13, నవంబర్ 2022, ఆదివారం

కుబుసం


పశువుల కొట్టానికి దూరంగా వున్న గడ్డి వాము దగ్గరకు వచ్చాడు సిద్దప్ప.  పరధ్యానంగా ఆలోచిస్తూ గడ్డిని దూయడం మొదలుపెట్టాడు. ఎంత బలంగా దూసినా పిడికెడు గడ్డి పరకలు కూడా బయటకు రాకపోవడం చూసి గడ్డిమోపు కట్టును వెదకడం మొదలెట్టాడు. కాసేపటి తర్వాత అతని ప్రయత్నం ఫలించింది. ఒక కాలిని వాముకు తన్ని పెట్టి రెండో కాలితో కాలికింద నేలను తొక్కి పట్టి బలంగా గడ్డిమోపు కట్టును పట్టుకుని  ముందుకు లాగాడు. కట్టు తెగి వెల్లకిలా వెనక్కి పడ్డాడు. నడుము విరిగినట్టైంది. చేతిలో గడ్డి పరకలతో పాటు  సగం తెగిన తెల్లని పాము    కుబుసం. భయంతో విసిరికొట్టాడు. చటుక్కున లేచి నిలబడి వెనక్కి మళ్ళాడు. కుబుసం విడిచిన పాము గడ్డిలో ఎక్కడో చోట దాగి వుంటుందని అతనికి తెలుసు. 

ఇంట్లోకి వెళ్ళదల్చుకోలేదు. భార్య రామేశ్వరి చూపులను ఎదుర్కోవాలంటే కూడా అదొక రకమైన భీతి. నిలువెత్తు మనిషిని అణువణువూ  చదివేసినట్లు వుండటమే కాదు ఉత్తరక్షణంలో తను చేయబోయే పనులకు అడ్డుకట్ట వేసేస్తుంది. లక్ష్యపెట్టకుండా ముందడుగు వేస్తే ఏం జరుగుతుందో చూచాయగా చెప్పి చూస్తుంది. తమ పెళ్ళై ఇప్పటికే నాలుగేళ్ళు గడిచాయి. ఆమె మాట ఆలోచన తప్పుకాలేదెన్నడూ.  సిద్దప్పకు ఒకరకంగా ఆమె మాటకు అవుననడం తండ్రి మాటను కాదనడం దుస్సహమైనది. తమ పెళ్ళి జరిగిన తీరును గుర్తు చేసుకున్నాడు.

************

 శ్రీశైలంలో స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళిన తను ఆమెను దర్శించాడు. చూసిన మరుక్షణమే మనసు పారేసుకున్నాడు. తల్లిదండ్రులు ఆమోదం తెలుపుతారో లేదో అని ఆలోచించకుండా  కట్నం మాట లేకుండా పెళ్ళాడతానని మాట ఇచ్చేసాడు.  తర్వాత కుటుంబాన్ని వొప్పించడానికి మెప్పించడానికి చచ్చే చావొచ్చింది. 

రామేశ్వరి తండ్రి బసవుడుది హుబ్లీ ప్రాంతం. కలలో శ్రీశైల మల్లికార్జునుడు ఆదేశించాడని చెప్పి భార్యను వెంటబెట్టుకుని  శ్రీశైలం వచ్చాడంట.ద్విసంధ్యలూ తనివితీరా స్వామి దర్శనమైతే  అవుతుంది కానీ ఉదరపోషణకు మార్గం కనబడలేదు.  దేవస్థానం సమీపంలో వున్న ఫలహారశాలలో  సహాయకుడుగా చేరాను.  కొన్నాళ్ళకు భార్య కూడా  చేరింది. పనీపాటా భక్తి ప్రదక్షిణల  మధ్య నలుగురు పిల్లలను కన్నాం. తిండికి బట్టకు లోటు లేకుండా పిల్లలు   పెరుగుతుండగా వారికి  ఆస్తులు కూడా సంపాదించి ఇవ్వాలన్న ఆశ కల్గింది. ధర్మకర్త సాయంతో  సొంతంగా ఒక ఫలహారశాలను స్థాపించాను. రామేశ్వరి ముగ్గురు అన్నదమ్ముల తర్వాతది. అపురూపంగా పెరిగింది.  నాట్యమైతే నేర్చుకోలేదు కానీ  మాటకన్నా ముందు  ఆమె కళ్ళు చేతులు కాళ్ళు  మట్లాడతాయి. ఫలహార శాలకు వివిధ ప్రాంతాలనుండి వచ్చే భక్తుల మాట తీరును వస్త్రధారణను అన్నీ సునిశితంగా పరిశీలించేది. చక్కని మాటతీరుతో  అందర్ని ఆకట్టుకునేది. అన్నల వ్యతిరేకత వున్నా దిగువున వున్న సుండిపెంటకు పెళ్ళి ఇంటర్మీడియట్ వరకూ చదువుకుంది. తండ్రి నుంచి కన్నడంలో వచనాలు చదవడం నేర్చుకుంది.   యుక్తవయస్కురాలైంది. కూతురికి బాగా ఆభరణాలు చేయించి సమస్త వస్తు సామాగ్రిని కానుకనిచ్చి అత్తవారింటికి పంపాలనే నా ఆశ” అని చెప్పుకొచ్చాడు ఆయన.  

తీరా పెళ్లి సంగతులు మాట్లాడే సమయంలో ఆమె అన్నలు ముగ్గురు అడ్డుకున్నారు. పొలాలు ఇండ్లు తమకే సొంతంగా భావించిన వారు  నామ మాత్రపు స్త్రీ ధనం యిచ్చి అత్తవారింటికి పంపారు. కాంతే కనకం అనుకుని తృప్తి పడ్డాడు తను. రామేశ్వరి మెదడుకు చురుకైన ఆలోచన కల్గిందపుడే.ఆడ మగ మధ్య వ్యత్యాసం మనిషి స్వార్థం సృష్టించినదే అని పదే పదే అనేది.అన్నలపై విముఖత ప్రకటించేది కూడా. 

తన కుటుంబం విషయానికి వస్తే తండ్రి వీరయ్యది సీమలో  ఒక మాదిరి రైతు కుటుంబం. మెట్ట పంటల సేద్యం. అన్న భార్య బాగానే కట్నం తెచ్చింది.తలలో నాలుకలా మెలిగేది. ఆమెకు భర్త మాట వేదవాక్కు.ఇద్దరు ఆడపిల్లలు. తను రెండో కొడుకు.  రామేశ్వరి పెద్దగా కట్నం తెచ్చుకోపోవడం బతుకు తెరువు కొరకు ఊరు విడిచి వచ్చిన కుటుంబం అనీనూ ఫలహారశాల నడపడం గౌరవమైన పని కాదనే భావన తమ కుటుంబ సభ్యుల మనస్సులో బలంగా వుండేది. అందుకు తగ్గట్టుగానే వారి ప్రవర్తన.  రామేశ్వరికి అది మనసులో ముల్లు గుచ్చుకున్నట్టు వుండేది. ఇంట్లో వారితో మనసు విప్పి మాట్లాడేది కాదు. వచనాలు చదువుకుంటూ ఆలోచిస్తూ మరీ అశాంతిగా వుంటే తనకు చెప్పి మనసు భారం దించుకునేది.

రామేశ్వరి అలా ఎక్కువ కాలం మౌనంగా ఉండలేక పోయింది.  ఉత్సాహంగా కదిలే  కాళ్ళను  చేతులను స్తబ్దత నుండి విముక్తి కల్గించి  పనికి మళ్ళించింది. ఇంట్లో వ్యతిరేకత మొదలైనా తనతో కూడి పొలం పనులు నేర్చుకుంది. చేసే ప్రతి పని శ్రద్దగా  తీరుగా చేసేది. క్షణం తీరిక లేకుండా ఇంటి పనులు చేసేది.  మాట్లాడటాన్ని తగ్గించి  లోతు ఆలోచనలు చేసేది. క్లుప్తంగా మాట్లాడి ఎదుటి మనిషిని కట్టడి చేసేది. తమకు ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చారు. మనుమడు మాత్రమే వంశోద్దారకుడని ఆడపిల్లలు పరాయింటికి సొమ్మును దోచుకుపోయేవారని అవసరమైతే కుటుంబ పరువు కోసం వారి ప్రాణాలు తీయడం కూడ తప్పు కాదని గాఢాభిప్రాయం తండ్రిది. చెల్లెలు పర కులస్తుడిని ప్రేమించిన పాపానికి అతన్ని పొట్టన పెట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా  వేరొకరికి కట్టబెట్టటంలో తనది మౌనపాత్ర. చెల్లెలు ఆ బలవంత వివాహం తర్వాత ఒక బిడ్డను కన్నాక కూడా ప్రేమించినతనిని మరువలేక పెన్నలో మునిగి ప్రాణ త్యాగం చేసింది.  తండ్రి మూర్ఖత్వం కరుకు గుండె ఎలాంటిదో ఏమిటో అన్న సంగతి తెలియడానికి రామేశ్వరికి ఆ విషయం గురించి కూడా చెప్పాడు. విని మౌనంగా వుంది రామేశ్వరి. 

ఆడవారికి  చాకలి పొద్దు రాసుకోవడం  పాల చీట్లు లెక్కపెట్టుకోవడం, ముందు పెట్టిన గుడ్లు మురిగిపోకుండా  కోడి గుడ్లపై తారీఖు వేసుకోడం తెలిస్తే చాలని తండ్రి అభిమతం. కాడిగట్టిన ఎద్దును ముల్లు కర్రతో పొడిచినట్లు ఇంటి స్త్రీలను చూపులతోనూ బూతులతోనూ పొడుస్తూవుంటాడు. ఇంటాబయటా పెత్తనమంతా ఆయనిదే. అన్న తను కూడా ఆయన చెప్పినది వినడం ఆచరించడం.


అయితే రామేశ్వరి కాస్తో కూస్తో చదువుకున్నది విషయపరిజ్ఞానం కలది కావడం అసలు భరించలేకపోయాడు. అటువంటిది ఆమె ఆర్ధిక విషయాల గురించి మాట్లాడటం విని ఉగ్రంగా మారిపోయాడు. ‘నీ పెళ్ళాన్ని హద్దుల్లో పెట్టుకో’ అని  తనను తరచూ హెచ్చరిస్తూ వుంటాడు. 


రామేశ్వరి తండ్రి చనిపోయాడు. దిన వారాలకు వెళ్ళినప్పుడే ఆమె అన్నదమ్ములు ముగ్గురూ ఆస్థి పత్రాలపై సంతకం చేయించుకుని పదివేలు చేతిలో పెట్టి పంపించారు. తనను భర్తను అడగకుండానే సంతకం పెట్టిందని సంతకం పెట్టకపోతే ఆస్తుల్లో వాటా వచ్చేదని తిట్టిపోసాడు వీరయ్య. తన చేత అడిగించి కోడలి దగ్గర వున్న ఆ పదివేలు ను తీసుకుని పొలం కొన్నాడు. ఉన్న భూమిలోనే పంట సరిగా చేతికందనపుడు  పొలంపై పెట్టుబడి పెట్టటం ఎందుకని రామేశ్వరి వాదన.   కొన్న భూమిని తన పేరున ఎందుకు పెట్టలేదు?  ప్రశ్నించింది.

“ఆడోళ్ళ పేరున ఆస్తులు రాయడమా!? తరతరాలుగా అది మా ఇంటావంటా లేని పని. నా ముందు అంటే అన్నావ్ గానీ మా నాయన ముందు ఈ మాట అనేవు.కత్తి తీసుకుని నరుకుతాడు” అన్నాడు  సిద్దప్ప.

“అంత చేతకాని వాళ్ళు ఎవరు లేరులే ఇక్కడ” అంది. ఆశ్చర్యపోయి భార్య వైపు చూస్తుండిపోయాడు. ఆ రోజు  కూడా గడ్డిపరకలతో పాటు  తన చేతిలోకి పాము కుబుసం రావడం గమనించాడు. భార్య  ప్రశ్నించినపుడల్లా అలా జరుగుతుందెందుకో అర్దం కావడంలేదు. అలాగే జరిగినది అనుకోవడానికి రెండు మూడు సార్లు రూఢి దొరికింది కూడా. 

మరొకసారి కూడా అంతే ! ఇద్దరు బిడ్డలు చాలని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటానని తనతో చెప్పింది రామేశ్వరి.  మన ఇంట మగపిల్లలు తక్కువ ఆడపిల్లలు ఎక్కువ వున్నారు. ఇంకో రెండుతూర్లు చూద్దాం. ఆపు అన్నాడు వీరయ్య. తండ్రి మాటను భార్య దగ్గర వల్లించాడు. భర్త వైపు ఓ చూపు చూసి చెప్పకుండా ఆపరేషన్ చేయించుకుని వచ్చింది. ఇంట్లో అందరూ చూస్తుండగా భార్య  చెంపపై గట్టిగా వొకటిచ్చి తన అధికారం ప్రదర్శించుకున్నాడు. రామేశ్వరి చెంప పట్టుకుని సన్నగా నవ్వింది. కోపంగా గదిలోకి వెళ్ళి మంచంపై పడుకున్న  తనపై  పై కప్పు నుండి సగం విరిగిన  పాము కుబుసం రాలిపడింది. తీవ్రంగా భయపడ్డాడు. ఇంట్లో ఎవరికి కనబడని పాము కుబుసం తనకే ఎందుకు కనబడుతుందని తల్లి దగ్గర వాపోయాడు. “ఐదు ఆదివారాలు పుట్టలో పాలుపోస్తానని ప్రదక్షిణలు చేస్తానని  సుబ్రహ్మణ్యస్వామికి మొక్కుకో..”అంది.

రామేశ్వరి“నీకు కుబుసం కనబడితేనే భయపడుతుంటివి,పొద్దస్తమాను పొలంలో తిరిగేవారికి పామంటే భయమైతే ఎట్టబ్బా” అని నవ్వింది. 

ఇంకొన్నేళ్లు గడిచాయి. ఇవ్వాల్టికివాళ “ఉమ్మడి కుటుంబంలో ఎన్నేళ్ళు ఎదుగుబొదుగు లేకుండా వుందాం. మీ నాయనను పంపకాలు చేయమని అడుగు, నువ్వు అడగకపోతే నేనే అడుగుతాను” అని కూడా అంది. తను తండ్రిని అడగలేక భార్యకు చెప్పలేక తను సతమతమై పోతున్నాడు.

************

వీధి దీపాలు వెలిగి దొడ్డంతా వెలుతురు పడితే కానీ చీకటి పడిందన్న ధ్యాస లేని సిద్దప్ప గుర్తు చేసుకుంటున్న గతాన్ని వదిలి వర్తమానంలోకి వచ్చిపడ్డాడు. 

‘ఈ పాము కుబుసం ఏమిటో తనను వెంటాడుతూనే వుంది.ఒంటరిగా ఏ పని చేయాలన్నా భయమౌవుతుంది’ మనసులో అనుకుంటూ పశువులకు గడ్డి వేయకుండానే లోపలకు వెళ్ళాడు.

 

సిద్దప్ప తండ్రిని పంపకాల గురించి అడగకుండా రోజులు వారాలు నెలలు గడిచిపోతున్నాయి.భర్త మగ పెత్తనంలో నడిచే సగం మగ మనిషి సగం ఆడమనిషి అనుకుని నిట్టూర్చింది రామేశ్వరి.


 తనకంటూ సొంత వ్యాపకం వుండాలనుకున్న రామేశ్వరి డ్వాక్రా గ్రూఫ్ లో సభ్యురాలైంది. లోను డబ్బుతో స్వంతంగా పాడిగొడ్డును కొంది. నూనె గానుగ పెడదామని ప్రతిపాదన చేసింది. మగపెత్తనం సాగే ఆ కుటుంబంలో ఆడది సంపాదన పరురాలు కావడం ఆర్ధిక విషయాలు మాట్లాడటం కుటుంబానికి మింగుడు పడలేదు. వీలైనంత ఆమెను అణచివేయాలని చూసారు. ఆ విషయంలో అత్త తోడికోడలు కూడా తమ పాత్రను సమర్దవంతంగా నిర్వహించారు.అయినా రామేశ్వరి లెక్కచేయలేదు. చిన్న చితకా వచ్చే ఆదాయ వనరులను కాపాడుకుంటూ డబ్బును సృష్టించాలని తాపత్రయపడేది. ఆడదానిక్కూడా మెదడు వుంటుంది, అదీ ఆలోచించగల్గుతుందని అంగీకరించని జమానాలో  తను ఏమి చెప్పినా ఎగతాళిగా మారుతుందని కొన్నేళ్ళు మౌనం వహించింది. కాలమే కాదు కలసిరాని భర్త నైజం ఆమెను నిరాశపరిచేది. వానలు కురవకపోతే భూమి పంటకు  పనికి రానట్టే డబ్బులు కురవకపోతే ఏ పని చేయడం అంత సులభం కాదని అర్ధం చేసుకొంది.  


 సకాలంలోనే చినుకులు రాలుతున్నాయి. పంట విత్తే సమయానికి కుటుంబం నుండి వేరు పడితే బాగుండును అనిపించింది రామేశ్వరికి. తమ వాటాకు రెండు ఎకరాలు రానీ మూడెకరాలు రానీ పంట  పండినా పండకపోయినా స్వతంత్రంగా బతకడం ఆలోచించడం భర్తకు అలవాటు అవ్వాలంటే తండ్రి నీడ నుండి బయటకు రావాలని అప్పుడే తమ పిల్లలకు చదువు మంచి భవిష్యత్ వుంటుందని అనుకొంది.నోరు విప్పి తండ్రిని అడగడం భర్త వల్ల కాని పని అని గ్రహించి తనే చొరవ చేసింది.


“పిల్లలు పెద్దగా అవుతున్నారు. కాన్వెంట్ చదువులకు పట్నం పంపాలి. ఫీజులకు డబ్బులివ్వు మామా “ అని అడిగింది.

“డబ్బు లేం చెట్లకు కాయడంలేదు ఉన్నంతవరకూ ఊళ్ళో బడికిపోయి చదవడమే” అన్నాడు వీరయ్య. 


“మా బిడ్డలను బాగా చదివించుకోవాలని కోరిక. మా వాటా ఎంతొస్తే అంత మాకు పంచి ఇవ్వండి”  అంది. 

“వాటాలు పంచమని అడిగేంత పెద్దదానివా నువ్వు” అంటూ కోడలిపై చెయ్యెత్తాడు. చేతిలో వున్న పాల బిందెను ఆచేతికి అడ్డం పెట్టింది. సిద్దప్ప ఉరుక్కుని  వచ్చి భార్య చేతిలో బిందె లాక్కున్నాడు రెక్క దొరకబుచ్చుకుని లోపలికి లాక్కెళ్ళాడు. 

ఆడదాని నోటికి కాలికి సంకెళ్ళు ఎలా వెయ్యాలో తెలిసిన వీరయ్య కోడలిని మనుమరాలిని వీధిలోకి త్రోసాడు. కొడుకుని మనవడిని లోపలికి నెట్టాడు. సిద్దప్ప ఆ రోజు గడ్డివాము దరిదాపులకు కూడా పోలేదు. అయినా  ఏవేవో పిచ్చి పిచ్చి కలలు. కొట్టబోయిన చేతిని అడ్డుకుంటున్న  పాలబిందె. నడిరోడ్డు పై నిలబడిన తల్లీ బిడ్డ.  ముక్కలు ముక్కలుగా చేతికి వస్తున్న పాము కుబుసం. రామేశ్వరి తన వంక చూసిన చూపు. కలవరపడ్డాడు కలత చెందాడు. 

 నడిరోడ్డులో నిలబడ్డ రామేశ్వరి ఆ స్థితిలో పుట్టింటి గడప తొక్కకూడదని నిర్ణయించుకుంది. ఎదురింటి వారి ఆశ్రయం కోరింది. వాళ్ళ కొట్టంలో ఖాళీగా వున్న ధాన్యపు గదిని నీడగా చేసుకొంది.  కట్టుకొయ్యకు కట్టేసిన బర్రెగొడ్డును దూడను తాడు పట్టుకుని తెచ్చుకోగల్గింది కానీ తాళి కట్టిన మొగుడ్నికొడుకును  లాక్కొచ్చుకోలేకపోయింది. పిల్లను వెంటబెట్టుకునే పొలం పనికి కోళ్ళఫారంలో పనికి వెళ్ళి ధైర్యంగా బతకడం నేర్చుకొంది. కొడుకు శివ  వీధి వాకిట్లో నిలబడి తల్లి చెల్లి వైపు చూస్తుండం తప్ప దగ్గరకు రాలేని నియంత్రణ. ఆ కంచె దాటి వస్తే వాడు తన కొడుకుగా పెరుగుతాడు. రాకుంటే మరో తరం ఆడదానికి అన్యాయం జరుగుద్ది అనుకుంది.  అలా ఏడాది గడిచిపోయింది.

ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఇల్లు కట్టించి ఇస్తానని ప్రకటించింది. సొంత స్థలం వుండాలని అదీ స్త్రీల పేరుతోనే వుండాలని షరతు పెట్టారు అని గ్రూఫ్ లీడర్ చెప్పింది. తను పదివేలు ఇచ్చింది కదా ఆ డబ్బుతో కొన్న పొలానికి బదులు ఖాళీగా వున్న వాముల  దొడ్డిని తన పేరున రాయమని వీరయ్యను వీధిలో నిలబెట్టి  అడిగింది. ‘కాదు పొమన్నాడు నీకు దిక్కున్న చోట చెప్పుకో’ అన్నాడు. 

 "రామేశ్వరి ఊరుకునే రకం కాదు  పంచాయితీ పెట్టిచ్చుద్ది చూడు" అంది తోడికోడలు మొగుడితో.

 అనుకున్నట్టుగానే ఊర్లో పెద్దల దగ్గర పంచాయితీ పెట్టించింది. తెగేదాకా  లాగకూడదు. కొడుకు భార్యే కదా, పరాయింట్లో ఎన్నాళ్లు తలదాచుకుంటుంది. వాళ్ళూ ఇల్లు కట్టుకొంటారు కోడలికి స్థలం రాసివ్వమని కొడుకుని పంపేయమని పెద్దమనుషులు సర్దిచెప్పారు. ముఖం గండుగా పెట్టుకుని అయిష్టంగా మిట్ట పల్లాలున్న పదిసెంట్ల భూమిని కోడలి పేరున రాసి ఇచ్చాడు. రిజిష్టర్ ఆఫీస్ లో పనై బయటికి వచ్చాక మామను ఉద్దేశించి “ మీ తాత ముత్తాత ఆస్తి నాకేమి  ఉచితంగా రాసియ్యలేదు. అర ఎకరా కయ్యి బదులు ఆ స్థలం రాసిచ్చావ్”  అంది. పళ్ళు పటపట నూరి ఒక బూతుమాట గొణిగి పై పంచె దులుపుకుని అవతలకు పొయ్యాడు. నాలుగు రోజులు గడిచాక స్థలం పత్రాలు పట్టుకొని కొడుకుతో సహా సిద్దప్ప  భార్య దగ్గరకు చేరాడు.  

జరిగిన విషయాలేవీ వారి మధ్యకు రానీకుండా జాగ్రత్తపడుతూ భర్తతో అన్యోన్యంగా వుంటూ.. అతనిని తెలివిగా శ్రమ మార్గంలోకి నడిపించింది. సిద్దప్ప రెండు ఎకరాల కౌలు పొలం చేసుకుంటూనే భార్య  కూతురు తో పాటు కోళ్ళఫారంలో పనిచేయడం మొదలెట్టాడు.  చిన్న వేన్ అద్దెకు తీసుకుని గుడ్లను పట్నంలో షాపులకు వేసి రావడం కోళ్ల మేత వేసుకురావడం చేస్తుండేవాడు.ఏడాదిపాటు కష్టపడి ప్రభుత్వం ఇచ్చిన చిన్న ఇంటితో పాటు రెట్టింపు ఇంటిని కలిపి నిర్మించుకున్నారు. రామేశ్వరి ఆలోచన ప్రకారం నూనె గానుగ పెట్టారు. సిద్దప్ప చేతిలో  డబ్బుల సందడి చూసి ఆ ఇంటి నుండి ఈ ఇంటికి రాకపోకలు మాములయ్యాయి. 

వ్యవసాయంలో మిగిలేది తవ్వింది పూడ్చటానికి కూడా రాక అప్పులపాలై నాలుగెకరాలు కరిగిపోయాక కానీ వ్యవసాయంపై ఆధారపడటం తప్పనిపించింది వీరయ్య కుటుంబానికి.ఆ విషయం వొప్పుకోవడానికి అహం అడ్డొచ్చి కాలు ఈడుస్తున్న ఎద్దుతో కాడి కట్టి సేద్యం చేస్తన్నట్టు సంసారం నడుపుకొస్తున్నాడు.అడపాదడపా సిద్దప్ప డబ్బు అందిస్తుంటే చూసిచూడనట్టు ఉండేది రామేశ్వరి.

పదవతరగతి దాకా కొడుకుని కూతురిని వొకే కాన్వెంట్ కి పంపించింది రామేశ్వరి.  ఒకోసారి ఆడపిల్ల చదువుకు  అంత ఖర్చు ఎందుకు? అని నసిగేవాడు సిద్దప్ప. కొడుకు శివ ట్యూషన్ కి  కూడా వెళుతూకూడా  ముక్కిమూలిగి ఏ గ్రేడ్ తెచ్చుకుంటుంటే స్కూల్ కి వెళ్ళేదాకానూ స్కూల్ నుండి వచ్చాక కూడా మనతోపాటు సమానంగా చాకిరిచేస్తూ కూడా వాడికన్నా మంచి మార్కులు తెచ్చుకుంటుంటే వద్దని అనడానికి నీకు నోరెట్టా వస్తుందయ్యా! ఎంతైనా నువ్వు ఆ ఇంటి బిడ్డ వే కదా! నీ ఆలోచనలు మాత్రం మంచిగా ఎట్టా వుంటాయ్” అంది విసురుగా. 


సందెవేళ దీపం పెట్టి నట్టింట్లో కూర్చుని భర్తకు వినబడేటట్టు వచనం చదివింది.


“తాను సృష్టించిన స్త్రీ తన తలనెక్కింది.

తాను సృష్టించిన స్త్రీ తన ఒడికెక్కింది.

తాను సృష్టించిన స్త్రీ బ్రహ్మ నాలుకకెక్కింది

తాను సృష్టించిన స్త్రీ నారాయణుని ఎడదకెక్కింది.

అందువల్ల, స్త్రీ స్త్రీ కాదు, స్త్రీ అబల కాదు స్త్రీ రాక్షసి కాదు.

స్త్రీ ప్రత్యక్ష కపిల సిద్ద మల్లికార్జునుడే కనవయ్యా’’


అది విన్న సిద్దప్ప మళ్లీ ఎప్పుడూ బిడ్డల మధ్య ఆడ మగ భేదం చూపించలేదు. 


ఇంటర్మీడియట్ లో శివ ను విజయవాడ హాస్టల్ లో చేర్పించి చదివిస్తే.. పక్కనే వున్న టౌన్ లో గవర్నమెంట్ కాలేజీలో చదివి మంచి ర్యాంక్ తెచ్చుకుంది మల్లి. రోజూ ఇంటి దగ్గర్నుండే అనంతపురం  వెళ్ళి బి టెక్ పూర్తి చేసింది.నూనె గానుగ చూసుకోవడం  తల్లి దగ్గరనుండి స్కూటీ తోలటం తండ్రితో కలిసెళ్ళి వేన్ నడపడం నేర్చుకుంది.  కాలేజ్ లో చేరేటపుడు తల్లి చెప్పిన మాటలు ఎప్పుడూ మననం చేసుకునేది. “ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకున్న రోజే ప్రేమ పెళ్ళి ఆలోచన చెయ్యాలి. ఆడమగ పిల్లలు కలిసి చదువుకునేచోట అనేక ఆకర్షణలు వుంటాయి. అలాంటి సాలెగూడులో పడకుండా బాగా చదువుకో. తర్వాత నీకిష్టమైన వాడిని ఎంచుకో. అంతే కాని తప్పు దారి పట్టకు’’. అనే మాటలను బాగా ఒంటబట్టించుకుని కుదురైన పిల్లగా పేరు తెచ్చుకుంది కానీ వానరాకడ ప్రాణం పోకడ తెలియదన్నట్టుగానే ప్రేమ పుట్టుక తెలియదని తర్వాత అనుకొనింది మల్లి .  

కరెంట్ హెచ్చు తగ్గులకు తగలబడి పోయిన మోటర్ ని విప్పుకుని బండి మీద వైండింగ్  షాపుకు తెచ్చింది మల్లి. అక్కడ తన క్లాస్మేట్  అర్జున్ కనిపించాడు. ఈ షాపు మాదేనండీ, నా తండ్రి ఎలక్ట్రీషియన్. నాకు కూడా ఈ పనులంటే ఇంట్రెస్ట్. అందుకే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసాను అన్నాడు. మల్లి కళ్ళల్లో ప్రశంస.

 “మోటర్ పూర్తిగా కాలిపోయింది. వైడింగ్ చేయడానికి కనీసం రెండు రోజులైనా పడుతుంది” అన్నాడు.

 “డ్రిప్ ఇరిగేషన్ కు అవసరమైన మోటర్ అండీ ఇది. ఇవాళ బిగించి నీళ్ళు వొదలకపోతే పంటకు చాలా నష్టం కల్గుతుంది” అంది.

 “మా దగ్గర స్పేర్ మోటర్ వొకటి వుంది. అది తీసుకొచ్చి బిగించి పెడతాను. ఈ మోటర్ పని అయ్యాక అది ఇచ్చేద్దురుగాని” అని మల్లి వెంట పొలానికి వచ్చి సాయపడ్డాడు.

నాలుగునాళ్ళు దగ్గరగా మసలడం వలన మల్లి కి అర్జున్ పై ఇష్టం కల్గింది.  ఓ వాలు చూపు విసిరింది చిరునవ్వు రువ్వింది.అర్జున్  లోన దాగిన కాముడుకి కలవరం కల్గింది.  తరచూ వారిరువురు కలవడానికి కారణాలు వెతుక్కున్నారు.

రామేశ్వరి విషయాన్ని త్వరగానే పసిగట్టింది. సున్నితంగా హెచ్చరించింది. “ఆ ఇంటి పరిస్థితులు ఎటువంటివో, అతనికి పెళ్ళి చేసుకునే ఉద్దేశం వుందో లేదో కనుక్కో. నలుగురి నోళ్ళలో నానడం మంచిది కాదు. ముఖ్యంగా నీకు అతను జీవితాంతం స్నేహితుడిగా అండగా నిలబడేవాడు స్త్రీ ధనాన్ని ఆశించనివాడు అవునో కాదో గ్రహించుకో. నువ్వు సరైన వాడినే ఎంచుకున్నానని అనిపిస్తే నాకు చెప్పు. పెళ్ళి జరిపిస్తాం” అని చెప్పింది.  

పది రోజుల తర్వాత “అర్జున్ లో ఏం చూసాను అన్నది కాదమ్మా, అతని తోడుంటే చాలు అని మంచిగా ఫీల్ అయ్యాను. మా నాన్న లాగే చెబితే వినే మనిషే అనిపించాడు. నేను అతన్నే పెళ్ళి చేసుకుంటాను”  అంది మల్లి. మీరు వద్దన్నా ఏదో ఒకరోజు గుళ్ళో పెళ్ళి చేసుకుంటాం” అని జరగబోయేదాన్ని సూచించింది.

పొలంలో కాయకూరలు తెంపుతూ మల్లి అర్జున్ పై మనసు పడిన విషయాన్ని సిద్దప్ప తో చెప్పింది.

“అదెట్టా కుదురుద్ది. చిన్నప్పటి నుండి శ్రీను గాడికి ఇచ్చి చేయాలని అనుకొంటిమి కదా! ఇప్పుడు వాడికి కాదని ఎవడికో యిచ్చి చేస్తే బాగుంటందా? పైగా అతను మన కులం కూడా కాదయ్యే,  మా నాయనను వొప్పించడం చానా కష్టం” అన్నాడు. నిజానికి శ్రీనుకి మల్లికి భర్త కాదగ్గ అన్ని అర్హతలున్నా సరే పురుషాహంకారానికి అచ్చు విలాసం అయిన ఆ ఇంట్లో పెరిగిన బిడ్డ శ్రీనుకి మల్లినిచ్చి చేయడం ఇష్టం లేదు. తిరుగులేని బాణం వేసింది రామేశ్వరి.“అంగం లింగం ఒకటయ్యాక నువ్వు నేను కాదని ఏమి చేస్తాం. గుట్టుగా పెళ్ళికి ఒప్పేసుకుందాం” అంది. 

సిద్దప్ప ఆశ్చర్యపోయాడు. కూతురు అంత ఇంగితజ్ఞానం లేనిది కాదని అతని నమ్మకం. భార్య చెప్పిన  నమ్మశక్యం కాని మాటలు గురించి ఆలోచిస్తూనే “ మరైతే నాన్న ఏమంటాడో అని”  అన్నాడు జంకుగా.

 “ వాటాల సంగతి అడక్కుండా పెద్ద పిల్లలిద్దరికి ఇచ్చిన కట్నం సంగతి మాటాడకుండా కయ్య రాసిమ్మని అడగకుండా వుంటే ఆయనే గమ్ముగా వుంటాడు. నేను మాట్టాడతాను. అక్కడికి వెళ్ళాక  మీ నాయన ముందు ఉత్తుత్తి ప్రతాపం చూపియ్యి. కాసేపు అట్టెట్టా కుదురుద్ది అని వీరంగం వెయ్యి చాలు” అని సూచనలిచ్చింది. 

తెల్లారేసరికల్లా ఊర్లోకి అడుగుపెట్టారు. విషయం ఎట్టా చెప్పాలా అని  సిద్ధప్ప మల్లగుల్లాలు పడుతుంటే.. తండ్రి వీరయ్యే కదిలించాడు. “మల్లి చదువు అయిపోయిందిగా. శ్రీను ని పంతులను పిలిపించి లగ్గాలు పెట్టుకుంటే బాగుంటది. ఏమంటావ్” అనడిగాడు కొడుకుని. 

“మల్లి కి శ్రీను ని చేసుకోవడం ఇష్టం లేదంట నాయనా, అది కాలేజీ లో చదువుకొనేటపుడు ఎవర్నో ప్రేమించింది అంట” 

“అనుకున్నదంతా అయిందన్నమాట. అందుకే ఆడముండలకు చదువులు వొద్దని చెప్పేది. మీరు ఇన్నారు కాదు” అన్నాడు తుస్కారంగా కోడలి వైపు చూస్తూ.

 

సిద్దప్ప తల్లి గొంతు కూడా లెగిసింది. “ఏవమ్మా కోడలా! సేద్యం లాభసాటి కాదంటివి. కోళ్ళ ఫారం నయమంటివి. కొడుకు చదువంటివి. కూతురు చదువంటివి. ఇల్లొదిలిపోయి ఇంటి పరువు తీసిపారేస్తిరి.టౌన్ కి పోయి కులం పోగొట్టుకునే పనులు చెయ్యాలా?  పిల్లను ఇచ్చేటపుడు తెచ్చుకునేటపుడు కులాచారం చూడకపోతే ఎట్టా? ఆ పెళ్ళి జరిగితే మేము వీధుల్లో తలెత్తుకుని తిరిగేదెట్టా” అంది.

“నేను అదే అంటున్నా అమ్మా, ఈ గడప దాటి పొయ్యాక అన్నీ పొయ్యాయి. ఇచ్చిన మాట  మర్యాద పొయ్యాక పరువు పోయినాక బతికి ఎందుకు? పరువు ఇంటి దూలం లాంటిది. ఈ ఇల్లే కూలి పోయినట్టుంది నాకు. అంటూ వీరావేశం తెచ్చుకుని “నీ కూతురు చేసిన పనితో ఈ ఇంటి పరువు పోయింది. నువ్వు నీ కూతురు గంగలో దూకి చావండి”అని వీరంగం వేసాడు సిద్దప్ప. 

భర్త నటిస్తున్నాడో లేక తన వాళ్ళ మధ్య వున్నాననే దైర్యంతో రంకెలు వేస్తున్నాడో అర్థం కాలేదు. వచ్చిన పని విజయవంతంగా ముగించుకుని వెళ్ళాలనే సృహ కల్గింది.

“వీరయ్య మనుమరాలు అయ్యిండి ఇంత పరువు తక్కువ పని చేసుద్ది అని నేను కలలో కూడా అనుకోలేదు మామా!.  ఆ ప్రేమించడమో గీమించడమో అంతవరకూ అయితే నేనే తిట్టో కొట్టో ఇంటిల్లపాది చస్తామని బెదిరించో దారికి తెచ్చుకుని వుండేదాన్ని.  శ్రీనుకిచ్చి పెళ్ళి చేసి వుండేవాళ్ళం.ఆ  ప్రేమ గీమ గీతలన్ని దాటిపోయి ఇప్పుడది  తల్లి కాబోతుంది.  డాక్టర్ దగ్గరకు తీసుకుపోతే ఐదవ నెల గడుస్తుందని చెప్పింది.  చిన్న పిల్ల దానికేమి తెలుసు అని అనుకుంటాం కానీ వాళ్ళు మాత్రం బోలెడు ఎదిగిపోయాం అనుకుంటారు. పైగా మైకంలో పడిపోయే. వివరం తవరం తెలియడానికి జ్ఞానం వడ్డించిన విస్తరి కాదయ్యే! అంది కావల్సినంత విచారాన్ని ముఖాన పులుముకుని గోడకు ఆనుకుని నేలచూపులు జూస్తూ. 

“ఛీ.. దానెమ్మ సిగ తరగ అంటూ మొదలై అనేక అశ్లీలమైన పదజాలంతో రెండుమూడు నిమిషాలు  రంకెలువేసాడు. ఒగరుస్తూనే ఇక దాన్ని తీసుకొచ్చి నా మనమడికిచ్చి పెళ్ళి చేయడమేమిటి? ఆ కులం తక్కువ వాడికే ఇచ్చి పెళ్ళిచేయండి.  శ్రీను కి రాజా లాంటి సంబంధం తెచ్చి పెళ్ళి చేస్తాను” అన్నాడు మీసం మెలేసి మూడవకాలి మీద ఊగిపోతూ. 

 

రామేశ్వరికి ఆ బూతు మాటల దాడికి కడుపు మండిపోయింది. ఆడదంటే అంత చులకన భావమా?  తండ్రి ముందు కూతురిని  కొడుకు ముందు కోడలిని పచ్చి బూతులు మాట్లాడుతుంటే చోద్యం చూస్తున్నట్లు చూస్తున్న భర్తను ఏహ్యంగా చూసింది. దానికి తోడు తన పెంపకాన్ని తప్పు పట్టినందుకూ లోలోపల రగిలిపోయింది. కర్రుకాల్చి వాత పెట్టినట్లు మాటలంటించింది.


“మీ అవ్వ తాత మీ మేనత్తను పెంచినట్టే నేను కూడా పెంచాను అని అంటారు కదే ముదనష్టపుదానా! అని గట్టిగా  నాలుగు మొట్టికాయలేసాను. కోపం తీరక గొడుగు ఇరిగిందాక కొట్టి కూడా వచ్చాను మామా! ఒకో యింటికి ఒకో సాలు. మల్లికి  మేనత్త సాలు తప్పిపోకుండా వచ్చింది. ఏం చేద్దాం మరి” అంది. నల్లబడ్డ ముఖంతో  అత్త పాలు పొంగి పోతున్నాయంటూ వంట వసారలోకి తప్పుకుంటే తోటికోడలు ముసి ముసి నవ్వులు నవ్వింది.

వీరయ్య సగం కాల్చి చెవిలో పెట్టుకున్న చుట్టను తీసి వెలిగించుకుంటూ కొడుకు వైపు క్రోధంగా చూసాడు ఇదంతా నువ్వే చెప్పి వుంటావు అన్నట్టు. సిద్దప్ప తల కిందకు వొంచాడు. 

“నా ఆస్థిలో దానికి ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వను. అంతా నా వారసుడికే రాసి పోతాను. నా గడప తొక్కవద్దు అని చెప్పు దానికి” అన్నాడు వీరయ్య అక్కడినుండి తప్పుకుంటూ. ఒక పని అయిపోయింది అని తేలిగ్గా నిట్టూర్చి ఎర్రటి ఎండలోనే చెప్పుల్లో కాలుంచింది రామేశ్వరి.

ఇంటికి వచ్చిన తల్లి ముఖం చూసి అక్కడ ఏం జరిగి వుంటుందో ఊహించింది కూతురు. కాళ్ళు ముఖం కడుక్కొని వచ్చిన తల్లికి చల్లని తేట మజ్జిగ నీళ్ళ గ్లాసును చేతికిచ్చింది. 

గ్లాస్ అందుకుని “మల్లీ, ఇటు రా” అని రెండో చేత్తో కూతురిని దగ్గరికి తీసుకుని “నువ్వు నన్ను క్షమించాలి” అంది. క్షణకాలం మల్లి కళ్ళల్లో తను కోరుకున్న వాడితో పెళ్ళి జరగదేమోనన్న భయం రెపరెపలాడింది. ఆ భయాన్ని గుర్తించిన రామేశ్వరి “నీ పెళ్ళి జరగడానికి ఎన్ని అబద్దాలు చెప్పాల్సివచ్చిందో తెలుసా! ఆఖరికి మీ నాన్నకు కూడా అబద్దమే చెప్పాను. ఆ అబద్దం ఆడకపోతే నీ పెళ్ళిని సులభంగా జరగనివ్వరు. నీ అన్నతో సహా అందరూ అడుగడుగునా అడ్డుపడతారు. అందుకే నువ్వు గర్భవతి వని అబద్దమాడాను, అందుకు నువ్వు నన్ను క్షమించాలి” అంది.

 “ఆపద్దర్మమో లేక వంద అబద్దాలు ఆడి వొక పెళ్ళి చెయ్యాలి అనుకోవడం తప్పు కాదులేమ్మా,నేను నిన్ను  అర్ధం చేసుకోగలను. నా కోసం మళ్ళీ తిట్లు తిన్నావ్ కదా అదే చాలా బాధగా ఉంది ’’  అంది మల్లి.

మల్లి పెళ్ళికి ముందు రోజే ఊళ్ళో కట్టుకున్న తన ఇంటి వెనుక భాగాన్ని  నూనె గానుగ పెట్టిన నాలుగు సెంట్ల స్థలాన్ని   కూతురికి సర్వహక్కులతో అనుభవించే విధంగా రాసి ఇచ్చింది. సిద్దప్పతో చెప్పింది. “లింగాయత్ చెప్పిందనే కాదు. నా దృష్టిలో ఆడ మగ ఇద్దరూ సమానమే! తల్లిదండ్రులకు బిడ్డలందరూ సమానమే! మన అబ్బాయికి ఈ విషయమే అర్థమయ్యేటట్టు చెప్పు” అంది.

 “వాడు చెల్లి పెళ్ళికి రానని నిర్మొహమాటంగా చెప్పేసాడు. ఇంకేం చెప్పను” అన్నాడు సిద్దప్ప.

“నేను జీవితకాలం యుద్ధాలు చేస్తూనే వుండటానికి ఓపిక తెచ్చుకుంటాను తప్పేదేముంది” అంది.  

స్నేహితులు తప్ప బంధువులెవరూ హాజరవని పెళ్ళికి ఆర్బాటాలు అవసరం లేదు అన్నారు వధూవరులు.  పెన్న అహోబిలం గుడిలో సింపుల్ గా పెళ్ళి జరిగిపోయింది. రామేశ్వరి తృప్తిగా నిద్రపోయింది ఆ రాత్రి. 

తెల్లవారుజామున గానుగ  ఎద్దులకు మేత వేయడానికి పాక లోకి వెళ్ళాడు సిద్దప్ప. దూసి వుంచిన గడ్డి కనబడలేదు.చాలా ఏళ్ళుగా గడ్డి దూయడం మానేసాడు. ఇంట్లోకి వెళ్లి భార్యని నిద్రలేపబోయి ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమె ముఖం చూసి వద్దులే అనుకుని బయటకు వచ్చాడు.  గడ్డి దూయడానికి వామి దగ్గరకు వెళ్ళాడు. భయం భయంగా గడ్డివాము మీద చెయ్యేసి గడ్డిని దూసాడు. రెండు వాట్లు దూసాక  గడ్డితో పాటు మధ్యలోకి తెగని అయిదున్నర అడుగుల కుబుసం చేతిలోకి వచ్చింది.గుండె జారినట్లైంది. కుడి కాలి దగ్గర జరజర మని శబ్దం. కదలకుండా ఊపిరి బిగపట్టి నిలుచున్నాడు. అప్పుడే కుబుసం విడిచిన గోధుమ వన్నె త్రాచు నిగనిగలాడుతూ బిరబిర సాగిపోయింది.  వెన్నెల వెలుగులో స్పష్టంగా కనబడిన పాము  దాని నిగనిగలాడే  మెరుపును చూసి ఎక్కడో చూసినట్టు అనిపించింది. గుర్తు చేసుకోవడానికి అన్నట్టు ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. రామేశ్వరి కనుల మెరుపు అది. ఆమె ఆలోచన మాట చెల్లుబాటైనప్పుడల్లా ఆమె కళ్ళల్లో వెలిగే మెరుపు అది. చిరుదరహాసం అతని పెదవులపై. 


*************

ATA 2022 సావనీర్  కథాస్రవంతి లో  ప్రచురితం. ఈస్తటిక్ సెన్స్ కథా సంపుటి లో కథ.






కామెంట్‌లు లేవు: