అనుబంధాల అల్లిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అనుబంధాల అల్లిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, ఏప్రిల్ 2023, గురువారం

మా ఊరు - మా ఇల్లు 2

 మా ఊరు -మా ఇల్లు  

మొదటి భాగం నిన్నటి తేదిన ప్రచురించాను. ఇది రెండవ భాగం . 


మా ఇంటి వాతావరణం పరిసరాలు గురించి మరికొంత. పడమటి వైపు వంటిల్లు ను ఆనుకుని దక్షిణం వైపు పొంత పొయ్యి మరొకపొయ్యి వుండేది. నీళ్ళు కాయడానికి ఇంకా యెక్కువ సేపు వుడికే మొక్కజొన్నల నూకల మడ్డికూడు వండటానికి పుల్లలు యెక్కువ పడతాయని కందికంప ఉపయోగించేవారు. పొగ యెక్కువ కాబట్టి వంటింట్లో వంట చేయకుండా ఆరుబయట అక్కడ ఆ పనులు చేసేవారు. నాకు ఊహ తెలిసేటప్పటికి మా నాయనమ్మ అక్కడ నీళ్ళు కాయడం మట్టి చట్టిలో పప్పు కూర వండటం లాంటివి చేసేది. మా నానమ్మకు మా అమ్మ మూడో కోడలు. పై ఇద్దరు కొడుకులు కోడళ్ళు  వారి పిల్లలు వేర్వేరు ఊళ్ళలో వుండేవారు. మా నాయనమ్మ తాతయ్య ఉత్తరం వైపు గది వంటింట్లో వుండేవారు. మా నాయనమ్మ వంట వేరే. వారి ఆస్థిపాస్తులన్నీ కొడుకులకు పూర్తిగా పంచేసి జీవన చరమాంకంలో చాలా అవస్థలు పడ్డారు. మా నాయనమ్మ తాతయ్య అంటే నడిచే ధర్మం మంచితనం అమాయకత్వం పరోపకారం.. మనుషులంటే అంతులేని ఆపేక్ష. వారిని తలుచుకుంటేనే నాకు గర్వం కల్గడంతోపాటు కళ్ళనిండా కన్నీళ్ళు కూడా వచ్చేస్తాయి. నడిచే దైవాలు లాగే వుండేవారు. మా తాతయ్య అంతే డౌన్ టు యెర్త్ మనిషి. 


మా నానమ్మ ది అదో అమాయకత్వం మంచితనం. కోపం వుండేది కాదు. ఉంగరాల జుట్టు చక్రాల లాంటి కళ్ళు ఇందిరాగాంధీ ముక్కులాంటి ముక్కు పల్చటి పెదాలు  చామానఛాయతో పొట్టి పొడుగు కానీ యెత్తుతో చక్కని  కుదిరకలు వున్న మనిషి. మా తాతయ్య మంచి రంగు కొద్దిగా లావుగా వుండే ముక్కు పెద్ద చెవులు విశాల నేత్రాలు అయిదున్నర అడుగుల యెత్తుతో కాస్త పొట్టిగా అనిపించేవాడు. చాలా కష్టజీవి. కొడుకులను   ఏరా  అని అరేయ్ వొరేయ్ అని కానీ సంబోధించని సంస్కారవంతమైనమాట. అయ్యా అమ్మా అనే ప్రేమ నిండిన పలుకులు తప్ప మరో విధమైన ఆక్షేపణీయమైన మాట ఆయన నోటివెంట విని యెరుగను నేను. అలాంటి వారి కడుపున వారి పాలిట దుష్టులైన బిడ్డలను కన్నారనే వొక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మా పెద్ద మేనత్త మా నాన్న చిన్నతనంలో వుండగానే చనిపోయింది. ఆమె గురించి వినడమే తప్ప ఫోటో కూడా చూడలేదు నేను. ఆమె నాలా యెత్తరిగా ఆకర్షణీయంగా వుండేదని మా చిన్నతాత కూతుళ్ళు అంటూ వుంటారు.


మా నాయనమ్మ గురోపదేశం తీసుకుంది.  వేలి కణుపులు లెక్కెట్టుకుంటూ  జపం చేసేది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పటం పార్వతీ పరమేశ్వరుల పటం శ్రీరామ పట్టాభిషేకం పటం వుండేవి పూజ గదిలో. వ్యాస పీఠంపై భగవద్గీత చిన్న రాతి వినాయకుడి బొమ్మ పూజ అరుగు పై వుండేవి. తులసమ్మకు పూజ చేసేది. మా నాయనమ్మ అంటే నాకు చాలా యిష్టం. స్త్రీ లలో అమ్మ తర్వాత నాయనమ్మ మా అమ్మ పెద్ద చెల్లి పార్వతి పిన్ని లో నేను మాతృ ప్రేమను అనుభవించానని చెప్పవచ్చు. ఇంటి గురించి చెప్పబోయి మనుషుల గురించి చెబుతున్నాను కదూ.. మా ఇల్లు అంటే మా నాయనమ్మ తాతయ్య కూడా నాకు. 


ఇక ఆరుబయట వంట చేసుకునే పొయ్యల తర్వాత దక్షిణం వైపుకు మళ్ళితే పడమటి వైపు గోడకు ఆనుకుని పెద్ద రోలు అందులో పొత్రం వేసి వుండేది. ఆ రోలు మూడడుగుల యెత్తులో వుండేది. ఏదైనా రుబ్బాలంటే వంగి రుబ్బేది నాయనమ్మ. లేదా రోలుపై కాలు చాపుకుని కూర్చొని రుబ్బేది. మాకు ఇంటి ఆవరణ అంటే ఇంటికి దక్షిణం వైపు వున్న స్థలమే! తూర్పున ఆరడుగుల పందిరి దానిముందు రెండు అడుగుల వెడల్పైన త్రోవ తప్ప స్థలం వుండేది కాదు. మా పెద్దతాత కొడుకుకు సంబంధించిన ఇంటి ప్రహరీ గోడ వుండేది. మా నిత్యకృత్యాలకు పశువులు కట్టేసుకోవడానికి గడ్డి వాము వేసుకోవడం చావిడి అంతా దక్షిణం వైపు స్థలమే! 


ఆ రోలు యెదురుగా  చిన్న దిరిసెన పూలు చెట్టు లాంటిది వుండేది. ఉసిరి ఆకులు లాంటి చిన్న ఆకులు బంతి ఆకారంలో మొగ్గలు విచ్చిన తర్వాత విసినకర్ర ఆకారంలో పూలు ముదురు గోధుమ రంగులోకి మారి చెట్టు కింద వొత్తుగా రాలిపడేవి. అదొక చేదైన వాసన. అలాంటి చెట్టును మళ్ళీ యింత వరకూ చూడలేదు. అదో అడవి జాతి చెట్టు.  దానికి గేదె దూడలను కట్టేసే వారు. ఆ పక్కనే త్రిభుజాకారంలో కట్టిన మామిడి పుల్లల మేటు. రెండు నిట్టాళ్ళ గొడ్ల చావిడి. అందులో గడిమంచి. చావిడి వెనుక భాగం లో కంది కంప మేటు దానికి అల్లుకున్న పొట్ల పాదు, బెండ మొక్కలు,  వెదురు లేక వాయిలు చువ్వలతో దడి కట్టిన స్నానాల గది.. దానికి పాకిన కాకర తీగ.. స్నానాల దడి గదికి ఇవతల పెద్ద గుండ్రటి తొట్టి.ఆ తొట్టికి ఆనుకొని పెద్ద యెర్రమందార చెట్టు.


 చావిట్లో రెండు పాడి గేదెలు.  దక్షిణపు వైపు ఇంకా దిగువకు గడ్డివాము వాము వెనుక మునగ చెట్టు సొర తీగ గుమ్మడికాయ తీగ వుండేవి. గడ్డి వాము ముందు చింత చెట్టు ఎరువు దిబ్బ. ఆ తిన్నగా మూడిళ్ళకు ఉమ్మడిగా పెద్ద బావి వుండేది. ఆ బావి నుండే మేము నీళ్లు తెచ్చుకునే వాళ్ళం. ఆ బావి నుండే కాడికట్టిన ఎద్దుల సాయంతో  మోటలతో నీళ్ళు తోడి కాలవల ద్వారా మళ్ళించి పాటి మళ్లలో పొగాకు మిరప పండించే వాళ్లని తాతయ్య చెప్పేవారు. ఆ భూమి అంతా ఐదుగురు కొడుకులకు వారి తర్వాత పిల్లలకు ఇరవై ముప్పై సెంట్లు లెక్క పంచుకుని వాముల దొడ్లు చేసుకున్నారు. మా నాన్న వాటా కూడా వొక పదిసెంట్ల భూమి వుండేది. అందులో గడ్డివాము వేసివుండేది. కూరగాయలు వేసుకునే వాళ్ళం. మునగచెట్టు చింతచెట్టు వుండేది. గచ్చకాయల చెట్లు గురివింద గింజల చెట్టు కూడా వుండేది.సరిహద్దు కర్రలో తాటిచెట్లు సీమ తుమ్మ చెట్లు వుండేవి. 


మా నాన్న పెళ్లికి ముందే కొడుకులు ముగ్గురికి సమానంగా ఆస్థిని పంచి యిచ్చేసాడు తాతయ్య. వాళ్ళకు కొడుకులు మనోవర్తి యిచ్చేవారు. వారి ప్రాభవం అప్పటికే కోల్ఫోయారు.  నాకు ఊహ తెలిసేటప్పటికి మా తాతయ్యకు కళ్ళజోడు రాలేదు.చేతికర్ర రాలేదు.1915 తర్వాత పుట్టినవారు ఆయి వుండవచ్చని నా అంచనా. మా తాతయ్య ఐదురుగురు కొడుకులలో రెండవ వాడు. మా పెద పెద్దనాన్న శోభన్ బాబు ఒకే వయసు వారంట.  జతగా పదవ తరగతి వరకూ మైలవరం వెళ్లి చదువుకున్నారట. మా పెదనాన్న ఇంకో కజిన్ తో కలిసి బెజవాడ బిసెంట్ రోడ్డులో రవి ప్యాన్సీ స్టోర్ పెట్టారంట. అందులో నష్టపోయి భూములు అమ్ముకున్నారట. ఇప్పటికీ రవి ప్యాన్సీ స్టోర్  అక్కడే అదే పేరుతో నడుస్తూనే వుంది. 


మా ఇంటి వయస్సు యెక్కువేమీ కాదు. 1940 ల తర్వాత కట్టిన యిల్లే. ఆ తర్వాత మా  ఇల్లు పూర్వ ఆకారం కోల్ఫోయింది. దానికి వొక కారణం వుంది. మా తాతయ్య వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు. వారందరూ పుట్టిపెరిన యింట్లోనే వుంటూ రెండవ మూడవ అన్నదమ్ములకు కలిపి పెంకుటిల్లు నాలుగు ఐదు సోదరులకు డాబా యిల్లు కట్టారు. మా పెద తాత పూర్వీకులు నివసించిన యింటిలో వుంటూ కొడుకులిద్దరికీ వేరు వేరు యిళ్లు కట్టించారు. అన్నదమ్ముల కాపురాలు వేరైనా యిళ్లు కలిసి వుండాలనో వొకే వెన్ను కింద వుండాలన్న భావనో లేదా ఖర్చు కలసి వస్తుందనో. మా ఊరిలో అన్నదమ్ముల ఇళ్లు చాలా వరకు అలాగే కట్టి వుండేవి. నిజంగా వాస్తు దోషాలు అదృష్ట దురదృష్టాలు వున్నాయో లేవో గానీ.. దక్షిణం వైపు భాగంలో వారు ఆర్థిక నష్టాలు అనేక కష్టాలు  అనుభవించేవారు. ఉత్తరం వైపు వారు పురోగవృద్ధిలో వుంటారనే దానికి ఆధారాలు వుండేవట. అందుకు రుజువులు మా తాతయ్య కాలం నుండి చూపేవారు. 


మా తాతయ్య తన తండ్రి ఆయనకు పంచి యిచ్చిన పాతిక యెకరాల భూమి నే ముగ్గురు కొడుకులకు పంచి యిచ్చారు. ఆయన తతిమా అన్నదమ్ముల లా  పొలాలు సంపాదించలేదు.. అమ్మనూ లేదు. ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు వచ్చీపోయే బంధుగణం అడిగిన వారికి లేదనకుండా సాయాలు చేయడం ఐదుగురు పిల్లలు ఖర్చులు మా నాయనమ్మ ధారళంగా ఖర్చు పెట్టడం ఇలాంటి కారణాలు వుండేవట. మా తాతయ్యకు ఐదవ తాతయ్యకు సంతానం యెక్కువ. అలాగే మా పెదనాన్నలు పెరిగిన తర్వాత తాతయ్య వారి మాటలను గౌరవించారు. వారి పర్యవేక్షణలో వ్యాపారాలు నష్టాలు.. వారిరువురు పెళ్ళి అయిన తర్వాత ఆస్తులు పంచుకుని ఊరు వదలి వెళ్ళిపోయారు. నాన్న కు పెళ్ళి ఖర్చుల కింద ఇంటిలో వాటా నాన్నకు వదిలేసి వెళ్ళారంట. దక్షిణం ఖాళీ యెక్కువగా వుండి ఇంటి కన్నా లోతు గా వుంటే ఆర్థిక నష్టాలు వుంటాయంటారు. మా తాతయ్య వేరు కాపురం పడినప్పటి నుండి మా ఇల్లు పరిసరాలు అలాగే వుండేవి. మా తాతయ్య నాయనమ్మ చేతికింద ఆర్థికంగా అంత బాగుండింది లేదు. మా పెదనాన్నలు ఆస్తులు అమ్ముకుని వెళ్ళిపోయారు కలిసి రాలేదని. 


మా నాన్నకు వ్యవసాయం చేతకాదు. పెళ్ళైన తర్వాత కూడా మా తాతయ్య వ్యవసాయం చేయించి పెట్టేవారంట. మాగాణి పొలం మూడు యెకరాలు వుండేది. వర్షాలు కురిసి చెరువుకు నీళ్ళు వస్తేనే మాగాణి పండేది. మిగతాది గరువునేల, మామిడితోట. వాటి మీద కూడా పెద్దగా ఆదాయం వచ్చేది కాదు. అమ్మ పొలం నాన్న పొలం కలిపి పదిహేను యెకరాలు వుండేది. మాకు పంటలు పండకపోతే.. ధాన్యం కూడా అమ్మమ్మ వాళ్ళు పంపేవారు. అమ్మ కు యిచ్చిన ఆవులకు పుట్టిన కోడె దూడలను అమ్మి  పైకం పంపేవారు. అప్పట్లో మాగాణి లో వరి వేయకపోతే పైరుశెనగ వేసేవారు. నడిమింట్లో తెల్లటి వేరుశెనగ కాయలు  దూలాలు పైకి ఆనేటట్టు పోయడం.. గడిమంచె వేసి మినుముల బస్తాలు మనిషి యెత్తులో మేటు వేయడం నాకు బాగా గుర్తు. వ్యవసాయం అంత బాగోకపోయినా పాడి మీద కొంత మామిడితోటల్లో కంది వేయడం ద్వారా  మామిడి కాపు అమ్మడం ద్వారా డబ్బు వచ్చి  మాకు ఆర్ధికంగా అంత లోటుండేది కాదు. 


నాకు పదిహేనేళ్ళు వచ్చేదాక బాగానే జరిగిపోయింది. తర్వాత ఆర్ధిక స్థితి తారుమారైంది. భూమి తరగిపోయింది. అప్పటినుండే యింటి వాస్తు బాగుండలేదనే శంక మొదలైంది.మా అమ్మకు ఆ అనుమానం బలపడి వుంది. మా నాన్న వ్యతిరేకించలేదు. దక్షిణపు వైపు స్థలం విడగొట్టి ప్రహరీ గోడలు కట్టారు. దర్వాజాలు మార్చారు. మా ఇల్లు రూపు రేఖలు మారిపోయింది. ఇలా వుండేది.



1985 లో నా పెళ్ళి అయింది. 1987 లో నా కొడుకు పుట్టాడు. నా కొడుకు పుట్టిన పదమూడు రోజులకు మా తాతయ్య చనిపోయారు. రెండు రోజుల పాటు వొంట్లో నలత. శరీరానికి నీరు వచ్చింది.అంతే! 


మా తాతయ్య కష్టించే స్వభావం గురించి మెత్తదనం గురించి కుటుంబ వైభవం గురించి చాలా చెప్పాలి.. 


(మిగతా భాగం.. తర్వాత) 




ఈ చిత్రంలో .. ఫోటో కుడివైపు నుండి  చూస్తే  మొదటి రెండు జంటలలో .. రెండవ జంట మా తాతయ్య నాయనమ్మ . తాతయ్యలుఅందరూ కూర్చుని ఉన్నారు . వారి వెనుక నిలబడింది నాయనమ్మలు . మధ్యలో కూర్చున్న జంట ..మా నాలుగో తాతయ్య ఏకైక సంతానం  మా సాంబశివరావు పెదనాన్న పెద్దమ్మ . వారి జ్ఞాపకంగా ఈ చిత్రం ఒకటే ఉంది మా వద్ద. 

 

5, ఏప్రిల్ 2023, బుధవారం

మా ఊరు మా ఇల్లు

                       మా ఊరు తూర్పు చెరువు 

మనిషికి మట్టితో అనుబంధం, విడదీయరాని బంధం. మట్టి పరిమళాన్ని ఆస్వాదించగానే ఎక్కడైనా మట్టి  మట్టే గదా  మట్టి వాసన వొకటే కదా.. అంటారేమో! 

 ఎవరికి వారికి వారి శరీరానికి అలవాటైన మానసిక భావనలకు ఆలంబనమైన  ఊరు గాలి ఆ మట్టి పరిమళం అక్కడ నీటి కున్న రుచి అక్కడ పండే పంట అన్నింటికి మనలా వాచా అలవాటై వుంటారు.  నా ఊరు ననుగన్న నావాళ్ళు అంటూ  ప్రతి వొక్కరికి ప్రత్యేకమైన అనుబంధం వుంటుంది. పెరిగి పెద్దై తనదైనప్పటి వూరు ను వదిలి బ్రతుకు తెరువు కోసం  కొత్త చోటుకు వెళ్లినా  అక్కడ ఇమడటానికి కొంత కాలం పడుతుంది. అలాగే వేరొకచోట స్థిరపడినా పుట్టి పెరిగిన వూరు లేదా  తమ మూలాలున్న వూరుతో ఉన్న అనుబంధాన్ని తల్చుకొని మూగ గా రోదిస్తారు. అంతెందుకు ఆ వూరు పేరు వినగానే కొత్త ఉత్సాహం వుప్పొంగి  ముఖంలోకి కొత్త వెలుతురు  యేదో ప్రాకినట్లు ఉంటుంది.

 తీరా  యెప్పుడో వొకప్పుడు పుట్టి పెరిగిన ఊరు వెళతామా ..అక్కడ వచ్చిన మార్పులను జీర్ణించుకోలేము. మన చిన్నప్పుడు ఉన్న గుర్తులను కోల్పోయామని బాధపడతాము. మనం మాత్రమే  ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేసి హోదాలను అనుభవిస్తూ ... మనం పుట్టిన వూరు మాత్రం అలాగే వెనుకబడో లేదా స్వచ్ఛంగా ఉండాలని భావిస్తూ వుంటాం.  మన ఆలోచనలు మనమే సిగ్గుపడాల్సిన విధంగా ఉంటాయన్నది వేరే విషయం అనుకోండి.
 
మనం ఎంత యెదిగినా మన ఊరు మన పరిసరాలు మన బాల్యం అంత స్వచ్ఛంగా  వుండాలని కలుషితం కాని ఊరు ను మనుషులను చూసుకోవాలని మనం కోరుకుంటాం. అదొక చాపల్యం అంతే! 

 ఇటీవల ..మా ఊరు మా ఇల్లు గురించి రాసుకోవాలి అనిపిస్తుంది.అందుకే రాస్తున్నాను. 

                                                                           మా ఊరు




మా ఊరు - మా ఇల్లు.. (మొదటి భాగం)

 బస్ లో ప్రయాణిస్తూ విండో సీట్ లో కూర్చుని తలపైకెత్తి చూస్తే…ఇరువైపులా పచ్చటి గుబురైన చెట్ల కొమ్మలు పైనున్న ఆకాశాన్ని కనపడనీయకుండా కరచాలనం చేసుకుంటున్నట్లు కింద చూస్తే.. నల్లని తారురోడ్డు. ఆ రోడ్డు పై ప్రయాణం ఆహ్లాదకరం. చింతచెట్లు మామిడిచెట్లు నేరేడు చెట్లు అవి కాలం చేసిన చోట్ల వెలిసిన సుందరమైన గుల్మొహర్ చెట్లు వాటి వెనుక చేనుకు కాపాలాగా నిలిచాయా అన్నట్లుండే తాటిచెట్లు వాటి మధ్య పరిగి చెట్లు చిట్టి ఈత పొదలు..


బెజవాడ నుండి వెళుతుంటే కుడిపక్క బెజవాడ వైపు వస్తుంటే ఎడమ పక్క రహదారి పక్కనే గరప నేలలో మనిషిలో సగమెత్తు పెరిగిన ఆకుపచ్చని పత్తి చేను ఎర్రటి పూలతో శోభనామయంగా కనబడుతుంటూ వుంటాయి. ఆ చేలని దాటి యెత్తుగా కనబడే యెర్రమట్టి చెరువుకట్ట.  వెంకటాపురం అనే గ్రామం నుండి తూర్పుకు మా ఊరికి పడమర వైపున వున్న ఆ చెరువుకట్ట రహదారి నా పూర్వీకులు నడిచిన దారి.  ఆ చెరువు గట్టుపై నడుస్తుంటే యెర్రటి యెండైనా సరే నల్లేరు నడకే!  చెరువు నిండా యెర్రటి నీళ్ళు నీళ్ళ మధ్యలో పచ్చటి పూలతో నల్ల తుమ్మ చెట్లు వాటిపై తెల్లటి కొంగలు  రకరకాల పక్షులు కిలకిల రవాలు వేలాడే గిజిగాడి గూళ్ళు. తూముల నుండి కిందకి దక్షిణంగా మాగాణి భూములకు జీవధారగా ప్రవహించే నీటి గలలు.. వాటి మధ్య దూరంగా రోడ్డు పై ప్రయాణించే వాహనాల శబ్దం. 


అసలు చెవుటూరు దాటగానే వెంకటాపురం రాకుండానే   తారు రోడ్డుపై బస్ లో  ప్రయాణిస్తూనే తూర్పున కనబడే మా ఊరు ను కళ్ళారా చూసుకునే అనుభవం యెప్పటికప్పుడు నాకు సరికొత్త అనుభూతి. కానీ ఊరు ముఖ చిత్రం మాత్రం  పురా సంస్కృతి.  శరీరం బస్ లో ప్రయాణిస్తూనే వుంటుంది. మనసేమో చెంగు చెంగున బస్ దిగేసి..అదిగో కనబడే చెరువు కట్టను  వొరసుకుంటూ వేగంగా సారించే చూపుతో పత్తి చేలను మాగాణి పొలాలను దాటి పాటి దొడ్లు మీదగా  చింతచెట్లు తాడిచెట్లు సీమ తుమ్మ చెట్లు దాటి ఊరిలో నైబుతి మూలగా నున్న మేడసాని వారిల్లు.  ఆ ముందు వరుసలో పొన్నం వారి బెంగుళూరు పెంకుటిల్లు దాటి మూడవ వరుసలో యెత్తుగా కనబడే కుమ్మరి పెంకుటిల్లు మాది అని  అనుకోవడం నిలువెత్తు సంబర పడటం. దూరం నుండి కొండ గుర్తుతో మా ఇల్లును అస్పష్టంగా చూసుకోవడంలో అంతులేని ఆనందం.  అలాగే తిరిగి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటూ  గుండె బరువై కన్నీటి మసకలో  మళ్ళెప్పుడు వస్తానో అనుకుంటూ ఆ ఇంటిని మమకారంతో చూసుకోవడం నాకు పరిపాటి. 


చెరువు కట్ట మీదగా  నడక దారితో వూర్లోకి ప్రవేశిస్తే. చెరువును ఆనుకునే వాలులోకి వున్న గ్రామ దేవత గంగానమ్మ గుడి ఆమెకు యెదురుగా పోతురాజు. ఆ పల్లంలో నుండి పదడుగులు పైకి యెక్కితే ఊరు నైబుతి భాగంలోకి చేరుకుని.. తిన్నగా నడిచి వెళుతూ.. కుడి పక్క మూడవ సందులో రెండవ ఇల్లు మాది. 


ఎనిమిది దూలాల పై తూర్పు పడమర ల వైపు సమానంగా వాలుగా వుండే యిల్లు మాది. మా వాటా నాలుగు దూలాల పట్టు. సగభాగం మా చిన్నతాత వాళ్ళది. పడమటి వాలులో రెండు పెద్ద గదులు మధ్యలో నడిమిల్లు తూర్పు వాలులో ఆగ్నేయం మూల ధాన్యం గది(కొట్టు గది) మిగతాదంతా వరండా


తూర్పున యింటికి మధ్యన ఆరడుగుల కన్నా ఇంకా ఎత్తైన సింహద్వారం. గోడలో అమర్చిన సింహద్వారం పై భాగాన తోరణం అటునిటు వ్రేలాడుతూ సగం మాత్రమే కనబడే గుమ్మటాల డిజైన్ గోడకి సింహ ద్వారం పైగానికి మధ్య అడుగున్నర వెడల్పు చెక్క (గొడుగు బల్ల) దాని కిందభాగం కూడా మంచి పనితనంతో చెక్కిన పద్మాల డిజైన్ లతలు తీగలతో చాలా అందంగా ఉండేది. సింహద్వారానికి ఇరువైపులా పెద్ద పెద్ద కిటికీలు. కిటికీ కి దర్వాజాకి మధ్య రెండు వైపులా దీపపు గూళ్ళు. దర్వాజా పైన కిటికీల పైనా నాలుగు అడుగుల యెత్తుతో లతలు పూలతో కూడిన ఆర్చెరీ డిజైన్. ఈ డిజైన్ లలో విపరీతంగా దుమ్ము చేరేది. బూజు కూడా ఎక్కువే. శుభ్రం చేసేటప్పుడల్లా సిమెంటుతో గోడ మందం వరకు నింపేసి సాపు చేపిస్తాను అనేది మా అమ్మ. ఆగ్నేయం మూలాన కొట్టు గది. దానికి నాలుగడుగుల వెడల్పుతో వుండే11 చెక్కలున్న నిలువెత్తు ద్వారం వుండేది.. పైన చూరుకు ఆన్చి కట్టిన గోడ.. ఆ గోడలో ఒక మనిషి యెక్కి లోపలికి దిగేంత వెడల్పు యెత్తుతో ఇంకో కిటికీ వుండేది. మాసూలు కాలంలో ధాన్యం యింటికి తోలుకు వచ్చి గది నిండా నింపిన తర్వాతే మిగతావి దళారికి అమ్మేవారు. 


ఇక సింహద్వారం యెదురుగా వరండాకు దిగువునా మూడు మెట్లు దిగితే ఇంటి పొడవునా.. ఆరడుగుల వెడల్పుతో తాటాకు పందిరి.. యెర్రమట్టిలో ఆకుపచ్చని పేడ కలిపి నున్నగా అలికిన నేల పై తెల్లటి నాము ముగ్గులతో కళకళలాడుతూ వుండేది. పడమటి వైపు ప్రత్యేకంగా పెంకులతో కప్పిన పొడవైన వంటిల్లు. ఇంటిని వంటింటిని కలుపుతూ తాటాకు పందిరి..  వెనుక వంటింటి గోడ నుండి వరండా గోడ వరకూ ఉత్తరం వైపున వున్న  మిగతా నాలుగు దూలాల పట్టు వున్న మా చిన్న తాత యింటిని విడదీస్తూ మధ్యలో అడుగున్నర వెడల్పు వున్న ఇటుకల గోడ. వంటింటికి యింటికి మధ్య ఖాళీ స్థలంలో  గోడను ఆనుకుని రాధాకృష్ణ పూలతీగ (Rangoon Creeper) తీగ మల్లెచెట్టు. కరివేపాకు చెట్టు.. మంచి నీళ్ళ కుండ.. మజ్జిగ కవ్వం గుంజ దానిముందు సిమెంట్ చుట్టు మీద తాటాకు చుట్టు. పడమటింట్లో దీపం గూడు ..ఒక పెద్ద కిటికీ ఉండేది. సాయంత్రం మా అమ్మ సంధ్య వేళ దీపం వెలిగించి ఆ గూట్లో పెట్టి దణ్ణం పెట్టుకునేది. పెద్దలకు పెట్టే దీపం అనేవారు. మూడు అరలున్న చెక్క అరమరాలు ఉండేవి ప్రతి గదిలో. వంటింట్లో అటక ఉండేది.వెలిసె మీద అనేవాళ్ళు. గోడవారగా చెక్క కొట్టి ఉండేది. దానిమీద పాత్రలు బోర్లించేవారు.


మా ఇంటి గోడలు పన్నెండు అడుగుల యెత్తులో రెండడుగుల వెడల్పుతో (ఒక మనిషి పడుకుని దొర్లే అంత ) వుండేవి. గానుగ సున్నం ఇటుక రాళ్ళతో కట్టిన ఇల్లు మాది. ఇంటికి వాడిన కలపంతా టేకు మద్ది వే నంట. దూలాలు దూలాలపైన పై కప్పుకు ఆలంబనగా వుండే చిన్న దూలాలు దంతులు పరందాలు. అన్నీ నల్లగా నిగనిగలాడుతూ వుండేవి. మందంగా ఉండే వెదురు బద్దలు పరచి వాటిమీద చాపలు పరచి కుమ్మరి పెంకుతో ఇల్లు కప్పబడి ఉండేది. పెద్ద పెద్ద గాలివానలకు పెంకు చెదర కుండా సిమెంటుతో బద్దులు కట్టి ఉండేవి.  


ఇక మా యింటి వరండా అందం చెప్పనలవి గాదు. నల్లటి రాయి మా అమ్మ పరిశుభ్రానికి మరింత నల్లగా మెరిసిపోయేది. మా అమ్మ కోడలిగా వచ్చే నాటికే ఆ ఇల్లు కట్టి ముప్పై నలబై యేళ్ళు పైబడిందేమో.. సున్నంతో కట్టిన గోడలు.. పెళికలు రాల్చేవి అంట. మా అమ్మ వాటిని రాల్చేసి..  వరండా అంతా సిమెంటుతో గోడలకు నాలుగడుగుల యెత్తు వరకూ ప్లాస్టింగ్ చేయించింది. రెండు రకాల గోడ అతుకులతో బాగుండదని నల్లరంగు వేయించి  పైన పట్టీగా మూడంగుళాల ఎర్రటి రంగుతో పట్టీ వేయుంచింది. నల్లగా చేవ దేలిన కలపతో వార్నిష్ మెరుపుతో నిగనిగలాడే దర్వాజాలు   మరియు తలుపులు కిటికీలు వాటి రెక్కలు వరండా గోడలు కింద నల్లటి గచ్చు. ఆరంగుళాల యెత్తుతో పసుపు రంగు గడప యెర్రటి పూలు ఆకుపచ్చ తీగలతో గడపబొట్టుతో (మండిగం) యెంతో అందంగా వుండేది.  


ఇక ఆ వరండాలో .. పచ్చటి  మేనిఛాయతో చక్కని నూరవనెంబరు కాటన్ చీరతో 100% రూబీ కాటన్ తప్ప మరే బట్టతో జాకెట్ కుట్టించని తొడగని  మా అమ్మ  వొత్తయిన జుట్టు నడుముదాటని జడతో బచ్చలిపండు రంగు కన్నా కొంచెం తక్కువ రంగున్న కుంకుమ బొట్టుతో.. మెట్ల మీద నో మండిగం ముందో కూర్చుని రామాయణమో వీక్లీ పుస్తకమో చదువుకుంటూనో లేదా గడ్డం కింద చేయి వుంచుకుని దీర్ఘంగానో ఆలోచిస్తూ కూర్చున్న ముఖచిత్రం నా కళ్ళ ముందు మెదులుతుంటుంది.


కాస్త మా యింటి గురించి చెప్పడం ఆపి.. మళ్ళీ మా ఊరు ముఖ చిత్రం గురించి చెప్పుకుందాం. పడమటి చెరువు వైపు నుండి మా ఊరిలోకి ప్రవేశించాం అని చెప్పుకుందాం కదా. అది ప్రధానమైన మార్గం కాదు. మా తాతల కాలం వాళ్లు నడిచిన దారి అది. చెరువు కట్ట కింద గంగానమ్మ గుడి పక్కనుండి చెరువు కట్ట యెక్కి రెండు పర్లాంగుల దూరంలో వున్న మంచి నీళ్ళ బావి దగ్గరకు చేరుకుందాం. కొన్ని తరాలముందు ఆ బావి రచయిత ప్రేమ్ చంద్ “ఠాగూర్ కా కువా” అయి వుండవచ్చేమో కానీ నాకు తెలిసేటప్పటికి ఆ బావి మా ఊరందరి ఉమ్మడిసొత్తు. పైన చెరువులో యెర్రటి నీళ్ళు కట్టకింద బావిలో నల్లటి నీరు. ఆ బావిని దాటి తిన్నగా ముందుకు వస్తే బడి లైబ్రరీ బ్యాంక్ చిల్లర కొట్టు పాలకేంద్రం బస్ స్టాప్ వుంటాయి. ఊరి రచ్చబండ కూడా  అక్కడే! మనం  మళ్ళీ బావి యెడమ పక్కకే వెళదాము. 


కట్ట మీదగా వొక పర్లాంగు దూరం వరకూ ముందుకు వెళుతుంటే కట్ట దిగువున కొంత ఖాళీ స్థలాలు వాటిని ఆనుకుని కొన్ని యిళ్ళు.. రెండు పర్లంగుల దూరం వరకూ వుండేవి. కట్ట మీద వొక పర్లాంగు దూరం నడిచాక  చెరువుకట్ట ను ఆశ్రయించుకుని కొంతమంది ఉప్పరుల యిండ్లు వారి పశువులు పందుల దొడ్లు వుండేవి. వారి ఇళ్ళు దాటేసరికి పడమటి చెరువు ఆగిపోయేది. చెరువు లో నీరు నిండిన తర్వాత వొక కాలువ ద్వారా తూర్పు చెరువుకు మళ్ళే విధంగా రెండు చెరువులకు వొక కాలువ అనుసంధానంగా వుండేది. ఆ కాలువ మీదనే వొక బ్రడ్జి వూరు ను అటు ఇటు కలుపుతూ సాగే అసలైన వాహన రహదారి వుండేది. పడమటి చెరువుకు దిగువగా వొక చిన్న వీథి తర్వాత వొక పెద్ద వీథి రెండు చెరువులను కలిపే కాలువ కుడిపక్కన కొన్ని వీథులు దాటి దక్షిణం వైపుగాను తూర్పు వైపుగాను ఊరు విస్తరించి వుండేది.  ఊర్లో సగభాగం ఇది. ఇక్కడ పేద గొప్ప బీద ధనిక కుటుంబాలు కలగాపులగంగా వుండేవి.కమ్మ కాపు వైశ్య మహ్మదీయులు వెలమ రజక ముదిరాజ్ బ్రహ్మణ కుమ్మరి కంసాలి కుటుంబాలు వుండేవి. ఈ భాగానికి లైబ్రరీ మధ్య భాగంగా రచ్చబండగా వుండేది.కచేరి సావిడి కూడా ఉండేది 


ఊరికి ఈశాన్యంలో తూర్పు చెరువును ఆనుకుని వొలికిలి (స్మశానం) తూర్పున చెరువు పడమరన చెరువు తూర్పు దక్షిణాన నైఋతి మూలన మాగాణి భూములు తూర్పున పంట పొలాలకు ఆనుకుని   భద్రాచలంలో కొలువైన తీరులోనే మా కుటుంబ ఇలవేల్పు సీతారామచంద్రస్వామి కొలువైన గుడి పాడుబడి వుండేది. ఎందుకు అలా వుందో తెలిసేది కాదు. స్వామి గుడి పక్కనే  పెద్ద స్థలంలో ఊడలు దిగిన మర్రి చెట్టు భయం గొల్పుతూ  వుండేది. అది దాటి ముందు వెళితే ఒక పెద్ద నీటి గుంత యండేది.


ఇక ఇంకో సగం ఊరు పడమటి చెరువును ఆనుకుని వాయువ్యానికి ఉత్తరానికి విస్తరిస్తూ.. హరిజనుల ఇళ్ళు  వుండేవి..ఈ రెండు వాడలకు మధ్య గౌడ గొల్ల కులాల వారు దొమ్మరి కులాల వారిళ్ళు వుండేవి. ఇదంతా కొత్త ఊరు అనే వారు. పాత ఊరు అనేది కాలువకు అవతల వున్న ఊరు. ఈ కొత్త వూరు మధ్య నుండే మా వూరి ప్రధాన రహదారి మైలవరం వైపు వెళుతుంది. విజయవాడ భధ్రాచలం రోడ్డు మార్గంలో కుంటముక్కల అడ్డరోడు దగ్గర నుండి( మైలవరం ఇంకా నాలుగు కిలోమీటర్లు ముందుకే వుంటుంది) నుండి మా వూరు మరొక కొస కు చేరుకోవాంటే రెండున్నర కిలోమీటర్లు వెళ్ళాలి.  ప్రస్తుతానికి అడ్డరోడ్డుకు కిలోమీటరు దూరం మాత్రమే వుండే వరకూ ఊరు ఉత్తరం వైపు విస్తరించి వుంది. ఊరికి ఆగ్నేయ మూలన వుండేది మా ఇల్లు. మా ఊరిలో వొక్క రెడ్డి కులం తప్ప అన్ని కులాల వారు వుండేవారని అనేవారు. ఒకప్పుడు ఊరు బొడ్డు రాయి మా ఇంటి వెనుక ఉండేది అంట. అలాగే మా రెండో పెదనాన్నకు వచ్చిన వాముల దొడ్డి భాగంలో దేవతా విగ్రహాలు ఉండేవి. అందులో వినాయకుడి విగ్రం తీసుకువచ్చి లైబ్రరీ దగ్గర గుడి కట్టి అందులో ఉంచారు మా చిన్నన తనంలో. ఇంకా రెండు నిలువెత్తు విగ్రహాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. ఆ విగ్రహాలు నల్లటి శిల్పాలు అయితే కాదు. కాస్త తెల్లగా ఉండేవి. చిన్నప్పుడు మేము సమీపంగా వెళ్ళడానికి భయపడే వాళ్ళం.


(మిగతాది మరికొన్ని భాగాలు గా.. ) 



మా ఊరు మంచి నీరు బావి

11, మే 2020, సోమవారం

ఆలోచన చేద్దాం కొంచెం ..

మనుషులను మనం విశాల దృష్టితో  వాళ్ళ కోణంలో అర్ధం చేసుకోవాలని అనిపించిన సందర్భం వొకటి చెప్పదలచుకున్నాను.

అది నా కవితా సంపుటి ఆవిష్కరణ రోజు. చాలా యేళ్ళ నుండి వాయిదా వేసి వేసి ఆఖరికి నేను కూడా వొక కవినే అన్న దైర్యం హెచ్చిన పిమ్మట  పుస్తకం ప్రచురణలోకి  వచ్చేసింది. మా అబ్బాయితో ఆవిష్కరణ చేయించాలని నా కోరిక. తనకి వీలవలేదు ఆ సమయానికి కోడలు వచ్చింది . తనచేత ఆవిష్కరింప జేసే ప్రయత్నం. అంతకు ముందు రోజు మా నాన్నగారికి కాల్ చేసి "నాన్నా.. రేపు పుస్తకావిష్కరణ. మీరు రావాలి "అని చెప్పాను. జెట్ స్పీడ్ లో "నాకు రావడం కుదరదు. రేపు మేము పోలవరం ప్రాజెక్ట్ చూడటానికి వెళుతున్నాం " అని సమాధానం వచ్చింది.

నాకు వెంటనే వుక్రోషం పొడుచుకొచ్చేసింది. కూతురి పుస్తకం కన్నా ఈయనకి పోలవరం ప్రాజెక్ట్ చూడటం యెక్కువైపోయింది అని అనేసి  వూరుకున్నానా .. యింకా పొడిగించి "   చూడటానికి ఆ మాత్రం కళ్ళు వుండాలి,మనసుండాలి " అని అనేశాను. అప్పటికి నాన్నగారు ఫోన్ కట్ చేశారు. చేసేది మనమైనా ఇంకేం చెపుతారో అని వేచి వినడం ఆయనకి  లేదు.  ఇంకేమైనా విషయం మిగిలి వుంటే  మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేయాల్సిందే.

అలా జరిగిన కొన్ని నిమిషాల తర్వాత "అయ్యో,నేనలా అనకుండా వుండాల్సిందేమో, ఎవరి భావోద్వేగాలు, ఎవరి సమయనిర్ణయాలు వారివి. ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తికి అప్పుడో యెప్పుడో  వ్యవసాయం చేసిన రైతుకి ఆ మాత్రం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చూడాలని అనుకోవడంలో తప్పేమి వుంది. నా కవితా సంపుటి భావోద్వేగాలకు సంబంధించినదే అయినప్పుడు ఆయనది కూడా భావోద్వేగమే కదా" అని అనుకున్నాను.

అలాగే కొంతమంది పనిగట్టుకుని రాకూడదు అనుకుని ముఖం చాటేసినా, వొంకలు వెతుక్కున్నా వారిని రాలేదమని అడగను కూడా అడగను. బహుశా నేను వారికి ప్రాధాన్యంగా అనిపించకపోవచ్చును. ఒకవేళ నా పొగరు వాళ్ళని గాయపరచి వుండవచ్చును.. ఇలా అనుకుని మామూలైపోతాను.

ఇలాంటి విషయాలకు ముఖం నల్లగా పెట్టుకోవడం, నిరాశగా వుండటం లేదా కక్ష సాధింపుగా వుండటం లాంటి వాటికి దూరంగా వుంటాను. ఇతరులను అర్ధం చేసుకుంటే మనకు చాలా మనఃశాంతిగా ఉంటుంది కదా!

   అరే జరా సే సోచ్నా   (जरा से सोचना)

1, మే 2020, శుక్రవారం

ఆశతో జీవించడంలోనే..

