ఫీలింగ్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఫీలింగ్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, జూన్ 2020, ఆదివారం

ఇవ్వడానికి మనసుండాలి మరి

చాలారోజులవుతుంది .. ఆలోచనలకు అక్షర రూపం కల్పించక. అప్పుడప్పుడూ ఇలా జరుగుతుండటం సహజమే కదా ! ఈ రోజు కొన్ని ఆలోచనలను పంచుకోవాలనిపించిది.. 
మొన్నొకరోజు ఫ్రెండ్ చెల్లెలు ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ నాకు ట్యాగ్ చేసింది. ఒక చిన్నపాపకు ట్రీట్మెంట్ కోసం ఆర్ధికసాయం అందించాలనే విషయం వుంది అందులో ..నేను చదివిన వెంటనే ..ట్యాగ్ తీసేశాను. ఒకరకమైన భయం . భయం అణువణువునా ఆక్రమించుకోవడం ఒక కారణమైతే ..వ్యాధుల బారిన పడిన వాళ్ళ నరకయాతన ఆర్ధిక పరిస్థితులు, తమవారిని రక్షించుకోవాలనే తపన,ఆరాటం అవన్నీ మనసును మెలిపెడతాయి కదా ! అంత చిన్న పాపకు వచ్చిన వ్యాధి కలవరం కల్గించింది .. నేను సహాయం చేయలేకపోయినా ..నా గోడమీద చూసిన మిత్రులు ఎవరైనా సహాయం చేస్తారేమోనన్న ఆలోచన కల్గకుండా ..క్షణాల్లో ట్యాగ్ తీసేశాను . 
నిజానికి నేనున్న పరిస్థితుల్లో నేను సహాయం చేయలేని పరిస్థితి  కూడా .. నేను సంవత్సరానికి కొంత మొత్తాన్ని ఇతరులకు సహాయం చేయడానికి పెట్టి ఉంచుకుంటాను. ఈ సంవత్సరం ఆ పరిమితి దాటిపోయింది. మళ్ళీ పొలంలో పంట వచ్చేదాకా నేను ఎవరికీ  సాయం చేయలేని పరిస్థితి కూడా ! 
కానీ నాలో ఏదో పీకులాట. మళ్ళీ కాసేపటికి మనసుని గట్టి చేసుకుంటాను. ఈ లోకంలో సహాయం అవసరమైన వారు చాలామంది ఉంటారు. వారికి అందరికీ సహాయం చేయగల స్థితిలో మనముండలేము. ఆ చిన్న బిడ్డకి సాయం అంది వైద్యం బాగా జరగాలని కోరుకున్నాను భగవంతుడిని. 
రిక్త హస్తాలతో ఉండటం అంటారే..అలా ఉండిపోవాల్సి వస్తుంది. ప్రస్తుతం నేను విశ్రాంతి జీవనంలో ఉన్నాను. బిడ్డ మీద ఆధారపడి ఉన్నప్పుడూ మన ఉదారబుద్ది వారికి అంటించలేము. అప్పటికప్పుడు అయ్యో ..నేను ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాల్సింది అని అనిపించింది కూడా ! 
అలాగే మిత్రులకు అత్యవసరం అన్నా అప్పుగా కూడా డబ్బు ఇవ్వలేని పరిస్థితి. మాట అడ్డువుండి అయినా ఇప్పించలేని పరిస్థితి. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలని అంటారు కదా! అందుకనే నేను సున్నితంగా వాస్తవ విషయాన్ని చెప్పి తప్పుకుంటాను. లేదని కాదని అన్నందుకు నాపై కినుక వహించిన మిత్రులను కూడా చూస్తున్నాను. డబ్బు ఇచ్చిపుచ్చుకునే విషయంలో నేను జాగ్రత్తగానే ఉంటాను. ఎందుకంటే జవాబుదారీ వహించాల్సివస్తే ..నాకు చాలా కష్టమైన విషయం. నా కుటుంబం నుండి మాట పడాల్సి వస్తుంది కూడా . అలా కొందరు మిత్రులు దూరం అయ్యారు . 
లేదని చెప్పడం కూడా ఎంత కష్టం అని .. లేదని చెప్పడం కూడా మనిషికి అదొక యాతన. గుమ్మం ముందు నిలిచి భవతి బిక్షాందేహి అని అడిగిన ఆదిశంకరుడికి కేవలం ఉసిరిక మాత్రమే ఇవ్వగల్గిన పేద ఇల్లాలి ఆర్ధిక దుస్థితిలో సిగ్గిల్లుతూ అభిమానం పడే యాతన. That is Power of Money.

అర్ధం చేసుకున్నవారు అర్ధం చేసుకుంటారు ..లేనివారు లేదు. నేను నిర్వేదంగా వున్నాను. స్నేహంలో కూడా డబ్బు ప్రముఖపాత్ర వహిస్తుంది . డబ్బు అవసరం లేని స్నేహాలు కూడా ఉండవు. నిస్వార్ధ త్యాగాలు సహాయాలు కూడా ఉండవు . ఇది చేదు నిజం. జీర్ణించుకోవడమే కష్టం మరి.
ఇక ఆ చిన్న పాపకి వైద్య ఖర్చులకు సాయం అందించడం అనే విషయం గురించే ఇంకా ఆలోచిస్తున్నాను . నేను చొరవచేసి సాయం అందిస్తే .. నా కొడుకేమీ కాదనడు. కానీ మా పరిమితి నాకు తెలుసు. 
ఇలా మల్లగుల్లాలు పడుతూ ... ఉండగా ..ఎప్పుడో ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ వ్రాసిన ఒక కథ చదివాను . ఆ కథ గుర్తుకొచ్చి వెతికితే దొరికింది ..ఆ కథ పేరు "విచిత్ర భిక్షువు "  
"పరిత్యాగానికి మించిన ధర్మం మరొకటి లేదు " అన్నది ఆ కథలో సందేశం. 
ఆ కథ మీరందరూ చదువుతారని ఇక్కడ పంచుతున్నాను. ఇవ్వడమంటే ఏమిటో ..మనకందరికి తెలియాలి తెలుసుకోవాలి  అనిపించింది ... చదవండి ఈ కథ. 
నా మనసు కూడా ..ఇప్పుడు నిర్మలంగా ఉంది. సాహిత్యం చేసే పని ఇదే ! మన మనోగవక్షాలను తెరుస్తుంది. ఇది నిజం. 
"విచిత్ర భిక్షువు " రచన:రవీంద్రనాథ్ ఠాగూర్ 







1, మే 2020, శుక్రవారం

ఆశతో జీవించడంలోనే..

ఈ సృష్టిలో ప్రతి ప్రాణి మరొక ప్రాణిని సృష్టించకపోయినా సృష్టించబడిన వాటిని ప్రేమిస్తుంది, ప్రశంసిస్తుంది, ఒకోసారి ద్వేషిస్తుంది.
లేదా సృష్టించబడిన వాటి మహిమని ప్రచారం చేస్తుంది. మనమూ అంతే కదా ! కానీ ఒకోసారి మన దగ్గర వారే మనను ద్వేషించిన సందర్భాలు మనకొక జీవిత పాఠాలు నేర్పుతుంటాయి..మనిషి స్వార్ధం ముందు నేను నాది అన్నది తప్ప మిగతా విషయాలన్నీ త్రోసిపుచ్చి వీలైనంత ఎదుటివారిని బాధ పెట్టేవిగా ఉంటాయనే విషయాన్ని మనం జీర్ణించుకోగల్గాలి.   ఆ విషయాన్ని మీతో పంచుకుంటూన్నానిలా..

ఆశతో జీవించడంలోనే అర్దమెంతో వుందిలే..

ఈ “ కరోన” కాలంలో బిడ్డలు దూరంగా వుండటం వల్ల ప్రతి చిన్న విషయానికి చిరుగాలికి కూడా అలఅల్లాడే చిగురుటాకులా వుంటుంది మానసిక పరిస్థితి. నిరంతర వార్తాప్రసారాలలో  వెలువడే వార్తలు గణాంకాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంటే తమ పక్కనే ప్రమాదం పొంచి వుంటుందనే ఎరుక ఒక విధమైన నిర్వేదాన్ని కల్గిస్తుంది.

మాములుగా స్పందించే చిన్న అనారోగ్య సూచన.. కూడా ముఖ్యంగా జలుబు తుమ్ము లాంటివి గొంతునొప్పి లాంటివి కూడా ఉలికిపడేలా చేస్తున్నాయి. తుడిచినదే తుడవడం కడిగినదే కడగడం ఆహార అలవాట్లలో మార్పు రావడం... మనవాళ్ళ క్షేమసమాచారాల పట్ల ఆదుర్దా.. కొన్ని అర్దంలేని భయాలు అర్ధం గురించి జాగ్రత్తలు ప్రణాళికలు.. చేయాలని వున్నా కూడా చేయలేని సహాయాలు ఇతరులను అంటకూడా సామాజిక బహిష్కరణలు.. ఒక విధంగా ప్రతి మనిషి ఒక వొంటరి ద్వీపమై మనని మనం వెలివేసుకుని పంజరాలలో బిగించుకున్న బతుకులు. నిస్వార్దముగా సేవ చేయడం లేదని ఈసడించుకున్న వైద్యులు ఆరోగ్య సిబ్బంది.. మరికొన్ని వ్యవస్థలు చిత్తశుద్దితో పనిచేస్తుంటే కొన్ని అసహనాలు తమ ఉనికిని బయటపడేసుకుటున్న ఉదంతాలు. వీలైనంత దూరంగా  వుంటూ మనని మనం కాపాడుకోవడం మనవారికి ఒక అమూల్యమైన కానుక. ముఖ్యంగా ఇతరదేశాలలో వున్న పిల్లలు తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా మసలుకోవాలి.

నా ఫ్రెండ్ ఫిబ్రవరి ఆఖరివారంలో USA నుండి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు భర్త ఇద్దరు పిల్లలతో కలసి. ఆమె ఇంట్లో సంస్మరణ కార్యక్రమం. మార్చి 12 కి తిరిగి వెళ్ళబోయేసరికి తిరుగు ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. కాలేజీలో అడ్మిషన్ వుండటం మూలంగా.. పెద్ద అబ్బాయి ఉద్యోగరీత్యా భర్త వీళ్ళిద్దరూ అత్యవసరమై వేరే మార్గం ద్వారా USA చేరుకున్నారు. ఆమె చిన్నబాబు ఆంధ్ర ప్రదేశ్ లో. కుటుంబం అందరికీ కరోన టెస్ట్ లు సెల్ఫ్ క్వారంటైన్. ఇక్కడ అమె కుటుంబం కూడా సెల్ఫ్ క్వారంటైన్. అదృష్టవశాత్తు అందరూ కూడా.. కరోన బారిన పడకుండా.. రక్షణ చట్రంలో వున్నారు.

నా స్నేహితురాలు ఇక్కడ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా  సర్దుకున్నా ఆమె చిన్న కొడుకు ఇక్కడ వాతావరణానికి ఆహారపు అలవాట్లకు ఇంటికి కట్టి పడేసిన ఆంక్షలకు వొత్తిడికి గురవుతున్నాడు. పైగా పుట్టిన తర్వాత దూరంగా వుండని తండ్రి అన్న లను బాగా మిస్ అవుతూ వుంటే.. నా ఫ్రెండ్ ఏమో మనుషుల మనస్తత్వాలకు ప్రవర్తనలో తేడాలు ఇగోలు శాడిజాలకు బలైపోతూ ఉక్కిరి బిక్కిరై పోతున్నారు.  మనిషి స్వార్ధజీవి. పక్కల్లో మిన్నాగు కాటుకు గురైతే తిరిగి ఇంటికి వస్తామో లేదో తెలియని పరిస్థితి కూడా..మన ఇగోలు వర్దిల్లాలి. శాడిజాలు తృప్తి పడాలి లాంటి ఆలోచనలు వుంటాయి చూడండి అవి కరోన కన్నా భయంకరమైనవి. వ్యాధులు ఆకలి బాధల మధ్య కూడా.. “నేను” ‘’నాది‘’అన్న స్వార్ధమే మనిషికి ఇలాంటి పరిస్థితులను తెచ్చిపెడుతుంది. ఎవరూ ఎవరింట్లోనూ వుండాలని అనుకోరు. ముఖ్యంగా స్త్రీలు భర్త పిల్లలతో కలిసి ఒకేచోట వుండాలని కోరుకుంటారు. అనుకోని పరిస్థితుల వల్ల వుండాల్సి వస్తే అది పుట్టిల్లైనా సోదరసోదరీమణుల ఇల్లైనా.. వారిని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి.మరింత మానసిక స్తైర్యానివ్వాలి తప్ప సూటీపోటీ మాటలు అంతస్తుల బేరీజులు డబ్బు లెక్కలు పిసినారితనాలు చూపకూడదు.

నా ఫ్రెండ్ ఒకటే అనింది. ఈ కరోన కళ్ళు తెరిపించింది..  అని. ఈ లాక్ డౌవున్ ఎత్తేస్తే టికెట్స్ ఎంత ఖరీదైనా సరే.. ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చినా సరే వెంటనే ఇక్కడినుండి వెళ్ళిపోవాలి అంది. తల్లిదండ్రులు తోబుట్టువులే ఇలా వుంటే మనిషి మంచితనం మానవత్వం పరాయివారిలో వెతకాలనుకోవడం మబ్బు చూసి ముంత వొలకబోసుకోవడం లాంటిదే అనుకోకూడదు. మనిషితనం మానవత్వం ఇంకా చాలా వున్నాయి. లేకపోతే ఈ మాత్రం కూడా మనిషి బతకలేడు... అనిపిస్తుంది. ఫ్రెండ్స్ మనవారే మనని బాధ పెట్టినా నిబ్బరంగా వుండాలి.. ఆశతో జీవించడంలోనే అర్దమెంతో వుందిలే... అనుకుంటూ ఉత్సాహంగా .. మరింత జాగ్రత్తగా వుందాం. వీలైనంత సాయంగా మరింత ప్రేమగా వుందాం.  సరేనా..



21, నవంబర్ 2019, గురువారం

తడిచిన గుండెకు తీగైన మరో గుండె




ఈ రోజు నా బ్లాగ్ పుట్టినరోజు ... తొమ్మిదేళ్ల క్రితం ఇదేరోజున బ్లాగ్ వ్రాయడం మొదలెట్టాను.
బ్లాగ్ వ్రాయడం మొదలెట్టకపోతే నేను ఈ రచనా రంగం వైపు వచ్చేదాన్ని కాదేమో .. కాలక్షేపం కోసమైతే బ్లాగ్ మొదలెట్టలేదు .అది కచ్చితంగా చెప్పగలను.నా  బ్లాగ్ అంటే .. నన్ను నేను బహిర్గతం చేసుకుని మళ్ళీ నాలోకి వొంపుకోవడం. ఒకవిధంగా చెప్పాలంటే .. నా ఉనికి. ప్రపంచానికి నా గురించి తెలియజేసేది కూడా . యేవో కొన్ని రాతలు తప్ప నేను వ్రాసుకున్నవి అన్నీ బ్లాగ్ లో జతపరిచాను . కొన్ని తుడిచివేసాను. (నాకు నచ్చక) 
నా జీవితంలో నేను రెండింటిని చూసి గర్వపడతాను .. మొదటిది నా కొడుకు . రెండు నా బ్లాగ్. 
గత సంవత్సరం నేను USA లో అబ్బాయి ఇంట్లో ఉన్నప్పుడు .. నాకు ఆరోగ్యం బాగోలేదు. హాస్పిటల్ కి వెళ్లే సమయమూ కాదూ ఎమర్జన్సీ కూడా కాదు. గుండెల్లో మంట విపరీతమైన పెయిన్. నాకేదో అయిపోతుందనిపించింది. అబ్బాయితో చెప్పాను .. నా బ్లాగ్ డిలీట్ అయిపోకుండా జాగ్రత్తగా చూడు అని. అది నా అప్పగింత  :) 

ఇంత శరీరానికి చిన్న ఇబ్బంది కల్గితే ఏదో అయిపోతుందని ఊహించుకుని భయపడటం కూడా నా లక్షణం కాదు. నాకెందుకో ఆ సమయంలో ఒకటి గుర్తుకొచ్చింది. "నువ్వు కచ్చితంగా హార్ట్ ఎటాక్ తోనే చనిపోతావ్, నీ గుండె ..నీవి నీది కాని వేదనలు కూడా మోసి మోసి కునారిల్లిపోయి ఉంటుంది. అన్నీ నీకే కావాలి. అన్నీ హృదయం దాకా తీసుకుంటావ్. నాకెందుకు అని అనుకోవు. నీ జాతకం కూడా అదే చెపుతుంది " అని ఒక ఫ్రెండ్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఆ క్షణంలో. నేను జాతకాలను నమ్ముతాను నమ్మను అనేది పక్కన పెడితే .. మనకో మన దగ్గరవాళ్లకు ఏదైనా మంచి లేదా చేదు జరుగుతుందని చెపితే అదే ఆలోచిస్తాము. నేనపుడు ఆ స్థితిలోకి అప్రయత్నంగా నెట్టబడి .. అలా అప్పగింతలు పెట్టాను. 

అప్పటి నా స్థితికి కారణం వెర్టిగో లక్షణాలు .. మరియు .. శరీరానికి కదలికలు లేకుండా ఎప్పుడూ కూర్చునో పడుకునే ఉండటం మూలంగా ... జీర్ణాశయంలో gas ఉత్పత్తి ఎక్కువకావడం. అదంతా తల్చుకుంటే నవ్వు వస్తుంది కానీ .. నేను దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నానో తెలిసిన సమయం అది.  

నా కన్ను చెమరిస్తే మనసు  నీరైతే గుండె బరువెక్కితే  ..   హృదయం చెమ్మగిల్లితే.. కోపం వస్తే ..ఎండ కాస్తే వాన కురిస్తే ..నవ్వొస్తే ... అనుభూతి నిలవనీయకపోతే ..ఆలోచన పంచుకోవాల్సి వస్తే ... నన్ను నేను బహిర్గతం చేసుకుని తెరిపిన పడటానికి .. డైరీ లాంటి బ్లాగ్ .. నాకు భుజమైంది. ఆసరా అయింది. నా తడిచిన గుండెను ఆరేసుకోవడానికి మరో గుండె తీగైంది. అందుకే నా బ్లాగ్ అంటే నాకు అత్యంత ఇష్టం . ... కచ్చితంగా నా బ్లాగ్ లో నేను దొరుకుతాను. <3 ఐ లవ్ మై బ్లాగ్ .  ఎంతోమంది వీక్షకులు .. చదువుతూ .. అభిమానంగా పలకరిస్తారు. అది చాలు కదా ..  హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు "వనజ వనమాలి" నాలోనే నాతోనే వుంటూవుండాలి నా నేస్తమై ... వ్యసనమై..  

ఈ వ్రాతలు ఇసుకలో వ్రాసిన వ్రాతలు కావు. ఏ బేషజాలు లేకుండా .. ఆర్భాటాలు లేకుండా కీర్తికండూతి కోసం ఆలోచించకుండా వ్రాసుకున్న రాతలు. నిజాయితీగా వ్రాసుకున్న రాతలు. 
కథల విషయానికి వస్తే ఒక పాతిక వంతు కల్పనలు ఉండవచ్చు తప్ప .. వాస్తవానికి ..నా అనుభవానికి ఇతరుల అనుభవానికి  దూరంగా నేల విడిచి .. రచనలు చేయలేదు నేను. ఎంతో మంది ఇప్పటికీ చదువుతూ ..తమ స్పందనను నాతో పంచుకుంటూ ... బ్లాగ్ బావుందండీ .. అని చెప్పడం నాకు సంతోషాన్నిస్తుంది. ఆ స్పూర్తితో వ్రాస్తూనే ఉంటాను. అందరికీ ధన్యవాదాలు. కృతజ్ఞతలు. 



12, ఏప్రిల్ 2018, గురువారం

వేకువ స్పర్శ

అప్పటి దాకా గోడల మధ్య బిగింపబడిన మనసుకి చల్లగా తాకిన స్పర్శ
నూటమూడు జ్వర పీడనలో అమ్మ కొంగు వీవెనై పలకరించినట్లు 

నీలాకాశంలో తెల్లగా మెరుస్తున్న కృష్ణపక్ష యేకాదశి నాటి నెలవొంక
పక్షుల కిచ కిచలు కోడికూతలు కోయిల కుహు కుహు రాగాలు 
ప్రకృతికి నేపధ్య సంగీతంలా ..

 ఇంతలోనే భవనాల మధ్యనుండి వడిగా వాడిగా నడిచొస్తున్నసూర్యుడు ..
పద పద మంటూ నిత్య జీవితపు పనులు 

మొగ్గగానే తల్లిని అంటి పెట్టుకునే వుండాలనుకున్నకాబోయే పువ్వులా ..
ఇంకాసేపు యిలాగే వుంటే బాగుండును అనుకునే నేను ..
ప్చ్ .. రోజూ రోజూ.. యింతేగా !

15, నవంబర్ 2017, బుధవారం

స్వభావం

స్వభావం 


ప్రేమో ద్వేషమో అభిమానమో ఆత్మీయతో అలకో ఆరోపణో


అన్నీ సహజంగా అప్పటికప్పుడు ప్రదర్శించడమే నా రీతి


వాటికి అడ్డుకట్టలేయాలని


యెప్పుడు యెంత బయటకు తీయాలో


యెక్కడెంత ముసుగు వేసుకోవాలో అని లెక్కలేసుకుండా


ఈర్ష్య అసూయో ఇసుమంత కూడా లేకుండా


సానుభూతి నసహ్యించుకుంటూ


జాలి దయ వర్షంలా ఎప్పుడు కురుస్తుందో తెలియకుండా


కురిస్తే ఆపకుండా ..


నిర్భయంగా నచ్చినదారిలో నడవవడమే నా మనిషి తనం




అడ్డుకట్టలేస్తే యే మాత్రం ఆగనిదాన్ని


భావనల మార్పుతో ప్రవహించే సెలయేటి సంగీతాన్ని


పదాల కనికట్టుతో కవితలల్లే అక్షర మంత్రదండాన్ని


ఈ పద్యమల్లే నేనే ఒక ప్రపంచాన్ని.


"నేను" అనే ఒక అహాన్నీ.


జ్వలనంలో బూడిదయ్యే వరకూ అది నీటిలో కరిగేంత వరకూ


యేమాత్రం నశించని..స్వభావాన్ని.




2, సెప్టెంబర్ 2015, బుధవారం

కిటికీలో చందమామ

నదులన్నీ నిదురోయే వేళ 

అలసిన కనుపాప 

కమ్మని నిదుర అడుగుతుంది . 

నిదురమ్మేమో జోల పాటడుగుతుంది 

జోలమ్మేమో మనసునడుగుతుంది 

మనసేమో మమతనడుగుతుంది

మమతేమో మట్టిలో నిదురోయింది.

మొలకై .. మళ్ళీ వస్తానంటుంది.

నీ ఒడిని చేరతానంటుంది


కంటికి రెప్పకి మధ్య కల నడూస్తూంది

కలలో అన్నీ మొలకలే !

కల చెదిరి కన్ను తెరచి చూస్తే ..

కిటికీ బయట చల్లగా చందమామ

కిటికీ ప్రక్కగా గోడపై అమ్మ


ఒకటి కనిపించే సత్యం

ఒకటి కని పెంచిన సత్యం

నమ్మకమే జీవితం జీవితమే నమ్మకం .

ఎదురుచూపుల మేళమే ఓ ఆహ్వానం







11, జూన్ 2014, బుధవారం

బి యాస్

ఒక తల్లి హృదయం నదీమతల్లిపై ఆగ్రహావేశం

బియాస్ 

నువ్వెంతటి మోసగత్తెవి....
దారిన పోయేవారిని 
రా రామ్మని ఆహ్వానించావు
నీ అందాలని తమతో బందీగా 
తీసుకు వెళ్ళాలనుకున్న పువ్వులని 
చిదిమేసి నీ గర్భాన దాచుకున్నావ్
ఎందరో తల్లులకి గర్భశోకం మిగిల్చిన
నిన్ను నదీమ తల్లిగా ఎలా కీర్తించం!

తెలుగుతోటంతా ధ్వంసమై
కన్నీరుమున్నీరవుతూంది

నువ్వెంత ప్రమోదమో....
అంతకంత ప్రమాదకారివని హెచ్చరిస్తూ....
మా దుఃఖరాశులన్నీ ఘనీభవించిపోయి
నీలా నడకలు సాగించమని
                                                      ఉద్భోదిస్తూ.... ఉన్నావా?  "బి యాస్"

4, ఏప్రిల్ 2013, గురువారం

FB గాయం

ఒక మనిషికి ఎన్నో నాల్కలు.  పది మంది దగ్గర పది రకాలుగా మాట్లాడటం వారికి వెన్నతో పెట్టిన విద్య. మరి వారి అవసరాలు అలాంటివి. ఏం  చేస్తాం చెప్పండి. !?

అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలంటే అందరి దగ్గరా నటిస్తున్నట్లే ! కదాఆఆఆఆఆఅ !!!

నిజం చెపితే నిష్టూరంగా ఉంటుంది "యదార్ధవాది లోక విరోధి "అంటారు కదా .. అలాగన్నమాట. ఎవరికీ ఏమి చెప్పనే కూడదు. విమర్శని తట్టుకోలేనప్పుడు వాళ్ళు తమలో లోపాలు ఎలా తెలుసుకుంటారు !?

వారి భావాలు ఆలోచనలు అభిప్రాయాలు అన్నీ వారి కవిత్వం లో రచనలలో తొంగి చూస్తాయి. అవి పబ్లిక్ అయినప్పుడు పాఠకుల అభిప్రాయాలను హుందాగా తీసుకోవాలి. అలా తీసుకోవడం మానేసి వ్యంగం తో మాటలు విసరడం చూసి నవ్వుకున్నాను. విమర్శని అంగీకరించలేనివారు  ఎన్నటికి ఎదగలేరు కదా!

అప్రయత్నంగా ఒక పాట  గుర్తుకు వస్తూ ఉంది

వేషమూ మార్చెను భాషను  మార్చెను మోసం నేర్చెను
అసలు తానె మారెను అయినా మనిషి మారలేదు
అతని మమత తీరలేదు
మనిషి మారలేదు అతని కాంక్ష తీరను లేదు ... అన్నది తలచుకుంటూనే ఉన్నాను

నిన్నటి నుండి నా ప్రమేయంలేకుండా కొన్ని లైక్ లకి కొన్ని వ్యాఖ్యలకి  కొన్ని వ్యంగ బాణాల కి నొచ్చుకుని..
ఫేస్ బుక్ అకౌంట్ డిలీట్ చేయాలనుకున్నాను . ఫ్రెండ్స్ లిస్టు లోనుండి కొందరిని నిర్దాక్షిణ్యంగా తొలగించాను. మరి కొందరూ లిస్టు లో ఉన్నారు కూడా. మంది ఎక్కువైతే పిర్యాదులు ఎక్కువే!  ఆచి తూచి వ్యవహరించినా  సరే  .. నా ప్రశాంతతని  పోగొట్టుకున్నాను :(:(

 అంతకీ రాత్రి నా ఫ్రెండ్  సున్నితంగా హెచ్చరించింది కూడా  .జాగ్రత్త అని .
 హే .. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తారు ? నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అన్నాను. తాటి మట్ట నువ్వు డీసెంట్ అని చూడదు. దాని పని అందరిని చీరడమే! పైగా అవసరం లేకపోయినా     ఇతరుల మాటలు వినిపిస్తారు ఏం  మాట్లాడాలో తెలియక "నొప్పించక తానొవ్వక " ఉండటం చాలా కష్టం సుమీ ! అని హెచ్చరించింది

విడవమంటే పాముకు కోపం కరవమంటే కప్పకి కోపం !? హె.. భగవాన్ ఈ కష్టాలు ఏమిటి తండ్రీ! అన్నానా !!?

ఫేస్ బుక్ గొడవల్లోకి నన్ను లాగొద్దు తల్లీ ! నా చిత్రాలకి భయం భక్తి లతో లైక్ కొట్టక పోయినా సరే! అంటూ ఆయన మాయం . హతోస్మి .

మరి నా మదికి తగిలిన గాయం ఎవరికీ చెప్పేది ఏమని చెప్పేది!?

అందుకే నా అంతరంగం కి చెప్పుకుని .. ఇప్పట్లో ఫేస్ బుక్ వైపే చూడకూడ దనుకుని  ఒట్టు పెట్టుకున్నాను.

ఇక బ్లాగ్ లోనే ఉంటాను

ఎవరి రాజ్యాలు వారు ఏలు కోండి . నేను అసలు ఎవరికీ పోటీ కాను. నేను ఒట్టి అహంకారిని సుమా !  నా బ్లాగ్ నాకు చాలు చాలు చాలు. అంటాననుకున్నారా? ఇక్కడ అక్కడ ఎక్కడైనా ఉంటానని చెప్పడం అన్నమాట