కవిత్వవనంలో నేను లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కవిత్వవనంలో నేను లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, జనవరి 2025, ఆదివారం

ప్రేమ పాత్ర

 నీ ప్రేమ పాత్ర ను ఎన్నడూ ఖాళీ చేయకు.. 

ఎవరైనా అడిగినప్పుడు ఉదారంగా కొంచెమే చిలకరించు.

నీ ప్రేమే కాదు 

ఏ ప్రేమ శాశ్వతం కాదు. 

ఒకవేళ నీ ప్రేమ పాత్రకు రంధ్రం పడిందే అనుకో…

అది మరొక పాత్రనూ నింపనూవచ్చు 

లేదా భూమి మీద పడి ఇంకి పోవనూవచ్చు. 

ధూళి గా మారి పోవచ్చు. 

ఇతరులకు కొంచెం ఇస్తూ

నిన్ను నీవు నింపుకోగల ప్రేమ మాత్రమే నీదైనది. 

నీతో వుంటుంది. గుర్తుంచుకో … 

ప్రేమదెప్పుడూ విజయగర్వం కాదు కేవలం

పరాజయ కంఠధ్వని మాత్రమే 

మోసుకుంటూ ఈడ్చుకుంటూ 

కూలిపోవల్సిందే! 


టాల్స్టాయ్  “అన్నాకరెనినా” కి ప్రేమతో




30, డిసెంబర్ 2024, సోమవారం

వాన కురిసిన రోజు

 విజయవాడలో  “ఎక్సరే” సాహితీ సంస్థ  నెల నెలా వెన్నెల అనే కవితా కార్యక్రమం నిర్వహించేది. ఒక అంశాన్ని ఇచ్చి కవిత్వం రాయమనేవారు. “వాన కురిసిన రోజు “ అనే అంశం ఇచ్చారు. అప్పుడు నేను రాసిన కవిత ఇది. వాన కురిసిన రోజు అందరికీ ఆహ్లాదం కానేకాదు. గుడిసె బ్రతుకుల వారికైతే మరీ కష్టం. నా చిన్నతనంలో నాతో కలసి చదివే ఒక అబ్బాయి వాళ్ళ ఇల్లు ఇలా పొలాలకి రోడ్డు కు మధ్యన  వానకు కురిసిన నీటిలో  వుండేది. ఆ అబ్బాయి వాళ్ళమ్మ వెదురుతో బుట్టలు తయారుచేసి అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేది. నాకెప్పుడూ వారి ఇల్లు ఆ జీవన సమరం ఆసక్తి గానూ సానుభూతి గానూ వుండేది. క్రిస్టమస్ పండుగ వస్తే ఆ అబ్బాయి వాళ్ళమ్మ వెదురు బద్దలతో స్టార్ చేసి కాగితాలు అంటించి గుడిసె ముందు వేలాడదీసేది. ఈ క్రిస్టమస్ కి మా ఇంటి చుట్టూ కొంతమంది విద్యుత్ కాంతులతో వెలిగే నక్షత్రాన్ని వేలాడదీసినప్పుడు ఆమె అప్రయత్నంగా జ్ఞాపకం వచ్చింది. ఆ జ్ఞాపకాలతో ఈ కవిత వెలుపలకు వచ్చింది. పుస్తకాల్లో దాచిన రాత ఇది. వెలికితీత లో బయల్పడింది. 

వాన కురిసిన రోజు    - వనజ తాతినేని 

గుడిసె లోపల కురుస్తున్న వాన చినుకులను పట్టటానికి ఇంట్లో సామాన్లు అన్నీ పరుస్తుంది అమ్మ. 

నేను నిండిన పాత్రలను గుమ్మం బయట పారబోస్తూ వుంటాను. 

అంతలో ఒక అతిథి వచ్చాడు గొడుగు వేసుకుని. 

అమ్మ లోపలికి రండి అని పిలవడానికి సిగ్గు పడింది. 

పొయ్యి లో పిల్లి పడుకునే వుంది..

 నాన్న ఇంకా రాలేదు వస్తాడన్న ఆశ లేదు. ఆకలితో అలమటిస్తూ నేను. మరొక ఆకలి అల్లరి తో పచార్లు చేస్తున్న అతిధి . అతనిచ్చిన గొడుగు పైసలు తీసుకొని  ఊర్లోని అంగడికి నేను. 

ఆ రాత్రి నా ఆకలి పిల్లి ఆకలి తీరింది. అతిథి ఆకలి తీరింది. 

అతను వెళ్ళి పోయాక  అమ్మ కన్నీటి వానలో నిలువెల్లా తడుస్తూ తనను శుభ్రపరుచుకుంది.

నాన్నకెలాగూ జాలి లేదు.. 

వానక్కూడా జాలి లేకుండా పోయింది. అమ్మనెందుకు ఏడిపిస్తుంది!?


20, డిసెంబర్ 2024, శుక్రవారం

బరువులు

 బరువులు

నిన్న చాలా బరువులు ఎత్తాను బాధగా మోసాను. 

కాసేపు వొంటరిగా కూర్చుని ఆలోచించాను

పడుకునే ముందు కాళ్ళు కడుక్కునట్టు

ఎత్తిన బరువులన్నింటిని మురికికూపంలోకి

విసిరేసాను. 

కలల నిద్రలో సేదతీరాను

మా అమ్మ బుగ్గపై వొక ముద్దిచ్చి..

నాకు కావాల్సినవి ఇవ్వమని గారాం చేశాను కూడా! 

అమ్మ ఏం చెప్పిందంటే.. .. 

మరీ బరువులు యెత్తుకోకు మరీ పరుగులు తీయకు.. 

నీ శక్తి సన్నగిల్లకుండా నువ్వు పడిపోకుండా వుండాలి.. 

నేనున్నాను గా! 

నీ బరువు నేనెత్తుకుంటాను 

నీ పరుగు నేను పూర్తి చేస్తాను 

పదిలం .. బిడ్డా! అని ముది గారాం చేసింది. 

మా అమ్మ లో వేల యశోదమ్మలు కనిపించారు. 

నేను మాత్రం…

 చిటికిన వేలితో గోవర్ధన గిరి ని 

యెత్తినట్లు.. బరువులను మోయగల 

సులువు కనిపెట్టాలి. 

మా అమ్మ కు కష్టం లేకుండా. 

ప్రేమ ఎంత బరువో అంత సలీసు కూడా.

కాదంటారా!?




18, డిసెంబర్ 2024, బుధవారం

వాక్యం

 - వనజ తాతినేని

ఎండిన మరువపు కొమ్మను తెచ్చి 

బట్టల బీరువాలో దాచినట్లు 

నచ్చిన పుస్తకంలో పెట్టినట్లు 

బాగా నచ్చేసిన మనిషిని 

హృదయంలో గుప్తనిధిగా  మార్చేస్తా 

జ్ఞాపకాల పుటల్లో బంధించేస్తా 

అబ్బ! భలే బావుందే ఈ వాక్యం అనుకుంటూ మస్తిష్కంలో నాన పెడతాను 

నేను మాత్రం ఏం తక్కువ అనుకుంటూ -~ ఆలోచనలను సాన పెడతాను 

వాక్యం వజ్రంలా మారకపోయినా 

కనీసం నా పెంపుడు పావురంలా --- మూల్గుతుంది .. నన్ను నిరాశ పర్చకుండా.

సమయం 09:14 ఉదయం 13/12/24



30, నవంబర్ 2024, శనివారం

ప్రకటన మాత్రమేనా!?

 ప్రకటన మాత్రమేనా!?

నిన్ను నీవు తెలుసుకోవాలంటే.. 

నీతో నువ్వు అంతర్యుద్ధం చేయాలి

మెదడుకి పట్టిన మురికిని కడుక్కోవాలి

నిన్ను నీవు గాయపర్చుకోవాలి 

నిన్ను నువ్వే ఓదార్చుకోవాలి

తొడుక్కున ముసుగు తొలగించుకోవాలి.

నిశ్శబ్దంగా నీతో నువ్వు మాత్రమే వుండగల్గాలి. 

ప్రతి అనుభవమూ అనుభూతి పాతవే అని గ్రహించాలి

నువ్వు నువ్వుగా మిగలగల్గాలి అంటే.. భావోద్వేగాలను అణచుకున్న మనిషివైనా కావాలికాలానికి ఎదురొడ్డి నిలిచిన మనిషివైనా అయివుండాలి. 

రహస్యంగానైనా నిన్ను ఆరాధించేబలగమైనా కలిగివుండాలి. 

మెట్టనేలలో మొండిగా నిలిచి   తుఫాన్ గాలి తట్టుకున్న చెట్టువైనా అయివుండాలి

రాగద్వేషాలు అద్దుకున్న  దేహ వస్త్రాన్ని  సవుడు సున్నం వేసి ఉడకబెట్టి పరిశుభ్రంగా ఉతికి ఆరేయాలి. 

పాము కుబుసం విడిచినట్టు జ్ఞాపకాలనూ అనుభవాలను బలవంతంగానైనా విసర్జించాలి. 

మొత్తంగా.. 

నీతో నీవు జీవించిన క్షణాల్లో గాలికి  కదలని దీపానివై  కొడిగట్టే వొత్తి వలే పూర్తిగా దగ్ధమైపోవాలి. 

ఇదంతా ఒక ప్రకటనలా మిగిలి పోకుండా వుండాలి. 

-వనజ తాతినేని  30/11/24  07:20 pm




అపుడపుడూ..

 అపుడపుడూ… 

ప్రకృతి తన సౌందర్యానికి తనే

మూర్ఛిలుతుంది

ఉదారంగా ఇతరులను చూడనిస్తుంది

సౌందర్యానుభవం  సొంతం చేసుకోమని 

ప్రేరేపిస్తుంది. కానీ.. 

తన సౌందర్యాన్ని నాశనం చేస్తూ 

నామ రూప గుణ విశేషణాలు లేకుండా 

చేస్తుంటే బెంగటిల్లుతుంది

జీవకణ విచ్ఛిన్నం విధ్వంసం చిరునామాగా 

మిగిలిందా అని చిరుకోపం ప్రదర్శిస్తుంది. 

నవంబరు 30/24 08:00 am.


1, నవంబర్ 2024, శుక్రవారం

పిచ్చి తల్లి

 పిచ్చి తల్లి 


అమ్మా ఆకలి అని పిలుపు వినిపిస్తే .. సమాధిలో నుండైనా లేచి పరుగెత్తి రావాలి. 

అంత ప్రేమ వుండాలి తల్లికి. 


అమ్మలను అమ్మ అమ్మలను అసహ్య భాషలో తిడుతుంటే 

చనుబాలు తాగుతూ రక్తం కారేటట్లు కొరికినా ఓర్చుకున్నట్టు చిన్న బిడ్డడు లే అని సర్దుకు పోవాలి. 


ఆలి వచ్చినాక పళ్ళెంలో ఇంత ముద్ద వేయకపోయినా.. పాపం ..నా బిడ్డ తప్పేం లేదు. పరాయి బిడ్డ పన్నాగం అనుకోవాలి గుడ్డి ప్రేమతో... 


ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుని కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తూ వుంటారు

భ్రమతలు వొదలరు సత్యం జీర్ణించుకోలేరు

పసివాళ్ళు!  వాళ్ళకేం తెలుసు సంసారం ఈదడం సాగరం ఈదటమేనని 

అంటూ .. మనసు గంప కింద గుట్టుగా దాపెడతారు. 


పిచ్చి సన్నాసులు

ఏదో చికాకులో నోరు జారతారు చెయ్యి ఇసురుతారు కానీ..

మళ్ళీ అవసరం వచ్చినా ఆపదొచ్చినా.. 

అమ్మా! కాసిని దుడ్లు ఇయ్యవే

కయ్యో ఇల్లో రాసియవ్వే.. అని కాళ్ళా వేళ్ళా పడతారు. బిడ్డలు మననిగాక ఎవర్నడుగుతారులే అని జాలిపడతారు.


కరిగి నీరై వేలిముద్రో సంతకమో చేజారారో.. 

దేవతలా దేవుడిలా చూసుకుంటానన్న వాగ్దానం.. హుష్ .. కాకి ఎత్తుకుపోయిందని.. 

రిజిష్టరు ఆఫీసు కాడే వొదిలిపెట్టి  దొడ్డి దారిన జారుకుంటారు. 


నిజం నిప్పై , నొప్పి నిజమై,  చేసిన తప్పై  రుణమై శాపమై పాపమై.. 

గొంతెత్తి ఏడ్చే శక్తి లేక నీరు నిండిన కళ్ళతో 

అయోమయం గా చూస్తుంటారు. నిశ్శబ్దంగా 

కాటికి సర్దుకుంటారు.



భూమి మీద పుట్టిన మానవ సంతతికి 

*ధాత్రి మాత ప్రసవ వేదన చిత్రాన్ని చూపండి 

అమ్మల్లారా అయ్యల్లారా..! 

అంతకు మించి… 

ఆ ప్రసవపు నొప్పి భరించిన తల్లులు పడే 

ఈ భరించలేని బాధలెన్నెంటినో తూకం వేయకండి. సారూప్యత వెతకకండి.


లైవ్ టెలీకాస్ట్ ల్లోనూ..  పెట్టుడు పోగ్రామ్ ల్లోనూ తల్లులను చూపిస్తూ ఆ బాధలను యెగతాళి చేయకండి.. తల్లుల్లారా తండ్రుల్లారా.. 🥲🥲


మీ అమ్మ ఏనాడో మీ నాయన దాష్టీకానికి చచ్చి చచ్చి మీ కోసమే బతికిన వెర్రి తల్లి .. వెర్రి ప్రేమ గల పిచ్చి తల్లి. ఆమె చావును ఆమె చావనియ్యండి.


*(ధాత్రి మాత - నేపాల్  / ప్రసవ వేదన పడే తల్లి రూపాన్ని భక్తితో పూజిస్తారు)


8, అక్టోబర్ 2024, మంగళవారం

మేల్కొలుపు

 మేల్కొలుపు

అర్ధరాత్రి లో  మెలుకువ

అలజడితో కాదు అదో చైతన్యం

మేల్కొలుపు సమయాలు 

సందేశాలు మోసుకొస్తాయి. 

వీధి దీపాల వెలుతురు 

ఛాయలు తాకని

ఆకాశం చాలా నేర్పుతుంది

చెవులతో చూడటం 

హృదయంతో వినడం

ఆత్మ ద్వారా గ్రహించి

అనుభవించేదే జీవితం 

ఆనందభరితం. 