ఈ సృష్టిలో ప్రతి ప్రాణి మరొక ప్రాణిని సృష్టించకపోయినా సృష్టించబడిన వాటిని ప్రేమిస్తుంది, ప్రశంసిస్తుంది, ఒకోసారి ద్వేషిస్తుంది.
లేదా సృష్టించబడిన వాటి మహిమని ప్రచారం చేస్తుంది. మనమూ అంతే కదా ! కానీ ఒకోసారి మన దగ్గర వారే మనను ద్వేషించిన సందర్భాలు మనకొక జీవిత పాఠాలు నేర్పుతుంటాయి..మనిషి స్వార్ధం ముందు నేను నాది అన్నది తప్ప మిగతా విషయాలన్నీ త్రోసిపుచ్చి వీలైనంత ఎదుటివారిని బాధ పెట్టేవిగా ఉంటాయనే విషయాన్ని మనం జీర్ణించుకోగల్గాలి.   ఆ విషయాన్ని మీతో పంచుకుంటూన్నానిలా..

ఆశతో జీవించడంలోనే అర్దమెంతో వుందిలే..

ఈ “ కరోన” కాలంలో బిడ్డలు దూరంగా వుండటం వల్ల ప్రతి చిన్న విషయానికి చిరుగాలికి కూడా అలఅల్లాడే చిగురుటాకులా వుంటుంది మానసిక పరిస్థితి. నిరంతర వార్తాప్రసారాలలో  వెలువడే వార్తలు గణాంకాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంటే తమ పక్కనే ప్రమాదం పొంచి వుంటుందనే ఎరుక ఒక విధమైన నిర్వేదాన్ని కల్గిస్తుంది.

మాములుగా స్పందించే చిన్న అనారోగ్య సూచన.. కూడా ముఖ్యంగా జలుబు తుమ్ము లాంటివి గొంతునొప్పి లాంటివి కూడా ఉలికిపడేలా చేస్తున్నాయి. తుడిచినదే తుడవడం కడిగినదే కడగడం ఆహార అలవాట్లలో మార్పు రావడం... మనవాళ్ళ క్షేమసమాచారాల పట్ల ఆదుర్దా.. కొన్ని అర్దంలేని భయాలు అర్ధం గురించి జాగ్రత్తలు ప్రణాళికలు.. చేయాలని వున్నా కూడా చేయలేని సహాయాలు ఇతరులను అంటకూడా సామాజిక బహిష్కరణలు.. ఒక విధంగా ప్రతి మనిషి ఒక వొంటరి ద్వీపమై మనని మనం వెలివేసుకుని పంజరాలలో బిగించుకున్న బతుకులు. నిస్వార్దముగా సేవ చేయడం లేదని ఈసడించుకున్న వైద్యులు ఆరోగ్య సిబ్బంది.. మరికొన్ని వ్యవస్థలు చిత్తశుద్దితో పనిచేస్తుంటే కొన్ని అసహనాలు తమ ఉనికిని బయటపడేసుకుటున్న ఉదంతాలు. వీలైనంత దూరంగా  వుంటూ మనని మనం కాపాడుకోవడం మనవారికి ఒక అమూల్యమైన కానుక. ముఖ్యంగా ఇతరదేశాలలో వున్న పిల్లలు తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా మసలుకోవాలి.

నా ఫ్రెండ్ ఫిబ్రవరి ఆఖరివారంలో USA నుండి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు భర్త ఇద్దరు పిల్లలతో కలసి. ఆమె ఇంట్లో సంస్మరణ కార్యక్రమం. మార్చి 12 కి తిరిగి వెళ్ళబోయేసరికి తిరుగు ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. కాలేజీలో అడ్మిషన్ వుండటం మూలంగా.. పెద్ద అబ్బాయి ఉద్యోగరీత్యా భర్త వీళ్ళిద్దరూ అత్యవసరమై వేరే మార్గం ద్వారా USA చేరుకున్నారు. ఆమె చిన్నబాబు ఆంధ్ర ప్రదేశ్ లో. కుటుంబం అందరికీ కరోన టెస్ట్ లు సెల్ఫ్ క్వారంటైన్. ఇక్కడ అమె కుటుంబం కూడా సెల్ఫ్ క్వారంటైన్. అదృష్టవశాత్తు అందరూ కూడా.. కరోన బారిన పడకుండా.. రక్షణ చట్రంలో వున్నారు.

నా స్నేహితురాలు ఇక్కడ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా  సర్దుకున్నా ఆమె చిన్న కొడుకు ఇక్కడ వాతావరణానికి ఆహారపు అలవాట్లకు ఇంటికి కట్టి పడేసిన ఆంక్షలకు వొత్తిడికి గురవుతున్నాడు. పైగా పుట్టిన తర్వాత దూరంగా వుండని తండ్రి అన్న లను బాగా మిస్ అవుతూ వుంటే.. నా ఫ్రెండ్ ఏమో మనుషుల మనస్తత్వాలకు ప్రవర్తనలో తేడాలు ఇగోలు శాడిజాలకు బలైపోతూ ఉక్కిరి బిక్కిరై పోతున్నారు.  మనిషి స్వార్ధజీవి. పక్కల్లో మిన్నాగు కాటుకు గురైతే తిరిగి ఇంటికి వస్తామో లేదో తెలియని పరిస్థితి కూడా..మన ఇగోలు వర్దిల్లాలి. శాడిజాలు తృప్తి పడాలి లాంటి ఆలోచనలు వుంటాయి చూడండి అవి కరోన కన్నా భయంకరమైనవి. వ్యాధులు ఆకలి బాధల మధ్య కూడా.. “నేను” ‘’నాది‘’అన్న స్వార్ధమే మనిషికి ఇలాంటి పరిస్థితులను తెచ్చిపెడుతుంది. ఎవరూ ఎవరింట్లోనూ వుండాలని అనుకోరు. ముఖ్యంగా స్త్రీలు భర్త పిల్లలతో కలిసి ఒకేచోట వుండాలని కోరుకుంటారు. అనుకోని పరిస్థితుల వల్ల వుండాల్సి వస్తే అది పుట్టిల్లైనా సోదరసోదరీమణుల ఇల్లైనా.. వారిని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి.మరింత మానసిక స్తైర్యానివ్వాలి తప్ప సూటీపోటీ మాటలు అంతస్తుల బేరీజులు డబ్బు లెక్కలు పిసినారితనాలు చూపకూడదు.

నా ఫ్రెండ్ ఒకటే అనింది. ఈ కరోన కళ్ళు తెరిపించింది..  అని. ఈ లాక్ డౌవున్ ఎత్తేస్తే టికెట్స్ ఎంత ఖరీదైనా సరే.. ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చినా సరే వెంటనే ఇక్కడినుండి వెళ్ళిపోవాలి అంది. తల్లిదండ్రులు తోబుట్టువులే ఇలా వుంటే మనిషి మంచితనం మానవత్వం పరాయివారిలో వెతకాలనుకోవడం మబ్బు చూసి ముంత వొలకబోసుకోవడం లాంటిదే అనుకోకూడదు. మనిషితనం మానవత్వం ఇంకా చాలా వున్నాయి. లేకపోతే ఈ మాత్రం కూడా మనిషి బతకలేడు... అనిపిస్తుంది. ఫ్రెండ్స్ మనవారే మనని బాధ పెట్టినా నిబ్బరంగా వుండాలి.. ఆశతో జీవించడంలోనే అర్దమెంతో వుందిలే... అనుకుంటూ ఉత్సాహంగా .. మరింత జాగ్రత్తగా వుందాం. వీలైనంత సాయంగా మరింత ప్రేమగా వుందాం.  సరేనా..



21, మార్చి 2020, శనివారం

రెండు తీరాల నడుమ నావ

విదేశాలలో పిల్లలుంటే తల్లిదండ్రులకు చాలా అవస్థలు.

వారి మానసిక స్థితిని లంగరు వేయడం కుదరని రెండు తీరాల నడుమ అలల్లాడే నావతో పోల్చుకోవచ్చు.

అనారోగ్యాలు ఒత్తిడితో కూడిన ప్రయాణాల కన్నా కష్టమైనది వేరొకటి వుంది.

అది... అనుబంధాల గొలుసు ముడిపడుతూ తెగనరుకుతూ.. బాధ్యతల నడుమ నలిగే రణరంగంలో మరి మరి క్షతగాత్రమయ్యే హృదయపు అలజడి.

ఈ సడిని అర్ధం చేసుకోదగిన పిల్లలెందరు? కథగా వ్రాయదగిన అంశం ఇది. ఓపిక లేదు వ్రాయడానికి. 😞

విదేశాలకు వెళ్లొచ్చిన తల్లిదండ్రులకందరికీ తెలుసు ..ఆ Pain..ముఖ్యంగా ... బిడ్డలను వారి బిడ్డలను కూడా వొదిలి జీవశ్చవాలుగా బ్రతకడానికి తిరిగి వస్తున్నప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం .

ఇప్పుడు "కొరోన" మహమ్మారి. పిల్లలు అక్కడ తల్లిదండ్రులు మరొక చోట. ఇదొక నరకయాతన.



27, ఏప్రిల్ 2018, శుక్రవారం

ప్రేమకి బందీ

ఈ విశాల ప్రపంచంలో స్వేచ్ఛగా యెగిరే పక్షినవ్వాలనో, ఓ స్వచ్చమైన  సరస్సులో క్షణం కూడా ఖాళీ లేకుండా అల్లనల్లగా యీదులాడే వో చేపనవ్వాలని, పచ్చని తోటలో రంగుల సీతాకోక చిలకనవ్వాలని అలా పుట్టి వుంటే బాగుండేది కదా అని తలంపులు  యెన్నో యెన్నెన్నో లోలోపల. ఇవన్నీ కాకున్నా  ప్రవరుడిలా  దివ్య లేపనం  పూసుకుని హిమాలయాల్లోనూ , అందమైన కాశ్మీరంలోనూ తిరిగి వచ్చే లేపనం అయినా  పొంది వుండకూడదా అని వగచిన సందర్భాలు యెన్నెన్నో! కాళ్ళకి  చక్రాలు ధరించి రయ్యి రయ్యిమంటూ  భారత దేశమంతా  తిరగాలని  జీవ వైవిధ్యాన్ని రికార్డ్ చేయాలని, వీలైనన్ని సార్లు  హంసల దీవిలో సాగరసంగమం  వద్ద  పొద్దస్తమాను తిష్ఠ వేసుకుని అలల ఘోషని హృదయం పెట్టి వినాలని యిలా చాలా చాలా వున్నాయి.  చెప్పుకుంటే బాగోదని లోలోపల అనుకుంటాను కానీ యిలా చెప్పుకునే సందర్భం వస్తుందనుకోలేదు కానీ వచ్చింది మరి.


మనలో చాలామందికి ఈ నాగరిక జీవనం పట్ల, వొత్తిడితో కూడుకున్న జీవిత పట్ల వో విముఖత. వొక విధమైన నైరాశ్యం కూడా ! ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి,అనురక్తి వున్నవాళ్ళు అంత తొందరగా వైరాగ్య భావనలోకి వెళ్ళలేరు. ప్రకృతి ప్రేమికులు మాత్రమే అదీ వొక passion వున్నవాళ్ళు మాత్రమే ఆధునిక  సౌకర్యాలని, సౌకర్యవంతమైన జీవితాన్ని వొదిలి అలా అరణ్యాల అందాలని ఆస్వాదించాలి, యింకా యేదో కొంగ్రొత్తగా తెలుసుకోవాలనే ఆసక్తితో,జిజ్ఞాసతో  వారు అభిలషించిన మార్గంలో నడిచే సాహసం చేస్తారు. అలాంటి వారిలో ఫేస్ బుక్  ఫ్రెండ్  జయతీ  లోహితాక్షన్ జనబాహుళ్యంలో తక్కువగానూ అరణ్యాలలో (అనకూడదేమో ) అడవి సౌందర్యాన్ని చూస్తూ, అన్వేషిస్తూ అక్కడి అందాలని ఛాయాచిత్రాలుగా బంధించి అందరికీ చూపిస్తూ  అందర్నీ వూరిస్తున్నారు.నిజానికి ఆమె నాకు పరిచయమయ్యాక ఆమెలా జీవించాలని, లేదా ఆమెని అనుసరిస్తూ నడవాలని కోరిక నానాటికి వృద్ధి చెందుతుంది. కానీ అడుగు కూడా ముందుకు వేయలేని ఆసక్తురాలిని. ప్చ్ .. అందుకు ఒక కథ వుంది.


మనం యేవేవో అనుకుంటాం అందుకు యిల్లు మనకి అనుమతి యివ్వదు. ఇల్లు అంటే నా దృష్టిలో నాలుగు గోడలు, పై కప్పు నాలుగు గదులు యిది కాదు నా దృష్టిలో. ఇల్లంటే ప్రేమాభిమానాలు అనుబంధాలు ఆప్యాయతలు కొన్ని విమర్శలు, కొంత ఆధిపత్య భావజాలం, కొంత ఈర్ష్యలు, కొంత నిస్వార్ధ త్యాగాలు, సర్దుబాట్లు యివన్నీ కలగలిసిన మనుషులు. ఇంట్లో వాళ్ళు బయటకి వెళుతుంటే యెన్నో జాగ్రత్తలు చెపుతాము. బయటకి వెళ్ళిన మనిషి తిరిగి గూటికి చేరేదాకా గుమ్మానికి చూపులు వ్రేలాడదీసి వుంచుతాం. మరికొంత ఆత్రుత, లోలోపల యేవో భయాలు తారట్లాడుతుంటే గుమ్మందాటి రహదారి పైకి వచ్చి వీధి మలుపు దాకా దృష్టి సారిస్తాం కదా ! అలా ..



నా కొడుకు నేను యెక్కడికైనా వెళతానని చెపితే అనేక జాగ్రత్తలు చెపుతాడు. ఈ మధ్య ... బంగారం, నేను  ఉత్తర భారత దేశం చూడటానికి వెళతాను, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది  వెళుతున్నారు, అన్ని యేర్పాట్లు బాగా చేసుకుంటున్నారు యిబ్బంది యేమీ వుండదులే అన్నాను కొంచెం అనుమానం గానే ! వెంటనే టపీమనే సమాధానం " వద్దు " అని.  నేను ముఖం చిన్నది చేసుకుని దిగులుగా "యే౦. యెందుకని ? " అన్నాను .


" ఇప్పుడెందుకమ్మా ! అక్కడ వర్షాలు ముందుగా కురుస్తాయి. కొండ చరియలు విరిగిపడటం, రోడ్లు పై వెళ్ళడానికి అడుగగునా అంతరాయం, బోలెడు ఇబ్బందులు. నేను వచ్చినప్పుడు అందరం కలిసి వెళదాం.. ఇప్పటికి వాయిదా వేసుకో " అన్నాడు .


ఓ భారమైన నిట్టూర్పుతో నాకు తెలుసు నువ్వు యిలా అంటావని, అసలు నీకు చెప్పకుండా ప్రయాణం ఖరారు చేసుకుని వెళ్లి వచ్చాక చెప్పాల్సింది అన్నాను. నువ్వేం అలా చేయవని నాకు తెలుసులే ..అని నవ్వు.


ఇక రెండో విషయం .. కార్ డ్రైవింగ్ నేర్చుకుని కూడా వొంటరిగా తీయడానికి అనేక ఆంక్షలు. నేను వచ్చినప్పుడు నువ్వు డ్రైవింగ్ యెంత బాగా చేస్తున్నావో చూసి అప్పుడు ఒకే చేస్తాను. అప్పడి దాకా డ్రైవర్ లేకుండా కార్ తీయోద్దమ్మా ..నువ్వు చాలా స్పీడ్ వెళతావ్, వెళ్లనని ప్రామిస్ చేయి అంటూ నా ఉత్సాహానికి బ్రేక్ వేసేసాడు.



సరే ! అదలా అయిందా .. మళ్ళీ ఇంకో సంగతి.  ఉదయాన్నే చాలా బద్దకంగా వుంటుంది మళ్ళీ వాకింగ్ కి  వెళ్ళాలనిపిస్తుంది . మనకి ఒక కిలోమీటర్ దూరంలో వాకింగ్ ట్రాక్ వేసారు, అక్కడికి బండి మీద వెళ్లి అక్కడ వాకింగ్ చేస్తాను, మనకి తెలిసిన అక్క వాళ్ళు రోజూ నాలుగు కిలోమీటర్ల దూరంనుండి వస్తున్నారు అక్కడికి. ఆ యేరియా చాలా ప్రశాంతంగా వుంది నాకు బాగా నచ్చింది అని చెప్పాను . అందుకూ సమాధానం వద్దు అనే ! నాకైతే భలే  కోపం వచ్చేసింది. ప్రతి చోటుకి వెళ్లొద్దు,వెళ్లొద్దు అంటావ్ ..  అసలు నీ పెత్తనం యేమిటీ  నాపై అన్నాను కోపాన్ని ప్రకటిస్తూ ..


అబ్బాయి మాత్రం తన సహజమైన నెమ్మదైన గొంతుతో .. యిదిగో, యిలాంటి ఆవేశమే వద్దనేది. నేను యెందుకు వద్దంటున్నానో అర్ధం చేసుకోవాలి నువ్వు. మన ప్రక్క రోడ్లు పెద్దవి చేస్తున్నారు కదా !  ట్రాఫిక్ అంతా అస్తవ్యస్తంగా వుంది కదా ! మొన్న నువ్వే చెప్పావు పిన్ని వాళ్ళ వెనకింట్లో వుండే అతను రోడ్డు దాటి మన సందులోకి వస్తుంటే రోడ్డు పని చేసే టిప్పర్ గుద్దేసిందని. పనులు జరుగుతున్న రోడ్డు పై రోజూ బండి వేసుకుని వెళ్ళడం యెందుకమ్మా ... వాకింగ్ వద్దు యేమీ వద్దు. నాకుంది నువ్వొక్కదానివే అమ్మా ! నీకేమన్నా అయితే  నాకెవరు వున్నారు అన్నాడు.


నాకు కళ్ళ నిండా నీళ్ళు. ఈ అవధుల్లేని ప్రేమకి నిలువెల్లా తడిసిపోవడం తప్ప ..నేనింకేం మాట్లాడగలను. అంగుళం కూడా ముందుకి కదలలేను. ఈ అనుబంధాల వానలో తడుస్తుంటే యే విహార యాత్రలకో తీర్ధయాత్రలకో వెళ్ళాలని యెందుకు  అనిపిస్తుంది ?  రెక్కలు ముడుచుకున్న పక్షినై గూటిలోకి జేరి మౌనంగా .. నేను వూహించుకున్న అందమైన లోకాలని గూగుల్   ద్వారా విహంగ వీక్షణం చేస్తూ సంతోషంగా కాలం గడిపేస్తున్నా! నాలో కలిగే  ఆధ్యాత్మిక  భావనలను హృదయానుభూతితోనూ సందర్శనం చేసుకుంటూ   నా భ్రమణ కాంక్షకి తిలోదకాలిచ్చేసి ...  "బంగారం...మీ అమ్మ నీ ప్రేమకి బందీ కానిదెన్నడు, నీ ఆజ్ఞలకి లోబడనిదెన్నడూ " అనుకుంటాను.



యెవరైనా అవధుల్లేని ప్రేమతో తన వారిని శాసించగలరు తప్ప .. వేరొక విధంగా కాదు. తమ వారి పట్ల ప్రేమ, భాద్యత వుంటేనే అలా ఆంక్షలు విధించగలరు కదా !  ఆఖరికి మా అబ్బాయి ఫినిషింగ్ టచ్ యెలా యిచ్చాడు అంటే .. నాకు ఇరవై యేళ్ళప్పుడు  సెకండ్ షో  సినిమాలకి వెళ్లొద్దు, జీరో అవర్స్ లో ఫ్రెండ్స్  చేసుకునే బర్త్ డే పార్టీలకి వెళ్లొద్దు  అంటే నేను నీ మాట వినలేదూ, అలాగే నువ్వు వినాలిప్పుడు " అంటే  లోలోపల మురిసిపోతూ నవ్వుకున్నాను. ఆ సందర్భాన్ని తలుచుకుంటూ యిప్పుడూ నవ్వుకుంటూ ..



ఏ ప్రేమలైనా తల్లి బిడ్డల ప్రేమ బంధం ముందు తీసి కట్టే .. అని నా అభిప్రాయం.అమ్మని నాగురించి నా బిడ్డ చెబితే బాగుంటుందేమో ..కానీ నా వైపు నుండి ఈ ప్రేమ ప్రకటన ..

నా కడుపున పుట్టిన వాడు

నా కన్న తల్లై నన్ను హత్తుకుని నడిపించే వాడు

కాబట్టి ..



22, ఫిబ్రవరి 2018, గురువారం

నా దారెంట

మనిషి జ్ఞాపకాల ఆధారంగానూ కల్పనలతో రోజుని గడుపుతుంటాడు. ఒకో జ్ఞాపకం చాలా పాతది కావచ్చు. అది మంచిదో చెడ్డదో.. కానవసరం లేదు. ఏదైనా జ్ఞాపకమే! ఈ రోజొక జ్ఞాపకం.. అది విషాద వీచికగా రూపాంతరం చెందిన జ్ఞాపకం. 

"నా దారెంట నే పోతుంటే  నన్నెందుకు  ఆకర్షించాలి నువ్వు"

వాస్తు పిచ్చితో మూలబడ్డ ఓ ఇంటి స్థలం ప్రక్కనుండి  వేలాది మందిలా  రోజూ నేను నడుచుకుంటూనే వెళతాను. ఖచ్చితంగా స్థలం ఎదురుగానూ ఎడమప్రక్కనూ కలుపుతూ  బ్లైండ్ మలుపు, వేగాలని నియత్రించడానికి అక్కడ వేసిన ఓ స్పీడ్ బ్రేకర్.  నా హడావిడి జీవితంలో ఓ రోజ.  ఆ రోజు చిన్నగా అనిపించే పెద్ద విచిత్రమే సంభవించింది. రోడ్డెంట నడుస్తూనే కనుకొసలనుంచి ప్రక్కకి చూస్తున్నప్పుడూ  ఓ పసుపు పచ్చని మొక్కొకటి తనువంతా పూలతో అలంకరించుకుని కనబడింది. ఏ వాహనమూ రాకుండానే నా నడకకి సంకెళ్ళు పడ్డాయి. 

"నా దారెంట నే పోతుంటే  నన్నెందుకు  ఆకర్షించాలి నువ్వు" అనుకుంటూ ముఖమంతా నవ్వు విచ్చుకుని వెలుగు కళ్ళతో ఆ మొక్క సమీపానికి వెళ్ళానా, ఎంత అందంగా వుందో ఆ పిచ్చి తల్లి. ఏవో కాయలు కూడా కాస్తున్నట్లు కనబడింది కూడా.  నెర్రెలిచ్చిన సిమెంట్ బండల మధ్య మొలకెత్తి పుష్ఫించి ఫలించిన మొక్క అది.  నయన స్పర్శతోనే ఆ జీవన సౌందర్యాన్ని పలకరించి ఆ రూపాన్ని హృదయంలో చిత్రించుకుంటూ   లోలోపల గింగిర్లు తిరుగుతున్నస్వరాలేవో పెదవి దాటి కూని రాగంగా మారి ఈ రోజు జీవించిన క్షణాల్లో ఇవి కొన్ని అనుకుంటూ  పదపద మంటూ అడుగులని తరిమే ఆలోచనల సాక్షిగా బతుకు బాటలో పరుగులు మామూలే. 

ఇంకొంచెం ముందు కు వెళతానా .. దారి ప్రక్కనే ఉన్న మామిడి చెట్టు క్రింద మాసిన గుడ్డని పరిచి దానిని గాలికి ఎగిరి పోకుండా చేతి కర్రని వుంచి వచ్చే పోయే వారి వొంక ఆశగా చూస్తూ ఉంటాడు ఓ భిక్షుయసీ. భుజాన తగిలించుకున్న సంచి చిల్లర నాణేలతో బరువుగా ఉంటే కాస్త బరువు తగ్గించుకుని తృప్తి పడుతూ బరువు లేని రోజు తల అడ్డంగా వూపుతూ నడక సాగిస్తూ ఉంటాను. 

నేను నడక నుండి  మళ్ళీ రెండు చక్రాల బండి పై ప్రయాణం , తర్వాత నాలుగు చక్రాల రధం పై ప్రయాణం చేసే స్థాయికి ఎదిగినప్పటికీ నిత్యం నన్ను ఆకర్షించే ఆ రెండు వస్తువులూ నాకొక ప్రకృతి పాఠాన్ని నేర్పుతూనే ఉంటాయి. ఆగి మరీ అలవాటైన నడకలోకి తొంగి చూడమంటాయి. పసుపచ్చ పూల చెట్టు  యే సంరక్షణా లేకుండా అన్ని ఋతువులలోనూ  ప్రవర్ధమానం అవుతూనే ఉంది. తాత  వొంట్లో సత్తువ తగ్గి  పీకేసే ఓపిక లేక వదిలేయగా జీబుగా   విస్తరించిన గరిక దుబ్బుల మధ్యన  సురక్షితంగానూ   వాకిట్లో నీళ్ళు చల్లి ముగ్గు కర్ర వేసుకోవాలన్న బామ్మ ఆకాంక్షలను త్రాగి బ్రతుకుతూనూ. 

మామిడి చెట్టు క్రింద భిక్షుయసి  శరీరం మరీ కృశించి పోతుంది.  పాదచారుల దయతో లభించిన నాలుగు కాసులుని  రోడ్డు చివర ఫలహారాల బండికి చేర్చలేక .. ఎదురుగా భవనంలో పని చేసే అడ్డ బాసర పెట్టుకున్నామెని బతిమలాడుకుంటాడు కాసిని టీ నీళ్ళు, రెండు ఇడ్లీముక్కలు తెచ్చి పెట్టమ్మా అని.  నేను నీకు  పని మనిషినా ..అని విసుక్కుంటూనే తెచ్చిచ్చే ఆమెలో  రోజూ దయా వర్షం కురుస్తూనే ఉంటుంది. అది చూస్తున్న నాలో తెలివి ఇనుమడించి రోజూ చేతి సంచీ బరువుగా ఉంటేనే ఇవ్వాలా .. నిండు కుండ అన్నంలో నాలుగు ముద్దలు పెట్టొచ్చు కదా అనుకుని ఆచరిస్తాను. 

పసుపచ్చ పూల చెట్టు ఉన్న ఇంటి తలుపులు రోజుల తరబడి మూసుకున్నట్లు గమనించినప్పుడు ఓ సీసాతో నీళ్ళు తీసుకెళ్ళి మొక్కని తడుపుతుంటాను.  అదో మానసిక ఆనందం నాకు. నిజానికి ఈ రెండు పనులు నేను చేయకపోయినా అవి ఉండవచ్చు .  సమయానికి  సందర్భానికి తగినట్లు బ్రతకడం మనుగడ సాగించడం సృష్టిలో సాధారణమైన విషయం.  అదీ కుహనా విలువల మధ్య బ్రతికే ఒక్క మనిషికి తప్ప. 

ఉన్నట్టుండి  మా వైపు రోడ్డు విస్తరణా కార్యక్రమాలు మొదలయ్యాయి. తెల్లారేపాటికి  రహదారి ప్రక్కనే ఉన్న మామిడి చెట్టు ముక్కలు ముక్కలుగా నరకబడింది. దాని క్రింద కూర్చునే వృద్దుడికి ఇప్పుడు తిండే కాదు నీడ లేకుండా పోయిందని విచార పడుతుండగా వెంటనే పసుపచ్చ పూల మొక్క గుర్తుకొచ్చింది. అడుగుల వేగం పెంచి ముందుకొస్తే  రంగ రంగ వైభవంగా విస్తరించుతున్న పసుపచ్చ పూల మొక్క ప్రోక్లెయిన్ తవ్విపోసిన మట్టి గుట్టల మధ్య  ఒదిగి పోయి దిగాలుగా పడి ఉంది.  ప్రయాసతో జారుతున్న మట్టి గుట్టలపైకెక్కి  పసుపు పచ్చ పూల మొక్కని చేతిలోకి తీసుకుంటే విరిగిన కొమ్మై నా చేతిలోకి వచ్చింది. నా మానసిక ప్రపంచం ముక్కలైనట్లైంది. దయ లేని లోకంలోకి,  ఈ వాచ్యం లోకి మళ్ళీ వచ్చిపడ్డాను.  "నా దారెంట నే పోతుంటే  నన్నెందుకు  ఆకర్షించాలి నువ్వు" అనే అభియోగాలు మోపని సాధారణ కాలంలోకి  మళ్ళీ వచ్చిపడ్డాను నేను.. 

కొన్నాళ్ళు నా పెదవులపై యే కూనిరాగాలు కూయవు. నా కళ్ళల్లో యే వెలుగుపూలు పూయవు. మళ్ళీ యేదో ఆకర్షణ తనలోకి నన్ను లాక్కునేదాక నేను వాచ్యంలో బ్రతుకుతుంటాను జీవించడం తెలియక.


15, ఆగస్టు 2013, గురువారం

రహస్య స్నేహితుడు

ప్రతి రోజు ... ఉదయాన్నే  ఓ  స్నేహితుడు నన్ను తన  చిరునవ్వుతో  పలకరిస్తాడు .   ఆ నవ్వు చూస్తే మురళీ మోహనుడు ఇంత మోహనంగా నవ్వి ఉంటాడా ? అని అనిపిస్తుంది. పెద్దగా నవ్వడం రాని నాకు...నవ్వడం నేర్పి వెళతాడు . ఎంత మంచివాడో కదా !

అలాగే సాయం సమయమప్పుడు వచ్చి గేటు  ముందు నిలబడి నేను కనబడే దాక వేచి ఉండి  మరీ నన్ను తన చిరునవ్వుతో పరామర్శించి వెళుతుంటాడు. దాదాపు అలా ఒక ఆరేడు నెలలుగా జరుగుతుంది

కనీసం ఆ స్నేహితుడిని నేను పలకరించను కూడా పలకరించను. తన పేరేమిటో,ఊరేమిటో కూడా తెలియదు. మా మధ్య ఏదో గత జన్మల బంధం ఉన్నట్టు నేను తనకి కనబడకపోతే అలాగే మా గేటు బయటే నిలబడి ఉంటాడు. కావాలని  నేను బయట కనబడకుండా అతనిని  పరీక్షించడానికి ఇంటిలోపలనే ఉండి కిటికీకి అమర్చిన పరదాల మధ్య నుండి చూస్తూ ఉంటాను . నేను కనబడేదాకా,  అతని చిరునవ్వు అంటువ్యాధిని  నాకు అంటించే దాకా అతను అక్కడినుండి కదలడని తెలిసాక . అయ్యో ! అతనిని అలా మా గేటు ముందు పడిగాపులు కాయించ కూడదు అని జాలి తలచి బయటకి వస్తాను. నన్ను చూడగానే మాములుగా నవ్వే నవ్వుకన్నా ఇంకా మోహనంగా నవ్వుతాడు, వెంటనే తుర్రు మంటాడు

ఉదయాన్నే అయితే నేను కనబడకపోతే ఏం చేస్తాడో  తెలుసా ? నేను వాకిట్లో పెట్టిన ముగ్గుని తదేకంగా చూస్తూ ఉంటాడు. నేను కనబడ్డాక  వెంటనే  వెళ్ళిపోతాడు

నాకైతే కొత్తలో చాలా చిత్రంగా అనిపించేది. రోజు ముగ్గు చూసి అది వేసిన నన్ను చూస్తాడు అనుకునే దాన్ని. అలా అని అతను  వాకిట్లో  ముగ్గులు వేయని మతానికి  చెందిన వాడిలా తోచలేదు. చెవికి పోగు కుట్టించుకుని హిందువుల  కుటుంబంలో పుట్టినతనిలా ఉన్నాడు. సరే జడ వేసుకోని నా రూపం వింతగా తోచేమో  అలా చూస్తున్నాడనుకునేదాన్ని. రోజులు గడుస్తున్న కొద్ది  ఇవేమీ కాదని నాకు అర్ధమై పోయింది.

ఈ రహస్య స్నేహితుడు ఏ జన్మలో నాకు స్నేహితుడబ్బా !? అనుకుంటూ గత జన్మ జ్ఞాపకాలలోకి వెళ్లి అతన్ని కనుక్కోవాలని అన్వేషణ మొదలెడతాను. ఊహు .. అది నీ వల్ల  కాదన్నట్లు అతని మనోహరమైన  ..ఓ .అల్లరి నవ్వు నన్ను తాకి వెళ్ళినట్లు ఉంటుంది. అతను  నాతో పలకపోవచ్చు కానీ  అతనిని ఛాయా చిత్రంలో బందిస్తుంటే మాత్రం వద్దని అనలేదు, అందుకే ఇలా బంధించి  అతనిని మీకు పరిచయం చేయాలని ఇలా వచ్చేసాను మీకు చూపాలని తెచ్చేశాను.

ఇదిగో .. ఇతడే ..నా గతజన్మల రహస్య స్నేహితుడు ...


నిన్న ఉదయం  వాకిట్లో ముగ్గు వేసుకుంటుంటే ఇలా దర్శనమిచ్చాడు. ఎంతటి గడుసువాడంటే  వెళ్ళేటప్పుడు అన్న రిక్షా తొక్కుతుంటే దర్జాగా కూర్చుని వెళతాడు. తిరిగి వచ్చేటప్పుడు అన్నని ఆ రిక్షా పై చెయ్యి కూడా వేయినివ్వడు. ఎంత కాన్పిడేన్సో ! 





ఈ రోజు ఇలా నన్ను పలకరించి నేను ఎంత పెద్దాడిని అయిపోయానో అని చెప్పీసి వెళ్ళిపోయాడు. నేను ఫోటో తీసుకుంటుంటే ... ఒకటే నవ్వుకుంటున్నాడు. 
చెప్తా ..చెప్తా .రేపటి  నుండి నేను దొంగాట మొదలెడతా ... అసలు కనబడను.  :) ఎందుకంటే ఈ ఫోటో చూస్తే ... నేను అప్రయత్నంగా చిరునవ్వులు చిందిస్తాను.

అనుబంధాల అల్లిక అంటే ఇదేనేమో ! జవం,జీవం ఉన్నప్పుడు అందరూ మనవాళ్ళేనని  నాకనిపిస్తూ ఉంటుంది.  ఎన్నాళ్ళొ  చెప్పలేను, కాని  ఇప్పుడు నా రోజును ఆహ్లాద భరితంగా చేసే ఈ గతజన్మల రహస్య స్నేహితుడికి .... 

సలాం -ఎ -ఇష్క్ మేరి జాన్ ... కన్నయ్యా .. !


4, ఆగస్టు 2013, ఆదివారం

సహృదయ స్త్రీ (అనుబంధాల అల్లిక మిగతా భాగం)

.... అలా  రెండు నిమిషాలు వేచి చూసి మళ్ళీ తలుపు కొట్టాలి అనుకునేలోపు తలుపులు తీస్తున్న శభ్ధం వినపడింది. కొంచెం వెనుకకి జరిగాను. తలుపు తీసిన ఆమె  ఆమేనా .... సందేహం . ఆమె ననుకుంటాను ..  అన్న నిర్ధారణ ల మధ్య .. సరయు గారు  ! అన్నాను . ..నా గొంతు వినగానే  "వనజ గారు కదా" ... అన్నారు ఆమె. అబ్బ ఎంత బాగా గుర్తుపట్టారు . అనుకుంటూ "అవునండీ ! అన్నాను .

చాలా సంతోషం .. చెప్పాపెట్టకుండా వచ్చేస్తాను అని ఊరిస్తుంటే .. అలాగే అంటారు కాని ఇంత దూరం వస్తారా?  అనుకున్నాను . అన్నట్లుగానే వచ్చేసారు.  అంటూ చేయి పట్టుకుని లోపలకి తీసుకు వెళ్ళారు. కూర్చోండి .. అని నన్ను హాల్లో కూర్చోబెట్టి  బెడ్ రూం లోకి వెళ్లి ... " ఆమె భర్త గారితొ.. ఏమండీ .. వనజ గారు వచ్చేసారండీ " అంటూ సంతోషంగా చెప్పి వచ్చారు. మళ్ళీ వచ్చి నా ప్రక్కన కూర్చుని  ప్రయాణం బాగా జరిగిందా ... ఇబ్బంది పడ్డారా ? అంటూ కుశల ప్రశ్నలు వేసి .. ముందు బ్రష్ చేసుకుని స్నానం  చేసి రండి అంటూ ..  స్నానశాల చూపించారు. నేను బయటకి వచ్చేటప్పటికి  ఇంట్లో ఉన్న అందరూ నా ముందు ఉన్నారు ఒకోకరిని పరిచయం చేసారు. ఆమె భర్త గారు ని పరిచయం చేసినప్పుడు .ఆయనకి నమస్కారం చెప్పి ..సర్ .. ఆరోగ్యం బావుందా.. అని అడిగాను." పర్లేదమ్మా ! ఏదో ఆ భగవంతుని దయ " అన్నారు.

భగవంతుని  దయ ఏమోకాని  అక్క చాలా శ్రద్ద తీసుకుంటారు అయినా .. ఆయనకంత  బావుండటం లేదండీ! ఆయన బాగా చూసుకోవాలనే తాపత్రయంతో అక్క ఆరోగ్యం పాడవుతుంది . అయినా సరే .. పసి పాపని చూసుకుంటున్నట్లు చూసుకుంటున్నాం  అని చెప్పారు సరయు గారి చెల్లెలు నర్మద.తర్వాత సరయు గారి తమ్ముడు ,మరదలు,వారి పిల్లలి అందరిని పరిచయం చేసారు .  చిక్కని చక్కని వాసనలు వెదజల్లే వేడి వేడి కాఫీని అందించి నాతొ మాట్లాడుతూనే రెండు మూడు నాస్టాలు   ఉగ్గాని,పెసరట్టు,ఉప్మా తయారు చేసారు.  ఈ సమయం లో కావేరి గారు కూడా ఉండి బావుండేది అన్నాను . కావేరి సరయు గారి చిన్న చెల్లెలు. అవును .. మిమ్మల్ని చూసి చాలా సంతోష  పడేది   నంద్యాల కొంచెం దూరమే అయినా ఇప్పటికిప్పుడు రమ్మని పోన్ చేసినా వచ్చేస్తుంది పాపకి పరీక్షలు జరుగుతున్నాయి కదా ..  అందుకని రాలేదేమో ! అని అన్నారు సరయు గారు 

అలా  అందరి మధ్యన కూర్చుని టిఫిన్ చేస్తూ బోలేడన్నీ రేడియో కబుర్లు చెప్పుకున్నాం . మేమందరం ముక్త కంఠం తో బహిర్పరచే పేరు .. ఒకే ఒక ప్రయోక్త పేరు ని ..  ఆనందంగా ఉదహరించుకుని కాసేపు ఆయన గురించి ముచ్చటించుకున్నాం.

మరికొంతసేపు అనేక పాటలు గురించి చెప్పుకుంటూ ఇట్టే  సమయాన్ని గడిపేసాము. మీ అందరిని చూడాలని నా మనసు వేగిరపడింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వచ్చేసాను.  నేను విన్నవాటినన్నింటిని  ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాను . మీ  ప్రేమైక కుటుంబం,  కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం,ఒకరిపట్ల ఒకరు చూపే శ్రద్ద, అభిమానం నాకు నమ్మశక్యం కావడం లేదు . ఇంకా ఇలాంటి కుటుంబాలు ఉన్నాయా అని ఆశ్చర్యం వేస్తుంది.
అన్నాను .

అదంతా ఏ ఒక్కరి గొప్పతనం కాదు వనజ గారు . అందరూ ఒకరికొకరు సహకరించుకుంటాం. ఒక తల్లి బిడ్డలం కదా ! మాలో మాకు బేధాభిప్రాయాలు ఉన్నా .. ఒక పని చేయాలనుకుంటే అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే ఆ పని చేయడం మొదలు పెడతాము అని చెప్పారు. రక్తం పంచుకు పుట్టిన మాకు  ఏకాభిప్రాయం రావడం గొప్ప కాదు . ఈ ఇంటికి అల్లుళ్ళు అయిన వాళ్ళు, కోడళ్ళు  అయిన వాళ్ళు కూడా మాలో కలసి పోయారు. ఏనాడు వారిది ఒక మాట  మాది ఒక మాట అంటూ వేరేగా  ఉండదు. ఒకవేళ అలా చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినా వెంటనే సర్దుకు పోతారు .. అన్నారు .

అదంతా .. వదిన గారి మంచితనం అండీ ! కోడలినయి  వచ్చి 30 ఏళ్ళు దాటినా చిన్నమెత్తు మాట అనరు. భోజనం టైం  కి  మేడ  దిగి రావడమే ! పిల్లలని చూసుకోవడం తప్ప నాకు ఏమి బరువు భాద్యత లేవు . మా వారికి సరయిన ఉద్యోగం లేకపోయినా అంతా పెద్దక్కే .. చూసుకుంటారు  అని చెప్పారు. పెద్దక్క అంటే సరయు గారు అన్నమాట.
అమ్మ నాన్నలు ఇద్దరూ అనారోగ్యంతో మంచాన పడినా " సరయ" అక్కే అన్నీ చూసుకునేదమ్మా .. అని  సరయు గారి తమ్ముడు చెప్పారు. ఆయన కాకుండా సరయు గారి ఇంకో అన్నయ్య ఉన్నారు. ఆయన ఉద్యోగ రీత్యా వేరే వూరిలో ఉంటారు. వారి పిల్లలు ఇద్దరూ కూడా .. సరయత్తా .. అని కలవరిస్తారమ్మా ! అన్న కూతురికి ఒకరికి, నా కూతురికి ఒకరికి పెళ్లి కూడా జరిపించేసాము. అన్నీ అక్క చేతి మీదే జరగాలి. మా కుటుంబం అంతటికి అక్కే అమ్మ. జగదాంబ .. అంటూ ఆయన భక్తిగా చెప్పారు.

"నారాయణా మరీ ఎక్కువ జేసి చెప్పేస్తా ఉండావ్ ! ఊరుకో .. " అని సరయు గారు సిగ్గుపడుతుంటే  చూస్తున్న నాకు భలే ముచ్చట గా ఉంది .

సరయు గారు స్నానాని కి వెళ్ళినప్పుడు ...  ఆమెకి వినబడకుండా నర్మద గారు ఆమె గురించి చెప్పుకొచ్చారు. నాకు పెళ్లి అయిందండీ ! ఉమ్మడి కుటుంబమే ! అతనికి  నేను నచ్చలేదని గొడవ చేసేవారు.  పెల్లైయిన రెండేళ్ళకి రకరకాల కారణాలు చెప్పి నన్ను గెంటేసారు . మా అమ్మ నా జీవితం చూసి బాధ పడేది. ఇంత అమాయకంగా కనబడే దీనిని మళ్ళీ పెళ్లి చేస్తే ..  వచ్చే ఆతను ఎలాంటివాడో ఇంకోసారి జీవితం ఎలా ఉంటుందో .. అని దిగులు పడేది. అప్పటికి సరయు అక్కకి పెళ్లయి  ఐదారేళ్ళు అయింది. బావ గారికి ఈ ఊరిలోనే ఉద్యోగం. పేరుకి వేరే ఇల్లు ఉన్నా కాని ఎప్పుడు ఇక్కడే ఉండేవారు. అక్కకి పిల్లలు కలగలేదు. అమ్మ నాన్న నా గురించి దిగులు పడటం చూసి .. అమ్మ నాన్న ని ఒప్పించి బావగారిని ఒప్పించి బావ గారితో నాకు రెండో పెళ్లి చేయించింది. అప్పటి నుండి అందరం ఈ ఇంట్లోనే ఉంటున్నాం. మా రాతలు బాగోలేదు .. నాకు పిల్లలు పుట్టలేదు బావగారికి మాత్రం అనారోగ్యం చేసింది రెండు కిడ్నీలు పాడైపోయాయని చెప్పారు. సరయక్కే  బావ గారికి కిడ్నీని దానం చేసింది. అవసరమైనప్పుడు రక్తం ఇస్తుంది .  చెల్లెలుని  సవతి  చేసుకుంది. ఎవరిని ఒక్క మాట అనదు. ఎవరైనా అన్నా పట్టించుకోదు. అందరూ కావాలనుకుంటుంది. ఆర్ధికంగా చితికి పొతే కుటుంబాన్ని ఆదుకుంది. నా తరువాతి 
చెల్లెలికి తనే  పెళ్లి చేసింది.  అందుకే నాన్న గారు ఈ ఇల్లు స్థలం అంతా అక్కకే వ్రాసి ఇచ్చారు. ఇపుడు ఎవరైనా ఆమె ఉండమంటే ఉండాలి లేకపోతే  బయటకి వెళ్లిపోవాలి .  అని చెప్పింది

నేను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను . సరయు గారు నాకు ఎంతో  ఉన్నతంగా కనబడ్డారు. ఎంతటి సహృదయత. ఎంత చెల్లెలు అయితే మాత్రం సవతిగా అంగీకరిస్తారా ?  పెళ్లి అయిపోయి ఒకరింటికి వెళ్ళిన ఆమెలా ఎవరైనా పుట్టింటిని ఆదుకుంటారా? తల్లిదండ్రులకి సేవ చేయగలరా !? అసలు ఆమె భర్త ఇవన్నీ ఎలా ఆమోదించారు ?

ఎవరి స్వార్ధం వాళ్ళు చూసుకునే టట్లు  ఉన్న ఈ రోజుల్లో   వీరందరి మధ్య ఈ బంధుత్వాలు, బంధాలు ఎంత అపురూపంగా పెనవేసుకు పోయి వున్నాయి   అని అబ్బురంగా అనిపించింది. ఆమె భర్త ఆమె మాట జవదాటకుండా ప్రతి విషయానికి అతని ఆమోదం తెలిపారు అంటే అతనిదెంత మంచి మనసు అనిపించింది. చాలా మందికి వారి భార్యభర్త ల బంధం  గురించి  అనేక పెడార్ధాలు తీసి ఉండవచ్చు. సరయు గారిది స్వార్ధం అని వ్యాఖ్యానించ వచ్చు కాని నాకు అక్కడ కుటుంబ సభ్యుల అందరి మధ్య  ఉన్న అవగాహనే కనబడింది. ఒకరి పట్ల మరొకరికి ఉండే ఈర్ష్యా ద్వేషాలు స్థానే అనుబంధాల అల్లికే కనబడింది. ఒకరినికరు గౌరవించుకోవడం కన్నా కూడా అర్ధం చేసుకుంటున్న తీరే ఎక్కువ కనబడింది. బహుభార్యతత్వం, సంతానలేమి,ఆర్ధిక అవసరాలు అనేవి బాహ్యంగా కనబడే విషయాలు కాని .. ఒక చూరు  క్రింద ఇంత మంది మనుషుల మధ్య పెనవేసుకున్న అనుబంధం అన్నదే  వారిని అలా కలిపి ఉంచింది. ఆ కుటుంబాన్ని ఏకతాటిపై ఉంచిన సరయు గారి గొప్పదనం ని ఆమె పట్ల నాకు కల్గిన భావనని నేను ఇక్కడ  వ్యక్తీకరించడానికి అక్షరాలూ సహకరించడం లేదు. అది మాటలకందని ఒ.గొప్ప  భావం. ఆమెని గురించి వేరొకరి నోట విని ఆమెని చూడాలన్న ఆసక్తితో నేను ఆ ఇంటికి చేరుకున్నాను. నేను విన్నదానికన్నా ఎక్కువ చూసాను, నా మనసుకి చాలా తృప్తి కల్గింది. ఆమెకి పాదాభివందనం చేసాను. వారి ఆత్మీయత, ఆదరాభిమానం మనుషుల పట్ల వారికి ఉన్న నమ్మకం చాలా చాలా బాగా అనిపించాయి

కారణాలేవి లేకుండానే   చీటికి మాటికి తగవు పడి విడిపోయే భార్యాభర్తలు,  ఆస్తులన్నీ చేజేక్కిన్చుకుని తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసిన బిడ్డలు, సోదరీ సోదరులని ఎలాంటి ఆపదలోను ఆదుకొని ధన పిశాచాలని, భర్తని అనుమానంగా కాల్చుకు తినే భార్యలని చూస్తూ ఉండే కాలంలో ఓ .. విభిన్నమైన వ్యక్తిని చూసాను. ఆమె ఒక్కరి గురించే ఆ ఇంటివారందరూ అలా ఉండటం సాధ్య పడిందేమో కూడా ! మళ్ళీ ఇంకొన్ని సార్లు కలసినప్పుడు  మిగిలిన కుటుంబ సభ్యులు, మేనకోడళ్ళు  అందరిని చూసాను . అందరూ ఆమెని మనఃస్పూర్తిగా ప్రేమించే వారే నని తెలిసింది .

నేను ఒంటరిగా వెళ్లి  వారిని అలా  కలసి వచ్చాను. తర్వాత కొద్దికాలానికే సరయు గారి భర్త కి అనేకసార్లు డయాలసిస్ చేయాల్సి రావడం మద్రాస్ విజయ హాస్పిటల్ కి త్రిప్పడం, అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్ కి ట్రీట్మెంట్ కి రావడం అన్నీ సరయు గారు ఒంటరిగానే చూసుకున్నారు.  బోలెడంత డబ్బు, విపరీతమైన  శ్రమ, అనారోగ్యాలు మధ్య ఆమె భర్తని బ్రతికించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ నిష్ప్రయోజనమే అయ్యాయి. ఆ సమయాన నేను వారింటికి వెళ్లి ఓదార్చి రావాల్సింది. కానీ వెళ్ళలేకపోయాను అప్పుడప్పుడు పోన్ లో మాట్లాడుతూనే ఉంటాను

రోడ్డు విస్తరణ లో భాగంగా వారు నివాసం ఉంటున్న ఇల్లు కూడా రోడ్డు కి వదలాల్సి వచ్చినా ఆమె చాలా హుందాగా ఆవిషయాన్ని స్వీకరించారు. ఎవరికీ ఏది ప్రాప్తమో  అంతే  ప్రాప్తం వనజ గారు .. ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఇంకో స్థలంలో ఇల్లు కట్టుకోవాలి అన్నారు. మేనకోడళ్ళు అందరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. వారందరూ  పిల్లా పాపలతో హాయిగా ఉన్నారు . వారికి పురుళ్ళు పుణ్యాలు అన్నీ ఆమె చేసారు . ఇప్పుడు ఉన్న కాస్త డబ్బుని ఇల్లు కట్టుకోవడానికి వెచ్చించి చేతిలో డబ్బు లేకుండా చేసుకోవద్దు. ఏదైనా అనారోగ్యం వస్తే బోలెడు డబ్బు కావాల్సి వస్తుంది. పిల్లలు మనవాళ్ళు అయినా వారికి వచ్చిన వాళ్ళు మనవాళ్ళు అవరేమో... ఆలోచించండి అని సలహా ఇచ్చాను . అంతే నంటారా ...   మీరు చెప్పిన  మాట  గురించి అంతా కలసి ఆలోచిస్తాం .అని ఆమె అన్నారంటే ..
ఆమె గురించి మన అభిప్రాయమే మార్చుకోవాలి తప్ప ఆమెలో ఏ  మార్పు ఉండదు అని నాకు అర్ధమయింది
 US  వెళ్లేముందు మా బాబుని కూడా తీసుకు వెళ్లాను ఆమె ఆశీర్వాదం కోసం.

కుటుంబం అంటే మనలో చాలా మందికి మనం మాత్రం ఉండే ఇల్లు అని అనుకుంటాం. ఇలా అన్నదమ్ములు,అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు కూడా అందరూ అరమరికలు లేకుండా కలసి ఉండే కుటుంబం సరయు గారి కుటుంబం. ఆ కుటుంబం మధ్య ఉన్న అనుబంధాల అల్లిక చాలా ప్రత్యేకం అనిపిస్తూ ఉంటుంది.

ఇలా అప్పుడ ప్పుడూ  నా మనసుకి నచ్చిన పనులు చేస్తూ ఉంటానండీ! ఇలా నేను కలవాల్సిన వారి లిస్టు చాలా ఉంది. కలిసిన వారి లిస్టు చాలా ఉంది . ఇలా . మీ  అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది.

పెళ్ళిలో ఏముంది ? కుటుంబం అంటే ఏమిటి ? తినడం, త్రాగడం ,పడుకోవడం ఇదేగా జీవితం అనుకుంటే మాత్రం పొరబాటు. మనకంటూ ..ఓ ..నలుగురు లేకపోయాక ఎన్ని ఉండి  ఏం  ప్రయోజనం !?
కష్టమైనా -సుఖమైనా పంచుకునే మనసు ఉండాలి, మనిషి ఉండాలి.

నా ఎరుకలో "సరయు " గారు .. ఓ  అసాధారణ వ్యక్తిత్వం అనేకంటే సహృదయ స్త్రీ !  అక్కా మీకు వందనం ...
ప్రేమతో ... అభిమానం తో  ఈ పోస్ట్ ...  వనజ


" కంటేనే అమ్మ అని అంటే ఎలా !" అనే పాట  ఆమె కోసం ...

3, ఆగస్టు 2013, శనివారం

అనుబంధాల అల్లిక

 నాకు ఏ  మాత్రం పరిచయం లేని ఒక కొత్త ప్రాంతం వైపు  హఠాత్తుగా బయలుదేరి వెళ్ళాలని  నేను ఎప్పుడు కలగనలేదు కలల్లో ఎంతెంత దూరాలో ప్రయాణిస్తాను కానీ ఇలా ఇలలో   ఇంత దూరం ఒంటరిగా ప్రయాణం చేయలేదు. చేసే దైర్యం పుష్కలంగా ఉన్నా ఒంటరి ప్రయాణం అంటే విముఖత.  సరే .. నేను వెళుతున్న ప్రయాణం  కేవలం నా ఆసక్తి మాత్రమె కాకుండా నాతొ పాటు నాకు పరిచయం ఉన్న అందరితో పంచుకోగల   చక్కని అనుభవాన్ని ఇస్తుందని,  మనుషుల పట్ల నమ్మకాన్ని పెంచుతుందనే  విషయం నాకు తెలియదు కాబట్టి.... 
ఈ ప్రయాణం నాకు అవసరమా ? అని  ప్రశ్నించుకుంటూనే  బస్ లో  సీట్ ని వెనక్కి దించుకుని అలా కళ్ళు మూసుకున్నాను. ప్రయాణం రాత్రి కావడం వల్లనేమో  బస్ లో ప్రయాణిస్తూ  వెనక్కి జారుకుంటున్న ప్రకృతి ని ఆస్వాదించే అవకాశం లేదు కాని బస్లో అమర్చిన టీవి లో పెద్ద సౌండ్ తో ఒక మాస్ చిత్రాన్ని ప్రదర్శిస్తూ నరకం తొలిమెట్టు పై ఉన్న బావన కల్గించారు మనకి ఇష్టం లేకుండానే యుద్దవాతావరణం లోకి మనని లాక్కువెళ్ళే  భయంకరమైన హింసాత్మక దృశ్యాలు చూడలేక చెవుల్లో వేళ్ళు  పెట్టుకుని బలవంతంగా  కళ్ళు మూసుకున్నాను.

అలా మూసుకున్న కళ్ళని 7 రోడ్స్ .. 7 రోడ్స్ దగ్గర దిగే వాళ్ళు రావాలండీ...  అని బస్ డ్రైవర్  కేకతో ఉలికిపడి తెరచి చూసాను . ఇంకా త్తెల్లవారలేదు ..టైమ్ చూస్తె నాలుగున్నారే ! .. ఈ చీకట్లో నేను వెళ్ళాల్సిన ప్రదేశం కి ఎలా వెళ్ళడం అనుకుంటూ లగేజ్ తీసుకుని బస్ దిగాను. వెంటనే ఆటో వాళ్ళు చుట్టుమిట్టారు శంభుమియా పేట వెళ్ళాలి వస్తారా !? అడిగాను.  ఆ ఏరియా అంతా తెలిసిన దానిలా అడగటమయితే అడిగాను కాని లోలోపల భయం తన్నుకు వస్తుంది. తెలియని ప్రదేశం. ఈ ఆటోవాడు ఎటు తీసుకువెళతాడో తెలియదు. కానీ ఆ భయం కనబడనీయకుండా ఆ ప్రాంతం చాలా చాలా పరిచయం ఉన్నదానిలా నిలబడ్డాను. శంభుమియా పేట ఎక్కడికమ్మా !? అడిగాడు. శనక్కాయల మిషన్ ఉంది కదా .అక్కడికి  అన్నాను సరే .రండమ్మా  అన్నాడు . ఎంత తీసుకుంటావు చెప్పలేదు అన్నాను ఆటో ఎక్కబోతూ. నలబై రూపాయలు అన్నాడతను. బేరం ఆడాలి లేకపోతె నాకు ఈ ప్రదేశం క్రొత్త అనుకుని కనిపెట్టేస్తాడు అనుకుని 30 రూపాయలు ఇస్తాను. లోపలి రావద్దు .రోడ్డు పైనే దిగేస్తాను అని చెప్పాను. సరే నన్నాడు . ఎక్కి కూర్చుని రోడ్డు మార్గాలని చూస్తూ గుర్తు పెట్టు కుంటూ అక్కడక్కద కనబడుతున్న జనసంచారంని పరిశీలిస్తూ మధ్య మధ్యలో ఆటో అతనివంక అనుమానం చూస్తూ ఒంటిమీద ఆభరణాలని కనబడకుండా జాగ్రత్తగా కప్పుకుంటూ ఉన్నాను . పది  నిమిషాల లోపే కనబడే ఆంధ్రజ్యోతి దగ్గరలో ఆటో ఆపించి దిగేసాను.

ఆ ఇంటి ముందు నిలబడి నేను గుర్తు ఉంచు కున్న  ఆనవాళ్ళు ప్రకారం చూసి అదే ఇల్లని నిర్ణయించుకున్నాను. ఇంత ప్రొద్దు ప్రొద్దుటే అపరిచిత వ్యక్తుల ముందు నిలబడటం బావుండదేమో ! ఈ బస్ ఇంత త్వరగా వచ్చి చావాలా?  ఆ డ్రైవర్ కాస్త నెమ్మదిగా బస్  నడపవచ్చు కదా ! తెల్లవారి పోయేది ... అప్పుడు నాకు బాగుండేది అని నా అనుకూలత కి డ్రైవర్ సమయపాలనని ఖూనీ చేద్దామని చూసాను. ఇంటి  ముందు నిలబడి వెళ్ళాలా  వద్దా ,,,  అనే  సందేహం ఏమిటీ? ... పిచ్చి కాని అనుకుంటూ ..  మూసి ఉన్న తలుపుల పై మునివేళ్ళతో  కొట్టాను  ....

ఈ రోజు కి ..ఇంతే ....

24, జూన్ 2013, సోమవారం

మరణించిన ప్రేమ

ది స్వోర్డ్ అఫ్ టిప్పుసుల్తాన్ , విజయరాజ్ , దివ్యభారతి ..

ఈ మూడు పేర్లు వినగానే నాకు చప్పున .. ఒక జ్ఞాపకం .. ఆ జ్ఞాపకం బాధావీచికం.

ఆ అమ్మాయి ఎలా ఉందో !? అనుకుంటాను . ఎందుకు ఆ అమ్మాయి అలా చేసింది ? ప్రాణ ప్రదంగా ప్రేమించిన భర్తని అంత  త్వరగా ఎలా మర్చిపోగల్గింది ? అని ప్రశ్నలు వేసుకుంటాను ఆడవాళ్ళు అంత  త్వరగా జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలని, జీవితానికి సంబందించిన మనిషిని అంత త్వరగా మర్చి పోతారా? అలా మర్చిపోవడం అంత సులభమా?  అనుకుంటూ మరీ...  నేను చాదస్తంగా ఆలోచిస్తున్నానేమో  ? అని  బలవంతంగా ఆ ఆలోచనల నుండి  బయట పడే ప్రయత్నం చేస్తాను .

ఈ రోజు దివ్య భారతిని (సినీ నటి ) ని ఒక వీడియో సాంగ్ లో చూస్తే చప్పున నాకు ఆ అమ్మాయి గుర్తుకు వచ్చింది అచ్చు దివ్యభారతిలా ఉంటుంది కాకపొతే చామానఛాయ రంగు  అంతే తేడా.

ఆ అమ్మాయి పేరు చాలా అందమైన పేరు సంజన ( పేరు మార్చాను ) తల్లి దండ్రులు ఇద్దరూ   ప్రభుత్వ ఉద్యోగులు .  ముగ్గురూ  ఆడపిల్లలే ! సంజన  చెల్లెలు నా చెల్లికి స్నేహితురాలు. అలా ఆ కుటుంబం తో నాకు పరిచయం ఉంది

సంజనకి చదువు మీద ఆసక్తి తక్కువ. అందుకనేమో .. ఆ పిల్లని ఒక పంక్షన్ లో చూసి పెళ్లి చేస్తారా అనగానే అడిగిన అబ్బాయి మంచి చెడులు చూసి వెంటనే పెళ్లి జరిపించేసారు. అతని పేరు విజయ్ రాజ్  . తండ్రి లేడు
ఒక్కడే సంతానం. మద్రాస్ లో సినిమాల షూటింగ్ల  కి కెమెరా మెన్ గా పని చేసేవాడు.అతనికి ఇచ్చి సంజన కి పెళ్లి జరిపించారు. పెళ్ళైన ఏడాదికి ఒక పాప పుట్టింది.విజయ రాజ్ కి సంజయ్ ఖాన్ నిర్మిస్తున్న " టిప్పుసుల్తాన్"  కి పనిచేయడానికి అవకాశం వచ్చింది .   ఆతను ఆ సంస్థ లో పని చేస్తూ ఉండగానే .  ఆ పాపకి సంవత్సరం వయసు ఉండగా  ఒక నెలరోజులు పాటు  ఖాళీ లేకుండా షూటింగ్ ఉండటం వల్ల సంజన ని చుట్టం చూపుగా పుట్టింటికి పంపి ఆతను షూటింగ్ కి వెళ్ళాడు స్పెషల్ ఎఫెక్ట్స్ తీస్తూ ఉండగా అగ్ని ప్రమాదం జరిగింది.  ఎంతో  మందిని రక్షించి అతను  ఆ అగ్ని ప్రమాదంలో చిక్కుకుని మరణించాడు.

ఆ అగ్ని ప్రమాదం వార్త వినగానే కుటుంబ సభ్యలు అందరూ అక్కడికి పరుగులు తీసారు రెండుమూడు రోజుల తర్వాత గుర్తుపట్టని స్థితిలొఉన్న అతని పార్ధివ శరీరాన్ని అప్పగించారు. మట్టి చేయడం,మిగతా కార్యక్రామాలు పూర్తీ చేసుకుని మరో రెండు రోజులకి మద్రాస్ పట్టణం నుండి  ఇల్లు ఖాళీ చేసుకుని బరువైన మనసులతో తిరిగి వచ్చేసారు. విజయ్ రాజ్ తల్లి దుఃఖ భారంతో కృంగి పోయారు కోడలు మనుమరాలుతో సహా కోడలి పుట్టింట్లో  ఉంది.కొన్నాళ్ళకు    ఆమె కోడలు మనుమరాలుతో కలిసి కోడలి పుట్టింట్లో వారితో కలసి  ఉండలేక బంధువుల ఇంట్లో ఉన్నారు. అగ్ని ప్రమాదంలో మరణించాడు కాబట్టి ఇన్స్యూరెన్స్ ద్వారా లభించే డబ్బు  విషయంలో తప్ప ఆమెకి కోడలికి  అంత అనుబంధం ఉన్నట్లు కనబడేది కాదు. 

నేను ఆ అమ్మాయిని పలకరించడానికని వెళ్లాను. సంజన  కన్నా ఆమె తల్లి తండ్రి చాలా దిగులుగా కనిపించారు
సంజన వాళ్ళ అమ్మ ఫామిలీ ఆల్బుం తీసి విజయ్ రాజ్ ఫొటోస్ ఆతను భార్య,కూతురు తో దిగిన ఫొటోస్ చూపిస్తూ అతనికి తల్లితో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఆమె బిడ్డపై ఎన్నో ఆశలతొ జీవించారు ఇప్పుడు అతని మరణాన్ని ఆమె  తట్టుకోవడం చాలా కష్టమని చెప్పారు

అలాగే ఆ ఇంట్లో మద్రాస్ నుండి ఇల్లు ఖాళీ చేసి వేసుకువచ్చిన వస్తు సామాగ్రి ప్రిజ్ద్ , బీరువా ,టీవి లాంటి వస్తువులపై  విజయరాజ్ భార్య పేరు తన పేరు కలిపి  స్టిక్కరింగ్ చేసుకుని ఉన్న గుర్తులు అతనికి భార్యపై ఉన్న ప్రేమని ప్రత్యేకంగా చెప్పాయి

సంజన మాత్రం చాలా మాములుగా కనిపించింది. విజయ్ రాజ్ ని పుట్టింటికి వచ్చే ముందు చూడటమే! మళ్ళీ భర్త  ముఖాన్ని కూడా ఆమె చూడలేకపోయింది అయ్యో ..పాపం అనిపించింది.

సంజనా ! మళ్ళీ నువ్వు చదువుకోవడం మొదలెట్టు అని చెప్పాను. నాకు ఆ అమ్మాయి పట్ల సానుభూతి కన్నా కూడా విజయ్ రాజ్ పట్ల అభిమానం ఎక్కువైనట్లు అనిపించింది అతనిని నేను అసలు చూడనే లేదు మాట్లాడనూ లేదు. అతని గురించి విన్న మాటలు మూలంగానే అతని మరణం పట్ల బాధ కల్గింది. సంజన ని చూస్తే జాలి కల్గింది అందమైన పిల్ల, పైగా చాలా చిన్న వయసు. మళ్ళీ తనకి ఒక పిల్ల.  ప్చ్.. ఏమిటో గాలిబుడగ ల్లాంటి జీవితాలు అనుకున్నాను.  విజయ్ రాజ్ మరణం తర్వాత  ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది కదా అని బాధ పడ్డాను

రెండు మూడు నెలల తర్వాత ఒకరి నోటెంట ఒక విషయం విని ఆశ్చర్యపోయాను.సంజన ఒక పోలీస్ కానిస్టేబుల్ తో సన్నిహితంగా మెలుగుతుంది అని

చ.. అలాంటివేవి ఉండవు లెండి, వాళ్ళ ఇంటి ప్రక్కనే అతను  ఉంటాడు ..ఏదో  మాట్లాడుకుంటూ ఉంటే తప్పేమిటి అని. మళ్ళీ తరువాత ఇంకొకరి నోటి వెంట అలాంటి మాటే విన్నాను స్వయంగా చూసాను కూడా. నేను మా కుటుంబ సభ్యులు సినిమాకి వెళితే సంజన ఆ కానిస్టేబుల్ తో కలసి సినిమాకి వచ్చింది. అతనితో ఆ అమ్మాయి చాలా క్లోజ్ గా మూవ్ అవడం చూసాను. నిజం చెప్పొద్దూ .. నేను ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను

ఇదేమిటీ .. ఈ పిల్ల భర్త చనిపోయి నిండా నాలుగు నెలలు కూడా కాలేదు అంతగా ప్రేమించే భర్తని మర్చిపోయి   అప్పుడే .పరాయి పురుషుడితో అంత  సన్నిహితంగా మెలుగుతుంది అని చిరాకు పడ్డాను.

అది అలా జరిగిపోయింది. తర్వాత ఆ అమ్మాయికి ఒక సంవత్సరం లోపే మళ్ళీ పెళ్లి జరిగిందని విన్నాను.  సంజనకి ఉన్న బిడ్డని ఆమె తల్లిదండ్రులు పెంచుతున్నారని విన్నాను. కొన్నాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి కూడా మా వూరు నుండి బదిలీ అయి వెళ్ళిపోయారు

కానీ నేను విజయ్ రాజ్ ని మర్చిపోలేదు. ది స్వోర్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్, దివ్యభారతి,విజయ్ రాజ్  అలా నా మనసులో ఒక జ్ఞాపకంగా మిగిలిపోయారు.

ఆ అమ్మాయి సంజన  గురించి ఇప్పటికీ అనుకుంటాను, మనుషుల మరణాన్ని  జీర్ణించుకోవడం అంత  సులభమా!? ఆ అమ్మాయికి చిన్న వయసు కావడం వలన అలా చేసిందా? లేక తోడూ కోసం అలా చేసిందా.. అన్నది నాకు అర్ధం కాలేదు.  మళ్ళీ వివాహం తప్పు కాకపోవచ్చు. మనుషుల్లో అంత  ప్రాక్టికల్  మైండ్ ఉండటం అవసరమేమో కాని నేను ఆ అమ్మాయి చేసిన పనిని  ఆమోదించలేకపొయాను. మరీ అంత తక్కువ కాలంలో అలా జరగడం వల్లనేమో నేను  ఆమోదించలేకపొయానని అనుకున్నాను.  బహుశా  నేను కొందరు మారినంత వేగవంతంగా  నా ఆలోచనలని, అభిప్రాయాలని మార్చుకోలేక పోవడం  వల్లనేమో !   సంజన స్థానం లో నేను లేను కాబట్టి నాకు అలా అనిపించింది   ఏమైనా స్త్రీల మనసు సముద్రం కన్నా లోతు  అందులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం అంటారు . కదా ! ఇదీ  అంతే  నేమో !

విజయ్ రాజ్ కూతురు ఇప్పటికి ఇరవై ఏళ్ళ అమ్మాయి అయి ఉంటుంది ఆ అమ్మాయి ఖచ్చితంగా తండ్రి ప్రేమతో పాటు తల్లి ప్రేమని కోల్పోయి ఉంటుందని   నేను అనుకుంటాను

కొన్ని ప్రేమలు మనవి కాకపోయినా మన జ్ఞాపకాలలో  గాఢంగా అలా నిలిచి ఉంటాయి . కొన్ని ప్రేమలు .వారి   మనిషితోపాటు వెంటనే  మరణిస్తాయి.

ఒకటి మాత్రం అనుకుంటాను .. ప్రియరాగాలు చిత్రంలో జగపతి బాబుకి సంబంధించి ఒక మాట , భార్య సమాది పై వ్రాసి ఉంటుంది .. " నా ఆత్మ, నీ శరీరం ఇక్కడ సమాధి చేయబడ్డాయి " అని

ఒకవేళ సంజన యాక్సిడెంటల్  గా చనిపోయి ఉంటే ... విజయ్ రాజ్ ఖచ్చితంగా అలాగే బాధపడుతూ ఉండేవాడేమో  అని నేననుకుంటూ ఉంటాను.  అతని గురించి నేను విన్న కొద్ది మాటల్లోనే నాకు ఏర్పడ్డ అభిప్రాయం అది. అది కేవలం నా ఊహ కావచ్చు.

భార్య చనిపోతే నెల లోపే మళ్ళీ వివాహం చేసుకునవారు ఉన్నప్పుడు సంజన చేసింది తప్పు కాదు. ఆ అమ్మాయి చేసుకున్న వివాహాన్ని  నేను వ్యతిరేకించలేదు కానీ ఓ తల్లికి బిడ్డ , ఓ బిడ్డకి తండ్రి రావడం చాలా కష్టం కదా ! ఆలోచిస్తూ ఉంటాను ఇప్పటికి కూడా.

వివాహం అంటే  అనుబంధాల అల్లిక మాత్రమే కాదు అవసరాల కోసం కూడానేమో కదా !





( నా ఆలోచనలని ఈ పొస్ట్ లో ఇలా వ్రాసినందుకు  "సంజనా .. ఐ యాం వెరీ సారీ )