నిగమ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నిగమ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, సెప్టెంబర్ 2022, శనివారం

ప్రేమ్ నగరం లో అతిథి

బహుళ త్రైమాసిక పత్రిక    ‘’రసోత్కృష్టం” శీర్షిక న  ‘’నిగమ’’ పేరుతో  అనువాద కథలను పరిచయం చేస్తున్నాను కదా… అందులో ప్రచురింపబడ్డ ఈ కథను చదవండి..


కథా పరిచయం: 


“ప్రేమ నగరంలో అతిథి"


కొందరు పవిత్రతను హృదయంతోనూ మనసుతోనూ తూస్తారు. మరికొందరు శరీరంతో లెక్కిస్తారు. నిత్యం వొళ్ళు అమ్ముకుంటే తప్ప పొట్టనిండని స్త్రీలు తమ దౌర్భాగ్యపు జీవితాలను ఇతరులతో పోల్చుకుని వేదన చెందుతూ వుంటారు. వేశ్యావృత్తిలో వున్నవారు తమను తాము కళంకితులుగా భావించుకుంటూ ఆత్మనూన్యతతో  కృంగిపోతూనే తమ అసహనాన్ని కసిని వివిధ రూపాల్లో ప్రదర్శిస్తారు. కొందరు తమ వ్యక్తిత్వాలను తూట్లు పడకుండా కాపాడుకుంటారు.  

నిజానికి సమాజం యొక్క కామ ప్రకోపాలకు బాధితులైన వారు విలాసవంతుల కొరకు తయారుచేయబడ్డవారు గత్యంతరం లేక ఆ రొంపిలోనికి దిగినవారు దించబడ్డవారు వేశ్యలు గా జీవనం సాగిస్తూ వుంటారు. అదిగో .. అలా ఏర్పడిందే ఊరు వెలివేసిన ఆ వేశ్యా వాటిక. ఆ వాటిక కు సమాజం పెట్టిన పేరు “ప్రేమ నగర్” ఊరి చివర స్మశానభూమిలో  వెలసిన ఆ ప్రేమనగర్ లో పాతికమంది స్త్రీలు నివసిస్తూ వుంటారు. వారికి దైవభక్తి కృతజ్ఞత కూడా ఎక్కువ. ప్రతి సంవత్సరం సత్యనారాయణస్వామి పూజ చేసుకుంటారు. ఆ పూజ జరిపించడానికి వచ్చిన పూజారిని కూడా వారు దైవసమానంగా భావిస్తారు. కానీ ఆ పూజారి పూజ చేయడానికి వచ్చినప్పుడు ఓ యువతిని చూసి కామప్రకోపితుడై ఆమె పొందును కోరతాడు.  రాత్రికి రాత్రే అతని వాంఛ అయితే తీరుతుంది కానీ.. ఆ ప్రేమనగర్ లోని స్త్రీల మనస్సులో అతని పట్ల వున్న పవిత్రభావం పోయి అతనూ వొక సాధారణమైన విటుడిగా మిగిలిపోతాడు. 

వేశ్యలైన స్త్రీలు సమాజం తమని ఏ చూపుతో చూసి తమకు విలువను నిర్ణయిస్తుందో అదే చూపుతో ఆ పూజారిని వారు సాధారణ విటుడి స్థాయికి లెక్కిస్తారు. అక్కడ పవిత్రతకు కొలమానం శారీరక ప్రాతివత్యం అనే భావనకు వారు లోనవడమే కాదు వారి వద్దకు వచ్చే విటుడికి కూడా ఆ పవిత్రత అనే అర్హత లేదని భావించారు. నిర్ధారించారు కూడా.  సిగ్గుతో తలొంచుకొన్న పూజారి స్థానంలో సమాజం కనబడుతుంది పాఠకుడికి. 

వేశ్యల కోణంలోనే కాదు.. వ్యభిచార గృహాలపై దాడులు జరిగినపుడు అక్కడ వున్న స్త్రీలను మాత్రమే వ్యభిచారులుగా లెక్కిస్తూ వారి పేర్లనూ ముఖాలను ప్రదర్శిస్తూ అదే నేరంలో భాగస్వామ్యులైన పురుషులను రహస్యంగా దాటించడం దాపెట్టడం సమంజసం కాదనే ప్రశ్నకు జవాబు ఈ కథలో నాకు గోచరించింది. ఆధునిక సమాజంలో లోపించిన పారదర్శకత చంద్రమ్మ నిర్ణయంలో ఆమె పూజారితో మాట్లాడిన మాటల్లో సుస్పష్టమయ్యాయి.

కొంకణి భాషలో వచ్చిన ఈ కథను తెలుగు అనువాదంలో నేను చదివాను. అనువదించిన వారు శిష్టా జగన్నాథరావు. 

మూల రచన ‘అచ్యుత్ తోటేకార్'  “ప్రేమ నగరంలో అతిథి" గోవాలోని దేవదాసీ పద్ధతికి సంబంధించింది. ఈ ఆచారం ఆదికాలం నుంచీ వస్తోంది. సామాజిక చైతన్యం వలన ఈ వ్యవస్థ నెలుగులోకి వచ్చింది. ఈ ఆచారంలోని ఒక నాజూకు భావబంధం ఈ కథలో గొప్పగా చిత్రించబడింది. అశ్లీలం అనిపించకుండా రచయిత అద్భుత పంధాలో కలం నడిపించారు. మీరూ చదివి ఆస్వాదిస్తారని.. ఈ కథా పరిచయం.  -నిగమ

ప్రేమ నగరంలో అతిథి

 ఈవేళ ప్రొద్దున్నించీ ప్రేమనగర్లో పెద్దపెద్ద లౌడ్స్పీకర్లు మ్రోగుతున్నాయి. ప్రేమనగర్ ఏదో విశేషం వుందని చెప్పడానికి అది సంకేతం. రోడ్డుమీద వెళ్తున్న జనం ఒకర్నొకరు కనుసంజ్ఞలతో విచారిస్తున్నారు. ఏమిటీ ఈ హడావిడి? కొంతసేపట్లో వూరంతా ఈ వార్త పాకింది. ఈరోజు ప్రేమ్నగర్లో వేశ్యల వార్షిక సత్యనారాయణపూజ. పూర్తి ఈ సత్యనారాయణపూజ ఎంతకాదన్నా అందరినీ - నవయువకుల నుండి వయోవృద్ధుల వరకూ అందర్నీ ఆకర్షిస్తుంది. దైవదర్శనంతో బాటు కొత్తకొత్త వేశ్యల ముఖారవిందాలు చూడడానికి అవకాశం వస్తుంది కదూ? అందుకని తరచూ వచ్చేవాళ్లేగాక, ఎప్పుడూ అటువైపు అడుగు వేయని వాళ్లు కూడా ఆరోజు సాయంత్రం ప్రేమనగర్కి ఆ ఉత్సవ దర్శనం నిమిత్తం వస్తారు. తమ పవిత్ర కర్తవ్యం నిర్వహిస్తారు. ఆ ఊరుకి ఒక మూలగా వేశ్యల గృహాలు ఒక పాతిక-ముఫ్పై వున్నాయి. ఆ ప్రాంతాన్నే ప్రేమనగర్ అంటారు. పది సంవత్సరాలకి పూర్వం ఈ ప్రాంతంలో చచ్చిన ఆవులు, గేదెల మృతదేహాలు తెచ్చి పడేసేవారు. రోజంతా యిక్కడ ఆ కుళ్లు మాంసం వాసన, కుక్కలు, కాకులూ, గ్రద్దలూ మినహా మరెవ్వరి దర్శనం వుండేదికాదు. అటువంటి ఆ చండాలపు భూమి భాగ్యం పండి ఈనాడు ప్రేమనగర్ అనే శృంగార నామం రూఢి అయింది.


ఈ వేళ ఈ స్థలంలో వున్న వేశ్యలు యింతకుముందు వూరిలో ఎవరైనా ఆశ్రయం యిస్తే వాళ్ళలో వుండేవారు. యువకులకు యిది గిట్టలేదు. వాళ్లు వేశ్యలకి విరుద్ధంగా గొడవ చేశారు. ఊరు వదలమని బలవంతం చేశారు. వేశ్యలందరూ ఒక్కటయ్యారు. ఊరు బయట స్మశానభూమి దగ్గరకి వచ్చారు.


ఇంటి సామాన్లన్నీ తెచ్చుకొని సత్యనారాయణమూర్తిని స్మరిస్తూ గుడిసెలు వేసుకున్నారు. సంసారాలు పెట్టి కొత్త జీవితం ఆరంభించారు. అనతికాలంలోనే గుడిసెలు ఇళ్లుగా మారాయి. ఇళ్లముందు రోడ్లు వెలిశాయి. రస్తాలొచ్చాక లైట్లు వచ్చాయి. ఆ తరువాత నీళ్లపంపులు, ఒక చిన్నవాడ వెలిసింది. వేశ్యలు దేహం అద్దెకిచ్చేవాళ్లు లేదా ప్రేమని విక్రయించేవాళ్ళు. అందుకని ఎవరో వేళాకోళంగా ఆ వాడకి ప్రేమనగర్ అనే పేరు పెట్టారు. ప్రేమనగర్లోని వేశ్యలందరూ కలిసి ఈ పూజని చేస్తారు. దానివెనక కారణం కూడా ఇదే. పూర్తిగా నిరాధార స్థితిలో వున్నప్పుడు శ్రీ సత్యనారాయణమూర్తి వాళ్లకి సహాయం చేసినందువలన ఆయన కృపతో మంచిరోజులు వచ్చాయి. ముందు ముందుకూడా ఆయన యిలా వాళ్ళని కాపాడాలని ఈ పూజలు. ఈరోజు వేశ్యలకి దైవ ధర్మవిధులు చేసే పరమ పవిత్రదినం. ఏ మొగాణీ ముట్టుకోడం కూడా జరగదు. ఎవరినీ దగ్గరకి చేరనివ్వరు. ఎవరికీ కన్ను కొట్టరు. నోట్లో తిట్లూ, బూతులూరావు. పూర్వకాలపు స్త్రీలలాగ తొమ్మిదిగజాల చీరలు ధరించి, కుంకుమతో అడ్డంగా రేఖలు వేసుకుని పూజకోసం వేసిన పందిరిలో తిరుగుతున్నారు. పూజ అందరికోసం కనక, ప్రజలందరూ యిమిడేలా పందిరివేస్తారు. అందరికీ తప్పక నిరాఘాటంగా దర్శనం లభించాలని ఉద్దేశ్యం. పూజకి అన్ని హంగులు, రంగులలైట్లు, టపాకాయలు, చిచ్చుబుడ్లు, భజనలు, హారతి యివ్వడాలు... అడక్కండి... ఎంతోమంది ధనవంతులు ఈ పూజకి పరోక్షంగా సహాయం చేసి వుంటారు కదూ? ఈ పూజ నిర్వహణ చూసేది 'చంద్రమ్మత్త'. చంద్రమ్మత్త అంటే ఈ వాడలో వేశ్యలందరికీ నాయకురాలు. ఆమె అధికారంలో, అధీనంలో ఆమె మాటే, వాళ్ళందరిమాట. మొట్టమొదటి నుంచీ, ఈరోజు వరకూ ఈ పూజ నిర్వహించే గౌరవం 'విఠూ'భట్టి (భట్ అంటే పూజారి వేశ్యలందరూ అతన్ని 'గురూజీ' అని వ్యవహరిస్తారు. వాళ్ల దైవ, ధర్మాధి కార్యాలు 'గురూజీ'యే చేస్తాడు. అతనికీ మంచి ఆదాయం. అందువల్ల 'గురూజీ' వలన ఎక్కడైనా తత్తరపాటు జరగవచ్చుకాని 'ప్రేమనగర్'లో మాత్రం 'యథావాచ-తథాకృతి' (మాటకీ చేతకీ పొంతన కుదిరేలా) అన్నట్టు వుండేవాడు. లోకులు పైపైన అతన్ని హేళన చేసినా, మనస్సులో అతనిని అర్థం చేసుకొనేవారు. గురూజీ వంటి సాదాసీదా మనిషి, అంతర్ముఖుడు ఈ ప్రపంచంలో.. మరొకడు వుండడు. నిజం చెప్పాలంటే గత పది సంవత్సరాలుగా ఈ వేశ్యలతో గురూజీగా తప్ప మరేవిధమైన (లైంగిక) సంబంధం లేదు. అందువల్ల దేవుడి తరువాత గురూజీనే వేశ్యలు గౌరవించేవారు. గురూజీ పీఠంమీద కూర్చుని పూజ చేస్తారు. వేశ్యలు పక్కల కూర్చుని చూస్తూ వుంటారు. అలా పుణ్యంలో భాగం పొందుతారు. పూజ పూర్తి అయ్యేవరకు ఎవరికీ పందిరిలోకి రావడానికి వీలుండదు. ఈవేళ పగలు సూర్యోదయం అవగానే గురూజీ పందిరిలో హాజరయ్యాడు. పూజాసామాగ్రి సర్దడం మొదలయింది. చంద్రమత్త కూర్చున్న చోటే వుండి ఒక్కొక్కరికీ సామాన్లు తెచ్చే పని పురమాయిస్తోంది. “చంద్రమ్మత్తా! గంధం ఎక్కడుందో?" గురూజీ అన్నాడు. "అరే సుమన్, నువ్వు గంధం తేలేదా?" చంద్రమ్మత్త అడిగింది. "అయ్యో మఱచిపోయాను. ఇప్పుడే తెస్తానుండు... సుమన్.' "ఇలాగే నువ్వు అన్ని విషయాల్లో నిర్లక్ష్యం చేస్తావు" చంద్రమ్మత్త సుపారీని ముక్కలు చేస్తూ అంది. "మరి కలశంలో వెయ్యాల్సిన రూపాయిపావలా?" "ఇదిగో తీసుకొండి గురూజీ" చంద్రమ్మత్త వేళ్లతో రూపాయపావలా గురూజీకి యిచ్చింది. 


"ఇదిగో ఈ ఐదుంపావలా తాంబూలంలో పెట్టడానికి." చంద్రమ్మత్త తమలపాకుల మీద సున్నం రాయడం మొదలుపెట్టింది. “సరేగాని, ప్రసాదం చేయడం సంగతి" “గురూజీ మీరు పట్టించుకోకండి, ఆ పని మిలన్కి అప్పజెప్పాను. ఇంకా టైముంది కదూ?" చంద్రమ్మత్త తమలపాకులు నోట్లో గుప్పుకొని, సగం మిగిలిన పళ్లతో నమలడం మొదలెట్టింది. “హారతి సిద్ధం చేశారా?" చంద్రమ్మత్త తమలపాకులు నమలడంలో నిమగ్నురాలయి ఏం మాట్లాడలేదు. ఆమె బదులు షైలా హారతి పళ్ళెంతో ముందుకి వచ్చింది. “అరె షైలా! హారతి యిలాగేనా పెట్టడం? వొత్తులు మరీ మొద్దుగా చేశావు, కాస్త వాటిని మరింత వొత్తి సన్నంగా నాజూగ్గా చెయ్యమ్మా." గురూజీ మాటలు..విని షైలా నిర్ఘాంతపోయింది. ఆమె సిగ్గుతో హారతి పళ్లెం తీసుకుని పక్కకి పోయింది.


తన మాటలు బెడిసి కొట్టాయా అని అనుకొని గురూజీ చంద్రమ్మత్త వైపు చేశాడు. చంద్రమ్మత్త నోట్లో నమిలిన కిల్లీ “తూ" అని పందిర బయట వుమ్మివేసి, గురూజీ మాటలకి తన వ్యతిరేక ఆవిధంగా తెలిపింది.


"గురూజీ ఈ దండ, ఈ తులసి ఆకులూ తీసుకోండి" ఎవరో తెలియని ఒక నవయువకుడు అన్నాడు.


“ఒసే రూపా, నువ్వు ఎంత తొందరగా అల్లావమ్మా దండని." ఎవరో అన్నారు. “రూపా అంటే రూపాయే. దానికి సాటి మరిఎవ్వరూ లేరు.” మరెవరో అన్నారు.


రూపా సిగ్గుతో వంకర్లుపోతూ చంద్రమ్మత్త ప్రక్కనే వచ్చి కూచుంది. రూపా ఇలా సిగ్గు పడడం గురూజీకి బాగా నచ్చింది. రూపావంటి సౌందర్య రాశిని గురూజీ ప్రేమనగర్ ఎప్పుడూ చూడలేదు. “సరే ఇక ప్రారంభిస్తా"


గురూజీ చంద్రమ్మత్త అనుమతి తీసుకుని పూజకి వుపక్రమించాడు. “కేశవాయనమ:”


“అందరూ నిశ్శబ్దంగా వుండండర్రా. చంద్రమ్మత్త గట్టిగా అరిచింది. అరుపుతోబాటు నోట్లో ఢిల్లీలో నుంచి ఊరిన లాలాజలం పెదవుల పక్కనించి కిందకి జారింది. దానిని వెంటనే తన కొంగుతో తుడిచింది. వేశ్యలందరూ చేతులు జోడించి దేవుడి పటం ముందు కూర్చున్నారు. ప్రశాంత వాతావరణంలో గురూజీ పూజ పూర్తిచేశాడు. "ఇప్పుడు మీరందరూ ప్రతీ ఏడాదిలాగే దేవుడికి గంధం, పూలు సమర్పించడానికి రండి" గురూజీ సూచన చేశాడు. “వెళ్లండర్రా అందరూ. ఒంటిమీద నీళ్లు చల్లుకుని తడిసిన శరీరంతో దేవుడికి గంధం, పూలు అర్పించడానికి రండి.” చంద్రమ్మత్త ఆర్డరు యిచ్చి, తనుకూడా పందిరివదిలి బయటికి వచ్చింది. దేవుడికి గంధం, పూలు యివ్వాలంటే పూర్తిగా మడికట్టుకోవాలి. అందుకే తడిసిన శరీరంతో, బట్టలతో రావడం నిజమైన మడి అని వేశ్యలందరి భావన. అందరూ పందిర వెనక బయటకి వెళ్లారు. అక్కడ పెద్ద చన్నీళ్ల పాత్ర నిండివుంది. అందరూ వాళ్లవాళ్ల పాతబట్టలు మార్చుకుని, కొత్త చీరలు కట్టుకుని, నెత్తిమీద నీళ్లు పోసుకున్నారు. తరువాత అలాగే తడితడి శరీరాలతో ఒక్కొక్కరూ పూజా మందిరంలోకి రాసాగారు.


మొదటి గౌరవం చంద్రమ్మత్తది. ఆమె అందరికంటే ముందు పందిరిలో అడుగుపెట్టింది. పందిరిలో గురూజీ తప్ప మరెవ్వరూ పురుషులు లేరు. దానికి కారణం వీళ్లందరూ గంధం, పూలు సమర్పించేవరకూ బయటవాళ్ళని పందిరిలోకి రానివ్వరు.


గురూజీ గంధం, పూలు ముందుకు చాపాడు. చంద్రమ్మత్త వాటిని అందుకుని దేవుడికి సమర్పించింది. తరువాత ఒంగొని సాష్టాంగ నమస్కారం చేసింది.


మనస్సులో ఆ తలంపులేకపోయినా గురూజీ దృష్టి ఆమె శరీరంమీద పడింది. ఒకానొకప్పుడు తన సౌందర్యంతో యితరులని వివశులు చేసి ఆకర్షించిన చంద్రమ్మత్త శరీరపు చర్మం మడతలు పడింది. కొన్నిచోట్ల చర్మం వదులుగా వేళ్లాడుతోంది. మొహంమీద ముసలి తనపు చారలు వచ్చాయి. నోట్లోంచి నాలిక లోపలికి బయటకీ కదులుతోంది. శరీరంమీద ఇక్కడా, అక్కడా నలుపు, నీలపు చారలు పొంగుతున్నాయి. ఆమెని చూస్తేనే గురూజీ శరీరంమీద తేళ్లు, జెర్రులు ప్రాకినట్లయింది. చూడలేక తలవొంచుకున్నాడు.


చంద్రమ్మత్త తరువాత వొక్కొక్కరే క్రమంగా పందిర క్రిందకి వచ్చి గంధం,పూలు, అక్షింతలూ సమర్పించారు. చంపి, గంగి, యేసు, లక్షిమే, మంజుళ... అందరూ తడిబట్టలతో, వొంటిమీది సౌందర్య వస్తువులు కడిగి వెళ్లారు.


ఈ వేశ్యలే సాయంసంధ్యలో ఇంటి గుమ్మం ముందో, కిటికీల వెనకో కూర్చుని చూపుల బాణాలతో విటులని గాయపరుస్తారు. ఇప్పుడు వాళ్ళ శరీరాలని చూడాలనిపించదు. సౌందర్యపు ఆటంబాబు పేలిపోయింది. అంతా ఏహ్యభావం -చీదరింపు కలిగించేది. పెదవులమీద రంగు, మొహంమీద పౌడరు, తుడుచుకు పోయాయి. కళ్ళులోతుకి పోయాయి. వక్షోజాలు పొంగుతగ్గి చదరంగా మారాయి. పొట్టలోని పేగులు లెక్కపెట్టవచ్చు. నెత్తిమీది సవరంతీసి ఎవరో బయట వేలాడదీశారు. రాత్రి చీకట్లో మెరుస్తూ వుండే స్త్రీ వైభవం గిల్టు పోయిన నగలలాగ బయటపడింది. శరీరంలో ఏ భాగంలోనూ ఆకర్షణలేదు. గురూజీ కళ్ళు మూసుకుని ఒక్కొక్కరి చేతిలోనూ గంధం, పూలు పెడుతున్నాడు. అవి దేవుడికి అర్పించి వెళ్లిపోయినా మొగలి ఆకులాంటి ఆమె శరీరకాంతి, ముత్యాలరంగులో తెల్లగా శుభ్రంగా వున్న కళ్లు, దానిమ్మపండు రంగు పెదాలు, చీరవెనక నుంచి తొంగిచూస్తున్న పావురాల జోడిలాంటి వక్షోజాలు కళ్ళముందు నుంచి అదృశ్యం కాలేదు.


చాలాసేపైనా, విచలితమైన గురూజీ మనస్సు కుదుట పడలేదు. మంత్రాలు సక్రమంగా జ్ఞాపకం రావడంలేదు. అయినా ఫరవాలేదు హారతి యిస్తున్నప్పుడు - వొత్తులు నూనెగిన్నెలో బదులు నీళ్లగిన్నెలో ముంచినప్పుడు ఎవరూ చూడలేదు. ప్రదక్షిణకూడ తప్పుగా మరోలా చేయసాగాడు. కానీ చంద్రమ్మత్త "గురూజీ, మీరేం చేస్తున్నారు?" అని అనబోయేలోగా, అతనికి తన తప్పు తెలిసింది.


“చంద్రమ్మత్తా, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి."


పూజ పూర్తయిన తరువాత ఒక మూల నిలుచున్న చంద్రమ్మత్తతో గురూజీ అన్నాడు.


"ఏమిటి?


చంద్రమ్మత్త ఎగతాళిగా చూస్తూ అడిగింది. "ఈ రూప ఎవరూ?" “రూప? ఆ నవ్వు ముఖంతో వున్న అమ్మాయా?” “అవును!" "ఒక కొత్త అమ్మాయి. చాలా అందగత్తె. అతిధులకి ప్రాణం అర్పించైనా సుఖాన్నివ్వడానికి తయారుగా వుంటుంది. కానీ నేనే జాగ్రత్త తీసుకొంటాను. దానికి ఏ కష్టం రాకూడదని.” “అవును జాగ్రత్త తీసుకోవాలి. చిన్నది పైగా నాజూకైన పిల్ల. “అవును.” “చంద్రమ్మత్తా, ఒకటి అడగనా?" "కోపం రాదు కదా నీకు?" "కోపం రావడానికి మీరు పరాయి వాళ్ళు కాదుకదా!" గురూజీ నిర్మలంగా, తలవొంచుకుని మాట్లాడాడు. “ఈరోజుతో పది సంవత్సరాలయింది నేను యిక్కడికి వచ్చి వెడుతున్నాను. కానీ ఎప్పుడూ ఏ ఆడమనిషిని వక్రదృష్టితో చూడలేదు. కాని ఈవేళ అలా


ఎందుకయిందో ఎవరికి తెలుసు? ఆ రూప నా మనస్సుని ఆకట్టుకుంది. నా కోరిక తీరుతుందా?" ఏదో దెబ్బ తగిలినట్టు చంద్రమ్మత్త మొహం గంభీరమయింది. గురూజీ మొహం చూస్తూ చూస్తూ ఆమె ఆలోచనల్లో మునిగింది. గురూజీకి షాక్ తగిలింది. రూపాని కోరడంలో తను పెద్ద తప్పు చేయలేదుకదా? చంద్రమ్మత్త కాదని అంటే జరిగే అవమానం తను భరించగలడా? గురూజీ (మనసులో) తర్కించుకుంటున్నాడు. మనస్సులో అస్వస్థత పెరుగుతోంది. కొన్ని క్షణాలు అలా గడిచాయి. ఆఖరికి చంద్రమ్మత్త ఎదో నిర్ణయం మనస్సులో చేసుకొని, ఆదర పూర్వకంగా గురూజీతో అంది. “గురూజీ నేను మీకు ఎలా కాదనగలను?" మీ పుణ్యశక్తి వల్లనే మాకంతా శుభం జరిగింది. మీ మాట నేను తిరస్కరించలేను. మీ కోరిక తీరుతుందిలేండి. చెప్పండి ఎప్పుడు?"


 "ఈ వేళ రాత్రి"


“సరే, ఇప్పుడు మీరు వుండండి. ప్రొద్దున్న పూజాసామాగ్రి తీసుకొని మా వీడ్కోలుతో వెళ్లండి.." చంద్రమ్మత్త మాటలు విని గురూజీ గుండెలు చిన్నపిల్లాడిలా లోపల్లోపల గెంతులేయసాగాయి. రాత్రి రూప తన చేతుల్తో తయారుచేసి యిచ్చిన తాంబూలం గురూజీ స్వీకరించి తిన్నాడు. ఆ తరువాత రాత్రి ఎలా రంగుల రసడోలలతో గడిచిందో తెలియలేదు. తెల్లవారింది. గురూజీ ముస్తాబై సోఫామీద కూర్చున్నాడు. పూజసామగ్రి తీసుకుని చంద్రమ్మత్త ముందుకి వచ్చింది. "ఇది పూజ సామాను. ఇదిగో దక్షిణ. అలాగే అందుకొండి. నమస్కారం ఆఖరిది" చంద్రమ్మత్త తన నడుము వెనకభాగం అతనివైపు త్రిప్పి (మొహం చాటేసి) మాట్లాడింది. ఆమె గొంతుకలో కంపన ధ్వనించింది. గురూజీకి ఆశ్చర్యం వేసింది. ఎప్పుడూ నవ్వు ముఖంతో ఆమె గురూజీకి వీడ్కోలు చెప్పేది. కాని ఈరోజు వేరే విధంగా గురూజీకి అనిపించింది. అతని నోటిలోంచి మాటలు వూడిపడ్డాయి. “ఆఖరి నమస్కారమా?" “అవును ఆఖరిది." తన చెమ్మగిల్లిన కళ్లతో గురూజీ కళ్లల్లో చూస్తూ ఆమె అంది.


“ఈవేల్టి వరకూ మీరు మా గురూజీగా వుండేవారు. ఇప్పుడు మీరు... కాదు నువ్వు మా అతిధివి అయ్యావు." “అంటే ఏమిటి?” “ఇది నేను చెప్పాలా? మీరు పుణ్య పురుషులని మేము (భావించి మీకు శ్రేష్ట గౌరవం ఇచ్చాము. మడిని పాటించాము. మీ పుణ్యశక్తి వలన మా పాపాలు తుడుచుకుపోయేవి." “కానీ మీరు మీ ప్రత్యేకతని త్యజించి మా ఎంగిలి మెతుకులు తింటే మేము మిమ్మల్ని గురూజీగా ఎందుకు గౌరవించాలి?" గురూజీ నిల్చునే వున్నాడు. అతనికి చంద్రమ్మత్త మాటలు తూటాలుగా తగుల్తూ వుంటే, ఆ బాధలో ఎలా జవాబివ్వాలో తెలియలేదు. "గురూజీ దుఃఖించకండి. రూప కోసం మీరు ఎప్పుడు కావాలన్నా రావచ్చు." తన వ్యధిత హృదయంతో తలవొంచుని చంద్రమ్మత్తతక్షణం ఇంట్లోకి వెళ్లిపోయింది.


పూజా సామాగ్రితో వున్న సంచి భుజం మీద వేసుకుని గురూజీ చంద్రమ్మత్త ఇంటినుంచి బయటపడ్డాడు. జరిగిన అవమానం సహించే ధైర్యం అతనిలో లేదు. అథః పతనంతో, నల్లబడిన మొహంతో తలవొంచుకుని నెమ్మదిగా అడుగులేస్తూ అతను ప్రేమగర్కి వీడ్కోలిచ్చాడు. మధ్యమధ్య అతనికి ఏదో భావన కలుగుతోంది. మూలల్లోని కిటికీలల్లోంచి రంగులు పులుముకున్న ముఖాలు “షూ...షూ" అంటూ తనని పిలుస్తున్నాయని. అప్పుడే చెవులు గింగురుమనేలా అపహాస్యంగా ఎవరో అరిచారు “ఏం అతిథీ! రాత్రి ఎలా గడిచింది?" ఇంత ఆయుస్సులో ఏమి సాధించి, గడించానో అదంతా ఒక్కరాత్రిలో తగలెట్టేసాననే దుఃఖభారం నెత్తిమీద వేసుకుని గురూజీ ఇంటిముఖం పట్టాడు. పశ్చాత్తాపంతో అతని గుండెలు మండుతున్నాయి.



6, జూన్ 2022, సోమవారం

వ్యక్తిత్వం

రసోత్కృష్టం - అనువాద కథ -నిగమ పేరు తో  బహుళ త్రైమాసిక పత్రిక లో నేను పరిచయం చేస్తున కథలో మూడవ కథ ఇది.. చదవండీ..

యుద్దం ఒక దీర్ఘగాయం. ఎవరు ఎన్ని కారణాలు చెప్పినా యుద్దం చేసిన గాయాల వల్ల మనుషుల జీవితాలు చిధ్రమవుతాయి. ఎంతోమంది స్త్రీలు భర్తలను కోల్పోతారు తల్లిదండ్రులు తమ బిడ్డలు కోల్పోతారు. ఎంతోమంది పిల్లలు తమ తండ్రిని కోల్పోతారు. శారీరక అవకరాలతో భారమైన జీవితం గడపాల్సి వస్తుంది.ఎంతోమంది నిరాశ్రయులై ఆకలికి అలమటించిపోతారు. అయినా యుద్దాలు వస్తూనే వుంటాయి. చరిత్ర యెన్ని పాఠాలు చెప్పినా గుణపాఠంగా తీసుకోలేక యుద్ధానికి కాలుదువ్వే దేశాలెన్నో! 

 రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్దం మొదలవగానే ఎప్పుడో చదివిన ఈ కథ గుర్తుకువచ్చింది. ఈ కథ  కూడా రష్యన్ యుద్ధ నేపథ్యంతో వ్రాయబడింది. రచయిత ఈ కథను మాస్కో రేడియోలో పప్రధమంగా వినిపించారు. తర్వాత అచ్చులో వెలువడింది.

  అలక్జీయ్ తోల్‌స్టాయ్  "రష్యన్  కేరెక్టర్ " కథను పరిచయం చేయబోతున్నాను.  "ఇవాన్ సుదారేవ్ కథలు’ శీర్షికతో రాయబడ్డ ఏడు కథలలో ఇది ఆఖరి కథ. ప్రారంభంలో  కథగా మొదలై రచయిత "కథ లోపల కథ" సాంకేతికతను ఉపయోగించి ఏడు కథలు చెపుతాడు.అందులో అతని స్నేహితుడు  , ఒక తోటి సైనికుడు, రష్యన్ యోధుని గురించి పాఠకుడికి చెప్పడమే ఈ కథ. యుద్దం   పంతొమ్మిది వందల నలభై ప్రారంభంలో జరిగినప్పటికీ, కథానాయకుడి యొక్క సాహసోపేతమైన దోపిడీలపై  ఆక్రమణలపై దృష్టి కేంద్రీకరించబడదు, కానీ తీవ్రంగా గాయపడిన తర్వాత అతనికి ఏమి జరిగింది అని చెప్పడమే ఈ కథ. మానవుడు కష్టసమయాల్లో కూడా తన వ్యక్తిత్వాన్ని మంచితనాన్ని ఎలా నిలబెట్టుకోవాలనుకున్నాడో తెలియజేసే కథ. అలాగే  ఉన్నతమైన ఇద్దరు స్త్రీమూర్తులు ఎంత స్థూల సూక్ష్మగ్రాహ్యులై తమ హృదయంతో తనవారిని ఏ రూపంలో వున్నా గుర్తించగలరని హృద్యంగా చెప్పినకథ. 

లెప్టినెంట్ యెగర్ డ్రోమోవ్ గొప్ప దైర్యశాలి.  యుద్దంలో ఆరితేరిన వీరుడు. కుర్క్స్ యుద్దం చవరిదశలో  విపరీతంగా గాయపడి అతికష్టంపై ప్రాణాలతో బయటపడి ముఖాకృతి కోల్పోయి కొన్ని సర్జరీల తర్వాత సరికొత్త మనిషి రూపంలో అద్దంలో తన రూపు చూసుకుని ఇంకెప్పుడూ అద్దం చూడకూడదనుకుని నిశ్చయించుకుంటాడు.  యదాప్రకారం యుద్దంలో పాల్గొనడానికి అనుమతిని పొందుతాడు.  అతనికి ఇరవై రోజుల సెలవు లభిస్తుంది. సెలవుల్లో అతను తల్లిదండ్రులను చూడడానికి యింటికి వెళ్తాడు.  తల్లిదండ్రులను చూసిరమ్మని  తన క్షేమ సమాచారములు తెలుపమని యెగోర్ తనను పంపాడని లెఫ్టినెంట్ గ్రోమొవ్ గా తనను పరిచయం చేసుకుని రాత్రి ఆ ఇంట బసచేస్తాడు. తల్లి వచ్చింది కొడుకేనని గ్రహిస్తూంది. కాబోయే భార్య కూడా అతనిని గుర్తిస్తుంది. యెగోర్ కూడా ఎక్కువ నటించడం చేతకాక అక్కడినుండి వెళ్లిపోతాడు. .. తర్వాత ఏం జరిగిందో చదివితే హృదయం చెమ్మగిల్లుతుంది. మనిషి బాహ్యసౌందర్యం కన్నా హృదయసౌందర్యం గొప్పది.తల్లి హృదయం బిడ్డను ఏ రూపంలో వున్నా గుర్తించగలదు. అలాగే ప్రేమించిన స్త్రీ హృదయానికి బాహ్యసౌందర్యంతో పనిలేదు. యెగోర్ మానసిక సౌందర్యాన్ని వ్యక్తిత్వాన్ని ఎరిగిన కాత్యా  యెగోర్ ఏ రూపంలో వున్నా అతనే తన భర్త అని నిశ్చయించుకుంటుంది. “నా జీవితమంతా నీతోనే కలిసివుంటాను నేను నిజంగా నిన్ను ప్రేమిస్తాను. నా సమస్త హృదయంతోనూ ప్రేమిస్తాను. నన్ను కాదనకు” అంటుంది.  కథ చదివిన పాఠకుడి మనసులో భావాతీతమైన ఉద్వేగం అలముకుని హృదయం విప్పారుతుంది.ఓహ్ ఎంత గొప్ప కథను చదివాం అన్న భావన నిండిపోతుందంటే అతిశయోక్తి కాదు. 

ఈ కథ రాసిన రచయిత యొక్క పని  ఒక వ్యక్తి ఎంత శక్తివంతంగా మరియు అద్భుతంగా ఉంటాడో చూపించడం. అందుకే ఈ కథ పేరు ‘’ వ్యక్తిత్వం”  ఎంత హృదయ సౌందర్యం తో మనిషి మనగల్గితే అంత జీవన సౌందర్యాన్ని సొంతం చేసుకుని మనుగడ సాగించగలడని చెప్పడమే రచయిత పని. అక్షరాలలో ఒదిగిన శక్తివంతమైన భావం పాఠకుడి హృదిని తాకుతుంది.

ఈ కథను  తెలుగులో“ రష్యన్ స్వభావం” పేరుతో  కొసరాజు లక్ష్మినారాయణ,  “వ్యక్తిత్వం”  పేరుతో రా.రా ( రాచమల్లు రామచంద్రారెడ్డి) అనువదించారు. 

నేను ఈ కథను మొదట ఆంగ్లంలో చదివాను. తెలుగు అనువాదం కోసం చాలా వెతికాను. మిత్రుడు అనిల్ బత్తుల ను అడిగితే వారు వెతికి ఈ కథను అందించారు. వారికి ధన్యవాదాలు చెబుతూ… ఈ కథను చదువుకుందాం.

 రష్యన్ వ్యక్తిత్వం 

మూలం:అలెక్జీయ్ తోల్ స్తోయ్ 

అనువాదం: రాచమల్లు రామచంద్రారెడ్డి


రష్యన్ వ్యక్తిత్వం : నేను చెప్పబోయే చిన్న కథకు యీ శీర్షిక మరీ ఘనంగా వున్న మాట నిజమే. అయినా తప్పదు మరి నేను చెప్పబోయేది రష్యన్ వ్యక్తిత్వం గురించే గదా!


అవును రష్యన్ వ్యక్తిత్వం వర్ణించండి మీకు చేతనైతే, లెక్కలేనన్ని వీర కృత్యాలను గురించి చెప్పగలను. కానీ ఎన్నో వుండగా వాటిలో దేన్ని ఎన్నుకోడం ? అదృష్టవశాత్తు ఒక మిత్రుడు తన జీవితంలోని ఒక ఘటన చెప్పి నా సమస్య తీర్చాడు. అతను నిరాడంబరమైన మామూలు మనిషి. సరాతోవ్ ప్రాంతంలో ఓల్గా తీరంలోని ఒక గ్రామంలో సమిష్టి క్షేత్ర రైతు అతను. అతని కండలు తిరిగిన దృఢ శరీరమూ, అందమైన రూపమూ అసాధారణమైనవి. యుద్ధకాలంలో తన టాంకు లోనుండి మూత తెరచుకొని బయటికి వచ్చినపుడు ముల్లోకాలనూ జయించడానికి అవతరించిన వీరాధివీరునిలా కనిపించే అతని వైపు యెవరైనా గుడ్ల ప్పగించి చూడక తప్పదు. అతను టాంకు మీదనుండి నేలమీదికి దూకి, శిరస్త్రాణం వూడదీసి, చెమటతో తడిసిన జుట్టుకు కాస్త గాలి తగలనిచ్చి, చింపిరి గుడ్డతో ముఖం తుడుచుకొని - తరువాత, మెల్లగా యీ ప్రపంచంలో ఇంకా జీవిస్తున్నందుకా అన్నట్లు ఆనందం పట్టలేక చిక్కగ చిరునవ్వు నవ్వేవాడు. 


మనిషి యుద్ధ రంగంలో వుండి, నిత్యం మృత్యువుతో ముఖాముఖి అవు తున్నప్పుడు, అతను మామూలు మనిషిగా వుండలేడు. పండుటాకులు రాలిపోయినట్లు అతనిలో పేరుకున్న చెత్తా చెదారం అంతా రాలిపోయి, నిజమైన సారం యేదో అది మిగులుతుంది. కొందరిలో యీ సారం మరింత గట్టిదిగా వుండవచ్చు. కొన్ని లోపాలు వున్న వాళ్ళు కూడా వాటిని వదిలించుకోడానికి తీవ్రంగా కృషి చేస్తారు ఎందుకంటే, ప్రతి ఒక్కడూ యుద్ధ రంగంలో తాను ప్రతి ఒక్కరికీ ఆప్తుడుగా, విశ్వసనీయుడు గా వుండాలని కోరుకుంటాడు. 


కానీ, నా మిత్రుడు యెగర్ డ్రోమొవ్ యుద్ధానికి ముందు కూడా నియమబద్ధ మైన మనిషి. తల్లి మరియా పొలికార్పొన్నా అన్నా, తండ్రియెగర్ కోవిచ్ అన్నా అతనికి అపారమైన అధిక గౌరవం. “మా నాన్న ఆత్మగౌరవం గల మనిషి. ఆయన్ను చూస్తే యెవరి కైనా మొదట కనిపించేదీ అదే, నీవు ప్రపంచంలో యెన్నో విషయాలు చూస్తావు బాబూ, విదేశాలకు కూడా పోతావు. కానీ, నీవు రష్యన్ వనే గర్వం అన్నా మాత్రం వదలిపెట్టకు" అనేవాడాయన. 


ఆ వూళ్ళోనే ఉన్న ఒక అమ్మాయిని తాను పెళ్ళిచేసుకోవాలనుకున్నాడు యెగర్. యుద్ధరంగంలోని సైనికులు తమ ప్రియురాండ్రను గురించీ, భార్యలను గురించి చెప్పి బోలెడు మాట్లాడుతారు. ముఖ్యంగా యుద్ధరంగం ప్రశాంతంగా వుండి, చలి కాలంలో అందరూ భోంచేసి కందకంలో చలిమంట చుట్టూకూర్చొని వున్నప్పుడు. ఆ మాటలు వింటే, ఒకోసారి చెవులు విచ్చుకు పోతాయి. ఎవరో ఒకరు మొదలు పెడతారు, "ప్రేమంటే యేమిటి?" అంటూ. ? 


"గౌరవమున్నప్పుడు ప్రేమ పుడుతుంది" అంటాడు ఒకడు.


“అదంతా వట్టిది. ప్రేమనేది అలవాటు. మనకు భార్యమీద ప్రేమంటూ కలగదు. తల్లిమీదా, తండ్రిమీదా కలుగుతుంది, చివరకు జంతువులమీద కూడా కలుగుతుంది" అంటాడు మరొకడు. 


ఇంకొకడు "చీఛీ, అదంతా చెత్త ! మనిషికి ప్రేమంటూ కలిగితే నిలువునా వూగిపోతాడు. సీసాడు సారాయి తాగినంత కైపులో వుంటాడు," అంటూ ఉపన్యాసం లంకించుకుంటాడు. 

 

ఇలా గంటా రెండు గంటలు సాగిన తర్వాత సార్జంట్ మేజర్ తన అధికార కంఠంతో సమస్యను చులాగ్గా తేల్చేస్తాడు. 


ఇలాంటి చర్చల్లో పాల్గొనడానికి యెగర్ ద్రోమొవ్ బిడియపడతాడు. అందువల్ల అతను తన ప్రేయసిని గురించి సూచనగా మాత్రమే నాతో ఒక మాట అన్నాడు. ఆమె చాలామంచి అమ్మాయి. తన కోసం ఆమె ఆగుతా నన్నదంటే,  తాను తిరిగి వెళ్ళినప్పుడు ఒక కాలు  లేకుండా వెళ్ళినాసరే, ఆమె తన కోసం అక్కడ వుంటుందనే అర్థం. ఇదీ అతను  చెప్పింది. 

 

తన యుద్ధచర్యలను గురించి కూడా అతను యెక్కు వ గా మాట్లాడేవాడు కాదు. "అవన్నీ జ్ఞాపకం చేసుకోవడం యెందుకు ?" అంటూ అతను ముఖం చెవులు చిట్లించి గట్టిగా సిగరెట్ దమ్ము లాగే వాడు. అతను తన టాంకితో చేసిన సాహస కృత్యాలను గురించి సిబ్బంది ద్వారానే విన్నాము. మరీ సాహసోపేతమైన ఒక కథ డ్రైవర్ చువిల్యోవ్ చెప్పాడు. 


“సరిగ్గా మలుపు తిరగగానే యెదురుగా గుట్టమీద కనిపించింది యేమిటనుకున్నారు! 'శత్రు టాంకి!' అని కేక వేశాను. ‘దానిమీదికి పద’ అని ఆయన బిగ్గరగా అరిచాడు. అలాగే నేను మా టాంకిని నడిపించాను. అక్కడ వున్న కొద్దిపాటి చెట్లను మాటుచేసుకుంటూ ముందుకు సాగాము. శత్రుటాంకి తన శతఘ్నిని మా మీదికి గురి పెట్టడానికి గుడ్డివానిలాగా  తారాడింది. అది ఒక గుండు పేల్చింది, కానీ గురి తప్పింది. ఇంతలో మా లెఫ్టినెంట్ ప్రేల్చిన గుండు దాని డొక్కలో తగి లింది. ఓ యేమి దెబ్బలే! రెండో గుండు డర్రెటకు తగిలింది. శత్రు టాంకి మోర పైకెత్తి వెనక్కి ఒరిగింది. గుండుతో మూడవ దాని నవరంధ్రాల గుండా పొగ రాసాగింది. మంటలు సుమారు మూడువందల అడుగులు పైకిలేచాయి. వెనుక ద్వారంగుండా సిబ్బంది బయటికి వచ్చారు. ఇవాన్ లాల్షిన్ తన మర తుపాకీతో వాళ్ళను ఊచకోత కోసే శాడు.ఇక రోడ్డుమీద మాకు అడ్డం లేదు. అయిదు నిమిషాల్లో సుడిగాలిలా వెళ్ళి ఊరిమీద పడ్డాం. బలే తమాషాలే ! నాజీలు దిక్కుదిక్కులకూ పరుగెత్తారు. నేలంతా బురదగదూ, అందుకని చాలామంది బూట్లు వదిలి  ఎగురుతూ గెంతుతూ ధాన్యాగారం వైపు పరుగు తీశారు. "ధాన్యాగారం ప్రేల్చేయండి!" అని మా కామ్రేడ్ లెఫైనెంట్ ఉత్తరువు యిచ్చాడు. మా శతఘ్నిని వెనక నుండి ముందుకు తిప్పి ఫటాఫట్ ప్రేల్చేశాం. దంతెలు, దూలాలు, ఇటుకలు, కొయ్య పలకలు అన్నీ కుప్ప కూలిపోయాయి. అటక మీది కెక్కిన నాజీలు కూడా కూలి పోయారు. ఇంకా యేమైనా మిగిలివుంటే సాపు చేయడానికి నేను టాంకిని లోనికి పోనిచ్చాను. మిగిలిన నాజీలు చేతులు పైకెత్తేశారు. 


అలా పోరాడాడు లెఫ్టినెంట్ యెగర్ డ్రోమొవ్. చివరకొకనాడు అతని అదృష్టం వక్రించింది.కుర్క్స్ యుద్ధపు చివరిదశలో, జర్మన్లు వెనుకంజ వేసే రోజుల్లో, ఒక గుట్ద మీద గోధుమ పొలంలో వున్న ద్రోమొవ్ టాంకికి షెల్ దెబ్బ తగిలింది. సిబ్బందిలో యిద్దరు వెంటనే చచ్చిపోయారు. రెండవ షెల్ తో టాంకి అంటుకుంది. ముందరి ద్వారం బయటికి వచ్చిన డ్రైవర్ చువిల్యోవ్ టాంకిమీదికి యెక్కి, లైప్టినెంట్ ను బయటికి లాగగలిగాడు. అప్పటికే అతనికి స్పృహ తప్పింది. బట్టలు అంటుకున్నాయి. చువిల్యోవ్ అతన్ని పక్కకు లాగిన మరుక్షణంలోనే మరొక గుండు వచ్చి మా టాంకిని బదాబడలు చేసింది. అయినా అతను లెఫ్టినెంటు తలమీదా, బట్టలమీదా మట్టి చల్లి మంటలు ఆర్పివేశాడు. తరువాత ఆతన్ని మెల్లమెల్లగా ప్రథమ చికిత్సా కేంద్రానికి యీడ్చుకపోయాడు. "ఆయన గుండె కొట్టుకోవడం నాకు వినిపించింది గనుక అలా యీడ్చుకపోయాను" అని " చువిల్యోవ్ తరువాత చెప్పాడు. 


యెగర్ ద్రోమొవ్ బతికాడు. అతని కళ్ళు పోలేదు కానీ, ముఖమంతా ఎంతగా కాలిపోయిందంటే, అక్కడక్కడా యెముకలు బయటపడ్డాయి. ఆస్పత్రిలో యెనిమిది నెలలు వున్నాడు. ప్లాస్టిక్ సర్జరీతో అతనికి ముక్కూ, చెవులూ, పెదవులూ, కనురెప్పలూ పెట్టారు. ఎనిమిది నెలల తరువాత కట్లు విప్పి నప్పుడు అతను అద్దంలో ముఖం చూసు కున్నాడు. తనదేనా ఆ ముఖం? అతనికి ఆద్దం అందించిన నర్సు పక్కకు తిరిగి యేడ్చింది. కానీ అతను అద్దం ఆమె చేతికిచ్చేసి "ఇంతకంటే ఘోరమైనవి చూశాను నేను ఫరవాలేదులే" అన్నాడు. 


అతను మళ్ళీ అద్దం కావాలని అడగలేదు. కానీ, తన ముఖం తానే చేతులతో తడుముకునేవాడు. దానికి అలవాటు పడటానికి ప్రయత్నిస్తున్నట్లు. వైద్య బృందం అతన్ని యుద్ధేతరమైన కొలువుకు యోగ్యుడుగా ప్రకటించింది. కానీ, అతను నేరుగా తన జనరల్ వద్దకు వెళ్ళి, తనను మళ్ళీ తన రెజిమెంటుకు పంపించండని కోరాడు. "నీవు యుద్ధానికి అసమర్థుడివి కదా" అన్నాడు జనరల్. "కాదు. నేను విరూపినయ్యాను అంతే. ఫరవాలేదు. త్వరలో మునుపటిలాగే యుద్ధం చేయగలను" అన్నాడు అతను. 


జనరల్ తనతో మాట్లాడేటప్పుడు తన ముఖంవైపు చూడకుండా చూపులు పక్కకు తిప్పుకోవడం యెగర్ గమనించినప్పుడు, అతని నోరు అనబడే రంధ్రం మీద వికట దరహాసం వెలిసింది. పూర్తిగా కోలుకోడానికి అతనికి ఇరవై రోజుల సెలవు యిచ్చారు. సెలవుల్లో అతను తల్లిదండ్రులను చూడడానికి యింటికి వెళ్లాడు.


రైలు స్టేషన్ నుండి స్వగ్రామానికి పోడానికి గుర్రపు బండి ఉంటుందని అతను అనుకున్నాడు. కానీ లేదు. ఆ పదిమైళ్లూ  అతను నడచి వెళ్ళాడు. నేల యింకా మంచుతో నిండివుంది. అంతా చిత్తడి.  ఎక్కడా జనసంచారం లేదు. ఈదర  గాలి యీడ్చి కొడుతూ,చలి కోటు సందుల గుండా లోపలికి దూరుతూ,  చెవులలో హోరు పెడుతున్నది. అతను గ్రామం సమీపించేటప్పటికి చీకటి పడుతున్నది. ఊరబావి మొత్తం గాలికి కీచుకోచుమంటున్నది. వీధివెంబడి పోతే ఆరవ యిల్లు తనది. హఠాత్తుగా అతను ఆగి, జేబులలో చేతులు పెట్టుకొని, తల పంకించాడు. తల వాకిలివద్దకు పోకుండా  అతను యింటిచుట్టూ తిరిగి, మోకాళ్ళ లోతువున్న మంచులో తొక్కుకుంటూ వెనక్కి వెళ్ళి, కిటికీ దగ్గర వంగి, లోపల  వున్న తల్లిని చూశాడు. కిరసనాయిల్ దీపపు మసక వెలుతురులో ఆమె టేబుల్ మీద రాత్రి భోజనానికి ఏర్పాట్లు చేస్తున్నది. ఆమె మునుపటిలాగే తలకు నల్లని శాలువ కట్టుకుంది, మునుపటిలాగే లాగే ప్రశాంతంగా, తొందరపాటు లేకుండా, దయగా కనిపించింది. కానీ, ఆమెకు మరింత వయసు పెరిగింది. భుజాలు పలుచబడ్డాయి. అయ్యో, ఈ సంగతి నించి తెలిస్తే రోజూ జాబు రాసేవాణ్ణిగదా,  నాలుగు మాటలైనా రాసేవాణ్ణి గదా ! అనుకున్నాడు అతను. ఆమె భోజనం  సిద్ధం చేసింది - గిన్నెలో పాలూ, కాస్త  బ్రెడ్డూ, రెండు గరిటెలూ, ఉప్పుడబ్బీ, తరువాత ఆమె టేబుల్ వద్ద నిలబడి చిక్కి శల్యమైన  చేతులు రొమ్మున కట్టుకొని, ఆలోచనలో మునిగి పోయింది. యెగర్ ద్రోమొవ్  కిటికీ గుండా ఆమెను గమనిస్తూ, ఆమెను యింకా బెదరగొట్ట కూడదనీ, అమాయక మైన

ఆ చిన్న ముఖాన్ని నిస్పృహతో మాడ్చి  వేయకూడదని నిశ్చయించుకున్నాడు. 


అతను ఉన్న చోటు నుండి ముందు వైపుకు తిరిగివచ్చి  గేటు తెరుచుకొని లోగిట్లోకి వచ్చి, అతను తలుపు తట్టాడు. "యెవరు?" అని  ప్రశ్నించిన తల్లి గొంతు అతనికి వినబడింది. "లెఫ్టినెంట్ గ్రోమొవ్", అని అతను జవాబు చెప్పాడు. 


గుండె దడదడ లాడడంతో అతను తల ద్వారబంధానికి ఆనుకోవలసి వచ్చింది. లేదులే, తల్లి తన గొంతు గుర్తుపట్టలేదు. తనకే అది మొదటిసారి వింటున్నట్లు అనిపించింది. తన గొంతు మొద్దుగా రాచినట్లు వుంది. "యేం కావాలి, బాబూ ?" ఆమె అడిగింది. "మీ అబ్బాయి సీనియర్ లెఫ్టినెంట్ ద్రోమొవ్ వద్ద నుండి వర్తమానం తెచ్చాను, మరియా పొలికార్పొనా. 


ఆమె తలుపు తెరచి, ఒక్క అంగలో అతన్ని సమీపించి, అతని చేతులు పుచ్చుకుంది.


 “మా యెగర్ బతికే వున్నాడా ? బాగున్నాడా ? లోపలికి రా, బాబూ, లోపలికి రా. ." 


యెగర్ ద్రోమొవ్ టేబుల్ దగ్గర బెంచీమీద కూర్చున్నాడు తాను పసి వాడుగా వున్నప్పుడు యెక్కడ కూర్చుంటే తల్లి తన ఉంగరాల జుట్టు నిమురుతూ "తిను బంగారూ, అంతా తినెయ్" అంటూ తనను బుజ్జగించేదో అక్కడే కూర్చున్నాడు. 


అతను ఆమె కుమారుని గురించి, అంటే తనను గురించే చెప్పసాగాడు. అతని తిండి తీర్థాల గురించీ, అతను సుఖంగా, కులాసాగా వుండడం గురించీ, యిబ్బందు లేమీ లేకపోవడం గురించీ అతను చెప్పాడు. టాంకి యుద్ధాలను గురించి ఒకటి రెండు మాటలు మాత్రమే చెప్పాడు.


 "అయితే మరి, యుద్ధమంటే భయంకరంగా వుండదూ?" ఆమె అడ్డు ప్రశ్న వేసింది. ఆమె అతని ముఖంపై చూసినట్లే వుంది గానీ, చూపులు యెక్కడనో వున్నాయి.


 "అవునమ్మా, భయంకరంగానే వుంటుంది. కానీ, అలవాటు పడిపోతాం" 


అతని తండ్రి యెగర్ యెగరోవిచ్ వచ్చాడు. ఆయనకు కూడా వయసు పెరిగింది గడ్డంసగం నెరసింది. ఆయన అతిథిని చూసి, ఫెల్టు బూట్లకు అంటుకున్న మంచును గడప దగ్గర వదలించుకొని, మెడచుట్టూ వున్న మఫ్లర్ నిదానంగా తొలగించి, చలికోటు విప్పిటేబుల్ దగ్గరకు వచ్చి కరచాలనం చేశాడు. తండ్రి చేయి, ఆన్యాయమెరగని విశాలమైన ఆ చేయి, యెగర్కు బాగా పరిచితమే. ఆయన ప్రశ్నలేమీ అడగలేదు — రొమ్మున వరుసగా అన్ని పతకాలు గల ఆ వ్యక్తి అక్కడికి యెందుకు వచ్చిందీ తెలుస్తూనే వుంది కూర్చొని అరమోడ్పు కన్నులతో విన సాగాడు. 


లెఫ్టెనెంట్ డ్రోమొవ్ తాను మరొకరైనట్లు నటిస్తూ తనను గురించే మాట్లా డడం కొనసాగే కొద్దీ, అతను ఆ నటనను వదలేయడం అంతకంతకూ అసాధ్యమయింది. అతను లేచినిలబడి "అమ్మా, నాన్నా, నేను యెంత విరూపి నైనా నన్ను గుర్తుపట్టలేరా ?" అని అడగడం అసాధ్యమయింది. స్వగృహంలోని భోజనాల టేబుల్ దగ్గర అతనికి సంతో షమూ, కలిగింది, బాధా కలిగింది.


 “సరే, భోంచేద్దాం. అతిథికి వడ్డించు" అంటూ తండ్రి లేచి, చిన్న అలమార తెరచాడు. చేపల కొక్కేలు గల అగ్గి పెట్టె అక్కడే వుంది. ముక్క బోయిన టీపాట్ కూడా వుంది. అన్నీ యెగర్కు గుర్తే. యెప్పటి లాగే అలమార యెండు బ్రెడ్డు వాసనా, ఉల్లిపాయల వాసనా వేస్తున్నది. తండ్రి వోద్కాసీసా బయటికి తీశాడు. అందులో కొద్దిగా మాత్రమే వోద్కావుంది. అంతకుమించి తాను యెక్కడా సంపాయించలేనందుకు ఆయన నిట్టూర్చాడు. గతంలో లాగే అందరూ భోజనానికి కూర్చున్నారు. తాను గరిటె పట్టుకున్న కుడి చేతి యొక్క ప్రతి కదలికనూ తల్లి గమనిస్తున్నదని లెఫ్టెనెంట్ ద్రోమొవ్ కొద్ది సేపు తర్వాత గుర్తించాడు. అతనికి నవ్వు వచ్చింది. తల్లి కన్ను లెత్తింది. ఆమె ముఖం బాధతో పణకింది. 


వాళ్లు యేవేవో మాట్లాడారు. వచ్చే వసంతం ఏలా వుండబోయేదీ, రైతులు సకాలంలో విత్తనం వేసుకోగలుగుతారా లేదా అనేదీ మాట్లాడారు. వేసవికల్లా యుద్ధం ముగియ వచ్చునని తండ్రి అన్నాడు.


 "ఈ వేసవిలో యుద్ధం ముగుస్తుందని యెందు కనుకుంటున్నారు"?, అని కొడుకు అడిగాడు.


 "ప్రజల కోపం మిన్ను ముట్టింది, వాళ్ళు నరకం అనుభవించారు. వాళ్ళ నిక ఏ శక్తీ ఆపలేదు. కనుక ఫాసిస్టులకు చావు మూడింది. అంటున్నాను" 


తల్లి అడిగింది: “యెగర్ యింటికి వచ్చి మమ్మల్ని చూడడానికి యెప్పుడు సెలవు యిస్తారో మీరు చెప్పనేలేదు. అబ్బాయిని చూసి మూడేళ్ళయింది. బాగా పెద్దవాడయివుంటాడనుకుంటాను. మీసాలు పెరిగి వుంటాయి. ప్రతిరోజూ మృత్యువుకు అంత దగ్గరగా వుండడం వల్ల గొంతు బాగా కరుకుదేలివుంటుంది."


"అవును అతను తిరిగివస్తే మీరు గుర్తు పట్టలేక పోవచ్చు," అన్నాడతడు. అతనికి పడక ఏర్పాటు చేశారు. అక్కడి ప్రతి ఇటుకా, కొయ్య మొద్దుల గోడలోని ప్రతి సందూ, ఇంటి కప్పు మీది ప్రతి అంగుళమూ అతనికి గుర్తే. ఆదంతా గొర్రె చర్మం వాసనా, బ్రెడ్డు 'వాసనా వేస్తున్నది. మరణ సమయంలో కూడా మరచిపోలేనట్టి సొంత ఇంటి సౌఖ్యపు వాసన అది. మార్చి గాలి చూరు కింద గీ పెడుతున్నది. కొయ్య దడికి ఆవల తండ్రి మెత్తగా గుర్రు పెడుతున్నాడు. కానీ, తల్లి తన మంచం మీద నిట్టూరుస్తూ పొర్లుతున్నది. ఆమెకు నిద్ర పట్టలేదు. తనేమో చేతుల్లో ముఖం పెట్టుకొని నిశ్చలంగా పడుకున్నాడు. ఆమె తనను ఎలా గుర్తు పట్టలేకపోయిందా అని అతను ఆలో చిస్తున్నాడు. 


ఉదయం పొయ్యిలో కట్టెల చిట పటలతో అతనికి మెలకువ వచ్చింది. తల్లి నిశ్శబ్దంగా పొయ్యి అంటిస్తున్నది. అతని మేజోళ్లు ఆమె వుతికి తాటి మీద ఆరవేసింది. అతని బూట్లు శుభ్రంగా తుడిచి వాకిటి పంచన పెట్టింది.


 "ధాన్యం అప్పలు ఇష్టమేనా బాబూ!" ఆమె అడిగింది. అతను వెంటనే జవాబు చెప్పలేదు. ప్రక్క దిగి, మిలటరీ చొక్కా తొడుక్కొని, బెల్టు బిగించుకొని, వుత్త కాళ్ళతో బెంచీ మీద కూర్చున్నాడు.


 "ఈ వూళ్లో కాత్యా మల్మిషేవా అనే అమ్మాయి వుందా? అంద్రేయ్ మల్మి షేప్ కూతురు."


"ఆమె నిరుడు కోర్సు పూర్తిచేసి, ఇప్పుడు ఇక్కడే బడిలో పంతులమ్మగా పనిచేస్తున్నది. ఆమెను చూడాల్నా?' 


"మీ అబ్బాయి ఆమెకు తన శుభాకాంక్షలు తప్పక అందజేయనున్నాడు”

కాత్యా కొరకు తల్లి పొరుగింటి పిల్లను పంపింది. లెఫ్టినెంటు బూట్లు తగిలించుకునే లోపలే కాత్యా మల్యిషేవా ప్రత్యక్షమయింది. విశాలమైన ఆమె ధూసర నేత్రాలు ఆశ్చర్యంతో మరింత విశాలమై మిల మిల లాడుతున్నాయి. సంతోషంతో ఆమె బుగ్గలు ఎరు పెక్కాయి. తల మీది శాలువ ఆమె భుజాల మీదికి లాక్కున్నప్పుడు అతను బాధతో మూల్గినంత పని చేశాడు. ఆ వెచ్చని మెత్తని వెంట్రుకలు ముద్దు పెట్టు కోగలిగితే ' 


ఆమెను తాను ఇలాగే మనసులో చిత్రించుకున్నాడు – నవనవోన్మేషంగా, కుసుమ సుకుమారంగా, కరుణార్ద్రంగా, అందంగా, ఎంత అందమంటే, ఆమె ఇంట్లో అడుగు పెట్టగానే ఇల్లంతా బంగారంలా మెరిసింది. 


"యెగిర్ నాకు శుభాకాంక్షలు పంపాడా?" ఆ క్షణంలో అతను వెలు తురుకు వీపు మళ్ళించి నిలుచున్నాడు. మాట్లాడడం సాధ్యంకాక అతను అవునని తల ఆడించాడు " రేయింబగలూ అతని కోసం కాచుకొని వున్నా నని చెప్పండి." ఆమె మరింత దగ్గరికి వచ్చింది. ఆమె కన్నులూ, అతని కన్నులూ కలుసు కున్నాయి. 


ఆమె అడుగు వెనక్కి వేసింది. గుండె మీద ఎవరో బలంగా గుద్దినట్లు ఆమె భయపడిపోయింది. దానితో అతను నిశ్చయానికి వచ్చాడు, అక్కడ ఇహ ఒక్క రోజు కూడా ఆగకూడదని, తల్లి పాలు కలిపి ధాన్యం అప్పలు చేసింది. తను మళ్ళీ లెఫ్టినెంట్ దోమొవ్ను గురించి, అతని సాహస కృత్యాలను గురించి, మాట్లాడాడు. కరకుగా కాత్యా వైపు కన్నెత్తి చూడకుండా మాట్లాడాడు. తన విరూపితనపు ప్రతిబింబం ఆమె మధురమైన ముఖంలో తనకు కనిపించకూడదనే ఉద్దేశంతో. తండ్రి సమష్టి క్షేత్రానికి వెళ్ళి గుర్రాన్ని తెస్తానని అన్నాడు. కానీ, తను స్టేషన్ కు నడిచే వెళ్ళాడు. జరిగినదానితో అతను నిలువునా కుంగి పోయాడు. దారిలో అప్పుడప్పుడు ఆగి, చేతులతో ముఖం కప్పుకొని “ఇప్పుడేం చేయాలి నేను?" అని బాధతో మూలిగాడు. 


 అతను తిరిగి తన రెజిమెంటులో కలిశాడు. అక్కడ మిత్రులు యిచ్చిన స్వాగతంతో అంత వరకు అతన్ని  నిద్రకూ తిండికీ దూరం చేసిన హృదయ భారం తొలగిపోయింది. తనకు కలిగిన దౌర్భాగ్యాన్ని తల్లికి యింకా కొంతకాలం దాకా తెలియజేయవలసిన అవసరం లేదని అతను నిశ్చయించు కున్నాడు. ఇక కాత్యా, ఆమెను తన గుండెలో నుండి పెకలించిపారవేయాలి. 


 సుమారు రెండు వారాల తర్వాత తల్లి వద్ద నుండి అతనికి ఉత్తరం వచ్చింది "బాబూ, నీకు జాబు రాయలంటే నాకు భయమౌతున్నది; ఎందుకంటే, నాకు యేమీ పాలుపోవడం లేదు. ఒక మనిషి మన యింటికి వచ్చాడు, నీ వద్ద నుండి వచ్చానని చెప్పాడు. అతను చాలా మంచివాడు, కానీ ముఖం మరీ విరూపం చెందింది. అతను యిక్కడ కొన్నాళ్లు వుండడానికి వచ్చాడు, కానీ హఠాత్తుగా మనసు మార్చుకొని వెళ్లి పోయాడు. బాబూ, అప్పటి నుండి నాకు కంటిమీద కునుకు లేదంటే నమ్ము. ఆ మనిషి నీవే అని నాకు అనిపిస్తున్నది మీ నాన్నేమో నన్ను కేకలు వేస్తున్నాడు. “నీకు మతి చెడింది, ముసలి పీనుగా. అతను మన అబ్బాయే అయితే ఆ విషయం మనతో చెప్పడంటావా ? మన అబ్బాయే అయితే, మరొకనిలా యెందుకు నటించాలి ? అలాంటి ముఖం వున్నందుకు యెవరైనా గర్వించాలి ?" ఇలా అంటూ మీ నాన్న నా మనసు మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ, నా మాతృ హృదయానికి తెలుసు అతను నీవే! నీవే అతను అని  మనసు ఘోషిస్తున్నది. ఆ మనిషి మన ఇంట్లో ప్రక్క మీద పడుకొని నిద్రపోయాడు. నేను అతని చలి కోటు దులపడానికి పెరట్లోకి తీసుకపోయాను. దాన్ని గుండెలకు హత్తుకొని యేడ్చాను. ఎందుకంటే అతను నీవే అని నాకు తెలుసు గనుక. బాబూ, యెగర్, భగవంతుని మీద ఆన, నాకు జాబు రాయి. ఏమి జరిగిందో  నిజం చెప్పు. లేక, నాకు నిజంగా తల కాయ చెడిందా ?" 


యెగర్ ద్రోమొవ్ యీ జాబు నాకు చూపించాడు. తన కథ చెప్తూ అతను  కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. నేను అతనితో అన్నాను.. 


"నీవు మూర్ఖునివోయ్, వట్టి మూర్ఖునివి. మీ అమ్మకు జాబు రాసి క్షమాపణ కోరుకో. ఆమెను పిచ్చిదాన్ని చేయవద్దు. నీ ముఖం యెలా వున్నా ఆమెకు లెక్కలేదు. ఇప్పుడున్న ముఖంతో నిన్ను ఆమె యింకా యెక్కు వగా కూడా ప్రేమిస్తుంది." 


ఆ దినమే అతను ఉత్తరం రాశాడు, "ప్రియమైన అమ్మా, నాన్నా నన్ను క్షమించండి. మిమ్మల్ని చూడడానికి వచ్చింది నేనే, మీ కొడుకునే..." అలా అతను నాలుగు పుటలు రాశాడు. తీరిక వుందే యింకా యిరవై పుటలురా సేవాడే.


 కొన్ని రోజులు గడిచాక ఒకనాడు మేమిద్దరమూ ఒకచోట వుండగా, ఒక సైనికుడు పరుగెత్తుకుంటూ వచ్చి, "మీ కోసం యెవరో వచ్చారు. కెప్టెన్ ద్రోమొవ్," అని చెప్పాడు. ఆ సైనికుడు కెప్టెన్ ఎదుట సైనికుడు నుంచోవలసిన విధంగానే కచ్చితంగా నిలుచున్నాడు గానీ, అపురూపమైన  శుభవార్త మోసుక వచ్చిన వింత కళ యేదో అతని ముఖంలో తాండవిస్తున్నది. 


నేనూ, ద్రోమొవ్ కలిసి మా గదికి వెళ్ళాం. అతను కాస్త అస్తిమితంగా వున్నాడని నాకు అర్థమౌతూనే వుంది. అతను దగ్గుతూ, కేకరిస్తూ వున్నాడు. టాంకి సైనికుడయితే కావచ్చు గానీ, అతను కూడా మనిషే కదా అని నేను అనుకున్నా ను. అతను నాకంటే ముందు గదిలోకి వెళ్లాడు. అతని కంఠం నాకు "అమ్మా, నేనే " వినిపించింది. 


ఒక ముసలి స్త్రీ అతన్ని రొమ్ముకు అంటగరచుకోవడం చూశాను. చుట్టూ కలయజూసినప్పుడు గదిలో మరొక స్త్రీ కనిపించించి, ప్రపంచంలో అందకత్తెలు చాలామందే వుంటారు. కానీ, యింత అందగత్తెను నేను యెప్పుడూ చూడలేదు. 


అతను తల్లి కౌగిలినుండి విడిపించుకొని, ఆ యువతి వైపు తిరిగాడు. నేను ముందే చెప్పినట్లు ఆ సమయంలో అతను తన శరీర సౌష్టవం మూలంగా ప్రపంచాన్ని జయించడానికి అవతరించిన వీరాధి వీరునిలా కనిపించాడు. "కాత్యా! నీవెందుకు వచ్చావ్? నీవు కాచుకుంటానన్నది యీ మనిషి కోసం కాదు, మరొక మనిషి కోసం.” 


ఇహ అక్కడ వుండడం నాకు మనస్కరించలేదు, నేను బయటికి వెళ్ళే లోపలే ఆమె మాటలు నాకు వినిపిం చాయి.


 "యెగర్, నా జీవితమంతా నీతోనే కలిసివుంటాను నేను నిజంగా నిన్ను ప్రేమిస్తాను. నా సమస్త హృదయంతోనూ ప్రేమిస్తాను. నన్ను కాదనకు."


రష్యన్ వ్యక్తిత్వ మందే అదీ! ఒకరు సాదామనిషి లాగా కనిపించ వచ్చు. కానీ, కష్టసమయం వచ్చినపుడు ఆ మనిషికి అతిలోకమైన శక్తి వస్తుంది. అదే మానవ హృదయపు మహా సౌందర్యం. 








8, ఫిబ్రవరి 2022, మంగళవారం

ఎల్లలెరుగని మాతృ హృదయం

 బహుళ త్రైమాసిక పత్రికలో “నిగమ” పేరుతో నేను వ్రాస్తున్న శీర్షిక “రసోత్కృష్టమ్”

ఫిబ్రవరి సంచికలో ఈ కథ….

ఎల్లలెరుగని మాతృ హృదయం

లిలిక నకోస్  

గ్రీకు నవలాకారిణి కథా రచయిత జర్నలిస్ట్

(1903- 1989)

 ఈ కథ కేరళ రాష్ట్రంలో  పాఠశాల విద్యార్దులకు తొమ్మిదో తరగతి ఆంగ్ల పాఠ్యాంశంగా వుంది. రచయిత 16 వ సంవత్సరాల వయస్సపుడు  మూడు నాలుగేళ్ళపాటు గ్రీక్ టర్కీ యుద్ద వార్తల మధ్య భయం భయంగానే పెరిగారు. తర్వాత కాలంలో కూడా టర్కీ ప్రభుత్వం ఆర్మేనియన్ లపై మారణకాండ జరిపింది. ఆ ఊచకోత పదివేలకు పైగా మంది ఉరితీయబడ్డారు. అనేక స్త్రీలపై అత్యాచారాలు జరిగాయి. ఆ దారుణకాండ జరిగినకాలంలో ఆర్మేనియన్ ప్రజలు స్వస్థలాలు విడిచి చెట్టుకొకరు పుట్టకొకరు తరలిపోయి ఇతరప్రాంతాలలో కాందిశీకుల క్యాంప్ లలో తలదాచుకున్నారు. ఆ విషయాలను స్పురింపజేస్తూ యుద్ద వాతావరణ నేపధ్యంలో జరిగిన కథగా  ఈ కథను చిత్రించారు.  కథ చదువుతున్న పాఠకుడికి ఇది వాస్తవ చిత్రీకరణేమో అని అనిపించకమానదు. 

దేశాల మధ్య అంతర్యుద్దాల మూలంగా ప్రజలు ఎన్నో ఇక్కట్ల పాలవుతారు. గూడు విడిచిన గువ్వలై   ప్రాణాలు అరచేతపెట్టుకుని తమది కాని ప్రాంతానికి ఎక్కడికో పరుగులు తీస్తారు.లేదావిసిరివేయబడతారు.

తలదాచుకోవడానికి ఇంత నీడ కరువై ఆకలిదప్పులతో అలమటిస్తారు.  అగమ్యగోచరమైన బతుకీతలో తుఫాను గాలికి అలల్లాడిపోతున్న నావలా కొట్టుమిట్టాడుతుంటారు. 

ఆర్మేనియన్ క్యాంప్ లో తలదాచుకుంటున్న  పద్నాలుగేళ్ళ బాలుడు “మికిలీ “ తల్లి చనిపోతూ అతనికి అప్పజెప్పిన చిన్నారి తమ్ముడిని కాపాడుకోవడానికి ఎంత యాతన అనుభవించాడో! బక్కచిక్కి ఎముకులపోగులా మారి వికారంగా మారిన ఆ పసివాడికి ఇన్ని పాలు కుడిపేవాళ్ళు కరువై పైగా అసహ్యానికి గురై.. దూరంగా నెట్టబడుతున్నప్పుడు ఆపద్బాందవుడులా ఎదురైన ఒక చైనా యువకుడు అతని భార్య మానవత్వ పరిమళాలను పూయించిన వైనమే ఈ కథ. మనుషుల్లో  సహజంగా వుండే దయ కరుణ సానుభూతిని ప్రదర్శించి తోటి మనిషికి మనిషి పట్ల జీవితంపట్ల  కాస్తంత నమ్మకాన్ని మిగిల్చిన అపురూపమైన కథ ఇది. కథను చదివి ఎవరికివారు అనుభూతిని పొంది తీరవలసిందే తప్ప భావాన్ని చెప్పడానికి భాష కోసం తడుముకోవాల్సిన కథ. 

మానవుడు ఎక్కడైనా మానవుడే! దేశాలు ప్రాంతాలు సంస్కృతి వేరు కావచ్చునేమో కానీ జీవితాలు స్పందనలూ భావనలూ భావోద్వేగాలు అందరిలోనూ ఒకటిగానే వుంటాయని ఆ మాతృమూర్తి నిరూపించింది. మనిషి అంతరంగం కరుణాసముద్రం. ఆ కరుణ అందరిలోనూ వుంటుందని చెప్పలేం. దయ గల హృదయమే దేవాలయం మందిరం మసీదు గురుద్వారా.. అన్నీనూ.  ఈ కథ తోటి మానవుల పట్ల కాస్త దయను సానుభూతిని ప్రదర్శించి మనిషితనం చాటుకోమని ఉద్బోదిస్తుంది. ఎల్లలు లేని మాతృ హృదయానికి శిశువు రూపంతో కానీ జాతి మతాలతో కానీ పనిలేదని మాతృ హృదయం మాతృ హృదయమేనని చాటి చెబుతుంది. సాహిత్యం ఇరుకు మనసులను  విశాలత్వం చేస్తుంది.  సంకుచిత స్వభావం కలవారిని మార్చడానికి ఇతోధికంగా తోడ్పడుతుంది. మన చుట్టూ వున్న ప్రపంచాన్ని బాగా అర్దం చేసుకోవడానికి ఉపకరిస్తుంది.  ముప్పేటలా కలగలిపిన భావాల వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతున్న సగటు మనిషికి సరైన త్రోవ చూపించి మనీషిగా మిగల్చడానికి చేయూతనిచ్చి నడిపిస్తుంది. అందుకే మంచి మంచి కథలను మనం చదువుకోవాలి. ఆ కథలను ఇతరులతో పంచుకోవాలి. అందుకోసమే ఈ కథా పరిచయం.       

 -నిగమ

మాతృత్వం

(MATERNITY)

-- లిలికా నకోస్ (గ్రీక్ రచయిత)

“మార్సెయిల్‌”' పట్టణపు శివార్లలో నెలరోజుల పైబడి “ఆర్కేనియన్‌”కాందిశీకులు విడిది చేసి ఉండడంతో అది ఒక చిన్నపాటి గ్రామసీమగా రూపుదిద్దుకుంది. ఎవరెక్కడ చోటు దొరికితే అక్కడ స్థిరపడిపోయారు. డబ్బున్న కాందిశీకులు గుడారాలు వేసుకున్నారు. మిగిలిన వారిలో కొందరు ఊడిపోతోన్న రేకుల షెడ్ల క్రింద కాలక్షేపం చేస్తున్నారు.

అయితే అధిక సంఖ్యాకులు మాత్రం ఉండడానికి దిక్కుతోచక గోనె బరకాలని వెదురు కర్రల మీది ఛాందినీలా నిలబెట్టి దానికింద కాలం వెళ్ళమారుస్తున్నారు. ఏదేనా ఒకటి రెండు రేకులు దొరికి గోడల్లా ఏర్పాటు చేసుకోగలిగిన వాళ్ళు మహా అదృష్టవంతులేనన్నమాట.

 ఎంతదృష్టవంతులంటే స్వంతంగా పోష్ ‌లోకాలిటీలో ఒక స్వంతభవనాన్ని నిర్మించుకున్నంతటి ఆదృష్టవంతుల కింద లెక్క. ఎవరికి ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ వచ్చిందాంతో కలో గంజో తాగి కాలక్షేపం చేస్తున్నారు.పిల్లలు కూడా మరీ మలమల మాడిపోకుండా ఓ డొక్క ఎండినా ఏదో కొంత తినగలుగుతున్నారు.

అయితే అణగారిన వాళ్ళలో కూడా అతి దరిద్రులూ దౌర్భాగ్యులో వున్నట్లే ఈ కాందిశీకుల్లో కూడా ఉన్న ఓ నికృష్టజీవి “మికలీ”. “మికలీ” పనైతే చేయలేడు కాని ఆతనికి కూడా అందరిలాగా ఆకలి వుంటుందిగా! వాళ్లూ వీళ్ళూ కనికరించి విసిరేసిన రొట్టె ముక్కలు తిని కడుపు నింపుకుని కాలక్షేపం చేసేవాడు, అయితే అతని శరీర తత్వాన్నిబిట్టి ఎంత ఎంగిలి రొట్టెముక్కలు తిన్నా శరీరం తెగబలిసిపోయింది. ఇంతకీ “మికలీ" కి పద్నాలుగు సంవత్సరాలు. ఆతను పని చెయ్యాలంటే వచ్చిపడ్డ మరో ముఖ్యమైన అవరోధం ఏమంటే వాళ్ళమ్మ కళ్ళు మూస్తూ, మూస్తూ వదిలిపెట్టి వెళ్లిన పసికందు భారం ఒకటి అతని మెడకు చుట్టుకుని ఉంది. అయితే ఈ పసికందుకు విపరీతమైన ఆకలి ఎడతెరిపి లేకుండా గాడిద ఓండ్ర పెట్టినట్టు ఏడుస్తూండడంవల్ల అతనిని ఆ చుట్టుపక్కల్నించి తరిమేశారు.నిద్రాభంగమైతే ఎంత సహృదయాులైతే మాత్రం భరించగలరా?

ఆసలు ఈ పసికందు హోరెత్తించే ఆకలి గోలకి మికలీ కి పేగులు తోడేసినట్టుండేది, ఆయితే అతని తల్లి అతని భుజస్కంధాలపై ఉంచిన బాధ్యత భారాన్ని వదలించుకోవడం ఆంత సులభంగాదు కదా! ఏడుపు విని వినీ అతని బుర్ర పూర్తిగా దిమ్మెక్కిపోయి పిచ్చెక్కినవాడిలా తిరగడం మొదలెట్టాడు. తానెక్కడెక్కడ తిరుగుతున్నా చెవులు హోరెత్తించే కర్ణకఠోరమైన ఈ పిల్లాడి ఏడుపు కూడా వుంటూండడంతో అందరూ  మికలీని అసహ్యించుకోసాగారు. ఏడ్చి ఏడ్చి ఆ పసికందు ఎప్పుడో ఒకప్పుడు హరీమనాలని మనస్ఫూర్తిగా వాంఛించసాగారు.

ఆయితే అటువంటిదేమీ జరగకపోగా ఈ “న్యూసెన్స్‌” విపరీతం కాసాగింది. ఈ కొత్తగా పుట్టిన శిశువు కరువు కాటకాలకు, ఆకలికి వాడు విపరీతంగా ఏడ్చి ఏడ్చి బతకాలని నిశ్చయించుకున్నట్లు తోస్తోంది. కరువును మించినట్టుగా భూనభాలు అదిరిపోయేలా రోదిస్తున్నాడు. ఇవన్నీ వినలేని మాతృమూర్తులు చెవుల్లో  దూది కుక్కుకుని మరీ తిరుగుతున్నారు. మికలీకి ఇంచుమించు పిచ్చెక్కినంత పనిగావుంది. తాగినవాడి స్థితిలో తిరగసాగాడు. పాలు కొని పడదామంటే అతని దగ్గర చిల్లిగవ్వయినా లేదు.

ఏ మాతృమూర్తి అయినా దయదల్చి తన స్థన్యాన్ని అందిస్తుందేమోనంటే ఏ తల్లికీ ఆ వాత్సల్యమూ లేదు, ఉన్నా ఆ మాతం క్షీరసంపదా ఉన్నట్టు తోచదు.ఇది చాలదా మనిషిని పిచ్చెత్తించడానికి ?

ఇది పని కాదని మికలీ ఆవలి వైపున ఉన్న క్యాంపుకి వెళ్ళేడు

ఆక్కడ ఆంటోలియన్‌ కాందిశీకులు ఉన్నారు. వాళ్ళూ ఆర్మేనియన్‌ కాందిశీకులాగే ఆసియా మైనర్‌లో తురుష్కుల మూకుమ్మడి హత్యాకాండకి ఝడిసి ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చినవాళ్లే.

వాకబు చేయగా చేయగా మికలీకి ఆ క్యాంప్‌లో దయామయులైన తల్లులున్నారని వారిలో దయ ఎంత నిండుగా వుందో స్తన్యం కూడా ఆంత ఉదారంగానూ వున్నదని, వారు అనాధలైన శిశువుల ఆకలిని తమ స్తన్యంతో తీరుస్తారని తెలిసింది- ఈ చిన్నారి పాపడిని కూడా ఆ తల్లులు అనుగహిస్తే తాత్కాలికంగానైనా ఈ ఆకలి రోదన శమించవచ్చని ఆశపడ్డాడు మికలీ. మనిషిని జీవింపజేసేది ఆశే కదా!

అయిశే ఆ క్యాంపూ ఆర్మేనియన్‌ క్యాంపంత హృదయవిదారకంగానే వుంది.ముసలివాళ్ళు కటిక నేలమీద పరున్నారు. వాళ్ళ కాళ్ళకి ఏ ఆచ్చాదనా లేదు. చిన్నపిల్లలు మురికి నీటి చెలమల్లో ఆడుకుంటున్నారు. ఇతన్ని చూస్తూనే వృద్దురాళ్ళు లేచి కూర్చుని సానుభూతిగా -

“ఏంకావాలి బాబూ? అని అడగసాగారు.తను వచ్చిన పనిని ముసలమ్మలకి చెపితే మాత్రం వాళ్ళేమైనా ఆర్బగలరా తీర్చగలరా? అందుకే తిన్నగా మేరీమాత గుర్తు జండా ఎగురుతున్న ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేడు. ఆ టెంటు లోపలనుంచి చిన్నారి శిశువుల రోదనలు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి. బహుశః  ఈ టెంటులో దయార్ద్ర హృదయులైన మాతృమూర్తుల ఉండి వుండవచ్చు, అందుకే ధైర్యం చిక్కబుచ్చుకుని..

“పవిత్రమైన మేరీమాత స్వరూపాన్ని ధరించిన ఈ టెంట్‌లోని దయామూర్తులెవరో ఈ ఆకలితో అలమటిస్తోన్న ఈ దిక్కూమొక్కూ లేని మాతృహీనుడికి పాలను ఇచ్చి ఆకలి బాపండి తల్లీ! నేను ఆర్మేనియన్ కాందిశీకుల క్యాంప్‌ నుంచి వస్తున్నాను అని హృదయ విదారకంగా కేకవేసాడు మికలీ,

ఈ అభ్యర్థనకు జవాబుగా ఒక అందమైన, నల్లటి పడతి వచ్చింది. ఆప్పటికే ఆమె చేతులలో అరమూతగా కన్నులు మూసుకుని పాలుగోలుతోన్న శిశువు వున్నది

మికలీ హృదయం ఆనందపరవశంలో నాట్యమే చేసింది. దాహార్తితో విలవిలలాడే ఎడారి పయాణీకుడికి ఒయాసిస్సు కనిపిస్తే కలిగేలాటి ఆనందం అది. ఈ ఆనందంతో అతని శరీరం గజగజావణికి పోసాగింది, చుట్టుపక్కల వారు కూడా కొందరు ఆతృతగా ముందుకి వచ్చి మికలీ భుజంమీద దుప్పటిలో చుట్టబెట్టుకువున్న ఆ ఏడ్చే శిశుశువును (మికలీ చిన్నారి తమ్ముడుని) బయటకి తీసి చూడబోయారు.

"ఏదీ ఈ ఆకలిగావున్న శిశువును చూపించు, ఇంతకీ ఇది అబ్బాయా? ఆమ్మాయా!'” దయ ఉట్టిపడే మధురన్వరంతో అడిగింది ఆ పడతి.

హృదయ విదారకంగా కేకలు వేయడం ఇప్పుడు వారి వంతు అయింది. ఆది శిశువా? శిశువు అనేకంటే నరరూపంలో వున్న ఒక దెయ్యపు పిల్ల అంటే సరిపోతుంది. ఎముకల పోగులాటి  బక్క పల్చటి శరీరం మీద దెయ్యం తలకాయ లాంటి పెద్ద తల. ఇప్పటిదాకా చప్పరించడానికి ఏమీ దొరకక  దాని బొటనవేలిని అది చప్పరించిందేమో ఆ వ్రేలు రుబ్బుడు పొత్రమంత సైజుకి ఉబ్బిపోయి వుంది. తన చిన్నారి తమ్ముడు ఇంత ఏహ్యంగా, జుగుప్సాకరంగా తయారయి వుంటాడని ఊహించని మికలీకే ఒక్కసారి షాక్‌ తిన్నట్టయింది.

“ఓయి దేవుడా! ఇది మనిషి పిల్లకాదు.ఇది మనుషుల రక్తాన్ని పీల్చే ఒక రకమైన గబ్బిలం, నిజంగా

 నా వక్షం నిండా పాలున్నా ఇలాటి తురుష్కుజాతి గబ్బిలానికి పాలిచ్చి దైవాపచారం చెయ్యలేను...”

“అవును... ఇది దైవాపచారమే....ముమ్మాటికీ దైవాపచామరే” శృతి కలిపారు మిగిలిన వాళ్ళు.

“ఏమిటేమిటి?.... ఏదీ చూడనియ్‌.... గబ్బిలంకాదర్రా....ఇది

సైతాను భూతపు మరో రూపమే.... ఒరే అబ్బాయి,వెంటనే ఈ క్యాంపు

లోంచి మొహం కనబడకుండా పోతావా చితకొట్టమంటావా? నువ్వు అడుగెట్టినచోట పంచమహాపాతకాలు చుట్టుముడతాయి" అంటూ మికలీని దూరంగా తరిమేశారు. ఏం చేయగలడు? నిస్సహాయుడు నిరాధారుడు. కనీసం సానుభూతి చూపేవాళ్ళైనాలేరు. గుడ్లనిండా నీళ్ళు కుక్కుకుని..

“ఆదరించువారే లేరా ఈ వనిలోన? మమ్మాదరించు దాతలు లేరా ఈ ధరలోన” అని వాపోతూ తిరగసాగాడు. అతని ఆకలిదప్పుల మాట దేవుడెరుగును? ఈ శిశువును ఆకలి రక్కసి కోరలు నుండి కాపాడడం అతనికి తక్షణ సమస్య అయి కూర్చుంది.అయితే తను ఏం చేయగలడట! ఈ శిశువు ఏడ్చి ఏడ్చి ఎంత త్వరగా మరణిస్తే ఎంత బాగుండును అనిపిస్తుంది. నాగరికులమైన మనకైతే పాపం అతడు అజ్ఞాని అందుకే అతడు మనంత నాగరికంగా ఆలోచించ లేకపోయాడు అనుకుందుము. అతడు ఏకాకి.అన్నీ పోగొట్టుకున్నవాడు. ఇంతసేపు అతను మోస్తున్నది ఆకలితో అలమటిసోన్న ఒక చిన్నారి శిశువును కాదని.... నర రూపంలో ఉన్న ఓ దెయ్యపు పిల్లనని అనిపించేసరికి వెన్నులోంచి వణుకు పుడుతోంది. అయినా అతనిలో లవలేశంగానైనా మిగిలివున్న బాధ్యత, మానవత్వం ఆ శిశువుని అలా మోయిస్తూనే వున్నాయి. అయ్యో పాపం పసివాడు.మికలీ ఒక షెడ్డు నీడలో చేరాడు, బయట వేడిగా వుంది. షెడ్డు లోనూ వెచ్చదనం పరుచుకుని వుంది. అతనికి తన కడుపులో ఎలకలు పరిగెడుతున్న సంగతి గుర్తువచ్చింది. వీధులలో సగం సగం తిని పడేసిన పదార్దాలనో, అవ్వీ దొరకకపోతే పెంట కుప్ప మీద పడి వున్న పదార్థాలను కుక్కలతో పోటీ పడోతినాలి. తప్పదు. అప్పుడు మొదటిసారిగా అతనికి జీవితం అతి భయంకరమైన దానిగా తోచ సాగింది. తోస్తేమాత్రం ఏం చెయ్యగలడు!

చేతుల్ని ముఖానికి అడ్డుపెట్టుకుని వెక్కి వెక్కి ఏడవనారంభించాడు. ఎవరు వింటారు. ఈ దీనుడి ఏడుపు? ఎవడికి కావాలట. ఎవరు ఎలా పోతే మాత్రం?? తొందరపడి ఆలా అనెయ్యకండి. సర్వసాక్షికి ఇవేమీ తెలియవనే అంటారా?....ఏమో !

మికలీ తలెత్తి చూసేసరికి అతని ముందు ఒక చైనా యవకుడు నిలబడివున్నాడు,  మికలీ ఆతన్ని ఆ క్యాంపులో చాలాసార్లు చూసాడు కాని అంతగా గమనించలేదు అయితే ఆ చైనీయడు మికలీని ఆతని అవస్థనూ నిత్యం చూస్తూనేవున్నాడు, అతగాడు ఈ క్యాంపులో పేపరుతో చేసిన రక రకాల ఆటవస్తువులూ ఏవేవో గమ్మత్తు వస్తువులు అమ్మి వ్యాపారం చేద్దామని వస్తూండేవాడు. ఆయితే అతని దగ్గర ఎవ్వరూ ఏమీ కొనేవారుకాదు.ఈ చైనా వాడు చింతాకుల్లాటి కళ్ళతో, తప్పడముక్కుతో, పచ్చగా, కుదమట్టంగా వుండడంతో క్యాంపులోని పిల్లలు ఆటపట్టిస్తూ ఉండేవారు.పైగా

“వీలింగ్‌, స్టింకింగ్‌ చింక్‌* అని పిలుస్తూ హేళన చేసేవారు.

మికలీ కేసి ఆ చైనా యువకుడు చాలా దయగా చూశాడు.అంత చిన్నకళ్ళల్లోనూ విశ్వమంత విశాలమైన దయ ఉబికి ఉబికీ తన్నుకు వస్తూ కనబడుతోంది.

“అలా ఏడవకూడదమ్మా అబ్బాయ్‌...” అన్నాడు ఎంతో సిగ్గుతో ముడుచుకుపోయినవాడిలా  వున్న మికిలీతో. “రా అమ్మ రా! నాకూడా రా.” అన్నాడు.

నేను రాను. అన్నట్టు తల అడ్డంగా వూపడం ఈ మాటు మికలీ వంతయింది....మికిలీ అక్కణ్తించి వేగంగా పారిపోదామని కూడా భావించాడు. ఈ ప్రాచ్యదేశస్టుల క్రూరత్వాన్ని గురించి మికలీ వాళ్ళ దేశంలో వున్నప్పుడు ఎన్నో రకాల కథలు విన్నాడు. వాళ్ళ దేశంలోనేకాదు ఈ క్యాంపులోకూడా తరచు వినబడేదేమంటే....ఈ చైనావారూ జపాన్‌ వారూ క్రైస్తవ పిల్లల్నిఎత్తుకుపోయి....యూదుల్లా వారి రకాన్ని పిండుకుని కడుపునిండా తాగుతారట.

అయితే ఆ చైనీయుడు ఒక అంగుళమయినా కదలకుండా అలాగే నిలబడివున్నాడు. నిండా మునిగిపోయేవాడిలో గడ్డిపోచయినా ఆశని కల్పించినట్టు చావుకి ఇన్ని చావులుండవుకదా అని అతని కూడా బయలుదేరి వెళ్ళాడు. పొలంగట్టు మీంచి నడిచి వెళ్ళటంతో చేతుల్లో పిల్లాడితో సహా తూలిపడిపోయాడు మికలీ.

అయితే చైనా యువకుడు మికలీ చేతిలోని శిశువును తానే అందుకుని తన గుండెలకు సుతారంగా హత్తుకుని ముందుకు నడవసాగాడు.

వాళ్ళు  అనేకమైన కాళీ ఇళ్ళని దాటుకుంటూ వెళ్ళారు. చివరికి ఒక తోట మధ్యలో వున్న కర్రలతో కట్టిన ఒక ఇంటి ముందు ఆగేరు, 

తలుపు మీద సున్నితంగా రెండు మూడు సార్లు తట్టాడు. ఒక చిరుదీపం దాల్చిన ఓ చిన్నపాటి యువతి వచ్చి తలుపు తీసింది. ఈ చైనా యువకుని చూడగానే ఆ అమ్మాయి కొద్దిగా సిగ్గుపడింది,బుగ్గలు ఎరుపెక్కాయి ఆయినా చిరునవ్వుతో వారికి స్వాగతం పలికింది. మికలీకి ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. లోపలికి వెళ్లాలంటే భయం, ఆందోళన ఏవేవో ఉద్వేగాలు అందుకే తడబడుతూ నిలబడ్డాడు.

“నందేహంలేదు....లోపలికి రావోయ్‌....ఈమె నా భార్యే…

“కానున్నది కాకమానదు"” అనుకుంటూ లోపలికి ఆడుగేశాడు మికలీ.

అది పెద్దగదే....అయితే దానివి కాగితాలు అంటింపుతో రెండు భాగాలుగా చేసారు...బీదరికం కనపడుతున్నా ఆ ఇంట్లో ఆరోగ్యం ఉట్టిపడుతూ వుంది. సౌజన్యం సరేసరి. 

 “ఇది మా పాప... అంది ఉయ్యాలలో ఆడుకుంటూన్న ముద్దు పాపాయిని చూపిస్తూ. ఆ పాపాయి ఎంతో ముద్దుగా వున్నాడు.ఇంతటి ఆందోళనలోనూ మికలీ పాపాయి దగ్గరిగా వెళ్లి బుగ్గగిల్లి అభినందించకుండా వుండలేకపోయాడు. కడుపునిండా పాలుతాగినట్టున్నాడు. హాయిగా

నిద్రపోతున్నాడు.

భర్త భార్యను సంజ్ఞచేసి పిలిచాడు.చాపమీద కూర్చోమన్నాడు. కూర్చోపెట్టి ఈ దెయ్యపు(లాటి)శిశువును చేతికందించాడు. చూడగానే ఆమెకూడా వెర్రికేక పెట్టింది.అయితే భయంతోనో ఏహ్యభావంతోనో వేసిన కేకకాదు.దయ చిప్పిల్లి  వేసిన సానుభూతి చిహ్నమైన కేక. ఆ శిశువును గుండెలకదుముకుని  పాలు కుడుపసాగింది. ఆమె పాలిండ్లు ఆర్ద్రమై పాలను ఎగచిమ్మేయి. ఆకలిగొన్న శిశువు ఆవురావురని పాలు తాగసాగింది,

7, ఫిబ్రవరి 2022, సోమవారం

తల్లి

రసోత్కృష్టం - నిగమ

కథల ఒడ్డున.. కాసాపు ఆగుదామా! 

 సృష్టిలో ఉత్కృష్టభావాన్ని భాగాలుగా విడగొడితే అందులో మాతృప్రేమకే అగ్రస్థానం లభిస్తుంది. అది పశువైనా శిశువైనా సరే. జంతువులు పశుపక్ష్యాదులు అనేక కీటకజాతులలో మాతృప్రేమ సొంతంగా మనుగడ సాగించేంతవరకే పరిమితంగా వుంటుంది. తర్వాతంతా ఆ సంతతి ప్రకృతిలో తమలాగానే ఇంకొకటిగా అనుకుంటూ మనుగడ సాగిస్తాయి. 

ప్రత్యేకంగా మనిషికి మాత్రమే కొన్ని బంధాలు అనుబంధాలు జీవితాంతం పెనవేసుకుని వుంటాయి.
అందులో ప్రతి మనిషికి అమూల్యమైనది మాతృప్రేమ. మాతృ ప్రేమకు మించిన ప్రేమ ఉంటుందా లోకంలో అని ఆశ్చర్యపడటం వింతేమి కాదు కూడా. 

ఇటీవల కాలంలో  అప్పుడప్పుడూ మాతృత్వ లక్షణం మసకబారుతున్నదా అనే అనుమానాలు పొడజూపినట్లనిపించినా.. అనేకానేక ఉదంతాలు విన్నా చూసినా చదివినా హృదయం చెమరిస్తుంది. అమ్మ ప్రేమకు మన అణువణువు అంజలి ఘటిస్తుంది. 
 
చాలాకాలం క్రిందట ఒక ఉర్దూ కథ చదివాను. ఆ కథ చదివిన పిమ్మట చాలా దుఃఖం కల్గింది. ఆ దుఃఖాన్ని అనుభవించడం ప్రతి మనిషికీ చేతనవును కూడా మరీ హృదయం అంత పాషాణం కాకపోయినట్లైతే!

మనకుతల్లి లేదా అమ్మ అనే భావనే అపురూపం. తల్లిబిడ్డలది నాభీసంబంధం. ఎక్కడో  దూరంగా బిడ్డకు ఇసుమంత కష్టం కల్గినా నొప్పి కల్గినా.. అది అమ్మ మనసుకు తెలిసిపోతుంది. బిడ్డ క్షేమం కోసం తల్లడిల్లుతుంది. వీలైతే ఆ బాధ తాను భరించి బిడ్డకు ఆ బాధనుండి విముక్తి కల్గించాలని తపన పడుతుంది. కానీ దేహమానసిక బాధలు ఎవరివి వారే భరించాల్సిరావటం ప్రకృతిచ్చిన శిక్ష. 

ఈ కథలో తల్లి అత్యంత సాధారణమైన తల్లే. ఆమెలో ఏ ప్రత్యేకతలు లేవు. అయితే మాత్రమేం.. ఆమె నిరంతర ఆలోచనా స్రవంతి కొడుకు చుట్టూనే. అతని బిడ్డల చుట్టూనే. ఏనాడు చిన్న ఆరోపణ కూడా చేయని ఆమె తల్లి ప్రేమ మనల్ని వెక్కివెక్కి ఏడిపిస్తుంది. ఎన్నో ఏళ్ళ తర్వాత తనను చూడవచ్చిన బిడ్డకు రాచమర్యాదలు జరిపించాలని ఘనమైన అతిధి సత్కారాలు చేయాలని అతనికీ అతని బిడ్డలకూ కానుకలనివ్వాలని తపించిపోయింది. ఆ కొడుకుతో పాటు కథ చదువుతున్న మనం కూడా  ఉద్విగ్నతకు గురవుతాం. కొడుకు పశ్చాతాపంతో మొదలైన కథ ముగింపుకొచ్చేసరికి అణువణువును కరిగించి కన్నీటి వర్షంలో తడిపేస్తుంది. ఒక స్త్రీ రచయితగా మరొక స్త్రీ అంతరంగ చిత్రణను అద్భుతంగా ఆవిష్కరించిన కథను అందరూ చదివితీరాలనే ఆకాంక్షతో ఈ కథను పరిచయం చేస్తున్నాను.. 

మీరూ  ఈ కథను చదవండి. మనలో ఆవిరైపోతున్న మానవత్వ విలువలను మేలుకొలుపుతుందీ కథ. మనని కనిపెంచిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదని మనను సున్నితంగా హెచ్చరిస్తుంది.

 రుకైయ్యా రీహానా వ్రాసిన “తల్లి"  కథను నేను చదివిన ఉత్తమకధలలో ఒకటిగా బహుళా త్రైమాసిక వెబ్ సంచికలో పరిచయం చేస్తున్నాను చదవండీ. 
                                                     -నిగమ

రచయిత పరిచయం


రుకైయ్యా రీహానా ఉన్నత విద్యావంతురాలు. స్త్రీ జీవితాన్ని చిత్రించడంలో అసమానమైన ప్రతిభావంతురాలు. ఉర్దూ కధాసాహిత్యంలో విశిష్టస్థానాన్ని సంపాదించుకొన్నది. ఆమె రచనలలో మానవహృదయంలోని ఆంతరంగిక వేదనా, మాతృత్వ, నారీత్వములలోని తీపి, ప్రధానస్థానాన్ని ఆక్రమిస్తవి. “తల్లి" ఆమె ఉత్తమకధలలో ఒకటి.


“తల్లి"

మాష్టరు హమీద్ ఢిల్లీలో బారహటోటేలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు. అతడి అసలు నివాసస్థానం రషీదాబాదులోని వహాడీ మొహల్లా, అతని తండ్రి రషీదాబాదులో కంచరి పనిచేస్తూఉండేవాడు. హమీద్ బాల్యంలో తన పేటలోని మసీదులోనూ, తరువాత కొద్ది రోజులు ముల్లా సాహెబు బడిలోనూ, ఆ తరువాత తండ్రిగారి ఇష్ట ప్రకారం కొంతకాలం తాలూకా స్కూలులోనూ చదువుకొన్నాడు. హమీద్ ఉర్దూ ప్యాసయిన రోజుల్లో రషీదాబాద్ లో ప్లేగువ్యాధి వ్యాపించి హమీద్ తండ్రిని బలిగొన్నది. ఆయన అంత్యకర్మలన్నీ పూర్తి చేసిన తరువాత హమీద్ తల్లి దగ్గర లెఖ్ఖ చూచుకొంటే డెబ్బయి రూపాయలు మిగిలినవి. మిడిల్ ప్యాసయిన తరువాత హమీద్ కు ఇంగ్లీషు గూడా చదువు కొందామని అభిలాష కలిగినది. కాని ఎలాగా చదువుకోవడం?

వీరి పేటలో ఉండే ఒకాయన ఢిల్లీలో పోలీసుగా ఉండడంవల్ల హమీద్ రెండు మూడు సార్లు ఢిల్లీని గురించి విని ఉన్నాడు. అందువల్ల తల్లి దగ్గర పది హేను రూపాయలు తీసుకొని మెల్లగా ఢిల్లీ చేరుకొన్నాడు.

పోలీసు కానిస్టేబుల్ నసరుల్లాఖాన్ ఇల్లు ఎలాగ తెలుసుకోవడం, చచ్చి చెడి అతని ఇల్లు తెలుసుకొన్నాడు. నసరుల్లాఖాన్ హమీద్ తండ్రిని బాగా ఎరుగును. అందువల్ల అతను హమీద్ ను ఆదరించి తన ఇంట్లో ఉండి చదువుకోడానికి అవకాశం కలుగజేశాడు. నసరుల్లాఖాన్ ఇంట్లోనే ఉంటూ హమీద్ మూడు సంవత్సరాల్లో పదో క్లాసుకు వచ్చాడు. లెఖల్లో హమీద్ నిధి. ఒక సహాధ్యాయుడికి పాఠం చెప్పడం ప్రారంభించి నెలకు ఏడు రూపాయలు సంపాదించడం ఆరంభించారు. ఏడు రూపాయలు తన భోజనానికి సరిపోతవి గనుక వేరుగా ఉంటానని తాను ఎంత బ్రతిమి లాడినా నసరుల్లాఖాన్ అంగీకరించనందున, హమీద్ విధిలేక అక్కడే ఉండిపోయినాడు.


‘ఆ విధంగా పది నెలల్లో హమీద్ డెబ్బయి రూపాయలు రొట్టం నంపాదించాడు. తల్లి దగ్గరనుండి తెచ్చినవి పది రూపాయలు మిగిలి ఉన్నవి. ఒకసారి తల్లి రెండు రూపాయలు మనియార్డరు పంపించింది. మొత్తం అతని దగ్గర ఎనభయి రెండు రూపాయలు పోగుపడినవి. స్కూలుకు వేసవికాలపు సెలవులిచ్చారు. నసరుల్లాఖాన్ గూడా సెలవు బెట్టాడు. ఇద్దరూ కలిసి రషీదాబాద్ వచ్చారు.


అప్పటికి హమీద్ తల్లి దగ్గర భర్త అంత్యక్రియలు చేయగా మిగిలిన డబ్బు పన్నెండు రూపాయలు మిగిలి ఉన్నవి. ఇంటిముందున్న పనసచెట్టు అమ్మడంవల్ల ప్రతి సంవత్సరం పాతిక రూపాయిల ఆదాయం వస్తూ ఉండేది. ఇంటికి పోయేటప్పటికి తల్లి హమీద్ కు వివాహసంబంధం మాట్లాడి సిద్ధంచేసి పెట్టింది, ఆ డబ్బు హమీద్ దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టి ఏదోవిధంగా హమీద్ వివాహం పూర్తిచేసింది. పెళ్ళి అయిన ఏడోరోజున తిరిగి హమీద్ ఢిల్లీ వెళ్ళాడు. ఆ సంవత్సరం పరీక్షలో కృతార్థుడు అయినాడు.


ఇక ఉద్యోగం ఒక ప్రైవేటు స్కూల్లో కొద్దిరోజులు నౌకరీ కుదిరింది. తరువాత ఇంకొక స్కూళ్ళో ఆ తరువాత ఇంకొక స్కూళ్ళో -చివరకు ఒక స్కూళ్ళో అతని పని చూసి సంతోషించి ఆ స్కూలు ప్రధానోపాధ్యాయుడు అతడి ఉద్యోగం ఖాయంచేశాడు.నెలకు ఇరవయి రూపాయల జీతం. ఇక వేరే కాపురం పెడతానని హమీద్ నసరుల్లాఖాన్ ను అడిగారు.


ఒంటరిగా కాదు. భార్యనుగూడా తీసుకొనిరమ్మని నసరుల్లాఖాన్ మూడు రూపాయలు అద్దెకు ఒక చిన్న ఇల్లు కుదిరించి పెట్టారు. హమీద్ ఖాన్ రషీదాబాద్ వెళ్ళి భార్యను తీసుకొచ్చి ఆ ఇంట్లో కాపరం పెట్టాడు. రషీదాబాద్ లో తల్లి ఒంటరిగా ఉండిపోయింది.


హమీద్ భార్యను ఢిల్లీ తీసుకొనివచ్చి ఏడు సంవత్సరాలు గడిచింది. అతనికి ముగ్గురు మొగపిల్లలూ, ఒక ఆడపిల్లా పుట్టారు. వారిలో ఒక మొగపిల్లవాడూ, ఆడపిల్లా చనిపోయినారు. హమీద్ భార్యకు గూడా చాలా జబ్బు చేసింది. ఒకసారి హమీద్ కు ఎండదెబ్బ తగిలి పది హేను రోజులు మంచంలోనే ఉండిపోయినాడు. అటుస్కూల్లో పని పెరిగి పోయింది. ఇటు జీతం ముప్ఫయి రూపాయలయింది. పదిరూపాయలు ప్రైవేటు చెప్పి సంపాదించేవాడు. కాని ఢిల్లీ లో ఆ డబ్బు అతనికి ఏమాత్రమూ సరిపోయేది కాదు. తల్లి రషీదాబాద్ రమ్మని ఉత్తరాలమీద ఉత్తరాలు వ్రాసేది. కాని డబ్బులేక తల్లిని చూడవలెనని ఎంత కుతూహల మున్నా హమీద్ రషీదాబాదు పోలేకపోయినాడు.


రోజూ ఉదయమే లేచి మసీదుకు  పోయి నమాజు చేసుకోవడం, ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఖురాన్ లోనుండి ఒక అధ్యాయం పారాయణం చేయడం అతనికి అలవాటు. మసీదు నుంచి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు రోజూ ముసలి చాకలిది జానకి నడుము వంగిపోయి కర్రపోటు వేసుకొంటూ చాకిరేవుకు పోతూ కనపడేది, కాని ఎందువల్లనో ఐదు రోజులనుండి జానకి కనపడడం లేదు, హమీద్ కు ఆశ్చర్యం వేసింది. జానకి కనపడని రోజు లేదే: ఎందువల్ల ఐదు రోజులనుండి కనపడడంలేదో తెలుసుకుందామని జానకి ఇంటికి వెళ్లాడు, జానకి ఏమైందని అక్కడివాళ్ళను ప్రశ్నిస్తే విన్నరాత్రి చనిపోయిందని వాళ్ళు జవాబు చెప్పారు.


జానకి చనిపోయిందని వినగానే హమీద్ గుండె గుభీలుమన్నది. జానకికి హమీద్ కు ఏమి సంబంధమున్నదో భగవంతునికి తెలియాలి , స్కూలుకు పోయినాడు. అక్కడ అతనికి ఏమీ తోచలేదు. ఏదోవిధంగా కాలక్షేపం చేసి స్కూలు వదలి పెట్టగానే ఇంటికి చేరాడు. భార్య “శరీరం బాగాలేదా ?" అని అడిగింది. ఏమీ వినిపించుకోలేదు. తెల్లవార్లూ అతనికి నిద్ర పట్టలేదు. మర్నాడు బక్రీదు. స్కూలుకు సెలవు. స్టేషన్ కి పోయి రషీదాబాద్ కు టిక్కెట్టు కొన్నాడు. రైల్లో పడ్డాడు. బక్రీదురోజు పగలల్లా రైల్లోనే గడిచింది. నమాజులేదు. కుర్బానీ లేదు. ముసలితల్లి ధ్యాసే. కళ్ల ముందు ముసలితల్లి కన్పించడమారంభించింది. తెల్లబడిపోయిన వెంట్రుకలు, ముడతలు పడిపోయిన శరీరం, వంగిపోయిన నడుము.

 

భార్య, పిల్లలమీద మక్కువవల్ల హమీద్ ముసలి తల్లిని మర్చిపోలేదు. నాలుగైదుసార్లు ఏడెనిమిది రూపాయలు తల్లికి మనియార్లరు గూడా పంపించాడు. ఆ డబ్బు పంపినప్పుడల్లా తనూ, తన పిల్ల లూ చాలా ఇబ్బంది పడే వాళ్ళు, తన తల్లికి ఉత్తరాలు వ్రాసినప్పుడు పిల్లలచేత గూడా ఆ ఉత్తరాల మీద ఏవో గీతలు గీయించేవాడు. ఆ పిచ్చిగీతలు చూసి తన తల్లి సంతోషించవలెనని అతని అభిప్రాయం. అతని భార్య గూడ వ్రాయడం నేర్చుకొన్నది. అత్తగారికి సలాములు తెలియపరుస్తూ ఉండేది. అటునుండి తల్లి మాటమాటకి రమ్మనీ పక్క ఇంటి దర్జీఆమె చేత ఉత్తరాలు వ్రాయిస్తూ ఉండేది. వచ్చే సంవత్సరం పంట రోజుల్లో తప్పక వస్తానని వ్రాసేవాడు. కుటుంబంతో పోవాలి. చేసేది ఉద్యోగం గనుక యేవోకానుకలు తీసుకొనిపోవాలి. పళ్ళు ఫలాలు తీసికొనిపోవాలి. అందుకు డబ్బుగావాలి. వచ్చే జీతంతో తిండి గడవడమే కష్టంగా ఉండేది. అందువల్ల ఎప్పటికప్పుడు ప్రయాణం ఆపుకొనేవాడు. కాని జానకి మరణవార్త వినిగుండె పగిలినట్లయి ఆగలేక ఒంటిరిగా బయలుదేరాడు.


బక్రీదునాడు సూర్యాస్తమయం సమయానికి హమీద్ రషీదాబాద్ చేరాడు. పైనుండి భోరున వర్షం కురవడం ఆరంభించింది. అతనికి స్మృతి వచ్చినట్లయింది, గొడుగుమాత్రం చేతులో ఉన్నది. అయ్యో! గుడ్డలన్నా తెచ్చుకోలేదనుకున్నాడు. గొడుగు వేసుకొని బయలు దేరాడు. జనం   నివసించే చోట నీళ్ళు నిలవగూడదనే ఆరోగ్య సూత్రం గ్రామస్తులకు అర్ధమే అయ్యేది కాదు, అర్థమైనా వాళ్ళు పట్టించుకొనే వాళ్పుకాదు. మోకాళ్ళతోతు నీళ్ళలో పడుతూ, లేస్తూ మెల్లగా యింటికి చేరుకొన్నాడు. తలుపు లోపల వేసి ఉన్నది. తలుపు తట్టాడు. "అమ్మా ! అమ్మా !" అని పెద్దగా పిలిచాడు.


లోపుల నుండి ఒక లావుపాటివాడు వచ్చి తలుపులు తెరిచాడు. బక్రీదు పిండివంటలన్నీ తిని అరగడానికి నిద్రబోయి అప్పుడే లేచినట్లు కనపడ్డాడు, హమీద్ ను గుర్తు బట్టి మూడు సంవత్సరాల క్రితం ఆ యిల్లును కొన్నట్లున్నూ. హమీద్ తల్లి దర్జీ ఆమె ఇంట్లో వున్నదని చెప్పాడు. తలుపు వేసుకొని లోపలికి వెళ్ళిపోయినాడు.


హమీద్ కు అడుగు ముందుకు పడలేదు. ఇల్లు కూడా అమ్మవలసినంత కష్టంలో తల్లి పడిపోయింది కాబోలు ననుకున్నాడు. వనపచెట్టు ఆదాయంతో కాలక్షేపం చేస్తున్నదనుకొని చాలా పొరపాటు చేశాననుకున్నాడు. ఆ తల్లికి మొఖం చూపించడమెలా , ఎంత స్వార్ధం తనలో బలిసిపోయింది. తన పిల్లల మంచినీ, తన మంచినీ తను చూసుకున్నాడే గాని ముసలి తల్లిని గురించి ఆలోచించనైనా లేదుగదా అని పశ్చాత్తాన పడ్డారు. మెల్లగా దర్జీఆమె ఇంటిదగ్గరకు కాళ్ళీడ్చుకుంటూ చేరాడు. తలుపు కొట్టబోయాడు. చెయ్యి లేవలేదు. మెల్లగా తలుపు కొట్టాడు. "అమ్మా !" అని పిలిచాడు. దర్జీ సోతి వచ్చి తలుపు తీసింది. హమీద్ ను గుర్తు బట్టింది. “హమీద్ వచ్చాడు. హమీద్ వచ్చాడు" అంటూ లోపలకు పరుగెత్తింది.


హమీద్ తల్లి ఈమధ్య ఆసక్తతవల్ల ఇంట్లో అటూ ఇటూ  నడవడం కూడా మానుకొన్నది, ఆమె కళ్ళు కూడా ఏమీ కన్పించేవి కావు. కాని హమీద్ వచ్చాడనడంతోనే ఆ సంతోషంలో ఎక్కడ నుండి శక్తి వచ్చిందో ఠఫీమని లేచి వాకిట్లోకి దూకి హమీద్ ను ఆలింగనం చేసుకొన్నది. వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె శరీరంలో ఎముకలు తప్ప ఏమీలేవు. తలమీద వెంట్రుకలు తెల్లబడి పోయినవి. నడుము వంగిపోయింది. మెడ శిరస్సు భారాన్ని గూడా వహించలేకుండా ఉన్నది. ప్రేమవల్లనో, లేక ముసలి తనం వల్లనో ఆమె శరీరం వణక నారంభించింది. చాలాసేపు ఇద్దరూ మాట్లాడలేకపోయినారు. చివరకు తల్లి మెల్లగా కంఠం పెకలించుకొన్నది "నాయనా , చాలా దూరం నుండి వచ్చావు. గుడ్డలన్నీ తడిసిపోయినవి. గుడ్డలు మార్చుకో, టీ తీసుకొని వస్తాను, పిల్లలంతా కులాసాగా ఉన్నారా ?" అని ప్రశ్నించింది.


అమ్మా, ఇల్లు అమ్మివేశావా ? నాకు తెలియజేయలేదేమి " అని అడిగాడు.

“నాయనా! నీకు తెలియజేస్తే మాత్రం నువ్వేమి చేస్తావు, నీకు మాత్రం కష్టాలు తక్కువగా ఉన్నవి గనుకనా, కానీ. ఈ దర్జీ సోతి నాకు చాలా సహాయం చేస్తున్నది. నీ కష్టాలు మీకు గాక నా బాధ కూడా మీకెందుకు నాయనా, ఈ జన్మలో నిన్ను చూడలేనేమో అనుకున్నాను, నువ్వు వచ్చావు" అన్నది.


హమీద్ కళ్ళవెంట బొటబొటా నీళ్లు కార్చాడు. ఇల్లు నలువైపులా కలయ చూచాడు. ఎదుట చిన్న మంచం మీద దర్జీ ఆమె ఇద్దరు పిల్లలూ నిద్రబోతున్నారు. ఒక పిల్లవాడు కింద ఆడుకుంటున్నాడు.

దర్జీ సోతి పొయ్యి రాజేస్తున్నది. ఆమె తొడుక్కున్న రవిక వీపుమీద చిరిగిపోయి పున్నది. గుడ్డలు మాత్రం తెల్లగానే ఉన్నవి.. బక్రీదు పండుగ కదూ!


"అమ్మా , రోజూ నీవు ఇక్కడనే నిద్రపోతూ ఉంటావా?"


“కాదు నాయనా ! ఆమె ఈ గదిలో పిల్లలతో పడుకొంటూంది. నేను అవతల గదిలో పడుకొంటాను" అన్నది తల్లి.


“అమ్మా! నీవు ఇంకా పనిచేస్తూనే ఉన్నావా? చేతులు పని చేయనిస్తున్నయ్యా!”

"చేతులు బాగానే ఉన్నవి గాని కళ్ళు మాత్రం నెల రోజుల నుండి కనపడడంలేదు నాయనా"


“కళ్ళు కనపడడంలేదా ? అన్నాడు ఆతురతతో హమీద్,


తల్లి హమీద్ తలను చేతితో నిమిరింది. చెయ్యి బుగ్గలదాకా పోనిచ్చింది. అతని తలను తన హృదయానికి హత్తుకొన్నది. చిరునవ్వు నవ్వింది. "నాయనా, కళ్ళు కనపడడం లేదా అంటున్నావా , నాయనా నీవు కనపడుతూనే వున్నావు. రోజూ సూర్యుడు కనబడతాడు అంతే. మిగిలిన వస్తువులు ఏమీ కనబడవు. చిన్న పిల్లవాడు కులాసాగా ఉన్నాడా? వాడి వయస్సెంత? అని అడిగింది.


“సంవత్సరంన్నర"


“అయితే చొక్కా, టోపీ వాడికి సరిపోతవి" అంటూ ఒక పాత గుడ్డల మూట విప్పి అందులోనుండి ఒక చొక్కాను, బుటేదారీ పనిచేసి యున్న ఒక టోపీని బయటకు తీసింది.


"మజీద్ కోసం ఇవి తయారుచేశావా ? అని హమీద్ కన్నీళ్ళు కార్చాడు.


కాదు నాయనా సలమా కోసం కుట్టి తయారు చేశాను. పంపుదామంటే నీవు రానేలేదు. తరువాత సలమా చచ్చిపోయిందని ఉత్తరం వ్రాశావు అని చొక్కా వంక చూసి కన్నీళ్ళు పెట్టుకొన్నది. లేచి లోపలికి వెళ్ళిపోయింది. టీ తెచ్చి ఇచ్చింది. తాగారు. తల్లి మంచం మీద కూర్చొని ఉండిపోయినాడు.


ఏమిటేమిటో ఆలోచనలు హమీద్ తనను తాను మరచి పోయినాడు. అలా రెండు గంటలు గడిచింది. పక్క ఇంటి నసీబన్ గూడా వచ్చింది. నసీబన్, హమీద్ తల్లి, సోతి వంట ఇంట్లో ఏమేమిటో చేస్తూ ఉండిపోయినారు.


సుమారు ఎనిమిది గంటలకు హమీద్ తల్లి బయటికి వచ్చి “నాయనా! భోజనానికి లేవమన్నది.

అప్పటికి హమీద్ కు కొద్దిగా నిద్రపట్టింది. ఉలిక్కి పడి లేచాడు.


బీద స్థితిలో ఉన్నది గనుక తల్లి జొన్నరొట్టె తయారు చేసి ఉంటుందనుకొన్నాడు. కాని వడ్డించిన పదార్థాలను చూసి ఆశ్చర్యపడ్డారు. కబాబు, మేక గుండెకాయ కూర, పొరాటాలు, మినప్పప్పు పప్పు గారెలు,మామిడి కాయ పచ్చడి, ఒక కప్పులో మీగడి, ఒక ప్లేటులో వండిన మామిడి పండు ముక్కలు ఘుమఘుమ లాడుతున్నవి. ఇంత బీదతనంలో ఉన్న తల్లి ఈ సామానంతా నెలా సేకరించిందా అని ఆలోచించాడు. భోజనం చేశాడు. భోజనం చేసినంత సేపూ తల్లిదగ్గర కూర్చొని లోకాభిరామాయణం చెప్పింది. కొసరి కొసరి వస్తువులు వడ్డించింది. తృప్తిగా భోజనం చేశాడు. లేచి చేతులు కడుక్కొని మంచం మీదకు చేరాడు.


దర్జీఆమె, నసీబన్ ఇద్దరూ బయటకు వెళ్ళి కొంత సేపట్లో తిరిగి వచ్చారు.

తల్లి హమీద్ దగ్గరకు వచ్చింది. “నాయనా ! ఒక్క మాట చెపుతాను. వింటావా ?" అని అడిగింది.

హమీద్ మొఖం వెలవెల బోయింది. గుండె దడదడ లాడింది. బహుశా తల్లి తనతోగూడా ఢిల్లీ వస్తానంటుందనుకొన్నాడు. లోలోపల అనేక ఆలోచనలు తనకు వచ్చే జీతం చాలా కొద్ది, ఢిల్లీ లో ఆ కొద్ది జీతం మీద అంతమంది బ్రతకడం ఎలాగా? భార్యా, పిల్లలూ, తల్లీ యింత మందినీ తను పోషించగలడా . తల్లి వంక అలాగే చూస్తూ ఉండి పోయినాడు.


"నాయనా నీవు పట్టణంలో ఉండేవాడివి. నౌకరీదారుడివి. నేను పరాయవాళ్ళ పంచల్లో తలదాచుకొంటున్నాను. నీకు ఎలా మర్యాద చేయగలను నసీబన్ ను పంపించి ఖాన్ సాహెబుగారి ఇంట్లో ఒక గది బాగు చేయించాను. మంచం, పక్కా వేయించాను. కాని నీవు నాతోబాటే ఉంటే బాగా ఉంటుందని నా మనస్సు కోరుతున్నది. ఈ ముసలిముండతో కూర్చోమంటే నీకు మనస్సుకు ఏమి కష్టం కలుగుతుందోనని చూస్తున్నాను. భయపడుతూ ఉన్నాను. నాయనా ! నా కోరిక పూర్తిచేస్తావా, అని భయపడుతూ అడిగింది.


"అదుగో, మంచం కూడా తెప్పించాను" అని ఎదుటపరచి ఉన్న మంచం చూపించింది.

తల్లి మాటలకు హమీద్ గుండె కరిగిపోయింది. నోటనుండి మాట రాలేదు. "అమ్మా! నీ దగ్గర ఉండకపోతే నేను యింకెక్కడకు పోతాను” అన్నాడు.


తల్లి ఆనందసంభరితురాలైంది. హమీద్ శిరస్సును ఆఘ్రాణించింది. నసీబన్ ను పిలిచి మంచం తన గదిలో వేయించింది. ఒకమూట విప్పి తెల్ల దుప్పటి బయటకు తీసింది. ఆ దుప్పటిమీద రకరకాల లతలు కుట్టి ఉన్నవి. ఆ మూటలోనుంచి రెండు దిండ్లు బయటకు తీసింది. తెల్లటి గలీబులు తొడిగి ఉన్నవి. చిన్న సీసాలోనుంచి అత్తరు తీసి గలీబులకు అత్తరు రాసింది. మంచం కింద ఒక పీక్ దానును పెట్టించింది. ఢిల్లీ పూల నల్ల చెప్పుల జోడు - కొత్తది - మంచం కాళ్ళ వైపున పెట్టి "నాయనా ! అలసిపోయినావు. ఈ మంచం మీద పడుకొని నిద్రబొమ్మన్నది.

హమీద్ ఈ తమాషా అంతా చూస్తున్నాడు. యా అల్లాహ్ ఈ సామనంతా ఎలా వచ్చింది . చివరకు తల్లిని అడిగాడు.


రషీదాబాద్ గూడా చిన్న బస్తీ లాంటి గ్రామమే. అన్నీ ఈ ఊళ్లోనే దొరికినవని జవాబు చెప్పింది.


"అమ్మా! భోజనం సంగతి సరే. ఈ చెప్పులు, ఈ పీక్ దాను. ఈ దుప్పటి ఇవన్నీ ఎలా కొన్నావు ?"

తల్లి వేడివేడి కన్నీళ్లు కార్చింది. మాతృదేవతా వాత్సల్యం అనుపమానం "ఏడు సంవత్సరాలు ఎదురు చూశాను. ఇల్లు అమ్మాను. పొట్ట బిగించుకొని నీ కోసం, నీ పిల్లల కోసం ఈ వస్తువుల్ని సేకరించాను. నీ కోసం ఎదురు చూసిచూసి కళ్ళు కాయలు గాచినవి. నాయనా ! ఈ వస్తువుల్ని సేకరించడానికి ఏడు సంవత్సరాలు వల్లింది. సల్మాను చూడనే లేదు " అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. .


తల్లి మాటలను విని శాంతిదేవత ఆ చిన్నగదినిండా తన రెక్క లను విప్పింది. ఇక ఎవరూ ఏమి మాట్లాడలేదు.


తెల్లవారిపోతుంది హమీద్ తల్లి ఇక కళ్లు తెరవలేదు.


***********