ఆవరణ - వనజ తాతినేని
నువ్వు కేవలం రెండు కాళ్ళ వస్తువువి
అందులో తొణికిసలాడే జీవాన్ని నింపింది నా ప్రేమ
నువ్వు కేవలం ప్రేమించానన్నావు
నా అస్తిత్వం మరిచిపోయి నీ ప్రేమగా మారిపోయాను
వెగటుగొట్టి మరో ప్రేమ కోరి పాక్కుంటూ వెళ్ళిపోయావు
శ్రమ పడకుండా వచ్చే స్వేచ్ఛ ఎగరడానికి పనికి రాదు
కావాలంటే..
కూకూన్ లో వుండే సీతాకోకచిలుకను అడిగి తెలుసుకో.
ప్రేమంటే..
ఖాళీ ఇవ్వకుండా ఆక్రమించడం కాదు
వెలుగులా మబ్బులా వెన్నెలలా పచ్చని చెట్టులా
అమ్మ చీర చెంగులా నాన్న వాత్సల్యంలా ఆవరించడం
నేను పొందింది ఓటమి కానే కాదు
నీ నుండి విముక్తి, దోపిడి నుండి విముక్తి
ద్రోహం నుండి విముక్తి.
కొన్ని శబ్దాలు యుద్ధాలు స్పర్శలు సువాసనలు
ప్రేమలు చేదులు జ్ఞాపకాలేవి వదిలి మనలేను నేను.
నువ్వు నాలో బతికే వున్నావు శాశ్వతంగా
కానీ ఒక అందమైన దుఃఖంలా
విరక్తి లేని విషాద గీతికలా.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి