నిర్మాల్యం
"వొదినా అమ్మమ్మకు మోకాళ్ళ నొప్పులకు ఆయింట్మెంట్ విటమిన్ టాబ్లెట్లు తీసి యిస్తాను పట్టుకెళతావా"అని అడిగింది చిన్నతాత మనుమరాలు. "అలాగేనమ్మా" అంటే వెంటనే కొనుకొచ్చి యిచ్చి వెళ్ళింది. అమెరికా నుండి మోసుకొచ్చిన వాటిని యిప్పుడు నాయనమ్మకు యిచ్చిరావాలి. నేనే స్వయంగా యిచ్చిరావాలనుకోవడానికి కారణం వుంది. ఊరెళ్ళి చేతి వేళ్ళన్ని యేళ్ళు అయివుండవచ్చు. ఊరి మనుషులైతే యేదో ఒక సందర్భంలో యెక్కడో వొకచోట కనబడవచ్చు కానీ ఊరు కనబడదు కదా, తాతల తరంలో మిగిలిన వాళ్ళలో వొకే వొకరు చిన్న నాయనమ్మ. మందులిచ్చినట్లు ఆమెను చూసినట్లు వుంటుందని ఆదివారం పల్లెకు బయలుదేరి వెళ్ళాను.
నాయనమ్మకు ఎనిమిది మంది సంతానం. అయిదుగురు కూతుళ్ళు ముగ్గురు కొడుకులు. తాతయ్య పెద్దకూతురు పదహారేళ్ళ వయసులో వుండగానే గుండె నొప్పితో మరణిస్తే రెక్కల క్రింద పిల్లలను సంరక్షించిన తల్లి కోడి వలె నిబ్బరంగా నిలబడింది. ఆడపిల్లలందరినీ చదివించింది. మగపిల్లలు పొలాలు పండిచ్చుకుంటారు పనులు చేసుకుంటారు. ఆడపిల్లలు జీవితంలో వచ్చే వొడిదుడుకులు తట్టుకోవాలంటే జ్ఞానవంతులై వుండాలి తమ కాళ్ళ మీద తాము నిలబడగల్గి వుండాలంటూ ఆ ప్రకారమే పిల్లలను నడిపించింది మరికొందరికి ఆదర్శం అయింది. నాయనమ్మ కూతుళ్ళ కెవరికీ బంగారు ఆభరణాలు చేయించలేదు. పట్టుచీరలూ కొనలేదు. అందరిని చదివించి ఉద్యోగాలు వచ్చాకే పెళ్ళి చేసింది. ఆఖరి బాబాయి వొక్కడే భార్యతో గొడవలుపడి పెళ్ళైన నెలరోజులకే తెగతెంపులు చేసుకుని వొంటరిగా మిగిలిపోయాడు. పెద్ద కూతురు టీచర్. భర్త చనిపోయి దగ్గరున్న పట్టణంలో వొంటరిగా ఉంటుంది. సెలవలు వున్నప్పుడల్లా తల్లి దగ్గరకెళ్ళి వస్తూ వుంటుంది. ఇద్దరు కొడుకులు పట్నంలో కాపురం పిల్లల చదువుల కోసమని. నిత్యం కొడుకులు ముగ్గురూ టిఫిన్ తినే సమయానికి అమ్మ ముందు పీట వాల్చుకు కూర్చోవాల్సిందే . మధ్యాహ్నం భోజనం టీలు కాఫీలు అన్నీ చూసి తిరిగి ఇళ్ళకి బయలుదేరేటప్పుడు పాలసీసాలు కాయకూరలు సర్ది చేతికందిస్తుంది. ఊరంతటికీ పేరు. ఎనబై యేళ్ళు దాటినా యెంత ఓపిక ఆమెకు అని. వయసులో వున్నబద్దకస్తులైన పిల్లలకు ఆమెను చూసైనా కష్టపడి పని చేయడం నేర్చుకోండి అని హితవులు చెబుతారు. మా కుటుంబాల్లోనూ ఊర్లోనూ చాలామందికి మా నాయనమ్మ రోల్ మోడల్.
కారు వూరిలో ప్రవేశించింది. ఆ వూరిలో వున్న ఒకే ఒక పెంకుటిల్లు అది. అయినా చెక్కు చెదరకుండా నిలిచి వుంది. అరుగు మీద కూర్చుని పేపర్ చదువుతున్న నాయనమ్మ నన్ను చూసి లేచి గబా గబా గుమ్మం దాకా వచ్చింది. "అమ్మాయీ, ఎన్నాళ్ళకు వచ్చావ్! పుట్టినూరు కూడా జ్ఞాపకం లేకుండా పోతుందే. నాలాంటి దానికి మిమ్మలను చూద్దామనిపించినా రాలేకపోతున్నా. బస్ ఎక్కాలేను దిగాలేను ఒకటే మోకాళ్ళ నొప్పులు. మోటారు కారులో రావాలంటేనేమో వాంతులు" అంటూ చేతిలో సంచీ అందుకుంది.
కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళగానే వూదొత్తుల వాసన గుభాలించింది. పూజ గదిలో యింకా దీపం వెలుగుతూనే వుంది. ఏ పనైనా పొదుపుగా మన్నికగా చేయాలంటే మీ చిన్న నాయనమ్మే అనుకో. ప్రమిదలో వేసే వొత్తి కూడా సన్నగా దారం పోసి గట్టిగా వొడేసి మెలిపెట్టి చేస్తుంది. కార్తీకమాసంలో కూడా తక్కువ నూనెతో యెక్కువసేపు ఆమె వెలిగించిన దీపాలే వెలిగేవి అనుకో అని అమ్మ చెప్పడం గుర్తొచ్చింది.
"నీ పూజల ఫలమే నాయనమ్మా నీ బిడ్డలందరూ చల్లగా వున్నారు " అని అంటే చిన్నగా నవ్వింది. "నీ కొడుకు కోడలు యెలా వున్నారు? అబ్బాయికి మంచి ఉద్యోగామేనా, ఎనిమిదేళ్ళు అయిందిగా వెళ్ళి. ఇల్లు కొనుక్కున్నాడా" అని అడిగింది.
"బాగున్నారు నాయనమ్మా యింకా ఇంటి దాకా వెళ్ళలేదు. ఆ ట్రంప్ పొమ్మనకుండా పొగబెడుతున్నాడుగా. అబ్బాయికి నిలకడైన ఉద్యోగమే కానీ కోడలికి ఉద్యోగంలేదు".
"నువ్వు బాగా పాడైపోయావు, పూజలు చేసి ఉపవాసాలు చేసినంత మాత్రాన ఉద్యోగాలు రావు, కోడలు కడుపు పండదు. వచ్చేవేళకి అన్నీ అయ్యే వస్తాయి. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవద్దు" అని మందలించి అన్నం తిందువుగాని రా అని పిలిచి పీటవాల్చింది. తినేసే బయలుదేరాను నాయనమ్మ అంటే ప్లేట్ లో సున్నండలు జంతికలు పెట్టి చేతికిచ్చింది. మనుమరాలు యిచ్చిన మందులు యిస్తే యివన్నీ నేను వేసుకుంటానా పెడతానా.. మళ్ళీ పిల్లల్లో యెవరో వొకరికి యివ్వాల్సిందే అని అరమారలో పెట్టింది.
"ఏళ్ళ తరబడి ఈ ఇంటిని పట్టుకుని వేలాడతా వుంటావు. మార్పు కోసమైనా పట్నం రావచ్చుగా. బెజవాడ నుండి అమెరికా దాక యెక్కడ చూసినా నీ పిల్లలు మనుమలు మనమరాళ్ళ సంతతి వున్నారు. ఒక్క రోజైనా ఇల్లు వదలవు. వచ్చే వారంలో మేము తిరుమలకు వెళుతున్నాం. అమ్మా నాన్న కూడ వస్తున్నారు,నువ్వుకూడా రా.. వెళదాము " అనంటే నవ్వి ..
"ఏటేటా కొండకి వెళ్ళాలన్న రూలేమన్నా వుందామ్మాయ్. మనసులో ఉండాల్సిన దైవం ఆలోచనల్లో రావాల్సిన పాపభీతి పోయి ఆడంబరం యెక్కువైపోయి ఓ ఎగేసుకుంటా గుడుల చుట్టూ తిరుగుతూ పూజలు చేసినంత మాత్రాన భక్తీ పరులు అయిపోతారా? భక్తీ విశ్వాసం ఉచ్వాస నిశ్వాసల్లాంటివి . నా జీవితంలో వొకే వొకసారి తిరుమలకు వెళ్లాను జన్మకో శివరాత్రి అన్నట్టు వొకసారి శ్రీశైలం వెళ్ళాను. మీ తాతయ్య చనిపోయాక కాశీ వెళ్ళి గంగలో మునిగి ఆ విశ్వనాధుడిని దర్శించుకున్నా. ఆ అన్నపూర్ణమ్మ తల్లిని కొంగుచాచి భిక్షమడిగాను. అవే నేను వెళ్ళిన పుణ్యక్షేత్రాలు తీర్ధయాత్రలు . మళ్ళీ యేనాడు గుడికి వెళ్ళిందేలేదు. రోజూ పేపర్ చదువుతా. టీవీ గీవీ చూడను. చదవాలంటే ఆ లైబ్రరీకి పోయి నాలుగు పుస్తకాలు తెచ్చుకుంటా." అంది
"అయితే యీ పూజలు యాత్రలు అనవసరం అంటావా" అన్నాను కినుకగా
"గుళ్ళకు పుణ్య క్షేత్రాలకు వెళ్ళనవసరం లేదు, భగవంతుడు ఎక్కడ లేడు చెప్పు? తులసి మొక్కకు ఓ చెంబుడు నీళ్ళు పోసి భక్తితో నమస్కరించుకుంటా.. ఆయనే మహా విష్ణువు.అదిగో ఆ రావి చెట్టు పశువులకు, మనుషులకు నీడ. పక్షులకు ఆవాసం. అది త్రిమూర్తుల స్వరూపం. ఇదిగో ఈ రుబ్బురోలు పొత్రం ఆరుబయట వెలిసిన శివాలయం. ఓ చెంబుడు నీళ్ళు పోసి కడిగి భక్తితో నమస్కరించుకుని బియ్యం పప్పు పోసి రుబ్బుకుని చేసుకుని తింటా అదే మహా ప్రసాదం. అన్ని చోట్లా ఆయనే. అంతెందుకు నీలోనూ వున్నాడు నాలోనూ వున్నాడు. రోజూ రెండుపూటలా దీపం పెట్టి నాలుగు పూలు పెట్టుకునో పండు పెట్టుకోనో దణ్ణం పెట్టుకుంటాను. పుష్ఫం పత్రం ఫలం తోయం అన్నాడు భగవంతుడు. ఆ నాలిగింటిలో యేదో ఒకటి సమర్పించుకుంటే చాలదా? దేవుడిని దర్శించుకోవాలని కుటుంబాలు కుంటుంబాలు తరలి వెళ్ళడం అదీ ఖర్చు కలిసి రావాలని కార్లలో వెళ్ళడం సమయం కలిసిరావాలని డబ్బు ఆదా చేయాలని వేళకాని వేళల్లో ప్రయాణం చేయడం పరిపాటి అయిపోయింది. తప్పు ఎవరిదైనా గాలిలో కలిసిపోయే ప్రాణాలెన్నో, తల్లికి బిడ్డ వుండడు భర్త వుండడు. భర్తకి భార్య వుండదు బిడ్డ వుండడు. ఎందుకమ్మా యీ మూకుమ్మడి కుటుంబ ప్రయాణాలు ? ఆ పుణ్య క్షేత్రానికి వెళ్ళే డబ్బుతో ఒక గేదెనో దూడనో కొని ఓ పేద కుటుంబానికి ఇవ్వు ఆ గేదె ఉన్నన్నాళ్ళు ఆ కుటుంబానికి నువ్వే భగవంతుడివి "అంది. నాకు నోటమాట రాలేదు ఆమె వాగ్ధాటికి వితరణకు.
ఇంతలోకి ఒకతను వచ్చి "అమ్మా పాస్టర్ గారు వచ్చారమ్మా. మీతో మాట్లాడాలంట"అన్నాడు.
"వస్తున్నాను పదరా .. జోసెఫ్, అమ్మా కాసేపు నడుం వాల్చు. నేనెళ్ళి వాళ్ళతో మాట్లాడి వస్తా " అని బయటకి వెళ్ళింది.
నేనేమో నాయనమ్మ మాటలను మననం చేసుకుంటూ ఆలోచనల్లో పడ్డాను. తను అమెరికాలో కొడుకింట్లో వున్నప్పుడు నిత్యం పూజ చేసి మరునాడు ఆ నిర్మాల్యం తీసాక యెక్కడ వేయాలి అనే పీకులాట మొదలయ్యేది. డస్ట్ బిన్ లో వేయడానికి మనసొప్పదు. పోనీ పారే నీళ్ళలో పడేద్దామా అంటే అక్కడకి తను వెళ్ళలేదు. ఒకోసారి కారులో వెళుతూ తనతో పాటు తీసుకెళ్ళేది. నీళ్ళు కనబడ్డచోట కారు ఆపమని కొడుకుని అడిగేది . కొడుకు తనని పిచ్చిదాన్ని చూసినట్టు చూసి మళ్ళీ అంతలోనే జాలిపడి యిక్కడ కారు ఆపడం కుదరదమ్మా అనేవాడు. నిర్మాల్యం యెక్కడ పోయాలి? మన దేశంలో పారే నీటిలో యెక్కడ బడితే అక్కడ కుమ్మరించి వేయడమే. ఒక్క నిర్మాల్యం అని యేముందిలే. పరిశ్రమల కాలుష్యాన్ని మనుషుల కాలుష్యాన్ని పనికిరాని వస్తువులను అన్నింటిని నీరు కనబడితే చాలు అందులో వదిలేయడమే అంది. ఇక్కడలా చేసేవు సుమారు ఐదొందలు డాలర్ల వరకూ ఫైన్ వేసి ఒక వారం రోజులు సోషియల్ సర్వీస్ చేయిస్తారు. అంటే రోడ్లు ఊడ్వడం లాంటి పనులన్నమాట అని హెచ్చరించాడు. వచ్చేదాకా నిర్మాల్యంని ప్లాస్టిక్ కవరులో నింపి అలాగే వుంచింది. నిర్మాల్యం భగవంతుడికి మేరు పర్వత శిఖరం కన్నా బరువైనది అవునో కాదో కానీ తన ఆలోచనల్లో అది అంతకన్నా యెక్కువ భారమై కూర్చుంది. ఆఖరికి తిరిగి వచ్చేసేరోజు ఆ నిర్మాల్యం వున్న సంచీని కొడుకుకి చూపించి దీనిని తీసుకెళ్ళి పారే నీటిలో వేయి నాన్నా, లేకపోతే పచ్చని చెట్టు మొదట్లోనన్నా వేయి అని పదే పదే చెప్పింది. అలాగేలేమ్మా..దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావ్. కూల్ గా వుండు. నేను నువ్వు చెప్పినట్లే చేస్తానుగా అని కొడుకు హామీ ఇచ్చాక మనసు నెమ్మది పడింది.
నాయనమ్మ అన్నట్టు పత్రం పుష్పం ఫలం తోయం అంటారు. తోయమొక్కటి సమర్పించి హృదయ పుష్పాన్ని సమర్పించి భక్తితో నమస్కారం చేసుకుని విశ్వాసంతో వుండటమే కదా చేసుకోవాల్సింది. తను కూడా అలా చేయడం లేదు. భక్తిలో ఆడంబరాలు ప్రవేశించాక నిర్మాల్యం యెక్కువైపోతుంది. వాటిని తీసుకెళ్ళి నదులలో పోయడం. నదుల ప్రక్షాళన చేయడానికి మానవశ్రమ పాటు ఆర్ధిక భారం యెక్కువైపోతుంది. విదేశాలలో లాగా ప్రభుత్వం దండిగా పరిహారం విధించాలి. అప్పుడు గాని మనుషుల్లో చైతన్యమూ జాగురుకత రాదు. విదేశాలకు వెళ్ళిన పిల్లలకు లోలోపల మాతృభూమిపై మమకారం వున్నప్పటికి వారు మళ్ళీ వెనక్కి తిరిగి రాకపోవడానికి కారణం రెండే రెండు మాటల్లో చెపుతారు. మనకి క్రమబద్దీకరణ లేని ట్రాఫిక్, అపరిశుభ్రత. ఎంత గొప్ప దేశాన్ని అలా కాలుష్య కాసారం చేసుకుంటున్నామో కదా అని బాధ పడ్డాడు కొడుకు.
మొన్నెప్పుడో రాత్రి ఎనిమిది గంటల వేళ కాశీ విశ్వేశ్వరుడిని ప్రత్యక్ష ప్రసారంలో చూపిస్తుంటే అరగంట పైనే చూసింది. మారేడు దళాలు పుష్పాలు గంధం విభూది ఇంకా నానారకాల పూజాద్రవ్యాలను సమర్పించి కొండంత యెత్తులో స్వామిని ముంచేశారు. నిర్మాల్యం తీసేవాళ్ళు తీసేస్తుంటే భక్తిగా సమర్పించేవాళ్ళు సమర్పిస్తూనే వున్నారు. అది గుడి కాబట్టి సరిపోయింది.. అదే ఆరుబయలు ప్రదేశంలో లింగరూపంలో స్వామిని ప్రతిష్టింపజేసి వుంటే ఈ దేశ జనులంతా కలిసి మరో కైలాసపర్వతాన్ని స్వామి చుట్టూరా నిర్మించి వుందురేమో అన్న ఆలోచన వచ్చింది. చెంబుడు నీళ్ళు చాలు అని చెప్పేడన్నా కూడా వినిపించుకోని మూఢ భక్తీ. భగవంతుడిని తోటి ప్రాణులలో చూడటం నేర్చుకుంటే మనం వారికి చేసే ప్రతి సాయం స్వామికి నైవేద్యమే అవుతుంది కదా అనుకుంటుంది ఎన్నోసార్లు.
మొట్టమొదటిసారి ముంబాయిలో గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర సముద్రాన్ని చూసిన ఆనందంలో వువ్వెత్తున ఆటుపోట్లు వస్తున్నప్పుడు వుత్సాహంగా రెండు అడుగులు ముందుకేసినప్పుడు నీళ్ళతో పాటు కాళ్ళకు పాముల్లా చుట్టుకున్న ప్లాస్టిక్ సంచులను చూసి కల్గిన బెరుకు యిప్పటికీ తగ్గలేదు.
కొన్ని దేశాలలో బీచ్ లు ఎంత పరిశుభ్రంగా వుంచుతారో. మనకి చెత్త పేర్చడం తప్ప శుభ్రం చేయడానికి వొళ్ళు వొంగదు.అంతా వ్యర్ధం వ్యర్ధం బయో వేస్ట్ ఇండస్ట్రియల్ వేస్ట్ మెడికల్ వేస్ట్ కెమికల్ వేస్ట్ అన్నింటిని పంచభూతాలు భరించి తమలో కలిపేసుకుంటున్నాయి కాబట్టి ఈ మాత్రం మానవుడు రోగాలతోనన్నా బ్రతికి వున్నాడు వుంటున్నాడు. అప్పుడప్పుడు ప్రకృతి ప్రకోపాన్ని చవిచూస్తున్నాడు. పంచ భూతాలూ ఈ వ్యర్ధాలను స్వీకరించని రోజు వ్యర్ధాల మధ్య మరో వ్యర్ధంగా మిగిలిపోయే రోజు వస్తుంది అని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నా మార్పు రావడంలేదేమిటో ? ఇలా ఆలోచనలు సాగిస్తుంటే "అమ్మాయి కన్నంటిందా, టీ పెట్టుకుందాం చుట్టింట్లోకి పోదాం పద" అంది మంచం దగ్గరకి వచ్చి.
"లేదు నాయనమ్మా, ఏదో ఆలోచిస్తూ వున్నాను అంటూ లేచి నాయనమ్మతో కలిసి చుట్టింట్లోకి వెళ్లాను. చుట్టింటి పక్కనే కొట్టు గదిలో నుండి ధాన్యం బస్తాలు తీసి రిక్షా మీద వేస్తున్న పాలేరు.
"మిల్లుకు వడ్లు పంపుతున్నానమ్మా, నాలుగెకరాలలో రసాయన ఎరువులు పురుగుమందులు చల్లని ధాన్యం పండిచ్చుకోవడం పిల్లలు ఎవరొచ్చినా బియ్యం కొబ్బరి నూనె పప్పులు పచ్చళ్ళు కారాలు వడియాలు అన్నీ పట్టుకెళతారు. నేను ఉండన్నాళ్ళు ఆమాత్రం జరుగుతాయి . తర్వాత ఎవరి పాట్లు వాళ్ళవి అంది.
:నీకున్న శ్రద్ద వోపిక ఎవరికీ వుండదు నాయనమ్మా! మేము కూడా ప్రశాంతంగా వుంటుందని మావూరికి వెళ్ళిపోయాం. ప్లాట్ పరిసర ప్రాంతాలలో యెటు చూపినా పచ్చని పంటపొలాలు అనేకమైన వృక్షాలు అపార్ట్మెంట్ చుట్టూ బోలెడు పూల మొక్కలు ప్రక్కనే ఖాళీ స్థలంలో వున్న రావిచెట్టు పై వచ్చివాలే అనేక పక్షులు చూడటానికి యెంత మనోహరంగా వుండేదో. ప్రతిరోజూ పక్షుల కిలకిలా రవాలతో నిద్ర లేవడం చెఱువు గట్టుపై వున్న గుడిలో నుండి వినవచ్చే మంత్రోచ్చరణ చేయి పట్టుకుని బాల్యంలోకి తీసుకువెళ్ళేయి. అందరూ మీ యింటికి రావాలంటే కష్టంగా వుంది అనడం మొదలెట్టినా వినిపించుకోలేదు నేను. వచ్చీపోయే చుట్టాలు, స్నేహితుల కోసం రెండు దశాబ్దాలు రణగొణధ్వనుల మధ్య అశాంతిగా బ్రతికాము. ఇప్పుడింటికి వచ్చే ఆత్మీయులను మీకు కష్టం లేకుండ బస్టాప్ లో దించుతానులే అని హామీ యిస్తున్నాం. ఒక ఏడాది కాలంలోనే మా ఇంటి చుట్టుపక్కల ఖాళీ స్థలంలో చెట్లన్నీ మాయం. అక్కడ చెట్లన్నీ కొట్టేసి స్థలాన్ని అభివృద్ధి చేయడానికి వొప్పందాలు కుదుర్చుకున్నారట. ఆ చెట్లపై ఆవాసముండే పక్షుల ఆరాటం ఆ పరిసరాలలో గిరికీలు కొడుతూ చేసే ఆర్తనాదాలు అర్ధం చేసుకోవడానికి పక్షుల భాష వచ్చివుండాల్సిన అవసరం లేదనిపిస్తుంది. కొన్ని నెలల తర్వాత కూడా ప్రతి రోజు సాయంసంధ్యలో కొన్ని పక్షులు వచ్చి అక్కడక్కడ తచ్చాడి పోతాయి. చిన్ని చిన్న పక్షులకు బాల్కనీ లో పెంచుకుంటున్న మొక్కలే పెద్ద పెద్ద వృక్షాల మాదిరి కాబోల్సు. ఇరుసంధ్యలలో వచ్చి సందడి చేసి వెళుతుంటే వాటికి కొంచెం సేపైనా ఆతిధ్యం ఇచ్చినందుకు ఆనందంగా ఉంటుంది నాకు" అని ఏకధాటిగా చెప్పేసెను.
"ఎక్కడ చూసినా ఇదే పని అంటగా. పేపరులో చదువుతున్నాగా" అంది.
"ఈమాత్రం మనసు విప్పి మాట చెప్పుకోవడానికి కూడా అక్కడ యెవరూ లేరు నాయనమ్మా, ఉన్నా నేను చెప్పేది విని నన్నువో పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారు" అన్నాను.
"అవునూ.. మీ ఆయనకీ పెద్ద దొడ్డి ఉండాలిగా మీ వూర్లో, ఎన్ని పాడిగొడ్డు వుండేయో, ఆ రోజులన్నీ పోయి పాలు కొనుక్కునే యవ్వారంలోకి వచ్చారు. ఇంతకీ ఆ స్థలం అట్టాగే వుందా అమ్మేసుకున్నారా?" ఆరా తీసింది.
"వుంది నాయనమ్మా. అన్నదమ్ములిద్దరికీ వాటా వుంది. సొంత ఇల్లు కట్టాలని నేనూ, అపార్ట్ మెంట్ కి యివ్వాలని వాళ్ళు అది తెగని వ్యవహారం అయింది" అన్నాను నిసృహగా.
"ఇల్లు కట్టాలంటే మాటలా.. అట్టాగే అద్దెకి వుండి చెట్లు పూల మొక్కలు కూరగాయల మొక్కలు వేసుకో. ఇప్పుడు కొని తినేవన్నీకల్తీ అయిపోయే" అంది. నా మనసులో వున్న మాట చెప్పేసరికి చిన్నగా నవ్వుకుని అట్టాగే నాయనమ్మా అన్నాను.
"కాలికి మట్టి అంటకుండా వొంటికి చెమట పట్టకుండా చేతికి మెతుకు అంటకుండా వొంటరి బతుకు బతకడం నాగరీకం అయిపోయిందర్రా. నాగరికత అంటే పది తరాల తర్వాత కూడా మనకి నిత్య జీవితంలో పనికి వచ్చేది అవ్వాల్రా ,ఈ కుంపటి ఈ మట్టి కుండ పనికి రాని కాలం ఉంటాదేమో కాస్త ఆలోచించి చెప్పు" అంది.
"నేనూ అదే ఆలోచిస్తున్నాను నాయనమ్మా ! మనీ మేనేజ్మెంట్ కోర్స్ చదువుకోవడం అవసరమేమో కానీ మనుషులు ప్రకృతికి దగ్గరగా బతకడం నేర్చుకోవడం మరీ అవసరం".
"యెప్పటి నుండో ఇంకుడు గుంటలు అని మొత్తుకున్నా యెవరూ వినడం లేదు, చెట్లు నరికేవాడే కానీ మొక్క నాటే నాధుడు లేడు, వానలు లేక నేల నెర్రులిచ్చి బావులు బోర్లు అడుగంటిపోయి ధాత్రి పుత్రులు ప్రాణులంతా దాహంతో అలమటిస్తున్నారు. మన దొడ్లో ఇంకుడుగుంత తవ్వించ బట్టి బావిలో నీళ్ళు వుంటున్నాయి. పల్లెటూర్లలో కూడా యెక్కడ చూసినా ప్లాస్టిక్ భూతం. మనిషి జీవితావసరాలతో చుట్టుకుని వుక్కిరిబిక్కిరి చేస్తుంది. సముద్రాలలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ కొండలు ప్లాస్టిక్ కోరలకు చిక్కుకుని అంతరించిపోతున్న జలజీవాలు. ఎవరిచ్చారు మానవుడికి ఈ హక్కు ? ఈ భువికి తనొక అతిధిలా వచ్చాడు. ఇతర జీవాల వునికిని నాశనంచేసి వుసురు పోసుకుంటున్నాడు. మనకి వ్యర్దంలో నుండి అర్ధం వెతుక్కునే మార్గాలు కావాలి. అసలు వ్యర్ధం కానివి అంటూ లేని జీవన విధానం కావాలి. నీవరకు నీకు చెపుతున్నా విను. గుడికి వెళ్ళేటప్పుడు పూజా ద్రవ్యాలు తగ్గించుకుని ముఖ్యంగా ప్లాస్టిక్ పేకింగ్ లో వచ్చేవి కొనడం ఆపేయి. మార్కెట్ కి వెళ్ళేటప్పుడు గుడ్డ సంచీలు పట్టుకెళ్ళడం మర్చిపోకు. సరుకులు కాగితాలలో పొట్లాం కట్టి యిచ్చే వాళ్ళ దగ్గరే తీసుకో , అట్టా యెవరికివాళ్ళు ఉద్యమంలా చేస్తే తప్ప మన పర్యావరణం బాగుపడదు" అంది.
థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ కొటేషన్ తెలియకపోయినా ప్రకృతిని బాగా అర్ధం చేసుకుని ప్రకృతికి అనుగుణంగా బ్రతకడంలో నాయనమ్మకు ముందు చూపు వుందనీ ఆనందమూ వుందని నాకర్ధమై .. మా నాయనమ్మ అందరికీ ఆదర్శం ఎందుకైందో కూడా మరొకసారి తెలిసొచ్చింది .
తపేళ చెక్కలు వేస్తూ తింటూ పొలం నుండి వచ్చిన బాబాయిలతో కలసి టీ త్రాగుతూ బంధువులు గురించి, వ్యవసాయం దగ్గరనుండి అమెరికా ఆర్ధిక విధానం దాకా మాట్లాడుకుంటుంటే సమయమే తెలియలేదు. అబ్బాయ్ పెద్దోడా .. నువ్వు వెళ్ళేటప్పుడు చెక్ బుక్ తీసుకుపోయి రేపు వచ్చేటప్పుడు డబ్బులు పట్టుకుని రా. ఇందాక ఫాస్టర్ గారు వచ్చారు. ఆ పిల్లాడెవరో అప్లికేషన్ పెట్టుకున్నాడు కదా. వాళ్ళు బాగా పేదవాళ్ళే లే, పిల్లాడు బాగా చదువుతాడని మార్కుల లిస్ట్ అవి చూస్తే అర్ధమయ్యింది. ఆ పిల్లాడికి సహాయం చేద్దాం అంది.
నేను ప్రశ్నార్ధకంగా చూస్తుంటే.. అమ్మ నీకు చెప్పలేదా ఆ విషయాన్ని ? మన ఊరికి అభివృద్ధి నిధి అని వొకటి యేర్పాటు చేశావమ్మా. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి ఆ నెంబర్ అందరికి యిస్తున్నాం. మన ఊరి వాళ్ళు దేశవిదేశాల్లో వున్నవాళ్ళు ఆ అభివృద్ధి నిధికి తమకి తోచినంత డబ్బు పంపుతున్నారు. ఆ డబ్బుని మన ఊరి పేదపిల్లల చదువులకు వుపయోగిస్తున్నాం. ఊరిలో అందరూ కలిసి అమ్మని సెక్రటరీగా ఎంపిక చేసారు. పది సెంట్ల స్థలంలో హాస్టల్ కూడా కడుతున్నాం. పేద ఆడపిల్లల కోసం. అర్హత కల్గినవాళ్ళకి ఉచిత వసతి తిండి బట్టా ఫీజులు అన్ని ఈ అభివృద్ధి నిధి నుండే తీసి ఖర్చు పెడుతున్నాం. నువ్వు కూడా సాయం చేయాలనిపిస్తే చేయొచ్చు అని అభివృద్ధి నిధి వివరాలున్న కార్డ్ యిచ్చాడు బాబాయి.
అది తీసుకుని చూసి నాయనమ్మ దగ్గరకు వెళ్ళి అభినందనలు తెలిపే భాష తోచక యిష్టంగా కావిలించుకున్నాను. ఆమె స్పర్శ చల్లగా ఉత్తేజంగా అనిపించింది. "ప్రభుత్వాలు చేసేది కాకుండా మన ఊరికి మనమూ ఎంతో కొంత చేసుకోవాలిగా అమ్మాయ్. ఆరు నెలల్లో ముప్పై లక్షల డబ్బు ఆ నిధికి జమ అయినాయి. వచ్చిన డబ్బు యెవరు పంపారు, యెన్ని పంపారు, దేనికోసం ఖర్చు పెడుతున్నాం అన్న వివరాలను కాగితాల్లో రాసి అరుగు మీద గోడకి వేలాడదీసి వుంచుతున్నాం. ఎవరైనా చూడవచ్చు. నువ్వు కూడా మీ అబ్బాయికి చెప్పు" అంది. "అలాగే నాయనమ్మా" అన్నా.
నాయనమ్మ కేలండర్ తీసి తిధి నక్షత్రం చూసి పూజకు ఉపయోగించిన పూల నిర్మాల్యాన్ని వుంచిన వెదురు బుట్టను తీసుకుని పెరటిలోకి వెళుతూ రా .."మనమరాలా! తోట చూద్దువుగాని. నీకు మొక్కలంటే ఎంత ఇష్టమున్నానువ్వు పెంచగలిగేది కుండీలలోనే కదా ! కాసిని పొట్లకాయలు బెండకాయలు ఆకు కూరలు కోసి ఇస్తా, పట్టుకెళ్ళుదువుగాని" అని పిలిచింది.
ఆమె వెనుకనే పెరటి తోటలోకి వెళ్లాను. అనావృస్టి కాలంలో కూడా పచ్చగా వెలిగిపోతుంది పెరడు. అనేక పూల మొక్కలు దొండ పందిరి పొట్ల పందిరి ఆకు కూరలు ఎక్కడ చూసినా హరితమే. ప్రతి మొక్కని తాకి తాకి చూసి పులకరించిపోయాను.
నేను పరిశీలనగా పెరటి తోట చూస్తుంటే నాయనమ్మ చిన్న గడ్డపలుగు తీసుకుని గొయ్యి తీస్తూ “భగవంతుని చేరే దారిలోనూ చేరాక అన్నీ పవిత్రమైనవే. పిమ్మట కూడానూ అవి నిర్మాల్యంగా భావింపబడతాయి. దానిని “ చెత్తకుండీ దృష్టితో చూడకూడదు వ్యర్థం లోనూ అర్థం వెతుక్కోవడం సంస్కారవంతుల లక్షణం " అని చెప్పి తీసిన గోతిలో నిర్మాల్యాన్ని వేసి ఒక నమస్కారం చేసుకుని మళ్ళీ మట్టి వేసి ఆ గోతిని పూడ్చేసింది. "నిర్మాల్యమైనా మనం వాడిన తర్వాత వచ్చే యే వ్యర్ధమైనా పంచ భూతాలలో కలిసి పోవాలి. అలా కలిసిపోని విధంగా మన చేష్టలు ఉండకూడదు. అదే ముందు తరాలకు మనమిచ్చే మూలధనం” అంది. నేను ఆమె మాటలను కృష్ణ భగవానుడు చెపుతున్న గీతావాక్యంలా విన్నాను.
పొట్ల పందిరి క్రిందకి వెళ్ళి ఒక పొడవైన కాయను చూపించి తొలిసారి కాసిన కాయ ఇది అంటూ ఆ కాయను తెంపి పక్కన పెట్టింది. ఇంకో రెండుమూడు కాయలు మిగిలిన రకాలు అన్నీ తెంచి వెదురు బుట్టలో సర్దుకొచ్చింది. ఎంతసేపటికి పక్కన పెట్టిన పొట్లకాయ మీదనే నా చూపు ఆగుతుంది. ఎంత నేవళంగ వుంది నాకిస్తే బాగుండుననే ఆశ. మల్లెలు సన్నజాజిపూలు పూలు కోసుకుని మాల కట్టుకుంటూ వుండు. నేను కుంపటి ముట్టించి పాలు తీసుకొస్తానంటూ వెళ్ళింది. మాల అల్లడం పూర్తయ్యేసరికి చిక్కని ఫిల్టర్ కాఫీ గ్లాస్ చేతికిచ్చింది. ఇలాంటి రుచులకు దూరమై నాగరికంగా బ్రతికే బ్రతుకులకు అర్ధం లేదనిపించింది నాకు. కాయకూరలన్నీ గుడ్డ సంచీలో సర్ది మధ్యలో ఇత్తడి డబ్బా సర్దింది. అదెందుకు నాయనమ్మా అవన్నీ యేమీ వద్దు అంటుంటే అది నేతిడబ్బా లేవే! మీ ఆయనకు మైసూర్ పాక్ అంటే ఇష్టంగా, చేసిపెట్టు. నేనేమన్నా కొని యిచ్చానా,యింట్లో పాడేగా అంది. ప్రతి చిన్న విషయమూ యెంత గుర్తు ఈమెకి అని ఆశ్చర్యపోవడం నావంతు అయింది. నన్ను వీధి గుమ్మందాకా సాగనంపడానికి వస్తూ చిన్న చెంబులోకి పాలు పక్కన పెట్టిన పొట్లకాయ తీసుకుని వచ్చింది.
"ఇంటి ముందు టైలర్ మస్తాన్ కూతురు నీళ్ళోసుకుని వుంది. నలుగురి పిల్లల మధ్య చాలీచాలని సంపాదన మధ్య ఆ పిల్లకి సరిగా పోషణ చేయలేకపోతున్నారు. ఆ బూబమ్మకి ఈ కాయ యిస్తే వేడి వేడిగా పాలుపోసి కూర వొండి పెట్టుద్ది" అని అంది.
ఆమె వద్ద వీడ్కోలు తీసుకుని వస్తూ .." నాయనమ్మ జీవన విధానం నుండి నేర్చుకోవాల్సింది రుచి చూడాల్సినది ఎంతో ఉంది. అందుకోసమైనా తరచూ ఆమె దగ్గరకు రావాలి. ఆమె చేసిన పూజలేమో కానీ ఆమె ఆలోచనా విధానమే ఆ యింటికి రక్షణ అయిందని అనుకున్నాను కూడా.
“ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నవా తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే “ పాట సాహిత్యం గుర్తు చేసుకుంటూ నా వంతుగా నా ఊరికి చేతనైన సాయం చేయాలి. వీలైనంతగా ప్రకృతి సిద్దంగా బతకడమెలాగో తెలియజేసే పని మొదలెట్టాలి. అది గుడి బడి నుండే ప్రారంభం కావాలి. నిర్మాల్యం భగవంతుడికే కాదు మనకి యెంత బరువో యెంత హాని జరుగుతుందో ప్రమాద ఘంటికలు వినిపిస్తూ చూపిస్తూ మరీ తెలియజేయాలి. అందుకు కంకణం కట్టుకుని ముందుకు నడవాలి అనుకుంటూ యింటికి చేరి మా ఇంటాయనకు యీ విషయాలన్నీ ఎపుడెపుడు చెపుదామా అని ఆయన కోసం ఎదురుచూస్తూ నాయనమ్మ మాటలు మననం చేసుకుంటున్నాను
నేనింకా ఆ మత్తులో ఉండగానే శ్రీకాంతాచారి నుండి ఫోన్. రేపటి సంకటహర చతుర్ధికి సోమవార అభిషేకానికి పూజ సామాగ్రి అన్నీ రెడీ చేసుకున్నారా అని. నాకు వీలుపడదు లెండి అన్నాను అప్రయత్నంగా. ఆ పూజకయ్యే ఖర్చు అంతా మరొక రకంగా మానవ సేవకు ఉపయోగించాలని అనుకున్నా కాబట్టి.
మర్నాడు గుడికి వెళ్లకుండానే ఏ అలంకారాలు లేని నిర్మలమైన ఆకారంతో ప్రశాంతంగా విరాజిల్లుతున్న భగవంతుని రూపాన్ని జ్ఞాననేత్రంతో దర్శించుకున్నాను. నదిలో కలపాలి అనుకున్న నిర్మాల్యాన్ని తీసి ఖాళీ కుండీలో వేసి మట్టిపోసి పైన ఒక నిత్యమల్లి మొక్కని నాటాను.
***************సమాప్తం*********************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి