పరిచయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పరిచయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, ఏప్రిల్ 2025, మంగళవారం

కథా ప్రస్థానం




సారంగ ఛానెల్ కొఱకు.. 


పాతికేళ్ళ కథా ప్రస్థానం  - వనజ తాతినేని. 


సాహితీ మిత్రులకు, సారంగ పాఠకులకు, సారంగ ఛానల్ వీక్షక మిత్రులకు హృదయ పూర్వక నమస్కారం. వనజ తాతినేని వనజవనమాలి పేరుతో నేను మీకు కొంత పరిచయం కల్గివున్నాననే భావిస్తున్నాను. పరిచయం కాని పరిచయం లేని  పాఠక మిత్రుల కొరకు ఇప్పుడిలా  పరిచయం చేసుకొంటున్నాను. ఇంతకు ముందు వెలువరించిన  “ రాయికి నోరొస్తే” “కుల వృక్షం” “ఈస్తటిక్ సెన్స్”  అనే కథా సంపుటాలు ద్వారా “వెలుతురు బాకు” అనే కవితా సంపుటి ద్వారా, త్వరలో విడుదల కాబోతున్న “దుఃఖపు రంగు” కథా సంపుటి లోని కథల ద్వారా రచయితగా తెలుగు పాఠకలోకానికి పరిచయమై  వున్నాను.


పాతికేళ్ళకు పైగా సాగుతున్న..నా రచనా ప్రస్థానం గురించి తెలియజేయడానికి ఇలా వచ్చాను. ముందు పాఠకురాలిగా నా గురించి చెబుతాను. 


 నా చిన్నప్పుడు మా అమ్మ పెద్దమ్మ  పిన్ని అక్కలు అందరూ వారపత్రికలు మాస పత్రికలు తెప్పించుకుని వంతుల వారిగా చదివేవారు.  నవలలు చదివేవారు.  నేను ఆరు ఏడు తరగతులు చదువుతున్నప్పుడు   మా అమ్మకు  లైబ్రరీ నుండి ఆమెకు కావాల్సినవి రాసి ఇచ్చిన లిస్ట్ లో వున్నవి   వారానికి మూడు పుస్తకాలు చొప్పున   తెచ్చి ఇచ్చేదాన్ని. యద్దనపూడి పూడి సులోచనా రాణి  వాసిరెడ్డి సీతాదేవి పోల్కంపల్లి శాంతాదేవి కోడూరి కౌసల్యాదేవి నవలలు ఎక్కువ వుండేవి. నాకు పదకొండేళ్ళ నుంచి పరిచయం అయినవి నేను చదివినవి రాధాకృష్ణ సీరియల్  యండమూరి వీరేంద్రనాథ్ గారి  రచనలు. అమ్మ పుస్తకాలు  చదువుతున్నప్పుడు నేను కూడా అవి చదువుతూ వుండేదాన్ని.  చందమామ బాలమిత్ర చదివిన అనుభవం నుండి  నా ఊహాశక్తి  విస్తరించి క్లాస్ లో బ్యాక్ బెంచిలో కూర్చొని   లాంగ్ నోట్ బుక్ లో చిన్నచిన్న కథలు రాసేదాన్ని. . నా బాల్య స్నేహితురాలు ప్రశాంతి. నేను రాసినవి తనే మొదట చదివేది. బాగున్నాయి అని కూడా చెప్పేది. ఆ అనుభవం తోనే  కాలేజ్ డేస్ లో కాలేజ్ మ్యాగజైన్ లో కథలు వ్యాసాలు  రాశాను. అవి ప్రచురితం అయినప్పుడు నాకు గర్వంగా వుండేది. చదువులో అత్యధిక మార్కులు తెచ్చుకుని గర్వంగా ఫీల్ అయ్యే వారిని నేను అధిగమించి కథలు వ్యాసాలు నేను బాగా రాస్తున్నాను అన్న ఫీలింగ్ తో కల్గిన గర్వం అది. అలాంటి గర్వం నాకిప్పుడు వుండదు అంటే మీరు ఆశ్చర్యపోవద్దు. నా బాల్య స్నేహితురాలిని 35 ఏళ్ళ దీర్ఘకాలం తర్వాత మళ్ళీ మేము కలుసుకున్నప్పుడు “ఏం చేస్తున్నావ్” అని అడిగింది.   ‘నేను రచయితగా స్థిరపడ్డాను   కథలు రాస్తున్నానుగా’  అని నవ్వుతూ  చెబుతుంటే ‘నువ్వు  ఇప్పుడు  కథలు రాయడం ఏమిటీ?  హైస్కూల్ చదువులో వున్నప్పుడే రాసేదానివిగా నీ ప్రథమ పాఠకురాలిని నేనే అని చెప్పింది. నా లోని రచయితను ఇంతకాలం గుర్తుంచుకున్న  నా స్నేహితురాలికి కృతజ్ఞతలు చెప్పడం మినహా నేనేం చేయగలను?.  అప్పటి నాలోని రచయితను ఎలా కాపాడుకుంటూ వచ్చానో ఎవరికీ తెలియదు. ఆఖరికి మా ఇంట్లోని వారిక్కూడా! ఇంటర్మీడియట్ తర్వాత వివాహమైంది. గృహిణిగా నా జీవితం ప్రారంభమైంది. అక్కడ ఎదుర్కొన్న ప్రతి అనుభవాన్ని కథగా రాయాలనుకున్నాను. నిజానికి రాశాను కూడా! కాకపోతే అవి వెలుగు చూడలేదు. కొన్ని కథలు మెదడులో రికార్డ్ అయి వున్నాయి ఇప్పటికీ. కొన్ని కథలు చదవడానికి మీ ముందున్నాయి. 


నా కాలేజ్ డేస్ వదిలేసిన పదేళ్ళ తర్వాత 1996 లో “జాతర” అనే కథ రాసాను. వెంటనే పత్రిక కు పంపాను.  నిడివి పెద్దదిగా వుందని ప్రచురణ కు అనర్హం అన్న వాక్యం తో తిరిగి వచ్చింది. ఆ తర్వాత కూడా రెండు మూడు కథలు అలాగే తిరిగి వచ్చాయి. ఇక రాయడం మానేసాను. చిన్న చిన్న కవితలు రాసాను. వాటిని అచ్చు లో చూసుకోవాలనే తపన కూడా బాగా వుండేది.. నేను అడపాదడపా చదివే పత్రికల్లో వచ్చే కథల కన్నా కవిత్వం కన్నా ఇవి చాలా బాగుంటాయి కదా అనే ఉక్రోషం కూడా వచ్చేది. నా ఇరవైల్లో కొంత అమాయకంగా  పట్టుదలగా వుండేదాన్ని. నేను రాయడం నా భర్తకు అస్సలు ఇష్టం వుండేది కాదు. ఎందుకంటే నాది ప్రశ్నించే స్వభావం. రేడియో వినడం పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెరిగి ఆ ప్రశ్నించే శక్తి మరింత పెరుగుతుందని అతని అసహనం. రహస్యంగా రాసినవి కొన్ని, రాయడం పూర్తై పత్రికలకు పంపితే తిరిగివచ్చిన కథలు కొన్ని. పూర్తి చేయని కథలు ఇలా  చాలా కథలు వుండేవి నా దగ్గర. రాతప్రతులు అన్నీ ఓ ట్రంకు పెట్టెలో  పుస్తకాల అడుగున దాచుకునేదాన్ని. ఓ రోజు న  అవి నా భర్త కంటబడి నిర్దయగా   కాల్చివేయబడ్డాయి. నేను నిస్సహాయంగా చూస్తూ వుండిపోయాను.ఆ అసంపూర్తి కథలు కేవలం అక్షరాలు కాదు. ఆ కథలు నా మానస పుత్రికలు.  ఒకే ఒక కథ “జాతర”  అనే కథ మాత్రమే నా వద్ద మిగిలింది.ఇప్పటికీ  ఒక్క అక్షరం కూడా మార్చని ఆ కథంటే నాకు చాలా ఇష్టం భయం కూడా! ఒక   స్త్రీ భర్తకు అనుగుణంగా నడుస్తూ అతని అదుపుఆజ్ఞల్లో జీవిస్తూ అతని వ్యసనాలను,  లోపాలను భరిస్తూ జీవితాన్ని గడుపుతూ వుండటం అనే నరకం కన్నా మరో నరకమూ జీవిత ఖైదు మరొకటి లేదనిపించేది ఆ రోజుల్లో. నా ఆలోచనలన్నీ  కాగితం పై పెట్టకుండా పెదవి కదపకుండా వుండటం చాలా  కష్టం గా వుండేది. అయినా గృహిణి గా మరికొంత కాలం  జీవితం కొనసాగింది.  ఆ వివాహ జీవితం నుండి  నేను విడివడటానికి ముందుగా ఇంట్లోనూ తర్వాత బయటా కూడా పోరాటం చేయాల్సివచ్చింది. నాకు అందుకు ఊతమిచ్చింది సాహిత్యమే!అంటే మీరు తప్పక నమ్మాలి.  ఓల్గా రాసిన ‘మానవి’ నవల లోని వసంత పాత్ర లాంటి నేను కూడా మానవి గా మారాను. ఒంటరి తల్లిగా నిలబడ్డాను.నిలబెట్టుకున్నాను.


2000 లో  స్వేఛ్ఛగా రాయడం మొదలెట్టాను. రేడియో కి రచనలు పంపడం ప్రారంభించాను. “జాతర” కథను మళ్ళీ  అప్పుడు బయటకు తీసాను.  నిడివి ఎక్కువ వుండటం వల్ల ఆ కథ కొంత భాగం తొలగించి కథానిక గా ఆల్ ఇండియా రేడియో  విజయవాడ  వనితావాణి కార్యక్రమంలో ప్రసారమైంది. అప్పుడు చాలా సంతోషం. తర్వాత “బంగారు” అనే కథానిక “మర్యాద వారోత్సవాలు “ అనే కథానికలు ఏ ఐ ఆర్ లో ప్రసారం అయ్యాయి. చదవడానికి ఆంక్షలు వుండి ఓ పదిహేనేళ్ళు పుస్తకాలు చదవడానికి కూడా దూరమై వున్న నేను  అదే 2000, 2001 సంవత్సరాల  కాలంలో రేడియోలో  ప్రసారం అయ్యే   శతవసంత సాహితీ మంజీరాలు అనే కార్యక్రమం వినడం అనేది ఆయాచితంగా లభించిన వరం అనుకునేదాన్ని.   ఆ కార్యక్రమం ద్వారా పేరెన్నికన్న పుస్తకాలు పరిచయం అయ్యాయి. పుస్తకాలు చదవడం ప్రధాన వ్యాపకం అయింది.  విరివిగా రాయడం మొదలెట్టాను. నాకు కథ కన్నా కవిత్వం అంటే ఇష్టం ఏర్పడింది. కవిత్వం రాయడం మొదలెట్టాను. కవిత్వం బాగా రాయగలను అనే నమ్మకం కూడా వచ్చింది. రేడియోలో పత్రికల్లో నా  కవితలు పది వరకూ ప్రసారం ప్రచురితం అయ్యాయి. 


ఒంటరి తల్లిగా బ్రతుకు పోరాటం  విపరీతమైన ఒత్తిడి  ఆరోగ్య సమస్యలు వర్క్ షాపు నిర్వహణ వీటన్నింటి మధ్య కూడా దూర విద్య ద్వారా డిగ్రీ చదువుకుంటూ వుండటం  వలన రాయడానికి  సమయం వుండేది కాదు. అసలు ఏ మాత్రం రాయలేకపోయేదాన్ని.. అలా  నాలుగైదేళ్ళు  అసలు కథలు ఏమీ రాయలేదు. 2010లో కంప్యూటర్ ముందు కూర్చున్నాను. బ్లాగ్ రాయడం మొదలుపెట్టాను. రాస్తూ వున్న క్రమంలో మళ్ళీ కథలు రాయడం మొదలుపెట్టాను. “కంట్రి ఉమెన్ కూతురు” “కాళ్ళ చెప్పు కరుస్తాది” “కూతురైతేనేం” “ఆనవాలు” కథలు రాసాను. 


