంటి దానితో సర్దుకోవాల్సి వస్తుంది. నువ్వు  వూ  అనవే సోనా  దాన్ని బయటకి తోలేస్తా అన్నాడు కళ్ళనిండా మోహముతో. సోనాకి  గొంగళి పురుగు ప్రాకినట్టై౦ది. రెండు చేతులతో అతన్ని విసురుగా  వెనక్కి నెట్టేసి లేచి బిరబిరా పోయి కొమ్మలందక మే మే అని అరుస్తున్న మేకపిల్ల ముందుకి  కొమ్మని లాగి చివురలంది౦స్తుంటే...."యెన్నాళ్ళు వొంటిగా పడి వుంటావ్, మొగుడ్ని కదా,  ముద్దు  మురిపం తీర్చుదామనుకున్నా నన్నే  కాదంటావా,  ఛీ కొడతావా, బాడ్కోవ్ దానా,  యింటికి రావే నా కొడుకుని అంటుకోవే నీ పని చెపుతా "అంటూ కొట్టడానికి మీదకి వచ్చాడు భూక్యా. అంతలో  యింటెనుక నుండి ఓయ్ ..అంటూ  చేతులూపుతూ కేకలు పెడతన్న రుక్కుని చూసి తోక జాడించి  మెల్లగా జారుకున్నాడు. భూక్యా  వెళ్ళిన వైపే చూస్తూ సన్నగా నవ్వుకుంది సోనా.


ఆ రాత్రి  చిన్నింటిలో  పడుకున్న సోనా దగ్గరికి మళ్ళీ వచ్చాడు భూక్యా . ఆమె పై అధికారంగా చెయ్యేసాడు.  తోసేసి మంచం దిగి లేచి నిలబడింది. నిద్రపోతున్న పిల్లాడిని యెత్తుకుని నన్ను అంటుకోనీయకపోతే ఈడిని  నువ్వు అంటుకోడానికి ఈల్లేదు. నాకే కదా కన్నావ్ యెవరికో కనలేదు కందా అన్నాడు ఓ ముతక మాటని వదులుతూ. చెరుకాకు సర్రున కనురెప్ప పై కోసినట్టై౦ది సోనాకి. వెనకనుంచి భూక్యా  చొక్కా పట్టుకుని గుంజి  గుమ్మానికి అడ్డంగా నిలబడి నా బిడ్డనీయ్ అని లాక్కోబోయింది. చూరు కింద గోడమేకుకి  తగిలిచ్చిన పలుపుతాడు తీసుకుని సోనా ని గొడ్డుని బాదినట్టు బాది నీ బిడ్డ అంట, బిడ్డను నువ్వేమన్నా పుట్టింటి కాడనుంచి తీసుకొచ్చినావా, సూది దారమే గంద తెచ్చింది అది తీసుకుని పోవే అని  వీధిలోకి నెట్టి తడిక బిగగట్టుకుని డాబా యింట్లోకి  పోయాడు.  పక్కలవాళ్ళు చోద్యం జూసినంత సేపు జూసి ఆ యింట్లో గోల మనకెందుకులే అనుకుని మెల్లగా  టీవిల ముందుకి సర్దుకున్నారు.  రెండు గంటలు  గడిచి పోయాయి. సినిమాకి పోయిన రుక్కు తిరిగొస్తూ వీధిలో పడున్న సోనాని దాటుకుని యేమి యెరగనట్టు ముందుకుపోయింది. పలుపుతాడు దెబ్బలకి వొళ్ళంతా పొంగింది సోనాకి.  జ్వరం ముంచుకొచ్చింది   నోరు పిడచగట్టుకు పోతుంది. ఎవరైనా నీళ్ళు యియ్యకపోతారా అన్నట్టు చూస్తూ వుంది.  ఊరంతా సద్దుమణిగింది కానీ గొంతులో చుక్క నీళ్ళు పడలేదు. ఆకాశంలో చంద్రుడికి మల్లే నడీధిలో సోనా. లోపల్నుంచి కృష్ణుడి యేడుపు ఆగకుండా వినొస్తుంది.దాంతో జతచేరి భూక్యా  కీచురు గొంతు.  ఆపరా ముండ నా కొడకా, యెప్పుడు చూసినా గీ గీ అని యేడుస్తూనే వుంటాడు అని విసుక్కుని ఈడిని తీసుకుపోయి దాని వొళ్లో వేసిరా పో అన్నాడు. ఆ మాట యెప్పుడంటాడా అని కాస్కుకూర్చున్న రుక్మి కృష్ణుడిని యెత్తుకుని  సోనా దగ్గరికి వొచ్చి చెల్లీ, ఇదిగో బిడ్డ యేడుస్తున్నాడు పాలిచ్చి పడుకోబెట్టు.అయినా నువ్వు  భర్తకి యెదురు చెప్పడమెందుకు, యిన్ని దెబ్బలు తినుడు యెందుకు, గుట్టుగా సర్దుకుని వుండొచ్చు గంద. నాకేమన్నా పిల్లా జెల్లా పుట్టునా. ఇల్లు  పొలానికంతటికీ నీ బిడ్డే వారసుడు గందా, లోపలికి వచ్చి  కాస్త యెంగిలిపడి సర్దుకుని పడుకో, ఆవు ఎదై వొకటే అరుస్తా వుంది పొద్దున్నేఆంబోతు కాడికో   హాస్పిటల్కో తోలుకుపోవాలి, నీళ్ళు మోయాలి యెట్టా చేస్తావో యేమో అని గది లోపలికి పోయి ఠక్కున  తలుపేసుకుంది. భుజాన బిడ్డనేసుకుని లేచొచ్చి  మళ్ళీ పాకలో కుక్కి మంచంలో కూలబడింది సోనా.ఏడుపు కూడా రానంత నిర్వేదంలో కళ్ళు మూసుకుంది.

 

మర్నాడు  పొద్దున్నే ఆవుని ఆంబోతు వున్నకాడికి తోలుకుపోయి దాటించుకుని వచ్చింది.  బిడ్డని వీపుకు గట్టుకుని పెద్ద  ప్లాస్టిక్ సీసాల  నిండా నీళ్ళునింపుకుని వాటికి తాడు గట్టుకుని భుజాన వేసుకుని పాడి ఆవుని  యెద్దులని తోలుకుని చేను వైపుకి పోయింది. కానుగ కొమ్మకి ఉయ్యాల కట్టి బిడ్డని అందులో వేసింది. పాడి ఆవుని చెట్టుకి కట్టేసి గడ్డి  వేసింది. నాగలి కట్టి మడి దున్నుతూ దూరంగా వస్తున్న మనిషి చూసి సంబరపడింది సోనా. దుక్కి ఆపి యెదురెళ్ళింది. అన్నా అని వాటేసుకుని యేడ్చింది.  “ఇంత దూరం యెట్లా నడిస్తివి. మధ్యాహ్నానికి నేనే యింటికి వస్తును గందా”  అంది.  


“అబ్బ ఈ కొండ కింది తండా యింత దూరం  వుంటదనుకోలేదు చెల్లి. చెల్లెలు కొడుకని పొలాలు వున్నాయని యింత దూరం నిన్నిస్తాడనుకోలేదు బాపు.  ఈ అడివిలో పడి మూఢాచారాలలో మగ్గుతా వుంటివి. మీ పక్కింటి వాళ్ళు  రోజూ అమ్మకి ఫోన్ చేసి నీ కష్టాలు చెపుతావుండే.నువ్వేమో పెదవిప్పి చెప్పకపోతే యెట్టా. నీ వరస నచ్చలేదు చెల్లీ, నువ్వు వూ అంటే ఆడ్ని మూడు చెరువులు నీళ్ళు తాగిచ్చి నీ బిడ్డనీ నిన్ను యీడ నుండి తప్పించి తీసుకుని పోతాను” అన్నాడు మురళీ. 


“అన్నా, వేలు మనదే కన్ను  మనదే కదన్నా. రెండో పెళ్ళి చేసుకునే రోజు పెద్దమనుషుల ముందు వొప్పుకున్నా కదన్నా. పెద్దమ్మవారు నెత్తిమీద కూకుని అట్టా  వొప్పుకునేలా చేసింది. వొప్పుకునేదాకా యెన్ని దినాలు నస పెట్టినాడని. నిలుచున్నా కూకున్న పండున్నా ఆఖరికి గుడికి పోయినా పక్కపక్కనే చేరి రాగి  సంకడి లో చికెన్ ముక్కని తిన్నట్టు మెదడుని  నంజుకు తిన్నాడు.  ఉప్పలమ్మ కోపం వచ్చి ఇల్లు మొత్తాన్ని జీవాలని  వూడ్సి పెట్టేసింది ఒక్కసారే అమ్మ నాయనని కాటికి చేర్చాను వొంటి గాడిని అయిపోయాను. ఆ దోషం పోవాలంటే మాశిమ్మని పెండ్లాడాలని  లేకపోతే పుట్టబోయే బిడ్డకి కూడా కీడు జరుగుద్ది  అని గణాచారి చెప్పాడంట. అట్టా చెప్పి చెప్పి నాచేత వొప్పించాడు” అని తన బతుకు బుగ్గైన తీరుని అన్నతో దిగులుగా చెప్పింది. 


“రుక్కు ఆ గణాచారి చెల్లెలేనంట కదమ్మా, బావ కన్నా వయసులో  చాలా పెద్దదంటా కదా ! “


“ఏమో అన్నా అవన్నీ నాకంత తెల్వ” అంది తలదించుకుని. కాడి వొదిలేసి బిడ్డని చంక నెత్తుకుని పశువులని తోలుకుని యింటికి వచ్చారు అన్నా చెల్లెలు. 


బావమరిదిని చూసి  "అబ్బో ..లగ్గమయిన మూడేళ్లకి గాని బావని చూడను  కుదిరిందే నీకు" అన్నాడు భూక్యా   మంచం పై నుండి  లెగవకుండానే.  "చేసే వుజ్జోగం అట్టాంటిది బావా, చెల్లి పెళ్ళికే నేను  రాలేకపోతిని గందా, అయినా నువ్వేమన్నా కొత్తోడివా యేంటీ"  అన్నాడు  


"మా పెండ్లికి నువ్వు లేవు గందా, నీకేమి తెలస్తాది యిక్కడ యేంజరిగిందో!  మీ చెల్లిని  మీ మేనమామ కొడుక్కి చేయాలనే గందా లగ్గం పెట్టితిరి. ఆడేమో లగ్గం రోజుకి మొహం తప్పించే, యెక్కడో  చెట్టుకి ఉరేసుకుని చచ్చిపోయే  నీ చెల్లిని చేసుకోవడం యెందుకిష్టం లేకపోయిందో  యెవరికీ యెరుక. సమయానికి నేను అక్కడుండబట్టే మా అమ్మ పోరింది   దీన్ని చేసుకోమని. నీ చెల్లెలిది  యినపపాదం. ఎక్కడ పాదం పెడితే అక్కడ నాసినం అయిపోద్దని .  నీ చెల్లెల్ని లగ్గమాడేకే మాకు కష్టాలు వచ్చి పడ్డాయి. గత్తరొచ్చి మందంతా చచ్చినట్టే మా అమ్మ నాన్న చచ్చిపోయిరి" అన్నాడు.

 

“తాగేనీళ్ళు  బాగోక  డయేరియా వచ్చి చచ్చి పొతే  మధ్యలో నా చెల్లెలు యే౦ చేసింది బావా!, అయినా ఆ దినాల్లో మీ వూర్లో చాలా మంది చచ్చిపోయారు కందా, తండాల్లో వాళ్ళకు చెప్పినట్టు నాకు కథలు చెప్పకు.  ఈ కథలు చెప్పే నా చెల్లికి చాలా అన్యాయం చేసావు నువ్వు. ఆ వుసురు గొట్టుద్ది నీకు”. కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు మురళి.   

 

“చెల్లిని చూడటానికి వొచ్చావా, పంచాయితీ  పెట్టను వొచ్చావా, అంత కష్టమనిపిస్తే  నీ చెల్లిని తీసుకుని పో ..నా కొడుకుని మీకియ్య. ఏమేవ్, రుక్కు, ఆ సూది దారం,మెత్త తెచ్చి యిటు పడెయ్యి, ఈ సాతాను దాన్ని అన్న తోడ్కొని పోతాడంటా” అని కేకేసాసాడు. రుక్కు సోనాకి పెండ్లి  నాడిచ్చిన సూదులు దారాల పూసల డిబ్బీ, మెత్త తీసుకొచ్చి అరుగుమీద పెట్టి కృష్ణుడిని యెత్తుకుని లోపలికి పోయింది.


“వద్దన్నా, నా రాత యిట్టా అని సర్దుకుంట. బిడ్డని వొదిలి నేనుండలేను. నేను పోతే  నీళ్ళు మోసేదానికన్నా పనికొచ్చిది అని రుక్కుని వొప్పించి యింకోదాన్ని  లగ్గం  చేసుకుంటాడు. ఆడిబుద్ది అంతే.. మడిసైతే మనసుంటాది. అది లేనోడికి యెంత చెప్పినా వొకటే. వాదనాడక వూరుకో అన్నా” అని అన్న ను బతిమాలాడింది సోనా.

 

“ఆడికి రుక్కు మీద  కూడా మోజు తీరిపోయిందమ్మా . పోనీ వాడితో అప్పుడప్పుడైనా  సర్దుకోమ్మా,నీ  కష్టాలు తగ్గుతాయి” అన్నాడు  చెల్లి కళ్ళలోకి నేరుగా చూడకుండా.


“నిలువునా పేణమన్నా తీసుకుంటా కాని వాడికి వొగ్గి యింకా  బిడ్డలని కనీయలేనన్నా. ఆ తండ్లాట కూడా  నాకొద్దన్నా “ అంది కన్నీళ్ళు తుడుచుకుంటూ.


గుదికొయ్యకి దూడని   కట్టేసి  పాలు పిండుకోడానికి ఆవుని తిప్పుకున్నట్టు నా చెల్లి జీవితాన్నే నీ చుట్టూ  తిప్పుతున్నావ్ కదరా బద్మాష్ అని భూక్యాని  తిట్టుకున్నాడు. “నీ కోసమే ఈ ఫోన్ కొని తెచ్చా.రోజూ అమ్మ బాపుతో మాట్లాడు, నీకేం కష్టం అనిపించినా ఫోన్ చేయి.తెల్లారేసరికి నీ కాడ వుంటా, నేను పోయొస్తా చెల్లీ” అన్నాడు కళ్ళ నీళ్ళు దాచుకుంటూ. మళ్ళీ  తొందరగానే వొస్తానులే  అని వెనక్కి వెనక్కి తిరిగి చెల్లిని చూసుకుంటూ దారిబట్టి పోయాడు మురళి.   


అన్నట్టుగా పదిరోజులకల్లా రానే వచ్చాడు మురళి. తనతోపాటు  బోర్ వేసే వాళ్ళని కూడా తీసుకు వచ్చాడు.రెండు చోట్ల దించినా వందల అడుగుల లోతుకి పోయినా జల జాడ చిక్కక పోయేసరికి వుసూరుమన్నాడు. “ ఈడ భూదేవి  తల్లి కండ్లలో కూడా నీరింకి  పోయిందనుకుంటా అన్నా” అంది సోనా నవ్వుతూ. “నవ్వు ఎట్టా  వస్తందమ్మా నీకు” అన్నాడు విచారంగా 


"చదువుకున్న తెలివితేటలు చూపిత్తారు, ఆ మాత్రం బోర్లు వేయించడం మాకు తెలియక" అన్నాడు వెటకారంగా భూక్యా .  "పెద్ద కాలువకి నీళ్ళు వొదిలినంత కాలమూ తండాలో బాయిల్లో  నీళ్ళు వుంటాయి. ఎండల కాలంలోనే యిబ్బంది. గొడ్డు గోదా మందకి తాగేదానికి నీళ్ళు కావాలి,  ఆడది బిందె పుచ్చుకుని నీళ్ళు మోయాలి మగోడు పుల్లరి కాపు కాయాలి, కట్టెల మోపు మొయ్యాలి.మరి ఇంటో పని చేయడానికి మడిసి వుండాలి కదా అందుకే రుక్మి ని పెళ్ళి చేసుకున్నా అని అర్ధం చేసుకోవాలె ..మడి వుంటే మాత్రం మాన్యాలు పండటానికి నీళ్ళు వుండొద్దు" అన్నాడు భూక్యా   తాను యేమీ తప్పు చేయనట్టు తననితాను సమర్ధించుకుంటూనూ. 

 

చెల్లి తలపై చెయ్యేసి "ఆ దేవుడే నిన్ను నీ బిడ్డని చల్లగా చూడాలి" అంటూ ఆశ్వీరదించినట్లు గొణిగి కళ్ళు తుడుచుకుంటూ బోర్ లారీ యెక్కేసి పోయాడు  మురళి..  

 

మిట్ట మధ్యాహ్నపు యెండ నిప్పులు చెరుగుతుంది.టింగ్  టింగ్ మంటూ చేతి పంపు  కొట్టినప్పటి చప్పుడు. తొంబై యెనిమిది తొంబై తొమ్మిది వంద అంకెలు లెక్కబెట్టుకుంటూ అలుపొచ్చి ఆగి ధార క్రింద బెట్టిన బిందె లోకి తొంగి చూసిన సోనా  వూసూరుమని నిట్టూర్చి దేవుడా, యీ బిందె నిండటానికి చేతులు నడుము పడిపోయేటట్టు యింకెన్ని సార్లు పంపు కొట్టాలో అని అనుకుంటూ  విచార పడుతుండగా ..


 “నిద్ర లేచినదగ్గర్నుండి ఆ పంపుని పట్టుకుని యేలాడతానే వుంటావ్ కదే సోనాబాయీ.. ఆ పంపన్నా విరిగింది కానీ నీ చేతులు యిరగడం లేదు. ఏం మోత, దిక్కుమాలిన మోత

తండా లో నుండి  యిక్కడిదాకా చీమలబారులా  బిందె లేసుకుని నీళ్ళకి తిరుగుతారు గానీ  పంచాయితీ వాళ్ళని  ట్యాంక్ లతో నీళ్ళు పోపియ్యమని అడగరు” అని గొణుక్కు౦టూ వచ్చి నిలబడింది లక్ష్మి. 


“దిగుడు బాయిలో ఇయ్యాల నీళ్ళే వూరడంలేదమ్మా, ఊరినా బురద బురదగా వుండాయి. ఆటి కోసమే కొట్టుకుంటా వుండారు. మీరైతే యేమీ అనరని యిటొచ్చా”  వేడుకోలుగా చూస్తూ చెప్పుకుంది.  


" సరేలే, ఇయ్యాలటికి  మోసింది చాల్లే, నీళ్ళన్నీ మీరే మోసుకుపోతే మేమైపోవాలి. లక్ష రూపాయలు పెడితే కానీ నీటి  చుక్క తగలడం లేదు.  మమ్మల్ని వుద్దరీయడానికి ఆడ నుంచి ఈడ దాకా వస్తారు " అని నాలుగు మాటలరాళ్ళనేసి గేటు దగ్గరే నిలబడింది. సోనా బిందెలెత్తుకుని బయటకి దాటితే గేటు తాళం వేసుకోవడానికి అన్నట్టు. వెనక చూపులు సూదులు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటుండగా బిందెలనూ కేనులని నింపుకుని పైకెత్తుకుంటుండగా    

  

“ఎలక్షన్లు వచినప్పుడన్నా గట్టిగా పట్టుబట్టి  తండాలో లోతు బోర్లు వేసి వాటర్ ట్యాంకు కట్టించమని అడగొచ్చు కదా,  రెండు వందల ఓట్లు వుండాయి. మీ ఆయన వార్డ్ మెంబర్ కూడా, అడగడానికి   కూడా నోర్లు అరువియ్యాలి మీకు” అంటూ విసుక్కుంది.  లక్ష్మి అమ్మగారు చెప్పింది నిజమే, లేకపోతే   నీళ్ళు మోయడానికే   యింటికొక మనిషి అవసరపడ తన్నారనే సాకు చెప్పి రెండో పెళ్ళాన్ని రాజమార్గంలో తెచ్చుకుంటారు తండాలో మగవాళ్ళు అని మనసులో  అనుకుంది సోనా.


తల మీద రెండు బిందెలు రెండు చేతుల్లో రెండు  పదిలీటర్ల ప్లాస్టిక్ కేన్ లు పుచ్చుకుని తండా వైపు నడక సాగించింది సోనా. తలలోంచి చెమట ధారగా జారుతూ ముక్కు కొసనుండి క్రిందికి జారిపడుతూ కొన్ని చుక్కలు   పెదాలపై పడుతూ . అప్రయత్నంగా పెదాలని తడుపుకుని ఉప్పగా తగిలిన చెమట చుక్కలని ఉఫ్ అని వూదిపడేసి గబా గబా  నడక సాగించింది. 


మధ్యలో మోటారు బైకు మీద పోతున్న కాలేజీలో చదువుకునే  తండా పిల్లగాడు. టీవి లో కనబడే దృశ్యం గుర్తుకొచ్చింది.  గతుకుల రోడ్డు పై కూడా కుండ క్రింద పడకుండా చుక్క నీళ్ళు చిందకుండా బండి పై సవారీ చేయుడు సులువేమో కానీ నెత్తి మండ కుండా కాలు కాలకుండా చుక్క నీరు యింటికి వచ్చేది కల్ల.. ఈ సారి అన్న వచ్చినప్పుడు  మోటర్ సైకిల్ బండన్నా కొనీయమని అడగాల, ఈ నీళ్ళ మోసుడు తప్పడానికి.  అప్పుడు దూరంగా పోయి అయినా  బండికి కట్టుకుని నీళ్ళు మోసుకో వచ్చు  అనుకుంది.  


వేప  చెట్టుకి కట్టేసిన పాడి ఆవు  దూరంగా వస్తున్న సోనా ని  చూసి తలని విదిలిస్తూ లేచి నిలబడి మెడలో పలుపుతాడు లాక్కుంటుంది. ఇంటి పక్కనే చిన్న పాకలో కట్టేసిన దూడ  కూడా సోనా  వైపు ఆశగా చూసింది. ఆ పాక యెదురుగా యెండలో నేల మీది కూర్చుని గిన్నెలో వున్న అన్నాన్ని రెండు వేళ్ళతో వొక్కో మెతుకుని తీసుకుని తింటూ మధ్య మధ్యలో చుట్టూ చేరిన కోడిపిల్లలకి  మెతుకులు  విసురుతూ చిద్విలాసంగా నవ్వుకుంటున్న సోనా   కొడుకు  కృష్ణుడు.  తల్లిని చూసి అమ్మా భో భో లు భో భో లు   అన్నాడు.  తల్లి కోడి   కృష్ణుడి యెదురుగా నిలబడి యెట్టాగొట్టా బెదరగొట్టి గిన్నెలో వున్న అన్నాన్ని యెగజిమ్మి పిల్లలకి పెట్టాలని కాసుకు కూర్చున్నట్టుంది.  


దూరంనుండే ..ఉష్ ఉష్ అంటూ కోడిని పిల్లలని అదిలించి..చేతుల్లో ఉన్న నీళ్ళ కేన్ లని అరుగు మీద పెట్టి గుమ్మం ముందు నిలబడింది సోనా. రుక్కు  వచ్చి నెత్తి మీద వున్న బిందెల్ని  దింపడానికి సాయపడుతుందేమోనని. కొంచెం సేపు ఎదురు చూసింది కూడా. దర్జాగా  పరుపు మంచంపై పడుకుని టీ వి సీరియల్ లో మునిగిపోయిన ఆమె సోనా  ని చూడనట్లు నటించింది. మోకాళ్ళు  వొంచి రెండు  బిందెలని జాగ్రత్తగా కిందికి దించి వూపిరి పీల్చుకుంటూ తల మీద చుట్టగా పెట్టుకున్న తుండుని విదుల్చుకుంటూ వెళ్ళి   యెండలో కూర్చున్న కొడుకుని గబుక్కున యెత్తుకుని చంకలో కూర్చో బెట్టుకుని చెట్టు కిందకి పోయింది. తుండుతో ముఖం తుడుచుకోబోతుండగా కృష్ణుడు కింది పెదవిని ముందుకు నెట్టి.. ఫ్ఫ్ ట్రూ  ప్ఫ్ ట్రూ  అమ్మా అన్నాడు శబ్దం చేస్తూ  .


కుండ  మూతపై బోర్లించిన గ్లాసు తీసుకుని మూత తీసి నీళ్ళు  ముంచబోయి ఖాళీగా కనబడిన కుండని చూసి నివ్వెరపోయింది సోనా. గుమ్మలో నిలబడిన రుక్కు  వొళ్ళు చిటబుడతా వుంటే ఆగలేక మంచి నీళ్ళ కుండలో నీళ్ళు పోసుకున్నా. మరి యే౦ చేయను గాబులో చుక్క నీళ్ళు లేకపోయే అంది.  నడిపెండలో మళ్ళీ బిందెలేసుకుని రెండు మైళ్ళు నడిచిపోవాలి గాబోల్సు మనసులో  అనుకుంటూ  అప్పుడే దించిన బిందెలో నుండి నీళ్ళు ముంచుకొచ్చి క్రష్ణుడుకి తాగించబోతుంటే కళ్ళ నుంచి రెండు చుక్కలు  గ్లాసులోకి రాలి పడి ఆ నీళ్ళలో కలిసిపోయాయి. ఏ నీళ్ళు అయితేనేం రంగు ఒకటేగా అనుకుంది సోనా. 

15, ఫిబ్రవరి 2019, శుక్రవారం

సామాన్యుడి వ్యాఖ్య.

పొద్దునే పేపర్ చదువుతూ నేను పైకి కోపం కక్కుతున్నా కాఫీ పొగలు కక్కినట్టు. 

నీ అమ్మ కడుపు మాడ.. 
అడగండి అంటున్నావ్ ! అంటే యిస్తాననేగా  అర్ధం. ఎవరి కొండలు అరగదీద్దామని నువ్వు కొండలు పోగేయడానికి. పోయినసారి చేసిన అప్పులే తీరలేదు. ఈసారి పోటీ చెయ్యం అని చేతులెత్తేస్తుంటే .. వాళ్ళని చూసి జాలిపడి నిన్ను తిట్టాలనిపిస్తుంది. సమిధలవడం   సోపానాలుగా మారడం గొర్రెలు చేసేపని. వాటికి మేత దొరుకుతుందనే ఆశ ఉంటే తప్ప.  

నారాయణమ్మ : ఎవరినమ్మా గొర్రెలు అంటున్నావ్. గొర్రెలకు తిరిగి మేయడమీ  తెలుసు. దొడ్లో వేసి బంగారం పెట్టినా తినవు. నువ్వట్టా అంటే మా చెడ్డ కోపం. మాట ఎనక్కి తీసుకోవాలి నువ్వు అంది.  

గొర్రెలంటే తెగ కోపం వచ్చేస్తుంది మనుషులకి. రావాల్లే   ఆమాత్రం.

(ఓటుకు ఐదు వేలు అడగండి అన్నమాటకు స్పందన )

****************

దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా

గురజాడ అప్పారావు గారు ఈ గేయం వ్రాసేనాటికి ఈ దేశంలో మతవిద్వేషాలు లేవు. కానీ ఈనాడు ఆ గేయరచయితను కులదృష్టితో చూస్తున్న సూడో మేధావులను చూస్తే అసహ్యాన్ని మించి వేరే ఏదో కల్గుతుంది. కాశ్మీర్ కాశీరులదే. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. దానిని కాపాడుకోవడానికి దేశం ఎంతో ఖర్చు పెడుతుంది. ముస్లిమ్స్ ఎక్కువున్నారు కాబట్టి అది పాకిస్థాన్ కి సంబంధించింది అయిపోదు. శతాబ్దాల చరిత్ర తవ్వి చూస్తే  కాశ్మీర్ ఎవరిదో అర్ధమవుతుంది. కాశ్మీర్ ని విడగొట్టి ఇచ్చినంత మాత్రాన ఈ దేశంలో ఉగ్రవాద దాడులు జరగకుండా ఆగుతాయా అని ఎవరైనా నమ్మకంగా చెప్పగలరా ? ఈ దేశంలోకి ఎవెరెవరు ఎక్కడినుండి వచ్చినా ఇప్పుడు ఉన్నవారందరూ భారతీయులు.

ఒక ఉదాహరణ ఏమిటంటే ఒక కుటుంబంలో  ఒక వ్యక్తి దేశద్రోహం మొదలు పెడితే ఆ కుటుంబం మొత్తం విచారణ ఎదుర్కోవలసి రావడం చట్టపరమైన విచారణ. కాశ్మీర్ లో జరుగుతుంది అదే.

మనం వంటింట్లో చాకు తీసినప్పుడల్లా ఇంట్లో ఎవరినో ఒకరిని పొడవడానికి కాదని పచ్చి మిరపకాయని చీల్చి గింజలు రాల్చి  చేసుకునే వంటల్లో వేసుకోవడానికని కూడా అర్ధం చేసుకోవాలి. సాత్విక ఆహారం తినడం కూడా  మన హక్కు కాదంటారా?


(కాశ్మీర్ ప్రజలను అనుమానించి హింసిస్తుంది రాజ్యం  అందుకే ఉగ్రవాదం పెరుగుతుంది అనే మేధావుల మాటలకు )

ఒక ఉగ్రవాది దాడికి 43 మంది సైనికులు మరణం నేపథ్యంలో ..కొందరి  మాటలకు నా స్పందన

పొగలు గ్రక్కడం సామాన్యుడికి వచ్చు. ఇది సామాన్యుడి వ్యాఖ్య. 

13, ఫిబ్రవరి 2019, బుధవారం

బియాండ్ మి


అదే సూర్యుడు - అదే నేను - కాఫీ సమయం
-beyond me
మీరందరూ నాలాగే స్పందిస్తారు. నేను చెప్పాల్సిందంతా చెప్పేస్తారు.అందుకే ఆఖరిదాకా వేచి వుంటాను. మీరు చెప్పనిదేమైనా వుంటే అప్పుడు నా మనసును ఆలోచనలను అక్కడ వొంపేస్తాను. ఆగి చూస్తూ వుండటమే నా మౌనానికి భాష్యం. వరుసలో ఆఖరిగా నిలబడటమే నాకిష్టం. చోటు దొరుకుతుందా లేదా అన్న చింత నాకనవసరం.
మొదటి స్థానం కావాలని ఉద్వేగంతో క్షణక్షణం చచ్చేవారు ఖాళీ దొరుకుతుందా లేదా అని ముందుకు తోసేవారు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయ్యేవారు ముందుకు వెళ్ళడానికి జనాన్ని మోచేతులతో వెనక్కి నెట్టేవాళ్ళున్న లోకాన్ని చూస్తూ లోలోపల నవ్వుకుంటూ ..
మనకెందుకురా బాబూ... పరులతో పోటీ పౌరుషాల దివిటీ?
మన చేతిలో చిరుదీపం చాలదూ మన నడక సవ్యంగా సాగడానికి. -beyond me

11, ఫిబ్రవరి 2019, సోమవారం

తపన

ఈ కథలతో చచ్చే చావొచ్చి పడిందంటే నమ్మండి  :) అయినా బుద్ధి రాదు.


"దుఃఖపు రంగు" కథ వ్రాసి  ఒక సంవత్సరం పైన. కథకి టైటిల్ సమంజసంగా ఉందా లేదోనని కొన్నాళ్ళు సంశయం. ఒక పేరున్న పత్రికకు పంపాను . రెండు నెలలకు మీ కథ ప్రచురణకు ఎంపిక కాలేదు అన్నారు. కొద్దిగా నిరుత్సాహం. 



మరలా ఒక మాసపత్రిక వారిని  కథను పంపమంటారా అని అడిగి వారు పంపమంటే కథ పంపాను. ఆరు నెలలు కాలంలో కథ పంపిన నాలుగుమాసాలు దాటిన దగ్గర్నుండి  రెండు నెలల కాలంలో ఆ కథ ఎంపిక సంగతి తెలియజేయమని నాలుగుసార్లు మెయిల్ పంపాను. ఆఖరికి వారు సమాధానం చెప్పారు. కథలు వేయకపోవడం వల్ల మీ కథ ప్రచురించలేకపోయామనీ  కథ మాత్రం చాలా బాగుంది అని ప్రశంసించారు. వారికి ధన్యవాదాలు చెప్పి (కథ బాగుందని చెప్పి నాలో ఉత్సాహం నింపినందుకు) మరో పత్రికకు పంపాను. రెండు నెలలు ఓపికగా చూసి కథ పరిస్థితి తెలుసుకున్నాను, అదెక్కడో పాతాళంలో పడిపోయిన దానిని వెదికి ఈ కథ మరీ చిన్నదిగా ఉందని పెద్దగా వున్న మరో కథ పంపమని అంటే ఇంకో కథ పంపాను. (అది అర్హత పొందలేదు). 


సరే మూడు పత్రికలకు పంపి తిరిగొచ్చిన పెళ్ళికూతురుని ఇంకో పత్రికకు పంపాను. రెండు వారాలకు కథ ఎంపికైంది. త్వరలో ప్రచురిస్తున్నాం అని సమాచారం పంపారు. అంటే నాలుగు గుమ్మాలు ఎక్కితే గాని ఒక గుమ్మం లో నుండి ప్రపంచంలో పడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి పట్టు వదలని విక్రమార్కుడిలా మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాల్సిందే. 


కథ మొదటి పత్రికకు పంపినప్పుడు ఏదైతే పంపానో ఇప్పటికీ  అదే కథ. ఒక్క చిన్న సవరణ లేకుండా ఏర్పూ కూర్పు చేయబడని  కథ " దుఃఖపు రంగు " 


అది ప్రచురణలోకి రావడానికి ఇంత కథ  అంత సహనం వుంది. కాబట్టి కొత్త కథకులు తెలుసుకోవాల్సింది యేమిటంటే... కథ తిరిగొచ్చిందని నిరాశ పడవద్దు. గతంలో పిడికిట్లో పూలు అనే కథ వ్రాసిన తర్వాత రెండు సంవత్సరాలు చాలా పత్రికల గుమ్మం ఎక్కి దిగి వచ్చింది. ఆఖరికి ఆ కథ "సారంగ" లో ప్రచురితమైంది. ఇంకో విశేషం కూడా సాధించింది ఈ  కథ. ఆ సంగతి తర్వాత పంచుకుంటాను. 


ఇదండీ.. కథలు వ్రాసి అవి ప్రచురణ లోకి రాకపోతే కలిగే నిరాశ మనోవేదన. ఇంత అనుకుంటానా .. కథ రాయకపోతే ఏమైంది అని మెదలకుండా కూర్చోను. మళ్ళీ ఎప్పుడో రాయడం మొదలెట్టి మళ్ళీ ఇలాంటి పాట్లు పడుతూ  శిరోభారం  మోస్తూ వుంటాను.  ఇదంతా పేరాశకి  మాత్రమే కాదు  ఎమోషన్స్ ఫీలింగ్స్ వెళ్ళగ్రక్కుకోవడానికి కూడా ! నా చుట్టూ ఉన్నవాళ్ళ జీవితాలను చూస్తూ కొంత అవగాహనతో ఆవేశంతో ఆవేదనతో అక్షరాల్లోకి వొంపేస్తూ వుంటాను.  రాయడమంటే అదొక తపన. అంతే ! ఆ రాతలు చదివి మెచ్చుకుంటే అదో  తృప్తి. 


త్వరలో "దుఃఖపు రంగు " కథ  వస్తుంది. అప్పుడు చదవాలండోయ్ మరి.




8, ఫిబ్రవరి 2019, శుక్రవారం

పల్లెటూర్లే పట్టుగొమ్మలు

పల్లెటూర్లే పట్టుగొమ్మలు (వాస్తవ చిత్రం )
ఉదయాన్నే ఓ పల్లెటూరి మధ్య నుండి ప్రయాణిస్తూ ఊరిని ఆసక్తిగా పరిశీలిస్తున్నాడు రాజేష్
రోడ్డు వారగా కొద్ది కొద్ది దూరంలో నిలబెట్టబడిన ముగ్గురి నాయకుల విగ్రహాలు. వాటి చుట్టూ కట్టిన చప్టాలపై అక్కడ కొందరు ఇక్కడ కొందరు కూర్చుని వార్తాపత్రికలు చదువుకుంటూ చర్చించుకుంటూ కనిపించారు. మళ్ళీ మద్యాహ్నం రెండున్నర గంటలపుడు తిరిగివస్తున్నప్పుడు కొంచెం యెక్కువమంది మనషులు మళ్ళీ అదే స్థితిలో యెదుటి వారిని క్రోధంగా చూస్తూ సీరియస్ గా చర్చలు జరుపుకుంటూ కనబడ్డారు.
ప్రతి ఇంట్లో నుండి టి వి ల హోరు.
మరి కొన్నాళ్ళకు అతను అదే దారిలో అదే సమయాలకు వెళ్ళడం రావడం. మరొక నెల తర్వాత అలాగే వెళ్లడం రావడం ఎప్పుడెళ్ళినా అదే మాదిరిగా మనుషులు పేపర్లు చర్చలు.
డ్రైవర్ అన్నాడిలా.. "ఏంటి సార్.. వీళ్ళంతా పేపర్ చదవడం నాయకుల కోసం పోట్లాడుకోవడమేనా ".
"చేయడానికి పని పాటా బరువు బాధ్యతలు లేకుండా వుండేవాళ్ళు అంతకన్నా ఏం చేస్తారు" అన్నాడు రాజేష్:
"పనులు లేకుండా చేయడం తేలిక.విగ్రహాలు లేకుండా చేయడం కష్టం సార్ "అన్నాడు డ్రైవర్ .
"మరి అభివృద్ధి అంటే యిదే "అని రాజేష్ అంటే
"నాయకుల అభివృద్ధి విగ్రహాల అభివృద్ధి. ఇదే ఇదే.. అసలైన దేశ అభివృద్ధి. దేశ అభివృద్ధికి పల్లెటూర్లే పట్టుగొమ్మలు" అన్నాడు పెద్దగా చదువుకోని డ్రైవర్.

6, ఫిబ్రవరి 2019, బుధవారం

అవార్డ్



అవార్డ్

అతనిప్పుడు డాక్టర్ అయ్యాడు తెలుసా?
అదెప్పుడు చదివాడు
మనుషులను బాగా చదివాడు
ముందు సూఫీ కవిత్వం వ్రాసాడు అవార్డ్లు వచ్చాయి.
అనాధాశ్రమం స్థాపించాడు గేయాలు వ్రాసాడు గుండెలను కదిలించాడు.
తర్వాత పుట్ పాత్ మీద అనాధలకు బిర్యానీ తినిపించాడు. ఇవ్వన్నీ చూసి ధనవంతులు విరాళాలిచ్చారు సంస్థలు అవార్డులిచ్చాయి. అందులో ఈ డాక్టర్ అవార్డు ఒకటి.
వీటన్నింటికి ముందు అసలతనేం చేసేవాడు?
ఫోటోగ్రాఫర్. అతని ప్రయాణంలో కెమెరాని ఎప్పుడూ మర్చిపోలేదు. వార్తా పత్రికను ఫేస్ బుక్ ను కూడా గుర్తుంచుకున్నాడు అదే అతని విజయ రహస్యం
సరేమరి. హృదయాన్ని ఫోటో తీసి చూపిస్తే దేవుడు అనే అవార్డ్ వస్తుంది. ముందు ఆ పని చేయమని చెప్పు.
(చిన్న కథ ) 

4, ఫిబ్రవరి 2019, సోమవారం

ఏనుగు అంబారీ



అమ్మా! యెలా వున్నావ్, నీరసం తగ్గిందా, మందులు వేసుకుంటున్నావా, నీ అకౌంట్ కి మనీ ట్రాన్సఫర్ చేసాను చూడు.

ఇప్పుడే మోటెల్  నుండి నడిచి వస్తుంటే… యీ  ఆకురాలు కాలంలో  వీధులన్నీ మన సంక్రాంతికి ప్రతి వీథిలో  రంగులలంకరించిన ముగ్గులు గాలికి చెదిరినట్లు కనబడుతున్నాయి.  చెట్లన్నీ  మౌనంగా ధ్యానం చేసుకుంటూ మనలోకి మనం చూసుకుని రివ్యూ రాసుకోమన్నట్టు  చెపుతున్నాయి. సెల్ఫ్ ఫీడ్ బ్యాక్ అవసరం కదా! ఫోన్ లో మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పలేను నీకు. అందుకే యీ ఉత్తరం రాస్తూ ..

నేనిక్కడ లెర్న్ కమ్ ఎర్నెర్ ప్రాసెస్ లో  చాలా నేర్చుకున్నాను. డబ్బు సంపాదించలేకపోయినా చాలా అనుభవం సంపాదించాను.   ప్రపంచమే వొక పెద్ద పాఠశాల. ఇల్లు నేర్పనిది ప్రపంచం నేర్పుతుంది అంటారుగా, నిజమే.   ప్రపంచం నుండి యేం తీసుకోవాలన్నది మాత్రం  యింటి సంస్కారం నేర్పుతుంది. వుద్యోగం లేకపోయేటప్పటికీ మొత్తంగా నేనిక్కడే ఫెయిల్ అయినట్టున్నాను.

నేర్వవలసినది నేర్వకుండా నేర్చినది మర్చిపోకుండా అసలెన్ని తిప్పలో తెలుసా ! ఎన్ని కథలో , ఇదిగో మళ్ళీ రెండవ థ రాయకుండా ధ వ్రాసావని వూరికే గొడవచేయకు. నువ్వు నేర్పినవన్నీ గాలిలోకి ఎగిరే ముందే గాలికొదిలేసి వచ్చేసాను. తెలుగులో రాయక మూడేళ్ళపోయింది. మూడు ముళ్ళు యెప్పుడేయించుకుంటావ్   అంటావ్. నువ్వేం కంగారు పడకు. అయితే గియితే యిక్కడ నల్ల జాతీయుడిని లవ్వాడతాను కానీ  ఇండియన్ ని ప్రేమించను. పాపం నల్ల జాతి వాళ్ళు వివక్ష కి  గురైనవాళ్ళని నాకు బాగా జాలి యేర్పడింది. మనవాడినే ప్రేమించి లేదా ఒప్పందం కుదుర్చుకుని నీ చేత లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళి చేయించను. ఆడంబరం కోసం అభద్రతలో యెంతో కష్టపడి సంపాదించుకున్న  సొమ్ముకి కాళ్ళొచ్చి పోయేటట్లు అస్సలు చేయను. నేను అంత త్యాగాలు  చేయలేనమ్మా, అనవసరంగా కులమూ కులమూ  అని వూరికే  లబ లబలాడి పోకు. అన్న ఎన్ఠీఆర్ పూనుతాడు నాకు.

సరేలే, యింకేంటి సంగతులు? ఏమీ తోచడం లేదు అనుకుంటూ ఇంకా మిషన్ ని అరగదీస్తూనే వున్నావా ? మన ఇంటిప్రక్కన ఆ కిరస్తానీ పిల్ల వుండేది చూడు, అదేనమ్మా  శరీరాన్ని బస్తాలో వేసి కుదేసినట్లు గున గునలాడుతూ తిరుగుతూ వుంటుంది చూడు ఆ పిల్ల. (బాడీ షేమింగ్ చేయకూడదు తప్పు అంటావని నాకు తెలుసులే)రెండు నెలలకొకసారి ఆఖరి ఇంచ్ వరకూ కుట్లు వేయమని వీలవకపోతే క్లాత్ ఎటాచ్ చేసి ప్యాచ్ వర్క్ అందాలు సృష్టించమని నిన్ను వూపిరాడనివ్వదు  కదా, ఆ అమ్మాయి యింకా వస్తుందా ?  ఎందుకమ్మా ఆమెకి  నిజం చెప్పలేవు నువ్వు ? శరీరాలు పెరిగినంత యీజీగా బాడీ ఫిట్టింగ్ కుట్టడం  యీజీ కాదని. పైగా ఆమె  వెళుతూ వెళుతూ యేమన్నదో తెలుసా? సిటీలో టైలర్ కి యివ్వకుండా నీతో బ్లౌజులు కుట్టించుకోవడం అంటే  పరోక్షంగా మనకి సహాయం చేయడమంటా. వెళుతూ వెళుతూ ఆ మాట నేను వినేటట్లు  అని వెళ్ళింది. నువ్వు వినలేదులే, బాధపడతావని నేను చెప్పలేదు. వాళ్ళ బడ్జెట్ లో వాళ్ళు సర్దుకోవడం చేతకాక  దాన్ని కప్పెట్టుకోవడానికి ఎదుటివాళ్ళ మీద పడి  యేడుస్తారు. "వారానికి నాలుగుసార్లు బిర్యానీలు  రోజుకు రెండు కోక్ లు తాగి గేదెల్లా పడుకుంటే వొళ్ళు పెరుగుద్దా తరుగుద్దా. పోవమ్మా ఫో. పోయి సిటీలో ఆ మాస్టర్ టైలర్ దగ్గరే కుట్టించుకో. నీకు వాళ్ళే కరక్ట్ "అని సమాధానమిచ్చా ఆమెకు.

ఎంత ఓర్పమ్మా నీకు ? కొలతలకు యిచ్చిన బట్టలకి ఇంత మురికి వుందేమిటో.. ఆ కంపు యేమిటో అంటూ  వాటిని అంటుకోవడం ఇష్టం లేకపోయినా ఆ అయిష్టాన్ని దాచుకుని వాళ్ళిచ్చే వందరూపాయల కుట్టుకూలి కోసం బ్లవుజులు కుట్టిన నీ పరిస్థితి లాంటిదే  యిప్పుడిక్కడ నా పరిస్థితి కూడా. అసలా అలగా జాతోళ్ళ  బట్టలు  నిన్నెవరు కుట్టమన్నారు అంత అయిష్టంగా  వుంటే కుట్టడం మానేయ్, మనకసలకి అంత ఖర్మేమి  పట్టిందట? మనం కూటికి పేదైతే నేమి కులానికి పేద కాదన్న సంగతి గుర్తుంచుకో  అనే నాన్న మాటలు గుర్తుకొచ్చి  మరీ వెగటుబుట్టుద్ది. నిజం చెప్పు, నాన్నది టూమచ్ యెస్కేపిజం కదూ…

డబ్బు లేకపోయినా కాస్త అందంగా వుండి  బాగా చదువుకుంటున్న నన్ను చూసి పక్కింటివాళ్ళు ఈర్ష్య పడటం వాళ్ళ ఈర్ష్యని చూసి నేను చికాకుని అణుచుకుంటూ నిజాలు మాట్లాడితే భరించలేరు మరి.  వాళ్ళది  వుడుకుమోత్తనం అయినప్పుడు  నాది గండ్రతనం యెందుకు కాకూడదు చెప్పసలు?.వాళ్ళకు పడీపడీ చదవాల్సిన పనిలేదు. బోలెడన్ని మార్కుల పనీ లేదు. ఏ రోజన్నా  సూర్యోదయం అంటే యెఱుగుదురా అనడిగితే వారికి కోపం వస్తుంది. అరకొర చదువుతోనే  ఠక్కునెళ్ళి వుద్యోగంలో కూర్చుంటారు. రేసులో ప్రతిభ వుండి కూడా వెనుకబడిన మనలను చూసి నవ్వుకుంటారు. ఏదో విషయం చెపుదామని యెక్కడెక్కడికో వెళ్ళిపోయా కదా! అన్నట్టు ఆ కిరస్తానీ పిల్ల వాళ్ళ అన్నయ్య కూడా నాకు దగ్గరలోనే వుంటున్నాడు. మంచి జీతమే వస్తుంది. వాడి వొంకర తనం యేమీ తగ్గలేదు. డాలర్ల బలుపు చూసి యింకా పెరిగింది కూడా.  కల్యాణీ బిర్యానీ అని ముక్కుమూసుకునే మనం ఇక్కడ ప్రక్కనోడు తింటుంటే అయిష్టతని కూడా లోలోపల అణిచిపెట్టి ప్లెసెంట్ ని పెదాలకి అద్దుకుంటాం. ఇదిగో యిలాగే యితరుల రుచులను అభిరుచులను అభిప్రాయాలను గౌరవించాలని నేర్చుకుంటామిక్కడ.అది నాకు చాలా నచ్చింది కూడా.

నాన్న లాగా తిని కూర్చోకుండా డెబ్భై ఏళ్ళు వచ్చినా  చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వృద్ధ బామ్మలు అడుగడునా కనబడతారు. ముఖ సౌందర్యానికి వేలకు వేలు తగలేస్తారు. ఎక్కడ చూసినా అందంగా వుండాలని కనబడాలని శరీరాన్ని హింసించుకునే నారీ మణులు కనబడతారు. అంతా వ్యాపార సంస్కృతే కదమ్మా, వూరికే కొంటూనే ఉంటారు.  ఇక్కడ బ్యూటీ  పార్లర్ కి వెళ్ళకపోతే మొగుళ్ళు వదిలేస్తారట.మా నల్ల ఫ్రెండ్ చెప్పాడులే. ర్యాండమ్ థాట్స్ మావిద్దరివి. మా దేశంలో పెద్ద పెద్ద కారణాలకు కూడా మొగుళ్ళను పెళ్ళాలు వదిలేయరు అన్నాను. ఆ కారణాలు యేమిటేమిటీ చెప్పమని ప్రాణం తీస్తాడు. నీ కథ చెప్పాను. ముఖం విచారంగా పెట్టి మీ నాన్నపై ఆమెకెందుకు అంత జాలి అని అడిగాడు. నేను పడి పడి నవ్వాననుకో.

అన్నట్టు   అసలిక్కడ కులం సంగతి చెప్పకుండా బతకలేము. దేశీవాళ్ళు  మనిషి పరిచయమవగానే  కుక్కలు నేరస్తుడిని పసి కట్టినట్లు  గుచ్చి గుచ్చి నానా రకాల ప్రశ్నలు వేసి కూపీలు తీసి ఆఖరికి  కులం కంపు బయట పెట్టేసుకుంటారు.కూటికి పేదోమో  కానీ కులానికి పేద కాదు అనే మన స్టాక్ డైలాగ్  యిక్కడ పనికిరాదు. సూది గుచ్చుకున్న నొప్పి తెలియకుండా విషభావాలు మెదడులోకి ప్రవేశపెట్టడం అనే విద్య బాగా తెలిసినవాళ్ళు మనవాళ్లే అంటే నమ్మవు నువ్వు. అలా  యెందుకుంటారులే అంటావ్. కుక్కలకిచ్చిన ఇంపార్టెన్స్ తోటి మనిషికివ్వరు. పక్కింటివాళ్ళ కుక్కను కూడా చూసి నవ్వరు ముఖం చిట్లించరు.అంతా గుంభనమే.

ప్రపంచంలో  ప్రతిదీ మార్కెట్. మార్కెట్ లో యేవైనా అమ్మబడతాయి.అందుకు సాక్ష్యంగా ఇక్కడ యోగా లెగ్గిన్స్ భలే అమ్ముడు పోతున్నాయి. ఆఖరికి మనసు పడే బాధ కూడా  శ్రమ లాగే. డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఆ డిగ్నిటీనీ నువ్వు  గడప దాటకుండా కుట్టు మిషన్ లో వెతుక్కుంటే నేను విమానమెక్కి యింకో మూల  ఒక మోటెల్ లో స్టివార్డ్ గా పని చేస్తున్నా.  ఉష్ష్.. ఎవరికి చెప్పకు. నాన్నకి కూడా చెప్పవని నాకు తెలుసులే. పరువు తక్కువ కదూ. పాతికేళ్ళ తేడాతో ఎన్ని మార్పులో చూసావు కదమ్మా,భాష మారింది భావం మారింది ఆహారం మారింది. నేను మారను అంటే కుదరదమ్మా యిక్కడ.   మెడ  మీద కత్తి పెట్టుకుని మరీ మారాలి.పొరుగు దేశంలో కూర్చుని నేను నాదేశం అంటూ దేశభక్తి అంటే కుదరదమ్మా ఇప్పుడు మానవుడు విశ్వ మానవుడు.గీతలు గీసుకోవడం అస్సలు కుదరదు. కాకపోతే గీతలు దాటడానికి రూల్స్ రాత కోతలు ఉంటాయి  నీకెంతో ఇష్టమైన రాఖీ కూతురు తీసిన రాజీ  సినిమాలో ఆయ్ వతన్ పాట విను. దేశమును ప్రేమించుమన్నా గేయాన్ని గుర్తుకు తెస్తుంది. రెండూ యే దేశం వాళ్ళైనా పాడుకోగల్గిన గీతాలు. నాదిపుడు ఠాగూర్ కి వున్నట్టు  విశ్వ ప్రేమ.

ఈ మధ్య యేమీ తోచక మాట్లాడేవాళ్ళు లేక  పాకిస్తానీ వాళ్ళ “హమ్ సఫర్ “ సీరియల్  సిరీస్ చూసాను. ఆ అమ్మాయి కిజార్ యెంత గట్టి అమ్మాయి తెలుసా. రేపు నీకేదైనా అయితే నేను ఒంటరిదాన్ని అయిపోతే  జీవితంలో ఒడిదుడుకులొస్తే ఆ అమ్మాయంత   గట్టిగా నిలబడాలని అనుకున్నాకూడా ! నోటికి ఏదొస్తే అది మాట్లాడమే అని నువ్వు గట్టిగా కూకలేస్తే వినడం నాకొక సరదా అమ్మా ! మరి నువ్వు సర్జరీ చేయించుకోవడం ఆలస్యం చేస్తే అది యే కేన్సర్ కో దారి అయితే  పరిస్థితి యేమిటో ఆలోచించు. అందుకే ఇలా చెపుతున్నా. ఆరోగ్యంతో ఆటలాడవద్దు మరి. చెప్పినమాట వినాలి మా అమ్మ కదూ ! చదువుకుంటూ నవ్వేసుకుంటావులే, నాకు తెలుసుగా… కన్నీళ్ళొస్తున్నాయే అమ్మా!

అన్నట్టు  అప్పుడప్పుడు పుస్తకాలు చదువుతున్నా కూడా. వచ్చే ఏడాది పెన్ వరల్డ్ వాయిసెస్ ఫెస్టివల్ లో  జాయిన్ అవ్వాలని అనుకుంటున్నా.  ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ లో  హ్యూమన్ రైట్స్ ఫోకస్ చేస్తూ నిర్వహిస్తారట. ఈ ఏడాది జరిగినప్పుడు హిల్లరీ వచ్చారు. ఆమె ఎంత చక్కగా మాట్లాడారనుకున్నావ్ . ఈ ఏడాది కొత్త గొంతుకలు వినిపించడానికొక ఛాన్స్ దొరుకుతుందేమోనని వెయిట్ చేస్తున్నా. ఛాన్స్ వస్తే మనదేశం గురించే మాట్లాడతాను.  గృహ హింస లైంగిక వివక్ష గురించి రాసుకోవడానికి స్వేచ్ఛనిచ్చి కులం మతం లాంటి నిషేదిత అంశాలతో కథలు గట్రా రాకూడదని బిర్రబిగదీసుకు కూర్చున్న పత్రికలు కొన్ని తెల్లారి లేస్తే అదే వార్తలను ప్రముఖంగా ప్రచురిస్తాయి. సాహిత్యం ఆ విషయాలను నోట్ చేయకూడదని ఆంక్షలు విదిస్తుంది. రాజకీయ రాబందుల గూళ్ళల్లో కులం మతం గుడ్లు పెడుతున్నాయి. పీక్కూతినడానికి ఇవి చాలవూ! ఆకలి జ్ఞానం రోగం యేపాటివి చెప్పు?. ఎక్కడ చూసినా భావ స్వేచ్ఛ అలా వర్ధిల్లుతూ  వుందని నలుగురం కూర్చుని వున్నప్పుడు చెప్పుకుని  నవ్వుకుంటున్నాం.

బాబాయి కూతురు ఇక్కడ ఎమ్మెస్ చేయడానికి తయారవుతున్నానని చెప్పింది. ఇక్కడికొస్తే లైఫ్ బాగుంటుందన్న భరోసాలేదు మంచితనమూ లేదు గట్టిదనమూ లేదు. ఇన్నింటిమధ్య సంపూర్ణత్వం ఆశించడం పూలిష్ గా ఉంటుంది అని చెప్పలేకపోయా. గారాబంగా పెరిగిన చెల్లి యిక్కడ నెగ్గడం కష్టం. కష్టాలే కదా యెలాగోలా పడదాము అనుకుంటే రావచ్చు. అప్పులు చేసి రావద్దని చెప్పు.మన ఖాళీ గిన్నెలను డాలర్ తో నింపుకోవాలని మాత్రం రావద్దు అని ఈసారి నేనే ఫోన్ చేసినప్పుడు చెపుతాలే. నువ్వు చెపితే మా పిల్ల వెళితే మేము బాగుపడతామని యిష్టం లేక ఇలా చెపుతుందని పిన్ని బాబాయి  అనుకుంటారు.

నిజంగా ఇక్కడ ఏమీ ఆశాజనకంగా లేదమ్మా , హెచ్ వన్ బి వుంది కదా  అనుకుంటే సరిపోదు.  వర్క్ లోడ్ తో చిత్ర హింస అనుభవిస్తూ   మూడు నెలలకోసారి కాంట్రాక్ట్ జాబ్ పూర్తై క్రెడిట్ కార్డు లతో నెట్టుకొస్తూ వుంటారు. అక్కడేమో   సిటీలో మంచి లొకాలిటీలో అమ్మ నాన్నలకు ప్లాట్,  కారు యివ్వాలి. ఇక  పెళ్ళి కోసం ఓ ముప్పై లక్షలు సంపాదించుకోవాల్సి వచ్చే  ముప్పై యేళ్ళు దాటేసిన బాల్డ్ హెడ్ యువకులు వాళ్ళతో యవ్వనోద్రేకంతో జతకట్టే అదే పరిస్థితిలో వుండే యువతులూ గురించి మీకేం తెలియొద్దు.  డాలర్ల కలలు  కనండి. కలలు కంటూనే వుండండి.

ఫోన్ ఆన్సర్ చేస్తే జాబ్ గురించి మాట్లాడాల్సి వస్తుందనో తల్లిదండ్రులు డబ్బులు పంపమని సంకేతం ఇస్తారనో చూసి కూడా  చూడనట్టు నటిస్తూ కోపం అసహనంతో తమని తామే తిట్టుకుంటూ విసుక్కుంటూ తరువాత  పశ్చాత్తాప పడుతూ బతుకు బరువీడుస్తున్న పిల్లల గురించి ఆలోచించాలి. దూరపు కొండలు నునుపు అని పిల్లలకు ఆశలు రేపొద్దని చెప్పాలి అంటే ఎంత మొహమాటం లేకుండా ఉండాలి. ఆ మొహమాటం లేకుండానే చెపుతున్నానమ్మా .. నన్ను అనవసరంగా పంపావు యిక్కడికి.అప్పులు చేసి మరీ పంపావు.  కట్టాల్సిన అసలు రొక్కం, వడ్డీలు కలల్లో కూడా డాన్స్ చేస్తున్నాయి. బిడ్డ భవిష్యత్ బాగుండాలని తల్లిగా నువ్వు ఆశ పడటంలో తప్పులేదులే! నా కూతురు గొప్ప చదువులు చదివి వేలకి వేలు డాలర్లు సంపాదిస్తుంది అని చెపుతూ  నీ చుట్టుపక్కల అమ్మలక్కల కళ్ళల్లో  ఈర్ష్యను చూస్తూ  హాయిగా  నవ్వుకో.

చాలా నేర్చుకున్నా. జీవితమనే ఆట  ఆడాలనుకున్నప్పుడు ఆ ఆట రూల్స్  తెలిసుండాలి.  కొట్టడమో , తప్పించుకునే గుంట  నక్క తెలివితేటలుండటమో  కాదు దెబ్బ తగిలితే ఓర్చుకోవడం తట్టుకోవడం తెలియకపోతే యీ ఆట ఆడలేమని తెలుసుకున్నాను. పోరాటమంటే ఏమిటన్నది   ప్రతిక్షణం నిన్ను చూసి నేర్చుకున్నదాన్ని కదా మరి.

ఒకటి చెప్పనా అమ్మా ! ఏనుగు అంబారీ చూడటానికి గొప్పగానే ఉంటుంది. ఏనుగెప్పుడు సహనం కోల్పోయి చిందులు తొక్కుతుందోనని  భయపడుతూ   జారీ పడిపోకుండా పట్టుకుని కూర్చోడం యెంత కష్టమో  అంబారీ లో కూర్చున్న వాళ్ళకి  తెలుస్తుంది.అచ్చు అలా ఉంటుంది యిక్కడ మా బతుకు. నా చిన్నప్పుడు ఏనుగు సవారీ చేయడానికి సరదా పడుతున్న నన్ను యెక్కించి జారిపడిపోతాననే భయంతో ఆ ఏనుగు వెనక  వెనకనే నడిచావు చూడు. అదే గుర్తుకొస్తుంటుంది నాకు. ఇప్పుడు కూడా నేను పడిపోతే పట్టుకోవడానికి నువ్వు ఉండాలి.  వడ్డీల సంగతి పక్కన పెట్టి సర్జరీ చేయించుకో, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో,  ఇక యింతకన్నా యెక్కువ ఆశలు పెట్టుకోకు. నిన్ను బ్రతికించుకోవడానికయినా  కార్పొరేట్ డాక్టర్స్ ధనదాహం తీర్చడానికి నేను నిత్యం  కష్టం ముల్లుతో గుచ్చుకుంటుంటానులే . బెంగపడకు, మనుషులకు విలువలను డామినేట్ చేసే అవసరాలు చుట్టుకుని ఉన్నంత కాలమూ విలువలు వలువలూడ్చినంత తేలికగావూడ్చి పారేయడమే.

కొన్ని నిజాలు  తెలిస్తే ఏడ్చి ఏడ్చి ఎండుకొమ్మలా పెళ్ళున విరిగిపోతావని నా భయం. అందుకే నీకు ఏమీ చెప్పను. అయినా నీ వద్ద ఏ రహస్యాలు వుండవు కదా,అందుకే కొన్ని మాములుగా కొన్ని అసహనంగా కలగాపులగం చేసి  కక్కుతున్నా. ఎవరికీ చెప్పుకోలేకపోతే యెవరి భుజమూ ఆసరాగా ఓదార్పుగా లేకపోతే మానసిక రోగాలు వస్తాయని నువ్వే చెప్పావుగా.  ఈ దేశం యెప్పుడు తల్చుకుంటే అప్పుడు పొమ్మంటేనూ పోనీ యెప్పుడైనా   నేను రావాలనుకుంటేనూ నాకంటూ వొకరుండాలి కదమ్మా. నీకన్నా గొప్పగా నాకెవరు వున్నారని!? ఏడుపొస్తుంది, రెక్కలు కట్టుకుని వచ్చి నీ వొడిలో పడుకుని తనివితీరా యేడవాలని వుంది.  ఉంటానమ్మా ..నీ దీప.

PS:  కేవలం పదిహేనువందల  డాలర్ల కోసం నీకు సర్జరీ చేయించడానికయ్యే ఖర్చు కోసం  యెప్పుడూ మీరు అతిశయంగా చెప్పుకునే కులం తొడుక్కున్న నేను  మీరు తీసి తీసి పడేసే  ఓ కులం తక్కువాడి కింద నెలరోజులు నలిగిపోయాననే నిజం  నీకు తెలియాల్సిన అవసరం లేదు. కూటికి పేద కానీ కులానికి పేద కాదుగా.  రోగం నయం చేయించుకోవడానికి డబ్బులు లేకపోతే చస్తాను. యెప్పుడైనా చచ్చేదిగా అని స్టాక్ డైలాగ్ చెపుతావని నాకు తెలుసు. నువ్వు లేకపోయాక మా అమ్మ ప్రాణం ఖరీదు కొన్ని వందల డాలర్లేనా అని ముందు ముందు  నేను సిగ్గుపడాల్సి వస్తుందేమో మరి. అందుకే తెగింపు కొచ్చేసాను. కాస్తంత దైవభక్తి  నేర్చిన జ్ఞానం  కళ్ళల్లో  తడి లోపలెక్కడో దాగినట్టే వున్నాయి. ఎప్పుడన్నా  కాసేపు ఏడ్చి తెరిపిన పడతాను.  కొద్దిగా ఊహించుకుంటే నువ్వు లేనప్పటి దుఃఖం కన్నా చిన్న దుఃఖమే కదా ఇది అనుకుని ఊపిరి పీల్చుకుంటాను.

***********************************

అని లెటర్ ముగించి మెయిల్ సెండ్ చేయబోయి ఆపేసిన దీప కొద్దిగా ఆలోచించింది.  అమ్మకి  యీ విషయం  తెలియాల్సిన అవసరమేముంది  అనుకుని వెంటనే ఆఖరి పేరా తుడిచేసి..సెండ్ చేసి భారంగా నిట్టూర్చింది.
 

(ఫిబ్రవరి 2019 సాహిత్య ప్రస్థానం  సంచికలో ప్రచురితం)