నా రచనా వ్యాసంగం గురించి ఎవరైనా అడుగుతారా.. అనుకునేదాన్ని.
“మా వంశీ “..
ఇలా ప్రశ్నలు సంధించారు. నేను చాలా సంతోషంగా నా సమాధానాలు ఇచ్చాను .
ఆసక్తి ఉంటే మీరూ చదవండి.
************
వనజ తాతినేని - వనజ గారు - మ్హీఖు ఖొషెన్స్ వ్హేయ్హభడ్ఢవి - సమ్ధానం షెప్థే షెఫ్ఫంఢి ళేఖుంఠే మ్హీఖీ హిష్ఠం
******
1.మీ కలం మాట్లాడగలిగితే, మీరు దానిని పుచ్చుకుని రాసిన కథల గురించి అది ఏమి చెబుతుంది?
1.జ) “ఇంత బరువైన కథలు రాయించావు ఏమిటి తల్లీ!? నీకు పురుష ద్వేషమా!?”
అంటుంది.
2.రచయిత్రిగా మీకోసం మీరు కొన్ని రాస్తారు, అందులో సందేహం లేదు - మీకోసం మీరు రాసుకున్న వాటికి బయటి పాఠకుల కోసం రాసే వాటికి మీ రచనా స్వరం మార్పుకు లోనవుతుందా? ఒక వేళ లోనైతే ఎంత శాతం? ముప్ఫై శాతం, 40 శాతం, 60 శాతం, 90 శాతం? అలా ఏమీ లేదు, పాత్రలను బట్టి కథను బట్టి అన్ని కథలకు వేటి స్వరం వాటికే ఉంటుందని మీ అనుకోలా?
2.జ) పాఠకుల కోసం రాసే కథలకు పది శాతం వరకూ నా రచనా స్వరం మారుతుంది. తప్పదు అది.
3.ఆధునిక కథలు చెప్పే మీరు పాత సాహిత్యం ఎంత చదివారు? విస్తృతంగానా? మధ్యస్థంగానా? అసలు ఏమీ చదవలేదా?
2. జ) మధ్యస్థంగా చదివాను
4.మీరు తెలుగు సాహిత్యంలో ఒక కథను - అది మీదైనా, మీకు నచ్చిందైనా - తిరిగి వ్రాయగలిగితే, అది ఏమిటి? ఎందుకు?
4. జ) కలాపి (మన్నెం సింధు మాధురి రచన) అనే కథ నాకు నచ్చింది. అదే కథను నేను తిరిగి రాస్తే ఒక భారతీయ స్త్రీ ఏడుసార్లు విడాకులు ఇవ్వదు. విడాకులు ఇవ్వడం ద్వారా మాజీ భర్తల నుండి పొందిన భరణాన్ని బాధిత స్త్రీలకు ఉదారంగా పంచదు. భారతీయ సమాజంలో స్త్రీ ఒకసారి విడాకులిచ్చి రెండవ వివాహంలోకి అడుగుపెట్టడమే సాహసోపేత నిర్ణయం తెలివి తక్కువ ఆలోచన కూడా! ఇక సహజీవనం గురించి నేను మాట్లాడను.
5.తెలుగు మహిళగా ఉండటం అనేది మీ కథా ఇతివృత్తాలను, మీలోని మహిళ ఎలా ప్రభావితం చేస్తుంది? ప్రేమించే అమ్మలానా? బాధలు పడే భార్యలానా? బేఫికర్ బాబమ్మ లానా?
5.జ) ముందుగా నేనొక స్త్రీ ని. నా కథా ఇతివృత్తాలన్నీ కాల్పనికం కాదు. కొన్ని కథలు నేను రాయకముందు రాసిన తర్వాత కూడా కల్లోల పడటం వాస్తవం. “లాస్ట్ మెసేజ్”, “రెండు లక్షలు”, “మాతృ హృదయం” కథలు నాకు పరిచితమైన స్త్రీల కథలే! “ ఔనా” కథ షాకింగ్ కథ. రాయడానికి సంకోచించాను. దశాబ్దం తర్వాత రాసాను. కథలు రాయడం పాఠకుల కొరకు కాబట్టి రచయితగా ఆలోచిస్తూనే.. సాటి మహిళగా సహానుభూతి ని ప్రదర్శిస్తూనే నిరసన స్వరాన్ని కొరడాలా ఝళిపిస్తాను. నేనెప్పుడూ ప్రేమించే అమ్మ నే. కథల్లోని పాత్రలను కూడా అమ్మ లాగానే ప్రేమిస్తాను.వీలైనంత వరకూ సరైన దారిలో నడపడానికి ప్రయత్నిస్తాను.
6.మీ జీవితం తెలుగు కథో, కవితో అయితే, దాని శీర్షిక ఏమిటి?
6.జ) జీవిత కథ
7.మీ రచన యొక్క సారాంశాలకు ఏ తెలుగు పదం లేదా పదబంధం న్యాయం చేయగలదని మీరు అనుకుంటున్నారు?
7.జ) ఆక్రోశం
8.జీవితాన్ని తిరిగి రాయటం, అందులోని బాధల్ని ఎడాపెడా రాసి అసలే జీవితాలని బరువుగా లాగుతున్న మనుషుల మనసు మీదో, మేధ మీదో, హృదయం మీదో - ఒక మేరు పర్వతం బరువు చేసి కుమ్మరించటం అనేది బాధ్యత గల రచయిత్రిగా ఎంత మటుకు సమర్థిస్తారు?
8.జ) మూడు తరాల స్త్రీల వెతలు, గృహ హింస, అణచివేత చూసాను. స్వయంగా అనుభవించాను. నిత్యం చూస్తున్నాను. కోపం,ఆవేశం,ఆక్రోశం,బాధ ప్రకటించాలనిపిస్తుంది. పురుషులందరూ చెడ్డవారని నేను అనడం లేదు.బాధిత స్త్రీల కొరకు ఏదో చేయాలనే తపన నా చేత రాయిస్తుంది. నా కథలు బరువుగా వుంటాయి. ఒప్పుకుంటాను.నాకు హాస్యరసం వొలికించడం చేతకాదు. ప్చ్..
9.చరిత్రలో మీకు నచ్చిన ఒక తెలుగు మహిళా రచయిత్రి ఎవరు? ఎందుకు?
9) జ. ఓల్గా. ఎందుకు అంటే… నా పరిస్థితి ని బట్టి ఆమె రచనల వైపు ఆకర్షితురాలినయ్యాను.20 వ శతాబ్దంలో స్త్రీల కొరకు ఆమె తన గళాన్ని బలంగా వినిపించారు. రచనలను కూడా బలంగా చెప్పగల్గారు.
10.మీ పుస్తకం మరొక భాషలోకి అనువదించబడాలన్న కోరిక మీకు ఉంటే ఈ క్రింది నాలుగు భాషల్లో ఏ భాషను ఎంచుకుంటారు? - సవర భాష, భోజ్ పురి భాష, బెంగాలీ భాష, ఆంగ్లం. ఆ భాషే ఎందుకు?
10.జ) ఆంగ్లం. ప్రపంచ దేశాలకు మన తెలుగు సాహిత్యం (కథ) ఏం ప్రతిబింబించింది అని తెలియాలని.
11.తెలుగు సాహిత్యం స్త్రీత్వం యొక్క సంక్లిష్టతలకు న్యాయం చేసిందని మీరు అనుకుంటున్నారా, లేదా? లేదనుకుంటే చేయవలసింది ఇంకా ఎంత ఉన్నది? ఒక ఇరవై శాతం, నలభై శాతం, వంద శాతం?
11)జ. తెలుగు సాహిత్యం స్త్రీత్వం యెక్క సంక్లిష్టతలకు న్యాయం చేయలేదు. స్త్రీలకు ఆలోచించే శక్తి సంపాదించే మార్గం, స్వేచ్ఛగా వుండే వాతావరణం లభించిందన్నమాటే కానీ ఇంకా సమస్యల వలయంలోకి నెట్టింది.చదువులు ఉద్యోగాలు ఉన్నాయన్న మాటే కానీ గౌరవం తగ్గింది.రక్షణ తగ్గింది. చాకిరీ హింస పెరిగాయి.కానీ పురుష దృష్టి ఇంకా మారలేదు. స్త్రీలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లా పరుగులు పెడుతుంటే పురుష సమాజం పాస్ట్ పాసింజర్ లా నడుస్తుంది. కుడి ఎడమ స్త్రీ పురుషుడు మధ్య తేడా కచ్చితంగా వుంటుంది. అలాగే స్త్రీ పురుషుల మధ్య కూడా! ఇరువురి మధ్య అవగాహన వుంటే తప్ప కలిసి మనుగడ సాగించలేరు. ఆర్థిక స్వేచ్ఛ వచ్చింది.విడాకులు ఎక్కువయ్యాయి. కుటుంబం కూలిపోయి ఒంటరితనం చిరునామా అయింది. సాహిత్యం మనిషికి హితం కల్గించాలి.మనుషులను విడదీయకూడదు. సాహిత్యం చేయవలసినది చాలా వుంది.
12.మీరు రాయడం ప్రారంభించినప్పుడు ఎవరైనా మీకు ఇచ్చిన సలహా ఏమిటి?
12.జ) మా ఇంటి పురుషులు నేను రాయడాన్ని ఇష్టపడలేదు కానీ స్త్రీలందరూ రాయమని ప్రోత్సాహం అందించారు. మా అత్తమ్మ నా ప్రతి రచన చదువుతారు. వ్రాసిన విషయాలను చెప్పిన తీరును మెచ్చుకుంటారు. ఆమె అనుభవాలను సూక్ష్మంగా విప్పి చెబుతారు. కొత్త విషయాలను అందిస్తారు.
13.మీరు ఇప్పటికిప్పుడు భవిష్యత్తు తరం (అనగా ఒక ముప్ఫై ఏళ్ళ తర్వాతి) తెలుగు మహిళా రచయిత్రులకు లేఖ రాయగలిగితే, అది ఏమి చెబుతుంది? వాళ్ళకు తెలుగు వస్తుందో లేదో, అప్పటికి తెలుగు భాష బతికి ఉంటుందో లేదో అన్న గోడ మీది లౌక్య వాక్యాలు చెప్పొద్దు. మీరు ఇప్పుడు వాళ్ళకు ఏం చెప్తారు? అంతే!
13.జ) “మీరు పూర్తిగా కాల్పనిక కథలు రాయండి. ఇష్టపడితే పాఠకులు చదువుతారు.లేదా మీ అనుభవాలను బట్టి ఇతరుల అనుభవాలను విని వాటిని బట్టి సమన్వయంతో రాయండి. మీ అనుభూతులను రాయండి అంతే తప్ప కమర్షియల్ రైటర్ ఫేమస్ రైటర్ అనిపించుకోవడానికి నానా రకాల చెత్తను పైత్యాన్ని నింపి పాఠకుల పైకి విసరవద్దు. కత్తి కన్నా కలం పదునైంది. భావ వ్యాప్తి సమాజాన్ని పెడదారి పట్టిస్తుంది”. అని.
14.మీ రచనల్లో ఒక రచన ఆధారంగా ఒక తెలుగు సినిమా తీస్తే, అందులో విలన్ రమ్యకృష్ణ అయితే, మీరు ఆ విలన్ క్యారెక్టరుకు ఇచ్చే ఊతపదం ఏమిటి?
14. జ) మైండ్ దొబ్బిందా లేక పైత్యం పెరిగిందా!?
15.మీరు మీ రచనా శైలిని ఒక తెలుగు వంటకంగా వర్ణించగలిగితే, అది పులిహోర అవుతుందా? తీపి బొబ్బట్టు అవుతుందా? కళ్ళనీళ్ళు తెప్పించే ఉల్లిపాయ అవుతుందా? పానీపురీ అవుతుందా? ఇంకేదన్నానా?
15.జ) వెల్లుల్లి కారం కూరిన కాకరకాయ
16.రచయిత్రిగా, మామూలు మనిషిగా మీకు ఏయే భావోద్వేగాలు ఇష్టం (విడివిడిగా. రచయిత్రి మనిషి రెండూ ఒకటే అయితే అప్పుడు ఆ ఉద్వేగం ఏమిటి?)
16.జ) నేను రచయిత్రి గానూ మాములు మనిషి గానూ రెండూ ఒకటే! నన్ను చలింపజేసేవి ప్రేమ దుఃఖం.ఇవి రెండూ సమానస్థాయి లో వుంటాయి. కరుణ ఆర్ద్రత నన్నంటి పెట్టుకుని వుంటాయి. కోపం తాటాకు మంట. దృఢత్వాన్ని (కఠినంగా) కలిగి వుండటానికి నేను సాధన చేస్తాను. (ఇది రహస్యం)😊👍
17.మీ పాత్రలు మీతో తిరిగి మాట్లాడగలిగితే, వారి పాత్రల కర్మ గురించి, విధి గురించి, నా పాత్ర ఇలా తీర్చిదిద్దారేమి అని ఏ పాత్ర ఎక్కువగా ఫిర్యాదు చేస్తుంది అని మీరనుకుంటున్నారు?
17) జ. “ఇంటి పేరు” కథ లో “సువర్ణ” లాస్ట్ మెసేజ్” కథ లో “ధాన్యమాలి”. సువర్ణ కథలో ధీర. నిజ జీవితంలో పలాయనవాది. “ధాన్యమాలి” ఇంత బోల్డ్ గా ఎలా రాసావు? నన్ను నడిరోడ్డుపై సిగ్గు శరం మానాభిమానాలు ఒదిలేసిన స్త్రీగా నిలబెట్టావు. రచయిత బాధ్యత మరిచావా? అని నన్ను నిలదీసాయి. అప్పటినుండి బుద్దిగా తెలివిగా రాస్తాను.
18.మీరు రాతలు ఎక్కువగా రాసే సమయం ఏది? పొద్దు పొద్దున్నే, మిట్టమధ్యాహ్నం, సాయంత్రం, ఊళల అర్థరాత్రి? ఎందుకు?
18.జ)ఏదో చెప్పాలని తపన పడ్డప్పుడు మాత్రం అర్థ రాత్రి సమయంలోకూర్చుని రాసేస్తాను, ఎక్కువగా తెల్లవారుజామున రాస్తుంటాను.
19.మీరు మీ రైటింగ్ డెస్క్‌కు కానీ ల్యాప్ టాపుకు పేరు పెట్టవలసి వస్తే, మీరు దానికి ఏ తెలుగు పేరు పెడతారు?
19.జ) అక్షర మాత
మాగంటి వంశీ మోహన్ గారికి ధన్యవాదాలు. 🙏 20/07/2025
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి