మిత్రులారా! సరి కొత్త కథ “పర్సనల్ స్పేస్” చదవండీ.. ఈ మధ్య రచయిత గా చచ్చేంత చావు వచ్చి పడుతుంది కథ రాస్తే ఇది కథ కాని నిజమైన కథా? అంటారు. పోనీ కథ కాని కథ రాస్తే.. కథ బావుంది అంటారు. అందుకే నిజం లాంటి అబద్ధంగా అబద్ధం లాంటి నిజమైన కథ రాసాను. ఇటీవల కాలంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి కథ వినే వుంటారు. ఈ కథ రాసానని నీకు ఆడపిల్లలు లేరా? ఇలాంటి కథ రాసావ్ అని తిట్టకండి. మారుతున్న కాలంలో మార్పు ని సహజంగా చూపించే కథ. కథ చదవండి. మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు 🙏
***************
పర్సనల్ స్పేస్ - వనజ తాతినేని
“ఇదిగో ! ముందే చెబుతున్నా! ఈ కండీషన్ మీద అయితేనే.. నీతో పెళ్లికి ఒప్పుకుంటా” అంది సిరి.
“ఓకే యార్, నీ స్వేచ్ఛ కు నేనెప్పుడూ అడ్డురాను. నీ సేవింగ్స్ నీ షాపింగ్ అంతా నీ ఇష్టం” అన్నాడు సంపత్.
అతని ఆలోచనలు నేలమీద వున్నాయి. “ఎక్కడో వెనుకబడిన జిల్లాలో చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన అమ్మాయి. ఇంచుమించు నాతో సమానంగా చదివి నాతో సమానంగా సంపాదించే ఆడది, ఆ మాత్రం చిలకపలుకులు వల్లించడం మాములే! ఇంతకు ముందు ఎంతమంది అమ్మాయిల మాటలు వినివుండలేదు. మహా అయితే శాలరీ అంతా పేరెంట్స్ కి చీరలకు నగలకు ఖర్చు చేస్తుందేమో! కొన్నాళ్ళు చూసి చూడనట్లు ఊరుకుంటే సరి”
సంపత్ ఆలోచిస్తూ వుండగానే సిరి ఏదో చెప్పింది. అతను “అలాగే” అన్నాడు మళ్ళీ.
ఆమె “సరే మరి. పేరెంట్స్ కి మన నిర్ణయం చెప్పేద్దాం” అంది.
“ఓకే డాళింగ్” అంటూ సంపత్ ఆమె నడుము చుట్టూ చేయి వేసాడు మొహమాటంగా. సిరి ఉరప్ శిరీష కాదనుకుండా వీలైనంత ఎక్కువ సిగ్గు నటించింది.
ఇదంతా కిటికీ పరదా వెనుక నుంచి ఊపిరి బిగపట్టి చూస్తున్న తల్లి సరళ గుండెలపై మండుతున్న నిప్పుల కుంపటిని తీసి పక్కన పెట్టినట్లు తేలికపడి ఊపిరి వదిలింది.
సంపత్ తల్లిదండ్రులు ముఫ్పై ఆరేళ్ళ కొడుక్కి దరిదాపుగా అదే వయసు వున్న అమ్మాయి తోనైనా పెళ్ళి జరుగుతుందని సంతోషించారు. ఆ సంతోషంలో చేతికి ఎముక లేనట్టు ఐదు రోజులు పెళ్ళిని రంగ రంగ వైభవంగా జరిపించారు. అసలు వో కావో తెలియని వజ్రాల నగలు, బెనారస్ పైథానీ చీరలు, మహారాజా షేర్వాణి ల ప్రదర్శనలు భారీ పూల అలంకరణలు, జానపద పాట కచేరీలు, వెస్ట్రన్ కల్చర్ హాట్ డ్రింక్ ఆతిథ్యం, క్రేన్ షూటింగ్ లు ఖరీదైన రిటర్న్ గిఫ్ట్ లు అతిథులను బాగా అలరించాయి. చూడటానికి కళ్ళు నొప్పి వినడానికి చెవుల నొప్పి తినడానికి పొట్ట నొప్పితో బాధ పడుతూ ఈర్ష్య పడ్డారు బంధుమిత్రులు. సంపత్ మనసులో విసుగుని దాచుకుని పురోహితులు,కెమెరా మెన్ లు చెప్పినట్లు మర్యాదగా నడుచుకున్నాడు. సిరి క్రీగంట చూపులతో సంపత్ ని చూస్తూ పదహారేళ్ళ కన్నెపిల్లలా సిగ్గుపడుతూ తాళి కట్టించుకుని భర్త పాదాలకు భక్తితో నమస్కరించి చేతులు కళ్ళకు అద్దుకుంది.
ఇవ్వన్నీ చూస్తున్న నేను ఆశ్చర్యాన్ని పదే పదే అరువు తెచ్చుకోవలసి వచ్చింది.
హైటెక్ సిటీలో సంపత్ కొనుక్కున్న విల్లా హౌవుస్ లో గృహప్రవేశం కూడా జరిగింది. నవదంపతులు హనీమూన్ కి శ్రీలంక వెళ్ళారు.
“ సిరి మంచి కుటుంబంలో అడుగుపెట్టింది. ఇకనైనా పద్ధతిగా ఉండాలని మనసులో పదే పదే కోరుకుంటున్నాను” అన్నాడు నా మిత్రుడు రాజారావు. అవునన్నట్లు తలపంకించాను.
ఒకోసారి భయపడినదే జరుగుతూ ఉంటుంది. పెళ్లైన రెండు నెలల తర్వాత..
“శ్రీధర్ అంకుల్ మీతో మాట్లాడాలి. సాయంత్రం వస్తాను. క్లుప్తంగా చెప్పి కాల్ కట్ చేసాడు సంపత్.
పెళ్ళికి ముందు ఏ వివరాలు అడగని సందేహాలు వెలిబుచ్చని అతను… ప్రత్యేకంగా నాతో ఏం మాట్లాడాలి? పైగా గుడివాడ నుండి ఒంగోలు వరకూ వస్తున్నాడంటే..మనసులో ఏదో జంకు గానే వుంది. సాయంత్రం ఆఫీసుకు వచ్చాడు. అసలే ముహూర్తాల కాలం. నాతో మాట్లాడుతున్న వారిని సాగనంపి సంపత్ తో మాట్లాడటానికి గంట సమయం పట్టింది. ఓపికగా కూర్చున్నాడు.
ఏమిటి బాబూ! ఎలా జరిగింది హనీమూన్ ట్రిప్. సిరి బాగుందా అడిగాను. ఫోన్ తీసి డ్రైవ్ ఓపెన్ చేసి చూపించాడు. అందులో సిరి మరొకతను సన్నిహితంగా వున్న ఫోటోలు. మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మే సంపత్. ఆ ఫోటోలో వున్న అబ్బాయి కూడా మాకు తెలిసిన అబ్బాయే, సిరి అతను చిన్ననాటి స్నేహితులు. సర్ధి చెప్పబోయి ఆగిపోయాను.. ఎదురుగా కనబడుతున్న ఫోటో చూసి.
“మీరేదో దాచి పెట్టి మీ స్నేహితుడి కూతురితో నాకు సంబంధం కుదిర్చారని తప్పు పట్టడానికి రాలేదు. ఈ విషయం ఇంతటితో ముగిసిపోతే మంచిది. హనీమూన్ ట్రిప్ లో వున్నప్పుడు సిరి స్నానం చేస్తున్నప్పుడు యదాలాపంగా ఆమె ఫోన్ చూస్తే ఈ ఫోటోలు వున్నాయి. ఎవరతను అని అడిగాను. బాయ్ ఫ్రెండ్ అని బెంగుళూరు లో వున్నప్పుడు కలిసే వున్నామని చెప్పింది. అతన్ని లవ్ చేసానని అతను వేరే డబ్బున్న అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడని అతనిపై కోపంతో నన్ను పెళ్ళి చేసుకున్నానని చెబుతుంది. గతం గతః. ఇక అవన్నీ ఒదిలేసేయ్, నేను నిన్నేమి అడగను అని కూడా చెప్పాను. నేను ఆఫీస్ కి వెళ్ళినప్పుడు అతను వచ్చి మా ఇంట్లో వుంటున్నాడు.అది భరించలేకపోతున్నాను. నా తండ్రికి ఈ మధ్యనే ఓపెన్ సర్జరీ అయింది.నేను వారితో ఈ దారుణమైన విషయాన్ని పంచుకోలేను. ఈ మోసాన్ని నమ్మకద్రోహాన్ని గరళంలా మింగి బతకలేను. మీరూ అంకుల్ వచ్చి సిరి ని మందలించి నాలుగు మంచి మాటలు చెబుతారని చెబుతున్నాను” అన్నాడు.
నలభై ఏళ్ళ నుండి మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న నేను ఏనాడు ఇంతగా సిగ్గుపడి తలదించుకోలేదు. రాత్రికి రాత్రి హైటెక్ సిటీకి చేరుకున్నాం రాజారావు నేనూ! తప్ప తాగి బాయ్ ఫ్రెండ్ తో ఇంటికి చేరుకున్న కూతురిని చూసి నిశ్చేష్టుడయ్యాడు ఆ తండ్రి. తన కళ్ళముందే ఇద్దరూ బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపులు మూసుకుంటే సిగ్గుపడి అరచేతుల్లో ముఖం దాచుకున్నాడు.
రెండు రోజులు వుండి మందలించి హిత వచనాలు చెప్పి భర్త ఎంత మంచివాడో విడమర్చి చెప్పే ప్రయత్నం చేసాం.
నేను నా పర్సనల్ స్పేస్ తీసుకుంటానని అతనికి పెళ్ళికి ముందే చెప్పాను. అతను ఒప్పుకున్నాకే పెళ్ళికి అంగీకరించానని సిరి మూర్ఖంగా వాదించడం మొదలెట్టింది. రాజారావు మండిపడి కూతురిపై చేయి చేసుకున్నాడు. మరింత మొండిగా తండ్రి మరింత సిగ్గుపడేలా సమాధానం చెప్పింది. ఏమి చేయలేని నిస్సహాయతతో తిరిగి వెనక్కి వచ్చాం.
పది రోజులకు సంపత్ సిరిని తీసుకుని వచ్చి పుట్టింట్లో దించి వెళ్లాడని ఇక తన ఇంటికి రానవసరం లేదని తెగేసి చెప్పి వెళ్ళాడని ఫోన్ చేసి చెప్పాడు రాజారావు. అత్తగారు సరళ సర్ధి చెప్పబోయింది అంట.
“ఆంటీ! మీరు కూడా మా అమ్మ లాంటి వారే! మీ అమ్మాయిని ఇంత విచ్చలవిడిగా పెంచారేమిటి అని అడగను నేను. నువ్వేమైనా వర్జిన్ వా ఏమిటి? నీ ఖాతాలు ఎన్ని వున్నాయో ఏమో! కావాలంటే నువ్వూ.. నీ గర్ల్ ఫ్రెండ్ తో తిరుగు, నేను అభ్యంతరం చెప్పను’’ అంటుంది. ఇంత ఫాస్ట్ కల్చర్ లో నేను పుట్టలేదు పెరగలేదు.మీ అమ్మాయిని భరించడం నావల్ల కాదు.” చేతులు జోడించి వెళ్లిపోయాడు అని కూడా చెప్పాడు.
రాజారావు పై కోపం ముంచుకొచ్చింది. సిరి కి ఇరవై ఏళ్ళు దాటినప్పుడు నుండి చెబుతానే వచ్చాడు. మంచి సంబంధం చూస్తాను, పెళ్ళి చేయమని. అదింకా చిన్న పిల్ల అప్పుడే పెళ్లేమిటి అన్నారు భార్యాభర్తలిద్దరూ నిర్లక్ష్యంగా.
ముందు చదువులు తర్వాత ఉద్యోగం ఆ తర్వాత బాగా సెటిల్ అవ్వడం. కారు ఇల్లు నగలు సమకూర్చుకునే వరకూ వయసు మడి కట్టుకుని కూర్చుంటుందా? గోడలు దూకి అల్లరయ్యే పని లేకుండా ఆడ మగ కలిసి రూమ్ షేర్ చేసుకోవడం అన్నంత తేలికగా సహజీవనాలు గడుపుతున్న కాలం ఇది.ముంబాయి లో చదివి బెంగళూరు లో ఉద్యోగం చేసిన పిల్ల. థర్టీస్ మిడిల్ లో పెళ్ళి చేసుకుంటూ వర్జినిటీ గురించి మాట్లాడటం అంత హాస్యాస్పదం ఇంకోటి లేదని తెలిసినా కూడా..
స్నేహితుడి కూతురు సిరి గురించి చూచాయగా తెలిసినా తను ఎప్పుడూ పాడే పాటే పాడేడు. అమ్మాయి తండ్రి పెద్ద ధనవంతుడు కాకపోయినా అమ్మాయి బంగారు బొమ్మ, గుణంలో కల్తీ లేని బంగారం అండీ, అంటూ అందరికీ చెప్పినట్టే కల్లిబొల్లి మాటలు చెప్పాడు. అబ్బాయి కుటుంబం మంచి సంప్రదాయమైన కుటుంబం అండీ, ధనవంతులు, అబ్బాయి గుణవంతుడు అని చెబుతుంటాడు సాధారణంగా. ఈ అబ్బాయి సంపత్ గురించి పొల్లు తేడా లేకుండా అరుదుగా కనబడే నిజమే చెప్పాను. ఏమిటో ఈ పిల్ల జీవితాన్ని తన చేతులతో తనే కాల్చుకుంటుంది అని బాధపడటం తప్ప ఏం చేయగలను?
**********
అంతా భ్రాంతి యేనా..
అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా..
సిరి గొంతు చించుకొని పాడుతుంది. తల్లి గబగబా కిటికీ తలుపులు మూసేసి టివి సౌండ్ పెంచింది. తండ్రి ఆందోళన గా బెడ్ రూమ్ తలుపు ముందు తచ్చాడుతున్నాడు. కూర్చున్న నేను లేచి వెళ్ళి రాజారావు పక్కన నిలబడ్డాను. పూర్తిగా మూసుకోని తలుపు సందులో నుంచి లోపలికి చూసా. పొట్టి నిక్కరు ప్రీ సైజ్ టీ షర్ట్ విరబోసుకున్న జుట్టు అసహ్యంగా కనిపిస్తున్న పెట్టుడుగోళ్ళు. ఓపెనర్ లేకుండానే రమ్ బాటిల్ మూతను తెరిచి గుటకలు వేస్తూ రెండో చేతిలో వున్న మొబైల్ చూస్తూ పాడుతుంది. ఈ సారి ఆంగ్ల కవిత అందుకుంది.
Do I contradict my self? Very well then I contradict myself, I am large, I contain multitudes.
చదివింది IIT లో CS యే కానీ పాత పాటలు పాత కవితలు కొట్టిన పిండి. ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేసిన రాజారావు కూతురికి ఆంగ్ల సాహిత్యాన్ని ఉగ్గు గిన్నెలో రంగరించి తాగించాడు అన్నప్రాసనలో తినిపించాడు. సరళ క్రోధంతో చూస్తూ చెవుల్లో దూది పెట్టుకుని సోఫాలో కూర్చుంది. రాజారావు తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు.
“ తల్లీ! ఇంత డార్క్ ఆల్కహాలిక్ గా తయారవుతావని నేను కలలో కూడా అనుకోలేదు. తల్లిదండ్రుల ముందు అత్తమామలు ముందు ఇంత సంస్కారహీనంగా మెలుగుతున్నావ్, మమ్మల్ని తల దించుకునేటట్టు చేస్తున్నావు. నీ అత్తమామలు నీతో మాట్లాడాలని నాలుగు గంటలుగా ఓపికగా ఎదురుచూస్తూ కూర్చున్నారు. వారితో మాట్లాడమ్మా, ఇకపై అలాంటివి జరగవు అని చెప్పమ్మా!” బతిమాలాడు.
విసురుగా బెడ్ పై నుండి లేచి తండ్రిని చేయి పట్టుకుని లాక్కొని హాలులోకి తీసుకొచ్చి గట్టిగా మాట్లాడింది సిరి.
“ వాళ్ళు మీరు కలిసి నాన్సెన్స్ చేయకండి నాన్నా! నేను పెళ్ళికి ముందే చెప్పాను సంపత్ తో. నా స్పేస్ నాకు వుండాలి అని. అతను అప్పుడు ఒప్పుకుని ఇప్పుడు పత్తిత్తు కబుర్లు చెప్పడం నాకు నచ్చలేదు. నాకు నచ్చినట్లే నేనుంటాను.కావాలంటే అతనికి నచ్చినట్లు అతన్ని వుండమనండి. ఇవన్నీ మీకు నచ్చకపోతే కళ్ళు మూసుకోండి. లేదా ఆ పల్లెటూరుకు వెళ్ళి కృష్ణ రామ అంటూ కాలక్షేపం చెయ్యండి. ఇదే నా ఫైనల్ డెసిషన్” తలుపులు ఉలిక్కి పడేంత గట్టిగా దడాల్న మూసుకున్నాయి.
కోడలి ప్రవర్తన మాటలు కళ్ళారా చూసిన నరేంద్ర సుజన తొలుత ఆశ్చర్యపోయారు
పిమ్మట భయభ్రాంతులయ్యారు. మరోమాట లేకుండా నమస్కారం పెట్టి మరీ వెళ్లిపోయారు. వాళ్ళ వెనుక నేను.
కారు ఒంగోలు బాట పట్టింది.
“ఇంత చూసాక నా కొడుకుతో దానితో కాపురం చెయ్యమని చెప్పను. నేను పెళ్ళికి ఖర్చు పెట్టింది నా వెంట్రుకతో సమానం” అని తిట్టడంలో సంస్కారం చూపించాడు నరేంద్ర. సుజన ఆవేశం ఆక్రోశం ఏడుపు సమపాళ్లలో చూపించింది.
“పదిహేను లక్షలు కెమెరా వాడికే ఇచ్చాం. దానికి పెట్టిన నగలు చీరలు తలుచుకుంటే గుండె బద్దలవుతుంది. సన్నాసి ము.. నా కొడుకు జీవితంతో ఆడుకుంది. వాడికి మళ్ళీ పెళ్ళి అవుతుందా? పెళ్ళి లో ఎంత అమాయకంగా సిగ్గుల మొగ్గలా నటించింది. అదంతా నిజమే అనుకున్నా. ఇలాంటి దానికి కోసి కారం పెట్టాలి”
సుజన మాటల్ని తప్పు పట్టాలనిపించడం లేదు. ఆలోచిస్తున్నాను.
“ఏమైంది ఈ అమ్మాయిలకు!? కాదు కాదు ఆధునిక మహిళ లకు. చదువు ఉద్యోగం
సహజీవనం. తాగడం చిందులు వేయడం. మళ్ళీ ఏమి ఎరుగని నంగనాచిలా పెళ్ళి పీటలు ఎక్కడం. మూడుముళ్ళ బంధానికి విలువ లేదు. కలిసి బతికేవాడి మాటకు విలువలేదు. తనకు నచ్చినట్లు జీవించాలని అనుకున్నప్పుడు పెళ్ళి ఎందుకు? సరదా తీర్చుకోవడానికా? మగవాడిని బకరా చేయడానికా? ఎందుకు! ఎందుకు!! ఎందుకు!?
ఇది జరిగిన వారంలోపే సిరి కి పెట్టిన నగ నట్రా ఏమీ వాపసు ఇవ్వకుండానే మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో విడాకులు తీసుకున్నారు.
విడాకుల పత్రాలపై సంతకం పెట్టాక సంపత్ సిరి తో వ్యంగ్యంగా ఒక మాట అన్నాడు. “పెళ్ళి తర్వాత కూడా బాయ్ ఫ్రెండ్ ని మర్చిపోలేన్నట్లు నన్ను కూడా మర్చిపోలేకపోతే అప్పుడప్పుడూ పిలుస్తూ వుండు. మళ్ళీ పెళ్ళైన తర్వాత కూడా వస్తూనే వుంటాను.
గిఫ్ట్ లు కూడా వుంటాయి అదనంగా”
సిరి కోపంగా “ఫక్” అంటూ నాలుగు వేళ్ళు మడిచి మధ్య వేలిని చూపించింది.
ఇదంతా వింటూ చూస్తున్న నరేంద్ర “షటప్” అని కొడుకు చెంప చెళ్ళు మనిపించాడు. “నువ్వు కూడా దిగజారి పోయావు” అన్నాడు ఊగిపోతూ.
ఇద్దరూ యధావిధిగా ఒకరిపై ఒకరు బురద చిమ్ముకున్నారు. సంపత్ నపుంసకుడు అని, గే అని సిరి ప్రచారం చేస్తోంది కాబట్టి సంపత్ కూడా శ్రీలంక లో ఆమె ఫోన్ నుండి తన ఫోన్ కి పంపించుకున్న ఫైల్ ఓపెన్ చేసాడు. సిరి తన బాయ్ ఫ్రెండ్ తో సన్నిహితంగా వున్నప్పుడు తీసుకున్న ఫొటోలు వీడియోలు తమకు వారికి వున్న కామన్ ఫ్రెండ్స్ అందరికీ ప్రసాదంలా పంచిపెట్టాడు.
ఐదు రోజుల పాటు ఆడంబరంగా జరిగిన పెళ్ళి గురించి వారం రోజుల పాటు ఎలా చెప్పుకున్నారో అలాగే ఈ కాలపు ఆడపిల్లల స్వేచ్ఛ గురించి హద్దు అదుపు లేకుండా తిరిగే విచ్చలవిడి జీవితం గురించి కూడా అలాగే చెప్పుకున్నారు.
పక్కింట్లో దొంగలు పడితే ఎలా జాగ్రత్త పడతామో అలాగే చుట్టుపక్కల వాళ్ళు తమ ఇంటి ఆడపిల్లలపై ఓ కన్నువేసి వుంచుతున్నారు. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకునే క్రమంలో నేను పెళ్ళిళ్ళ పేరయ్య అవతారం చాలించాను.
వంద అబద్ధాలు ఆడి ఒక పెళ్ళి చేయమని అన్నారు పాత కాలం వారు. ఒక నిజాన్ని దాచి కాపురం నిలబెట్టలేం అన్నది ఈ నాటి నానుడి.
సంపత్ బయోడేటా ని వేరొక మ్యాట్రీమోని లో రిజిష్టర్ చేయించాను. వారానికల్లా సంపత్ కి పెళ్ళి నిశ్చయం అయింది. వధువు ఎవరో కాదు. నిండా పాతికేళ్ళు కూడా లేని నా కూతురు మాధవి. ఆశ్చర్యంగా నీకూ అతనికి పన్నెండేళ్ళు తేడా వుందమ్మా అని అభ్యంతరం చెప్పాను.
“పర్వాలేదు నాన్నా! మనఃస్పూర్తిగా అతను నాకు నచ్చాడు. ఆస్తులు ఉద్యోగం చూసి కాదు. సహనం, జీవితాన్ని అతను అర్ధం చేసుకునే తీరుని బట్టి”అంది.
సంపత్ కొన్ని నెలలు టైమ్ తీసుకున్నాడు. తర్వాత సరే అన్నాడు. సింపుల్ గా తిరుమలలో పెళ్ళి జరిగింది. నా కూతురిని ఇచ్చి చేయడానికే సిరిని సంపత్ ని కావాలని విడదీసానని లోకులు కాకులై కూసారు. రాజారావు సరళ నా ఇంటికి వచ్చి అమ్మాయిని ఆశీర్వదించి వెళ్ళారు. అది చాలు నాకు.
పదిరోజుల తర్వాత నా కూతురు మాధవి ఫోన్ చేసింది. ఆయన నా పర్సనల్ స్పేస్ నాకిచ్చారు నాన్నా! నేను దాన్ని ఎప్పటికీ దుర్వినియోగం చేయను. ముందు పిల్లల్ని కంటాను. తర్వాత వాళ్లను మీకు ఇచ్చి చదువుకుంటాను అంది. హాయిగా నవ్వాను నేను. కథ కంచికి వెళ్ళడానికి స్పేస్ లోకి ఎగిరింది.
************
(పిల్లల భవిష్యత్తు పట్ల చీకూ చింత లేకుండా హాయిగా నవ్వుకునే అవకాశం
తల్లిదండ్రులకు ఇవ్వండి పిల్లలూ! ఆ స్పేస్ ఇచ్చిన పిల్లలకు అంకితం.. ఈ కథ)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి