కారు ఊరిని వెతుక్కుంటూ బయలుదేరింది.
గూగుల్ మ్యాప్ సాయంతో ఊరు చేరిన చంద్ర డ్రైవర్ తో “ఆంధ్ర దేశంలో ఊళ్ళన్నీ ఇలాగే వున్నాయా?”
“ఆ.. ఇలాగే వుంటాయండీ. రైతువారీ పద్దతి ఇప్పుడు ఎక్కడుందండీ, జనం అంతా సిటీల్లోనే కదా వుండేది” . వివరణో ఆరోపణో అంతు చిక్కలేదు.
“ఎప్పుడో ముప్పై ఏళ్ళ కిందట మా తాత చనిపోయినప్పుడు వచ్చాను. సరిగ్గా ఇల్లు కూడా గుర్తు పట్టలేను.లీలగా జ్ఞాపకం. తండ్రి భూషణరావుకి ఫోన్ చేసాడు. ఎంగేజ్ వస్తుంది. “ఎవరితోనో మాటల్లో వున్నారు. ఈలోపు ఊరంతా తిరిగి చూద్దాం. గుడి వుంటుంది మా ఇంటికి దగ్గర్లో” సూచన ఇచ్చాడు. ఊరి వీధులన్నీ చుట్టేస్తుంటే అక్కడక్కడా అరెకరంలో కాకపోయినా పది ఇరవై సెంట్ల స్థలంలో వున్న ఇళ్ళు దైన్యవదనాలతో వెలిసిపోయిన రంగులతో ముందు వాకిట్లో జిల్లేళ్ళు మొలిచి వెనక పెరడంతా పిచ్చి చెట్లు అలవికాని తీగలు అల్లుకుని లోపలికి అడుగుపెట్టడానికి వీలుకాకుండా వున్నాయి. పరీక్షగా మనసుపెట్టి చూస్తే దీపం పెట్టే దిక్కు కోసం అలమటిస్తూ గత జ్ఞాపకాలతో ఊపిరి పీల్చుకుంటున్నట్టు వున్నాయి. కొన్ని ఇళ్లు రేపో మాపో కూల్చివేయబడటానికి సంసిద్దంగా వున్నాయన్నట్లున్నాయి.
మనుషులు ఈ ఇళ్ళను నిర్మించుకునేటప్పుడు తమ భావి తరాలు రాజ్యాలు ఏలినట్టు ఊరిని ఏలాలనుకుని ఎన్నెనో ఊహలు కలలు ఆశలతో ఉత్సాహంతో ఇల్లు కట్టించుకుని వుంటారు!? వందేళ్లు గడిచినా చెక్కు చెదరని ఆ ఇళ్ళల్లో వారసులు లేకున్నా సరే మనుషులైనా ఉండటం లేదు. బదులు ఎలుకలు పందికొక్కులు పాములు గబ్బిలాలు రాజ్యమేలుతూ భీతిగొల్పుతున్నాయి అనుకున్నాడు చంద్ర.
గుడి దగ్గరకు చేరుకున్నాక.. అక్కడికి దగ్గరగా వున్న ఇల్లును గుర్తించాడు. వీధి దర్వాజాకి అటునిటూ గోడపై నిలిపిన ఎద్దుల బొమ్మలు. ఠీవిగా కనబడుతున్నా పాకుడుబట్టి నల్లబడిపోయి కళ కోల్పోయి పెచ్చులూడిపోయి గత వైభవ చిహ్నాలుగా మిగిలివున్నాయి. దర్వాజా పక్కన నల్లటి రాతి పలక పై తాత తాత పేరు. లంకా రామచంద్రయ్య. ఆయన పేరే తన పేరు కూడా! తరాలు మారుతూ నాగరికత అద్దుకుంటూ తన దాకా ప్రయాణించింది. దర్వాజా తలుపులు మూసి తాళం వేసి వుంది. పగలగొట్టడానికి కూడా సాధ్యపడని ఇత్తడి తాళం అది. అప్పుడు వచ్చాడు పొలం కౌలు కు చేసే తిరుమలరావు. తనను పరిచయం చేసుకుంటూ “వచ్చేటప్పుడూ ముందుగా చెప్పాల్సింది బాబూ!” అన్నాడు.
“లోపలికి వెళ్ళడానికి వీలవుతుందా”.
అతను గొడ్డలి కొడవలి తెచ్చి కాస్త దారి శుభ్రం చేసాక వరండా వరకూ వెళ్ళడం వీలైంది. సింహద్వారం ముందు వున్న మెట్లపై కూర్చుని చుట్టూ పరికించాడు. రాతి పలకల్లోంచి రావిచెట్లు మొలుచుకొచ్చి మనిషి ఎత్తును దాటి కొమ్మలు విస్తరించాయి.
“శుభ్రం చేస్తానే వుంటామండీ మళ్ళీ పుట్టుకొస్తాయి.కొబ్బరిచెట్లకాయలు మామిడికాయలు వొక్కటి మిగలనీయరండీ,గోడలు దూకి కోసుకెళ్ళిపోతారు”
గోడలవైపు చూసాడు. ఏడడుగులెత్తు. పెదవులు విచ్చుకున్నాయి చంద్ర కి.
ఇల్లు లోపల కూడా చూద్దురుగాని రండి. తాళం తీసి లోపలికి నడిచాడు. మాస్క్ తగిలించుకుని లోపలికి వెళ్ళాడు. చీకటి గుహలా గబ్బిలాల నిలయం లా తోచింది. “అంతా పాడుబడిపోయిందండీ, స్థలమే కానీ ఇల్లు ఏ మాత్రం పనికిరాదు అండీ” అభిప్రాయం వెలిబుచ్చాడు తిరుమలరావు. ఫోన్ టార్చ్ వేసుకుని వేలాడుతున్న సాలెగూడులు తెంచుకుంటూ ఇల్లంతా తిరిగిచూసాడు చంద్ర.
ఆజానుబాహుడు ఒంటిమీద ఎర్రమట్టి రంగు తేలుతూ ముతకపంచె చొక్కా పైపంచె వేసుకుని తలపాగా చుట్టుకుని లావుపాటి వెండి కడియం తొడిగిన దండ చేతిలో చేతి కర్ర ఊతగా చేసుకుని నిలబడ్డ వృద్దుడు కళ్ళముందు కదలసాగాడు. కుడి చెవి కి కుట్టిన బంగారు కాడ దానికి వేలాడే బుళాకు దట్టమైన కనుబొమలు విశాలంగా వుండే నుదురు పెద్ద పెద్ద కళ్ళు కోటేరేసిన ముక్కు గుబురు మీసాలు నిడుపాటి గడ్డం ఎర్రని పెదవులు సాగదీసి పళ్ళన్నీ కనిపించేలా నవ్వే నవ్వు. తన వెనుక నీడలా అనుసరిస్తున్నట్టు అనిపించసాగింది చంద్ర కి.
“ ఉరమరగా తొంబై ఏళ్ళు ఈ ఇల్లు కట్టి. నాకు అప్పటికి యాభై యేళ్ళు పై మాటే, మారేడుమిల్లి కొయ్యలగూడెం అడవులకు వెళ్లి నల్లమద్ది టేకు చెట్లు నరికించి దూలాలు చేపిచ్చి గానుగ సున్నంతో కట్టిన ఇల్లు. ఐదుగురు కొడుకులకు ఐదిళ్ళు కట్టిచ్చా” అని ఆ మనిషి చెబుతున్నట్టు తను విన్నట్టు వుంది అనుకున్నాడు.
బ్లాక్ మ్యాజిక్ సినిమాలు గుర్తొచ్చి మనసులో చిన్నపాటి జంకు.దాన్ని జయించడానికి.. తిరుమలరావుతో మాట కలుపుతూ “మీ పిల్లలు ఏమి చేస్తారు అడిగాడు. “డిగ్రీ దాకా చదువుకున్నారండీ. ఉద్యోగాలు రాలేదండీ. ఆ అమెజాన్ లో స్విగ్గీ జొమాటో ల్లోను డెలివరీ బోయ్ లుగా పనిచేసి ఎదుగుబొదుగు కనబడక తిరిగి వచ్చేసారండీ. నాలుగు గేదెలను కొన్నాం. రోజుకు ఇరవై లీటర్ల పాలు అమ్ముతాం. ఒకడు ఆ పని చేస్తాడు. ఇంకొకడు మునగతోట వేసి అంచులెంట ఆర్గానిక్ కూరగాయలు పండిస్తాడండి. ఈ ఏడు మా సొంత పొలంలో రెండు ఎకరాల జెముడు మొక్కలు వేసామండీ. ఇప్పుడిప్పుడే కాయలు వచ్చాయండీ. మరో రెండు ఏళ్ళకు చేనంతా పూర్తి పంట కొచ్చేత్తది అండీ. గర్వం తొంగిచూసింది. తను బ్యాక్ యార్డ్ లో కూరగాయలు పండించినప్పటి సంతోషం లాంటిది వెయ్యరెట్లు పైనే కనబడింది చంద్ర కి.
మళ్ళీ అతనే అన్నాడు. “బాబయ్యా..మీరు ఈ ఇల్లు అమ్మాలనుకుంటే ఎవరికీ అమ్మబాకండి బాబూ! నేనే కొనుక్కొంటాను. ఏళ్ళ తరబడి మీ భూముల్ని కంటికి రెప్పలా చూసుకొన్నాను కూడానండీ, మీఇంటి మనిషినే అనుకుని కాస్త తక్కువకే ఇయ్యాలండీ” అన్నాడు వినయంగా.
చంద్ర నవ్వి ఊరుకున్నాడు.
“మీ బాబాయి గారితో మాట్టాడి మీరు వెళ్ళిపోయేలోపు ఇల్లు అమ్మకం ముగిచ్చేసుకుని రిజిస్ట్రేషన్ కూడా చేయిచ్చుకుంటే పనై పోద్ది బాబూ! మీ నాన్న గారిని ఎప్పుడడిగినా అబ్బాయిని రానీ వాడు సంతకాలు చెయ్యాలిగా అని దాటేత్తున్నారు. మీరు వచ్చారుగా.. అందుకే తొందరపడుతున్నా. మీ బాబాయి గారిని పిలిచి మధ్యవర్తులను పెట్టుకుని మాట్టాడుకుందాం”. ఈ ఇంటిని తను సొంతం చేసుకుంటే కానీ నన్ను కదలనిచ్చేటట్టు లేడు అనుకున్నాడు చంద్ర. ఇంటి బయటికి వచ్చి చుట్టూ తిరిగి చూసి మళ్ళీ గుమ్మం ముందు మెట్టు మీద కూర్చుని ముఖం తుడుచుకుని బాటిల్ లో నీళ్ళు తాగి.. వరి పొలం, మామిడితోటకి కూడా వెళదాం అన్నాడు.
“అలాగేనండీ.. తమరు కాఫీ టిఫిన్ పుచ్చుకున్నాక వెళదాం, మా ఇంటికి రండి” అన్నాడు తిరుమలరావు.
“దారి మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం తిరిగి వెళ్ళేటప్పుడు చూద్దాం. పొలానికి కారు వెళుతుంది కదా?”
“మీ పొలాలకు రాజమార్గం పడిపోయింది.” నేను బండి మీద వెళతా వుంటా మీరు మావెనకాలే రండి” దారి తీసాడతను.
వెనుక సీట్లో కూర్చుని ఇరుపక్కలా వున్న పంటపొలాలను చూస్తూంటే మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించిందతనికి. ఖాళీ మాగాణి పొలం చూసుకుని మామిడితోటకు వెళ్లారు. మూడు రకాల ఫల భారంతో మామిడి చెట్లు ఏదో సందేశాన్ని ఇస్తున్నట్టు వున్నాయి. డ్రైవరు, తిరుమలరావు ఆవకాయ కు పనికొచ్చే కాయలు పక్వానికొచ్చిన కాయలు కోసి అట్ట పెట్టెల్లో ప్యాక్ చేసుకోవడానికి తోట లోపలికి వెళ్ళారు. కారు సీట్ సరిజేసుకుని విశ్రాంతిగా పడుకొని రెండు రోజులుగా వస్తున్న కలలను విశ్లేషించుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. నిద్ర ఆవహించింది. మళ్ళీ చెవి పక్క గుస గుస వినిపించింది. ఆ చెవి పోగు వున్న మనిషే.గంభీరమైన ఆ గొంతు లో వేదన పొంగిపొర్లుతా వుంది.
“అనిమనుమడా! మా అప్పుడు చెరువు పక్కగా వుండేవి ఈ ముదిరాజుల ఇళ్ళు.ఇప్పుడు ఊరంతా విస్తరించాయి. రైతు కుటుంబాలు వ్యవసాయం వొదిలేసి పోతే ఆ పొలాలను నమ్ముకుని వ్యవసాయం చేస్తూ పాడి పంటలు ఊతగా చేసుకుని వాళ్ళిప్పుడు మన ఇళ్ళను పొలాలను కొనుక్కోగల స్థితిమంతులు అయ్యారు. మన వాళ్ళేమో బియ్యం దొరకని దేశంలో ఏవేవో తిని సర్దుకుంటున్నారు. సత్యం చెబుతాను వినుకో, ఎప్పుడైనా భూమి ఉన్నోడిదే రాజ్యం. పంట పండించిన వాడికే నోట్లోకి నాలుగువేళ్ళు వేళ్ళే కాలం మళ్ళీ వస్తుంది చూడరా! నేను చెప్పేది నిజం అవుద్ది. రాసి పెట్టుకో. కాస్తో కూస్తో వున్న భూమిని ఇల్లును అమ్మవొద్దు రా తండ్రీ!” అభ్యర్ధన.
మళ్ళీ.. ఆ గొంతే.. “అదిగో కనబడుతున్న పాటిదిబ్బలన్నీ వొకప్పుడు మనవే! పొగాకు వేసేవాళ్ళం. బాయి నీళ్లతో మోట తోలి తోట తడిపే వాళ్ళమి. అదంతా నా కొడుకులకి పంచి ఇస్తిని. వాళ్ళు వాళ్ళ కొడుకులికి అప్పజెప్పితిరి. అందరూ అమ్ముకుని పోయారు. నా మనుమడి కూతురు అదే మీ పెద్ద తాత కూతురు. చర్చికి రాసి ఇచ్చింది ఆ స్థలం. ఆ పక్కనే మీ తాతకిచ్చిన స్థలంలో దేవుడి బండలుండేవి. వినాయకుడు సుబ్రహ్మణ్యస్వామి అమ్మవారు అయ్యవారు అంతా వుండిరి. వారికి కప్పు లేకుండే. ఎన్ని తరాలుగా అట్లా వుండిదో నాకు తెలియదు. పట్టించుకునే నాధుడు లేకపోతే గుడి ఏంటి ఇల్లేంటి అన్ని శిథిలమే! ఆ శిథిల శిల్పాలు ఎక్కడెక్కడ వాళ్ళో ఎవరెవరో వచ్చి ఎత్తుకుపోయే. ఇప్పుడు ఆ భూమి లేకపోయే. ఒకప్పుడు బొడ్రాయి మన ఇంటి వెనక వుండేది. ఇప్పుడు దక్షిణపు పక్క ఊరంతా కాలగర్భంలో కలిసిపోయే! నేను పోతిని నా కొడుకులు పోతిరి వాళ్ళ కొడుకులు మూడొంతులు పోతిరి. ఊరొదొలి పోతిరి నగరం వొదిలి పోతిరి దేశం వొదిలి పోతిరి. అట్టా పోయినవాళ్ళు ఎప్పుడో వొకసారి వొచ్చి ఉన్న కాసిని భూముల్ని ఇళ్ళని అమ్మకుంటింటిరి. ఇంకా అమ్ముకోవడానికి నీలా ఊరికి వస్తిరి. నాకు మనసంతా గింజుకుంటది. దుఃఖం తడిపేస్తది.” ఆ మనిషి పొగిలి పొగిలి ఏడుస్తున్న శబ్దం, కట్టవేయలేని దుఃఖం.కట్టడి చేయలేని దుఃఖం. గుండెని మెలిపెడుతున్న దుఃఖం.
“మనుమళ్ళు, ముదిమనుమళ్ళు, అనిమనుమళ్ళు నగరాల్లో మహా నగరాల్లో విదేశాల్లో తలదాచుకోవడానికి ఇంత నీడ కోసం నేల విడిచి సాము చేస్తూ గజాల్లో తమను తాము ఇరికించుకుంటూ పాతిక ముప్పై ఏళ్ళు బ్యాంక్ లకు తమను తాము తాకట్టు పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఈ ఇళ్ళన్నీ ఏం కావాలి, ఈ భూములు ఏమి కావాలి!? నేనూ, పంచపాండవుల్లాంటి నా కొడుకులు ముప్పొద్దులా రెక్కలు ముక్కలు చేసుకుని అరక దున్ని ఆరుగాలం కళ్ళలో వొత్తులేసుకుని పంట పండించి కొండపల్లి నవాబులకు సగం పైగా శిస్తులు కట్టితిమి. మిగిలినయ్యే పొతింగా సర్దుకుంటూ పాలు అమ్మి పెరుగు అమ్మి నెయ్యి అమ్మి పిడకలమ్మి గంజి తాగి కాణీ కాణీ కూడబెట్టి దివాణం వాళ్ళదో అగ్రహారం వాళ్ళదో భూముల్ని కొని సాగుజేస్తిమి. కష్టపడి నూట యాభై ఎకరాలు చేస్తిమి.నాలుగక్షరాలు చదువుకొని వచ్చి మీ ఎకరాలు మీరు సాగు చేసుకోమంటిమి. చదువు చంకనేసుకుని మనవళ్ళు ఊరు దాటెల్లి వాళ్ళ పిల్లల చదువుల కోసమని వ్యాపారం కోసమని భూములని అవగ్గా అమ్ముకుంటురి. “
“ఇక్కడ పండించే వాడు లేక భూమాత పిక్కటిల్లుతుంది. అవగ్గా ఈ భూములన్నీ అమ్ముకుని పోయి ఒక ఐదారు సెంట్లలో ఇల్లు కొంటావ్.. ఈ మట్టిని అమ్ముకుని పోయి అక్కడ మట్టిని మనసారా హత్తుకుగోలవా? నీకో సంగతి తెలుసా! మట్టికి మనిషికీ ఎగతెడని బంధం. మునిమనుమడి కొడుకా!. నీ పూర్వీకులెవరని నీ బిడ్డలు అడిగితే నువ్వు తడుముకోకుండా సమాధానం చెప్పగలవా? వాళ్ళు నడయాడిన నేల ఇది అని గర్వంగా చెప్పగలవా? చూపగలవా?
నేను కూడా మూడవ తరగతి చదువు చదివినాను లే! అప్పుడప్పుడు దొరలతో కూడి షికారికీ పోయేవాణ్ని. మైలారం నాటక సమాజం లో నాటకాలు ఏసినాం చూసినాను.ఇంగ్లీషు రవ్వొంత తెలుసు నాకు.
“మనిషి అంటే what about అంటే నీకెన్ని భాషలు వచ్చు ఎన్ని డిగ్రీలు చదివినావు ఎన్ని కోర్సుల్లో ప్రావీణ్యం సంపాదించావు అన్నదే కాదు.. నువ్వు పుట్టిన దేశం నువ్వు ఆడిపాడిన నేల నీ పూర్వీకులు ఎవరు? వారి వృత్తి ఏమిటి, మీ ఆచారాలేమిటి? అన్నవి కూడా! మనిషి అంటే ఏడు తరాల సంస్కృతి. అది నీ రక్తంలో ప్రవహిస్తూ వుండాలి. తిండికి గడవకపోతే వలసలు పోవాలి. మితిమీరిన కోర్కెలతో పోయి అవస్థలు పడకూడదు.ఆడ చానామందికి నిలవ వీడలేదు చేయడానికి నౌఖరీ లేదు అంట. ఆ అరకొర బతుకులు మీకెందుకు నాయనా!”
“ఆన్లైల్ చదువులు ఆన్లైన్ ఉద్యోగాలు ఒళ్ళొరగని పనులు రకరకాల పైత్య వాత రోగాలు. ఇతర దేశాల నుండి కొనుక్కొచ్చిన దినుసులు ధాన్యాలు ఫ్యాక్టరీ పాలు కొనుక్కొని తింటూ తాగుతూ మీరంతా ఆ శీతల దేశంలో ఏం సంతోషంగా వుండినారు చెప్పు. నువ్వు నీ బిడ్డల్ని తీసుకుని ఊరికి వచ్చేయ్ రా అయ్యా! ఇక్కడ మూడు కాలాలు ఆరు బుుతువుల గొడుగులో వుండటానికి ఇల్లు దున్నుకోవడానికి నేల తాగడానికి స్వచ్ఛమైన నీరు నీ బిడ్డలకు చదువుకోవడానికి బడి గుడి అన్నీ వుండాయి. పరాయిచోట అస్థిమితంగా బతికే బతుకు నీకెందుకు రా అయ్యా! మనం కడుపు కి వొక ముద్ద తింటున్నందుకు మట్టికి దాస్యం చెయ్యాలి. మట్టి కి మనిషికి అదే విడదీయరాని బంధం. అనిమనుమడా! నా బంగారు తండ్రీ! నువ్వు నీ మూలాల్లో సద్దుకుని చల్లంగా వుండరా! ఈ భూముల్లో పంట పండించుకుని తృప్తిగా తినండి. తరాలు తరాలు చల్లగా వుండండి. నువ్వు తిరిగి రాకపోతే నా ఆత్మ క్షోభిస్తూనే వుంటది. క్షోభిస్తూనే వుంటుంది.అది గుర్తుంచుకో..నే పోతన్నా బిడ్డా! పోతున్నా.”
వీపు పై కొరడా ఝళిపించినట్లై ఉల్కిపడి మేలుకున్నాడు చంద్ర. టైమ్ చూసుకున్నాడు. గంటన్నర పైనే అయింది తను విశ్రమించి. కల గన్నట్టు లేదు. ఎవరో తన పక్కనే కూర్చుని మాట్లాడిపోయినట్లు వుంది. వాటర్ బాటిల్ తీసి సగం పైనే గటగటా తాగేసాడు. కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకున్నాడు. తిరుమలరావు డ్రైవరు మామిడికాయల బాక్స్ లు డిక్కీ లో నింపుతున్నారు. మండించే ఎండ బదులు ఆకాశమంతా నల్ల మేఘాలు వొక దానితో వొకటి అల్లుకుంటున్నాయి. చిక్కుముడులు వేసుకుని విడదీసుకోవడం కుదరదన్నట్లు మెరుస్తూ ఉరుముతూ కాసేపు కుండపోత కురిసి బరువును తగ్గించుకుని అంతలోనే తేలిపోయాయి. చంద్ర మనసులో తిష్ద వేసుకుని మెదడులో రూపుదిద్దుకున్న ఆలోచనల మేఘాలు మాత్రం ఇంకా బరువెక్కి వున్నాయి
తిరుమలరావు ఇంటి దగ్గర ఆగి ..టీ తాగి హైదరాబాద్ కు తిరిగి ప్రయాణమైనారు. మధ్యలో విజయవాడ కు వెళ్ళి ఇల్లు బేరం కుదర్చమని గుర్తుచేసాడు తిరుమలరావు. బాబాయి ఇంటికి వెళ్లాడు. ఆత్మీయతలు పంచుకుని అతిథి మర్యాదలు అయ్యాక ఇల్లు అమ్మాలనుకున్న సంగతిని బాబాయ్ తనే ప్రతిపాదించాడు. “మీ నాన్న వ్యాపారాలు చేసి సంపాదిచ్చాడు.నాకేం వుంది? పెన్షన్ మీద బతుకుతున్నాను. ఆడపిల్లలకు భారీగా పెళ్లిళ్లు చేసి అంతా అమ్ముకుంటిమి. రోగానికి రొష్టు కి డబ్బు కావాలి గా. వెంటనే అమ్మేద్దాం” అన్నాడు. అలాగే బాబాయ్ ! నాన్నను తీసుకుని వచ్చే వారంలో మళ్ళీ వస్తాను” అన్నాడు చంద్ర.
ఇంటికి చేరాక భూషణరావుకి చెబితే “ఇప్పుడెందుకురా అమ్మడం, ఆంధ్ర కు ఔటర్ రింగ్ రోడ్డు వచ్చిందిగా. దానికి లోపల్నే వుంది మన ఊరు. ఇప్పుడొద్దులే!” అన్నాడాయన. ఆ మంచి రేటేదో ఇప్పుడే వస్తుంది. నా ఫ్రెండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుండే. వాడికి అప్పజెబుదాం. మీ అన్నదమ్ములిద్దరూ కలిపి మాట్టాడుకోండి అని పురమాయించాడు.
ఆ రాత్రి చంద్ర భార్య లత తో మాట్లాడుతూ పల్లె విశేషాలు చెప్పసాగాడు. అతని మాటల్లో సంతోషాన్ని గ్రహించింది. ఆలోచనల లోతును పసి గట్టింది.
“రిటన్ వచ్చేద్దాం అనుకుంటున్నా! నువ్వేమంటావ్”లతా?” అడిగాడు.
“ ఆ…ఇక్కడ మాత్రం ఏముంది లెద్దూ! స్వేచ్ఛగా బతుకుదామనుకుని వచ్చి ఏడాదిలో సగం రోజులు అడుగు బయటకు వేయకుండా నాలుగు గోడలకు బందీ. అయిన వాళ్ళందరిని వదిలేసుకుని ఇక్కడ బానిస బతుకుతున్నాం. ఎప్పుడు ఊడిపోద్దో తెలియని ఉద్యోగం విపరీతమైన వర్క్ లోడ్. జూబ్లీ హిల్స్ లో పుట్టి పెరిగిన కోటీశ్వరుడి కూతుర్ని అన్నమాటే కానీ ఇక్కడ గొడ్డు చాకిరీ తో చచ్చిపోతున్నా. రొటీన్ లైఫ్. వెనక్కి వెళ్లిపోదాం అనిపిస్తుంది నాక్కూడా” అంది విసుగ్గా..
“నిజం కదా లతా! వచ్చిన జీతం అంతా ఇంటి కోసం కారు కోసం తీసుకున్న అప్పులు కట్డడానికి, మెడికల్ ఇన్సూరెన్స్లు క్రెడిట్ కార్డ్ లకు సరిపోయే! ఐదు రోజులు పని రెండురోజులు ఇంటికి కావాల్సినవి తెచ్చుకోవడంతో సరిపోధ్ది. అదీ కాక ఎప్పుడు ఎక్కడ గన్ పేలిన చప్పుడు వినబడుద్దేమోనన్న భయం. పక్క నున్న వాడిని నమ్మలేని భయం. కొంతమందికి కొందరంటే ఇష్టంలేదు. ఆ కొందరికి మనలాంటి వారిని చూస్తే ఇష్టం లేదు.దాడులు దోపిడీలు తిరస్కారమైన చూపులు.H1b ముద్ర వేయించుకున్న బానిసలం అనిపిస్తుంది. వద్దు, ఇవన్నీ వద్దు. వచ్చేద్దాం. ఈ ఒత్తిడితో కూడిన జీవితం మనకి వొద్దు. మనుషుల అవసరాలు తీర్చే డాలర్ లు సంపాదిస్తున్నాం అన్నమాటేగానీ.. మన మానసిక అవసరాలన్నీ మన నేల తోనే ముడిపడి ఉంటాయి అని నాకు బాగా అర్ధమవుతుంది. నీతో డిస్కస్ చేసాక కొన్ని నిర్ణయాలు తీసుకుందాం అనుకున్నాను. నువ్వు వొప్పుకున్నావ్ థాంక్యూ డియర్” మనఃస్పూర్తిగా అన్నాడు చంద్ర.
వారం రోజుల తర్వాత అనుకున్న దానికన్నా ఎక్కువ ధరకు ఇల్లు అమ్మకం జరిగిపోయింది. అన్నదమ్ములిద్దరూ డబ్బు పంచుకున్నారు. రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు డాక్యుమెంట్ పై పేరు చూసి అన్నదమ్ములిద్దరూ ఆశ్చర్యపోయారు.ఎల్ ఆర్ చంద్ర సన్నాఫ్ భూషణరావు.
“ఇది తాత ముత్తాతల ఆస్థి. ఎవరికో ఎందుకు అమ్మడం? అది నాక్కావాలి. నేను తిరిగి వచ్చేస్తున్నాను.ఈ ఊరిలోనే వుంటాను” అన్నాడు చంద్ర. భూషణరావు కొడుకు వైపు విసుగ్గా చూసాడు. తిరుమలరావు ముఖం మాడ్చుకున్నాడు.బాబాయి భార్య ధర తక్కువకు ఇచ్చేసారు అని గోలచేసింది. మేనత్తలు మేము పుట్టి పెరిగిన ఇల్లు పరాయి పాలు కాలేదని సంతోషించారు.
నెల రోజుల్లో లతా పిల్లలిద్దరూ హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడే పిల్లలిద్దరికీ స్కూల్ అడ్మిషన్ తీసుకున్నారు. చంద్ర రిమోట్ జాబ్ చేస్తూనే.. దగ్గరుండీ ఇల్లు బాగుచేయించుకున్నాడు. ప్రతిరోజూ గుడికి వెళ్ళి ఇలవేల్పు పట్టాభిషిక్త రామచంద్రుడిని దర్శించుకుని ఆధునిక వ్యవసాయం చేసుకునేందుకు శక్తినిమ్మని కోరుకున్నాడు. లత ఆర్గానిక్ వ్యవసాయం చేయడానికి ఉవ్విళ్ళూరుతుంది.వివరాలు సేకరిస్తుంది.
తనకు కలలో కనబడిన పెద్దమనిషి చిత్రాన్ని గీయించుకుని ఫ్రేమ్ చేయించుకుని వచ్చాడు చంద్ర. వెలుగులు విరజిమ్మే ఇంట్లో హాల్లో ఆ చిత్ర పటాన్ని పెట్టించాడు. జీవకళ ఉట్టిపడుతూ వున్న ఆ చిత్రపటాన్ని చూసి “ఎవరు డాడీ ఈయన !? అని అడిగాడు చంద్ర కొడుకు. “మా తాత తాత ఆయన. నేను ఐదవతరం వాడిని, నువ్వు ఆరోతరం, ఏడో తరం కూడా ఈ నేల పైనే వర్ధిల్లాలి” అన్నాడు ఆలోచనల్లో ఆశలు అల్లుకుంటూ. కల యో నిజమో భ్రాంతి యో… ఏదో వొకటి తనలో నిబిడీకృతమైన ఆలోచనలు ఇలా వాస్తవరూపంలో సాక్షాత్కరించడం ఏనుగెక్కినంత ఆనందంగా వుంది చంద్ర కి.
“మా తాత కూడా ఇదే పోలికల్తో వుండట్టు జ్ఞాపకం వుందిరా అబ్బాయ్!” అన్నాడు భూషణరావు. వ్యాపారంలో పండిపోయిన మనిషి. కొడుకు కోసం తమ వారసులు అమ్ముకున్న భూములను కొనడానికి ప్రయత్నిస్తున్నాడు.చంద్ర తల్లి మణి పెద్దలు కలలో కనబడుతున్నారంటే వారిని మనం మర్చిపోయామని. అమావాస్య రోజున పితృ తర్పణాలు వొదలాలి అని అన్నదమ్ములిద్దరినీ హెచ్చరించింది. తిరుమలరావు అతని కొడుకులిద్దరూ పిలిస్తే పలకడానికి సిద్దమైపోయారు. చంద్ర వారి అభివృద్ధికి సాయం చేస్తానని మాటిచ్చాడు.
ఆ రాత్రి బహుళ పంచమి మసక వెన్నెల్లో ఆరుబయట నులక మంచంపై పడుకుని.. కనీ కనబడని నక్షత్రాలను వెతుకుతూ..తన పూర్వీకులను తల్చుకున్నాడు. “నాన్న ముత్తాతా! అని తాతా! ఇదిగో చూడు, నువ్వు కోరుకున్నట్టే మన ఇంటికి వచ్చేసాను. నువ్వు చెప్పినట్టు తల్లి గర్భం నుండి బయటపడినప్పటి నుండి తిరిగి మట్టిలో కలిసే వరకూ మట్టి తోనే మనిషికి అనుబంధం. ఒక బంధం విడిపోతే మరొక బంధం లతలా పెనవేసుకుపోతుంది. మళ్లీ ఆ బంధం విడిపోతుంది. ఒక ఆశ నశిస్తే మరొక ఆశ చిగిరిస్తుంది. నడిపిస్తుంది. ఇదే తరతరాల జీవితం. ఇదే జీవితం అని నాకర్ధమైంది”. అన్నాడు.
ఊరి వారందరూ దారిన వెళుతూ ఆ ఇంటి వీధి ద్వారానికి ఒక వైపు నల్లని గ్రానెట్ రాయిపై బంగారు రంగులో మెరుస్తున్న “లంకా రామచంద్రయ్య నిలయం” రెండో వైపు పలకపై “అనిమనుమడు లంకా రామచంద్ర” అనే పేర్లతో ముచ్చటగొల్పుతూ కళకళలాడుతున్న ఆ ఇంటిని చూస్తూ మా పిల్లలు కూడా వెనక్కి వచ్చేస్తే బాగుండ్ను అనుకుంటారు. వాళ్ళ ఆశలు బిడ్డల ఎత్తుకు ఎగురుతాయో లేదో కాలమే చెప్పాలి.
*********************సమాప్తం***********************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి