సామాన్యుడి వ్యాఖ్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సామాన్యుడి వ్యాఖ్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, సెప్టెంబర్ 2025, బుధవారం

అంతన్నారు ఇంతన్నారోయ్ NRI ల అమ్మనాన్నలూ..

 


అంతన్నారు ఇంతన్నారోయ్ NRI ల అమ్మనాన్నలూ.. 


అమెరికాలో అంత ఇల్లు వుండటం గొప్పా!? ఇంతిల్లు వుండటం చులకనా !?  


అమెరికా గొప్పదే! కానీ అదేమీ భూతల స్వర్గం కాదు కుబేరుని ధనాగారం కాదు. ముందుగా ఆ దేశాన్ని గొప్పగా ఊహించుకోవడం పోల్చుకోవడం మానేయాలి. మన జన్మభూమి ఎంత అందమైన దేశం అని పాడుకోకపోయినా ఎవరి మాతృదేశాన్ని ఎవరి మాతృభాషను వారు ప్రేమించుకోవాలి గౌరవించుకోవాలి కదా! 


ఈ మధ్య కొంతమంది తెలుగు వారు అక్కడికి విదేశీ యాత్రకు లేదా పిల్లల దగ్గర కు వెళ్ళి ఇబ్బడిముబ్బడిగా 

వీడియోలు తీసి ఇక్కడ పెడుతున్నారు. సంతోషమే! కానీ అక్కడ H1B వీసా పై ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళందరి జీవితాలు అంత గొప్పగా ఏమీ వుండవు. మన దేశంలో లక్ష రూపాయలు జీతం తెచ్చుకునే వాళ్ళ జీవితం లావే వుంటుంది. . భార్యభర్తలిద్దరూ   ఉద్యోగాలు చేస్తే తప్ప ఇప్పటి మార్కెట్ ని బట్టీ సింగిల్ హోమ్ కొనలేరు. అసలు సొంత ఇల్లు లేకుండా అపార్ట్మెంట్ లో వుండేవాళ్ళు 60 శాతం మంది వుంటారన్న సంగతి మనకు తెలియదు.. 


ఇతర దేశాల నుండి పొట్ట చేతబట్టుకుని వలస పక్షుల్లా వెళ్ళిన వారు రెండు సూట్కేస్ లు చేతబట్టుకుని ఎన్నెన్నో కలలతో వెళతారు. వాళ్ళ వెనకాల లక్షల కొద్దీ ఎడ్యుకేషన్ లోను వుంటుంది. ఏదో కొంతమంది సంపన్న కుటుంబాల  పిల్లలు స్టేటస్ కోసం లేదా సరదాగానూ వెళుతుంటారు. ఒక్క అమెరికా నే కాదు ఏ ఇతరదేశం వెళ్లిన వాళ్ళైనా అక్కడ ఉద్యోగ అవకాశాలను బట్టీ తమకు లభించే జీతం రాళ్ళను బట్టీ అనేక కారణాల బట్టి అక్కడే స్థిర పడటానికి నిర్ణయించుకుంటారు. మన దేశంతో పోల్చుకుంటే అమెరికా ఆస్ట్రేలియా బ్రిటన్ జర్మనీ మొదలైన దేశాల్లో  పరిశుభ్రతకు పెద్దపీట వేస్తారు.పరిసరాల వాతావరణం బాగుంటుంది. వ్యవస్థలన్నీ బాగా పనిచేస్తాయి. విద్య వైద్యం కూడా ఉచితంగా బాగుంటుంది. అందుకే మనవాళ్ళు అత్తెసరు ఆదాయంతోనైనా అక్కడే

స్థిరపడాలనుకుంటారు. 


ఇకపోతే ముందుగా చెప్పుకున్నట్టు అమెరికాలో అందరికీ పెద్ద పెద్ద ఇళ్ళు వుండవు.ఎకరంలోనో అర ఎకరంలోనో నలభై సెంట్లు ముప్ఫై సెంట్లు లో ఇల్లు వుండదు. అలా వుండాలి అంటే వారు ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం వెళ్లిన వారు అయి వుంటారు. ఇప్పటి వాళ్ళకు అంత పెద్ద ఇళ్ళు వున్నాయంటే వాళ్ళు తాము వుండే సిటీకి చాలా దూరంగా వెళ్ళి వుంటారు . ఇప్పటి అప్పటి పరిస్థితుల్లో అయినా నగరం మధ్య అంత పెద్ద ఇల్లు పెద్ద ఖాళీ స్థలం రావడం శక్తి కి మించిన పని. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ కనీసం ఒకరి పూర్తి జీతాన్ని EMI గా చెల్లించాలి. వాళ్ళ జీవితాన్ని 15 నుండి ముఫై ఏళ్ళపాటు బ్యాంకు కి తాకట్టు పెట్టుకోవాలి. పైగా ఆ ఇళ్ళు కమ్యూనిటీ లో వున్నట్లైతే ఇంకా నెలవారీ చెల్లింపులు ఎక్కువగానే వుంటాయి. 


మానవుడికి ఇల్లు మూడు ఫ్రాధమిక హక్కు  తర్వాత వుండే ప్రాధమిక అవసరం కాబట్టి.. సిటీలో వుండాలంటే అద్దె కూడా ఎక్కువే చెల్లించాలి కాబట్టి  అక్కడ వున్నవారు ముందుగా ఇంటి వైపు దృష్టిపెట్టాలి. పెడతారు  కూడా! ఆ క్రమంలో సిటీకి దూరంగా నైనా వాళ్ళ కలలకు అనుగుణంగా ఆర్థిక స్థోమతకి అనుగుణంగా ఇల్లు కొనుక్కొంటారు. ఆ ఇల్లు ఉద్యోగం చేసే చోటుకు గంట గంటన్నర రెండు గంటలు ప్రయాణదూరంలో వుంటుంది. పొద్దున్నే లేచి రాత్రి వండి ప్రిడ్జ్ లో పెట్టిన వాటిని లంచ్ బాక్స్ లో సర్దుకుని ఓ అరగంటపాటు అయినా డౌన్ టవున్ ట్రాఫిక్ లో పడి వెళ్ళి మళ్ళీ అదే మాదిరి ప్రయాణం చేస్తూ ఇంటికి చేరుకోవాలి. ఇవన్నీ తల్లిదండ్రులు చెప్పుకునే  గొప్పలు వినే వాళ్ళ కంటికి కనబడని సత్యాలు. కమ్యూనిటిలో కాకుండా బయట స్థలం కొనుక్కుని ఇల్లు కట్టించుకునే వారు వుంటారు. అసలు ఇంటికి ఫెన్సింగ్ లేనివాళ్ళు వుంటారు. అక్కడ ఫెన్సింగ్ వేయించుకోవడం కూడా ఖర్చు తో కూడిన పని. మా అబ్బాయి ఇల్లు ఇలా పెద్ద గా వుంది మా అమ్మాయి ఇల్లు ఇలా వుంది అని గొప్పగా చెప్పుకుంటూ చూపించుకుంటూ వుండేవారు ఆ ఇల్లు కొనడం వెనుక వున్న కష్టాలు మాత్రం చెప్పరు. ఏం? మన దేశంలో మాత్రం సిటీలకు దూరంగా ఒక ఎకరం పొలం కొని ఓ రెండు అంతస్తుల ఇల్లు కట్టుకుని అక్కడి ప్రశాంత వాతావరణం లో జీవిస్తూ కోళ్ళు  కుక్కలు కుందేళ్లు పెంచుకుంటూ కూరగాయలు పండించుకుంటూ .. ప్రశాంతంగా జీవించకూడదా? అక్కడ లాగే రెండు గంటలు పాటు కారులో ప్రయాణించి వచ్చి కూడా ఉద్యోగం చేసుకోవచ్చు తిరిగి ఇంటికి పోవచ్చు. . మనదేశంలోనూ బ్యాంకులు సొంతింటి కోసం అప్పు  కూడా ఇస్తారు. మనకి వచ్చే ఆదాయ వనరులను బట్టే కదా బ్యాంకులు లోను ఇచ్చేది. 


నేను చెప్పేది ఏమిటంటే.. వాళ్ళు యూట్యూబ్ లో చూపించే వాటిని చూసి మనం కూడా అలా వుండాలి అని యువత భ్రమ పడవద్దు. అందులో ఇప్పుడు అమెరికా వెళ్ళడం మంచి నిర్ణయం కాదు. తీసుకున్న ఇంటికి లోన్ ఎలా కట్టాలో ముందు ముందు  ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి రావచ్చు. HIB పై జాబ్ చేసేవాళ్ళకు కూడా ఎప్పుడైనా ఉద్యోగం పోవచ్చు రావచ్చు. ఇల్లు EMI కారు EMI  ప్యామిలీ మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వన్నీ పోతే వాళ్ళ జీతాల్లో మిగిలేది చాలా స్వల్పం. రెండేళ్ళ నుండి గ్రాసరీ రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి అంట.  దూరపు కొండలు నునుపు అంటారు కదా! ఆ బాపతు ఇప్పటి అమెరికా లండన్ బతుకులు. . అమెరికాలో పెద్ద ఇల్లు SUV కారు టెస్లా కారు గురించి కలలు కంటూ అతిగా ఆలోచించకండి.ఉద్యోగ భద్రత లేని దేశాలకు నిరుద్యోగం ఎక్కువగా ఉన్న దేశాలకు ఆర్థిక వ్యవస్థ బలంగా లేని దేశాలకు వెళ్ళే ప్రయత్నం ఎందుకు? ఇక్కడే ఉద్యోగ ప్రయత్నాలు చేయమని ఏడేళ్ళ క్రితమే కొంతమందికి సూచిస్తే పైకి ఏమీ అనకపోయినా చాటుగా తిట్టి పోశారు.  తర్వాత వాళ్ళ అనుభవం లోకి వస్తే కానీ విషయం బోధ పడలేదు. కలలు కనడం తప్పు కాదు ప్రయత్నం చేయడం తప్పు కాదు. ఏటికి ఎదురీది కొంతమంది మాత్రమే వొడ్డు చేరగలరు. మిగతావారు? నిండా అప్పుల్లో మునిగి పోతారు.  ఈ దేశంలో వున్న తల్లిదండ్రులు కూడా పరాయి దేశంలో వున్న తోటివారి పిల్లల్ని చూసి బంధువుల పిల్లలను చూసి .. వొత్తిడి పెట్టి తమ పిల్లల్ని పంపించిన వాళ్ళు వున్నారు. అక్కడ ఆ దేశంలో ఈ పిల్లలు నిలదొక్కుకోవడానికి…  ఎన్నో నియమ నిబంధనలు మధ్య వ్యతిరేక పరిస్థితుల మధ్య వొంటరి యుద్ధం చేస్తూ.. నెట్టుకు వచ్చారో!  ఎన్ని కష్టాలు అనుభవించారో!  అవి కూడా చెప్పాలి కదా! . మనకు వున్నవి గొప్ప గా ప్రదర్శించాలి అనే ఉత్సాహం తో మిగతా కష్టనష్టాలు గురించి ఎంత మాత్రం చెప్పరు కొందరు . ఇక్కడ ఆర్థికంగా బాగా వున్నవారు పిల్లలకు తమ ఆస్తులు అమ్మి బదిలీ చేస్తారు. అక్కడ  వ్యాపారాలు చేసేవారు కూడా వున్నారు. వారికి సాధ్యమైంది కాబట్టి అందరికీ  అలా సాధ్యం కాదు. అమెరికాలో టౌన్ హోమ్ ల్లో అద్దె కు వుండేవారు కోకొల్లలు. అవికూడా చూపించాలి. విజ్ఞత లేకుండా మనకున్న వాట్టిని ఎగ్జిబిషన్ పెట్టకూడదు. ఇతరులకు ఈర్ష్య కలిగించకూడదు. అర్థంపర్థం లేని గొప్పలు ప్రదర్శించకూడదు. ఇక అక్కడ వుండే వాళ్ళు మన దేశానికి వచ్చి భారీ ఎత్తున ఫంక్షన్ చేసి నగలు కొనుగోలు చేసి డిజైనర్ దుస్తులు ధరించి ఆర్భాటం ప్రదర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. మనం చూస్తున్న నాణానికి రెండో వైపు కూడా వుంది. వాళ్ళు ప్రదర్శించిన ఆడంబరాలు వెనుక వేల డాలర్ల క్రెడిట్ కార్డ్ వుంటుంది అని మనకు తెలియదు కదా! ముఖ్యంగా మధ్యతరగతి వారు విదేశాల్లో వున్న మన బంధువులతోనో  స్నేహితులతోనో పోల్చుకోవద్దు. వాళ్ళ అమ్మనాన్నలు చెప్పే డంబాసారాలు కూడా తలకెక్కించుకోవద్దు. అసలు వారితో పోల్చుకుని వొత్తిడి కి గురి కావద్దు. మన దేశంలో మనకు చాలా స్వాతంత్ర్యం వుంది. మనకి వుండటానికి ఇల్లు లేకపోతే కనీసం ఆ నీడ నివ్వకపోవచ్చు ప్రభుత్వం. కానీ మనం నిలబడి వున్న ఈ నేల మనం హాయిగా వుండగల్గే స్వేచ్ఛ ఇచ్చింది. చిన్నపాటి ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లో అనాలోచితంగా ప్రవర్తించినా కూడా కఠినంగా వ్యవహరించడం లేదు. మెడపట్టి బయటకు గెంటేయడం లేదు. ఇతర దేశాల జీవనశైలి ప్రమాణాలు మనకు లేకపోవచ్చు ఆకర్షణీయమైన జీతం లేకపోవచ్చు. కానీ స్వేచ్ఛ వుంది. అభద్రత లేదు. ఇతర దేశాల్లో వున్నప్పుడు వారి నియమ నిబంధనలకు తలవొగ్గి ఎలా వుంటామో.. ఇక్కడ కూడా అలా ఉండగలిగితే అది తప్పు కాదు చేతకాని తనం కాదు. 


మై డియర్ ఫ్రెండ్స్..ఆలోచించండి . NRIల అమ్మలు నాన్నలు అమెరికాలో వున్న మీ అబ్బాయి అమ్మాయి ల  ఇళ్ళు కార్లు గొప్పతనం YouTube లో ప్రదర్శించకండి. మీకు వ్యూస్ రావాలనుకుంటే అమెరికా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి జీవనాన్ని వారి వృత్తులను పంటల్ని వారి సంస్కృతి ని విహార ప్రదేశాలను  గొప్ప గొప్ప వ్యక్తులను అమెరికా  చరిత్రను పురాతన సంస్కృతి ని పరిచయం చేయండి. అమెరికన్ సంస్కృతి ని నేను చాలా గౌరవిస్తాను.ప్రేమిస్తాను. అలా అని మన దేశాన్ని నేను తూలనాడను. ఇదంతా నేను అక్కసుతో లేదా ఈర్ష్య మాత్రమే మాట్లాడుతున్నాను అని అనుకోవద్దు. మా అబ్బాయి 15 సంవత్సరాలు నుండి అక్కడే ఉన్నాడు.12 సంవత్సరాల నుండి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో..  వుంది. మాకు అక్కడ ఇల్లు వాకిలి కార్లు అన్నీ వున్నాయి. అక్కడికి వెళ్ళి నప్పుడల్లా చాలా ఆనందంగా ఉంటాను. అప్పుడప్పుడు అక్కడికి అతిథిగా వెళ్ళి వస్తూ వుంటాను.ఆ దేశపు నియమ నిబంధనలకు లోబడి ఉంటాను.  తిరిగి వస్తాను. అక్కడ వుంటున్న వారిని నిశితంగా పరిశీలిస్తాను.  రెండు కథలు కూడా రాసాను. “ ఏనుగు అంబారీ”, “చెరగని గీత” అనే కథలు అవి. వీలైతే  ఆసక్తి వుంటే ఆ కథలు వినండీ 


ఒకటి మాత్రం చెబుతాను. 


ఈ కంటెంట్ తో ఎవరిని కించపరచడం నా ఉద్దేశం కాదు. విషయాన్ని సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించాను. మాది ఇలా.. నేను ఇలా..  అని ప్రదర్శించడం ఏదైతే ఉందో అది అహం అవుతుంది.ఆడంబరం అవుతుంది. అవి లేని వారికి ఈర్ష్య కల్గించి మన మనుగడ కు ముప్పు కలిగిస్తుంది.నా లైఫ్ స్టైల్ ఇలా వుంటుంది అని ప్రదర్శించడం, నా సంపద ఇదిగో అని ప్రదర్శించడం వెనుక ఒక రకమైన  అహం వుంటుంది. అది వేరొకరికి కంటగింపు అవుతుంది. 

నరుడి కంటికి నాపరాయి బద్దలవుతుందిఅంటారు కదా!  దిష్టి కూడా తగులుతుంది.  మన భారతీయులు నివసించే ప్రాంతాల్లో  బంగారం కోసం దొంగతనాలు జరుగుతున్నాయి అంట. మన వాళ్ళ నే టార్గెట్ చేస్తున్నారు. 


 ఒకటి మాత్రం నిజం. మన పిల్లలు అక్కడ కష్టపడకుండా టాక్స్ చెల్లించకుండా ఎగవేత వేసి ఆర్ధికంగా అభివృద్ధి చెందడం లేదు. నిజం చెప్పాలంటే అక్కడ మన అభివృద్ధి పేకమేడల్లాంటిది. అది ఎప్పుడైనా కూలిపోవచ్చు. అమెరికాలో ఇప్పుడు అదే జరుగుతోంది. అర్ధమైన వారికి అర్ధమైనంత. ఉన్నవాడిని చూసి లేనివాడు నూన్యతా భావానికి గురవుతూ ఉంటారు. అది మానవ స్వభావం. పాలకులు మారినప్పుడల్లా వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు పాలసీలు మారుతూ ఉంటాయి. మన వారి జీవితాల్లో  కూడా పెను మార్పులు వస్తాయి. కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా. 


అమెరికా ఆస్ట్రేలియా బ్రిటన్ జర్మనీ గొప్పలు చెప్పుకోవడం మానేద్దాం. Thousand K నుండి Two thousand K ల మధ్య కొన్న ఇళ్లు సేల్ కి పెట్టి వున్నాయట. జాబ్ లేకపోతే వచ్చే ఇక్కట్లు మాములుగా వుండవు మరి. మనదేశం ఇంకో ఇరవై ముఫ్పై ఏళ్లలో వృద్ద ప్రజలు వున్న  దేశం అవుతుంది అంట. యువతంతా వలసలు పోయి అక్కడెక్కడో ఇబ్బంది పడకుండా ఇక్కడే వుంటే మంచిది. మన దేశం అనేక రంగాల్లో నిపుణుల కొరతతో కొట్టుమిట్టాడుతుంది. ఆ విషయం పై దృష్టి పెడితే మంచిది. ముఖ్యంగా రైతు కరువు రాబోతుంది అంట. రైతు లేని దేశాన్ని ఊహించి చూడండి. 


చివరగా ఒక మాట. 


వలస పక్షులు తమ కష్టాలను లేదా సౌఖ్యాలను ఏ మాత్రం ప్రదర్శించుకోవు. వాటికి Yuotube తెలియదు.అమ్మలూ నాన్నలూ మీరు గొప్పలు ప్రదర్శిండం మానండి ప్లీజ్! 



2, సెప్టెంబర్ 2024, సోమవారం

విజయవాడ వరద కు కారణం

 


ఎక్కడో ఖమ్మం కృష్ణా జిల్లాల సరిహద్దులలో కొండప్రాంతలలో పుట్టిన బుడమేరు..

A.కొండూరు,మైలవరం,జి.కొండూరు మండలాల గుండా విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలోకి ప్రవహిస్తుంది..

బుడమేరుకి రెడ్డిగూడెం నుండి కోతుల వాగు,జి.కొండూరు మండల గంగినేని నుండి పులివాగు,(మా ఇంటి పక్క నుండి వెళ్ళుతుంది)మునగపాడు(మా గ్రామం)నుండి బీమ్ వాగు,CH మాధవరం నుండి లోయవాగు,గడ్డమణుగు లోయప్రాంతం నుండి దొర్లింతలవాగు ఉపవాగులుగా ఉన్నాయి..


సరిగ్గా 20ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపుకు గురైంది. వాగులు, వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని మరోసారి రుజువైంది. 20ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్థాంతరంగా నిలిచిపోవడంతో దానికి మూల్యం నేడు చెల్లించుకుంటున్నారు. 20ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని వేగంగా విస్తరించడం, బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. ముఖ్యంగా 2019 నుండి జగన్ పాలనలో వైకాపా నాయకుల కబ్జాకి బలైంది బుడమేరు..అసలు బుడమేరుతో విజయవాడ మునకకు ముఖ్య కారణం YS రాజశేఖర్ రెడ్డి..


విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించే కృష్ణానదికంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతో దశాబ్దాలుగా దానికి ముప్పు పొంచి ఉంది.2005లో చివరి సారి బుడమేరు బెజవాడ పుట్టిముంచింది. 2005సెప్టెంబర్‌లో వచ్చిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. విజయవాడ మూడొంతులు ముంపుకు గురైంది. వరదల కారణంగా విజయవాడలో కార్పొరేషన్‌ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. దీనికి ప్రధాన కారణం బుడమేరు ఉగ్రరూపంతో ప్రవహించడమే. రికార్డు స్థాయిలో ఎగువున ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో అదంతా విజయవాడను ముంచెత్తింది.


ఖమ్మం జిల్లాలో పుట్టే బుడమేరు ఏటా సాధారణ సీజన్‌లో గరిష్టంగా 11వేల క్యూసెక్కుల ప్రవాహంతో ప్రవహిస్తుంది. 2005లో అది 70వేల క్యూసెక్కులకు చేరింది. బుడమేరు ప్రవాహాన్నినియంత్రించడానికి వెలగలేరు వద్ద ఓ రెగ్యులేటర్‌ను కూడా 70వ దశకంలో నిర్మించారు. వెలగలేరు మీదుగా ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ రూరల్‌ మీదుగా నగరంలోకి ఇది ప్రవేశిస్తోంది.


2005లో వచ్చిన వరదలకు కారణాలను వివరిస్తూ దేవినేని ఉమామహేశ్వరరావు గారు,సీపీఐ అనుబంధ రైతు సంఘం నాయకుడు కొల్లి నాగేశ్వరరావు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బుడమేరు ముంపుకు శాశ్వత పరిష్కారం చూపకపోతే కృష్ణా జిల్లాకు ఎప్పటికీ ముంపు పొంచి ఉంటుందని ఆందోళనకు దిగడంతో ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి స్వయంగా విజయవాడ వచ్చారు. విజయవాడలో ఉన్న వరద పరిస్థితి మొత్తాన్ని ఇరిగేషన్ అధికారులు సీఎంకు వివరించారు. బుడమేరు ప్రవాహాన్ని కట్టడి చేయాలంటే దానిని మళ్లించడం ఒక్కటే మార్గమని భావించారు.

పోలవరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలను కుడి కాల్వ ద్వారా కృష్ణా నదిలో కలిపే డిజైన్ అప్పటికే ఖరారైంది. బుడమేరు ప్రవాహానికి దిగువన పోలవరం కుడికాల్వ కృష్ణానదిలో గుర్తించి అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని అధికారులకు నాటి సీఎం వైఎస్సార్‌ సూచించారు. విజయవాడ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు బుడమేరు మలుపులు సరి చేసి నీటి ప్రవాహం నేరుగా కొల్లేరుకు చేరేలా చూస్తామని, వరదల్లో నీటి ప్రవాహం వెనక్కి ఎగదన్నకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


పోలవరం కుడి కాల్వ నిర్మాణంలో భాగంగా 2007-08 నాటికి బుడమేరు దిగువ ప్రవాహాన్ని కుడి కాల్వలోకి మళ్లించారు. కొత్తగా మరో కాల్వను తవ్వకుండా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్‌ నుంచి వచ్చే జలాలను కృష్ణా నదిలో కలిపే కాల్వలోకి మళ్ళించారు.ఇక్కడే సాంకేతికంగా ఓ సమస్య తలెత్తింది. పోలవరం కుడి కాల్వను గరిష్టంగా 37,500 క్యూసెక్కుల ప్రవాహం ఉండేలా డిజైన్ చేశారు.


విటిపిఎస్‌ మీదుగా ప్రవహించే కాల్వలకు అంత సామర్థ్యం లేదు. వాటిని వరద ప్రవాహానికి అనుగుణంగా పెంచాలని ప్రతిపాదనలు ఉన్నా, థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ లోపల కాల్వలను విస్తరించే పరిస్థితి లేకపోవడంతో బుడమేరు వరద ప్రవాహానికి అనుగుణంగా కాల్వల సామర్థ్యం పెరగలేదనే వాదన ఉంది. దీనికి తోడు కృష్ణానది ముఖ ద్వారంలో ఉన్న నిర్మాణాలు కూడా వరద ప్రవాహాన్ని నిరోధిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.


విటిపిఎస్‌ నుంచి కృష్ణా నదిలోకి బుడమేరు వరద నీరు చేరాలంటే కృష్ణానదిలో నీటి మట్టం తగిన స్థాయిలోఉండాలి. కృష్ణా నదిలో ఎగువ నుంచి వరద కొనసాగే సమయంలో బుడమేరు నుంచి వచ్చే వరద ప్రవాహం నదిలోకి చేరదు. అదే సమయంలో పోలవరం కుడి కాల్వ నుంచి నీటి విడుదల కొనసాగితే వరద ప్రవాహం దిగువన విజయవాడ వైపే వెళ్లాల్సి ఉంటుంది.


20ఏళ్ల నిర్లక్ష్యానికి మూల్యం....

20ఏళ్ల క్రితం వచ్చిన వరదల్లో విజయవాడ నగరంలో న్యూ రాజరాజేశ్వరి పేట, సింగ్‌నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. రోజుల తరబడి ప్రజలు వర్షపు నీటిలో చిక్కుకుపోయారు. బుడమేరుకు వెలగలేరు రెగ్యులేటర్ దిగువన మళ్లింపు చేపట్టగానే విజయవాడకు వరద ముంపు తప్పిపోయింది.


2008 నుంచి విజయవాడ రూరల్‌ మండలంలో వేగంగా నిర్మాణాలు విస్తరించాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏకంగా నగరంలో మరో కొత్త ప్రాంతాలు ఏర్పడ్డాయి. విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం పరిధిలో న్యూ రాజరాజేశ్వరిపేట ఎక్స్‌టెన్షన్‌, నందమూరి నగర్ వంటి ప్రాంతాలు విస్తరించాయి. అంతకు ముందు అదంతా బుడమేరు పరివాహక ప్రాంతమనే సంగతిని పూర్తిగా విస్మరించారు.


2005లో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా అటకెక్కిన సంగతి కూడా ప్రజా ప్రతినిధులు విస్మరించారు. బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను 2008 నుంచి పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ కరకట్ట ఇప్పుడు ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. సుందరీకరణ పేరుతో నగరానికి రక్షణగా ఏర్పాటు చేసిన వ్యవస్థల్ని రాజకీయ నాయకులు యథేచ్ఛగా ధ్వంసం చేశారు. కాలనీలకు కాలనీలను విస్తరించి నివాస ప్రాంతాలను విస్తరించడంలో 2009 నుంచి విజయవాడలో ఎన్నికైన ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్,వైసీపీలకు ఇందులో ఎక్కువ భాగస్వామ్యం ఉంది.

బుడమేరు ఉగ్రరూపం దాల్చినపుడు నీటి ప్రవాహానికి అనుగుణంగా పలు చోట్ల మలుపులు ఏర్పడ్డాయి. రెండు, మూడు దశాబ్దాల క్రితం నాలుగైదేళ్ల క్రితం బుడమేరుకు వరదలు వచ్చినా పంట పొలాలు మాత్రమే నీట మునిగేవి. బుడమేరు ప్రవాహంలో ఉన్న మలుపులు నీటి సహజ ప్రవాహ వేగాన్ని తగ్గించి ఊళ్లను ముంచెత్తుతున్నాయని, విజయవాడ, నిడమానూరు ప్రాంతాల్లో ఉన్న “యూ ” టర్నింగ్‌లను సవరించాలని 20ఏళ్ల క్రితమే ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించింది.


బుడమేరును ఆక్రమణల నుంచి విడిపించి దాని గరిష్ట సామర్థ్యానికి అనుగుణంగా విస్తరించాలని ప్రతిపాదించారు. విజయవాడ మార్కు రాజకీయం ఆ పనుల్ని అడ్డుకుంది. ఇళ్లను తొలగిస్తే ఊరుకోమని హెచ్చరించడంతో ప్రభుత్వం కూడా వదిలేసింది. ఇదే అదనుగా బుడమేరును యథేచ్ఛగా ఆక్రమించేశారు. ఇక విటిపిఎస్‌ నుంచి ప్రవహించే వరద ప్రవాహ మార్గంలో ఉన్న నిర్మాణాలు కూడా విజయవాడ ముంపుకు కారణమవుతున్నాయి. వాటిని సరిచేసే సంకల్పం ఏ పార్టీకి లేకపోవడమే ప్రస్తుత పరిస్థితి కారణమైంది.


ప్రపంచంలోనే అతిపెద్ద మంచి నీటి సరస్సుకు నీటిని అందించే నీటి వనరుల్లో బుడమేరు ఒకటి, పశ్చిమగోదావరిలో తమ్మిలేరు, ఎర్రకాల్వలతో పాటు కృష్ణాలో బుడమేరు కొల్లేరుకు ప్రధాన నీటి వనరుగా ఉంటుంది. కొల్లేరులో వరద ప్రవాహాన్ని స్వీకరించకుండా ఆక్రమణలతో నిండిపోవడంతో వరదలు దిగువకు చేరడంలో జాప్యం జరుగుతోంది. ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ప్రవహించే వర్షపు నీరంతా బుడమేరు ద్వారా 170కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి కొల్లేరును చేరుతుంది.


విచిత్రం ఏముంటే పగలు కూడ పరదాలతో తిరిగినోడి భజన బృందం గాళ్ళు..Z + కేటగిరి 70 సంవత్సరాల నవయువకుడు ప్రజలలో తిరుగుతుంటే వెటకారం చేయడం.

సేకరణ. శీలం శేషురెడ్డి Facebook వాల్ నుండి. 


24, జనవరి 2020, శుక్రవారం

అమరావతీ... ఊపిరి పీల్చుకో..


ద్వేషం మంచి నీరుగా చేసుకుని తాగేవారికి మంచిమాటలు తలకెక్కవు . 
 కమ్మ రాజధాని అమరావతి
కమ్మ పరిపాలన
కమ్మోళ్ల రాజ్యం మాకొద్దు  కమ్మ  లం... లు
ఏమిటిరా ..బాబూ ఈ శిక్ష మాకు ..  ఎందుకు మా మీద ఇంత ద్వేషం ? 
ఎందుకు మా మీద ఇంత శిక్ష ? 
యూ  ట్యూబ్ లో ఛానల్స్ చూడాలంటే భయం న్యూస్  చూడాలంటే చాట్ వైపు దృష్టి వెళ్లకుండా కట్టడి చేసుకోవాలి 
పేస్ బుక్ తెరవాలంటే భయం  మెసెంజర్ లో నోటిఫికేషన్ చూస్తే జంకు 
ఒక్కటి మాత్రం చెప్పగలను మీలా మాకు PayTM బ్యాచ్ లేరు మీ అంత ద్వేషం సంస్కారం ఉన్నవాళ్ళం కాదు 
కానీ ఎల్లకాలం చూస్తూ ఊరుకోము ... ఊరుకోము  ఊరుకోము అంటున్నారు ముఖ్యంగా  స్త్రీలు. అమరావతి స్త్రీలు మాత్రమే కాదు అంతర్జాతీయంగా స్త్రీలందరి గొంతులు ఈ అవమానకర వ్యాఖ్యలకు స్పందిస్తున్నారు. ఎన్నాళ్ళు ఊరుకుంటారు చెప్పండి ?  

మనుషులు మరీ కుసంస్కారులుగా మారిపోతున్నారు. చదువుకున్నవాళ్ళు మరీనూ .. ఇలాంటి స్థితి నేనెప్పుడూ చూడలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆవేదన కల్గుతుంది . ప్రజల మధ్య కుల పిచ్చిని రగిలించాడు ..మతాన్ని చాప క్రింద నీరులా ప్రవహింపజేస్తున్నాడు. ప్రాంతీయ ద్వేషాన్ని పెంపొందిస్తున్నాడు ఈ ఆర్ధిక ఉగ్రవాది. రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది . తెలంగాణా ముఖ్యమంత్రి చేతిలో రిమోట్ పెట్టి .. మన ఆంధ్రుల అభిమానాన్ని తాకట్టు పెడుతున్నాడు. భావితరాలకు  భవిష్యత్ లేకుండా వలస కూలీలుగా మిగిలిపొమ్మని యువత నుదిటి రాత లిఖిస్తున్నారు ఈ ముఖ్యమంత్రి . 
ఎవరి ప్రయోజనాల కోసం ..ఈ ముఖ్యమంత్రి .. !? 
ఇకపై రాజ "కీ " యాలు తాళం చెవితో ప్రజల మనసును తెరవగలరా ? గెలవగలరా ?
రాష్ట్రంలో ప్రస్తుతం చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు సున్నా . ఇతర రాష్ట్రాలకు ఇతరదేశాలకు చీమలబారులా దారి కడుతున్నారు . ముందు ముందు అమ్మఒడి ద్వారా బడికి వెళ్లి ఇంగ్లీష్ మీడియం ద్వారా చదువుకునే పిల్లలకు మాత్రం భవిష్యత్ లో ఉపాధికల్పన దొరుకుతుందా ? పరిశ్రమలు సాఫ్ట్ వేర్ మన రాష్ట్రాన్ని నమ్మి వచ్చే పరిస్థితి ఉందా ?
రాజధానిని మార్చితే అభివృద్ధి ఎలా వస్తుంది ? 
ఈ పిచ్చి రాజకీయాలు మాని రాష్ట్ర ప్రగతిపై దృష్టి పెడితే బాగుంటుంది. కేసులు కోర్టులు విచారణలు వీటితోనే కాలం గడిచిపోతుంది. ఏమిటీ ఈ అనిశ్చితి ? 
ధరలు చుక్కలు తాకుతున్నాయి . పన్నులు నడ్డి విరుస్తున్నాయి . 
మీ మీ ధనాపేక్షలకు పదవీ వ్యామోహాలకు ప్రజలను బాధితులను చేస్తున్నారు. 
ప్రజలకు సులభంగా పనులు జరిగే "మీ సేవ" లు లేవు. గ్రామ సచివాలయాలు నోటు ఇస్తే తప్ప పనిచేయడం లేదు. వాలెంటీర్స్ ఎందుకు పనిచేస్తున్నారో ఏమి పనిచేస్తున్నారో తెలియదు . సంక్షేమ కార్యక్రమాలు తప్ప ఇంకేమి అవసరం లేదా ? ప్రజలకు ఉచిత పధకాలు ఎర వేసి ఓట్లు దండుకునే పనులు తప్ప ..ఇంకేమి అభివృద్ధి అవసరంలేదా ? 
ఏం ఖర్మ రా ..బాబూ .. పని లేని(చేయని ) ప్రభుత్వాలకు పనిలేని సోమరి ప్రజలు.   
ఎట్టకేలకు అమరావతిని ధ్వంసం  చేయాలనుకునేవారికి అడ్డుకట్ట పడింది. కానీ వారి పుర్రెలలో పుట్టిన ఆలోచన మరిన్నిసరికొత్త  వికృత ఆలోచనలకు తెరతీస్తోంది. తప్పులపై తప్పులు చేస్తూ వారినివారు సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు మంత్రులు. సామాన్యుడికి కూడా వారేమిటో తెలిసిపోయి ..ఇలాంటి వారినా తాము యెన్నుకున్నదని చెప్పులతో కొట్టుకుంటున్నారు. 
మూడు రాజధానుల ప్రతిపాదన, సి ఆర్ డి ఏ రద్దు బిల్లులు రెండూ మండలి పరిశీలనకు వెళ్లి అక్కడ సెలెక్ట్ కమిటీకి వెళ్లాలని సిఫారసు చేయడం వల్ల మూడు రాజధానుల ప్రసక్తికి తెర దించినట్లే అనుకోకపోయినా  చట్టపరంగా మూడురాజధానులు విషయం సాధ్యం కాదని రాజ్యాంగ నిపుణులు చెప్పడంవల్ల ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారనే చెప్పవచ్చు. 
ముఖ్యంగా అమరావతి భూములిచ్చిన రైతులు , విదేశాల్లో ఉన్న అమరావతి ప్రజలు   అమరావతి చుట్టూ ఇన్వెస్ట్ చేసిన మధ్యతరగతి ప్రజలు  ...ఊపిరి   పీల్చుకున్నారు. విదేశాలలో ఉన్న వారు క్రెడిట్ కార్డులు తీసుకుని దాచుకున్న ప్రతి పైసాను తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధిలో భాగస్వామ్యమైతే వారూ  లబ్ది పొందవచ్చు అనుకుని పెట్టుబడి పెట్టారు . ఇప్పుడిక్కడ  పరిస్థితులు చూసి వేదన చెందుతూ గుబులు గుబులుగా చూస్తున్నారు . వారికి చెప్పేది ఒకటే ! మీ మీ నమ్మకాలు నిలబడతాయి . నిలబెట్టబడతాయి. గ్రీన్ కార్డు ల కోసం కళ్ళు కాయలు కాచేదాకా ఎదురు చూడకుండా ..మీరు అమరావతికి వచ్చే రోజు వస్తుంది. ఏముంది అక్కడ అని నిసృహ వద్దు . ఓపికగా ఎదురుచూసినవారిదే నూరేళ్ళ జీవితం .. సహనమే మన ధర్మం . 
అమరావతీ... ఊపిరి పీల్చుకో...
ప్రజలు నీ నీడలో చల్లగా వుండాలని ఆకాంక్షించారు.
దేవుడు చూస్తున్నాడు.. నిబ్బరంగా నమ్మకంగా వేచిచూడటమే!
ధర్మ ఏవహతో హంతి
ధర్మో రక్షతి రక్షితః
తస్మాద్ధర్మోన హత వ్యో
మానో ధర్మాహతో వధీత - వాల్మీకి.

జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ !! జయహో ..ప్రజాస్వామ్యం !! 




29, డిసెంబర్ 2019, ఆదివారం

అమరావతి విధ్వంసం తగదు

అమరావతి ఇకపై  రాజధాని గా ఉండబోదు అన్న ప్రకటన వల్ల  లేదా మార్పు వల్ల  నాకు వ్యక్తిగతంగా నష్టం లేదు. లాభం లేదు.


సామాజికపరంగా చూస్తే  ఒక ఐదేళ్లపాటు ఈ ప్రాంతంలో జరిగిన ట్రేడింగ్ ఏదైనా ఉందంటే అది అమరావతిని కేంద్రంగా  చేసుకుని పెరిగినదే. ఈ రాజధాని పరిధిలో అందరిని అభివృద్ధి వైపు ఊరించిన అంశం ఇది. అనేకమంది  పెట్టుబడులు పెట్టారు. ఎక్కడెక్కడ వున్నవాళ్ళందరూ  ఇల్లు కట్టుకోవాలని పిల్లలు చదువులు ఇక్కడే కొనసాగాలని ఇక్కడే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు . అలాంటివారికి ఈ నిర్ణయం ఆశానిఘాతం. పల్లెల నుండి ఇతర పట్టణాల నుండి వచ్చి మా ఊరులో ఎంతోమంది ఇళ్ళు కొనుక్కున్నారు. రాజధాని రావడం మూలంగా మా వూరు ఈ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందటం కాదు. ఇది అప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం.

కానీ అమరావతి ప్రాంతంలో అక్కడ జరిగిన  జీవన విధ్వంసం    ఏదైతే ఉందొ ..ముఖ్యంగా వ్యవసాయ విధ్వంసం అది మళ్ళీ పునరుద్దించలేనిది. భూములిచ్చిన రైతుల వితరణ దాని వెనుక వారి అభివృద్ధి ఆకాంక్ష ఆ ప్రాంతం చుట్టూ కేంద్రీకృతమైన అభివృద్ధి ఆనవాలు అవన్నీ యిపుడు  నాశనమైపోతాయి. 


ఆనాడు ప్రతిపక్షంలో వుండి  ఒప్పుకున్న నాయకుడు ఈ రోజు కుంటిసాకులు చెప్పి మార్చాలనుకోవడం బాగోలేదు. వారికి అసలు దీనిపై అవగాహన శూన్యం. వ్యతిరేక భావనలు మినహాయించి ప్రజల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదు. అన్ని వేల ఎకరాల పొలం రూపు రేఖలు మారిపోయాక ఎన్నో కుటుంబాల ఆశలు ధ్వంసం అవుతుంటే వారు రోడ్డున పడుతుంటే అలాంటి నిర్ణయాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేనూ నా ప్రాంతమూ ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలు భావోద్వేగాలు త్యాగాలు  అక్కడి అభివృద్ధి అంతా సామాజిక అభివృద్ధి అనుకుంటానండీ. అవి పరిణామక్రమంలో జరుగుతున్న జరిగిన మార్పులు. వాటిని ఇప్పుడు మార్చాలనుకోకూడదు. అందరూ ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు వారి స్వార్ధం  కోసం అమరావతిని మార్చకూడదు. 


ముఖ్యంగా .. నేను చెప్పేది ఏమిటంటే ..ఎంతోమంది విదేశంలో నివసిస్తున్నవారు సాఫ్ట్ వేర్  ఉద్యోగస్తులు ఇక్కడ అభివృద్ధి కోసం కలలు కంటున్నారు. మాతృదేశానికి తిరిగి  వచ్చేయడానికి. వారి ఉద్యోగాలకు అనువుగా.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని. వారి కష్టాన్ని ఇక్కడ పెట్టుబడులుగా  పెట్టారు.అదంతా యిపుడు ఏమైపోవాలండీ? ఆర్ధిక అనిశ్చితితో చాలామంది  నిత్య మానసిక క్షోభతో కూలిపోయే చెట్లల్ల వున్నారిప్పుడు. నాయకుల వ్యక్తిగత ద్వేషాలు వారి వ్యక్తిగత అభివృద్ధి ఈ ప్రాంత ప్రజలను అధోగతి పట్టించడం భావ్యమా?  ఇక్కడ చదువుకున్న పిల్లలు వలసలు వెళ్లిపోతున్నారు ఆ తల్లిదండ్రుల మానసిక క్షోభ ..వలస వెళ్లిన చోట వారికి కలుగుతున్న కష్టాలు,జీవన  సంఘర్షణ వెళ్ళినచోట  గుర్తింపు రాక వెట్టి చాకిరి చేస్తూ అయినవాళ్లకు దూరంగా వాళ్ళు పడే బాధలు వర్ణనాతీతం . ముఖ్యంగా ... "అమరావతి "  ఈ ఆంధ్ర  రాష్ట్ర ప్రజల కలల రూపం. అది వాస్తవ రూపం దాల్చకుండా ప్రజలే తింటున్న వాళ్ళ కంచంలో నీళ్లు పోసుకున్నారు. ఇంతకన్నా ఊహించిన అభివృద్ధి ఇప్పుడు మారాలన్న చోటులో రాదు. మౌలిక వసతులు అమరావతికన్నా వేరొక చోట మెరుగ్గా వుండవు. ఇది సత్యం.  ఇది కేవలం నాయకుల వ్యక్తిగత అభివృద్ధి కోసం జరుగుతున్న మార్పు. కనబడేది 29 గ్రామాలే కానీ ప్రజలు పతనమయ్యే కనబడని కోణాలు ఎన్నో .. నేను ఒక మామూలు మనిషిగా స్పందిస్తున్నా .. బహుశా నేను ఆలోచిస్తున్న తీరు కొందరికి సున్నితంగా కనబడవచ్చు. హాస్యాస్పదంగా కనిపించవచ్చు . అయ్యో ఇలా అవుతుందేమిటి అనుకునే సామాన్య మానవులు నా చుట్టూ వేలమంది . 


మళ్ళీ రాజధాని పేరిట ఇంకోచోట వేల  ఎకరాల భూములను నాశనం చేయొద్దు...ప్లీజ్ . అభివృద్ధి చేయాలంటే అనేక మార్గాలు. రాజధానులు పెట్టాల్సిన పని లేదు.



     

1, డిసెంబర్ 2019, ఆదివారం

స్త్రీ జాతికి మరణ శాసనమైన యువత అరిషడ్వర్గాల ఉచ్చు

 స్త్రీ జాతికి మరణ శాసనమైన యువత అరిషడ్వర్గాల ఉచ్చు  
ఇటీవల జరిగిన ఒక యదార్ధ సంఘటన ..కి అక్షర రూపం. మీ పిల్లలు కూడా ఇలా చేస్తున్నారేమో ..గమనించుకోండి. 

పట్టణానికి దూరంగా  నిత్యం వేలాది వాహనాలు రణగొణ ధ్వని వినబడే రహదారి నుండి రెండు పర్లాంగుల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో  ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ కాలేజ్. ఉదయం పదకొండు గంటల సమయం. తరగతులు జరుగుతున్నాయి. పనివారు హాస్టల్ గదులను శుభ్రం చేస్తున్నారు.

ఆ క్యాంపస్ కి ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్న సరిత మేడమ్ రోజూ లాగానే  కారిడార్ లో సంచరిస్తూ పరిశీలన చేస్తూ.. మధ్యలో కాసేపు నిలబడింది. ఆమె వయసు నలబైకి పైన.  అందంగా వుంటుంది. ఆ అందానికి  తగ్గట్టు మంచిగా రెడీ అవుతుంది. గౌరవభావం కల్గించేలా వస్తాధారణ చేస్తుంది. అపుడు ఆమె నిలుచున్న చోటుకు  రెండు గదుల తర్వాత  సిక్ రూమ్ వుంది.  ఆ గది నుండి బయటకు వచ్చిన ఒక స్టూడెంట్ రెండు రోజులగా జ్వరంతో బాధ పడుతూ సెలవుతీసుకుంటున్నాడు.   అతని పేరు హరీష్ .    ఆ గదికి ఎదురుగా వున్నబిల్డింగ్  గదులలో క్లాస్ లు జరుగుతున్నాయి. ఆ క్లాస్ లు అతను హాజరయ్యే క్లాస్ లే కావడంతో నిలబడి వింటున్నాడనుకుంది ఆమె.

ఆ స్తూడెంట్ ని పలకరిస్తూ  దగ్గరకు వెళ్ళింది. "ఏం ..హరీష్.. ఎలావుందీ జ్వరం తగ్గింది కదా ... క్లాస్ లకు వెళ్ళిపోతావా అని పలకరించింది. "పర్వాలేదు మేడమ్ ..ఈ రోజు ఆగి రేపటికి క్లాస్ లకి వెళ్ళిపోతాను " అన్నాడు. ఓకే ..ఇక్కడెందుకు నిలబడతావ్ ..క్లాస్ లో పిల్లలు నీ వంక చూస్తుంటారు లోపలి వెళ్లి రెస్ట్ తీసుకో .. "అని చెప్పి కొద్దీ దూరంలో వెళ్లి నిలబడి మెయిన్ గేట్ వైపు చూస్తూ పరిశీలిస్తూ నిలబడింది. కొన్ని నిమిషాల తర్వాత..లోపలి వెళ్ళకుండా ఇంకా అక్కడే నిలబడి ఉన్న హరీష్ వైపు దృష్టి సారించింది. అతను వెంటనే తన ప్యాంట్ జిప్ తెరిచి తన   జననాంగాన్ని  బయటకు తీసి అటుఇటు వూపుతూ ఆమెకు చూపించి సైగ చేసాడు. ఆమె షాక్ తింది. సిగ్గుతో తలవంచుకుని  తన గదిలోకి వెళ్ళిపోయింది .

స్టాఫ్ అందరికి ..నాన్ టీచింగ్ స్టాఫ్ మెస్ స్టాఫ్  తో సహా అందరిని  మూడు గంటలకు కాన్ఫరెన్స్ హాలుకి తప్పని సరిగా రమ్మని సర్క్యులర్ పంపింది. అందరికీ ఆశ్చర్యం. అకస్మాత్తుగా ఎందుకీ సమావేశం అని ఆలోచిస్తున్నారు. అదే సమయానికి హరీష్ తల్లిని మాత్రమే తప్పనిసరిగా రావాలని ఫోన్ చేసి చెప్పింది. ఆమె జ్వరంతో ఉన్న పిల్లాడు ఎలా వున్నాడో అనుకుని కంగారుపడుతూ కాలేజ్ కి చేరుకుంది.మూడింటికి కాన్ఫరెన్స్ హాలుకి చేరుకున్న కొందరు ఆమెకు సన్నిహితముగా వుండే వారు  .."ఎందుకు మేడమ్.. ఈ అత్యవసర సమావేశం ? ఏం జరిగిందో చెప్పండి. సస్పెన్స్ భరించలేకపోతున్నాం"  అని అడిగారు. వెయిట్ ప్లీజ్ .. అంది ఆమె.  సరిగ్గా మూడు గంటల అయిదు నిమిషాలకు ..హరీష్ ని ఆ హాలుకి పిలిపించింది. అతని తల్లి అనేక అనుమానాలతో అర్ధం కానీ భయాలతో టెన్షన్ తో లేచి నిలబడి .ఏం జరిగింది మేడమ్ ..అని అడిగింది.

ప్రిన్సిపాల్ లేచి నిలబడి హరీష్ దగ్గరికి వచ్చింది. మృదువుగా కూల్ గా "నాన్నా ..హరీష్ .. పొద్దున్న నేను కారిడార్ లో నిలబడి ఉన్నప్పుడు .. నువ్వు నాకు తీసి చూపించావు కదా .. అది తీసి ..ఇప్పుడు మీ అమ్మకు చూపించు. ఇక్కడున్న స్త్రీలందరికీ కూడా చూపించకు. కేవలం మీ అమ్మకు మాత్రమే చూపించు చాలు . నా  కన్నా మీ అమ్మ చాలా అందంగా ఉంటుంది. ఇంకా నా వయస్సు కన్నా కూడా వయసులో చాలా చిన్నది. నీకు అన్ని సమయాలలో అందుబాటులో కూడా ఉంటుంది. తీసి చూపించి సహకరించమని నాకు చేసినట్లు సైగ చేయి "  అంది అందరికి వినబడేటట్లు. అందరిలో కొందరు  ఆశ్చర్యంతో నోరు తెరిచారు. కొందరు కిసుక్కున నవ్వారు. కొందరు వాడిని చెప్పు తీసుకుని ఎడాపెడా వాయించాల్సింది మేడమ్ అన్నారు ఆవేశంగా.

హరీష్ తల్లి అవమానంతో ..కోపంతో దుఃఖంతో లేచి నిలబడింది. హరీష్ దగ్గరకు వెళ్లి చెప్పు తీసుకుని ఎడా పెడా వాయించేసి తుపుక్కున ముఖాన ఊసి .."మేడమ్ .. వీడు యిక్కడ ఒక్క క్షణం కూడా ఉండటానికి వీలులేదు.  ఇక చదువుకోవడానికి కూడా అనర్హుడు. టీసీ ఇచ్చేయండి మేడమ్" అని అడిగింది. హరీష్ చేసిన తప్పుకు మౌనంగా తలొచుకుని నిలబడే వున్నాడు. అతన్ని అక్కడే వొదిలేసి ..తల్లిని తీసుకుని ఆఫీస్ రూమ్ కి వెళ్లి .. అతన్ని ఇంటికి పంపించే పనిలో పడింది ప్రిన్సిపాల్ మేడమ్ .

ఇంత సస్పెన్స్ క్రియేట్ చేయడం ఎందుకు ? ఆ పని చేసిన వాడిని అప్పుడే చెప్పుతో కొట్టి బయటకు పంపించాల్సింది అని కొందరు, పాపం తల్లి ఏం చేస్తుంది ..వీడివికృత చేష్టలకు ఆమెను అనడం న్యాయమా అని కొందరు ..ఈ కాలం పిల్లలు ఇట్టాగే చచ్చారు వయసు వరస వావి ఏమి లేకుండా .. సినిమాలు అట్టా  నేర్పుతున్నాయి అని కొందరు. అలా తలొక రకంగా వ్యాఖ్యానించుకుంటూ వెళ్లిపోయారు.

నాకు మాత్రం ఆ ప్రిన్స్ పాల్ మేడమ్ సరిగ్గాన్నే ప్రవర్తించింది అనిపించింది. ఏ మాత్రం ఆవేశానికి లోనుకాకుండా ..కూల్ గా ప్రవర్తించి ..మంచి నిర్ణయం తీసుకుంది. ఎవరికీ తెలియకుండా తల్లిదండ్రులను  అతన్ని మాత్రమే పిలిపించి .. మీ అబ్బాయి ఇలా చేసాడు అని చెప్పడం కూడా సరైనది కాదు. మా వాడిది తప్పై పోయింది మేడమ్ . క్షమించండి వాడి తరపున మేము మీ కాళ్ళు పట్టుకుంటాం అని కాళ్ళావేళ్ళు పడేవారు తప్ప .. ఇలాంటి పరిష్కారం ఉండేది కాదు. ప్రిన్సిపాల్ విజ్ఞతతో వ్యవహరించారు.

హరీష్ ప్రవర్తన నేటి యువతలో చాలామంది  ఆలోచనా విధానానికి పరాకాష్ట.  కన్నందుకు తల్లిదండ్రులు వారిని సంస్కారవంతులుగా పెంచడంలో విఫలం అయ్యారని చెప్పవచ్చు. అసలు ఇల్లు మాత్రమే కాకుండా సమాజం యేమి  నేర్పుతుంది పిల్లలకు .. ఇది ఆలోచించుకోవాలి మనం.  .. 

15, ఫిబ్రవరి 2019, శుక్రవారం

సామాన్యుడి వ్యాఖ్య.

పొద్దునే పేపర్ చదువుతూ నేను పైకి కోపం కక్కుతున్నా కాఫీ పొగలు కక్కినట్టు. 

నీ అమ్మ కడుపు మాడ.. 
అడగండి అంటున్నావ్ ! అంటే యిస్తాననేగా  అర్ధం. ఎవరి కొండలు అరగదీద్దామని నువ్వు కొండలు పోగేయడానికి. పోయినసారి చేసిన అప్పులే తీరలేదు. ఈసారి పోటీ చెయ్యం అని చేతులెత్తేస్తుంటే .. వాళ్ళని చూసి జాలిపడి నిన్ను తిట్టాలనిపిస్తుంది. సమిధలవడం   సోపానాలుగా మారడం గొర్రెలు చేసేపని. వాటికి మేత దొరుకుతుందనే ఆశ ఉంటే తప్ప.  

నారాయణమ్మ : ఎవరినమ్మా గొర్రెలు అంటున్నావ్. గొర్రెలకు తిరిగి మేయడమీ  తెలుసు. దొడ్లో వేసి బంగారం పెట్టినా తినవు. నువ్వట్టా అంటే మా చెడ్డ కోపం. మాట ఎనక్కి తీసుకోవాలి నువ్వు అంది.  

గొర్రెలంటే తెగ కోపం వచ్చేస్తుంది మనుషులకి. రావాల్లే   ఆమాత్రం.

(ఓటుకు ఐదు వేలు అడగండి అన్నమాటకు స్పందన )

****************

దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా

గురజాడ అప్పారావు గారు ఈ గేయం వ్రాసేనాటికి ఈ దేశంలో మతవిద్వేషాలు లేవు. కానీ ఈనాడు ఆ గేయరచయితను కులదృష్టితో చూస్తున్న సూడో మేధావులను చూస్తే అసహ్యాన్ని మించి వేరే ఏదో కల్గుతుంది. కాశ్మీర్ కాశీరులదే. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. దానిని కాపాడుకోవడానికి దేశం ఎంతో ఖర్చు పెడుతుంది. ముస్లిమ్స్ ఎక్కువున్నారు కాబట్టి అది పాకిస్థాన్ కి సంబంధించింది అయిపోదు. శతాబ్దాల చరిత్ర తవ్వి చూస్తే  కాశ్మీర్ ఎవరిదో అర్ధమవుతుంది. కాశ్మీర్ ని విడగొట్టి ఇచ్చినంత మాత్రాన ఈ దేశంలో ఉగ్రవాద దాడులు జరగకుండా ఆగుతాయా అని ఎవరైనా నమ్మకంగా చెప్పగలరా ? ఈ దేశంలోకి ఎవెరెవరు ఎక్కడినుండి వచ్చినా ఇప్పుడు ఉన్నవారందరూ భారతీయులు.

ఒక ఉదాహరణ ఏమిటంటే ఒక కుటుంబంలో  ఒక వ్యక్తి దేశద్రోహం మొదలు పెడితే ఆ కుటుంబం మొత్తం విచారణ ఎదుర్కోవలసి రావడం చట్టపరమైన విచారణ. కాశ్మీర్ లో జరుగుతుంది అదే.

మనం వంటింట్లో చాకు తీసినప్పుడల్లా ఇంట్లో ఎవరినో ఒకరిని పొడవడానికి కాదని పచ్చి మిరపకాయని చీల్చి గింజలు రాల్చి  చేసుకునే వంటల్లో వేసుకోవడానికని కూడా అర్ధం చేసుకోవాలి. సాత్విక ఆహారం తినడం కూడా  మన హక్కు కాదంటారా?


(కాశ్మీర్ ప్రజలను అనుమానించి హింసిస్తుంది రాజ్యం  అందుకే ఉగ్రవాదం పెరుగుతుంది అనే మేధావుల మాటలకు )

ఒక ఉగ్రవాది దాడికి 43 మంది సైనికులు మరణం నేపథ్యంలో ..కొందరి  మాటలకు నా స్పందన

పొగలు గ్రక్కడం సామాన్యుడికి వచ్చు. ఇది సామాన్యుడి వ్యాఖ్య.