25, ఆగస్టు 2024, ఆదివారం

ఔరా!

నీటి అద్దంలో తనను తాను చూసుకున్న పువ్వు 

తన సౌందర్యానికి మూర్చిల్లింది.

తన పరిమళ హృదయాన్ని

ఎవ్వరికి బహుమతిగా ఇవ్వనున్నదో తెలియకున్నది. 

హమ్మింగ్ బర్డ్ కా లేక మధుపానికా లేక 

సీతాకోకచిలుక కా అని ఆలోచనలో పడింది. 


దయ లేని బాల వొకతె తోటలోకి వేంచేసి

చటుక్కున తెంపి జడ లోన తురుముకుంది. 

ఔరా!

స్త్రీలు సుకుమారులన్నది ఎంత నిజమో కానీ

పూలను చూడగా వెర్రిగా ప్రవర్తింతురన్నది

సత్యం. 



7, ఆగస్టు 2024, బుధవారం

మూడో మనిషి

వనజ తాతినేని     ||మూడో మనిషి ||

నిన్ననీవుకనిపించావు

నీతలపులలో నేను  ఇంకా..సజీవంగానేఉన్నానని

ఇంకా  నీసొంతమనే

బ్రాంతిలోనేఉన్నావని,


స్తబ్దత ఆవరించిన  నీ  నిస్తేజజీవనంలో

నాతలంపే  దారిచూపే  దీపమని,

నేను సృష్టించిన నీఎదలోనికార్చిచ్చు

ప్రజ్వలిల్లుతూనే ఉందని,


నాలో  నీప్రేమతాలూకు  అవశేషాలు

ఏమైనా మిగిలిఉన్నాయేమోనని...

వెతుక్కుంటూ..వచ్చానని  అన్నావు

నేను నీకన్నా తక్కువేమీ కాదుకదా!


నేను  ఏనాడైనా  నీప్రేమను   అభిశించనులేదే?అంటూ..


మూడు ముళ్ళబంధం నిప్పుల కుంపటి అయిందని..

మనసు పరాధీన భావనలో..

అతిభద్రంగానే ఉందని, లోలోపల చిద్రమై

పై మెరుగులతో తళుకులీనుతూ...


నిట్టూర్పు సెగల మద్య,

అనాదరణ అనే ఎడారిలో..యానంలో..

ప్రేమ ఒయాసిస్సుకై అన్వేషిస్తుంటే..


ఆకస్మికంగా నీ ప్రేమ..

జీవ నదిలా ప్రత్యక్షమైతే ..

సర్వం మరచి మీనమై విహరించాలని..

అతిగా ఆశించాను...


అంతలో వివేకం వీపు పై చెళ్ళుమని చరచింది..

వయసు ఎలాంటిదైనా.. మనసు పారేసుకోవడం

అనే మంచి - చెడ్డ గుణం..

మనిషికి శాపమే కాదు.. తాపం కూడా!

విచక్షణ మరచినది కూడా!! 


కాలం గారడీలు చేస్తుంది.

పేరడీలు సృష్టిస్తుంది.

నీసంగతి నా సంగతి....

కలిపేమాట అటుంచి

కాస్తంత ఆలోచించి చూస్తే సమిధ మాత్రం

నీకు - నాకు మద్య వచ్చిన మూడోమనిషి.

ఆఖరి వరకు అంటి పెట్టుకుంటాననే ఆశతోవచ్చిన మనిషి.

మనమధ్య వచ్చిన మూడో మనిషికి

మరో మూడో మనిషి తారసపడితే !?


(యవ్వనం తాలూకు ప్రేమలని తలచుకుంటూ.. అసంతృప్తులతో.. వేగే భార్య-భర్తల్ని ఉద్దేశించి)

14|12|2012.



7, జులై 2024, ఆదివారం

ప్రకృతి పుస్తకం

 ప్రకృతి పుస్తకం -వనజ తాతినేని.

నా చుట్టూ నక్షత్రాలు అక్షరాల రూపంలో కాంతులు విరజిమ్ముతున్నాయి. 

మదిలో మెదిలే భావాలు అడవిపూల సౌంగంధాన్ని వెదజల్లుతున్నాయి. 

పుట తిరగేయని ఓ మొహమాటపు మర్యాద సిగ్గు పడుతూ మేఘాల మాటున జాబిలి లా తొంగి చూస్తుంది. 

నా చిన్నారి మనసు తుళ్ళి తుళ్ళీ పదాల వాన చినుకుల్లో సంబరంగా ఆడుకుంటుంది

వాన వెలిసాక ఇంద్రధనుస్సు లోని రంగుల్లన్నీ  పుస్తకాల సీతాకోకచిలుకలై  తోటలోఆడుకుంటున్నాయి.

ఓ తుంటరి సీతాకోక చిలుక నా ముఖంపై వాలింది. కాలమెందుకో స్థంభించిపోయింది.

మమేకమైతే ప్రకృతి ఓ పెద్ద పుస్తక భాండాగారం కదా!

5, జులై 2024, శుక్రవారం

విభిన్న ఆకర్షణ

 విభిన్నమైన ఆకర్షణ 

ముళ్ళ చెట్టు పండ్ల చెట్టు పూల చెట్టు అన్నీ పై పై స్వభావాల్ని ప్రదర్శిస్తాయి. భూమి లోపలంతా వేళ్ళు కలగలుపుకుని పెనవేసుకునే వుంటాయి. 

స్తీ తీగ లాంటిది పురుషుడు ఆధారం అంటారు కానీ.. 

తీగ తను పెనవేసుకున్న మానును ఎదగనివ్వదు. మాను తన కింద తీగను ఎదగనివ్వదు. పరస్పర శత్రువులు. ఒకరిపై వొకరు పై చేయి సాధించాలనే కాచుకుకూర్చుంటారు.



29, జూన్ 2024, శనివారం

వానకారు కోయిల

వానకారు కోయిల వేకువఝామునే మేల్కొలిపింది. 

హృదయంలో మారణాయుధం ధరించి

పెదవులపై మధుర సంగీతం పలికించినట్లు.

బాధ కూడా ఒక మెలుకువే కనుక. 


నిన్నంతా.. 

ఏదో సాధించాలనే తాపత్రయం దహించి వేయవచ్చును  గాక

ఏదో కొంత సాధించాం లే.. 

అన్న సంతృప్తి తో ప్రశాంతత ను నిద్రలో వెదుక్కొంటాం గనుక 


కామితములు తగ్గుతాయా తగ్గించుకోవడానికి ప్రయత్నించామా

వ్యక్తీకరించడానికి ఇష్టపడని రహస్యనిధి 

ముఖపత్రం పై సంతకం చేయడానికి తిరస్కరించింది గనుక 

ఇంకనూ..

జనలోకంలో గౌరవంగా బతికివున్నాం గనుక


త్రి దుఃఖాలు మనిషి వేటాడుతుండగా

దుఃఖం లేని జీవితాన్ని ఆశించడం అత్యాశ

అని అంటుంది వానకారు కోయిల

ఆమోదం లేని ఆజ్ఞాపన అది.




3, మే 2024, శుక్రవారం

వదిలేసాక

 










వదిలేయండి వదిలేయండి 

అంటారు. 

తీరా వొదిలేసాక.. 

పట్టించుకోలేదు కటిక మనసు 

అంటారు. 


ఎప్పుడెంత వొదిలేయాలో 

ఎప్పుడెంత పట్టించుకోవాలో 

వారు నిర్దేశిస్తారట

మనం పాటించాలట. 


మనం కన్నవాళ్ళే 

వాళ్ళకో తోడు దొరికాక.. 

గుండెల్లో గునపాలు దించుతారు

మనసును చిత్రవధ చేస్తారు


చేతిలో దిండు లాక్కుపోయినట్టు 

పిల్లలను లాక్కెళ్ళిపోతారు

వాళ్ళకు కావాల్సినవాళ్ళకు చేరిక చేసి

మనకు అవమానపు తొడుగువేసి

నవ్వుకుంటారు. 


మనం కూడా పిల్లలను అలాగే పెంచి

వారికి ధార పోసామని మర్చిపోతారు

హక్కులు భలే గుర్తుంటాయి 

ముఖాన కప్ కాఫీ పొయ్యకపోయినా.


ఇనుప అడ్డుగోడలు

కట్టుకున్నాక.. బంధాలను

పెంచుకొనుట తెంచుకొనుట

చాలా సులభం సౌఖ్యం కూడా! 


కోతిని రాణి ని చేసి సింహాసనమెక్కించి

కొండముచ్చులు భజన చేసినట్టు

వుంది రాజ్యం. 

సౌఖ్యాన్ని మరిచి సొద లెందుకు 

వ్యధలెందుకు నరుడా! 


నన్నంటుకోకు నామాలకాకి

అన్నట్టు ఏకాకివై మిగలిపో

కొడుకులను కన్నందుకు నీకిది శిక్ష

నావ ఏ తీరమో చేరకపోదుగా.. 

ఏదో ఒక తీరాన్ని వదిలేయక తప్పదుగా! 


-వనజ తాతినేని

03/05/2024.

28, ఏప్రిల్ 2024, ఆదివారం

చిధ్రమైన అనుబంధాలు



ఖలీల్ జిబ్రాన్ ఈ మధ్య  బాగా నచ్చుతున్నాడు. ఎందుకంటే.. 

భద్రమైన బంధాలు మాయమైపోతున్నందుకు.


ఒక తల్లి అంటుంది.. 

నా కొడుకుకి నేను మాటలే నేర్పాను కానీ 

వాడెందుకో ఈ మధ్య చిలకపలుకులు మాత్రమే పలుకుతున్నాడు.

 నాకెందుకో ఆశ్చర్యంగానైతే లేదు. కొంత ఊహించినదే!  

పుత్రుడే కానీ ఒకోసారి  పురుషుడి విశ్వరూపం చూపెడతాడు.

అమ్మనే కానీ అర్భకురాలిని కదా వణికిపోతాను లోపలా బయటా. 


మగవాడు భర్తగా మారగానే భార్య చేత 

హైజాక్ చేయబడతాడు. 

మొదట మాటలతో తర్వాత చూపులతో 

తర్వాత మెదిలే ఆలోచనతోనే   పూర్తిగా నియంత్రించబడతాడు. 

రహస్య తీర్మానాలన్నీ పడకటిల్లు వంటిల్లు మధ్య లిఖించబడతాయి.


వారు రావడం రావడంతోనే తల్లిదండ్రులు రక్త సంబంధీకుల 

 మధ్య ఓ అగాధాన్ని సృష్టించడానికి 

ఆయుధాలు సమకూర్చుకునే వుంటారు. 

పంపకాలు వాటాల లెక్కలు మనసులో గుణించుకునే వుంటారు. 


వంశపారంపర్యంగా వచ్చే ఆస్థులు బహుమానాలు అన్నీ ఆశిస్తూనే…

  వారి భర్తలు బిడ్డలు అత్తింటి వైపు వారికి అతుక్కపోతారేమోనని 

కంటికి కనబడని  అనేక ఆంక్షలు విధిస్తారు. 

మనుషులకి మనసులకు అంటరానితనం  అపాదించి చులాగ్గా నెట్టేస్తారు. 


బిడ్డలు తల్లిదండ్రుల ప్రేమను 

అమృతంలా జుర్రుకుని విషాన్ని  వెల్లగ్రక్కుతుంటారు. 

వారు బయటకు విసరక ముందే 

గౌరవంగా వదిలించుకోవడం శ్రేయస్కరం


ప్రేమ దాహం పట్టుకున్న తల్లిదండ్రుల ప్రేమలకు 

రిటైర్మెంట్  ఏజ్ వుంటే బాగుండును. 

ఆశ్రమ జీవనం బదులు వనవాసం శిక్ష వేసినా బాగుండును. 

అడవులైనా విస్తరిస్తాయి. అదిప్పుడు అత్యవసరం కూడా! 


రెక్కలొచ్చాక పక్షులు ఎగిరిపోయినట్టు 

లోహ విహంగాలనెక్కి పిల్లలు యెగిరిపోతున్నారు. 

దారం తెగిన గాలిపటాల్లా ఎక్కడెక్కడో 

చిక్కుకుని పోతారేమో అని భయపడతారు

 కానీ.. . 


ఎర వల రెండూ వున్న జాలరి చేతికి  

చేప చిక్కినట్టు ఆలస్యంగా గ్రహిస్తారు.

మంచి చెడు విచారించే పాణిగ్రహణం చేసి  

అప్పజెప్పామని మర్చిపోతారు.


కడకు నిర్లక్ష్యం చేయబడ్డ తల్లిదండ్రులు.. 

ఏ తీరం వొడ్డునో పడ్డ చేపల్లా గిలగిలలాడతారు. 

ఊపిరి వదిలాక కూడా అంతిమ సంస్కారానికి 

బిడ్డలొస్తారని మార్చురీలో  పడి ఎదురుచూస్తారు. 


నిజాలు అబద్ధాలు మధ్య ఖాళీ కొద్దిగానే  వుంటుంది. 

అది పూరించుకునే సమయానికి 

ఓ జ్ఞాపకంగా కూడా మిగిలివుండలేని తల్లిదండ్రులు 

గోడల మీద వేలాడటం అసహ్యమనిపించి

డేటా లో  పదిలంగా దాగుంటారు.


 అందుకే… ఖలీల్ జిబ్రాన్ ఈ మధ్య  బాగా నచ్చుతున్నాడు. 

బంధాలను తేలిగ్గా వొదిలించుకుంటే మనిషి 

మరింత సుఖపడతాడనే పాఠం కొత్తగా నేర్చుకుంటున్నాను. 

భద్రమైన బంధాలు భ్రమలు మాత్రమే

నేను మాత్రమే నిజం అని అనుకోవడమే మిగిలింది గనుక. 


28/04/2024 -వనజ తాతినేని.



12, ఏప్రిల్ 2024, శుక్రవారం

వీధి దీపం

 వీధి దీపం

కార్తీకంలో వేలాడదీసిన ఆకాశదీపంలా వీధి దీపం. 

వొంటి స్తంభం గాజు మేడలో నుండి కాంతులు విరజిమ్ముతూ ఆవురావురుమంటూ చీకటిని భక్షిస్తుంది 

పార్క్ లో ఆడి అలసి ఇంటికి పోయే పిల్లలందరికి తోవంతా వెలుగు పంచుతుంది 

కొత్త తావుకు పోతూ బాటను దాటుతున్న ఎరను ముక్కలైపోతావని హెచ్చరిస్తుంది

ముసురు పట్టిన వానలోనూ వానలా కురిసే మంచులోనూ తడిసి ముద్దైపోతూ 

అమవాస్య నాటి వెన్నెల దీపమౌతుంది

మైనస్ డిగ్రీల్లోనూ గడ్డ కడుతూ  తన విధిని మర్చిపోతానేమోనని రగిలిపోతూ జాగ్రత్త పడుతుంది. 

రహదారి మలుపులో నడిరాతిరి వొంటరిగా దిగాలుగా నిలబడి

ఆకురాలు కాలాన్ని  చూస్తూ  దీర్ఘ విషాదాన్ని మోస్తుంది పాపం!

వేకువనే హాయి గొలిపే పక్షుల సంగీతాన్ని మలయమారుతాలను  ఆస్వాదిస్తూ చిన్న కునుకుదీసిందేమో ఉదయపు నడకల సవ్వడి విని ఉలికిపడి మేల్కొంటుంది

సూర్యోదయ  సౌందర్యాన్ని వొంటరిగా జుర్రుకుని దిగ్విజయంగా తన పని నుండి నిష్క్రమింస్తుంది.   

విధి నిర్వహణలో తాను వొంటరి నని అనుకున్నప్పుడల్లా ఓ కాంతివలయం నన్ను చుట్టుకునే వుంటుందనే సృహ కల్గిన రాత్రి సూర్యుడు వీధి దీపం

మూడు కాలాల్ని ఆరు బుుతువులను నిశ్శబ్దంగా అనుభవించిన ఒంటరి భూ నక్షత్రం వీధి దీపం

 తనను చూసినప్పుడల్లా వొకటే తలపోస్తాను నేను

ప్రతి మనిషి వీధి దీపం లా  నిలబడకపోయినా  గూట్లో దీపంలా వెలుగునిస్తే చాలునని.

12/04/24.








10, డిసెంబర్ 2023, ఆదివారం

అద్వైతం

ఒకానొక మబ్బులవేళ

స్వర్గపు తునక అరచేతికి అందినట్లు

జవరాలి తనువుపై జడివాన నాట్యం చేసినట్టు


మునిమాపు ముదిరిన వేళ

నది వొడ్డు నిశ్శబ్దం లోకి.. ప్రవహించినట్టు


రాత్రి తన సమయాన్ని వీధి దీపానికి వేలాడదీసినట్టు


నేను నీ ధ్యానంలో దాస్యంలో మునిగి తేలుతూ

హృదయం బుద్ది  జుగల్బందీ గా మారాక


నాలో వున్న అతన్ని ఆమెని కలగలిపి 

చూస్తున్న నన్ను చూసి జనులు నవ్విపోనీ గాక


భావానికి అక్షరం చేయూత నిచ్చాక

నాలోని కవి కి యింకొక పని యెందుకు? 


కాంతి గాలి జొచ్చుకుని పోయినట్టు కవిత్వం నాలో కలసి పోయాక

కవిత్వం రసప్లావితం కవిత్వం అద్వైతం.




5, సెప్టెంబర్ 2023, మంగళవారం

నేను నేనుగా ..

 నేను నేను గా లేను. 

పెదవులపై నవ్వు నేను కాదు. కళ్ళలో కనిపించే ఆత్మ విశ్వాసం నేను కాదు. నా ముఖం నేను కాదు. నా కురుల రంగు నిజం కాదు. ఆడంబరంగా కనిపించే దుస్తుల మధ్య బంధించిన నా శరీరం నాది కాదు నా జోళ్ళు నావి కావు నా నడక నాది కాదు. నా ఆహార్యవిహారాలు నావి కావు. అసలు మొత్తంగా నేను నేను కాదు. 

నేను ఏమిటంటే.. ఓ గృహిణి నమూనా ని.


చుక్కలు కోసుకొచ్చి డ్రాయింగ్ రూమ్లో అలంకరించమని

ఎవరూ చెప్పలేదు. అయినా నేను ఆ  ప్రయత్నం చేస్తాను. 

ఇల్లు అద్దంలా వుండాలని నేను అలసినప్పుడో ఆసక్తి లేనప్పుడో ఎంతమాత్రం అనుకోను. కానీ ప్రశ్నించే చూపులు నూరిపోసిన ఉద్భోదలు డూ ఇట్ డూ ఇట్ అని మెదడును గుచ్చి చంపుతుంటాయి. 

అందరి సోమరితనాన్ని నిర్లక్ష్యాన్ని అలవోకగా తలకెత్తుకుని నిలువెల్లా అరిగి పొమ్మని నాకు నేనే శిక్ష వేసుకుంటాను. అందరి రుచుల కోసం రెండు కాళ్ళ స్థంభానై వంట గదిని దున్నేస్తాను. 

ప్రేమించడం పాఠశాలల్లో నేర్పించే విద్య కాదని అది సహజంగా ఉద్భవించేదని

నాకు తెలుసు. 

ఇంటి మనుషులకు తెలియదనే నా ఆరోపణలో నుండి ..క్షమించడం అలవాటు చేసుకుని 

దారి చేసుకుని  నడుస్తున్నాను. 

నిజం చెప్పనా..!

ఇంట్లో మనుషులు కన్నా వారి

మనసులకన్నా వీధులు పరిశుభ్రంగా ఆకుపచ్చగా మెరుస్తుంటాయి.

 ఓ కొత్త ఉత్సాహాన్ని బాహ్యప్రపంచాన్ని నాలో దాగిన అంతఃచక్షువుని నాకే కానుకగా ఇచ్చాయి. 

ఇప్పుడు అనుకున్నాను.. 

నేను నేను గానే జీవిస్తున్నానని. దేహమంతా కొత్త చివురులు తొడిగిందని.. 

శరీరానికి మెదడుకి ఆత్మ కు లంకె కుదిరిందని. 

31, జులై 2023, సోమవారం

Snow fall like flower shower

 In English Translation….  మంచు పూల వాన - వనజ తాతినేని.



Snow fall Like flower shower - - Vanaja Tatineni


 

I told a secret in the ear of a rose flower.


"That I love you". She nodded happily.


Always looking for me.


I haven't told you the secret that I like to hide and seek..


She waited for days without falling.


Again.. One day I said "Shall I tell you a secret"..


Approached or not..


Petals were falling silently and 


remained naked

*********


Far away.. “Look at this look at this”words are heard.


“Snow falls like rain and flower showers” ​​.


They are joyous celebrations. No more roses will bloom.


I know that the rose under the snow will wait a little longer in the form of petals. 

Love is an indestructible, undesired prospect.


*********End**********


మూలం:


మంచు పూల వాన - వనజ తాతినేని

 

గులాబీ పువ్వు చెవిలో రహస్యం చెప్పాను. 


“నిన్ను ప్రేమిస్తున్నాను అని”.  సంతోషంగా తలను ఊపింది. 


నిత్యం నాకై వెదుకులాడేది. 


దాగుడుమూతలాట నాకిష్టమనే రహస్యం నేను చెప్పలేదుగా.. 


రోజుల తరబడి  రాలిపోకుండా ఎదురుచూసింది. 


మళ్ళీ.. వొకనాడు “నీకొక రహస్యం చెప్పనా” అంటూ.. 


సమీపించానో లేదో.. 


నిశ్శబ్దంగా రేకలు రాల్పుతూ  వివస్త్ర అయింది.



దూరంగా.. “చూడు చూడు.. 


మంచు పూల వాన కురుస్తుంది’’ అనే  మాటలు. 


వారివి   ఆనందోత్సవ సంబరాలు.  ఇక పై ఏ గులాబీ విచ్చుకోదు . 


మంచు కింద   గులాబీ.. రేకల రూపంలో మరికొంత కాలం యెదురు చూస్తుందని నాకు తెలుసు. 


ప్రేమంటే నాశనం లేని ఏమి కోరుకోని యెదురుచూపు.








2, జులై 2023, ఆదివారం

సంతోషపు ఊపిరి

 నాన్న కొని తెచ్చిన 

పిల్లనగ్రోవిని అందుకున్న పిల్లవాడు 

అమ్మ పక్కన పడుకుని ఎపుడెపుడు 

తెల్లవారుతుందా అని ఎదురు చూసాడు 


వేకువనే లేచి వడి వడిగా గుట్ట లెక్కి

తన స్నేహితుడి కోసం వేచి చూసాడు 

అప్పటి దాకా చంద్రునితో ఊరేగిన పిల్లగాలి 

ఎదురు చూస్తుంది 

కాస్త సూర్యోదయాన్ని తాగి వెచ్చబడాలని. 


వెలుగుజుత్తు లేసుకుని 

కొండల చాటునుండి నెమ్మదిగా 

పైకి వస్తున్న సూరీడు.. 

పిల్లవాడు పిల్లగాలి 

ఇద్దరూ స్నేహితుడిని చూసారు  


ఇదిగో.. నాన్న తెచ్చిన బహుమతి చూసావా.. 

అంటూ ఉత్సాహపు ఊపిరిని వేణువులో పూరించాడు

పిల్లగాలి అతనికి తోడైంది. 

వేణువొలికించిన మధుర  స్వరాలతో 

ప్రకృతి పరవశంతో ఊగిపోయింది. 


పిల్లవాడు  రోజూ సంతోషపు చొక్కా 

తొడుక్కొని కనిపించ సాగాడు 

అమ్మ నాన్నలకు.


-వనజ తాతినేని

01/07/2021  11:10 AM

Pic courtesy: Google.