తర్వాత సారంగ వెబ్ పత్రిక వచ్చింది. కొత్త రచయితలను ప్రోత్సహించింది. “సంస్కారం” “స్వాతి వాళ్ల అమ్మ”  “రచయిత్రి గారి భార్య” కథలు రాసాను. కథను క్లుప్తంగా చెప్పవచ్చు, ఇంత దీర్ఘంగా రాయనవసరం లేదు  అన్న పాఠకుల అభిప్రాయాన్ని చాలెంజ్ గా తీసుకుని “మర్మమేమి” కథ రాసాను. అంతకు ముందే కల్పన రెంటాల గారూ పత్రికల ఈ మెయిల్ అడ్రెస్ లు ఇచ్చి ప్రింట్ పత్రికలకు కూడా  రచనలు పంపమని ప్రోత్సహించారు. అలా వివిధ పత్రికల్లో రెండు మూడేళ్ల కాలంలోనే 25 పాతిక కథల వరకూ ప్రచురింపబడ్డాయి. అలా రచయితగా నాకొక స్థిరమైన స్థానం కుదురుకుంది. అప్పటి నుండి రాస్తూనే వున్నాను. ఇప్పటికి 130 కథలు రాశాను. నేను రాసిన ప్రతి కథ నా అనుభవంలో నుండో ఇతరుల అనుభవం నుండో రాసినవే! నా కథలన్నీ 75% వాస్తవికత 25% ఫిక్షన్ కలగలిపినవి.  నా కథలు అన్నీ చదవని పాఠకులు స్త్రీల కథలు మాత్రమే రాసాను అనుకుంటారు. నేను విభిన్నమైన కథలు రాశాను.  హిజ్రా లపై “మార్పొద్దు మాకు”  టాన్స్ జెండర్ లపై “తృతీయ ప్రకృతి”  లెస్బియన్  సహజీవనం పై “పరస్వరం”  గిగోల స్ “ప్రత్యాహారం” అనే కథలు పదేళ్ళ కిందటే కథలు రాసాను. ఎందుకంటే ఆ జీవన విధానాలు మన కళ్ళముందు  జరుగుతున్నాయి కాబట్టి. పర్యావరణ పరిరక్షణ గురించిన  అంశాలపై “బయలు నవ్వింది” “నిర్మాల్యం” “బంగారు భూమి” కథలు, విదేశీ విద్య  ఫాల్స్ ప్రిస్టేజ్ కోసం వెంపర్లాడే మధ్యతరగతి కుటుంబాల్లోని పిల్లల వెతలు గురించి “ఏనుగు అంబారీ” “రాజు -వెట్టి” కథలు రాసాను. ఆత్మాభిమానం వ్యక్తిత్వంతో నిలబడ్డ స్త్రీల కథలు రాసాను. 



సామాజికంగా  నేను వ్యక్తులతో ఎంత కలివిడిగా వుంటానో అంత మౌనంగా కూడా వుంటాను. స్వభావసిద్ధంగా మొండిదాన్ని. ఏ పనైనా నాకు నచ్చితేనే చేస్తాను.అది రాయడం కూడా!  నాకు రాయాలనిపించినప్పుడే రాస్తాను. ఒక కథా సంకలనంలో మీ కథ కూడా  వుంటే బాగుంటుంది కథ రాసి ఇవ్వండి అంటే ఇవ్వలేను. నేను రాసిన కథలన్నీ నేను ఇష్టంగా రాసినవే. ఇంకా బాగా రాయవచ్చేమో అనుకుంటాను కానీ ఇలా ఎందుకు రాసాను అని  నేనెప్పుడూ అనుకోలేదు. ఒక రచయిత గా నా కాలాన్ని సమకాలీన జీవితాలను నేను నోట్ చేసాననే అనుకుంటున్నాను. ఆగి ఆగి ఆచితూచి రాసిన కథలు ఎలాగూ నాణ్యంగా వుంటాయి. కానీ ఒకే వొక సిట్టింగ్ లో రాసిన కథలు కూడా బాగా వచ్చాయన్నది నా రచనానుభవం. “ఇల్లాలి అసహనం” “నూతిలో గొంతుకలు” “రస స్పర్శ” అనే కథలు  రాత్రికి రాత్రి కూర్చుని రాసిన కథలు. అలా రాయగల్గినందుకు నాపై నాకే ఆశ్చర్యం. రోజుకొక పది కథలైనా చదువుతాను. నేను విసృతంగా చదవడం మూలంగానే కొన్ని కథలు బాగా రాయగల్గాను అనుకుంటాను. సహ రచయితలు వదిలేసిన కోణాలు, వారు కథ ముగించిన తర్వాత ఉద్భవించిన ప్రశ్నలకు కొనసాగింపుగా రాసిన కథలు లోలోపల పొరలను కూడా బహిర్గతం చేయాలనే ఆలోచనలతో రాసిన కథలు. ఇలా నా కథా ప్రస్థానం కొనసాగుతుంది.   


నా అనుభవంలో  నేను రాసిన వాటికన్నా  రాయని కథలెన్నో వున్నాయి. బద్దకం ఏర్పడింది అనే కన్నా ఒక విధమైన నిరాశ నెలకొని వుంది. పత్రికలు కథ ను బట్టి స్వీకరించే కాలం కానే కాదు ఇది. రచన కన్నా రచయిత వ్యక్తిగత స్నేహాలకు చోటిచ్చే కాలం. చాలా వరకు సాహిత్య రాజకీయాలకు నెలవైన పత్రికలు వున్నాయి కాబట్టి ఎంత మంచి రచనైనా కారణం లేకుండా తిరిగి వస్తాయి. ఆ నిరాశను తట్టుకోవాలి రచయితలు. నేను అలాగే తట్టుకున్నాను. అలా తిరిగి వచ్చిన  12  అముద్రిత కథలతో  మరో రెండు కథలు  కలిపి “ఈస్తటిక్ సెన్స్” కథా సంపుటి గా ప్రచురించుకున్నాను. రచయితగా నాకు సంతృప్తినిచ్చిన కథలు అవి. 


నా మైనస్ ఏమిటంటే  రచయితగా ప్రతి కథను ప్రింట్ పత్రికలకు అనుగుణంగా 1500 పదాల్లో క్లుప్తీకరించలేను. అదసలు నాకు నచ్చదు కూడా! “లతాంతాలు” “నీట చిత్రం” “పైడి బొమ్మ” లాంటి నిడివి ఎక్కువ కల్గిన కథలు రాసాను. ఆ కథలను పత్రికలు ప్రచురించవు అని నాకు తెలుసు. ఇతివృత్తాన్ని బట్టి కథలకు రూపం ఏర్పడుతుంది తప్ప రచయిత చేసే నాటకీయత   బలవంతపు అసందర్భ  ముగింపులు వల్ల కథలకు వాటికి రావాల్సిన రూపు రాదు. ఆ సంగతి నాకు బాగా తెలుసు.అలా రాయడం  నాకు నచ్చదు కూడా.  నా కథలు ఎడిట్ చేసి ప్రచురిస్తాం అంటే కూడా నేను వొప్పుకోను. కథలకు ఒకోసారి వర్ణన కూడా అత్యవసరం అని నా భావన. నా ప్రతి కథ నిబద్దత తో రాసాను. ఎవరి సలహాల మేరకు మార్పులు చేర్పులు కూడా ఇష్టపడను. వివాదాస్పద రచనలు చేయడం ద్వారా ప్రాచుర్యం లోకి రావడం  కోసం కూడా రాయలేదు. ఇవన్నీ నేను చేసి వుంటే నా కథలు తిరస్కరణకు గురి అయ్యేవి కాదు. మరికొన్ని కథలు ప్రింట్ పత్రికల్లో వచ్చి వుండేవి. రాశి కన్నా వాసి ముఖ్యం అని భావిస్తాను. “పలుచన కానీయకే చెలీ” “ ఆదర్శ నాయకుడు” “చూపుల దొంగాట” “నీరెండ ఛాయల్లో” లాంటి సూక్ఙమైన కథలు రాసాను. అవి మనస్తత్వ కథలు. కొన్ని చైతన్య స్రవంతిలో రాసిన కథలూ వున్నాయి. నా దృష్టిలో రచయిత రచనలు వేరు వేరు కాదు. ఒకటే! చాలా వరకు నా కథల్లో నేనూ వుంటాను. ఏ కథ? ఏ పాత్ర   అన్నది మాత్రం రహస్యం. 


ఇంకో విషయం ఏమిటంటే… 


నేనెప్పుడూ ఇలాంటి కథలు  రాశాను ఇన్ని రాశాను  అని చెప్పుకోలేదు. ఎందుకంటే ఇంతవరకూ ఏ పత్రిక లోనూ నా పరిచయం కూడా  రాలేదు. నాలుగైదు పుస్తకాలు ప్రచురించిన తర్వాత కూడా! 

రచయితల సమూహం లో నుండి అందరినీ తోసుకుంటూ ముందుకు ముందుకు వెళ్ళి మొదటి వరుసల్లో నేను కూర్చోలేను.అది నాకిష్టం వుండదు. నలుగురి దృష్టిలో పడటానికి ప్రయత్నించను కూడా. నాకున్న అవకాశాలను బట్టి సోషల్ మీడియాలో సెల్ఫ్ ప్రమోట్ చేసుకోవడం మినహా. నా కథల పుస్తకాలకు ముందు మాట రాయించుకోవడం సమీక్షలకు పుస్తకాలు పంపడం కూడా చేయను నేను. ఎందుకో నాకది అంతగా ఇష్టం వుండదు.


ఇవాళ సాహిత్య వాతావరణం ఎలా వుంది అంటే.. 


మీరు వెంటనే పుస్తకం వేయండి మీకు ఈ సంవత్సరం అవార్డు ఇస్తాం అని ముందుకు ముందే నిర్ణయం చేయబడుతున్న తెలుగు సాహితీలోకంలో అవార్డుల కోసం రివార్డుల కోసం సంకలనాల కోసం ఏదో ఒక విధమైన గుర్తింపు కోసం రచనలు చేయడం నా అభిమతం కాదు. రాయకుండా వుండలేనితనం నన్నావహించినప్పుడు మాత్రమే  రాసాను. రాయాల్సినవి చాలా వున్నాయి. రాసే సమయం వచ్చినప్పుడు తప్పకుండా రాస్తాను. ఇప్పుడు మాత్రం స్టోరీ టెల్లర్ గా అవతారమెత్తాను. ఇతరులను ఇంకా ఎక్కువగా చదువుతున్నాను. నా కథలే కాక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కథలు మంచి మంచి తెలుగు కథలు వినిపిస్తున్నాను.  నేను రాసే కథలు నేను రాస్తున్నాను.   ఏదో అనుకోకుండా గాలివాటుగా నేను రచయితను కాలేదు. భారతీయ సమాజంలో తరతరాలుగా పీడనకు గురవుతున్న స్త్రీ ల  గురించి  వారి జీవితాల్లోని అనేక పార్శ్వాలు గురించి రాయాలనే తపన వలన రచయితను అయ్యాను.  ఆ రాయడం అనేది చాలా బాగుండాలి  అనే శ్రద్ధ వలన  రాయగల్గాను. కీ బోర్డ్ పై రాసే సౌలభ్యం వుండటం మూలంగా రాయగల్గాను తప్ప ఇందులో  వ్యక్తి గా నా గొప్ప ఏమీ లేదు. గొప్పగా వుండాలని గుర్తింపబడాలని కూడా నేను కోరుకోవడం లేదు.


 రచయితగా నాకు గుర్తింపు నిచ్చిన ప్రోత్సహించిన సారంగ వెబ్ పత్రిక నా రచనా ప్రస్థానం గురించి తెలియజేయమని కోరిన వెంటనే ఇలా మీ ముందుకు వచ్చాను. వర్ధమాన రచయితగా వున్నప్పుడు  నేను రాసిన కథల్లోని విపరీతమైన అచ్చుతప్పులను భరించి  సరైన వాక్య నిర్మాణం చేసి నా కథలను ప్రచురించి నన్ను ప్రోత్సహించిన  సారంగ వెబ్ పత్రిక  నిర్వాహకులు అఫ్సర్ గారికి కల్పన రెంటాల గారికి రాజ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.  నా కథలను చదివి ఆదరించిన ఇప్పుడు విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్తే! .




పాతికేళ్ళ కథా ప్రస్థానం

  • ఒంటరి పోరాటమే అన్నీ నేర్పింది - పాతికేళ్ళ కథా ప్రస్థానం గురించి వనజ తాతినేని స్యీయ పరిచయం.. “సారంగ “ ఛానెల్ లో .. 

21, సెప్టెంబర్ 2019, శనివారం

ఓషో చెప్పిన జెన్ కథ

ప్రతిది పరిపూర్ణత (perfect ) గా వుండటం సాధ్యమేనా! అసలు యే లోపం లేకుంటే బాగుంటుందా?
ఇదిగో యీ ఓషో చెప్పిన జెన్ కథ చదవండీ.. ఆంగ్లంలో వున్న కథకు సునీత పోతూరి  తెలుగు అనువాదంలో..
ఒక రాజు తోటపని నేర్చుకుందుకు ఒక జెన్ మాష్టర్ దగ్గరకు వెళ్లాడు. 'ముందుగా నీవున్న చోటనే... వెళ్ళి, వొక చక్కని తోటను తయారు చేయమని' ఆ మాష్టర్ చెప్పాడు.
మూడు సంవత్సరాలు గడిచాక తను వచ్చి ఆ తోట ను చూస్తానని, అది కనక సంపూర్ణంగా తయారు అయింది అనుకో...‌ అపుడు రాజు ఆ పరీక్షలో ఉత్తీర్ణుడై నట్లే నని అంటాడు.
రాజు ఈ 'సంపూర్ణంగా' అనే పదాన్ని 'మొత్తం గా, ఎటువంటి లోపాలు లేని' విధంగా పరిపూర్ణత కలిగినది అని అర్థం చేసుకొంటాడు. వేలకొద్దీ తోటమాలులను పనిలో పెట్టి... జపాన్ దేశం లోనే మిగతా గార్డెన్స్ కంటే మిన్నగా తయారు చేసాడు రాజు. ఎక్కడా వొంక పెట్టేందుకు వీలు లేనంతగా తయారైంది...
అలా మూడేళ్ళు గడిచింది. జెన్ మాష్టర్ అన్న ప్రకారం వచ్చి చూసాడు. తన తోట ఎంత బాగుందో నంటూ మురిసి పోతున్నాడు రాజు.
కాని, జెన్ మాష్టర్ అంతా చూసాక అసంతృప్తి చెందాడు... సాధారణంగా మితభాషి అయిన మాష్టర్ ఏం మాట్లాడలేదు. మౌనంగా వహించాడు. రాజు మనసులో ఆందోళన. ఈ తోటకు ఇంతకు మించి చేయవలసినది...చేయగలిగేది ఏమీ లేదే.. ఉన్న వాటిల్లో ఈ తోట దీటుగా వుందే... తానేమి పరీక్ష తప్పడు కదా..
జెన్ మాష్టర్ మౌనం దుర్భరం గా వుంది రాజుకి.
ఇక ఉండబట్టలేక అడిగేశాడు..."ఏమైంది? మీరు ఎందుకు వొక్క మాట కూడా మాట్లాడటం లేదు? నా తోట మీకు నచ్చలేదా?"
మాష్టర్ నిదానంగా జవాబిచ్చాడు."నమ్మలేనంత పరిపూర్ణంగా వుందీ తోట. అంతా కృత్రిమంగా అనిపిస్తోంది. నిజానికి ప్రకృతి లో ఏదీ పరిపూర్ణత కలిగి వుండదు. ఇదిప్పుడు ఎంత బాగుంది అంటే ఇక ఇందులో మెరుగు పరచేందుకు ఏమీ మిగలలేదు. నా విచారం అంతా అదే. నేను నీకు చెప్పాను.. మొత్తం అన్నీ వుండాలి అని. నీవు సరిగా అర్థం చేసుకున్నట్లు లేదు. ఈ తోట మొత్తం వెదికినా..వొక్కటంటే..వొక్కటి ఎండాకు కనిపించడం లేదు. ఇదెలా సాధ్యం.?"
"లేకేం చాలానే వున్నాయి.. మీరొస్తున్నారని అంతా శుభ్రం చేయించాను" అన్నాడు రాజు.
" నాకొక బకెట్ ఇవ్వండి" మాష్టర్ అడిగాడు
వెంటనే బకెట్ వచ్చింది. అతను తోట బయట ఎండుటాకులు పారేసిన చోటుకి వెళ్లాడు. బకెట్ నిండా ఎండుటాకులు నింపాడు. లోపలి కి వచ్చి...దారంతా వెదజల్లాడు వాటిని....
సరిగ్గా... అప్పుడే వీస్తున్న గాలి...ఆ ఆకులతో ఆడుకోవడం మొదలు పెట్టింది. గాలితో పాటుగా ఆకుల గలగల...సంగీతం!
జెన్ మాష్టర్ పెదవులపై చిరునవ్వు వెలిసింది.
"ఇప్పుడు... ఇప్పుడిది సరిగ్గా వుంది..మరీ పరిపూర్ణంగా కాకుండా.. సహజంగా... వుంది. ఈ ఆకులే లేకపోతే ఎంత నిర్జీవంగా వుండేది".
పరిపూర్ణత ..అంటే లోప రహితంగా అనికాదు. కాని ఈ విషయాన్ని మనం అనాదిగా అపార్థం చేసుకుంటూనే వస్తున్నాం


28, జనవరి 2019, సోమవారం

విశ్వ కథా వీధి కథలు

వాడ్రేవు చిన వీరభద్రుడు గారు పరిచయం చేసిన విశ్వకథా వీధి ఐదో సంపుటిలోనూ ఆరుకథల్నీ ఆవురావురావురుమంటూ చదివాను. వాటి గురించి నా స్పందన.
“గుల్లీ” చదివాను. ప్రమాణం యెంత గొప్పది. ఎంత గొప్ప మనసు. విలువలు పాటించడంలో వున్నతి ధనిక పేదలో లేదు. అలాగే గుల్లీలో భూతదయ, దాదూ పై అల్లుకున్న ప్రేమ గొప్పగా వున్నాయి. ఛగన్ లాంటి గుంటనక్క ఉంటారని చెప్పిన కథ యిది.
"కసి" కథలో గఫార్ కసి సంస్కారవంతమైనది. అతనికి నా సెల్యూట్. వడ్డించిన భార్య చేతులను తన చేతులలోకి తీసుకుని కృతజ్ఞత తెలియజేసాడు. ఆ భావన యెంత సంతోషం కల్గిస్తుందో అనుభవిస్తే కాని తెలియదు. ఒక చేయి విరిగినా రెండో చేత్తో యువకుడిని కాపాడిన తక్షణ సంస్కారం మెచ్చుకోతగినది.విప్లవాలు ఎందుకు వస్తాయో ప్రజలెందుకు ఉద్యమిస్తారో అరటిపండు వొలిచి తినిపించినట్టు పరిచయం చేసేకథ యిది.
"డేగ" కథ మర్చిపోలేని కథ. తీవ్రవాదులను, క్రీడాకారులను ఇలాగే తయారు చేస్తారేమో ఇంకా చెప్పాలంటే ఇప్పటి మన ప్రభుత్వాలు సంక్షేమ పధకాలు ద్వారా ప్రజలకు కష్టపడకుండా సోమరులను చేసి ముప్పు తెచ్చుకోబెట్టారని నాకనిపించింది. పాపం రహీమ్ అనిపించలేదు. అతనికి అది సంతోషమే కల్గించినందుకేమో.
"దొంగ" కథ ...ఒక సామెతను గుర్తు చేసింది. కథలో యజమాని సేవకురాలు కాబట్టి ఆ సామెత పొసగక పోయినా సమంజసం కాకపోయినా " మొగుడ్ని కొట్టి మొగసాలకు ఎక్కడం లాంటిది"
"పిల్లలు -ముసిలివాళ్ళు" కథ చదివి విచలితమైపోయాను .యుద్ధం ఎందుకు చేసుకుంటారు రాజుగారి కోసం. యుద్ధంలో ఎంత బాగా చంపగలితే అంత గొప్ప. శత్రువు దగ్గర హృదయం ఉండదు శత్రువు దగ్గర హృదయం ఉండదు అంతే. కథ ముగింపు వాక్యాలు దుఃఖభరితంగా ఉంటాయి. వాక్యం ఎంత శక్తివంతంగా వ్రాయవచ్చో తెలిపే కథ యిది.
"ఆఖరి ఉత్తరం" ఆలోచింపజేసే కథ. బాగుంది. ప్రేమ కథలెప్పుడూ బాగుంటాయి. వృద్ధాప్యపు జ్ఞాపకాలలో స్థిరంగా ఉండేది యవ్వనమే. ఆ వృద్ధుడు తన ప్రేయసికి ఒక లేఖ వ్రాస్తాడు. స్వార్ధంలేని ప్రేమఒక్క భగవంతుడికే సాధ్యమవును అని చెపుతూ నా జీవితంలో సుఖ దుఃఖాలు రెండూ నీతోనే వచ్చాయి. ఆ రెండింటి కోసమూ నీ ముందు కృతజ్ఞుడిని నేను అంటాడు. కానీ అతను వ్రాసిన ఆఖరి ఉత్తరాన్నిప్రియురాలికి పోస్ట్ చేయకముందే అతను చనిపోతాడు. ఆ వృద్ధుని కొడుకు ఆ ఉత్తరాన్ని చూసి నాన్న రహస్యాలు మనకి తెలియడానికి వీల్లేదంటూ ఆ ఉత్తరాన్ని కాల్చేస్తాడు. కానీ తండ్రి మనసును తెలుసుకోలేకపోయానని దుఃఖిస్తాడు. మనో వైజ్ఞానిక కథ.
ఈ కథల్లో పరిచయమైన చాలా పదాలకు అర్ధం తెలుసుకోవాల్సి వుంది. పురిపండా గారి అనువాద రచనలు చదివి ఉండటం వల్ల అనువాద కథలే అనిపించలేదు.ఈ కథలను మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి. కాలక్షేపపు కథలు కావివి. మంచి కథలను పరిచయం చేసిన వాడ్రేవు చిన వీర భద్రుడి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
విశ్వ కథా వీధి ఆరు భాగాలు కలిపి కథా సంకలనం గా పునర్ముద్రణ కాబోతుంది. కథాప్రపంచం వారు ప్రచురిస్తున్నారు. త్వరలో విడుదల కాబోతుంది. తప్పకుండా కొని చదువుకోవాల్సిన కథలివి.