రచనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రచనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, జులై 2025, సోమవారం

ప్రశ్నలు - సమాధానాలు

 నా రచనా వ్యాసంగం గురించి ఎవరైనా అడుగుతారా.. అనుకునేదాన్ని. 

“మా వంశీ “.. 

ఇలా ప్రశ్నలు సంధించారు. నేను చాలా సంతోషంగా నా సమాధానాలు ఇచ్చాను . 

ఆసక్తి  ఉంటే  మీరూ చదవండి.

************

వనజ తాతినేని - వనజ గారు - మ్హీఖు ఖొషెన్స్ వ్హేయ్హభడ్ఢవి - సమ్ధానం షెప్థే షెఫ్ఫంఢి ళేఖుంఠే మ్హీఖీ హిష్ఠం 


******

1.మీ కలం మాట్లాడగలిగితే, మీరు దానిని పుచ్చుకుని రాసిన కథల గురించి అది ఏమి చెబుతుంది?


1.జ) “ఇంత బరువైన కథలు రాయించావు ఏమిటి తల్లీ!? నీకు పురుష ద్వేషమా!?”

 అంటుంది.


2.రచయిత్రిగా మీకోసం మీరు కొన్ని రాస్తారు, అందులో సందేహం లేదు - మీకోసం మీరు రాసుకున్న వాటికి బయటి పాఠకుల కోసం రాసే వాటికి మీ రచనా స్వరం మార్పుకు లోనవుతుందా? ఒక వేళ లోనైతే ఎంత శాతం? ముప్ఫై శాతం, 40 శాతం, 60 శాతం, 90 శాతం? అలా ఏమీ లేదు, పాత్రలను బట్టి కథను బట్టి అన్ని కథలకు వేటి స్వరం వాటికే ఉంటుందని మీ అనుకోలా? 


2.జ) పాఠకుల కోసం రాసే కథలకు పది శాతం వరకూ నా రచనా స్వరం మారుతుంది. తప్పదు అది.


3.ఆధునిక కథలు చెప్పే మీరు పాత సాహిత్యం ఎంత చదివారు? విస్తృతంగానా? మధ్యస్థంగానా? అసలు ఏమీ చదవలేదా? 


2. జ) మధ్యస్థంగా చదివాను


4.మీరు తెలుగు సాహిత్యంలో ఒక కథను - అది మీదైనా, మీకు నచ్చిందైనా - తిరిగి వ్రాయగలిగితే, అది ఏమిటి? ఎందుకు?


4. జ) కలాపి (మన్నెం సింధు మాధురి రచన) అనే కథ నాకు నచ్చింది. అదే కథను నేను  తిరిగి రాస్తే  ఒక భారతీయ స్త్రీ ఏడుసార్లు విడాకులు ఇవ్వదు. విడాకులు ఇవ్వడం ద్వారా మాజీ భర్తల నుండి పొందిన భరణాన్ని బాధిత స్త్రీలకు ఉదారంగా పంచదు. భారతీయ సమాజంలో స్త్రీ ఒకసారి విడాకులిచ్చి రెండవ వివాహంలోకి అడుగుపెట్టడమే సాహసోపేత నిర్ణయం తెలివి తక్కువ ఆలోచన కూడా! ఇక సహజీవనం గురించి నేను మాట్లాడను. 


5.తెలుగు మహిళగా ఉండటం అనేది మీ కథా ఇతివృత్తాలను, మీలోని మహిళ ఎలా ప్రభావితం చేస్తుంది? ప్రేమించే అమ్మలానా? బాధలు పడే భార్యలానా? బేఫికర్ బాబమ్మ లానా? 


5.జ) ముందుగా నేనొక స్త్రీ ని.  నా కథా ఇతివృత్తాలన్నీ కాల్పనికం కాదు. కొన్ని కథలు నేను రాయకముందు రాసిన తర్వాత కూడా కల్లోల పడటం వాస్తవం. “లాస్ట్ మెసేజ్”, “రెండు లక్షలు”, “మాతృ హృదయం” కథలు నాకు పరిచితమైన స్త్రీల కథలే! “ ఔనా” కథ షాకింగ్ కథ. రాయడానికి సంకోచించాను. దశాబ్దం తర్వాత రాసాను. కథలు రాయడం పాఠకుల కొరకు కాబట్టి రచయితగా ఆలోచిస్తూనే..  సాటి మహిళగా సహానుభూతి ని ప్రదర్శిస్తూనే నిరసన స్వరాన్ని కొరడాలా ఝళిపిస్తాను. నేనెప్పుడూ ప్రేమించే అమ్మ నే. కథల్లోని పాత్రలను కూడా అమ్మ లాగానే ప్రేమిస్తాను.వీలైనంత వరకూ సరైన దారిలో నడపడానికి ప్రయత్నిస్తాను.


6.మీ జీవితం తెలుగు కథో, కవితో అయితే, దాని శీర్షిక ఏమిటి?


6.జ) జీవిత కథ 


7.మీ రచన యొక్క సారాంశాలకు ఏ తెలుగు పదం లేదా పదబంధం న్యాయం చేయగలదని మీరు అనుకుంటున్నారు?


7.జ) ఆక్రోశం


8.జీవితాన్ని తిరిగి రాయటం, అందులోని బాధల్ని ఎడాపెడా రాసి అసలే జీవితాలని బరువుగా లాగుతున్న మనుషుల మనసు మీదో, మేధ మీదో, హృదయం మీదో - ఒక మేరు పర్వతం బరువు చేసి  కుమ్మరించటం అనేది బాధ్యత గల రచయిత్రిగా ఎంత మటుకు సమర్థిస్తారు? 


8.జ) మూడు తరాల స్త్రీల వెతలు, గృహ హింస, అణచివేత చూసాను. స్వయంగా అనుభవించాను. నిత్యం చూస్తున్నాను. కోపం,ఆవేశం,ఆక్రోశం,బాధ ప్రకటించాలనిపిస్తుంది. పురుషులందరూ చెడ్డవారని నేను అనడం లేదు.బాధిత స్త్రీల కొరకు ఏదో చేయాలనే తపన నా చేత రాయిస్తుంది. నా కథలు బరువుగా వుంటాయి. ఒప్పుకుంటాను.నాకు హాస్యరసం వొలికించడం చేతకాదు. ప్చ్.. 


9.చరిత్రలో మీకు నచ్చిన ఒక తెలుగు మహిళా రచయిత్రి ఎవరు? ఎందుకు?


9) జ. ఓల్గా. ఎందుకు అంటే… నా పరిస్థితి ని బట్టి ఆమె రచనల వైపు ఆకర్షితురాలినయ్యాను.20 వ శతాబ్దంలో  స్త్రీల కొరకు ఆమె తన గళాన్ని బలంగా వినిపించారు. రచనలను కూడా బలంగా చెప్పగల్గారు.


10.మీ పుస్తకం మరొక భాషలోకి అనువదించబడాలన్న కోరిక మీకు ఉంటే ఈ క్రింది నాలుగు భాషల్లో ఏ భాషను ఎంచుకుంటారు?  - సవర భాష, భోజ్ పురి భాష, బెంగాలీ భాష, ఆంగ్లం. ఆ భాషే ఎందుకు?


10.జ) ఆంగ్లం. ప్రపంచ దేశాలకు మన తెలుగు  సాహిత్యం (కథ) ఏం ప్రతిబింబించింది అని తెలియాలని.


11.తెలుగు సాహిత్యం స్త్రీత్వం యొక్క సంక్లిష్టతలకు న్యాయం చేసిందని మీరు అనుకుంటున్నారా, లేదా? లేదనుకుంటే చేయవలసింది ఇంకా ఎంత ఉన్నది? ఒక ఇరవై శాతం, నలభై శాతం, వంద శాతం? 


11)జ. తెలుగు సాహిత్యం స్త్రీత్వం యెక్క సంక్లిష్టతలకు న్యాయం చేయలేదు. స్త్రీలకు ఆలోచించే శక్తి  సంపాదించే మార్గం, స్వేచ్ఛగా వుండే వాతావరణం లభించిందన్నమాటే కానీ ఇంకా సమస్యల వలయంలోకి నెట్టింది.చదువులు ఉద్యోగాలు ఉన్నాయన్న మాటే కానీ గౌరవం తగ్గింది.రక్షణ తగ్గింది. చాకిరీ హింస పెరిగాయి.కానీ పురుష దృష్టి ఇంకా మారలేదు. స్త్రీలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లా పరుగులు పెడుతుంటే  పురుష సమాజం పాస్ట్ పాసింజర్ లా నడుస్తుంది. కుడి ఎడమ స్త్రీ పురుషుడు మధ్య తేడా కచ్చితంగా వుంటుంది. అలాగే స్త్రీ పురుషుల మధ్య కూడా! ఇరువురి మధ్య అవగాహన వుంటే తప్ప కలిసి మనుగడ సాగించలేరు.  ఆర్థిక స్వేచ్ఛ వచ్చింది.విడాకులు ఎక్కువయ్యాయి. కుటుంబం కూలిపోయి ఒంటరితనం చిరునామా అయింది. సాహిత్యం మనిషికి హితం కల్గించాలి.మనుషులను విడదీయకూడదు. సాహిత్యం చేయవలసినది చాలా వుంది.


12.మీరు రాయడం ప్రారంభించినప్పుడు ఎవరైనా మీకు ఇచ్చిన సలహా ఏమిటి?


12.జ) మా ఇంటి పురుషులు  నేను రాయడాన్ని ఇష్టపడలేదు కానీ స్త్రీలందరూ రాయమని ప్రోత్సాహం అందించారు. మా అత్తమ్మ నా ప్రతి రచన చదువుతారు. వ్రాసిన విషయాలను చెప్పిన తీరును మెచ్చుకుంటారు. ఆమె అనుభవాలను సూక్ష్మంగా విప్పి చెబుతారు. కొత్త విషయాలను అందిస్తారు. 


13.మీరు ఇప్పటికిప్పుడు భవిష్యత్తు తరం (అనగా ఒక ముప్ఫై ఏళ్ళ తర్వాతి) తెలుగు మహిళా రచయిత్రులకు లేఖ రాయగలిగితే, అది ఏమి చెబుతుంది? వాళ్ళకు తెలుగు వస్తుందో లేదో, అప్పటికి తెలుగు భాష బతికి ఉంటుందో లేదో అన్న గోడ మీది లౌక్య వాక్యాలు చెప్పొద్దు. మీరు ఇప్పుడు వాళ్ళకు ఏం చెప్తారు? అంతే! 


13.జ) “మీరు పూర్తిగా కాల్పనిక కథలు రాయండి. ఇష్టపడితే  పాఠకులు చదువుతారు.లేదా మీ అనుభవాలను బట్టి ఇతరుల అనుభవాలను విని వాటిని బట్టి సమన్వయంతో రాయండి.  మీ అనుభూతులను రాయండి అంతే  తప్ప కమర్షియల్ రైటర్ ఫేమస్ రైటర్ అనిపించుకోవడానికి నానా రకాల చెత్తను పైత్యాన్ని నింపి పాఠకుల పైకి విసరవద్దు. కత్తి కన్నా కలం పదునైంది. భావ వ్యాప్తి సమాజాన్ని పెడదారి పట్టిస్తుంది”. అని.


14.మీ రచనల్లో ఒక రచన ఆధారంగా ఒక తెలుగు సినిమా తీస్తే, అందులో విలన్ రమ్యకృష్ణ అయితే, మీరు ఆ విలన్ క్యారెక్టరుకు ఇచ్చే ఊతపదం ఏమిటి? 


14. జ) మైండ్ దొబ్బిందా లేక పైత్యం పెరిగిందా!? 


15.మీరు మీ రచనా శైలిని ఒక తెలుగు వంటకంగా వర్ణించగలిగితే, అది పులిహోర అవుతుందా? తీపి బొబ్బట్టు అవుతుందా? కళ్ళనీళ్ళు తెప్పించే ఉల్లిపాయ అవుతుందా? పానీపురీ అవుతుందా? ఇంకేదన్నానా? 


15.జ) వెల్లుల్లి కారం కూరిన కాకరకాయ 


16.రచయిత్రిగా, మామూలు మనిషిగా మీకు ఏయే భావోద్వేగాలు ఇష్టం (విడివిడిగా. రచయిత్రి మనిషి రెండూ ఒకటే అయితే అప్పుడు ఆ ఉద్వేగం ఏమిటి?) 

 

16.జ) నేను రచయిత్రి గానూ మాములు మనిషి గానూ రెండూ ఒకటే!  నన్ను చలింపజేసేవి  ప్రేమ దుఃఖం.ఇవి రెండూ సమానస్థాయి లో వుంటాయి. కరుణ ఆర్ద్రత నన్నంటి పెట్టుకుని వుంటాయి. కోపం తాటాకు మంట. దృఢత్వాన్ని (కఠినంగా) కలిగి వుండటానికి నేను సాధన చేస్తాను. (ఇది రహస్యం)😊👍 


17.మీ పాత్రలు మీతో తిరిగి మాట్లాడగలిగితే, వారి పాత్రల కర్మ గురించి, విధి గురించి, నా పాత్ర ఇలా తీర్చిదిద్దారేమి అని ఏ పాత్ర ఎక్కువగా ఫిర్యాదు చేస్తుంది అని మీరనుకుంటున్నారు?


17) జ. “ఇంటి పేరు” కథ లో “సువర్ణ” లాస్ట్ మెసేజ్” కథ లో “ధాన్యమాలి”.  సువర్ణ కథలో ధీర. నిజ జీవితంలో పలాయనవాది. “ధాన్యమాలి” ఇంత బోల్డ్ గా ఎలా రాసావు? నన్ను నడిరోడ్డుపై సిగ్గు శరం మానాభిమానాలు  ఒదిలేసిన స్త్రీగా నిలబెట్టావు. రచయిత బాధ్యత మరిచావా?  అని నన్ను నిలదీసాయి. అప్పటినుండి బుద్దిగా తెలివిగా రాస్తాను. 


18.మీరు రాతలు ఎక్కువగా రాసే సమయం ఏది? పొద్దు పొద్దున్నే, మిట్టమధ్యాహ్నం, సాయంత్రం, ఊళల అర్థరాత్రి? ఎందుకు? 

  

18.జ)ఏదో చెప్పాలని తపన పడ్డప్పుడు మాత్రం అర్థ రాత్రి సమయంలోకూర్చుని రాసేస్తాను, ఎక్కువగా తెల్లవారుజామున రాస్తుంటాను. 



19.మీరు మీ రైటింగ్ డెస్క్‌కు కానీ ల్యాప్ టాపుకు పేరు పెట్టవలసి వస్తే, మీరు దానికి ఏ తెలుగు పేరు పెడతారు?


19.జ) అక్షర మాత 


మాగంటి వంశీ మోహన్ గారికి ధన్యవాదాలు. 🙏 20/07/2025




1, మార్చి 2025, శనివారం

నువ్వు - నేనూ -కనకాంబరం



 నువ్వు నేనూ - ఓ కనకాంబరం.   -వనజ తాతినేని


“సావేరి”  నేనొక స్వర విపంచిని. 


పాట వినిపించే మానసిక స్థితి కాదు నాది. పోనీ, కథ చెప్ప మంటారా! కథ కేమి తక్కువ!? బ్రతుకు కథ చెబుతాను, వేయి కథలతో పాటు.


ఒక్కో కథకి మూలం ఒక్కోలా ఉంటుంది. నా కథ మూలం ఎందరో స్త్రీల కథ లాంటిదే! ఇంకాస్త విభిన్నంగా ఎందుకు లేదూ.. అనే ఆరోపణ నాక్కూడా వుంది. 


నెలాఖరు రోజులు. చేతిలో పైసలు నిండుకున్నాయి.  ఎవరికీ యెప్పుడూ కూడా మనసు విప్పి చెప్పుకోలేని  మొహమాటం లాగానే అప్పు అడగలేని మొహమాటం. మూడు నెలల అద్దె బకాయి. డ్యూటీ చార్ట్ ఖరారు కాకముందే ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ దగ్గరకు వెళ్ళి తరువాత నెలలో ఆఖరి వారంలో తన షో స్ వుండేలా చూడమని రిక్వెస్ట్ చేసాను. అతను దయతలిస్తే  కాస్త ఊపిరి పీల్చుకున్నాను. పిల్లను తీసుకుని హైదరాబాద్ పయనమయ్యాను. అక్క దగ్గర అతిథిగా కొన్నాళ్ళు  వుండి కొన్ని జింగిల్స్ చేయాలి. రాసి రికార్డ్ చేసుకున్న జావళి లు వినిపించి ఏదైనా ఛానల్ లో అవకాశం కోసం ట్రై చేయాలి. అదృష్టం కలిసొస్తే యేదైనా అవకాశం లభిస్తే ఈ ఎఫ్ యెమ్ ను వదిలేయాలి. అంతకన్నా ముందు భర్త నుండి విడాకులు తీసుకోవాలి, అక్క మహిళా కోర్టు జడ్జి గా చేస్తుంది. ఆమె సాయం వుండనే వుంటుంది అనుకున్నాను. కొన్ని అనుకున్నట్టే అవుతాయి. ముఖ్యమైనవి తప్ప. 


వచ్చిన రెండు రోజుల తర్వాత అక్కను విడాకులకు అప్లై చేస్తానని అడిగాను. అక్క యేమీ మాట్లాడకపోవడం బాధ కల్గించింది.కాస్త వివరంగా చెప్పాను.


“అతన్ని భరించడం చాలా కష్టంగా వుంది. ఎప్పుడెక్కడ వుంటాడో  అసలు ఆఫీస్ కి వెళతాడో లేదో తెలియదు. పాప నేసుకుని వెళ్ళి షో చెయ్యడం కష్టంగా వుంది. ఆ జాబ్ చెయ్యకపోతే యింటి ఖర్చులకు కూడా డబ్బులుండవు. జెరాక్స్ సెంటర్ కూడా మూసేయక తప్పలేదు. షట్టర్ తెరిస్తే అప్పుల వాళ్ళ తాకిడితో మెదడు మొద్దుబారిపోతుంది. మూడేళ్ల నుండి యిదే వరుస. అవన్నీ వొకెత్తు.  అతను యింటికొస్తే యింకో నరకం. నోటితీట, జుగుప్సాకరమైన మాటలు,చేతలు భరించలేకున్నాను అక్కా!” మనసులో బాధను  కళ్ళనీళ్ళతో  గుమ్మరించాను.


“కారణాలు గట్టిగానే వున్నాయి. కానీ విడాకులు వరకూ వెళ్ళే ముందు యింకోసారి గట్టిగా ఆలోచించు చెల్లీ!  పిల్లదానికి తండ్రి అనేవాడు వుండాలి కదా” అంది. 


“ఇంకెప్పుడూ అక్కతో కష్టాలు చెప్పుకోకూడదు” దృఢంగా అనుకున్నాను. ఫ్రెండ్స్ సహకారంతో అవకాశాల కోసం ప్రయత్నించాను.రెండు జింగిల్స్ చేసి కొంత డబ్బు చేతికందాక పర్వాలేదు, ఈ మాత్రం ప్రోత్సాహం వుంటే లైఫ్ లాగించేయవచ్చుననే ఆశ వేళ్ళూనుకుంది. . 


 “పిల్లకు నీకూ పండుగ కి బట్టలు కొనుక్కో”  అని చేతికి పదివేలు యిచ్చింది అక్క. 


“వద్దక్కా! యిప్పటికే నీకు చాలా రుణపడి పోయాను” అని సున్నితంగా తిరస్కరించాను. 


 “తోడబుట్టిన వాళ్ల మధ్య రుణం అనే మాటలుంటాయటే” అని మందలించింది.తర్వాత నేను చూడకుండా యింకొంత కలిపి నా బ్యాగ్ లో పెట్టింది.


బస్ యెక్కించడానికి అక్క బావ యిద్దరూ వచ్చారు.  కదలబోతున్న బస్ యెక్కేముందు “అక్కా, బావ గారూ! మీ యిద్దరిని వొక మాట అడగనా?”


“చెప్పమ్మా సావేరి, ఏ హెల్ప్ కావాలన్నా నిస్సంకోచంగా అడుగు” మాటిచ్చాడు బావ. 


“నాకేదైనా జరిగితే నా పాపను చూస్తారు కదూ!” సమాధానం కోసం చూడకుండా బస్ యెక్కేసింది. వాళ్ళిద్దరి చూపుల్లో దిగులు వీడ్కోలు బాధలో మిళితమైంది.


**********

జీవితంలో అన్ని రోజులు ఒకేలా వుండవు. జీవితాన్ని మలుపు తిప్పే పరిచయాలు జురుగుతుంటాయి. అప్పటికి అది మాములు పరిచయమే ! ఆ రోజు   ఎఫ్ ఎమ్ లైవ్ లో వుంది. నానారకాల పైత్యాలు భరించిన తర్వాత అతని కాల్. 


“నా పేరు శ్రీకాంత్! “

 

“నైస్!  ఇంకొంచెం చెప్పండి మీ గురించి?”


“నౌ ఐ యామ్ ట్వంటీ యెయిట్.  సినిమాలు అమ్మాయిలు చాట్స్  ప్రేమలు పిక్నిక్ స్పాట్స్  ఫ్రెండ్స్ తో వీకెండ్ పార్టీలు అన్నీ రొటీనైపోయి లైఫ్ బోర్ కొట్టేసింది. నన్ను యెప్పుడూ విడిచిపెట్టనిది పాట వొక్కటే, పాట నా చేతివెన్నముద్ద.  ప్రస్తుతానికి దాన్నే పట్టుకుని వేలాడుతున్నాను. మీ స్వరం మీరు ప్లే చేసే పాటలు చాలా బాగుంటాయి.”


“పాట పట్టుకుని వేలాడుతూ వుండటానికి కూడా ఇంకేదో పట్టుకుని వేలాడాలి కదా! అదేంటో చెప్పే సేయండీ”


“చెప్పాలంటారా, చెప్పక తప్పదంటారా?”

 

“బలవంతం ఏమీ లేదు, fm యెవరు వింటున్నారు అనే సర్వే కోసం అనుకుని చెప్పేస్తే వొక పనై పోతుంది”అని హింట్ పాస్ చేసింది. 


“సాఫ్ట్ వేర్ అన్నాననుకోండి” అన్నాడతను. 


“ఓకే.. ఓకే. మీకిష్టమైన పాట చెప్పండి?”


 “కీరవాణి  ప్రణయమా! ప్లే చేయండి.”


“ ఓ! మీది 90’ స్ టేస్ట్ అన్నమాట, మీరు  కొంచెం పాడవచ్చు కదా! “


అడగడమే తడవు అతను  పాట అందుకున్నాడు. విబ్రాంతి గా వింటూ అనుకున్నాను. 


“పాడమని అడిగితే తన ప్రాణాన్ని పాటలో నింపే వాడితను. పాట సాహిత్యానికి జీవం పోసేవాడితను అని.”


ఆ తర్వాత రెండు రెండురోజుల పాటు అతని పాట మెదడులో గింగిరాలు తిరుగుతూనే వుంది.


ఇంకోరోజు.. అతనే! పాట తోనే  పలకరింపు. 


“నీవే అమర స్వరమే సాగే శృతిని నేనే” అంటూ. పాట కోసం యెవరూ ఫోన్ చేయరు. మీతో మాట్లాడటానికే చేస్తారు” అన్నాడు.


అలా అన్న అతను రుజువు చేయడానికే అన్నట్టు నిత్యం నా షో కి మాత్రమే కాల్ చేసేవాడు. మిడ్ నైట్ కి గంట ముందు యెండ్ అయ్యే షో కి కాల్ చేసినపుడు సంభాషణల్లో డిన్నర్ గురించి ప్రస్తావన. 


“మీకేం, మీరు హాయిగా తినేసి రిలాక్స్ అవుతూ కాల్ చేస్తున్నారు. నేను యింటికి వెళ్ళి వొండుకుని తినాలి” అంది. 


సైన్ ఆఫ్ చేసి  బయటికి వచ్చి పార్కింగ్ వైపుకు వెళ్ళబోతుండగా  “సావేరి  మేడమ్!” అని గట్టిగా పిలిచాడో వ్యక్తి.  అప్రయత్నంగా తల తిప్పి చూసింది. 


అతను వేగంగా  సమీపించి “మీరు వెజ్ ఆర్ నాన్ వెజ్ ? “


చిరాకుపడి “మీరెవరు? అసలు ఆ విషయం మీకెందుకు?”


“ఇప్పుడు యింటికి వెళ్ళి యేం వొండుకొని తింటారు లెండి. వెజ్ అయితే ఇది తీసుకోండి నాన్ వెజ్ అయితే ఇది తీసుకోండి” చేతులు రెండూ చాచి చూపుతూ అన్నాడు. 


“ఆర్ యు శ్రీకాంత్!” ఆశ్చర్యంగా అడిగింది. 


“యెస్ మేమ్. తప్పుగా అనుకోకండి. ఆకలి తో యెవరున్నా  యిలాగే పుడ్ అందిస్తాను. ఆకలి యెలా వుంటుందో నాకూ బాగా తెలుసు గనుక.”  ఈ సారి అతను చూపుల్తో   స్నేహ సేతువు కడుతున్నాడు 


 ఏవో పాజిటివ్ వైబ్స్. అతని చేతిలో వెజ్  పేకింగ్ ని అందుకుని థ్యాంక్స్ చెప్పింది. ఆ అందుకునే క్రమంలో అతని చేతివేళ్లు తగిలి మనసు ముట్టుకున్నట్టు అనిపించింది. 



“ఏంటి విశేషం? కొందరు నీ షో కి మాత్రమే కాల్ చేస్తారు. వారికి ఏం మంత్రదండం వేసావ్” అని నవ్వుతూ కో ఆర్జేస్  అడిగినా అందులో  కనబడని ఓ వెక్కిరింత ఈర్ష్య కలగాపులగంగా వుండేవి. 


“అదేంలేదు, ఏదో పాటల టేస్ట్. అంతే!”


నిజంగా అప్పటికి అంతే! ముందు ముందు ఏం కాబోతుందో నాకు మాత్రం ఏం తెలుసు? 

విధి వల్లనో వరం లాగానో ప్రేమ దేవతల కరుణ వల్లనో నాకు తారసపడ్డాడు.


అతను కాల్ చేయగానే.. ఎందుకో నా కళ్ళలో మెరుపు. పెదవి పై లేనగవు అంకురిస్తూ వుంటుంది. 


అనేక చికాకులు సమస్యల్లో వున్న  నాకు అతని పరిచయం నచ్చింది. నా బాధల గురించి మర్చిపోయే వెసులుబాటు నిచ్చింది. అతని ఆలోచన రిలీఫ్  నిచ్చింది. పర్సనల్ ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకోవడం జరిగిపోయింది. ఫ్లూట్ ప్లేయర్ రాజేష్ చేర్తాల, శాక్సోఫోన్ లిపిక సమంతా ని వారి స్వరనాదాల తీయదనాన్ని  పరిచయం చేసింది  అతనే!  ఎన్నో కబుర్లు, క్లాసికల్ మ్యూజిక్, పుస్తకాలు గురించి అతని మాటల్లో అవలీలగా దొర్లిపోయేవి. అతని నేపథ్యం సంగీతసాహిత్యంతో ముడిపడి ఉందని అర్ధమైంది. అప్పుడప్పుడు ఏ పార్క్ లోనో బీచ్ లోనో కలవడం. సరదా కబుర్లు. లిరిక్స్, స్క్రిప్టులు ఇచ్చిపుచ్చుకోవడం. ఇద్దరం కలసి  కొన్ని పాటలు రికార్డ్ చేసాము. 


అతనొక ప్రేమ సముద్రం. ఒడ్డున వున్న రాయిలాంటి నన్ను  అలల కళ్ళతోనే  నిలువెల్లా సృశిస్తుంటే తడిసి ముద్దై  సజీవంగా మారినట్లు వుంది. మదిలోకి   చొరబడుతుంటే టక్కరిగా  ఓరగా తలుపు తీసి మూసి దాగుడుమూతలు ఆడింది.వమూసిన కిటికీ తలుపులపై వాన తన మృదువైన స్పర్శతో సంతకం చేసినట్లు అతని గుండె గుసగుస నా గుండె వరకూ చేరింది. 


ఏకాంతమున నేల యెదురైతినే తనకు

లోకాధిపతికేల లోనైతినే

చేకొనిదె మన్నించె శేషాద్రివల్లభుడు

పైకొనిదె మమ్మేల పాలించెనే - పదే పదే పాడుకున్నాను.


మనసు ముట్టుకున్నవాడు బాహ్యంగా దూరంగా ఎలా వుంటాడు?  

అటుఇటూ తేల్చుకోలేక ఊగిసలాడాను. మధనపడ్డాను. బిడ్డ తల్లిని కదా..  నేను అని నాలుగునాళ్ళు ఊగిసలాడాను. ఆఖరికి సందేహాన్ని జయించాను. 


“ఉత్తమ వ్య క్తినించివొచ్చే వున్నత ప్రేమ మన జీవనానికి పరమ అవసరము, మకుటము అని చలం అనలేదూ”  ఆహ్వానించకపోవడం తప్పు కదూ! నా మోహ గిరి అతను.  వశం తప్పుతున్న శరీరానికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాను. 


మంచులా గడ్డకట్టిన నా దేహం కరగడం మొదలైంది. జడము చైతన్యంతో కలిసి ప్రవహించిది. ఆ కలయిక కు పారిభాషిక పదజాలం ఏమిటి? నువ్వు నా స్వైరిణి వి అన్నాడు అతను. ఉలికిపడ్డాను. నిజమే కదా! అతనితో అనుభవం నా జీవితానికో వరం. 


అతను ఏ పని చేసినా మనఃస్పూర్తిగా అంకితభావంతో చేస్తాడు. పాపాయి కి పాలు పట్టడం ముక్కు తుడవడం డైపర్ మార్చడంతో సహా. ఆల్కాహాల్ మానేయమని అడిగాను.. మారుమాటాడకుండా వదిలేసాడు. అంతే! తనను పూర్తిగా అతనికి వదిలేసుకుంది.


మూడు నెలలు సెలవు పెట్టేసింది. ముందుకు అడుగు వేసింది. అతని తల్లి నివాసముంటున్న ఇంటికి తీసుకువెళ్లాడు. కోనసీమ లో ఓ పల్లెటూరు.  అప్పుడు ఆమె  కలకత్తాలో వుంది అని చెప్పాడు. ఆ ఇల్లు గోదావరీ తీరం లో వుంది. గ్రంథాలయంలా పూలవనంలా చిత్రకళా కుటీరంలా  వుంది. “ఎంతో రసికుడు దేవుడు ఎన్ని పూవులెన్ని సొగసులిచ్చేడు” పాట పదే పదే పాడుకున్నాను. 


అది మండు వేసవి. ఆ మూడ్నెల్ల  కాలం ఎలా గడిచిందో చెప్పలేను. నా జీవితంలో గడిపిన అత్యద్భుత కాలం అది. ఏటిలో పడవ ప్రయాణం లా భావగీతంలా సాగిపోతుంది. అతనొక ప్రేమ ప్రవాహం. రేపటి గురించి ఆలోచన లేదు భయం లేదు. స్వేచ్ఛగా హాయిగా కలసి పాడుకుంటూ ఆడుకుంటూ వంట చేసుకుంటూ పిల్లదాన్ని అపురూపంగా పెంచుకుంటూ. 


నల్లగా నిగనిగలాడే (ఆకుపచ్చ ) తోటలో అనేక రంగురంగుల కనకాంబరాలు.  ఆ రంగులంటే అతనికిష్టమట. పొద్దున్నే పూసి సాయంత్రానికి రాలే పువ్వులు కావవి. తీయని మకరందంతో విరాజిల్లుతూ తుమ్మెదలను ఆకర్షిస్తాయి అని చెప్పాడు. పాపాయి ని ఆ పూలతోటలో నిలుచుండబెట్టి పదుల సంఖ్యలో ఫోటోలు తీసాడు. దాన్ని గుండెలకు హత్తుకుని నువ్వు నా కనకాంబరానివి అనేవాడు. ఈర్ష్య గా చూస్తున్న నన్ను హత్తుకుని నువ్వూ నా కనకాంబరానివే! అనేవాడు ఆకాశాన్ని చూపిస్తూ.కాలం అలా స్తంభించిపోతే బాగుండును అని పదే పదే అనిపించేది కూడా! 



“సావేరి, పాపను ఎవరికీ ఇవ్వవద్దు. మన దగ్గరే వుంటుంది. అమ్మకు అంతా చెప్పాను. అభ్యంతరం చెప్పలేదు. మనం ఇక్కడే వుండిపోదాం. సిటీ కి వెళ్ళవద్దు” అని పదే పదే అనేవాడు. 


 ఇతను ఎల్లప్పుడూ ఇదే ప్రేమ ఇవ్వగలడా? అన్న అనుమానం కల్గేది నాలో. మళ్లీ అంతలోనే ఛీ! నేను తప్పుగా ఆలోచిస్తున్నాను అని మొట్టికాయలు వేసుకొనేదాన్ని. “అయినా ఈ నగ్నదేహాల బిగింపుల బలమెంతో కాలమే చెప్పాలి” అని అనేక సంశయాలతో అనుకున్నాను.  అయినా నాకు యిదే కావాలి అదొద్దు అనడానికి మనమెవరం ? నాకిపుడు ఇది ఇలా జరగాలని రాసి పెట్టి వుంది కాబోలు అనుకునేదాన్ని. 


కాలం అలా గడిచిపోతే ఎలా? ఆడియో సంభాషణలతో సరిపెడుతున్న నన్ను వీడియో కాల్ చేయమని బలవంతపెట్టసాగింది అక్క.  నేను ఏదో కుంటిసాకులతో దాటేసేదాన్ని. ఆమెకేదో అనుమానం పొడచూపింది. ఆరా తీయడం మొదలెట్టింది. వచ్చి చూస్తే  ఖాళీ ఇల్లు వెక్కిరించింది. కొలీగ్స్ ని ఆరాతీసారు. ఎలాగైతేనేం మా ఆచూకీ కనుక్కొన్నారు. రెండు కార్లలో మేమున్న ఇంటికి వచ్చి పడ్డారు.


అప్పుడు శ్రీకాంత్ ప్రక్కనే వున్న టౌన్ కు వెళ్లాడు. అది వాళ్ళకు అనుకూలంగా మారింది.


“చూస్తూ కూర్చుంటే యేకు మేకు అవుతుంది మేకు బాకవుతుంది” అంది అక్క. 


బావ గారు “ఇదేం పని అమ్మా! ఫలానా జడ్జి చెల్లెలు ఇలా చేసింది అంట అని చెప్పుకుంటుంటే  మీ అక్క కు ఎంత అవమానం? పరువు తక్కువ?“ అన్నారు. 


“జీవితాన్ని ఆస్వాదించడానికి అనుభవించడానికి అనుభూతి చెందడానికి సరైన జోడి కావాలి. వయస్సు రాగానే ఎవరినో వొకరిని  చూసి ముడి పెట్టేసి చేతులు దులుపుకుంటారు. కనీస అభిరుచులు కూడా కలవకుండా శరీరాలు మాత్రమే కలుస్తూ మనసులు యుద్ధాలు చేస్తూ నిత్యం నటిస్తూ రోజులు గడుపుతారు. కాబట్టే.. ఆ జీవితం నిస్పృహ గా మారింది. దానికి తోడు ప్రేమరాహిత్యం, అతగాడి వ్యసనాలు, ఆర్థిక పరిస్థితులు, అప్పులు, బాధ్యతలు నా జీవితాన్ని నరకం చేసాయి”  అని గట్టిగానే చెప్పాలనుకున్నాను. కానీ గొంతు పెగల్లేదు. 


ఎలాగో నోరు విప్పి “నాకు నచ్చిన పని నేను చేసాను. అతను నాకు వద్దు. విడాకులకు అప్లై చేస్తాను.”


“అలాగే! విడాకులు తీసుకున్న తర్వాత అతన్ని పెళ్ళి చేసుకుందువు. అప్పటి వరకూ నా దగ్గర వుందువు గాని వచ్చేయ్” అంటే  అక్కను నమ్మి వారి వెంట వచ్చేసాను. 


అక్కడికి చేరుకున్నాక  ఇరువైపు పెద్దలూ చేరి  చూపుల చురకత్తులతో మాటల గునపాలతో గుచ్చి గుచ్చి చంపారు. నీకు వాడే కావాలి అనుకుంటే  పిల్లను వొదిలేసి వెళ్ళిపొమ్మని పిల్లను లాక్కుని రెండు రోజులు కనబడనీయకుండా చేసారు.  


“పాప కావాలా? శ్రీకాంత్ కావాలా!? అంటే ఏం చెబుతాను.” నిస్సహాయంగా చూస్తూ వుండిపోయాను. ఈ లోపు ఎక్కడ వున్నాడో తెలియని భర్తను వెతికి పట్టుకొచ్చి ఇంటికి వొంటికి కాపలా పెట్టారు.  శ్రీకాంత్ ని కలవనీయకుండా మాట్లాడకుండా విశ్వాసం కల కుక్కలా అనుక్షణం కనిపెట్టి అనుసరించే వుండేవాడతను. అత్తమామలు సైనికుల్లా కాపలా. తన చేతిలో ఫోన్ అనేది లేకుండా చేసి గృహ ఖైదు చేసేసారు. శ్రీకాంత్ రెండు రోజులు ఇంటి చుట్టూ తిరిగాడు. అక్క కంప్లైంట్ చేసింది. అతన్ని పోలీసులు తీసుకు వెళ్ళారు. ఏం జరిగిందో తెలియదు. అలజడి,భయం,ఏవో పీడకలలు. ఇంట్లో గుసగుసలు. అతని గురించి ఆందోళన.తిండి లేదు, నిద్ర లేదు.  


ఎలాగోలా వాళ్ళ కళ్ళుగప్పి పక్కింటి అమ్మాయి నడిగి ఫోన్  తెప్పించుకుని రహస్యంగా శ్రీకాంత్ కి ఫోన్ చేసాను. ఇంట్లోనే వున్నాడు. ఎంత చిక్కిపోయాడో! అంత నిరాశగా వున్నాడు. 

.

“సావేరీ! పాపను తీసుకుని వెంటనే వచ్చెయ్, విడాకుల సంగతి తర్వాత చూసుకుందాం” గొంతు రుద్దమై  మాట కన్నీటి మడుగులో చేప పిల్లలా ఈదులాడింది. 


 “రాలేనేమో శ్రీ” అన్న నా మాట విని ధారగా  కన్నీరు కార్చాడు. అతన్ని ఓదార్చడం నా వల్ల కాలేదు.

 “శ్రీ! ఇప్పుడు నేను నీ ప్రేయసిని కాదు,ఆ నాటి స్వరఝరి ని కాదు. పరాజయ కంఠధ్వని మాత్రమే! ఓ బిడ్డకు తల్లిని మాత్రమే!  కుటుంబ గౌరవాన్ని కాపాడే బానిసని మాత్రమే! నన్ను అర్థం చేసుకో! ప్లీజ్!”


“నాకు రెండు నాల్కలు, రెండు గుండెలు, రెండు జీవితాలు లేవు సావేరి.  వసంతంలో పుట్టి శిశిరంలో రాలిపోయేది కాదు నా ప్రేమ. నేను రాలిపోవడమే తప్ప!”


“నీకేమైనా పిచ్చిపట్టిందా! లేక  బ్లాక్ మెయిల్ చేస్తున్నావా ? నన్ను మర్చిపొమ్మని చెబుతున్నాను కదా!” అరిచేసాను. 


అవతల ఫోన్ పగిలిపోయిన శబ్దం. 


“ప్రయత్నిస్తాను అని కూడా తాను ఎందుకు చెప్పలేకపోయింది? అంటే  ప్రయత్నించడం లేదనే కదా! ప్రశ్న ప్రశ్నించింది. అపరాధభావంతో  ఓ నిట్టూర్పు విడిచాను. ఆలోచించడం మొదలెట్టాను. పాపతో సహా  వెళ్ళిపోవడానికి మార్గాలు వెతకసాగాను.


వారం రోజులు గడిచాయేమో! ఆడదాన్ని తిరస్కారాన్ని మగవాడు భరించలేడు. మొగుడైతే మరీనూ. ఆ మొగుడనే వాడు  నన్ను తన దారిలోకి తెచ్చుకో ప్రయత్నం చేసాడు. అతన్ని దూరంగా  నెట్టి కచ్చితంగా చెప్పాను.


“మనం భార్య భర్త  అన్న గీత దాటిపోయింది. ఎవరి సరదాలు సుఖాలు సంతోషాలు  వారివి గా  మారిపోయాయి. నలుగురు స్త్రీలతో నాకు అక్రమ సంబంధం వుండొచ్చు కానీ నువ్వు మాత్రం నాకు ప్రతివతా శిరోమణి  అయిన భార్య గానే వుండాలి అంటే  కుదరదు. అసలు నీతో జీవితం కొనసాగించాలంటేనే నాకసహ్యమేస్తుంది.  విడాకులు కావాలి. ఇచ్చేయ్!” అని అరిచాను. 


జుట్టు పట్టుకుని ఈడ్చాడు. విచక్షణా రహితంగా కొట్టాడు. అసహ్యంగా తిట్టాడు. భరిస్తూనే మొండిగా చెప్పాను.


“నేను అతనితో గడిపిన రోజుల్లో పొందిన ప్రేమ ఆనందం సంతోషం  నీతో గడిపిన మూడేళ్ళ లో  వీసమెత్తు కూడా దక్కలేదు. మన ఇద్దరికీ  ఏ విధంగానూ సరిపోదు. నన్ను వదిలేయ్ ప్లీజ్!” వేడుకున్నాను కూడా!. 


అయినా వినలేదు. పశు బలంతో దాడి చేశాడు.ఆ మృగం ముందు నా దేహం ఓడిపోయింది. ఒడలంతా భగభగ మండిపోయింది. ఇక ఈ జీవితం ఇంతేనా? నాపై నాకే అసహ్యం కల్గింది. 


నిస్త్రాణంగా పడిపోయిన నేను తడి స్పర్శకు కళ్లు తెరిచాను.  లేచి పాపాయి కి డైపర్ మార్చబోయి అది పొడిగా వుండేటప్పటికి జరిగింది గ్రహించాను. అదొక అవమానం. అసహ్యంతో బాత్ రూమ్ లోకి పరిగెత్తాను.


స్నానం చేసి వచ్చి కారిడార్ లో నిలబడ్డాను. అప్పుడే గుడి గంట మ్రోగింది. గోపురం వైపు చూసి హృదయ నమస్కారం చేసుకున్నాను.ఆ చర్య నాలో పాపభీతి కాదు. నేను మనసా వాచా కర్మణా శ్రీకాంత్ తో గడిపానని అర్థమైంది. అంతలో  పక్కింటి అమ్మాయి కంగారుగా కారిడార్ లోకి వచ్చింది. సైగ చేసింది. ఫోన్ నాకే అంది. అందుకుని లిఫ్ట్ చేయగానే  శాపనార్ధాల వర్షం శరాఘాతంలా తడిపేసింది. ఓ తల్లి గుండె శోకాలు పెడుతుంది. ఆమె శ్రీకాంత్ తల్లి. ఆమె చెప్పిన మాటలు విని..


“నో! అలా జరగడానికి వీల్లేదు” అంటూ గట్టిగా అరిచి పెద్దగా ఏడుస్తున్నాను. 


ఇంట్లో అందరూ చుట్టుముట్టారు. విషయం చెప్పాను. భర్త అనే పురుగు  నా  వైపు చూస్తున్నాడు అతని కళ్ళల్లో వికృతమైన ఆనందం నృత్యం చేస్తోంది. అందరూ  వాన కురిసి ఆగిన తర్వాత గొంతు చించుకుని అరిచే బావురు కప్పల్లా బెకబెక మన్నారు. వారందరి కళ్ళల్లో రాక్షసత్వం ద్విగుణీకృతం అయింది. ఏవో అపశకునపు మాటలు. 


నాలో ఏదో విస్పోటనం, పశ్చాతాపం. ఇంకేమీ  ఆలోచించకుండా ఒక్క ఉదుటన ఇంట్లో నుండి బయటకు వచ్చి తలుపు గడియ బిగించేసాను.  రోడ్డున పడి ఎక్కడికో, ఏమో తెలియని పరుగులు తీస్తూ..  


నిశ్శబ్దంగా జారుతున్న కన్నీరు, అడుగడుగుకి గుండె బరువు పెరిగిపోతుంది. అడుగు తడబడుతుంది. అయినా  ఆగలేదు వగరుస్తూ.. అడ్డదిడ్డంగా  అనేక మలుపులు తిరుగుతూ తిరుగుతూ.. రైల్వే స్టేషన్ వైపు.


 నేను సమాజానికి భయపడ్డానా? శ్రీకాంత్ పరిచయానికి ముందైనా భర్త తన మెడకు భారమైనా బాధ పెడుతున్నా  నాకొద్దీ  మనిషని యెందుకు త్యజించలేకపోయింది?  ఇప్పుడు మాత్రం ఏమైంది? అది బిడ్డను వదలలేని బలహీనత మాత్రమే కాదు, ఏదో బలవంతపు భరింత.


శతాబ్దాలుగా స్త్రీల మనోభావాలపై అణచివేత వున్నట్లే ఇప్పుడు కూడా తన జీవితంపై మరి కొందరి ఉక్కుపాదం, పెత్తనం, జులుం, స్వారీ. ఇంకా ఏవేవో! నచ్చని వ్యక్తి నుండి విడాకులు ఆశించడం తప్పా!? ఆ హక్కు సుదూర తీరమేనా!? 


శ్రీకాంత్ జీవితాన్ని నిర్లక్ష్యంగా సుళువుగా తీసుకునే మనిషి. ఎంత బాధను అనుభవించి వుంటే ఆ కఠిన నిర్ణయం తీసుకుని వుంటాడు?. అందుకు  కారణం యెవరూ? నేను కాదూ! ఏడేడు జన్మలకు కలిసి నడుద్దాం అనుకున్న వాగ్ధానాలు నీటి బుడగలై పోయాయి. 


“శ్రీ.. నువ్వు లేకపోతే నేనుంటానా?  నెవ్వర్! ప్రేమ ముగిసినప్పుడు జీవితం కూడా ముగిసిపోతుందని నువ్వు అనుకున్నప్పుడు నేనూ నీ దారిలోనే!  క్షణకాలం కూడా ఆలోచించకూడదు. ఈ బంధాలు బంధనాలు అన్నీ తృణప్రాయంగా విసిరేయాలి. అవును అంతే!” 


“శ్రీ !  నేను భౌతికంగా నీతో కలిసి జీవించలేక పోయానన్నమాటే కానీ.. ఈ ఎడబాటులో నిన్ను మరిచింది లేదు. కేవలం ఈ దుఃఖ దేహంతో నిలిచి వున్నాను. నా ఆత్మ  నీవు. ఆత్మను మాత్రమే నీకివ్వగలను. నువ్వు మాత్రం బ్రతకాలి,నిండు నూరేళ్ళూ బ్రతకాలి!! ఈ ప్రపంచానికి నువ్వు కావాలి. ముఖ్యంగా మీ అమ్మకు నువ్వు కావాలి.  ఎవరికైనా నువ్వు పంచే అమృత ప్రేమ కావాలి. అతి మధురమైన నీ స్వరం నిర్జీవమై పోకూడదు. నీ ప్రేమ లో తడిసి తరించే భాగ్యం  అదృష్టం నాకెలాగూ లేదు. పరువులు కోసం పడి చచ్చే పాపాత్ములు నాకు నిన్ను  మిగలనీయరు. నా కోసం నిష్కారణంగా నువ్వు మరణించకూడదు!”  అప్రయత్నంగా అంతులేని ప్రేమ నిండుకున్న నా గొంతు నుండి  నా ఆత్మ చీల్చుకుని వచ్చిందా అన్నట్లు ఓ పెనుకేక. “శ్రీ”.. అంటూ. 


చుట్టూ వున్నవాళ్ళు విచిత్రంగా చూసారు. వెళుతున్న వారు  ఆగి వెనక్కి తిరిగి మరీ చూసారు. వెనుక నడుస్తున్నవారు ఆసక్తిగా నన్నే  గమనిస్తున్నారు. లోకం అంతే! లోకానికి మరే పని లేదు ఇతరులను గమనించడం, నిందించడం తప్ప. వ్యాఖ్యానించడం తప్ప..


వేగంగా గూడ్స్ బండి దూసుకువస్తుంది. అంతవరకూ ప్లాట్ ఫామ్ పై నడుసున్నదాన్నల్లా వొక్క వుదుటున పట్టాల మీదకు దూకేసాను. పైన నిలబడినవారు వెనక్కి రమ్మని లేదా అవతలకు వెళ్లమని గోల గోలగా అరుస్తున్నారు. 


ప్రేమ అగ్ని కీల. అందులోనే దగ్ధం కాదలుచుకున్నాను.  శ్రీకాంత్ లేని జీవితం ఊహించలేను. ఆ విషాద గీతం ఆలపించలేను. నాకూ ఈ జీవితం వద్దనే వద్దు. మృత్యు భయాన్ని జయించాను. తెంపరితనంతో ముందుకు ఉరికి  ఎదురుగా వస్తున్న రైలును క్షణ కాలం అతన్ని  హత్తుకున్నట్టుగానే. అంతే! బాధల తుఫాన్ తీరం చేరడానికి సమీపంలో వుంది. 


కథ ఇంకా వుంది. పాట సాగుతూనే వుంది అంతులేని ప్రవాహంలా! 


***********సమాప్తం*****************


(ఫిబ్రవరి 15/2025 సారంగ పక్ష పత్రికలో  ప్రచురితం) 

16, ఫిబ్రవరి 2025, ఆదివారం

ఇంతింతై



ఇంతింతై - వనజ తాతినేని 


కుండీలో ఏపుగా కొమ్మా రెమ్మలతో పచ్చగా నవనవలాడుతూ వున్న చంద్రకాంత మొక్కను చూస్తూ వుంది మైధిలి. ఇది ఇప్పటికైనా పూలు పూస్తే బాగుండును. ములుకులు లాంటి మాటల బారి నుండి తప్పించుకోవచ్చు.


 అత్తగారు నిర్మల మాటలు  చెవిలో గింగిరాలు కొడుతూ వుంటాయిలా. “అమ్మాయ్! ఇంకా ఎందుకా మొక్కకు పోషణ చేస్తావ్!  బడితలా పెరిగింది కానీ.. ఓ మొగ్గ వేసి పువ్వు పూసింది లేదు. పీకి పారేసి ఏ శంఖం పూల గింజలో వేయకూడదు పూజకు పనికి వస్తాయి. హెర్బల్ టీ కూడా చేసుకోవచ్చు.”


సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు సొంతానికి వాడుకునేందుకు అనువుగా ఉండాలి లేకపోతే అది దానంతటదే మాయం అయిపోవాలి.లేకపోతే నాశనం చేసేయాలి మరొకటితో  నింపేయాలి. ఇదే మానవుడి లక్షణం అన్నట్లు వుంటున్న ఆమెను చూస్తే మైథిలి కి ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రకాంత మొక్క స్థానంలో తనని ఊహించుకుంటుంది. 


పెళ్ళై నాలుగేళ్ళు అయింది. ఇంకా పిల్లలు పుట్టలేదేంటి అని ఆశ్చర్యపోవడం దాటి ఎగతాళిగా చూడటం మొదలు పెట్టారు. ఎవరూ నోటితో పల్లెత్తు మాట అనరు. కానీ వారి చూపుల్లో పెదాల మీద నవ్వుల్లో కనుబొమ్మల విరుపుల్లో కదలికల్లో స్పష్టంగా కనిపిస్తాయి. 


ఇంట్లో నలుగురు పిల్లలు వున్నారు. వారందరిని నెలల వయస్సున్నప్పటి నుండి  అపురూపంగా మోసి వారికి కావలసినవి కొనిపెట్టి సినిమాలకు షికార్లుకి తిప్పే బాబాయ్ .. శ్రీరామ్ అంటే మహా ఇష్టం. శ్రీరామ్ కూడా మైథిలి నెల తప్పకపోవడాన్ని పెద్దగా పట్టించుకున్నదీ లేదు.ఐవిఎఫ్ సెంటర్ కు వెళ్దాం అని అడిగింది. తొందరేం వుంది చూద్దాం అని దాటేయడం. 


నిట్టూరుస్తూ.. చంద్రకాంత మొక్క చివుళ్ళను సృశిస్తూ..దాన్ని బతిమిలాడింది. 

“బుజ్జి తల్లీ! త్వరగా పూలు పుయ్యవే! లేకపోతే నేను లేనప్పుడు ఎవరో వొకరు లేదా తుంటి ఎముక విరిగి వీల్ చైర్ లో తిరుగుతున్న అత్తగారికి పూర్తిగా నయమైన తర్వాతో వచ్చి నిర్దాక్షిణ్యంగా పీకి పడేస్తారు. ఎంత ఇష్టంగా తెచ్చుకున్నాను నిన్నూ! బంధువుల ఇంటి ముందర విరబూసి పరిమళాలు వెదజల్లుతూ గాఢ ఆకర్షణ లో పడేసావు నువ్వు. 


పసుపు పచ్చని రంగుపై ఎర్రని చుక్కలతో మనోహరంగా మెరిసిపోతూ. అనుమతి తీసుకోకుండానే  విత్తనాలు సేకరించాను.  మట్టి తో సహా పింగాణీ కుండీ కొని తెచ్చి ఈ నాల్గవ అంతస్తు బాల్కనీ లో పెట్టి అపురూపంగా పెంచాను.సాయంవేళ నిండుగా నువ్వు పూలు పూసి పరిమళాలు వెదజల్లుతూ వుండే దృశ్యాలను ఎన్నిమార్లు కలగన్నానో తెలుసా! ఇప్పటికైనా పూలు పూయవే తల్లీ! మా బంగారు వి కదూ!” బతిమిలాడింది. 


“పిన్నీ!”అంటూ వచ్చింది ఏడేళ్ళ పాప! 


“రిషితా ! వచ్చేసావా!“ దగ్గరికి తీసుకోబోతూ  ఆగిపోయింది. 


పాప ముఖం లో భయం ఆందోళన. కన్నీటి చారికలు. ఏదో కీడు శంకించింది. 


“ఎందుకమ్మా అలా వున్నావు? ఏం జరిగింది చెప్పు? “


“పిన్నీ! మామయ్య మామయ్య నన్ను “ వెక్కుతూ ఆగిపోయింది. 


గుండె గుబేల్మంది మైథిలికి. 


గబగబా వెళ్ళి రూమ్ తలుపులు మూసి వెక్కుతున్న పాపను వొడిలోకి తీసుకుని కన్నీళ్ళు తుడిచి వెన్నునిమురుతూ లాలనగా అడిగింది. 


“స్కూల్ బస్ దిగి లోపలికి వస్తున్నాను. లిఫ్ట్ దగ్గర మామయ్య ఉన్నాడు. మీరందరూ షాపింగ్ కి వెళ్లారు అని చెప్పాడు. వాళ్ళింటికి రమ్మన్నాడు. మామయ్యతో వెళ్ళాను. చాక్లెట్లు ఇచ్చి బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళాడు. ఏమేమో చేసాడు పిన్నీ! నేను గట్టిగా ఏడ్చాను. చూడు బ్లడ్ వస్తుంది “ గాటు పడ్డ పెదవిని చూపించింది.ఈసారి  భయంతో తాను వణికిపోయింది మైథిలి. 


దైర్యం కూడదీసుకుంటూ అడిగింది “ఇంకెక్కడైనా నొప్పి గా వుందా తల్లీ!”

“ ఊహూ, ఇంకెక్కడా నొప్పి లేదు. నేను కూడా మామయ్య చేతిని గట్టిగా కొరికాను.కేకలు పెడుతూ తలుపు తెరుచుని వచ్చేసాను”  


“సరే, ఈ విషయం గురించి నువ్వు ఎవరికీ చెప్పకూడదు. అత్త కు చెప్పి మామయ్య కు గట్టిగా పనిష్మెంట్ ఇప్పిద్దాం. సరేనా!”


“సరే పిన్ని” రిషిత ముఖం లో చిన్న నవ్వు. 


రిషిత కు స్నానం చేయించి స్నాక్స్ పెట్టి పాలు తాగిస్తూ తన దగ్గర కూర్చోబెట్టుకుని ఆలోచిస్తూ ఉంది. అంతలో ఆడపడుచు ఇంట్లో పనిమనిషి రిషిత పుస్తకాల బ్యాగ్ షూస్ తీసుకొచ్చి ఇచ్చింది. అత్తగారికి కాఫీ ఇస్తుంటే.. లావణ్య షాపింగ్ కి వెళ్ళిందిగా.. అల్లుడి ని కూడా కాఫీ కి పిలువ్ అమ్మాయ్! అంటూ ఆజ్ఞాపించింది. అత్తగారికి  కూతురు కళ్లెదురుగానే వుండాలి. అల్లుడికి నిత్యం కొత్త అల్లుడికి జరిగినట్లు రాచ మర్యాదలు జరగాలి. ఆ మాత్రం కాఫీ కలుపుకుని తాగలేడా వెధవ! అని తిట్టుకుంటూ అత్తగారి మాట పెడచెవిని పెట్టి శ్రీరామ్ కి కాల్ చేసి రిషిత కి ఏం జరిగిందో చెప్పింది. లాయర్ గా పనిచేస్తున్న అతనే ఆ సంగతి చూసుకుంటాడని. 


మరో గంటకల్లా.. కారకుడైన వ్యక్తి మినహా అందరూ హాల్లో కూర్చుని ఉన్నారు. 


నిర్మల చాలా అసహనంగా వుంది. లావణ్య అవమాన భారంతో తలదించుకుంది. పాపం!

అంతకన్నా ఏం చేయగలదు? 


 క్రమశిక్షణ లోపించి చదువుసంధ్యలు అబ్బక పోయినా సినిమా హీరోలాగా వున్నాడని అతన్నే కావాలని కోరుకుంది. పెళ్ళై పుష్కరం గడిచినా పైసా సంపాదించడు సరికదా పట్టె మంచం పైకే అన్నీ రావాలి.ఇన్నేళ్ళగా లావణ్య చిన్నచితకా ఉద్యోగం చేస్తూ తల్లి ఆర్థికస్థోమతను అండజేసుకుని   వ్యసనపరుడై బలాదూర్ గా తిరుగుతూండే భర్తను కాచుకుంటూ వస్తుంది. అప్పుడప్పుడు తాను మందలిస్తున్నదని తనపై కంటు తల్లికి కూతురి కి.


“గోటితో పోయే దానికి గొడ్డలి పోటు దాకా ఎందుకు?ఏదో ముద్దు చేసి వుంటాడు.రిషిత ఏదో ఊహించుకుని భయపడి వుంటుంది. ఇక ఈ విషయం మర్చిపోండి” అంది నిర్మల కఠినంగా. 


“మర్చిపోవడం ఏమిటి అత్తయ్యా! మీరు తప్పు ను ఖండించలేదు అంటే సమర్థిస్తున్నారా?”


“నోర్మూయ్! నీకు లావణ్య అంటే ఇష్టం వుండదు. ఎప్పుడూ ఏదోకటి అంటూనే వుంటావు. ఇది నీ పన్నాగమే!”

.

“లావణ్య తో నాకు చిన్న చిన్న విభేదాలు వున్న మాట నిజమే అయినప్పటికీ  వాటిని ఇలా రిషిత విషయంలో జరిగిన తప్పు కు ముడిపెట్టడం బాగోలేదు అత్తయ్యా! పవన్ అలా చేయడం నిజం. కూతురిపై వున్న ప్రేమతో అల్లుడి నిర్వాకాన్ని తప్పు అనకుండా మీ కళ్ళు మూసుకుపోయాయి.” 

గట్టిగా మాట్లాడింది మైథిలి. 


ఆ మాటకు  నిర్మల ఆవేశంతో ఊగిపోతూ.. 

“శ్రీరామ్ ! నీ పెళ్ళాం నన్ను అంతమాట అంటుందా? ఈ ఇంట్లో నేనైనా వుండాలి అదైనా వుండాలి. గొడ్డుమోతు దానికి పిల్లలపై ప్రేమ ఎలా వుంటుందో తెలిస్తే కదా! ఎవరు వొప్పుకున్నా వొప్పుకోకపోయినా నా కూతురు ఇక్కడే ఉంటుంది“ తీర్మానం చేసింది.


“తల్లి లేని పిల్లవాడు అని పవన్ ని పెంచి పెద్ద చేసి కొడుకులతో సమానంగా ఆస్తులు పంచి ఇచ్చారు. కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేసి ఇంట్లో నే పెట్టుకున్నారు.అతను పామై కాటేస్తుంటే గుడ్డిగా వెనకేసుకు వస్తున్నారు. నిజాలను నమ్మక పోవడం మీ ఖర్మ” అని అంటూ 

మైథిలి విసురుగా తన గదిలోకి వెళ్ళింది. 


నిర్మల ఆ తర్వాత కూడా  ఏడుపు అక్కసు నోటి తుత్తర కలగలిపి మైథిలి ని పావుగంటసేపు తిట్టిపోసింది. విసుగు విరామం లేకుండా ఎఫ్ ఎమ్ ఆర్ జె రొదలా వినిపిస్తూనే వున్న ఆ మాటలను అపార్ట్మెంట్ అంతా శ్రద్ధగా వింది. భయపడి జాగ్రత్తలోకి మేల్కొంది. పసిపాపల చుట్టూ రక్షణ కవచాలను కట్టుదిట్టం చేసుకునే ప్రయత్నం చేసింది. 


జరిగిన విషయానికి బాధతోనూ అవమానం తోనూ శ్రీరామ్ తల పట్టుకుని కూర్చున్నాడు. అతనిలో అనేక ఆలోచనలు. ఇక్కడ మైథిలి చెప్పినదాన్ని నమ్మడం నమ్మకపోవటం కాదు సమస్య. అచ్చం సోషల్ మీడియాలో లాగానే.. జరిగిన తప్పు కళ్లెదురుగా కనబడుతున్నా ప్రశ్నించలేని స్వార్థంలో మనిషి కూరుకుపోతున్నందుకు బాధగా వుంది. ఏ విషయానికైనా అవును అనే వాళ్ళు కొంతమంది, కాదు అనే వాళ్ళు ఇంకొంతమంది. ఇక్కడ కుటుంబం సమాజమే కాదు మనిషి మనిషీ..  ఆఖరికి మనిషి- మనస్సు కూడా విభేదించే స్థాయికి చేరుకున్నారు. కళ్ళు మెదడు తెరిచి సత్యాన్ని చూడటం ఎలా!?


ఎయిర్ బేగ్ లో  బట్టలు సర్దుకుని వెళుతున్నానని శ్రీరామ్ కి   “రిషిత పాప జాగ్రత్త అక్కా” అని ఏమీ మాట్లాడకుండా అయోమయంలో వున్న తోడికోడలుకి హెచ్చరిక చేసి  ఆటో ఎక్కింది మైథిలి. 


ఆ రాత్రి  అందరూ భోజనాల బల్ల ముందు కూర్చుని అన్యమనస్కంగా పళ్ళెంలో వేళ్ళు పెట్టి కెలుకుతూ వున్నప్పుడు రిషిత మరో బాంబు పేల్చింది. 


“బాబాయి నీకో సంగతి చెప్పనా! అప్పుడెప్పుడో నాన్నమ్మ కి కాలికి ఆపరేషన్ జరిగినప్పుడు మీరు హాస్పిటల్ లో వున్నప్పుడు మామయ్య మీ రూమ్ లోకి వెళ్ళి  పిన్నిని కూడా వెనకనుంచి హగ్ చేసుకున్నాడు. పిన్ని మామయ్య ను తోసేసి చెంప మీద గట్టిగా కొట్టింది కూడా!” 


షాకింగ్ గా చూసారు అందరూ. 


“నిజమా పాపా!” అడిగాడు రిషిత తండ్రి. 


“అబద్ధం ఎందుకు చెబుతాను నాన్నా! నేను అక్కడే ఆడుకుంటున్నాను. నన్ను చూసి మామయ్య బయటకు వెళ్ళిపోయాడు. 


“ఆ తర్వాత ఏం జరిగింది?”. 


“పిన్ని  ఈ సంగతి ఎవరికీ చెప్పొద్దు తల్లీ గొడవలవుతాయి అని ప్రామిస్ తీసుకుంది”. 


శ్రీరామ్ లేచి చెయ్యి కడిగేసుకుని రూమ్ లోకి వెళ్ళిపోయాడు.


మిగిలిన కోడళ్ళు ఇద్దరూ చూసారా అన్నట్టు అత్త వైపు అసహనంగా చూసారు. 


“పిల్ల ముండ ఏదో అలా  చెబుతుంది.అల్లుడు ఎందుకలా చేస్తాడు? ఈ మాటలన్నీ లావణ్య వింటే బాధ పడుతుంది.” శుభ్రంగా తిని ప్లేట్ లో చేయి కడిగి పళ్ళెం కింద పెట్టి చక్రాల కుర్చీ నడుపుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది నిర్మల. 


శ్రీరామ్ భార్య కి ఫోన్ చేసాడు. పొడి పొడి సంభాషణ తప్ప రహస్యం బయట పడనేలేదు. ఇతనూ తెలిసిందని చెప్పనూలేదు. 


ఇరవై రోజులు గడిచాయి. లావణ్య తల్లితో మొబైల్ సంభాషణ తప్ప ఇంట్లోకి అడుగు పెట్టలేదు. రిషిత తల్లి స్కూల్ బస్ ఎక్కించడం దింపుకుని ఇంటికి తీసుకురావడంలో శ్రద్ధ తీసుకుంటుంది. లావణ్య కొడుకు అనిరుద్ధ్ తో కూడా రిషిత ఆడకుండా వేయి కళ్ళతో కావలి కాస్తుంది. 


మైథిలి శ్రీరామ్ కి మెసేజ్ చేసింది. “వేరేచోట ప్లాట్ అద్దెకు తీసుకోండి. నేను అక్కడికే వస్తాను. మా పుట్టింట్లో జరిగిన విషయాలేవి తెలియదు మీరూ చెప్పొద్దు “ అని. 


రెండు సార్లు అత్తింటికి వెళ్లి భార్యను చూసి వచ్చేశాడు శ్రీరామ్. రిషిత చెప్పిన విషయం గురించి ప్రస్తావనకు తేలేదు కూడా! “ఇంటికి రా మైథిలి. అమ్మ అప్పుడేదో కోపంలో నోరు జారింది లే!” అన్నాడు. 


తల అడ్డంగా ఊపింది. 


ఎందుకో నీరసంగా మగతగా  వుంటుంది అమ్మాయికి. హాస్పిటల్ లో చూపించి ఒక నెల తర్వాత పంపుతాం బాబూ”  అంది మైథిలి తల్లి. 


నెల రోజుల తర్వాత డబుల్ బెడ్రూమ్  ప్లాట్ అద్దెకు తీసుకొని  మైథిలి ని ఆ ఇంటికి తీసుకుని వెళ్ళాడు శ్రీరామ్. మైథిలి ఆ ఇల్లును చూసి  ముచ్చట పడింది. తన పుట్టింటి వారు ఇచ్చిన పర్నిచర్ మొత్తం ఆ ఇంట్లో కి మార్చి నీట్ గా సర్ది పెట్టి వుంది. ముఖ్యంగా బాల్కనీలో తను పెంచుకున్న చంద్రకాంత మొక్క వున్న కుండీని చూసి ఆనందపడింది. భర్తకు థాంక్స్ చెప్పింది. 


పరీక్ష గా చూడు.. ఇంకా సంతోషిస్తావ్ అన్నాడు. 


దగ్గరకు వెళ్ళి చూస్తే.. చిగురు చిగురులోనూ.. పొటమరిస్తున్న పసి మొగ్గలు. తన పొట్ట పై చేయి వేసుకుంది. బుజ్జి తల్లీ! నువ్వు అమ్మ వి అవుతున్నావ్ నేను అమ్మను అవుతున్నాను. మొక్కను ముద్దు పెట్టుకుంది. 


“మైథిలి నీతో ఒక మాట చెప్పాలి” ఆగాడు సంశయం గా శ్రీరామ్. 


ఏమిటి అన్నట్లు చూసింది. 


“రిషిత ని మనం పెంచుకుందాం. అక్కడ కన్నా ఇక్కడ సేఫ్ గా వుంటుంది అని.” . 


“బావగారూ అక్కా ఒప్పుకోవద్దు. వాళ్ళు ఒప్పుకుంటే అలాగే మనం తెచ్చేసుకుందాం.”


“వదిన సరే నంది. అన్నయ్య అమ్మను అడిగి చెబుతాను అన్నాడు.” 


మైథిలి మనసులో అనుకుంది. నామ మాత్రం సంపాదన. తల్లికి ఎదురుతిరిగి బతకడం సాధ్యపడదు. ఆ ఇంట్లో నుండి పొమ్మంటే అద్దె కట్టుకుని పిల్లలకు ఫీజులు కట్టుకుని సంసారం ఈదడం అంటే మాటలు కాదు కదా!” అని.


సాయంత్రం పిన్నీ అంటూ  స్కూలు బ్యాగు బట్టల బ్యాగుతో ప్రత్యక్షమైంది రిషిత..


ఆ మర్నాడు ఆదివారం కావడంతో రిషితను  తీసుకుని స్కూటీ పై  కూరగాయల మార్కెట్ కి వెళ్ళింది. 


ఫస్ట్ ప్లోర్ లో వుంటున్న సరిత  టీచర్ కనబడింది. ఉమ్మడి కుటుంబం లో వుండటం ఇష్టంలేక నా కోడలు ఈ అపవాదును వేసి పోయింది. మా అల్లుడు బంగారం లాంటి వాడు. అని చెబుతుంది మీ అత్తగారు అని  సరిత టీచర్ చెబుతుంటే అసహ్యం వేసింది మైథిలికి. అత్తగారికి హృదయం మెదడు రెండూ లేవు అనుకుంది విరక్తిగా. 


కంచే చేను ని మేస్తుంటే ఎవరు కాపలా కాయగలరు? 

పసిపాపలను కుటుంబ సభ్యుల నుండే కాపాడుకోవాల్సి రావడం ఎంత సిగ్గు చేటు. 

పైగా అంత వయస్సు వచ్చిన అత్తగారు కూడా నిసిగ్గుగా అతను చేసిన పనిని ఖండించకుండా బయటకు పొక్కకుండా వుంచాలని చూడటం.ఆ రోజు  అంతకుమించి రిషిత కి  ఇంకేదైనా జరిగివుంటే.. అలాగే ఆనాడు తన పైన బలాత్కారం జరిగి వుంటే!? తనకు తోడు రిషిత వుండబట్టి మౌనంగా వెనక్కి తిరిగాడు కానీ. 

 

పీడకులు బాధితులు ఒకే కప్పు కింద వుండాల్సిరావడం ఎవరైనా ఎందుకు వొప్పుకుంటారు? అందుకే రిషిత ని తమ ఇంట్లో వుండటానికి తల్లిదండ్రులు వొప్పుకున్నారు పంపించారు అని అత్తగారు అర్థం చేసుకోదేం!? 


ఆలోచిస్తూనే వంట చేసింది. ముగ్గురూ తిని టివి చూస్తూ వుండగా శ్రీరామ్ కి అన్నయ్య నుండి ఫోన్. 


కంగారు గా లేచి బట్టలు మార్చుకుంటూ చెప్పాడు.”లావణ్య ఆత్మహత్యా ప్రయత్నం చేసిందట. హాస్పిటల్ కి తీసుకు వెళుతున్నాం రమ్మని.” అని. 

 

మైథిలి రిషిత ని  తీసుకుని నేను కూడా వస్తాను అంది. 


 “వద్దు.. అక్కడ మా అమ్మ చేసే న్యూసెన్స్ మాములుగా ఉండదు. ఏం జరుగుతుందో ఏమో! పవన్ వాచ్మెన్ కూతురు పట్ల  మిస్ బిహేవ్ చేసాడంట. వాళ్ళు పట్టుకుని బాది పడేసి కంప్లైంట్ ఇచ్చారంట. విచారించడానికి పోలీసులు వచ్చేసరికి అది భరించలేక లావణ్య ఆత్మహత్యా ప్రయత్నం చేసిందట. బ్రతకడం కష్టం అంటున్నారు “ అని దిగులుగా చెప్పి గబగబా వెళ్ళిపోయాడు. 


మైగాడ్! అసలు  ఏం జరుగుతుంది? పవన్ మిస్ బిహేవియర్ గురించి అశ్లీలపు వాగుడు గురించి లావణ్యతో  చెప్పి వుండాల్సిందేమో! తాను కూడా రహస్యంగా వుంచి తప్పు చేసింది.బంధుత్వాలు బలహీన పడతాయనో పరువు పోతుందనో గోప్యంగా ఉంచడం వల్లనే ఆ కామాంధుడికి  మరింత బలం చేకూరింది.. 


పెంచిన ప్రేమో లేదా పేరెంట్స్ కి వుండే  గుడ్డి ప్రేమల వల్లనో  పిల్లలు  ఎన్ని తప్పులు చేసినా ఎన్ని నేరాలు చేసినా పెద్దలు సమర్థిస్తూనే వుంటారు. మొదటిసారి తప్పు చేసినప్పుడే ఖండించి వుంటే ఎలా వుండేదో!. ఇంతై ఇతింతై వటుడింతై అన్నట్లుగా పవన్ అరాచకాలు మితిమీరి పోయాయి. తన పర అన్న విచక్షణ కూడా లేనివాడుగా  కీచకుడిగా మారిపోయాడు. అతను తప్పకుండా శిక్షింపబడాలి. లావణ్య మాత్రం బ్రతకాలి! బ్రతకాలి!!


ఒక్క క్షణం ఆగి మళ్ళీ ప్రశ్నించుకుంది మైథిలి.

 

అవును, లావణ్య బ్రతికి మాత్రం ఏం చేయాలి? ఎల్లకాలం ఇలాంటి అవమానాలు భరిస్తూనే వుండాలా? కొడుకు భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటూ వొంటరిగా  తన జీవితం తాను బతుకుతాను అంటే సమాజం సెహబాష్ అంటుందేమో కానీ లావణ్య తల్లి నిర్మల ఊరుకుంటుందా? ఊరుకుంటుందా అని!? ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది ఇందుకేనన్న మాట. అవసరమైతే తనూ రిషిత కూడా సాక్ష్యం ఇవ్వాలని పవన్ శిక్షింపబడాలని దృఢంగా అనుకుంది.

 

అలా చేస్తే  పరువు మర్యాదలు పోతున్నాయని గుట్టు రట్టు అవుతుందనే అత్త అహంకారం ధన మదం ఊరుకుంటుందా? ఇవ్వన్నీ పోతే .. పోతే ఎలా!? అని అసహనం ప్రదర్శించదూ!!  

గంటన్నర తర్వాత శ్రీరామ్ నుంచి ఫోన్. లావణ్య అవుటాఫ్ డేంజర్ అని ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని. 


అత్తగారి మూర్ఖత్వం తో అహంకారంతో  యుద్ధం చేయడానికి మైథిలి సమాయత్తం అయింది. 


వికసిత దరహాసంతో  చంద్రకాంతలు ఆల్ ది బెస్ట్ చెప్పాయి. 

 

********************************

(16/02/2025 ప్రజాశక్తి స్నేహ సంచికలో ప్రచురితం)