నాకు నచ్చిన సినిమా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నాకు నచ్చిన సినిమా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, సెప్టెంబర్ 2012, సోమవారం

సాగరసంగమమే...



నాకు పన్నెండేళ్ళప్పుడు అనుకుంటాను.. మా రిక్షా మేట్స్ తో కలసి  ఓ..ఆదివారం పూట  మైలవరం అశోక్ దియేటర్ లో మ్యాట్నీ షో కి  వెళ్లి  "సీతాకోక చిలక " చిత్రం చూసాను. 

ఆ రోజు ఎవరు సినిమా గురించి మాట్లాడుకోలేదు.మౌనంగా ఉన్నాం.  ఎవరి ఇళ్ళకి వారు చేరుకునే తొందరలో..ఉన్నాం కాబట్టి. . 

తెల్లవారి మళ్ళీ సినిమా ప్రసక్తి వచ్చింది. అందరూ ఆ చిత్రం బాగోలేదు.. అని అన్నారు. ఎందుకంటే మతాంతర, కులాంతర వివాహం కాబట్టి.. బాగుందని చెపితే పెద్ద వాళ్ళు నాలుగు ఉతుకు తారనే భయం. 

మూడు దశాబ్దాల క్రితం ఎవరూ కూడా ప్రేమ వివాహాలని ప్రోత్సహించే స్థితిలో లేరు కాబట్టి.మేము వెళుతున్న రిక్షా ముందు వెనుక మరో రెండు రిక్షాలు మేము కూర్చున్న రిక్షాతో పాటు మొత్తం మూడు రిక్షాలలో పిల్లలు మొత్తం పద్దెనిమిది మంది పిల్లలలో అందరు ఆ సినిమా చూసినవారే.. అందరూ కూడా ఏం బాగోలేదు ఆ సినిమా..అని ఏకగ్రీవంగా చెప్పేశారు. తర్వాత పెళ్లీడు వచ్చాక కుల మత  ప్రసక్తి లేకుండా ప్రేమ వివాహాలు చేసుకున్నవారు ఉన్నారు. అప్పుడు మాత్రం.. సినిమాని మెచ్చుకునే దైర్యం లేదు.

నేనయితే  మాత్రం ఆ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఏ కులమయితే  ఏ మతమయితే ఏముంది.?   వాళ్ళు ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకున్నారు తప్పేముంది? అని అని చెప్పాను. 
మా వెనుక ఉన్న రిక్షా రాఘవులు.. మేము వెళుతున్న రిక్షాని క్రాస్ చేసి.. ఏమిటమ్మాయి ! సీతాకోక చిలక సినిమా బాగుందా!? పలుపుతాడు  తీసుకుని  నాలుగు ఉతికేవాళ్ళు లేక పొతే సరి. అన్నాడు. నాకు రోషం ముంచుకు వచ్చేసి .. ఏం! మీకు ఎందుకు బాగోలేదో నాకెందుకు ? నాకు నచ్చింది అంతే..!అన్నాను. 

ఈ పిల్లకి పెద్దదవగానే చదువు గిదువు మానిపించి.. పెళ్లి చేసేయమని .. సాంబయ్య  బాబాయికి చెప్పేయాలి. లేకపోతే ఈ పిల్ల ప్రేమించే  పెళ్లి చేసుకుంటుంది.. అని అన్నాడు. మా నాన్నతో..నువ్వేమిటి చెప్పేది.. నీ పని నువ్వు చూసుకో.. అని గట్టిగా సమాధానం చెప్పాను కానీ.. రాఘవులు అన్న మాటలు నాకు చాలా అవమానంగా అనిపించాయి. అతను వినకుండా.. పెద్ద వీడి బోడి పెత్తనం నా మీద చూపిస్తాడేమిటి..!? సినిమా చూసి బాగుందో లేదో చెప్పాను కాని వీడికి నేను ప్రేమించి  పెళ్లి చేసుకుంటానని చెప్పానా? అంటూ వినేటట్టు  ..వినకుండా..ఇంకా కొన్ని తిట్లు  స్కూల్ దగ్గర దిగే వరకు తిడుతూనే ఉన్నాను 

తర్వాత మా అమ్మకి చెప్పాను.. ఆ రిక్షా  రాఘవులు "సీతాకోక చిలక" సినిమా బాగుందని చెపితే.. ఆ చచ్చినోడు ఏమిటేమిటో..అన్నాడు.  వాడు ఎందుకలా అన్నాడో..అడుగమ్మా..! 
నువ్వు కూడా ఆ సినిమా చూసి రా.. ! బాగుందో  లేదో .. చెప్పమ్మా..! అని కొద్ది రోజులు నస పెట్టాను. మా అమ్మ ఆ సినిమా చూడనూ లేదు. రిక్షా రాఘవులని   మా అమ్మాయిని   అలా ఎందుకన్నావని  తిట్టనూ లేదు.

పల్లెలలో..ఉన్న పెద్ద వాళ్ళల్లో అంతర్లీనంగా.. ఈ ఆడ పిల్లలని చదువుకోవడానికి  పంపుతున్నాం  గోపాలరావు గారి అమ్మాయిలా ఏ క్రిష్టియన్ మతస్తుడినో కట్టుకుని వస్తే.. నలుగురిలో ఎంత తలవంపు..? మునుసబు గారి  చిన్న అబ్బాయి సినిమా నటి జయసుదని పెళ్లి చేసుకుంటేనే వాళ్ళు ఒప్పుకోలేదు, మన కులం కాదని అనుకుంటూ ఎంత పేరు,డబ్బు ఉన్నా కూడా వారికి మనసంగీకరించ లేదు అని చెప్పుకునేవారు. మన పిల్లలు అలాగే చేస్తారేమో అని  భయపడేవారు. అందుకనేమో.. మా అమ్మకూడా  ఆ సినిమా విషయం గురించి మాట్లాడలేదు అనుకునేదాన్ని.

ఏమైనా సీతాకోక చిలక సినిమా నాకు బాగా నచ్చింది అన్నానని..నేను ఏ కులాంతర,మతాంతర వివాహమో చేసుకోలేదు. నేను ఇంటర్ మీడియట్ చదువుతుండగానే  మా పెద్ద వాళ్ళు చూసిన సంబంధమే, నాకు వరుసకు అత్త అయ్యే ఆమె కొడుకునే కనీసం పెళ్లి చూపులు లేకుండా ఒక్క చూపు కూడా  చూడకుండా  పెళ్లి జరిగిపోయింది. రిక్షా రాఘవులు మాటని నేను అబద్దం చేసేసాను కూడా!

సరే దర్శకుడు భారతీరాజా గారికి  హ్యాట్సాఫ్ చెప్పుకుంటూ..  చిత్ర రాజం "సీతాకోక చిలక" చిత్రం లో నాకు నచ్చిన అంశాలు.. 

పాటలు చాలా బాగుంటాయి. అలాగే పాటల సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. అప్పటికి వేటూరి గారు ఎవరో తెలియదు కానీ రేడియోలో  పాటలు వస్తుంటే గబా గబా నోట్స్ తీసుకుని వ్రాసేసుకునేదాన్ని. తర్వాత ఆ పాటలని ఇంకోసారి వచ్చేటప్పుడు వింటూ  తప్పులు సరిదిద్దుకుని పాఠం చదువు కున్నప్పటికన్నాశ్రద్దగా పాటలని చదివేదాన్నేమో.. ఆ పాట సాహిత్యం బాగా అర్ధం అయ్యేది.  ఆ పిచ్చో లేక పొతే ఇంకేదన్నానో కానీ  నా  ఇంట్రెస్ట్ మాత్రం అదే ! కావాలంటే నేను ఇంటర్ మీడియట్ చదివేటప్పుడు మాకు  బోటనీ    సబ్జక్ట్ భోధించిన "అనార్కలి " మేడం  తిట్లు సాక్షిగా  ఎప్పుడూ పాటలే చదివేదాన్ని అన్నమాట.

చిత్ర కథ కి వస్తే కులం, మతం ధనిక-పేద తారతమ్యాలు అనేవి కొన్ని వందల సంవత్సరాలుగా మనుషుల మనస్సులో పేరుకుని పోయి.. మనుషుల్లో సహజంగా దాగిన మానవత్వాన్ని కూడా మరుగున పడేసి కర్కశత్వంతో గిరి గీసుకున్న సమాజంలో మార్పు తీసుకురావాలన్న సందేశంతో  ఆ చిత్రం ఉంటుంది.

కులం,మతం అనేవి ప్రవహించే నదులు లాంటివి. ప్రవహించి ప్రవహించి ఆఖరికి అవి కడలి ఒడికి చేరాల్సిందే కదా! అలాగే మనుషుల మధ్య అంతరాలు సమసిపోవాలి. యువతీ యువకుల మధ్య సహజంగా వికసించే ప్రేమ,ఆకర్షణ కలగలిపి అవి పెళ్లివరకు దారితీసే దశలో ఈ కులం,మతం తప్పకుండా అడ్డుగోడలై నిలిచి ఎంతో మంది  ప్రేమికులని విడదీస్తూ ఉంటాయి. మనుషుల మధ్య ఈ అంతరాలు సమసిపోయి ఎవరు అడ్డుకున్నా వెరవక రెండు మనసులు ఏకమయ్యే అపూర్వ ప్రేమ సంగమమే సాగరసంగమం.

సీతాకోక చిలక ఆనే టైటిల్  కూడా.. ఎంత అర్ధవంతంగా  ఉంటుందో కద్దా!?
గొంగళి పురుగు చూడటానికి ఎంతో  అసహ్యంగా ఉంటుంది కదా ! అలాగే పచ్చని చెట్టు ఆకులని తినేసి.. ఆ ఆకుకే గూడు కట్టుకుని ప్యూపాగా మారి.. ఆ దశ నుండి క్రమ క్రమంగా వికాసం చెంది  అందమైన సీతాకోక చిలకగా  మారడం చూసే కన్నులకి ఎంత ఆహ్లాదకరం. 

 కులం మతం ఆనే గొంగళి  పురుగులు సమాజమనే మొక్కకి  పట్టిన చీడ లాంటివి.. అవి సమాజ వికాసానికి నిరోధకంగా మారతాయి. మనుషుల్లో ఆలోచన కల్గిస్తూ.. కులాంతర మతాంతర వివాహాలని ఆమోదించక తప్పదని  అప్పుడే ఈ సమాజం.. సీతాకోకచిలుకలా ఆహ్లాదంగా ఉంటుందనే సందేశం ఉంటుంది. ఇంత ఆలోచనా విధానం నాకు అప్పుడు లేకపోయినా కూడా ఆ సినిమా నచ్చింది. నచ్చినందుకేమో.. ఇంత డీప్ గా ఆలోచించాను. 


"సీతాకోక చిలక" చిత్రంలో.. ఈ బిట్  నాకు  చాలా  ఇష్టం అలాగే  సాగర సంగమమే పాట కూడా.. . 

సాగర సంగమమే... ప్రణవ సాగర సంగమమే!
సాగర సంగమమే... ప్రణవ సాగర సంగమమే!

జానకి కన్నుల జలధి తరంగం ... జానకి కన్నుల జలధి తరంగం ... 
రాముని మదిలో విరహ సముద్రం  
చేతులు కలిపిన సేతు బంధనం 
ఆ సేతు హిమాచల ప్రణయ కీర్తనం 

సాగర సంగమమే... ప్రణవ 

ఈ బిట్ ఎంత బాగుంటుందంటే.. జానకి కన్నుల జలధి తరంగం .. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.. అర్ధం అంత లోతు గనుక. ఆ విషయం అప్రస్తుతమే కానీ .. మనసు పెట్టి చది చూస్తే మీ నయనం చెమ్మగిల్లడం ఖాయం.   

రావణుడు సీతమ్మని అపహరించి లంకలో అశోక వనంలో బంధించి వుంచితే రామచంద్రుడిని తలచుకుంటూ కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతూ ఉంటే హనుమంతుని ద్వారా సీత జాడని తెలుసుకున్న శ్రీరామచంద్రుడు లంకకి ఈవల సముద్ర తీరాన వుండి వారధి కట్టే ప్రయత్నంలో ఉన్నప్పుడు  రాత్రి సమయంలో సీతని తలుచుకుంటూ విరహాన్ని అనుభవిస్తుంటే ఆ విరహాన్ని సముద్రంతో పోల్చిన కవి భావన అర్ధం చేసుకున్న మనసులకి ఎంతో రసజ్ఞత ఉందని అనుకుంటాను. తన విరహాన్ని మోసుకుని వెళ్ళేగాలి కూడా సీతకి వేడిగా తగలకూడదని శ్రీరామచంద్రుడు కోరుకున్నాడని ఎక్కడో చదివిన విషయం గుర్తుకొచ్చి అందలి భావనని అనుభవించి మనసు మూగపోతుంది నాకు. అలాంటి సాహిత్యమే ఇది కూడా అనిపిస్తుంది నాకు. 



జానకి  కన్నుల జలధి తరంగం, రాముని మదిలో విరహ సముద్రం.. 

ఎంత గొప్పగా చెప్పారు.. ఆ మహానుభావుడు 


చేతులు కలసిన ఆ సేతు బంధనం అనేది.. ఆ సేతువుని నిర్మించడమే కాదు..

చిన్నారి స్నేహితులు .. ఈ యువ జంట ప్రేమకి సాయం చేయడాన్ని  తెలుపుతాయి.

ఆసేతుహిమాచల ప్రణయ కీర్తనం.. 

నిజమే కదా! కన్య కుమారి నుండి హిమాచలం వరకు మనందరికీ ఆదర్శ ప్రాయమైన జానకిరాముల  ప్రణయ బందాన్ని ఆచంద్ర తారార్కం కీర్తించేవారిమే కదా!


ఈ చిత్ర కథకి "వేటూరి" సాహిత్యంతో   అర్ధవంతమైన  రూపమిస్తే  పోస్తే.. ఇళయ  రాజా సంగీతం ప్రాణం పోసింది.

మీరే ఒకసారి విని ,చూడండి. రేపు.. ఇంకొక పోస్ట్ లో "వేటూరి" గారిని తలచుకుంటూ.. సాగరసంగమమే... పాట.. గురించి చెప్పాలని ప్రయత్నం. 

16, ఏప్రిల్ 2012, సోమవారం

తన రంగునిచ్చి తను రాలిపోయిన "గోరింటాకు"



నాకు  చాలా బాగా  నచ్చిన సినిమా .. గోరింటాకు.

నేను పదునైదేండ్లు వయసులో ఉండగా.. చూసిన సినిమా. ఇప్పటిలా ఒక సినిమా రాగానే కొన్ని నెలలకే , కొన్ని రోజులకే కనుమరుగై పోయిన రోజులు కావు కదా అవి. మంచి సినిమా అంటే ఏడాదికి ఓ సారి అయినా వచ్చి ఓ..పది పదిహేను రోజులపాటు ధియేటర్ లో మూడు పూటలా  అలరించి వెళ్ళేవి .

