5, సెప్టెంబర్ 2023, మంగళవారం

నేను నేనుగా ..

 నేను నేను గా లేను. 

పెదవులపై నవ్వు నేను కాదు. కళ్ళలో కనిపించే ఆత్మ విశ్వాసం నేను కాదు. నా ముఖం నేను కాదు. నా కురుల రంగు నిజం కాదు. ఆడంబరంగా కనిపించే దుస్తుల మధ్య బంధించిన నా శరీరం నాది కాదు నా జోళ్ళు నావి కావు నా నడక నాది కాదు. నా ఆహార్యవిహారాలు నావి కావు. అసలు మొత్తంగా నేను నేను కాదు. 

నేను ఏమిటంటే.. ఓ గృహిణి నమూనా ని.


చుక్కలు కోసుకొచ్చి డ్రాయింగ్ రూమ్లో అలంకరించమని

ఎవరూ చెప్పలేదు. అయినా నేను ఆ  ప్రయత్నం చేస్తాను. 

ఇల్లు అద్దంలా వుండాలని నేను అలసినప్పుడో ఆసక్తి లేనప్పుడో ఎంతమాత్రం అనుకోను. కానీ ప్రశ్నించే చూపులు నూరిపోసిన ఉద్భోదలు డూ ఇట్ డూ ఇట్ అని మెదడును గుచ్చి చంపుతుంటాయి. 

అందరి సోమరితనాన్ని నిర్లక్ష్యాన్ని అలవోకగా తలకెత్తుకుని నిలువెల్లా అరిగి పొమ్మని నాకు నేనే శిక్ష వేసుకుంటాను. అందరి రుచుల కోసం రెండు కాళ్ళ స్థంభానై వంట గదిని దున్నేస్తాను. 

ప్రేమించడం పాఠశాలల్లో నేర్పించే విద్య కాదని అది సహజంగా ఉద్భవించేదని

నాకు తెలుసు. 

ఇంటి మనుషులకు తెలియదనే నా ఆరోపణలో నుండి ..క్షమించడం అలవాటు చేసుకుని 

దారి చేసుకుని  నడుస్తున్నాను. 

నిజం చెప్పనా..!

ఇంట్లో మనుషులు కన్నా వారి

మనసులకన్నా వీధులు పరిశుభ్రంగా ఆకుపచ్చగా మెరుస్తుంటాయి.

 ఓ కొత్త ఉత్సాహాన్ని బాహ్యప్రపంచాన్ని నాలో దాగిన అంతఃచక్షువుని నాకే కానుకగా ఇచ్చాయి. 

ఇప్పుడు అనుకున్నాను.. 

నేను నేను గానే జీవిస్తున్నానని. దేహమంతా కొత్త చివురులు తొడిగిందని.. 

శరీరానికి మెదడుకి ఆత్మ కు లంకె కుదిరిందని. 

కామెంట్‌లు లేవు: