21, ఆగస్టు 2015, శుక్రవారం

హాంగోవర్

హాంగోవర్

తల పగిలిపోతుంది
రక్త నాళాలు చిట్లిపోతున్నట్లు బాధ
యాపిల్ ని కత్తితో కొస్తే రెండు చెక్కలైనట్లు
మెదడు రెండు ముక్కలైతే బావుండును
నా నుండి నేను  పాయలుగా చీలిపోతున్నట్లు
శాకోపశాఖలుగా విస్తరించినట్లు
అంతర్వేదన బహిర్వేదన
ఏది ఎక్కువో ఏది తక్కువ చెప్పడానికి లేదు
హృదయాన్ని  పిండేస్తున్నబాధ
నిజ జీవిత శకలాలని చూసి చూసి
హృదయాన మోసి మోసి
మెదడు ఆలోచించి ఆలోచించి
బాహ్య ప్రపంచపు బాధలన్నీ అంతః ప్రపంచ బాధలుగా
తిష్ట వేసుకుని కూర్చుంటే కనబడని రక్తస్రావాలెన్నెనో
కళ్ళ ముందు చీకటి పొరలు లోకం తాలూకు  పసిరకలు
కొన్ని వెలుతురు  మరకలూ
నన్ను వ్రాయి నన్ను వ్రాయి అంటూ
పాత్రలు యుద్ధం చేయడం మొదలెడతాయి
అందులో ముసుగేసుకున్న పాత్రలు కొన్ని
 వేదిక ఏదైనా సన్నివేశం రక్తి కట్టించాలి
పాఠకుల హృదయం తడిసి ముద్దై పోవాలి
అంతా నిజమే వ్రాయాలంటే అసలు కుదరదు
రక్తి కట్టాలంటే అబద్ధాలు వ్రాయాలి
అబద్ధం వ్రాయడానికి ఆలోచన కావాలి
మనసుతో అసలు పని లేదు
కాస్త కాఫీ అన్నా పడితే బాగుండును  చురుకు పెరుగుతుంది
చిక్కటి కాఫీ లోకి పంచదారలో చీమ బలై పోయింది
ఓపిక లేదు వాటిని దులిపేందుకు అదో ఎస్సెం టయిల్
పాపం చీమ ! అసలెందుకు రావాలి అక్కడకి .
కాఫీతో కాస్త కవిత్వమైనా నంజుకుందాం
అయినా ఎక్కడుంది కవిత్వం
యాక్ .. వాంతోస్తుంది
కవి అనుభవిస్తాడు కథకుడు అభినయిస్తాడు
 మూడు కవితలు  ఆరు కథలు ఎందుకయ్యాయో
అని ఆలోచిస్తా .. ఆ ... అర్ధమయ్యింది
కథే నయం  ఏ పాత్రకి ఏ రంగేయాలో
ఏ మాటలు మాట్లాడాలో తూకం వేయాలి
అయినా ఏదో వైపు మొగ్గు జూపుతూనే ఉంటుంది
ధర్మబద్దంగా వ్రాద్దామంటే  ఎడిటర్ ఈడ్చికోడతాడు
కొందరి మనోభావాలు దెబ్బ తింటాయంటాడు
చాప క్రిందకి నీరోచ్చినా పట్టు చీర తడవకుండా కూర్చునేందుకు
పీట  తానిస్తానంటాడు.
తల నొప్పి బిళ్ళలేసుకుని
తలనొప్పి కలిగించకుండా వ్రాయాలంటాడు
ఇంకోసారి కాఫీ .. లాభం లేదు .
సెన్సర్  లోషన్ సెన్సార్ కన్నా ఎక్కువ పని చేస్తుంది కానీ
 అదీ  చాలడంలేదు ఎందుకో !
దాహంగా ఉంది కాస్తంత సంగీతాన్ని తాగాలిప్పుడు
ఎమ్ పీ త్రీ సముద్రపు ఒడ్డున వాలిపోయా
 అష్టాదశ వత్సరాల క్రితం  ఏ లోకాలకో వెళ్ళిన అమ్మ వచ్చి
కర్పూర తైలాన్ని కను రెప్పల పై వ్రాసి సున్నితంగా మర్దన చేసింది
లోకంలో బాధలన్నీ నీకే  కావాలా   అంటూ ప్రేమగా కోప్పడింది .
నా బాధ లోకం బాధ ఒకటే కాదా అంటే నవ్వి దూది పింజేలా తేలిపోయింది
కల్మషాలు ఉండకూదంటూ కన్నీరు చెక్కిలిని తడిపేసింది
ఖండాంతరాలలో  ఉన్న నా ప్రియపుత్రుడొచ్చి
మెత్తగా నా పాదాలొత్తుతూ "పిచ్చి అమ్మా " అంటాడు
రాళ్ళ మీద నడిచొచ్చిన బాధ గుర్తే రాదసలు .
ఒంటరితనం నాకు లభించిన వరమో
ఒంటరితనానికి నేను లభించిన శాపమో  కానీ
 అక్షరాలలో ఉన్న కథకి ప్రాణం వస్తుంది అప్పటికప్పుడు
కథ  కంచికి చేరుతుందో లేదో కానీ ..
కథ  వ్రాసినప్పటి హాంగోవర్  నన్ను అంటిపెట్టుకునే ఉంటుంది
ఇంకోసారి కాఫీ
మొండిచెయ్యి చూపిన పాల బుట్ట  
శ్రావణ లక్ష్మి కోసం ఇల్లాళ్ళ ఆరాటం
బర బర మంటూ  చీపురు మోతలో  వినిపిస్తుంది
అర్జంట్ గా   ఇల్లంతా తిరిగే మనిషిని కావలప్పుడు
మధ్యాహ్నం కయినా మంచి కాకరకాయ కూరనవ్వాలి

(కథ  మిగిల్చిన హాంగోవర్ రూపం ఇది )

   

కామెంట్‌లు లేవు: