31, డిసెంబర్ 2017, ఆదివారం

ఆశలెప్పుడూ..


ఆశలెప్పుడూ లేతగా ఉండాలి.ముదిరితే పండి రాలిపోతాయి.
కాబట్టి .. చిన్న చిన్న ఆశలతో మారిన కేలండర్ లోకి మనమూ మారిపోదాం.
అందరూ కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు చెప్పుకుంటుంటే ..అప్రయత్నంగా దాశరధి గారి గేయం గుర్తుకువచ్చింది.
"అన్నార్తులు అనాధులుండని నవయుగమదెంత దూరం 
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
పసిపాపల నిదుర కనులలో  మురిసిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవి గుండెలల  రాయబడని కావ్యాలెన్నో..."
మనచుట్టూ ఉన్న సమాజం కోసం ఇలాంటి పెద్ద కలలు కనడం అవసరం కూడా అనిపించిది.
అంతలోనే ..మనసు ఇలా వెక్కిరించింది . ఓసి ..పిచ్చి మొహమా ! ఇప్పుడేగా ఆశలు లేతగా ఉండాలి అన్నావ్ ! కలలు కూడా రాత్రి పూటే కనాలి. నువ్వు పగటి కలలు కంటున్నావ్  సుమా ..అని హెచ్చరించింది
 ప్చ్ ..ఆశలో ,కలలో, భ్రమలో ..
క్షణాలని సూర్య చంద్రుల సాక్షిగా ప్రసవిస్తున్న కాలమా ..
ఆగదులే అడుగు - ఎందుకనో నీ గర్భంలో దాచుకున్న చరిత్ర నడుగు .. అని అంటూ ..  ప్రవాహంలా సాగిపోవడమే మనపని.
మిత్రులందరికీ,బంధువులందరికీ  నూతన సంవత్సర శుభాకాంక్షలు.
(ప్రత్యేకించి అందరికి చెప్పలేను కాబట్టి  పోస్ట్

22, డిసెంబర్ 2017, శుక్రవారం

ఎలా చెపుతున్నాం !?

ఆది అనంత శబ్ద్ ఓం హై.. అని హిందూ ధర్మం చెపుతుంది అంటే నేను విన్నాను,  గుడ్డిగా నేను నమ్ముతాను , అలా అని నా విశ్వాసాన్ని ఇతరులెవరైనా అంగీకరించకపోయినా మౌనంగా ఊరుకుంటాను తప్ప వివాదానికి దిగను. 
ఎందుకంటే వేదాలు శాస్త్రాలు పురాణ ఇతిహాసాలు  అన్నీ నేను చదవలేదు వాటిని అర్ధం చేసుకోగల జ్ఞానం నా దగ్గర లేదు. ఆది అనంత శబ్దం ఓం  అని నేను అనుకోవడం పట్ల ఇతరులకి ఏమీ హాని లేదు కదా ! :) 
ప్రతి జాతికి,మతానికి. దేశానికి .ఇంకా చెప్పాలంటే ప్రతి కుటుంబానికీ తమవైన ఒక సంప్రదాయం ఉంటుంది . ఆ సంప్రదాయం ప్రకారమే నడవాలనుకుంటారు. ఏ దేశంలో ఉన్నా తమదైన సంప్రదాయాన్ని వొదులుకోవడం కష్టం .  కాలక్రమేణా అనేక  జాతులు రీతులు .సంప్రదాయాలు కలిసిపోయి కొత్త సంప్రదాయాలు ఏర్పడతాయి. మళ్ళీ అదొక సంప్రదాయంగా మారుతుంది. అనేక తరాల తర్వాత  నవ్యరీతులు తో జీవనం గడుపుతున్న వారిని ..అల్లదిగో ఆ సంస్కృతికి ఆ స్మృతికి వారసులు మీరు. మిమ్మల్ని ద్వేషించడమే మా పని. ఇంకా చెప్పాలంటే ద్వేషించడమే మా హక్కు అనే కొందరిని చూస్తూ ఉంటాం  వాళ్ళ బారిన పడకుండా మౌనంగా మన మార్గాన మనం నడుచుకుంటూ వెళ్ళడమే . ఇతరులకి హాని చేయకుండా వాళ్ళ మనసులని కష్ట పెట్టకుండా .. చదువు సంస్కారం అంటే ఏమిటో , సాంప్రదాయం అంటే  ఏమిటో తెలుసుకుని చైతన్యంగా,వివేకంగా నడవడమే ! మతం కన్నా దేశభక్తి కన్నా మానవత్వం మిన్న అని నేను ఒప్పుకుంటాను.  అలాగే పౌరులకి  దేశభక్తీ తో మెలగండి అని ఎవరూ చెప్పనవసరం లేదు. దేశ ద్రోహానికి పాల్పడకండి అని చెప్పడం సబబు. ఉత్తమ ఫలితాన్ని ఆశించాలనుకున్నప్పుడూ ఎలా చెపుతున్నాం అనేది కూడా చూసుకోవాలి అని నా అభిప్రాయం.  


చిన్నప్పుడు నుండి నేను రేడియోలో విన్న దేశభక్తి గీతం ఇదిగోండి ..మీరూ వినండి . "జయ భారతి -వందే భారతి"

19, డిసెంబర్ 2017, మంగళవారం

జపాకుసుమాల జావళి

మా వరండా తోటలో విరబూసిన .. మందారాలతో ..ఒక చిత్రాన్ని రూపొందించాను . 
చూడండి  మరి ..
ఈ చిత్రంలో వినిపించిన సంగీతం ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారంచేసే "క్రాంతిరేఖలు " కార్యక్రమం సిగ్నేచర్ ట్యూన్ అని గమనించమనవి.
 ధన్యవాదములతో ..

వీడియోని చూడండి ఈ లింక్ లో .. ప్రశ్న ఒక్కటేగా !

ప్రశ్న ఒక్కటేగా !
సమాధానాలు పై వన్నీ ఎందుకయ్యాయి అని ఆశ్చర్యపోవడం
ఇదీ చిన్న విషయమేగా అని కొట్టిపారేయలేని నీ స్థితిని
మరొకమారు గుర్తుచేస్తున్నా .. మిత్రమా !
**********
ఏం చేస్తున్నావింట్లో ఒంటరిగా
కాస్తలా బయటకి రావచ్చుగా అని నీ ప్రశ్న
గోడలతో మాట్లాడుతున్నా,బయటకొచ్చి చేసేది అదేగా అంటాను
*******
నలుగురిలో కలవకుండా ఉండటానికి యేదో ఒక వొంక వెతుక్కుంటాను
వ్యక్తిత్వాన్ని చంపుకుని నటనల ముసుగేసుకుని పొగడటం
పొగిడించుకోవడం అనివార్యంగా మారకుండా..
**********
గుర్తింపు పేరు ప్రఖ్యాతులు జలతారు పరదాల్లాంటివని
చీకట్లో తప్ప తమ జిలుగులని విరజిమ్మ లేవని అనుభవమయ్యాక
ఆర్టిఫిషియల్ గా(అసహజంగా ) విచ్చుకుంటున్న మొగ్గల మధ్య
పరిమళించి నలుగురి కంటాపడనీ అడవిపూల వునికి ఎందుకని..
**************
సరిహద్దులకావల జరిగే సభల్లో సన్మానాలకై
వరుసలో వేచి ఉన్న ప్రయాణికుడి పరాభవం నాకెందుకు గానీ
పార్కులో పిల్లల మధ్య పద్యాన్ని నిలబెట్టి
సామూహిక గానంలో గొంతుకలుపుతుంటాను.
********************
కవితో కథో .. అక్షరాల సీతాకోక చిలకలై విహరించాల్సింది
పని ప్రదేశాలలోనో ,పాఠశాలల వనాల్లోనో కానీ
రాజకీయ వేదికలపై కాదనీ .
(ప్ర తె మ స లో చోటు దొరకలేదని బాధపడే వారి కోసం)

18, డిసెంబర్ 2017, సోమవారం

అడవి పూవందం

ఈ అడవి పూవందం చూడండీ ! 
అచ్చు మన గోగు పువ్వు లా గా ఉంది కానీ గోగు పువ్వు మాత్రం కాదు . బ్రెజిల్ లో  బొటానిక్ గార్డెన్లో ఉంది . అలాగే అక్కడక్కడా ఆఫ్రికా అడవుల్లో కనబడుతుందని చదివాను . గూగుల్ సెర్చింగ్ లో ఈ అందం ఆకర్షించి వివరాల కోసం ప్రయత్నిస్తే చాలా కష్టం మీద వివరాలు దొరికాయి. ఆ వివరాలు చిత్రం క్రింద పొందుపరిచాను. .. చూడండి . 


Turnera subulata Sm.
Common name
English: White buttercup
Classification
Kingdom: Plantae (2505)
  Phylum: Magnoliophyta (2404)
    Class: Magnoliopsida (2036)
      Order: Malpighiales (93)
        Family: Passifloraceae (10(family description)
          Genus: Turnera (3)
           Epithet: subulata Sm. (3)

subulata => awl-shaped
Characteristics
Climate: tropical
Habit: herb
Flower colour: yellow

Flower: Botanical Garden, Brasilia, DF, Brazil; 3/2012 © (కాపీ రైట్ ఉన్న చిత్రం ఇది ) 

Pinterest సౌజన్యంతో .. ఈ చిత్రం. 15, డిసెంబర్ 2017, శుక్రవారం

సమకాలీన కథ - కల్పన

కల్పన (కథ ) 

రచన :సామాన్య గండవరపు 

దాలియ పూల మొక్కలు నిండి పోయిన దారి వెంబడి,క్లాస్ రూం లోకి వెళ్తూ వెళ్తూ ,ఆగి ”అమ్మా !నన్ను తీసికెళ్లడానికి నువ్వే వస్తావు కదా !ప్రామిస్ కదా!”అంది పాపాయి.పువ్వుల్లో పువ్వులా కలిసి పోయి ,ముద్దుగా అందంగా కన్నుల పండువలా వుంది.”ప్రామిస్ రా …వస్తాను ”అన్నాను.

పూలను చూస్తే జ్ఞాపకమొచ్చింది.ఇవాళ ‘ఇకెబెన ‘ క్లాసుంది .వెళ్ళాలి .ఏవేవో పనులు .ప్రతి రోజూ ఉండేవే అయినా ఇవాళ కొంత ఎక్కువ. .ఎన్ని పనులున్నా ఇకెబెన   క్లాసు వదలబుద్ది కాదు  .కళ్ళకు ఇంపుగా రంగు రంగుల పూలు, రెమ్మలు ,…పరిమళాలు.. అమర్చుతూ వెళితే ఆ అమరిక ఎక్స్ప్రెస్ చేసే ఫైనల్ ఫీలింగ్ ..ఎంత బాగుంటుందో . ..అసలు మొదట ఆ రంగులే మనసుకు ఏదో శాంతినిస్తాయ్ .ఓదారుస్తాయ్ .అందుకే క్లాస్ కి ఆబ్సెంట్  కాబుద్ది కాలేదు  . క్లాస్ దగర స్కూటీ కి స్టాండ్ వెయ్యబోతుంటే పక్కనే ఇంకో స్కూటీ వచ్చి ఆగింది .తను ఇకెబెన లో నా బాచ్ మేట్ కల్పన. హెల్మెట్ తీసి చెమట తుడుచుకుంటూ తనంది.”ఎంత ఎండలండి అప్పుడే ,ఈవినింగ్ బాచ్ కి వద్దామంటే ఇంట్లో కుదరదు” అని .

 ఇద్దరం వెడల్పాటి మెట్లు ఎక్కుతూ ఆ కాంప్లెక్స్   చివరనున్న క్లాస్ కి వెళ్లాం .

 అదే చివరి క్లాసు .అందరికీ వీడ్కోలు చెప్పి బయట పడ్డాను.

        ***          ***             ***       ***     ***         ***             ***              ***              ***

హైదరాబాద్ సెంట్రల్ యూనివెర్సిటీ లో హ్యూమన్ రైట్స్   డిస్టెన్స్ జాయినయ్యాను .ఇంకో రెండు రోజుల్లో

ఎగ్జామ్స్.ఇంటి నుండి వెళ్లి రావడం అంటే దాదాపు ఇరవై కిలో మీటర్లు ప్రయాణం.అదెలా వున్నా ఇప్పటి దాకా ఒక

ముక్కా చదవ లేదు.అందుకే పిల్లని అమ్మమ్మకి అప్పగించి యునివర్సిటీ గెస్ట్ హౌస్ కి వచ్చేసాను.

మొదటి పేపర్ బాగానే అయింది .రెండవ పేపర్ పుస్తకాన్ని చక్కగా మంచమెక్కించి కిటికీ దగ్గరగా నిలబడి బయటికి

చూస్తున్నా .యూనివెర్సిటీ గెస్ట్ హౌస్ వెనుకంతా అడవి .సెంట్రల్ యునివర్సిటీ ఒందల ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి

ఉంటుంది

 తలుపు తట్టిన శబ్దం వినిపించి కిటికీ వదిలి వెళ్లి తలుపు తీసా .ఎదురుగా’ ఇకెబెన ‘ కల్పన నేను ఆశ్చర్యం లో

నుండి బయట పడేలోపు ఆ అమ్మాయి ‘హాయ్  నైస్ టు సీ  యు హియర్’ అని పలకరించి లోపలి వచ్చింది. 

ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ చేస్తున్నానండి .ఎగ్జామ్స్ నిన్నంతా డార్మెట్రీ  లో  ఉన్నాను .చాలా డిస్టర్బెన్స్ . ఏదో కోర్సు కి

వచ్చారు వాళ్లు .బాగా ఎంజాయ్ చేస్తున్నారు .నేనేమో ఇంత వరకు చదవనేలేదు .పదే పదే రిక్వెస్ట్  చేస్తే చివరికి

డబల్ రూమని ఇక్కడికి పంపారు .అన్నట్లు మీరే పని మీద వచ్చారు .

 ”నేను హ్యూమన్ రైట్స్  చేస్తున్నా.ఎక్జామ్సే  నాక్కూడా ”

 ”అచ్చా! మీ ప్రాపర్ హైదరాబాదే అనుకుంటా కదా !”

 ”అవునండి .ఇళ్ళు ఇక్కడి నుండి బాగా దూరం ,అదీ కాక నేను కూడా  ఏమీ చదవలేదు ”.

 మొదటి సారి ఆ అమ్మాయిని పరీక్షగా చూసా ,తన నవ్వు ఎవరి నవ్వులానో ఉంది .జ్ఞాపకం రాటం లేదు చక్కటి

అమ్మాయి .ఫ్రెండ్లీ స్మైల్. 

తను లగేజ్ సర్దుకుని ఫ్రెషప్ అయి   పుస్తకం పట్టుకుని మంచం ఎక్కబోతూ, కిటికీ దగ్గరకొచ్చి బిస్కెట్స్ ఆఫర్

చేసింది. 

”వేకువ ఝామున లేస్తే బోలెడు నెమళ్ళు చూదోచ్చిక్కడ .ఆ కనిపించే అడవి నుండి వస్తాయి , పిల్ల పాపలతో

”బిస్కెట్ తీసుకుంటూ అన్నాను.

 ”నెమళ్ళా ?” ఆ అమ్మాయి ఆశ్చర్యంగా అంది .

 ”హా..అవును. మా యూనివర్సిటీలో బోలెడు నెమళ్ళు  ఉంటాయ్ .హాయిగా స్వేచ్చగా తిరుగుతుంటాయి ,ఇక్కడ స్టూడెంట్స్ లాగే”అన్నాను.

 ”ఓ సో యు ఆర్  ఫ్రం దిస్  యూనివర్సిటీ  ఓన్లీ .అందుకే మీకు  ఇలా రూం ఇవ్వగలిగారన్న మాట ”అంది.

 ”మే బి!”అంటూ చిన్నగా నవ్వాను.

 చూస్తుండగానే పల్చగా చీకట్లు ఆవరించడం మొదలు పెట్టాయి.చీకట్లను వెలిగిస్తూ వెన్నెల నెమ్మదిగా అడవి

పైనంతా పరుచుకుంటుంది

కిటికీ వద్దనుండి లేచి,  అచదువుకుంటున్న ఆ అమ్మాయితో ”డిన్నర్ కి టైమైనట్లుంది… వస్తారా”అన్నాను.’

తను  లేచింది .

డిన్నర్ మొత్తం ఒక్క పుల్కా, కర్రీతో ముగించి ”ఏంటోనండీ,  ఒక్క బాబేనా… అప్పుడే వళ్ళోచ్చేసింది ..ఎప్పుడూ  

కూర్చుని ఉండాల్సిన జాబ్ కదా, డెలివరీ తర్వాత కొంత వ్యాయామం  కూడా లేక పోడం చేత  ఇలా ఐపోయాను”

అంది.

నేను తన వెనుక ప్లేట్ పెట్టడానికి వెళ్తూ నవ్వి  అన్నాను  ”సేమ్ విత్ మి. కానీ జాబ్ వల్ల కాదు లెండి .శరీరపు తీరు

.అంతే .అన్నట్లు మీ    బాబేం చదువుతున్నాడు?” 

“సెకండ్ క్లాసంది.మీకు పిల్లలున్నారా?”  

హా,  ఒక పాప .తను కూడా క్లాస్ టూ లోనే ఉండాలి .కానీ నా జాబ్ ఒక దగ్గర ,నా  హస్బెండ్ ది ఇంకో దగ్గర.బాలన్స్ చేసుకోడం కుదరలేదు జాబ్ వదలాలా వద్దా ..సందిగ్దం  నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ని . అండ్ ఐ లవ్ టీచింగ్ ,పిల్లలు …పాటాలు … చాలా నచ్చిన ఉద్యోగం నాకది ,అదీ కాకా చదివేప్పుడు పోరాట  పటిమతో చదువుతాం కదా . ఉద్యోగం వదల లేక పోయాను. కానీ చివరికి తప్ప లేదు. జాబ్ విడిచేసా,కానీ అప్పటికే చాల ఆలస్యం జరిగింది .పాపాయి ఈడు వాళ్లు ఇప్పుడు క్లాస్ త్రీ కి  వెళ్ళ బోతుంటే తనేమో ఇంకా ukg  నే ….ఓకే. కాసేపు వెన్నెల్లో వాకింగ్ చెయ్యాలనిపిస్తుంది వచ్చే ఐడియా ఏమైనా ఉందా?అన్నాను . 

 తను ”నడుద్దాం  ,ఈ వెన్నెల మనం ఉంటున్న  నడి  హైదరాబాద్లో ఒంద  చేతులు చాచినా దొరకదు కదా ”అంటూ

బయల్దేరింది.

 నల్లటి రోడ్డు, పండు వెన్నెల పడి  పట్టు పంచ కట్టుకున్న కొత్త పెళ్లి కొడుకులా నిగ నిగ లాడుతూ సంతోషంతో

మిడిసి పడుతున్నట్టుంది .

 తనందీ   ”నాదీ సేమ్ ప్రాబ్లమండి .నేను బి  టెక్  చేశాను .జాబ్ వదిలి టు యియర్స్ అయింది .జాబ్ వదిలే

సమయానికి ఏడాదికి ఇరవై లక్షలు సంపాదిస్తున్న టీం లీడర్ని ,ఇప్పుడు ఏడాదికి వేయి రూపాయలు కూడా

సంపాదించడం లేదు .కానీ నా విషయంలో బాబొక్కడే  కారణం అనలేనేమో”అని .

ఇద్దరం నాలుగు రోడ్ల కూడలికి వచ్చాం నేను ఆగి తనతో అన్నాను,” ఆ కనిపించే బిల్డింగ్ మా లైబ్రరీ .ఒక సారి

లోపలి వరకూ వెళ్ళోద్దామా ”

 తను ముందుకు నడిచింది .

 లైబ్రరీ ప్రశాంతం గా ఉంది ,తమ యౌవనపు  ముఖాలు, పుస్తకాల్లోకి కంప్యూటర్ల లోకి  దూర్చేసి వున్నారు పిల్లలు .తెలుగు వింగ్ వైపు వెళ్లి నేను ఎప్పుడూ కూర్చునే కుర్చీ చూశాను .ఏమీ మారవు యూనివెర్సిటీ లు .అదే కుర్చీ ,అదే కిటికీ వెలుపటి పావురాలు .తనతో అన్నాను ” కల్పన గారూ ,ఇది అప్పుడు నా కుర్చీ .ఇక్కడి నా ఘన సమయాలన్నీ లైబ్రరీలోనే గడిచాయి ,ఏ ఎంజాయ్ మెంటూ  లేదు సాధారణ స్టూడెంట్స్ లాగా. ఎప్పుడూ చదువు,.. చదువు  .  దాన్ని ఎంజాయ్ చేసాననడం వేరే విషయం లెండి .ఏమైనా ఈ లైబ్రరీని చేతులు చాచి  కావిలించుకోవాలన్నంత ప్రేమ కలుగుతుంది ఎప్పుడు చూసినా ..దట్ ఈస్ ఆల్సో వొన్  రీసన్ వై ఐ ప్రిఫర్ టు స్టే ఇన్ ది గెస్ట్  హౌస్   ..నా  స్వేచ్ఛా గాలుల జ్ఞాపకాల నిధి ఈ యూనివర్సిటీ”. 

 మళ్ళీ వెనుకకు నడవడం మొదలు పెట్టాం .దారంతా  పసుపు రంగు పూలు వాడి, సోలి పోయినా .. ఆహ్వానం పలుకుతున్నట్లు పరుచుకుని వున్నాయి.కల్పన  బాబుతో కాబోలు మాట్లాడుతుంది ఫోన్లో .సంభాషనంతా  తమిళంలో సాగుతుంది. కాల్ ఎండ్ చేసిన తరువాత అన్నాను ,”మీరు తమిళులా….కల్పన గారూ ” 

తనంది”అవునండి ఐ  యాం ఫ్రం మదురై,అండ్ మై హస్బెండ్ ఈస్  ఫ్రం కోయంబత్తోర్

 ”అచ్చా.కానీ యువర్ తెలుగు … సో నైస్ ,ఊహించ లేదసలు” .

 ”థాంక్ యు! బాబును వదిలి వచ్చా కదా ,కొంత బెంగ .కానీ ఎందుకో ఒన్ వీక్ అట్లీస్ట్ ఆ సఫోకేషన్  నుండి తప్పించుకో గలిగితేనే ఎక్జాం ఇవ్వగలననిపించింది . వచ్చేసాను .లేదంటే  దూరం పెద్ద లెక్క కాదు .కానీ ఇలా రావడం ..ప్రాబ్లమే . అతను బాబుతో పెద్ద కేరింగ్ గా ఉండడు.నేను తనని ఓ టు యియర్స్ వదిలేసానండి .చెన్నై నుండి బెంగుళూర్ కి  కి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లి పోయా. అట్లా తనకి బాబుకి  గ్యాప్ వచ్చింది”.

 ఇద్దరం  మౌనమయ్యాం  .ఎందుకని కారణం ఏం అడుగుదాం. స్థూలంగా చూస్తే ఆడవాళ్ళందరూ ఒకే పడవల్లో ప్రయాణిస్తూ ఉంటారు. యేవో స్వల్ప తేడాలు అంతే.

 ఫైన్ ఆర్ట్స్  వాళ్లు టీ కప్ లాటి చిన్న శిల్పం  పెట్టారు నాలుగు రోడ్ల కూడలిలో , దాని చుట్టూ చిన్ని లాను ముచ్చటగా

.”ఇక్కడ కాసేపు కూర్చుందామా కల్పన గారు ”అన్నాను. తను తల ఊపి కూర్చుంది .

 వెన్నెలను   చూస్తూ తను మాట్లాడటం  మొదలు పెట్టింది. 

 ”ఎంతెంత పెద్ద కార్పోరేట్ ఆఫీసుల్లో యూనివెర్సిటీలల్లో పనిచేస్తున్నాం ఇవాళ ఆడ పిల్లలం .ఎంత మంది కస్టమర్స్ ని  హండిల్ చేస్తాం ,విదేశాలకి ఒంటరిగా వెళ్లి వచ్చేస్తాం ,టీం ని లీడ్ చేసేస్తాం. కానీ కుటుంబం విషయం వచ్చేసరికి ఎక్కడో తప్పు జరిగి పోతుంది .మన తెలివంతా ఎక్కడికి పోతుంది అనిపిస్తుంది .కుటుంబమనే ఒక చిన్న యూనిట్ని ఎందుకు మేనేజ్ చేయలేక పోతున్నాం .ఇంట్లో నా అపజయం ఆఫీస్లో బాస్ గా నా సక్సెస్  ని తగ్గించ లేక పోవచ్చు కానీ ఆనందాన్ని కూడా ఇవ్వలేక పొయ్యేది .ఎప్పుడూ మనసులో ఏదో దిగులు ,భయం .ఇంట్లో ఇవాళ ఏం గొడవ అవుతుందో ..ఇట్లా ..

 అతను  నన్నో పెళ్ళిలో చూసి ఇష్ట పడ్డాడు. సేమ్ ప్రొఫెషన్ .అందుకని వాళ్ళ వాళ్లు వచ్చి అడగగానే మా పేరెంట్స్

ఒప్పుకున్నారు .పెళ్లై పోయింది 

 కల్పన ఆగి నవ్వింది .నవ్వితే ఆ అమ్మాయి కింది పెదవి ఒంపు తిరుగుతుంది ఇలాటి నవ్వే ఎక్కడో

చూసాను .జ్ఞాపకంరావట్లేదు .

”మొదటేమో  ఇద్దరం సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ మి కనుక కట్న కానుకలు వద్దని అన్నారు ,కానీ ఎందుకనో వాళ్లకి

కట్నం తీసుకు రాని కోడలినని వెలితి వుండేదనుకుంటా ”   

 ”అది వెలితి కాదు కల్పనా ,నరనరానా జీర్ణించు కపోయిన మన సంస్కృతి కల్పించిన అసంతృప్తి .కోడలు లక్షలు

సంపాదించినా వస్తూ వస్తూ కాసులు మూట కట్టుక వస్తేనే విలువ ఇస్తారు”.

 ”ఔను. నిజమే! .పదే పదే అనే వాళ్లు ఏమిచ్చాడు మీ నాన్న .ఏం తెచ్చావు నువ్వు అని. నా పేరెంట్స్ ని  కించ పరుస్తూ మాట్లాడేవాళ్ళు. వాళ్ళనేమైనా  అన్నప్పుడు నాకు  ఏడుపు ముంచుకొచ్చేది . నా కళ్ళలో నీళ్ళు రాగానే, ఆ! తిప్పిందండీ  కొళాయి అనే వాళ్లు. అటువంటి కామెంట్స్ మరీ హర్టింగ్ గా అనిపించేవి  .

 మన జెనరేషన్ ఆడ పిల్లలం చదువు నుండి నేరుగా ఉద్యోగాలలోకి ,పెళ్లిలోకి వచ్చేస్తున్నాం కదా .తినడం తప్ప

వంట నేర్చుకునే తీరిక కూడా ఉండని   షెడ్యూల్స్ కదా  మనవి 

మా అత్తగారు కాపురానికోచ్చిన రెండో రోజే నన్ను వంటింట్లోకి వెళ్ళమన్నారు .ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలనే  కనీస అవగాహన కూడా లేదు నాకు . నేర్పుతారేమో  నేర్చుకోవచ్చు అనుకున్నాను .మా అత్తగారు తమాషా చూద్దాం అని పెదవి భిగించి కూర్చున్నారు .సరే సాంబార్ అందరం చాల సార్లు తిని ,చూసి ఉంటాం కదా అందుకని అది ఎంచుకున్నా . పప్పు ఉంటుంది .కూర ముక్కలు ఉంటాయ్ .అంతా ఓకే,  కానీ చింత పండు కనిపించదు కదా అంచేత చింత పండు వెయ్యలేక పోయా .అప్పటికీ కూర బాగానే ఉండింది .కానీ అది ప్రపంచ యుద్దమైనట్టు మా ఇంటి మీద అణు దాడి జరిగి పోతుందన్నట్టు మా అత్తగారు అవాళ నానా రభస చేసారు .అప్పటికింకా నా కొత్త పెళ్లి కూతురి తనం  పోలేదు కూడా .

 మా ఆడ పడుచు ఒకావిడ ఉండేది ,ఫ్రిజ్ లో నీళ్ళ బాటిళ్ళు ఖాళీగా  కనిపించాయనుకోండి  ,నీళ్ళు లేవిక్కడ బాటిళ్ళలో అని నేనెక్కడుంటే అక్కడకి వినిపించేట్టు అరిచేది .నేను ఉరుకుతూ వెళ్లి బాటిళ్ళు నింపే దాన్ని .కోడలంటే అలానే ఉండాలేమో  అనుకునేదాన్ని”. 

పరద్యానంగా చేతిలో ఉన్న మొబైల్ నొక్కుతూ ”బహుశ మీరు అనుకోవచ్చు ఇదంతా ఏముంది చిన్న గొడవలే కదా అని .వెలుపల ఉండి చూస్తే ఇవసలు చెప్పుకోడానికి కూడా చాలా సిల్లీ గా ఆనిపిస్తాయ్ .కానీ ఆ సందర్భం మద్యలో ఉన్నప్పుడు అవే వేల చేతులతో ఊపిరాడకుండా చేస్తాయి ”అంది .ఆ అమ్మాయి కళ్ళలో పల్చగా కన్నీటి పొర.

నేను కల్పన చేతిని అసంకల్పితంగా నా చేతిలోకి తీసుకుని అన్నాను ”వీటి రూపాలు ఇంచుమించు వేరేగా అనిపించవచ్చు కల్పనా … కానీ ,ఎసెన్స్ అదే మీదైనా నాదైనా ఇంకో స్త్రీ దైనా .అన్ డిఫైనబుల్ హింసలివి ”. 

”ప్రతి శనివారం బాత్రూం కడిగే పని ఉండేది .ఒక్కో సారి వీలుపడేది కాదు నాకు . అప్పుడు  పనమ్మాయి కి ఎక్స్ ట్రా   డబ్బులిచ్చేదాన్ని  కడగమని, అందుకు నువ్వేం మైసూర్ మహారాజా కూతురివా ,నిన్నిట్లా  పెంచిన  మీ నాన్నని నడి బజారులో నిలబెట్టి కడిగేస్తాం  అనేవారు  .

 శాలరీ చెక్ తెచ్చి మా మావగారికి ఇవ్వాలి .పెద్ద వాళ్లకి ఇవ్వడంలో తప్పేముంది కానీ ,ఆయన దాన్ని చేతికి కూడా తీసుకునేవారు కాదు .కళ్ళు కూడా పైకెత్తకుండా అక్కడ పెట్టు అనేవారు .అది బాధ కలిగించేది .బిడ్డల సంపాదన చూసి పెద్ద వాళ్ళు గర్వ పడితే మనకు అదో తృప్తి కదా .నేను అది ఎక్స్పెక్ట్ చేసే దాన్ననుకుంటా బహుశా.

అంత రణ రంగంలో నా పక్షం ఎవరున్నారు ?,నా తప్పేంటి అనుకునే దాన్ని.  నా  శరీరానికి పట్టాదారుడననుకునే  నా భర్త ,ఎమోషనల్ సపోర్ట్ కావాల్సినప్పుడు మాత్రం శత్రు రంగానికి సారధి అయ్యేవాడు .ఎట్లీస్ట్ అతను ,న్యాయమేదో దాని వైపు ఎందుకు ఉండకూడదు అనిపించేది. 

ఈ చిన్ని చిన్ని బేదాభిప్రాయాలే చిలికి చిలికి గాలీవానగా  మారాయి .బయటకోచ్చేయాలనుకున్నాను .బాబును ఇవ్వనన్నారు .పోలీసుల సహాయం తీసుకుని ట్రాన్స్ఫర్ చేయించుకుని బెంగళూర్ వెళ్ళిపోయాను .

 అఫీషియల్గా   డైవోర్స్ ఏం తీసుకోలేదు ,కానీ అతను కనీసం ఒక్క సారి కూడా కాల్ చేయలేదు .ఆ రెండేళ్ళు అతని కాల్ కోసం ఎదురు చూసేప్పుడు అనిపించేది,ఏంటి లోపం? , అతన్ని ప్రేమించడంలో,అతని కుటుంబ సబ్యుల విషయంలో నేను చేసిన తప్పేంటి? .మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అని .పెర్సనాలిటి డెవలప్ మెంట్ క్లాసులు అటెండ్ చేశా .వ్యక్తిత్వ వికాస పుస్తకాలు విపరీతంగా  స్టడీ చేశా .

 ఒక రోజు మా బంధువులావిడ అంది ,నిజమేనమ్మా మీరు సంపాదిస్తున్నారు కనుక విడిపోతారు .మేం సంపాదించటం లేదు కనుక చక్కబెట్టుకుంటున్నామని .అప్పుడు అనిపించింది ఉద్యోగంలో కోలీగ్స్ తోనో ,బాస్ తోనో ఇబ్బందులోస్తే మనం ఉద్యోగం వదిలేయటం లేదు కదా అని .ఆఫ్ట్రాల్ మేరేజ్ ఈస్  ఆల్సో ఎ  బిజినెస్  డీల్ ..కదా .. .అన్నీ  డబ్బు చుట్టూనే  కదా తిరుగుతాయి పెళ్లి లో మొదటినుండి .మనం ఎందుకు ఈ బిజినెస్ లో సక్సెస్ కాకూడదు అనిపించింది .

యు నో  సుధీరా .. భర్తను ప్రేమిస్తూ ఇతను నా స్వంతం అనే ఎమోషన్ మద్యలో మనం ఉన్నత వరకే స్ట్రగుల్ ,ఇదంతా ఓ గేం , గెలవడం ప్రధానం అనుకున్నామా , దేర్ ఎండ్స్  దె మేటర్ .ఇక ఏం చేసైనా సరే  గెలుద్దాం అనిపిస్తుంది  .వైభవ్ కి తండ్రి లేకుండా ఎందుకు చేయాలి ,ఈ గేం గెలుద్దాం అనుకున్నాను .తనకు కాల్ చేసి ప్రపోసల్ పెట్టాను .ఇద్దరం హైదరాబాద్ కి   ట్రాన్స్ఫర్ చేయించుకుందామని .

 అలా మా  విడి కాపురం మొదలైంది .

 ”కానీ సుధీర గారు స్థలాలు మారినంత మాత్రాన స్వభావాలు మారుతాయా ?.నా భర్త ఇప్పుడు తనదే కాక అతని అమ్మ నాన్నల రోల్ కూడా ప్లే చేస్తున్నాడు” అని   నవ్వింది …నవ్వి అంది  ”నా పేరు కల్పన అని పెట్టారు కదా మా పేరెంట్స్ ఒక్కో సారి అనిపిస్తుంది నాకు ఊహలు ఆలోచనలు అందుకే.. ఎక్కువేమో ” అని . 

 నేను లేచి  తనకు చేయందిస్తూ అన్నాను  లేవండి  కల్పన రూం కి వెళ్దాం అని .నడుస్తున్నాం .ఒక మేఘం నిండు చంద్రుడ్ని కప్పేస్తూ ప్రయాణిస్తుంది .చంద్రుడు చిన్న బోయాడు .

 రూం కొచ్చి తాళం తీస్తూ  అన్నాను ”జాబ్ యెట్లా వదిలేసారు ?”.

 ”వదిలేయాలనుకోలేదు సుధీర గారు ,జీవితంలో ఇది ఇంకో ఫేస్.బాబును ఎవరు చూసుకోవాలి  ? .ఇద్దరం బిజీ .ఇంటికొచ్చాక బోలెడు పని నా కోసం ఎదురు చూసేది .తను ఆఫీసయ్యాక , ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేసేవాడు .నేను బాబుకోసం ఉరికేదాన్ని .బహుశా దట్ ఈస్  కాల్డ్ మదర్  ఇన్స్టింక్ట్ .బాబు చదువుతున్నాడో లేదో …తింటున్నాడో…లేదో..ఇలా అస్తమానం సతమతమయ్యేదాన్ని.  

 తనకి  ఓ ఫీలింగ్ ఉండేది .నేనే కావాలని ఇలా చేసాను కనుక ఐ మై సెల్ఫ్ షుడ్ హండిల్ అల్ దీస్  థింగ్స్ అని.సో నాకిప్పుడు అట్లా రెండు పనులు .ఇంటి పని, బయటి పని .ఆఫీస్లో ఉంటె బాబు గురించి దిగులు, కేర్ తీసుకోలేక పోతున్నానని .ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ ఫోన్ల ప్రెషర్ .ప్రెషర్ .రోజు రోజు కి ఈ ఒత్తిడి  నాలో పెరిగి పోతూ పోయింది .ఇది కాక నీ డబ్బు నా డబ్బు అని గొడవలు. 

 ఒక  రోజు ఇక అర్థమై పోయింది ఈ రెండు పడవల ప్రయాణం ఇక సాగించలేనని .అదీ గాక తనెప్పుడూ అంటుండేవాడు  ఏం తెచ్చావ్ నువ్వు అని ,నేనేం తెస్తున్నానో అర్థమై పోతుంది కదా అనిపించింది .సో అట్లా జాబ్ వదిలేసా .ఎనీ వే అ యాం హ్యాపీ  నౌ .

 కానీ అది నిజమైన సంతోషమా అని అడుగుతే కాదనే చెప్పాలి.మన తల్లిదండ్రుల తరం మారింది .ఆడ పిల్లలు చదువుకోవాలని కొడుకులతో సమానం గా చదువు చెప్పించింది .కానీ చూసారా మగ వాడు మారలేదు .మగ వాడి తల్లిదండ్రుల పాత్ర మారలేదు .ఇప్పుడు మనకు అభ్యుదయం పేరిట అదనపు బరువు బాధ్యతలు” .

నేను లేచి పుస్తకాలు పక్కన పెట్టి పక్క సరి చేస్తూ అన్నాను .కల్పన గారు నేను ఉద్యోగం వదలాలనుకున్నప్పుడు కేవలం అది నా సమస్యగానే మాట్లాడేవారు ఇంట్లో అందరూ  .అతను వదలాలా నేను వదలాలా అనే ప్రశ్నకు తావే లేదు  ,మగ వాడు ఇంట్లో ఉండగలడా? ,చర్చలు మొదలయ్యాయంటే గెలిచేది ఉద్యోగం పురుష లక్షణం అనే వాదనే ,వీగి పోయేది మనమే .

మానస అని నా స్నేహితురాలు….ఎంసిజే   చేసింది. ప్రముఖ పత్రికలో పని చేసేది .పాప పుట్టాక ఏడాదిన్నర ఇంట్లో ఉండింది .భర్త డాక్టర్.ఇంట్లోనే నర్సింగ్ హోం .ఇక పాపని నువ్వు చూసుకో అని తను జాబ్లో జాయినైంది  .తనకి  ఆ జాబ్ అంటే ఎంతో ఇష్టం .అతనికి ఆ అమ్మాయి జాబ్ చేయడం  అయిష్టం .అతను యేవో ప్రజా సంఘాలతో కలిసి పని చేస్తాడు .మీటింగ్లు అవీ ఇవీ ..బిడ్డ తో అవన్నీ కుదరవు  .తను ఒక  రోజు నాతో  చెప్పింది ,బాగా నడుస్తూ ఉండిన పాప తను ఆఫీస్ కి వెళ్ళడం మొదలు పెట్టిన తరువాత మళ్ళీ గోడలు   పట్టుకుని నడవడం మొదలు పెట్టిందని  .చివరికో రోజు జాబ్ వదిలేద్దాం అని నిర్ణయించుకొని భర్తతో చెప్పిందట .అన్ని రోజులు ఎలా వెళ్తున్నావ్, ఏం  తింటున్నావ్ అని అడగని భర్త రిజైన్ చేసి వచ్చే రోజు మాత్రం కాల్ చేసి అడిగాడట ఎలా వస్తున్నావ్ జాగ్రత్తగా రా అని .

ఇప్పుడు ఆ అమ్మాయికి  రెండో బిడ్డ .ఆ బాబుకి ఏ  ఏడో  ఎనిమిదో  వచ్చే లోపు  ఆ అమ్మాయికి  ముప్పై  ఎనిమిదో  ఎంతో  వస్తాయ్  .తను అంటుందీ..అపుడిక  ఉద్యోగం  చేసే  ఉత్సాహం శక్తీ  నాకూ   వుండవు  , ఇచ్చే  వాడూ  ఉండడు అని .ఆ రెండో బిడ్డ కావాలనుకున్నది కూడా అతనే ,ఆ అమ్మాయి కాదు .

ఏంటో కల్పనా , పెళ్లై అన్నేళ్ళు పెరిగిన ఇంటిని వదిలి ఎక్కడికో వస్తాం .వచ్చిన చోటు ఒక్కో సారి యుద్ద వేదిక అయి మన కోసం ఎన్ని న్నాళ్ళ నుంచో కాచి పెట్టుకు ఉన్నట్లు దాడి చేస్తుంది .ఇంకా, ఎక్కడికో విసిరేసే ఉద్యోగాలు .హోం సిక్ నెస్.ఇంటి పేరు ఊరి పేరు మారి ఊరు పేరు లేని వాళ్ళం అయి పోతాం .అదొక్కటేనా ? శరీరంలో ఎన్ని మార్పులో .మాటి మాటికి హార్మోన్స్ తేడాలు .ఒక్కో దశలో ఒక్కో మార్పు .వొళ్ళు గుల్ల చేసి వదిలి వెళ్ళే దిగుళ్ళు ఎన్నెన్నో .ఖాళీలు ఎన్నెన్నో  .

 ఇంకో తమాషా చెప్పేదా కల్పనా ,నేనో బ్లాగ్ ఓపెన్ చేసుకున్నా ఈ మధ్య  .అందులో ఆకుపేషన్ కాలం ఉంటుంది కదా ,ఫస్ట్ చాల అనాలోచితంగా ప్రొఫెసర్  అని రాసాను .జాబ్ వదిలేసిన దాన్ని నేనెలా ప్రొఫెసర్ ని కాగలనని  తరువాత అనిపించింది. అట్లా అని హౌస్ వైఫ్ అని రాయడానికి మనస్కరించలేదు. నేను డాక్టరేట్ సంపాదించిన గోల్డ్ మెడలిస్ట్ ని  .ఈ కాంప్టీటివ్  ప్రపంచంతో  పోటీ పడి ఉద్యోగం సాధించు కున్న దాన్ని,నన్ను  నేనెట్లా వట్టి హౌస్ వైఫ్ ని అనుకో గలను  .పోనీ పోష్ గా హోం మేకర్ అనుకుందామన్నా ,నాకు నేనే ఎందుకు ఈ ఇంటి పని చేసే దానిగా ఒక  పేరుని ఇచ్చుకోవాలి .అయినా మగ వాడికి లేవేం హౌస్ హస్బెండ్ లాటి పేర్లు .ఎట్ లీస్ట్ హోం మేకర్ అనే మాటైనా” .

కల్పన నవ్వింది ..”నాదీ సేమ్ ప్రాబ్లం.నేను ఇంజినీర్ ని .ఇవాళ వెళ్ళినా ఏడాదికి పాతిక లక్షలు సంపాదించగల దాన్ని .నన్ను నేను నార్మల్ హౌస్ వైఫ్ అనుకోడానికి ఏదో ఇగో అడ్డం పడ్తుంది .అందుకే ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఏదో ఒకటి చేయాలని బాబు స్కూల్ కి వెళ్ళిన సమయంలో తంజావూర్ ఆర్ట్ ,ఇకబెన ,భరత నాట్యం అవీ ఇవీ నేర్చుకుంటున్నా  .ఇదిగో వేల్యూ ఆడింగ్ లా ఉంటుందని ఈ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ లో చేరా .ఎట్ లీస్ట్ ఇకబెన పూర్తి చేయ గలిగి  సర్టి ఫికేట్  సంపాదించ గలిగితే ఇంటి నుండే ఏదో చేయ గలను కదా .నా లైఫ్ కి లగ్జ రీని ఇవ్వడానికి నెలకో ఐదు వేలు సరిపోవా  ..అతని ముందు చేయి సాచకుండా .ఇట్లా ఇవి కొన్ని ప్రయత్నాలు .

 ”కల్పనా,నువ్వూ నేనూ పిల్లల కోసమని ఇష్టమైన ఉద్యోగాలని వదులుకున్నాం.కష్ట మనిపించినా ఇది గుడ్డిలో మెల్ల.అటు బయటి పని వదలాలన్నావదలలేక ,ఇంట్లో పని చేసుకో లేక చేతి సాయం కాదు కదా మాట సాయం కూడా చేయని మగ వారితో మల్టీ పర్పస్ వర్కర్ లై చన్నీళ్ళకు వేడి నీళ్లవుతున్నఇల్లాల్లెందరో కదా , …దిగులేస్తుంది కల్పనా ఇది ఏ పురోగమననానికి తిరో గమనం! .నేను ,నువ్వు  ,ఇంకా మనలాటివారే నా స్నేహితులూ వినయ ,శ్రీదేవి,బిందు ,అందరం ఈ రెండు పడవల  ప్రయాణీకులమే .అటో కాలు ,ఇటో కాలు .ఎప్పుడు పడి పోతామో! ఎప్పుడు ఇక నా వల్ల  కాదని అన్నేళ్ళు కష్ట పడి సాధించిన ఉద్యోగపు  పడవను తన్నేస్తామో .తన్న లేని వాళ్ళం ఎప్పుడు కుప్పకూల్చే రోగాలపాల,మానసిక వెతల పాలు పడి పోతామో .ఒక్కో సారి ఆడ పిల్లలకి చదువెందుకు అనిపిస్తుంది కూడా ”.

 కల్పన నిట్టూరుస్తూ అంది ,”లేదు సుధీరా ..అమ్మాయిలు ఖచ్చితంగా చదువుకోవాలి .ఎందుకంటె కనీసం ఏ పడవను తన్నాలనే డెసిషన్ మేకర్స్ మి మన జీవితానికి మనమే అవుతాం కదా” .

తెల్లవారబోతుంది కాబోలు .పక్షులు కిల కిలారింపులు మొదలు పెట్టాయి .కిటికీ దగ్గరకు వెళ్లి నిలుచున్నాను నెమళ్ల కోసమని .చంద్రుడు గతం ఖాతాలోకి వెళ్ళిన అనుభవం లా మసక బడ్డాడు .తను కూడా కిటికీకి వద్దకు వస్తూ కల్పన  ”నిన్నటి మీ నిదురను నాకు అంకితం చేసినందుకు బోలెడు కృతజ్ఞతలు”అంటూ  నవ్వింది . ఆ అమ్మాయి అందమైన నవ్వుని చూస్తూ ”కృతజ్ఞతలు చెప్తున్నారా మరైతే సేమ్ టు యు”అన్నాను. కను చూపు  దూరం లోనే పొదల మాటు నుండి ఒక తల్లి నెమలి,బిడ్డని వెంటేసుకుని నడుస్తూ రావడం కనిపించింది . ముద్దుగా అందంగా …ఇద్దరం చూస్తూ నిల్చున్నాం.*

************(*)************

రంగవల్లి పురస్కారం పొందిన కథ. ‘ఆంధ్రజ్యోతి’ ఆదివారం 2011 లో ప్రచురితమైన కథ. తర్వాత విహంగ వెబ్ మాస పత్రికలో పునఃప్రచురితమైన కథ. ఈ కథపై కథా జగత్ నిర్వహించిన కథా విశ్లేషణలో నాకు ప్రధమ బహుమతి లభించడం విశేషం. (నచ్చిన కథకి మంచి విశ్లేషణ చేసిన సంతోషం )  రం