నేను పదవతరగతి చదివేటప్పటికి  ఆ చిత్రం విడుదలయి ఓ..రెండేళ్ళు దాటింది. శోభన్ చిత్రాలు అంటే..మా వూరి వాళ్లకి బాగా అభిమానం. అక్కడే పుట్టి పెరిగి వెళ్ళినవాడని..అందరికి పరిచయం ఉండటం మూలంగా ఎక్కువ గా శోభన్ చిత్రాలని   ఆదరించే వారు.  చిత్రం బాగుంటే ఇంకా ఎక్కువగా  ఆ చిత్రాన్ని ఆదరించి అభిమానాన్ని చాటుకునేవారు.  అయినా శోభన్ బాబు ఖాతాలో ఎక్కువ మంచి చిత్రాలే ఉండేవి.

నేను "గోరింటాకు " చిత్రాన్ని చూసింది మూడు సార్లు..కానీ ఆ చిత్రాన్ని రోజు సెకండ్ షో ని చూడకుండా వినడం ఓ..పదిహేను రోజులు. రాత్రి సమయాలలో ట్యూషన్ టైం అయిపోయి..అందరూ  ముసుగుతన్ని  పడుకుంటే..ఆ చిత్రంలో సంభాషణలన్నింటిని  బాగా  వింటూ.. అంత కన్నా బాగా జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ.. అలా నిద్రలోకి జారుకునేదానిని.(ప్రక్కనే దియేటర్ ఉండేది కాబట్టి)

అలా గోరింటాకు చిత్రం నాకు బాగా నచ్చేసింది. చిత్ర కథా రచన దాసరి గారు అనుకుంటాను. చాలా పదునైన సంభాషణలు, కదిలించే సంభాషణలు చాలానే ఉండేయి,

ఓ పల్లెటూర్లో పుట్టిన రాము కి ఓ..చిట్టి చెల్లి ఉండేది. ఆమెకి గోరింటాకు అంటే చాలా ఇష్టం. తల్లి ఆ అమ్మాయికి గోరింటాకు కోసి రుబ్బి పెడుతూ.. ఓ.పాట పాడుతుంది. ఆ పాట వినగానే మనకి గీత రచయిత దేవులపల్లి  టక్కున గురుకు వస్తారు. మాహానటి సావిత్రి రూపం గుర్తుకు వచ్చి బాగా బాధ కల్గుతుంది.

"మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు,గన్నేరులా పూస్తే కలవాడోస్తాడు,  సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా..అందాల చందమామ తానే దిగి వస్తాడు." అని పదహారు అణాల తెలుగుతనాన్ని పూయించిన పాట.
ఇంతకీ  ఆ తల్లికి లభించిన  మొగుడు కోపిస్టి వాడు,పాపిష్టి వాడు కాబట్టి..అ బిడ్డ అల్పాయుష్కురాలయింది.ఆ ముద్దుల అన్నకి గోరింటాకు అంటేనే భయం మిగిల్చింది.

ఆ చిత్రంలో సావిత్రి భర్త ఓ..వ్యసనపరుడు. పరాయి స్త్రీల మోజులో..కుటుంబాన్ని గాలికి వదిలేసి..అప్పుడప్పుడు వచ్చి తన ప్రతాపాన్ని చూపించి వెళ్ళిపోతూ ఉంటాడు. కనుల నీరు నింపుకుని ఆ భర్తకి ఎదురు చెప్పలేక మౌనంగా భరిస్తూ.. బిడ్డలే ప్రాణంగా బ్రతుకుతున్న ఆమెకి కడుపు కోత మిగిల్చి..పూర్తిగా తన విలాస జీవితంలోనే మునిగి పోతాడు..తండ్రి (జే వి రమణ మూర్తి). మేనమామ, అత్తల సాయంతో..రాము (శోభన్ బాబు ) చదువుకోవడానికి పట్నం చేరు కుంటాడు. మెడిసన్ కోర్స్ లో జాయిన్ అయి.. చదువుకుంటూ.. సక్రమంగా ఫీజు చెల్లించలేక ఆ
దుస్థితిలో అందరి దృష్టిలో పడినప్పుడు  స్వప్న (సుజాత) దృష్టిలో పడతాడు. ఆమె అతని కి సాయపడి..అందుకు బదులుగా తన చెల్లికి తమ్ముడికి ట్యూషన్ చెప్పమని అడిగి వారి ఇంట్లోనే అవుట్ హౌస్ లో ఆశ్రయం ఇస్తుంది. అతనికి సహాయ పడుతుంది.

ఆమె మంచితనాన్ని, సహృదయాన్ని, వ్యక్తిత్వంని ఆరాదిస్తూ..తన మనసులో భావాల్ని ఎప్పటికప్పుడు  డైరీలో రాసుకుంటూ ఉంటాడు రాము. అవకాశం దొరికితే తన మనసులో భావాలని  ఎన్నో సార్లు  చెప్పాలనుకుని ఆరాట పడతాడు. అలా కొన్నేళ్ళు ఆమెకి తన ప్రేమని చెప్పాలనుకుని కూడా చెప్పలేక మూగప్రేమతో.. సతమత మవుతాడు.

చదువు పూర్తికావడంతో..స్వప్న తండ్రి ఆమెకి  వివాహం చేయదలచి ఒక మంచి సంబందం చూస్తాడు.ఆ విషయాన్నే  రాముకి చెప్పి అతని సలహా తీసుకుంటాడు.రాము కూడా ఆమెకి అన్ని విధాల సరైనజోడని ఆమె తండ్రి ఎంపికకి ఓటు వేస్తాడు. అది తెలిసిన స్వప్న ..తన ప్రేమని తనలోనే దాచుకుని తండ్రి కుదిర్చిన వ్యక్తి ని వివాహం చేసుకుంటుంది.

ఆనంద్ తో   కలసి కాపురానికి  వెళ్ళిన స్వప్నకి .. ఓ..చేదు విషయం తెలుస్తుంది. ఆమె వివాహమాడిన ఆనంద్ (దేవదాస్ కనకాల) కి అంతకు ముందు ఓ..వివాహం జరిగి..ఓ..పాపకి జన్మనిచ్చాడని తెలుస్తుంది. అతని తప్పుని నిలదీసి..అతనికి బుద్ధి చెప్పి  పాపతో కూడా వచ్చిన ఆమెని అతనితో కలిపి   తిరిగి పుట్టింటికి చేరుకుంటుంది. ఈ లోపు రాము ..ఆ ఇంటి నుండి వేరే ఇంటికి మారి పోయి..పల్లెటూరి నుండి తల్లిని తీసుకు వచ్చుకుని ఆమెతో కలసి ఉంటూ ఉంటాడు.

వారి ఇంటి ప్రక్కనే మేడమీద నివసిస్తున్న పద్మ పాడిన విషాదమైన పాట (పాడితే శిలలైన కరగాలి) వింటాడు. ఆ పాట తర్వాత ఆమె  దుఖః భారంతో సృహ తప్పడం ఉన్మాదిలా ప్రవర్తించడం  చేస్తూ ఉంటుంది. రాము  ఒక డాక్టర్ గా వెళ్లి ఆమెకి సేవలు అందిస్తాడు.ఆ క్రమంలో  ఆమె  చేష్టలవలన  గాయపడతాడు కూడా. ఆమె తల్లి  చెప్పిన విషయాల వల్ల కొన్ని విషయాలు  రాముకి తెలుస్తాయి. పద్మ వివాహ ఘడియకు ముందు ఆమెని పెండ్లాడాల్సిన వరుడు..పెళ్ళికి సిద్దమై వస్తూ.. దారిలో జరిగిన  యాక్సిడెంట్ లో చనిపోవడం మూలంగా  ఆమె ఆ షాక్ తో మానసికంగా దెబ్బతిని అలా ప్రవర్తిస్తుందని తెలుస్తుంది. ఆమె పై కలిగిన సానుభూతితో.. ఆమెకి ట్రీట్మెంట్ లో భాగంగాను..పద్మకి సన్నిహితం అవుతాడు. ఈ లోపు.. రాము తండ్రి అనారోగ్యం పాలయి హాస్పిటల్ లో దిక్కు మొక్కు లేకుండా పడి ఉండటం చూసి  తండ్రికి  తన తిరస్కృతి చూపుతూనే వైద్యం అందించి మామూలు మనిషి అయ్యేటట్లు చూస్తాడు. ఆ తర్వాత  తండ్రి తమతో మరలా కలసి ఉంటాడని  తల్లి అన్నప్పుడు వ్యతిరేకిస్తాడు...కానీ తల్లి మాట కాదనుకోలేక తమతో కలసి ఉండటానికి అయిష్టంగానే అంగీకరిస్తాడు. ఎందుకో సావిత్రి నిర్ణయాన్ని హర్షించలేకపోయాను కూడా ! అలాంటి భర్తని ఆమె క్షమించడం నా దృష్టిలో అవివేకం కూడా !

మధ్యలో ఒకసారి స్వప ని  కలసినప్పుడు ఆమెకి జరిగిన అన్యాయానికి బాధపడతాడు.
ఒకరోజు..  స్వప్నకి రాము డైరీ ఆ ఇంట్లో కనబడుతుంది అది చదివిన ఆమెకి అతని మనసులో ఉన్న ప్రేమ  సంగతి తెలుస్తుంది. అతనితో.. మాట్లాడాలనుకుంటుంది. ఈ లోపుగా రాముకి  పద్మకి మధ్య ప్రేమ చిగురిస్తుంది. వారు ఇద్దరు పెళ్ళిచేసుకోవాలని నిర్ణయం చేసుకున్తప్పటికి ..స్వప్న ప్రేమ సంగతి తెలుస్తుంది. పద్మ ఆత్మహత్యా ప్రయత్నం .. చేయడం..స్వప్న ఆమెకి బ్లడ్ డొనేట్ చేసి బ్రతికించడం.. ఆ ఇరువురి మధ్య నలిగిన మూగ ప్రేమ తిరిగి కలిసే సమయానికి మళ్ళీ ట్రయాంగిల్ లవ్ స్టొరీ కావడం అంతా  ఒక కలలా అనిపించినా.. కథ, సెంటిమెంట్ బలంగా ఉండటంతో.. ఎక్కడా ప్రేక్షకుడికి విసుగు పుట్టవు. మన మధ్య జరుగుతున్న  సహజమైన కథలా రీళ్ళు కి రీళ్ళు కదలి వెళ్లి పోతుంటాయి .

పద్మ ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించు కున్నాని రాము చెప్పినప్పుడు   స్వప్న ఒక ఉన్నత వ్యక్తిత్వంతో.. పద్మ ఉన్న స్థితిలో ఆమెని వివాహమాడటమే మంచిదని రాముని ఒప్పిస్తుంది.

"స్వప్నా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావ్ ? "  అని అడుగుతాడు..రాము.
"నేను తిరిగి నా భర్త దగ్గరకే వెళ్లి పోవాలనుకుంటున్నాను" అని చెపుతుంది.
"నీకు పాత కాలం ఆడవారికి తేడా లేదు అని నిరూపించావ్"..అంటాడు రాము.
"కాలం ఏదైనా ఆడవాళ్ళు ఆడవాళ్లే కదా !" అంటుంది..స్వప్న.
చదువుకునే రోజుల్లో వల్లించే ఆదర్శాలు,ఆశయాలు నిజ జీవితంలో ఆచరణ లో కనబడని స్త్రీల జీవితం పట్ల ఆవేశం,ఆవేదన ఉంటుంది.
అలాగే  చిత్రం ఆఖరిలో స్వప్న   ఒంటరిగా మిగిలిపోయి..అలా దూరంగా నడచి వెల్లిపోయేటప్పుడు.. వినిపించే  గీతం  మనసుకు వస్తూను ఉంటుంది.  "తన రంగుని ఇచ్చి (ప్రాణ మిచ్చి ) తనువంతా ఎండి తను రాలిపోతుంది." అంటూ గోరింటాకు స్వరూపాన్ని స్వప్న పాత్రకి అన్వనయించి చెప్పడం నాకు చాలా నచ్చింది.

స్త్రీల  పూర్తి కాల జీవితం పురుషుల నడవడికతో ముడిపడి ఉండటం.. వారి అహంకార విలాస,విచ్చలవిడి శృంగార జీవితాన్ని భరించాల్సి రావడం.ఎన్ని తప్పులు చేసినా..అన్నీ మరచి పోయి వారిని క్షమించడం.. సావిత్రి పాత్రలో మనకు దర్శనం ఇస్తే..

పెద్ద చదువులు చదువుకుని.. ఇచ్చిన మనసు బయట పెట్టుకోలేక తండ్రి కుదిర్చిన మనువాడి..అతని నిజ స్వరూపం తెలిసిన తర్వాత ఇంకొక స్త్రీజీవితాన్ని సరిదిద్దే ప్రయత్నంలో.. పురుషుడి మోసాన్ని నిలబెట్టి కడిగి పారేసి ఆ స్త్రీకి న్యాయం చేకూరుస్తుంది... ఆ పాత్రలో నటి  సుజాతని తప్ప మరొకరిని ఊహించలేము.

ఆనంద్ (దేవదాస్ కనకాల) ని నిలదీసే టప్పటి డైలాగ్స్ నాకు యెంత బాగా నచ్చాయో!

మూడు మూరల పసుపుతాడుతో..  ఒక పసుపు కొమ్ముతో..ఒక ఆడదాన్ని జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకు ఎవరు ఇచ్చారు. ఆమెని తల్లిని  చేసి మరలా డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకుని ..ఎంతోమంది జీవితాలతోనో ఆడుకోవాలనుకునే నిన్ను షూట్ చేసి పారేసినా పాపం లేదంటుంది. చాలా పదునైన సంభాషణలు.

సంభాషణ ల రచయిత ఎవరో గుర్తు లేదు కానీ ..ముప్పయ్యి ఏళ్ళ క్రితం చూసిన చిత్రం ఇంకా  గుర్తు ఉండి పోయిందంటే  ..కథా కథనం యెంత గొప్పవో కదా! ఆ చిత్రంలో పాటలన్నీ ఎంతో..బాగుంటాయి. రమాప్రభ,చలం ల హాస్యం మనసార నవ్విస్తాయి.  కే.వి.మహదేవన్ సంగీతంలో పాటలు ఒక దానికి మించి మరొకటి..
అద్వితీయమైన సుజాత నటన మన మనస్సులో చెరగని ముద్ర వేస్తుంది.

నాలో స్త్రీవాదం పట్ల ఉన్న భావాలు బలంగా నాటించిన చిత్రం అది.ఎందుకంటే..అలాటి కథలు సావిత్రి భర్త లాటి పురుషులు కుడి ఎడమగా అలాటి ధోరణులు   మనం చూస్తూనే ఉంటాం కాబట్టి.  భర్తలని ప్రశ్నించలేని అసహాయతలో ఇంట్లో మగ్గిపోయిన ఆడవారి జీవితాలకి తార్కాణం సావిత్రి పాత్ర.. మేడిపండు లాటి వివాహ వ్యవస్థలో మగ్గిపోయిన ఆడవారి కథ కూడా.

విధి వంచించినా ఓ..సహ్రుదయుడి సానుభూతి లభించి అది ప్రేమగా మారి సరిక్రొత్త జీవితం లభించిన పద్మ  జీవితం..  ఇలా ఇన్ని కోణాలు ఉన్న చిత్రం అది.

మళ్ళీ ఒకసారి చూసి చిత్రం గురించి వ్రాయాలనుకున్నాను. కానీ చూడటం కుదరక.. గుర్తు తెచ్చుకుని ఇది వ్రాస్తున్నాను.


6, మే 2011, శుక్రవారం

సవాల్ కి జవాబు దాసరి "మేఘసందేశం"

కాలం తో.. పని లేనిదీ  కారణాలతో.. పని లేనిదీ.. ప్రేమ.. 
అవును.. ఈ.. చిన్న వాక్యానికి  అనంతమైన  అర్ధం... ఇమిడి.ఉంది.. 
విజ్ఞులు,గురుతుల్యులు చెప్పినంత వివరంగా ..సోదోహరణంగా..నేను చెప్పక లేక పోవచ్చు.. చెప్పే ప్రయత్నం అయితే మాత్రం  చేస్తున్నాను.   


శతాధిక  చిత్ర దర్శకుడు దాసరి నారాయణరావు..గారి చిత్రం ఇది.  దాసరి గారు ఈ..చిత్రానికి.. సంబంధించి..ఓ..సవాల్  ఎదుర్కున్నారని చెబుతూ..ఉంటారు. శంకరాభరణం చిత్ర విజయం తర్వాత.. కే.విశ్వనాథ్ గారి.. పేరు మారుమ్రోగుతున్న వేళ.. దాసరి గారు.. ఒకసారి విజయవాడ వచ్చినప్పుడు.. రైల్వే స్టేషన్ లో... వారు వారి అభిమానులతో.. నడచి వెళుతూ..ఉండగా.. జనంలోనుండి...అగ్ర దర్శకుడు అని  పేరు చెప్పుకోవడం కాదు.. మా..విశ్వనాథ్ లా.. ఒక కళాఖండం తీయగలవా? అని సవాల్ విసిరారట. అప్పుడు ఆయనలో.. ఆలోచనలు   మొదలై.. ఒక.. చక్కని, చిక్కని కళాఖండం రూపుదాల్చింది.  అదే .. "మేఘసందేశం "


1983 లో.. జాతీయ స్థాయిలో..  రెండు  అవార్డ్లు  సొంతం చేసుకుంది. "ఆకాశ దేశాన "పాట పాడినందుకు  కే.జే ఏసుదాస్ కి , స్వరాలూ అందించిన రమేష్ నాయుడు  గారికి.. ఇంకా.. ప్లే బ్లాకు ఫిమేల్ సింగర్  గా ..పి.సుశీల గార్కి, దర్శకుడు  దాసరి కి, నిర్మాత గా దాసరి పద్మ గారికి.. ఇలా. ఒక్క  ఈ.. చిత్రానికి.. మొత్తం 27  అవార్డ్ లు గెలుచుకున్న చిత్రం ఇది. 

ఇన్ని అవార్డులు అందుకున్న చిత్రం అని నాకు అసలు తెలియక ముందరే  నేను   ఈ.. చిత్రాన్ని చూసినప్పుడు.. చాలా నచ్చేసింది..ఎందుకో..తెలియదు.ఆలోచనల్లో.. పరిపక్వత వచ్చేసరికి.. ఇంకా.. బాగా నచ్చేసింది. అందుకే..నా కు నచ్చిన సినిమాల్లో..మేఘసందేశం ఒకటి.

చిత్ర  కధ లోకి వెళితే.. కథ లో... ఏ.యెన్.ఆర్.. రవీంద్ర బాబు.. ఒక పల్లెటూరిలో.. గౌరవనీయుడు..మంచి మనిషి. కవి కూడా.  వివాహమై ఒక కూతురు కూడా..ఉంది.. నలుగురికి మంచి చెప్పే ఆదర్స ప్రాయుడైన  వ్యక్తిగా..గుర్తింప 
బడతాడు. అతని భార్య లక్ష్మి..అతనికి తగిన విధంగా నడచుకునే  భార్య.

ఆ ఊరికి.. ఒక దేవదాసి కుటుంబం వలస వచ్చి.. ఊరి చివర నది ఒడ్డున నివాసం ఏర్పరచుకుని తమ నాట్య గానాలతో.. అందరిని అలరిస్తూ..ఉంటారు. ఆ ఊరిలో.. పురుషులందరూ.. ఆ..ఇంటికి వెళుతూ.. తమ కుటుంబాలని,పనులని నిర్లక్ష్యం చేస్తున్నారని.. ఆ దేవదాసి కుటుంబాన్ని..మందలించి ఆ ఊరినుండి తరిమి వేయమని కొంత మంది గ్రామీణులు  కోరికని  రవీంద్ర బాబుకి చెప్పుకుంటారు .  అతను ఆ.. ఇంటికి వెళ్ళడం అక్కడ "పద్మ "అనే దేవదాసి స్త్రీ ని చూసి  ఆమె నృత్య గానానికి ముగ్దుడవడం.. అంతలోనే తేరుకుని.. ఆమెని ఊరు వదలి వెళ్ళమని మందలించడం ..ఆమె అందుకు.. సమాధానం గా.. మేము..నాలుగు ఊర్లు తిరుగుతూ.. మాకొచ్చిన విద్యలతో..  జనులని అలరించి పొట్టపోసుకునే వాళ్ళం. ఇక్కడకి.. వచ్చి చెడిపోయిన వాళ్ళు.. ఎవరు ఉండరు.. చెడిపోయి ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఉంటారు..అంటుంది.

 మాట్లాడకుండా.. వెళ్ళిన అతను.. మళ్ళీ.. ఏదో..అయస్కాంతం లాగినట్లు.. మరుసటి రోజు అక్కడకి వస్తాడు. ఆమెని చూసి ఉత్తేజం చెంది  అతనిలో మరుగున పడిన కవి మేల్కొని కవిత్వం వ్రాయడం మొదలెడతాడు. అతని భార్య.. ఆ..కవిత్వం   చూసి తనని ఊహించుకునే అతను ఆ కవిత్వం వ్రాసుకున్నట్లు భ్రమపడి భద్రంగా.. బట్టల అడుగున ఆ.. కాగితం దాచుకోవడం.. తర్వాత గుడిలో.. వర్షంలో.. తడిచిన పద్మ పరిచయమై.. తమ బండిలో.. తీసుకుని వెళ్లి ఇంటి లోపలకి..  ఆమెని ఆహ్వానించడం వెళ్ళేటప్పుడు ఆమెకి  పసుపు -కుంకుమలు ఇవ్వడం.. ఆమె వెళ్ళిన వెంటనే.. నిజం తెలియడం.. బట్టల అడుగున దాచుకున్న కవిత్వం   కాగితాన్ని చించి ముక్కలు చేసి పారేయడం.. ఇదంతా ..ఒక సగటు ఇల్లాలి..తనం జయసుధ పాత్రలో.. ఎంత  సహజం గా.. ఒదిగిపోయాయో! 

 తర్వాత అన్నగారిని పిలిపించడం  భర్తకి.. సుద్దులు చెప్పించి..కాపురాన్ని దక్కించుకునే  ప్రయత్నం చేయడం.. అది.. వీలు కాదనుకుప్పుడు..  ఆ అన్నయ్య ఊరి పెద్దల సహకారంతో ఆ దేవదాసి కుటుంబాన్ని.. ఆ ఊరినుండే పంపేయడం.. జరుగుతుంది. రవీంద్ర బాబులోని కవి.. ఆ ప్రేయసి ఎడబాటుతో.. ఎప్పుడూ.. ఆలోచిస్తూ.. బాహ్య ప్రపంచాన్ని  మరచి..ఆమె ద్యాస లోనే..బ్రతుకుతూ..ఒక కావ్య రచన చేయడం.. ఆ.. పుస్తకఆవిష్కరణ సమయంలో .. అతనిపై ఉన్న అభిమానంతో..పద్మ కూడా రావడం.. ఆమెని ..రవీంద్ర బాబు చూడటం జరుగుతుంది. రావీద్రబాబు కూడా   ఆమెని పిలుస్తూ జనంలో వెతుక్కుంటూ వెళ్ళిపోవడం .. అతనిని వారించబోయిన అన్నగారిని లక్ష్మి.. వారించి.. " ఆయన మనసంతా.. ఆమె నిండి ఉంది... బాహ్యంగా ఆయన ఇక్కడ ఉండేకన్నా పూర్తిగా ఆమె దగ్గర ఉంటేనే.. మంచిచి..ఆయనని వెళ్ళనీ అన్నయ్యా " అంటుంది. భర్త మనసును అర్ధం చేసుకున్న ఆమె తీరు ప్రేక్షకులని ముగ్ధుల్ని చేస్తుంది .  అతి సాధారణంగా మెలుగుతున్నట్లు కన్పించిన ఆ   స్త్రీ మనసు,ఆమె  ఆలోచనల్లోని..పరిణితి..చాలా హృద్యంగా ఉంటుంది.

 పద్మ ని వెదుకుతూ.. వెళ్ళిన అతను.. ఎక్కడెక్కడో..తిరగడం.. అటు భార్య దగ్గర లేక , ప్రేమించిన ఆమెని చేరుకోలేక .. మతి భ్రమించిన  వాడిలా..తిరుగుతూ ఉంటాడు .  ఆ విషయం తెలుసుకున్న పద్మ ఓ  నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసి ఆతన్ని.. రప్పించే యోచన చేయడం .. అనుకున్నట్లుగానే.. అతను  అక్కడికి రావడం.. పద్మకి.. చేరిక అయి ఆమె  ప్రేరణతో  కవిగా  ఎన్నో.. రచనలు చేయడం ఇది కథ .  ఇంతటి కథ వెనుక .. అసలు.. కారణం .." ప్రేమ"  అది..  పెళ్లి అయి భార్య బిడ్డలతో.. గౌరవనీయుడిగా బ్రతుకున్న వ్యక్తి  మదిలో..మెదిలిన ప్రేమ భావన. అది.. ఆకర్షణ లో..పుట్టిన ప్రేమ కాదు. మోహంలో.. పుట్టిన ప్రేమ అంతకంటే  కాదు. ఇద్దరు.. కళాకారులకు సంబంధించిన  హృదయ స్పందన. దానికి.. కాలంతోను.. కారణాలతోను.. పని లేకుండా జనియించిన ప్రేమ . ఎవరికి ఎప్పుడు ఎవరిపై ప్రేమ ఎప్పుడు ఎందుకు కల్గుతుందో చెప్పలేం..కూడా!  అదే..జరిగింది ఆ కధలో.. అల్లా.. జరిగిన ఆ కథలో .. అందరి చేతా చులకన చేయబడిన పాత్ర  పద్మ పాత్ర  ..  జయ ప్రద తప్ప అలా.. ఎవరు చేయగలరు? ఈ.. చిత్రంలో.. ఎవరి పాత్రకు తగినట్లు వారు జీవించారు. పాటలు, చిత్రీకరణ,సంగీతం ..అన్నీ..అద్భుతం.  అందుకే ఈ చిత్రం ఒక కావ్యం అనదగ్గ అర్హతలు  ఉన్నాయనిపిస్తుంది . చిత్రం ఆద్యంతం  ఒక మధురానుభూతితో..చూడవచ్చు. ఎక్కడా ఇసుమంతైన అతిశయం లేకుండా  .. మన మద్య జరుగుతున్నంత ఒక వాస్తవం లా.. సాగుతూ..ఉంటుంది.  .  

ఆఖరిలో..  తన  కూతురి పెళ్ళికి   రవీంద్రబాబు  రావడం అందరికి సంతోషకరం.. పెళ్లి అయిన వెంటనే.. తిరిగి వెళ్ళాలనుకోవడం,అతను త్వరపడటం..మనసంతా పద్మ దగ్గరే.. తారట్లాడినట్లు  ఉండటం.. ఏళ్ళు గడిచినా తరగని వన్నె తగ్గని ఒక సాంగత్యం, అనుబందాన్ని . తప్పక విప్పి చెపుతాయి. అతని భార్య..  లక్ష్మి పాత్రలో.. జయసుధ పాత్ర పోషణకే ...వన్నె తెచ్చేవిధంగా  వ్రాసిన మాటలు.. నాకు.. చాలా.. బాగా నచ్చుతాయి.  తనని వివాహమాడి ఒక బిడ్డ ఉండగా కూడా.. తనని, తన బిడ్డని నిర్లక్ష్యం చేసి..పర స్త్రీ ఆకర్షణలో.. ఇల్లు.. పరువు ప్రతిష్టలు ,ఆస్తులు..అన్నీ వదిలేసి వెళ్ళిన భర్త ని నిందించకుండా అందుకు కూడా.. తనే కారణం అని నిందించు కుంటుంది.ఒక సామాన్య  స్త్రీగా  భావించుకుని  జీవితాన్ని  రాజీ  మార్గంలో నడిపించుకుంటుంది . అందుకే   భర్త ఆమెని  క్షమాపణ కోరినప్పుడు.. " నేను భార్యగా..  మీ మనసు తెలుసుకుని మిమ్మల్ని సుఖ పెట్టలేకపోయాను.అందుకే మీరు.. ఆమెని కోరుకున్నారు  .. తప్పంతా..నాదే.." అంటూ.. నెపం ని తన మీద వేసుకుంటుంది.".. అలా ఎందుకు..ఆమెని ఆమే తక్కువ   చేసుకునే..విధంగా  అలాంటి సంభాషణలు పెట్టారు?  అని దాసరి గారిని అవకాశం లభిస్తే  ఎప్పుడైనా సరే.. అడగాలనుకునే దాన్ని.. అది పాత్ర  ఔచిత్యమని.. క్రమేపి సినిమాని అనేక సార్లు  చూసినప్పుడు అర్ధమైంది .  సహజంగా.. జయసుధ పాత్రని తీర్చి దిద్దిన ..దాసరికి.. హాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేము .



అలాగే జయప్రద  పాత్ర..  అర్ధం కావాలంటే.. ప్లేటోనిక్ లవ్.. గురించి తెలిసి ఉండాలి.  శారీరక సంబంధంయొక్క  ప్రమేయం లేకుండా.. ఒక కళ కో.. అభిరుచి కో.. భావసామీప్యం  ఉన్నందుకో.. ఇద్హరు వ్యక్తులు.. అది స్త్రీ -పురుషులు  కలసి జీవించడాన్ని సమాజం సరిగా అర్ధం చేసుకోదు.   అ..పోకడల్ని గమనించే.. దాసరి అ.. కధ లో.. చక్కని ముగింపు ఇచ్చారు. రవీంద్ర బాబు.. మళ్ళీ ఆమె దగ్గరకు.. వెళ్లి పోవాలనుకోవడం .. ఆమెనే కలవరిస్తూ.. ప్రాణాలు విడువడం.. పద్మకి..ఆ వార్త తెలియజేయడానికి.. వెళ్ళినప్పుడు..  రవీంద్రబాబు బావమరిదీ ఆమెని అమ్మా! ..అని సంభోదిస్తూ ..పిలవడం అ.. పాత్ర పై పెరిగిన గౌరవం అని  మనకి చెపుతుంది   రవీంద్ర బాబు మరణించాక  అది తెలియక ముందే..ఆమె మరణించడం..  శరీరాలు వేరే..కానీ.. ఆత్మ ఒక్కటే..  వారి ఆత్మలు కూడా.. కలిసాయి  అని చెప్పడం...ఎంత సహజాతిసహజంగా  ఒదిగిపోయింది . చివరి వరకు.. జయసుధ  పాత్ర పై ప్రేక్షకుడికి..సానుభూతి ఎక్కువ. ఆ.. సానుభూతి చెరిపేసి .. కళకి.. కళా హృదయాలకి  పట్టం కట్టారు దాసరి.
ఈ  చిత్రంలో.. నా.. అభిమాన పాత్ర.. జయసుధ. .. ఒక వాస్తవాన్ని.. ఎంత హుందాగా.. అంగీకరించి తన జీవితాన్ని కాల్చుకుని మరీ  భర్త మార్గాన్ని  సుగమం  చేసింది. కొన్ని వాస్తవాలని  గ్రహించి.. అందుకు అనుగుణం గా నడుచుకోవడం వల్ల  వేదనలు... ఉన్నా.. ఎవరో ఒకరు.. ఆనందంగా ఉంటె చాలు కదా! అని తలపోసింది. అందుకు తగినట్లుగానే ప్రవర్తించింది. ఈ..సినిమా గురించి.. మా ఫ్రెండ్స్  మద్య ఎప్పుడూ.. చర్చ నడుస్తూ ఉంటుంది . .ఎప్పుడూ.. నేను ఆ విషయమే  చెపుతాను.

ఈ.. చిత్రంలో.. అన్ని పాటలు..  అయిదు స్టార్ ..కోవ లోకే! అయినా.. నా ఫేవరేట్ "ముందు తెలిసినా ప్రభూ, ఆకాశ దేశాన .." అయితే   శీత వేళ కానీయకు కానీయకు..శిశిరానికి చోటీయకు ..అనే పాట మనకి చిత్రం లో..కనబడదు. ఇదండీ .. ఈ.. చిత్ర కధ లో.. నాకు నచ్చిన  అంశాలు. అందరు చూసిన చిత్రమే కావచ్చు .  ఎందుకో.. నాకు ఈ చిత్రం అంటే.. చాలా ఇష్టం. ఇలా.. మీతో..పంచుకోవాలనిపించి.. చెపుతున్నాను. చూసి చాలా కాలం అయింది. కధక్రమం తప్పిందేమో..కూడా! పాత్రలైతే  అలా నిలిచిపోయాయి.  పాత్రల స్వభావం చెప్పాను.. ప్రేమ ఎందుకు.. ఎప్పుడు   పుట్టకూడదో.. ఆలోచిస్తాను  అప్పుడప్పుడు.. ఇలా.. గే.. కాకుండా..   ముందు తెలిసినా  ప్రభూ .. పాటపై అమిత ఇష్టంతో .. దేవులపల్లి ని  గుర్తు చేసుకుంటూ..  కూడా ! ఎవరైనా.. మిత్రులు.. ఈ.. చిత్రం గురించి  చర్చించదల్చుకుంటే .. ఆహ్వానం. 

3, మే 2011, మంగళవారం

బాలచందర్ కోకిలమ్మ



అభిమానుల మనసులో ఉన్నఅభిమానమే..కళాకారులకి నిజమైన అవార్డులు-రివార్డులు...అని వేరే చెప్పక్కరలేకపోయినా..ఆయా రంగాలలో.. వారి ప్రతిభకి..తగిన విధంగా పురస్కారాన్ని ఇచ్చి..గౌరవించుకోవడం..సముచితం అనిపించుకుంటుంది.. చాలా ఆలస్యంగా.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ లభించిన కె.బాలచందర్ గారి..ని అభిమానించని..భారతీయుడు.. ఉండరేమో!
ప్రతిభకి గుర్తింపుగా  పురస్కారాలు లబించగానే.. తాము ఎంతో అభిమానించే..సాటిలేని మేటి వెలుగుల తారలకి  ఇన్నాళ్ళకు లభించిన పురస్కారానికి ..ఆనందం వెల్లువై ప్రవహిస్తూ.. అభిమానులు వారి ప్రతిభాపాటవాలని గుర్తుకు తెచ్చుకుంటారు.
  

బాలచందర్  అనగానే..ఉత్తమ అభిరుచి కల దర్శకుడు,నిర్మాత, రచయిత.. ఇంత మంది గుర్తుకు వస్తారు.. దక్షిణాది రాష్ట్రాలలో దర్శక అగ్రగణ్యుడు. నాకెప్పుడూ ఆయన చిత్రాలలోని ప్రతి ప్రేమ్ కూడా  చిత్రం  చూసిన చాలా ఏళ్ళ  తర్వాత కూడా .. ఆలోచింప జేస్తుంది.

.ఆయన చిత్రాలలోని  చాలా దృశ్యాలు..చాలా సహజంగా.. సాదాసీదాగా ఉంటాయి.. ఒక సందేశాన్ని.. ఆయన చిత్రాలలో.. సూటిగా చెప్పడాన్ని ఆశించలేం.. కేవలం దృశ్యాల  ద్వారానే, ఎక్కువ మాటలు లేకుండా సగటు ప్రేక్షకుడిని ఆలోచింప జేస్తూ కధను.. ముందుకు.. తీసుకు వెళతారు.. చెప్పాల్సింది.. మనకి అర్ధమైపోతుంది.. అలా.. నాకు అనిపించిన  చిత్రం.." కోకిలమ్మ"  ఆ చిత్రం నాకు ఎంత బాగా నచ్చిందో..! 1983  లో    ఆయనకీ  బెస్ట్ స్క్రీన్ ప్లే  చేసినందుకు గాను  ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డ్ ని అందుకున్నారు.


ఈ చిత్రం లో "సరిత" కోకిలమ్మగా.. ఎంత మంచి నటనను ప్రదర్శించారో! ఎవరు తోడు లేని ఒక పేద చెవిటి అమ్మాయి.. పదిళ్ళల్లో..  పనులు చేసుకుంటూ..వినబడకపోయినా.. తనని తిడుతూ ఉంటారని తెలిసి కూడా.. అందరి తిట్లుని.. భరిస్తూ..  అరవ చాకిరి  చేస్తూ.. జీవనం సాగిస్తూ..ఉంటుంది. తమ మధ్యే ఉంటూ బాగా చదువుకుని ఉద్యోగం దొరకక  బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ ఉండే.. రాజీవ్ తో పరిచయం..తో..ఆమె జీవితం మలుపు తిరుగుతుంది.

అతనిపై.. ఆకర్షణ లేదా ప్రేమ కన్నా కూడా..సానుభూతితో.. అతనితో..పరిచయం పెంచుకుంటుంది.  అతనికి సంగీతం పట్ల ఉన్నఆసక్తి గమనించి.. అతని కి..సంగీతం నేర్పించడానికి.. ఎంతో.. శ్రమిస్తుంది. సంగీతం నేర్చుకుని ఒక స్థాయికి చేరుకునేవరకు "కోకిలమ్మ" ని.. ప్రేమగా.. తనపట్ల కరుణ చూపిన దేవతలా భావించిన అతను..కొంత గుర్తింపు రాగానే.. డబ్బు అందం, కీర్తి ప్రతిష్టల మోహంలో..ఆమెను నిర్లక్ష్యం చేయడం..ఆమె తనకి తగినది కాదుగా భావించి..మొహం చాటేయడం.. నిగ్గదీసి అడిగినప్పుడు.. మంచి సంబంధం చూసి వేరొకరితో.. ఆమెకి ..పెళ్లి చేసి.. ఋణం తీర్చుకోవాలనుకోవడం అంతా.. మధ్యతరగతి మనస్తత్వాల అవకాశవాదాన్ని  ఎంత బాగా..సహజంగా.. చూపించారో!


అలాగే పని పాటలు చేసుకునే చదువు కోని . .పేద పిల్ల ఆత్మాభిమానాన్ని..ఎంత గొప్పగా చెప్పారో! ముఖ్యంగా  సంగీతం నేర్పించడానికి గురువు  ఉచితంగా చెప్పడం మాని..ఎక్కువ డబ్బు అడిగాడని మనం  తప్పుగా అనుకుంటాం. కానీ.. సంగీతం నేర్వటానికి  తగిన శ్రద్ధ, అర్హత అతనికి.. ఉన్నాయో..లేదో.. తెలుసుకోవడానికి.. ఒక పరీక్ష అని మనం అనుకోం..కానీ.. అతనిలో.. ఉన్న ఆసక్తిని.. గుర్తించి.. మంచి.. గాయకుడిగా తీర్చి దిద్దటం లో.. గురువు  శిష్యుడులో ఏమి అర్హతలు చూస్తాడో.. అన్నది.. తర్వాతగాని మనకి అవగతమవదు. అలాగే..  డబ్బు అవసరంలో..లారీ డ్రైవర్ దగ్గరకి  పనికి వెళ్ళినప్పుడు.. అతని..అంతరంగం గ్రహించి.. వాడిని ధైర్యంగా కొట్టి బయట పడిన ధైర్యం.. ఈ నాటి అబల లకి  ఏనాటికైనా కావాల్సిన లక్షణం. ఆపదలు ఎదురైనప్పుడు భయంతో.. వణకకుండా..తిరగబడి కొట్టడం  అనేది ఎంత సహజంగా రావాలి.


అలాగే.. ప్రేమించినవాడి  అవకాశవాదం అర్ధం చేసుకున్న  కోకిలమ్మ అతని మాటలు విన్నప్పుడు కల్గిన బాధని  జీర్ణించుకోలేక అతను కొనిచ్చిన వినికిడి యంత్రాన్ని సముద్రంలోకి విసిరివేసిన ఆవేదనా భరితమైన దృశ్యం ఎవరూ మర్చిపోలేరు. తనకి చిన్నపాటి పరిచయం ఉన్న అంగవైకల్యం ఉన్న పేదరాలు భర్త చనిపోయి బిడ్డతో..ఒంటరిగా.. భర్త చేసిన పనినే.. సినిమా వాల్పోస్ట్ లు అంటించడాన్ని  కష్టంగా ఒంటిచేత్తో చేస్తూ  కనబడినప్పుడు ఆమె  చేయి అందుకుని ఆమెకి తోడుగా నిలవడాన్ని ఎంత ఉదాత్తంగా చూపించారో..!

ఊరికి దూరంగా కొండపైన వాల్  పోస్ట్ లు  అంటించడానికి వెళుతున్నప్పుడు..కారు చెడిపోయి అవస్తపడుతున్న అతనికి..సాయం చేయమంటారా అని అడగటంలో ఉన్న అంతర్లీనంని.. అతను చెపుతున్నవేమి.. వినబడటం లేదన్న ఆమె మునుపటి రీతిని.. అర్ధం చేసుకుంటే ఆమెని, ఆమె కష్టాన్ని, ప్రేమని, నమ్మకాన్ని సోఫానాలుగా మార్చుకున్నఅతని తీరు ఎంత సిగ్గుచేటు. చదువుకుని అవకాశవాదంతో ఇతరులని ఉపయోగించుకునే నయవంచకులకన్నా   ఆత్మాభిమానంతో బ్రతుకుతూ పేదరికంలో కూడా ఇతరులకి అండగా నిలిచే దృడచిత్తమైన, ఉదాత్తమైన మనసు కల్గిన స్త్రీ మూర్తిగా.. కోకిలమ్మ పాత్ర  నాకు బాగా నచ్చుతుంది.


అలాగే ఒక సందేశం కూడా ఉంటుంది.. కష్టపడి ఉన్నత విలువతో బ్రతికేవాళ్ళు..ఎప్పుడూ.. ఉన్నతంగానే ఉంటారన్న దానికి సింబాలిక్ గా  కోకిలమ్మ కొండపైన ..వాల్పోస్ట్ లు అతికిస్తూ.. ఉంటుంది. హీరో రాజీవ్ మాత్రం  డబ్బు, అంతస్తు కీర్తిప్రతిష్టలు అన్ని సంపాదించి  కారులో ప్రయాణిస్తూ కిందికి వెళుతూ ఉంటాడు. మనిషిగా పతనమై కిందికి జారిపోతున్నట్లు ఆ..దృశ్యం  ఎంత బాగా గుర్తుకు వస్తుందో నాకు.

ఇక పాటలు విషయానికి వస్తే.. ఎమ్.ఎస్.విశ్వనాథన్ + ఆత్రేయ  మేలుకలయికలో.. బాలచందర్ గారి చిత్రాలలో.. ఎన్నో.. మంచి పాటలు. అంతులేనికధ, ఇది కథ కాదు, అందమైన అనుభవం, గుప్పెడుమనసు, తోలికొడికూసింది.. ఇలా చాలా చిత్రాలు. అన్ని సూపర్ హిట్..సాంగ్స్. ఈ చిత్రం లో..పాటలు అంతే! పల్లవించవా నా గొంతులో,ఎవ్వరో పాడారు భూపాలరాగం, నీలో..వలపుల సుగంధం,కొమ్మ మీద కోయిలమ్మ.. పోతే పోనీ.. అనే పాటలే కాకుండా  ఈ పాట శ్రీ వాణి (మధురం మధురం ) కూడా  చాలా మంచి పాట. సాహిత్యపరంగా.. మంచి పాట. నాకిష్టమైన పాట మీరు.. వినండి..

ఈ..చిత్రం చూసి చాలా ఏళ్ళు గడిచాయి.. అందుకే .. చిత్రంలో.. హీరో.. పేరు గుర్తు లేదు. చంద్రునికి..ఓ.. నూలు పోగులా.. బాలచందర్ గారి పై  అభిమానంతో.. ఈ.. కోకిలమ్మ చిత్రాన్ని..గుర్తుకు తెచ్చుకుని.. నాకు నచ్చిన అంశాన్ని వెల్లడించే ప్రయత్నం చేసాను. ఏదైనా తప్పులు ఉంటే మన్నిచండి.  మరొకసారి.. ఇంకో పాత్ర..గురించి..ముచ్చటించుకుందాం..బై ఫ్రెండ్స్..