19, ఆగస్టు 2015, బుధవారం

లాఠీ కర్ర

లాఠీ కర్ర 


"మూరెడు పూలమ్మితే రూపాయే గందా  వచ్చేది . అదే ఒక్క పేకెట్ అమ్మితే పది రూపాయలు కళ్ళచూడొచ్చు.  రైలు మారేపాటికి నేనొచ్చి నీకు పేకెట్లు  అందిచ్చేస్తా, గట్టిగా అమ్మినావంటే రోజుకినాలుగొందలు మిగులుద్ది . అట్టా నాలుగునెల్లు సంపాయిచ్చామంటే లచ్చాధికారి అయిపోతాం . హాయిగా బతికేయోచ్చే రమణా.. నా మాట వినవే"  బతిమిలాడుతున్నాడు వేంకటేశు.  


"ఏమో బావా ! నువ్వట్టాగే చెపుతావ్ ! పోలీసాళ్ళ కళ్ళన్నీ పహారా కాస్తా ఉంటాయి .  బుట్టలో అడుగుదాకా పూలేనా, పేకెట్లు కాని పెట్టుకోచ్చావా అని పట్టి పట్టి చూత్తన్నారు. ఆళ్ళ కళ్ళ గప్పి  బండిలోకి ఏసుకెళ్ళెది ఎట్టా? అమ్మేది ఎట్టా ? " సందేహం వెలిబుచ్చింది రమణ. 


"ఓసి పిచ్చిదానా ! పోలీసులకి కనబడేటట్టు  పూలబుట్ట లో పేకెట్ లు పెడతామా ఏంటి ? ఇదిగో నీ కోసం ఇది తెచ్చా చూడు ".అంటూ  ప్లాస్టిక్ కవరులో నుండి బయటకి తీసి చూపిచ్చాడు. రమణ దాని వంక ఆశ్చర్యంగా చూసింది . అది ఆడాళ్ళు కట్టుకునే లోపలి లంగా, పైకి మాములుగా కుచ్చీళ్ళు లంగా లాగానే ఉంది కానీ దాని లోపల వైపు వేలు పట్టే  సందు కూడా లేకుండా ప్రక్కప్రక్కనే జేబులు కుట్టేసి ఉన్నాయి . మొగుడి తెలివితెటాలి నోరెళ్ళ బెట్ట చూస్తూండగానే "ఒసేయ్ ఎర్రి మొహమా ! ముయ్యవే నోరు, ఈగలు కూడా పోతూండాయి " అని ఎకససెకాలు పడుతూనే .. ఈ లంగా నిండా పేకెట్ లు కూర్సేసి ఎసేసుకున్నావనుకో  వీటిని కనిపెట్టడం బ్రెహ్మ తరం కూడా కాదు. సారా నిషేధం పెట్టాక చుక్కేసే అలవాటు వుండాళ్ళందరికి నోరు పిడచ కట్టుకుపోయి ఛత్తా ఉండారు. సరొద్దులు దాటిపోయి తాగి రాలేరుగా, వున్న మారాజులకి వచ్చే దారిన మందు వస్తానే వుంది. ఎటుగాక చచ్చేది పేదాడే ! వాడికే పది రూపాయలది ఇరవై రూపాయలకి అమ్మి మనం సొమ్ము చేసుకోవాలె, మనం ఎంతెక్కువమ్మితే అంత డబ్బులు ఇస్తానని బట్టీ ఆయన చెప్పాడు ... వొప్పుకోవే ! కోడిని దువ్వినట్లు దువ్వి రమణని వొప్పించాలని ఆరాటపడ్డాడు . 


ఏమో, నువ్వు భయమేమి ఉండదని అంటన్నావ్  కాబట్టి  'ఊ ' అంటన్నా యేదన్నా అయ్యిందంటే  నేను ఎట్టో బడి దూకి చావడమే ! తర్జనగా వేలు చూపిస్తూ చెప్పింది . నేనున్నా కదా ! ఇశయాలన్నీ నేను చూసుకుంటా నన్నా కదమ్మీ ! ఇక పడుకో తెల్లారఝామున లేచి  రైలందుకోవాలి. అని నేలపై పక్క పరిచాడు. ఒళ్ళో  ఉన్న బిడ్డని  పక్కపై పడుకోబెట్టి  తను పడుకుని కళ్ళు మూసుకుంది. వెంకటేశం బస్తాలో ఎసుకోచ్చిన సారా పేకెట్ లని తీసి ఒక్కోకటిని ఒక్కో అరలో  పెట్టి  ముడతలు లేకుండా సవరదీసి సర్ది పెట్టాడు.    


 కోడి కూయక ముందే నిదర లేచి అన్నం కూర ఒండి మొగుడికి, తనకి బాక్సులకి సర్దింది రమణ.   అంత చలిలోనూ రెండు చెంబులు నీళ్ళు  గుమ్మరించుకుని వచ్చి  వేసుకునే చీర జాకెట్  తీసుకుని  జాకెట్ తొడుక్కుని వెంకటేశం  తయారు చేసిన లంగా చేతిలోకి తీసుకుని ఆ బరువుని మోయలేక కిందకి వదిలేసింది. టప్ మన్న చప్పుడుతో  వెంకటేశం  నిద్ర నుండి లేచి అప్పుడే తెల్లారిపోతుందా, మొద్దు నిద్దర పట్టేసింది. అంటానే కిందబడ్డ లంగా వైపుకి చూసి "ఇట్టా  కిందబడితే పేకెట్లు చిరిగిపోతాయి  చుక్క మందు బయటకి ఒచ్చేసిందా పోలీసు నాయాళ్ళు  వాసన పసి కట్టేస్తారు. జాగ్రత్తగా ఉండాలి"  .. అంటూ  " ఇటురా  నేను లంగా కడతా " అంటూ .. చొరవగా ముందుకొచ్చాడు. మొగుడు పెళ్ళాం  ససరసాలాడు కుంటున్నప్పుడే  మొగుడు ముఖం చూడటానికి సిగ్గు పడే రమణ వెంకటేశానికి యెదురుగా తాడిచెట్టల్లె నిలబడింది . రమణ  సృహలో లేకుండా ఎక్కడో ఆలోచిస్తుందన్నది అర్ధమై కదిలిస్తే యెక్కడ మొదలుకే మోసం వస్తుందని గ్రహించి రమణ తలమీద నుంచి లంగా తొడిగి ఒంటిమీదన్న పాతచీరని తీసి తన భుజం పై వేసుకుని  బొందులు లాగి ముడివేసాడు. 

రమణ కైతే ఓ పెద్దనాయకుడిని చంపడానికి ఆడమనిషికి నడుంకి బాంబులు కట్టుకుని వెళ్ళిందని చెప్పుకున్న విషయమే గుర్తుకొచ్చి ... ఇట్టాగే కట్టారు కాబోలు అనుకుంది. రమణ చీర కూడా చుట్టుకోకుండా ఆలోచిస్తానే ఉందని తనే చీర చుట్టి కుచ్చెళ్లు పోసి ఇచ్చి .. "ఇక ఆలోచిచ్చింది చాల్లేవే ! కుచ్చీలు దోపుకుని అటు ఇటూ నడిచి చూడు" అని గదమాయించాడు .   


అలవాటులేని పని బెరుకు బెరుకుగా మొదలెట్టి    రెండుమూడు నెలలకే   రోజుకి  వంద సారా పేకెట్లు అమ్మడంలో ఆరితేరిపోయింది రమణ. అసలు దారి మూసేస్తే ప్రక్కదారులు వెదుక్కున్నట్టు అదివరకటి కన్నా  యెక్కువగా సంసారం గుల్ల చేసుకుని మరీ తాగే సారా ప్రియులు, అందుబాటులో లేని ఖరీదైన మందు దొరక్క నాటు రకానికే మళ్ళిన డబ్బున్న తాగుబోతులు రమణకి రోజువారీ కస్టమర్లు అయిపోయారు. డబ్బు రుచి ముందు రమణ బెరుకు,భయం అన్నీ పోయాయి. 


 ఒకరోజు ఆలస్యంగా బయలుదేరి  హడావిడిగా కదులుతున్నరైలేక్కేసింది . తీరా చూస్తే అది  ఎసి బోగీ. వెంకటేశం యెనకనే వున్న బోగీ ఎక్కేసాడు కానీ  అతని చేతి సంచీలోనే సారా పేకెట్ లు  వుండిపోయాయి. రైలు నెమ్మెదిగా బ్రిడ్జీ దాటుతుంది. చెక్ చేస్తూ వస్తున్న రైల్వే పోలీస్ రమణని కనిపెట్టాడు . రైలాపి ఆమెని స్టేషన్ కి లాక్కెళ్ళి కూర్చోబెట్టి వివరాలు అడుగుతూ అసలు విషయం కనిపెట్టేసాడు.  


 సమయం రెండు గంటలవుతుంది. పోలీస్ స్టేషన్ లో పొద్దుటినుండి  నుంచుని నుంచుని కాళ్ళు పీక్కుపోతున్నాయి. అయినా క్షణం క్షణం గది గుమ్మం వైపు చూస్తూనే వుంది. గుమ్మం బయట మనుషులు చీమలబారుల్లా  తిరుగుతూనే ఉన్నారు అందులో వెంకటేశం ఉంటాడేమో నన్నఆశ,  సీజన్ టికెట్ తీసుకుని వచ్చి  చూపించి   తనని తీసుకుపోతాడనే ఆశతో  కళ్ళు కాయలు కాసిపోతున్నాయి. అయినా అతను  రావటం లేదు. నీరసం ముంచుకొచ్చింది  రమణకి. 


 హెడ్ కానిస్టేబుల్  రాక్షసుడిలాఎదురుగా  కూర్చుని తినేసేటట్టు చూస్తూనే వున్నాడు. వాడి చూపులు ఒంటి మీద  త్రేళ్ళు, జెర్రులు ప్రాకినట్టే ఉండాయి. చీర కొంగుని భుజంచుట్టూ కప్పుకుని నిలబడిన చోటే సత్తువలేనట్టు  జారగిలబడి నేలపై కూర్చుని  గోడకి చేరగిలబడింది. కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి. క్యాంటీన్ నుండి సర్వర్ కృష్ణుడు  టీ  తీసుకొచ్చి హెడ్ కి ఇచ్చాడు. ఆఫీసులో పనిచేసే వారికీ ఇచ్చాడు . ఇంకోటి మిగిలిపోయింది . ఏం  జేయను సార్ ! అడిగాడు . వెనక్కి తీసుకుపోయి లెక్కలో ఒకటి తగ్గించి రాయి  చెప్పాడు . 


"పొద్దుటి నుంచి ఈ ఆడ మనిషి ఇక్కడే కూర్చుని ఉంది. మగాళ్ళని కూడా నలుగురైదుగురిని తీసుకొచ్చారు కదా ! వాళ్లేరి ? ఈ మనిషి ఇక్కడే కూర్చోబెట్టారు ,   ఈమెని విడిచి పెట్టనూ లేదు  స్టేషన్ కి పంపలేదు ఇక్కడే ఉంచారు? " ఏం  తప్పు చేసింది సార్ అనడిగాడు కృష్ణుడు . 


" ఈ  ముండ " రోజూ  పూలు అమ్ముతున్నట్లు నమ్మించి సారా పేకెట్ లు అమ్ముతుందిరా! పైగా టికెట్ కూడా కొనడం లేదు అందుకే  తీసుకొచ్చి లోపల పడేసా, ఎనకమాల బోగీలోమొగుడు రైలెక్కి వుంటాడు.  ఆడి జేబులో సీజనల్ పాస్ ఉంది  ఆడు వస్తాడు చూపిస్తాడని  బొంకు మాటలు చెపుతుంది. దీని మాటలు ఎంత నిజమో ! సరే  వాడొచ్చేదాకా చూద్దామని చూస్తున్నా. అందుకే కేసు రాయలేదు.  ఈ కేసు సంగతి చూస్తే గాని ఇంటికి వెళ్ళను. డ్యూటీ అంటే అంత సిన్సియర్ గా చేయాలి, చేస్తానని పేరు కూడా ! నీకు తెలియనిది ఏముంది ? అన్నాడు.  


"అవునండీ .. మీరు ఎంత సిన్సియరో నాకు తెలియకపోతే కదా, మీరు అంత గొప్పగా ఉండబట్టే ఇక్కడ స్టేషన్ లో  దొంగతనాలు తగ్గాయి, రౌడీల పెత్తనం తగ్గిపోయింది. మీకు మీకు ఉన్న అండర్ స్టాండింగ్ లు అలాంటివి మరి .  అయినా  లంక చేలల్లో బట్టీలు  పెట్టి  సారా కాసే వాళ్ళని, మధ్యనుండి  సరుకేసే దళారీలని వదిలేసి అమ్ముకునే వాళ్ళని పడితే ఏమొస్తుంది. పడితే తిమింగాలనే పట్టాలి గానీ " అంటూ చురకేసి   "ఇదిగోమ్మా ! కాస్త వేడి వేడిగా  ఈ టీ  తాగు. మీ అయన వచ్చేస్తాడు లే ! నిన్ను తీసుకుని పోతాడు భయపడకు"  అంటూనే  " ఇదిగొ హెడ్ గారు ఈ టీ  మీ లెక్క లోకి రాదులే ! నా లెక్కలో రాసుకుంటాను." అన్జెప్పి  వెళ్ళిపోయాడు.  


ఆలోచిస్తూనే బెరుకుగా ఆ టీ తాగాలా వద్దా అన్నట్టు చూసి అనుమానంగా హెడ్ వైపు చూసింది రమణ.  తనవైపుకి చూపులు మరల్చ గానే అప్పటిదాకా రమణ నే తినేసేటట్టు చూస్తున్న హెడ్ చప్పున పేపర్ లో తల దూర్చాడు.    ఈగలు ముసురుకోబుతున్న ఆ టీ  గ్లాస్  వైపు  కాసేపు చూసి నెమ్మదిగా చేతిలోకి తీసుకును టీ తాగింది   


 ఎనిమిది దాటిపోయింది."అయ్యా !  బయటకెళ్ళి కాసిని నీళ్ళు తాగి వస్తాను " దాహంగా ఉంది అడిగింది హెడ్డు ని . 


 రమణని బయటకి పంపితే ఆమె  కోసం వెదుకుతున్న వాళ్ళ కంటబడితే తను అనుకున్న పని నెరవేరదు, అదీ గాక ఇది తప్పించుకుని పారిపోవచ్చు అనుకుని " ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అక్కడే కూర్చో నేను నీళ్ళు తెప్పిస్తా " అని గదమాయించాడు . తనే బయటకి వెళ్లి  క్యాంటీన్ సర్వర్  కృష్ణుడు తోనే నీళ్ళు పంపించాడు . 


నీళ్ళు ఇస్తూ చెప్పాడు . మీ ఆయన అనుకుంటానమ్మా ! మధ్యానం  నుండి ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు.  నీకు కనబడాలని గుమ్మం తిన్నగా వచ్చి పట్టాల మీద నిలబడుతున్నాడు. లోపలి రాడానికి దైర్యం చాలడంలే ! ఈ ఆంబోతు  హెడ్డు గాడు  ఏ ఇనప కమ్మీలు దొంగతనం  చేసాడనో  కేసు బనాయించి లోన వేస్తాడని బయపడుతున్నాడు . నీ కోసం వరంగల్ దాకా పోయోచ్చాడు అంట . మీ అమ్మ వాళ్లంటికి పోయోచ్చాడంటా, ఎక్కడా లేదు యేమైపోయిందో అని కలవర పడుతుండగా  మీ పూలాళ్ళే  చెప్పారంట  నువ్వు యిక్కడ వుండావని . ఏం చేయాలో తెలీక చతికిలబడ్డాడు . ఏదో అదృష్టం జరగాలి మీరు బయటపడాలంటే . ఈ హెడ్డు గాడి ఆకలి సామాన్యం కాదు . బాగా మేపితే కాని బయటకి వదలడు. కాసేపాగినాక ఏదో ఒక టిఫిన్ పట్టుకొస్తాను .  కాస్త తిని నెమ్మదిగా పడుకో ! అన్నింటికీ  ఆ దేవుడే అండ  అంటూ వెళ్ళిపోయాడు . ఇంతలో ఎక్కడినుండో కూతురు ఏడుపు వినిపిన్చినట్లనిపించింది.   గొంతు ఎండిపోతున్నానీళ్ళు ఎదురుగా వున్న  గొంతు  తడుపుకోవాలన్న సంగతి కూడా మర్చిపోయి గబాల్న లేచి గుమ్మం ముందు కొచ్చి అటు ఇటు చూసింది. ఎక్కడా వెంకటేశం కానీ, కూతురు కానీ  కనబడలేదు లాటీ ఊపుకుంటూ  హెడ్ వస్తూ కనబడ్డాడు. . 


గబుక్కున లోనికోచ్చింది. ఏంటే  పారిపోదామని చూస్తున్నావ్,   ఆడదానివని  కూడా చూడకుండా మక్కె లిరగదంతాను . లోపలి పద అంటూ రమణ  జుట్టుని బలంగా ఒడిసి పట్టుకుని  ఈడ్చి మూలకి తోసాడు ." టప్"  మని మూలకి కొట్టుకుని  సృహ తప్పి పడిపోయింది రమణ.


 " సర్  ఆ మనిషికి ఏదైనా అయితే మనకి  మూడుద్ది . ఈ సారి ఆధారాలతో సహా పట్టుకుందాం, ఇప్పుడు వదిలేద్దాం సర్ ! కానిస్టేబుల్ నచ్చజెప్పబోయాడు . 


"ఆ విషయం నాకు తెలుసు నీ డ్యూటీ టైం  అయిపోయినట్లు  ఉందిగా నువ్వెళ్ళు, నా రిలీవర్ వచ్చాక నేను వెళతాను " అంటూ తరిమేసాడు.      .  


కాసేపటి తర్వాత  రమణ  సృహలోకి  వచ్చింది.    నెమ్మెదిగా  లేచి హెడ్ ముందుకొచ్చి నిలబడి   "బాబూ ! నన్ను వొదిలి పెట్టయ్యా ,  నేను నిజంగా పూలే అమ్ముతున్నాను సారా పేకెట్ ల సంగతే తెలియదు .  సీజన్ టికెట్ కూడా కొనుక్కున్నాం . మీరు ఇప్పుడు వదిలేస్తే రేప్రొద్దున అది కూడా తీసుకొచ్చి చూపిస్తాను. ఇంటిదగ్గర పసి బిడ్డ  కూడా ఉంది " ప్రాదేయపూర్వకంగా  అడిగింది .   


ఏం  తింటావ్ చెప్పు ?  నాకు "బిర్యానీ " ఆర్డర్ చెపుతున్నా . నువ్వు కూడా తింటానంటే తెప్పిచ్చి పెడతా  అంటూ వంకర నవ్వొకటి  నవ్వాడు . హెడ్ వైపు అసహ్యంగా చూసింది రమణ.

  టైం చూస్తే  తొమ్మిదవుతుంది. ప్లాట్ పారం పై సందడి కూడా తగ్గుతుంది . ఈ హెడ్ ఎప్పుడు డ్యూటీ మారిపోతాడో ఇంకెవరు వస్తారో ? ఆ వచ్చే వాడు వీడు లాగానే ఉంటే, గుండెల్లో భయం  ముంచుకొచ్చింది. మొగుడిపై కోపం తన్నుకొచ్చింది. ఈ ముదనష్టపు సారా పేకెట్ లు అమ్మొద్దు అంటే వినలేదు. వాటిని  అమ్మిన పాపానికి  ఈ హెడ్ ఇప్పుడు పట్టుకుని సాదిస్తున్నాడు.  భగవంతుడా, నన్నీడ నుండీ బయటపడేయి ! కనిపించని దేవుళ్ళకి  మొక్కుకుంది . 


హెడ్ బిర్యానీ తెప్పించుకున్నాడు . దానితో పాటే సారా  పేకెట్ లు కూడా.  తింటున్నాడు ,తాగుతున్నాడు . మధ్య మధ్యలో రమణ వంక  ఆకలి చూపులు చూస్తున్నాడు . ఆ చూపులు అర్ధమై  రమణకి పై ప్రాణాలు పైనే పోతున్నాయి.. హెడ్ తినడం ముగించి చేతులు కడగడానికన్నట్లు లేచాడు.  పారిపోవడానికి అదే అదనుగా అనిపించింది. పారిపోయినా  ఎంత దూరం  పోగలదు ? వెంటనే చిక్కిపోవడం  ఖాయం అనుకుంది.  అలా నిమిషాలు గడుస్తూ వుండగానే హటాత్తుగా గుమ్మం దగ్గర  కూతురు కనబడింది. ఆ పిల్లని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించి ఒక్క వుదుటున  పిల్లని తీసుకుని వొళ్ళో పొదువుకుంది.  శృతీ  "నిన్నెవరు తీసుకొచ్చారమ్మా " అడిగింది .. ఆ పిల్ల నాన్న అంటూ గుమ్మం వైపు చూపింది రమణ.  మళ్ళీ గుమ్మం  దగ్గరికి వచ్చి బయటకి చూసింది . ఈ సారి కూడా భర్త కనబడలేదు  కానీ, యిక్కడే ఎక్కడో ఒక చోట దాక్కుని ఉంటాడని అర్ధమై ... దైర్యం వచ్చింది. పొద్దుటి నుంచి తల్లి కనబడని పిల్లకి తల్లి వొడి దొరకగానే ఆకలి గుర్తొచ్చింది. తల్లి గుండెలపై ఉన్న పైటని  ప్రక్కకి తోసి జాకెట్ పైకి లేపి స్తన్యం దొరక పుచ్చుకుని ఆనందంగా పొట్ట నింపుకోసాగింది .


పిల్లతో పాటు నాకు పాలు ఇస్తావా, అమ్మ పాలు అప్పుడెప్పుడో తాగా .. మళ్ళీ ఒకసారి రుచి చూడాలనిపిస్తుంది ... వచ్చి మోకాళ్ళపై రమణ ముందు కూర్చున్నాడు . " తూ.. నీ యమ్మ " యేమడుగుతున్నావ్ రా ! కాలితో ఎగిరి తన్నానంటే బొక్క బోర్లా పడతావ్, ఊరుకుంటున్నానని వెకిలివేషాలు  యేస్తన్నావ్?  అంటూ  సివంగిలా పైకి లేచింది.  


ఏంటే నోరు లేగుస్తుంది . నేను తల్చుకున్నానంటే  నిన్ను నీ మొగుడిని లోపలేసి అయిదారేళ్ళు శిక్ష  వేయిస్తా ఉగ్రంగా పైన పడబోయాడు . 


 అంతలో రమణ వేడుకోలువిన్న దేవుడే పంపినట్లు  "స్టాపిట్ స్టాపిట్ ఏం జరుగుతున్దిక్కడ     అంటూ  స్టేషన్ ఎసై   వచ్చాడు. హెడ్ వైపు కోపంగా చూస్తూ .., మీ గురించి ఇప్పటికే ఎన్నో పిర్యాదులున్నాయి . అక్రమంగా  ఆడవాళ్ళపై కేసులు బనాయించి వాళ్ళపై అత్యాచారాలు చేస్తున్నావని . అలాగే అమాయుకులపై దొంగతనాల కేసులు బనాయించి అసలు దొంగలని దాటేస్తున్నావని . మీకింతకు ముందే ఒకసారి వార్నింగ్ ఇచ్చాను  అయినా మీకు బుద్ది రాలేదు .  ఇప్పుడు సాక్ష్యంతో సహా దొరికిపోయావ్ ! మీకు సస్పెన్షన్ తప్పదు " అన్నాడు . మళ్ళీ వెంటనే   "ఎందుకు తీసుకు వచ్చావ్ ఈమెని" అని ప్రశ్నించాడు. . 


" పూలు అమ్ముతున్నానని సారా పేకెట్ లు అమ్ముతుందండి, టికెట్  కూడా లేదు, అడిగితే సీజన్ టికెట్ అంటుంది. అలాగే దీని మొగుడు జేబులు కొట్టేస్తున్నాడని కంప్లైంట్ ఉంది " అందుకే లాక్కొచ్చాను . ఇంత  వరకు  ఎవరు రాలేదు, అందుకే స్టేషన్ లోనే  ఉంచాను "  హెడ్ సంజాయిషీ యిచ్చాడు.


"ఎవడికి వాడు  సమాజాన్ని జలగల్లా పట్టి తాగేస్తున్నారు,  వ్యవస్థని  నాశనం చేసి పారేస్తున్నారు .నిజాయితీగా పనిచేసేవాళ్ళు, మంచి చెడు ఆలోచించే వాళ్ళే లేకుండా పోతున్నారు.  ప్రభుత్వం  ప్రజల సంక్షేమం కోసం ఎన్ని నిషేధాలు పెట్టినా వాటిని ప్రజలే అమలవనివ్వరు. ఇంకెందుకీ నిషేధం, పందికొక్కుల్లా కొందరు బొక్కడానికి, పేదవాడు ఇంకాస్త పతనమవ్వడానికి తప్ప "   పైకే అనుకుంటూ అసహనంగా  సీట్లో కూర్చున్నాడు ఎస్సై .    


ఓ రెండు నిమిషాలు ఆలోచించి రమణ వైపు చూపి   " నువ్వెళ్ళు"    అంటూ రమణ కి చెప్పగానే ఆమె  కృతజ్ఞతగా చేతులు జోడించి  బయటకి వెళ్ళింది. ఆమె పదడుగులు వేసిందో లేదో " ఏయ్ ఆగు "అంటూ వెనకనుంచి .. కేకేసాడు ఎస్సై . 


రమణ ఆగింది.  దగ్గరకి వచ్చి "నిజంగా నువ్వు పూలే అమ్ముతున్నావా?" అడిగాడు . 


"అవునండీ ! " అబద్దమే చెప్పింది ఈ సారి కూడా .  

  

ఎస్సై అసహనంగా   రమణ దగ్గరికి వచ్చి జుట్టు పట్టుకుని ముందుకి వొంచి  లాటీ కర్రతో వీపుమీద ఒక్కటిచ్చాడు  


"చచ్చాన్రో బాబోయ్ "  అంటూ రమణ కేక పెట్టి కూలబడిపోయింది.   


(విహంగ వెబ్ మాస పత్రిక లో 08/2015 లో ప్రచురితం ) ప్ర ర వే  అనేక ఆకాశాలు  లో  వచ్చిన కథ. 




 


కామెంట్‌లు లేవు: