2, జనవరి 2017, సోమవారం

ఆత్మీయ స్పర్శ

2017 జనవరి సంచికలో "తెలుగు వెలుగు " లో వచ్చిన నా కథ ..
ఆత్మీయ స్పర్శ

అసలే వేసవి కాలం . ఎంత మెత్తని దిండు క్రింద అయితేనేం ? ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నా.
ఇది లేకపోతే  నాకు ఒక్క క్షణం కూడా తోచదు అనే ఈమె ఇవాళ  నన్నసలు పట్టించుకోదేమిటీ ?  కాస్త తీసి బయట పడేస్తే  బావుండును. అందరినీ  చూస్తూ నైనా కూర్చోవచ్చు . ఎవరూ పలకరించే దిక్కులేక అటూ ఇటూ తిరక్కుండా ఓ మూలపడి  కూర్చోవడం విసుగ్గా ఉంది.

రోజులాగానే ఆమె నన్ను చేతిలోకి తీసుకుని అటూ ఇటూ  తిప్పుతూ సున్నితంగా సృశిస్తూ,నవ్వు ముఖంతో చూస్తూ ఆనందంగా గట్టి గట్టిగా మాట్లాడటం లేదు.ఆమె చేతిలో నేనున్నాను కానీ ఆమె చూపంతా  గడియారపు ముళ్ళ పైనే కేంద్రీకరించుకుని చూస్తూ ఉంది . క్షణ క్షణానికి  ఆనందం  ఆమె ముంగిట్లోకి నాట్యం చేస్తుందన భావనే మధురంగా ఉన్నట్టు. కళ్ళల్లో గిర్రున తిరిగే నీరు, పెదవులపై పూచే నవ్వు , కొద్దిగా వేగంగా కొట్టుకునే గుండె.

ప్లైట్ దిగిన తర్వాత కొడుకు ఫోన్ చేసాడు.   అమ్మయ్య నాకు కాస్త కదలిక వచ్చింది. నువ్వుఎక్కడున్నావమ్మా ! అన్నాడు . నేను ఎయిర్ ఫోర్ట్ కి రావడం లేదు నాన్నా! అనగానే అవునా అమ్మా  అంటూ నిరాశ పడ్డాడు. మళ్ళీ అంతలోనే సర్దుకుని పర్వాలేదులేమ్మా ! అన్నాడు. నీ క్కాబోయే మామగారు రిసీవ్ చేసుకోవడానికి వస్తున్నారు కదా నాన్నా ! అందుకే రావడం లేదు . మీ ఇద్దరి లగేజ్ నలుగురు మనుషులకి సరిపోయే కారు కాదు కదా నాన్నా ! అందుకే వేరే కార్ ఏర్పాటు చేసాను. అని చెప్పింది.
"నా కోసం వచ్చిన కార్ డ్రైవర్. ఎక్కడమ్మా అతని  ఫోన్ నంబర్ చెప్పు"అన్నాడు. అతని నంబర్ చెప్పింది .
 డ్రైవర్  అసలే ఫాస్ట్ గా నడిపే  ఫాస్తైన కుర్రాడు పేరు  స్టాలిన్. కొంచెం ఆశ్చర్యంగా చూసింది ఆమె మొదటిసారి ఆపేరు విన్నప్పుడు. మా నాన్నకి స్టాలిన్ అంటే అభిమానమమ్మా ! అందుకే ఆ పేరు పెట్టాడు అన్నాడతను.
ఇదిగో స్టాలిన్! బాబుని జాగ్రత్తగా ఇంటికి తీసుకురావాలి. స్పీడ్ గా నడపవద్దు అని హెచ్చరించడమే కాకుండా  అన్నయ్య గారూ ! డ్రైవర్ కొంచెం స్పీడ్. మధ్య మధ్యలో కాస్త వేగం  తగ్గించుకోమని చెపుతూ ఉండండి అంటూ జాగ్రత్తలు చెప్పేసింది. నన్ను మళ్ళీ పక్కన పడేసింది.

కారు అక్కడ బయలుదేరిన దగ్గరనుండి గడియారం పైనే చూపులు. మామిడి కాయ పప్పు, బంగాళ  దుంప వేపుడు, బెండకాయ కొబ్బరి ఫ్రై, గోంగూర పచ్చడి  చేసేసింది  అవన్నీ కొడుకుకి ఇష్టమైన కూరలంట.   వచ్చి రాగానే బిడ్డకి అన్నం పెట్టుకోవాలి అంటుంది అత్త గారితో . నాకు, నా కొడుక్కి కూడా అంత శ్రద్దగా చేసి పెట్టొచ్చుగా అని గొణుక్కుంటుంది  ఆ ముసలమ్మ. మామిడి పండ్ల   రసం తీసి చల్లగా ఉండాలని ఫ్రిజ్డ్ లో పెట్టి ఉంచింది. ఎన్ని  పనులు చేసినా సమయం కదలదే ..ఇంకా పదిన్నరేనా !  అంటూ విసుక్కుంటుంది .

 శంషాబాద్ విమానాశ్రయం టూ విజయవాడ రెండువందల ఎనబై తొమ్మిది ప్లస్ ఆరు ఈజీక్వల్ట్ రెండువందల తొంబై  అయిదు. నాలుగు గంటలన్నర. ఇప్పుడు సూర్యా  పేట దాకా వచ్చి ఉంటారేమో అని లెక్కలేసుకోవడం . మధ్యలో కాస్త కునుకు తీయడం మళ్ళీ అంతలోనే ఉలికిపడి లేవడం గడియారం వైపు చూడటం. అప్పుడు నాతో  అవసరం పడిందేమో ..నన్ను చేతిలోకి తీసుకుని .."అన్నయ్య గారూ! ఎక్కడివరకూ వచ్చారు?  పిల్లలు ఏమైనా తిన్నారా ? మధ్యలో ఆగి ఏమైనా తినండి "అని పలకరింపు .  మళ్ళీ నిద్ర .

పెళ్లి పనులలో, బంధు మిత్రులని ఆహ్వానించడంలో, కొనాల్సినవి కొంటూన్నప్పుడు  మాత్రం నన్ను విపరీతంగా వాడుకుంటుంది. ఇప్పుడే ఇలా నిర్లక్ష్యం చేస్తుంది కానీ పాపం చాలా మంచామె . గుంభనం కల మనిషి .  ఒక్క భుజం మీద కాడిని మోస్తూ అలసిపోతూ, ఓపిక కూడబెట్టుకుంటూ, ఆర్ధిక విషయాలు చూసుకుంటూ, కొన్ని అసంతృప్తులని ఎదుర్కుంటూ  తన  కల నిజమయ్యే రోజు కొరకు ఎదురుచూస్తూ ఉంది.  నిజానికి ఆమె నా ద్వారానే ప్రపంచంతో మాట్లాడుతుంది తప్ప ఎవరితోనూ ముఖంలో ముఖం పెట్టి మాట్లాడి ఎరుగదు.

మళ్ళీ కాసేపటి తర్వాత  నాకు నిశ్శబ్దం నుండి విముక్తి కల్గింది.మాటలు నానుండి ప్రవహించాయి . "అన్నయ్య గారూ ఎక్కడి వరకూ వచ్చారు " అని అడిగింది. వచ్చేసామండీ. ఆటోనగర్ దగ్గర ఉన్నాం అని వినగానే గబుక్కున పక్క మీద నుండి లేఛి నన్ను చేతిలోకి తీసుకుని గది దాటి బయటకి వచ్చింది. ఆమె తండ్రి,అబ్బాయి తండ్రి, అత్తగారూ అందరూ గురకలు పెట్టి నిద్ర పోతున్న శబ్దం.  బిడ్డ వస్తున్నాడని ఒక్కరు కూడా మేలుకుని ఎదురుచూడ్డటం లేదు. ఏం మనుషులు వీళ్ళు ! అనుకుంటూ చిరాకు పడింది. ఆకలి,నిద్ర వాటి తర్వాతే ప్రేమైనా, ద్వేషమైనా ఏదైనా  ! అని గొణుక్కుంటూ తలుపులన్నీ తీసి గ్రిల్లు తాళం తీసి .. లిఫ్ట్ చప్పుడుతో అందరి నిద్ర చెడగొట్టటం ఎందుకని మూడంతస్తులు దిగిక్రిందికి వచ్చింది . వాచ్మెన్ దోమ తెరలు కట్టుకుని పడుకుని ఉన్నాడు. అతనికి కూడా నిద్రాభంగం కల్గనీయకుండా గేటు తీసుకుని రోడ్డు మీదకి వచ్చి నిలుచుంది.

ఆమె రెండు కాళ్ళు ఒక్క క్షణం కూడా కుదురుగా ఉంచుకోదు . అటూ ఇటూ తిరుగుతూ వీధి చివర మలుపులోకి  ఆత్రంగా చూస్తూనే ఉంది . ఇంకో రెండు అడుగులు కేసి మచిలీపట్నం రోడ్డు నుండి ఈ  సందులోకి ఏవైనా కారు వస్తుందేమోనని చూసింది. కారు రావడం లేదు కానీ పోలీస్ పెట్రోలింగ్ వాహనం వచ్చింది. రోడ్డుపై నిలబడ్డ ఆమెని  చూసి వాళ్ళు  స్లో అయ్యారు.  వాళ్లకి దగ్గరగా నడిచి "సర్ ! మా బాబు విదేశం నుండి వస్తున్నాడు అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నా" అంది . సరేనమ్మా అంటూ వాళ్ళు  ముందుకు కదిలారు.

వాళ్ళు మాకు పైనున్న కాలనీవైపుకి వెళ్ళారో లేదో  రెండు నిమిషాల తర్వాత ఇన్నోవా  కారు వస్తూ ఉంది . కారు అద్దాలలోనుండి అబ్బాయి ఎటువైపు సీట్ లో  కూర్చున్నాడోనని కళ్ళతో వెతుక్కుంటుంది ఆమె  . ఈ మనుషులకి బిడ్డలంటే అంత ప్రేమ కాబోల్సు. మొదటిసారిగా నాకు అమ్మ లేదని బాధ కల్గింది.  కారు  ఆగి ఆగగానే వెనుక సీట్ కారు డోర్ ని తీయడం కోసం  ఆమె హాండిల్ పై చేయి వేయగానే  అబ్బాయి లోపలి నుండి డోర్  తీసుకుని కిందికి దిగి అమ్మా! అంటూ ఎదురుగా నిలబడ్డాడు.

నిలువెత్తు కొడుకు ఆమె  ముందు అలా  నిలబడేటప్పటికి  ఉప్పెనలా దుఃఖం తన్నుకొచ్చింది.  బంగారం అంటూ అతన్ని  చుట్టేసుకుంది.  ఆమెలో  దుఖం వరదలా ప్రవహించి  బిడ్డని తడిపేసింది. ఆ బిడ్డ చేతుల మధ్య అమ్మ గువ్వలా ఇమిడిపోయింది. "ఈ  నాలుగేళ్ళు నువ్వు లేకుండా ఎట్టా గడిపానో బంగారం, కళ్ళల్లో ఒత్తులేసుకుని నా  బిడ్డని క్షేమంగా చూడు తండ్రీ అని దేవుడిని వేడుకుంటూ  రోజులు రోజులు లెక్కపెట్టుకుంటూ ఈ అమ్మ  నీ కోసమే బ్రతికింది  బంగారం" అంటూ కదిలి కదిలి పోయింది.

అమ్మా ! ఏడవబాకు. నువ్వు అలా ఏడిస్తే నేను తట్టుకోలేను. నేను వచ్చేసాగా . పిచ్చి అమ్మ .. అంటూ నవ్వాడు కన్నీళ్ళతో . అయినా ఆమె ఏడుస్తూనే ఉంది.  .ఎందుకమ్మా ఏడుస్తావ్! చూడు నేను బాగానే  ఉన్నానుగా! నువ్వే చూడు ఎలా అయిపోయావో ! అన్నాడు తల నిమురుతూ.

ఆమె  అంతకు మునుపే మనసులో ఎన్నో అనుకుంది.ప్రతి చిన్నమాటని నాలో భద్ర పరచడం ఆమెకి అలవాటు కాబట్టి  ఆ మాటలు నాకు ఎప్పుడో తెలుసు. ఆమె కథలు కవితలు వ్రాస్తుంది కదా ! నిన్ననే ఇలా వ్రాసుకుని నాలో సేవ్ చేసుకుంది కాబట్టి నాకు అదంతా కంఠతా వచ్చేసింది.
బంగారం ...
ప్రతి కలయిక ముందు వీడ్కోలు దుఃఖం అలాగే అంటి పెట్టుకుని ఉందని చెప్పనా !
గాయపడిన ప్రతిసారి పడిలేచిన కెరటమైపోయానని చెప్పనా !
 ఈ అమ్మ దుఃఖ కడలిని లోలోపల దాపెట్టి పైపైకి నిశ్చలంగా నిలబడి ఉందని చెప్పనా !
ఎందరికో సమాధానం చెప్పి అమ్మకి గొడుగై నిలుస్తావని ఎదురుచూస్తున్నానని చెప్పనా !  అనుకుంది మరి .

కాబోయే కోడలు తల్లీ బిడ్డల గాఢ పరిష్వంగాన్ని దుఃఖాన్ని బిక్క మొహం వేసుకుని  చూస్తుంది నాలాగే !  చప్పున కాబోయే కోడలిని పలకరించలేదని సృహ కల్గి  కొడుకు నుండి నుండి విడిపడి "అమ్మా ఎలా ఉన్నావ్ అంటూ ఆ అమ్మాయిని  దగ్గరకి తీసుకుంది . బాధపడకండి ఆంటీ ! ఇకనుండి అందరం కలిసే ఉంటాం కదా ! అని ఓదార్చింది . బిడ్డది ఎంత గొప్ప మనసు. ఈ పిల్లకి  ఓదార్చే విద్య కూడా తెలుసు. డిక్కీలో లగేజ్ అంతా క్రిందికి దింపించింది బ్యాక్ పేక్ , పాస్పోర్ట్ ఉన్న వాలెట్ అన్నీ తీసుకొచ్చి అబ్బాయికి ఇచ్చింది. నాక్కాబోయే కోడలు జాగ్రత్త పరురాలు. అబ్బాయిని నా అంత జాగ్రత్తగా చూసుకుంటుంది అనుకుంటూ  ఆమె  సరేనమ్మా ! మీరు వెళ్ళిరండి. రేపు కలుద్దాం అని ... ఇద్దరూ  కలిసి లగేజ్ అంతా  లిఫ్ట్ వైపు తేబోతుంటే  నేను తెస్తానుగా, నువ్వుండమ్మా  ..అంటూ చేతిలో లగేజ్ అందుకున్నాడు ఆ బిడ్డ. ఎంత శ్రద్ధ ,అమ్మంటే ఆ బిడ్డకి ఎంత ప్రేమ అనుకున్నాను .  నేను తెస్తాను కదా బాబూ మీరు పదండమ్మా అన్నాడు వాచ్మేన్.

ఇంట్లోకి వచ్చిన  సూట్కేస్ చక్రాల చప్పుడుకి ఒక్కొక్కరే ఆవిలించుకుంటూ  చిన్నీ.. అప్పుడే వచ్చేసాడా అంటూ బయటకి వచ్చారు. అందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరి సంతోషం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది కూడా .   ఆమె కొడుకు స్నానం చేయడానికి గీజర్ ఆన్ చేసింది . వేసవి కాలంలో వేడినీళ్ళు  ఏమిటమ్మా అంటున్నాడు . అదంతేలే ..నువ్వెళ్ళు ముందు. నేను అన్నం కలిపి పట్టుకొస్తాను అంది. ఆమె ఏమో హడావిడిగా  టీపాయ్ పై కూర గిన్నెలు,నెయ్యి ,పెరుగు , అన్నం గిన్నె, పళ్ళెం ,మంచి నీళ్ళు అన్ని సిద్ధంచేసి కొడుకుకి గోరుముద్దలు తినిపించుకోవడానికి ఎదురుచూస్తుంది .

 ఒక్క వెలుగు వెలిగి ఆరిపోతూ  రోజూ అంతలా అరగదీసేస్తూ  ఉంటావు . ఇవాళ అసలు నన్ను పట్టించుకోవడం లేదు అన్నాను ఉక్రోషంగా.. అప్పుడామె నవ్వి .. కొద్దిగా వేచి ఉండు, నీ ప్రశ్నకి సమాధానం చెపుతా అంది .
కొడుకుకి ఇష్టమైన కూరలేసి గోరు ముద్దలు తినిపిస్తూ  ఆనందంగా ఊరి వస్తున్న  కన్నీళ్ళు తుడుచుకుంటూ ఆమె ఇలా చెప్పింది..

 నాన్నా!  నీకిష్టం లేకపోయినా నేనే నిన్ను బ్రతిమలాడి విదేశానికి పంపాను. నువ్వు విదేశాలకి వెళ్ళి   బాగా చదువుకున్నావ్, ఎన్నో కష్టాలు పడ్డావ్ , మంచి ఉద్యోగం చేస్తున్నావ్ , ఇక్కడ  అమ్ముకున్నంత కాకపోయినా కొద్దిగా పొలం,నగానట్రా,కారు అన్నీ కొనుక్కున్నాం,ఆర్ధికంగా బాగున్నట్టు అనిపించినా ఏదో వెలితి,  ఇవేమీ ఇవ్వలేని భద్రత, నిశ్చింత  ఏదో కావాలనిపించేది నాకు. నిండుగా నవ్వింది లేదు, కడుపు నిండుగా తిన్నదీ లేదు,కంటి నిండా నిద్ర పోయింది లేదు. అనుక్షణం చెప్పలేని ఏదో అలజడి. అన్ని బంధాలలోనూ ఏదో అశాంతి,

ఆమె కంట కన్నీరు కారుతూనే ఉంది. కొడుకు ఓదారుస్తూ నిండు కుండ అన్నం కుడితితొట్టెలో  వేసిన రోజూ తెలుసూ, కొరివికారంతో తింటూ పరమాన్నంగా భావించిన రోజూ తెలుసు. ఏడేళ్ళ పసి వయసులో అమ్మ కష్టం తెలుసు, నాన్న నిర్లక్ష్యమూ అంతకన్నా బాగా తెలుసు. ఇన్నాళ్ళూ తప్పిపోయిన గొర్రె పిల్లని నేనేనెమో అనుకునేవాడిని. అయినవాళ్ళ ఇందరి మధ్య ఉండి నువ్వు ఇంత ఒంటరి తనం అనుభవించావా..అమ్మా ! అన్నాడు

నాన్నా ! అయినవాళ్ళ పలకరింపులలో కూడా కనబడే వెక్కిరింతలు, ఈర్ష్యాద్వేషాలు అన్నీ అనుభవించాను. చిన్న సాయం చేసి కూడా తాము లేకపోతే మనకి ఏమీ జరగదు, అన్నిటికి మీకు మేమే దిక్కు అన్నట్టు మాట్లాడే వాళ్ళు, చిన్న లోపాన్ని భూతద్దంలో చూస్తూ వాళ్ళే నిజాయితీ పరులు అని ఢంకా మోగించుకునేవాళ్ళు, వీళ్ళే మన చుట్టూ ఉంది . ప్రేమ నిండిన ఓ ఆత్మీయత కోసం అలమటిస్తున్నా . ఏళ్ళ తరబడి గూడుకట్టున్న దుఃఖాన్ని కరిగించే ఒక  స్పర్శ కోసం ఎదురు  చూస్తున్నా నాన్నా !   రెండేళ్ళ క్రితం హాస్పిటల్ లో పడి  ఉన్నప్పుడు కూడా ఆ  విషయం నీకు తెలియకుండా  ఉండాలనే జాగ్రత్త పడ్డాను కానీ  ఒకోసారి నా బిడ్డ స్పర్శ  తగిలితే చాలును  అరక్షణంలో నా రోగాన్ని జయించగలను  అని ఎన్నో సార్లు అనుకున్నాను"  చెపుతూ ఏడుస్తూనే ఉంది ఆమె.


 ఇదిగో  ఇది ఉంది చూడు ! అంటూ నన్ను ఎడమ చేతితో తీసి  అతనికి చూపించి మళ్ళీ  విసిరినట్లు ప్రక్కన పడేసి .. స్పర్శతో దీన్ని నువ్వు,  నేను ఏ ఆటైనా ఆడించగలము. అరక్షంలో ఎదురెదురుగా  కూర్చుని చూసుకోగలం, మాట్లాడుకోగలం,పెద్ద పెద్ద వ్రాతలని బట్వాడా చేసుకోగలం, వాన కురుస్తుందో ఎండ కాస్తుందో,ఎటు వైపుకి వెళుతున్నామో అన్నీ చెపుతుంది కానీ ఇది నాకొక ఆత్మీయ స్పర్శని ఇవ్వగల్గుతుందా ? నా దుఃఖ హృదయాన్ని  తన స్పర్శతో ఊరడించ గల్గుతుందా? అని అడిగింది . బిడ్డల భవిష్యత్ బాగుంటుందని,ఆర్ధిక ఇబ్బందులు తొలుగుతాయని  బిడ్డలని,భర్త ని దూరంగా విదేశాలకి పంపించిన వాళ్ళందరూ కోల్పోయేది ఈ ఆత్మీయ స్పర్శ నే . వీళ్ళు అక్కడికి వెళ్ళలేక ,వాళ్ళు యిక్కడికి రాలేక అనుబంధాలన్నీ మూగవోయి జీవచ్చవంలా బ్రతుకుతుంటారు . ఎప్పుడెప్పుడు వారి మధ్య  దూరం తగ్గి దగ్గరయ్యే క్షణం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తారు .  అక్కడ దొరికేది ఏదో, ఏమో  కానీ కోట్లు పోసినా దొరకనిది  మాత్రం ఇదే. ఈ స్పర్శ కోసమే అలమటించి పోతారు నాన్నా ! అని చెప్పింది.

అప్పుడు నాకు సిగ్గనిపించింది . నాలాంటి వాళ్ళు కోట్లాను కోట్లు ఉండి ఉండవచ్చు మావల్ల  మనుషుల  పై పై అవసరాలు తీరిపోవచ్చు.  కానీ  మనిషికి మనిషి మధ్య సజీవమైన స్పర్శని ఇవ్వలేవు కదా ! ప్రపంచంలో ఏ ప్రేమైనా ఎప్పటికో అప్పటికి కరిగి తరిగి పోతుంది కానీ తల్లికి బిడ్డ మధ్య  ఉన్న ప్రేమ ఎప్పటికీ కరగనిది తరగనిది కదా !  అనుకున్నాను . అవును మమ్మల్ని పుట్టించిన దేవుడికి మాకు స్పర్శ నివ్వడం ఎందుకు సాధ్యమవలేదూ ? స్పర్శ అంత గొప్పది కాబోలు .   సృష్టిలో కొన్ని కొన్నిఅసలు  సాధ్య పడవు కాబోలు. ప్చ్ సజీవ స్పర్శ లేని బ్రతుకు 
ఎంత దుర్లభం అనుకుంటూ వాళ్ళ వైపు చూసాను.


కామెంట్‌లు లేవు: